ఆకాశవాణి పరిమళాలు-21

0
1

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

జర్మనీలో నెల రోజులు:

[dropcap]1[/dropcap]996 జూన్ నెలలో ఢిల్లీలోని డైరక్టరేట్‌లో పని చేస్తున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరక్టరు శ్రీమతి ఉషా పూరి విజయవాడ ఆకాశవాణి డైరక్టరుగా పనిచేస్తున్నా నాకు ఫోన్ చేశారు. “జర్మనీలోని డాయ్చ్ వెల్ (deutsche welle) బ్రాడ్‌కాస్ట్ కంపెనీ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో భారత ప్రతినిధిగా మిమ్మల్ని పంపడానికి డైరక్టర్ జనరల్ ఆమోదించారు” అని శుభవార్త తెలియజేశారు. జర్మన్ దేశంలోని కొలోన్ పట్టణంలో నెల రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.

జర్మనీ వెళ్ళడానికి కావలసిన యూరోప్ దేశాలకు చెందిన షెనగల్ వీసా కోసం నేను సంబధిత ఫారాలు భర్తీ చేసి పంపాను. మదరాసులోని జర్మనీ ఎంబసీకి వెళ్ళి ఫీజు చెల్లించి వచ్చాను. వారం రోజుల్లో వీసా వచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్‌వేస్‌లో టికెట్లు బుక్ చేశారు మా డైరక్టరేట్ వాళ్ళు. నేను మదరాసు కెళ్ళి ఢిల్లీ విమానం ఎక్కాను. ఢిల్లీ నుండి ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా కొలోన్ చేరుకున్నాను.

కొలోన్ సదస్సు:

30 రోజుల పాటు జరిగిన ఆ అంతర్జాతీయ సదస్సులో “ప్రసారాలలో ఆధునికత” అనే అంశంపై 13 మంది వివిధ దేశాల ప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపాము. నాతో పాటు పాట్నా కేంద్రం డైరక్టరు గ్రేస్ కుజూర్ కూడా పాల్గొన్నారు. చైనా, మలేషియా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు అందులో భాగం.

కొలోన్‌లో జర్మనీ దేశానికి చెందిన రేడియో ప్రసార సంస్థ వుంది. రేడియో, టెలివిజన్ విడివిడిగా ‘డాయ్చ్ వెల్’ అనే స్వయంప్రతిపత్తి గల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రేడియోకి సంబంధించిన శిక్షణా కళాశాల ఈ సదస్సుని నిర్వహించింది.

సంస్థాగతంగా వారు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నేను కొలోన్ విమానాశ్రయంలో దిగగానే మాకు ఒక గైడ్‌ను కేటాయించారు. ఆయన నన్ను సరాసరి నేను నెలరోజులు బస చేసే హోటల్‍కు తీసుకెళ్ళి దించారు. శిక్షణా సంస్థకు డైరక్టరుగా శ్రీమతి  బార్బారా షెకారత్ వ్యవహరిస్తున్నారు. మాకు నెల రోజుల కార్యక్రమ వివరాల బ్రోచర్ అందించారు తొలిరోజునే.

విమానయాన బడలిక:

పదిగంటలకు పైగా ప్రయాణం చేసి ఢిల్లీ నుండి ఫ్రాంక్‌ఫర్ట్, అక్కడి నుండి బాన్, ఆపైన కొలోన్. మన దేశానికి జర్మనీకి కాలమానంలో తేడాలు ఉన్నాయి. మనకు రోజుకు 12 గంటల రాత్రి వేళ. అక్కడి వాళ్ళకు సూర్యోదయం 5.30 గంటలకు. చీకటి పడడం రాత్రి 8.30 గంటలకు. అక్కడ రాత్రి 10 గంటల వేళ భారతదేశంలో మధ్యాహ్నం 1.30 గంటలు. వాళ్ళ కరెన్సీ ‘మార్కులు’.  మనకు పరీక్షల్లో మార్కులు, వాళ్ళకి జీవిత గమనంలో మార్కులు అవసరం.

రెండు జర్మనులు:

జర్మనీ దేశం తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడిపోయాయి. తూర్పు జర్మనీకి బెర్లిన్, పశ్చిమ జర్మనీకి కొలోన్ రాజధానులు. 1990లో ఉభయదేశాలు విలీనమయ్యాయి. రెండు దేశాల మధ్య ఉన్న ‘బెర్లిన్ వాల్’ని పడగొట్టారు. 150 సంవత్సరాలు విడిపోయినవారు కలిసి పరస్పరాభివృద్ధికి దోహదం చేసుకున్నారు. 1990 డిసెంబరు 20న నూతన పార్లమెంటు తొలి సమావేశం జరిగింది. మేమందరం ఆ పార్లమెంటు భవనాలను, పడగొట్టిన బెర్లిన్ గోడను చూసి వచ్చాము. 1991 జూన్ 20వ తేదీన ఉభయ జర్మనుల రాజధానిగా బెర్లిన్ ప్రకటించబడింది.

ప్రసార మాధ్యమాలు:

జర్మనీలో పత్రికలు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. వారికి కూడా మన వలె ప్రెస్ కౌన్సిల్ ఉంది. ఫిర్యాదులను పరిశీలించి కొరడాను ఝుళిపిస్తారు. అంతకు ముందు రెండు దేశాలకు విభిన్న రేడియో, టెలివిజన్లు నడిపారు. విలీనమైన తర్వాత పశ్చిమ జర్మనీ వారు విదేశీ ప్రసారాలను, తూర్పు జర్మనీ వారు స్వదేశీ ప్రసారాలను నడుపుతున్నారు. ఒకటి Deutsche Welle, మరొకటి Deutschlandfunk. రెండు కార్యాలయాలు కొలోన్‌లోనే 31 అంతస్తుల భవనంలో పక్కపక్కనే వున్నాయి.

”డాయ్చ్ వెల్ ‘లో 1900మంది ఉద్యోగులున్నారు. పూర్వకాలంలో ఆ కార్యాలయ భవన నిర్మాణానికి ఆస్‍బెస్టాస్ షీట్లు వాడారట! అది ఆరోగ్యానికి భంగకరమని ఒక ఉద్యోగి కోర్టుకెళ్ళాడు. ఫెడరల్ కోర్టు ఆయన వాదనను పరిశీలించి, పరీక్షించి సమర్థించింది. కోట్లాది వ్యయాంతో  నిర్మితమైన ఆ భవనాన్ని నేలమట్టం చేసి బెర్లిన్ లోని నూతన భవనాలలోకి 1997లో వెళ్ళారు. మన దేశంలో చాలా పాఠశాల భవనాలు ఆస్‍బెస్టాస్ రేకుల షెడ్లలోనే నడుస్తున్నాయి.

సదస్సు విశేషాలు:

30 రోజుల పాటు తలలు బద్దలు కొట్టుకుని చర్చించిన ప్రధాన విషయం – రేడియోకి ప్రాముఖ్యత తగ్గకుండా చూడడం ఎలా? టెలివిజన్ ఛానళ్ళ దాడిని తట్టుకోవడం ఎలా? కేవలం చర్చలకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయా దేశాలలో వారు అనుసరిస్తున్న వ్యూహాల గురించి అధ్యయనం చేసి తయారు చేసిన నివేదికలు పరిశీలించాం. ప్రసార రంగంలో బి.బి.సి, వాయిస్ ఆఫ్ అమెరికా కు చెందిన నిపుణులు కూడా ఈ గోష్ఠులలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఫిలిప్పిన్ దేశానికి సంబంధించిన ప్రైవేట్ సంస్థ – రేడియోకు చెందిన అధిపతి రోలాండో టాన్ సదస్సులో మాట్లాడుతూ – వారి దేశంలో ప్రకటనల ద్వారా వచ్చిన ధనంతో సంస్థలను ప్రైవేటు సంస్థలు నడుపుతున్నాయని చెప్పారు. జర్మనీలో బి.బి.సి. తరహా వ్యవస్థ పనిచేస్తోంది.

జర్మనీ రేడియో:

రేడియో ప్రసారాలు కొలోన్ నుండి జర్మన్ భాషలోనే కాక 38 ఇతర భాషలలోనూ జరుగుతూ ప్రపంచ దేశాలకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. రోజుకు అన్ని ఛానల్స్ కలిసి 86 గంటల ప్రసారం చేస్తాయి. 130 వార్తా సంచికలు వెలువడతాయి. 41 ట్రాన్స్‌మిటర్లు ఉన్నాయి. ఆసియా దేశాలకు సంబంధించి హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో ప్రసారాలు చేస్తున్నారు. ఢిల్లీ ఆకాశవాణి నుంచి డిప్యూటేషన్ మీద వెళ్ళిన ఒక అనౌన్సర్ అన్ను హిందీలో ఇంటర్వ్యూ చేసింది. నేను నాకు తెలిసిన హిందీలో సమాధానాలు చెప్పాను. ఆమె నేను 1997లో ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా ఉన్నప్పుడు తిరిగి ఢిల్లీ ఆకాశవాణిలో చేరింది. 1995లో రేడియో శ్రోతల నుండి నాలుగున్నర లక్షల ఉత్తరాలు ఒక సంవత్సరంలో వచ్చాయని విని ఆశ్చర్యపోయాను. 1996 ఆగస్టు 4న నా ఇంటర్వ్యూ ప్రసారం చేశారు. గుంటూరు నుండి ఒక శ్రోత విని ఆనందిస్తూ నాకు ఉత్తరం వ్రాశాడు. ‘దీని తస్సాదియ్యా… రేడియో గాలిలో ఎంత దూరం వస్తుంది రా’ అని అనుకున్నాను.

ఆ దేశంలో ప్రసార సంస్థకు 17 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వారు రేడియోకి ఒకరిని, టివికి ఒకరిని డైరక్టర్ జనరల్‌లను ఎన్నుకుంటారు. 1996లో ఆ సంస్థ వార్షిక బడ్జెట్ 648 మిలియన్ డచ్‌మార్కులు. అప్పట్లో ఒక డచ్‌మార్క్ 24 రూపాయలకు సమానం.

మా ఆవిడకు టెలిఫోను:

నేను సుఖంగా చేరానన్న విషయాన్ని విజయవాడలో ఉన్న మా ఆవిడకు తెలియజేద్దామని దగ్గరలో వున్న ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్‍కు వెళ్ళాను. అందులో వ్రాసి ఉన్న సూచనల ప్రకారం ఒక 5 మార్క్‌ల కాయిన్‍ను బాక్స్‌లో వేశాను. నెంబరు కొట్టాను. మనం మాట్లాడిన తర్వాత మిగిలిన చిల్లర కిందపడిపోయి మనకి లభిస్తుంది. నేను సుమారు 2 మార్క్‌ల విలువ గల సమయం మాత్రం మాట్లాడాను. చిల్లర డబ్బులు రాలేదు. పక్కనే వెళుతున్న ఒక గ్రామీణుడిని ఇంగ్లీషులో ‘ఏం చేయాలి?’ అడిగాను. అతనికి ఇంగ్లీషు రాదు. నాకు జర్మన్ రాదు. సైగలు చేశాను. అతను తల వూచి వెళ్ళిపోయాడు. మర్నాడు మా సదస్సు ప్రారంభమైంది. ఆఫీసు నుంచి ఫోన్ చేసి డబ్బులు కట్టే వ్యవస్థ ఏర్పరచారు.

విహారయాత్ర:

ఆదివారాలలో ప్రతినిధి బృందాన్ని పరిసరాలలోని విహార స్థలాలకు టూరిస్టు బస్సులలో తీసుకెళ్ళారు. బెర్లిన్‍కు విమానంలో తీసుకెళ్ళి అక్కడి వివిధ సంస్థలను చూపించారు. రెండు రోజులు అక్కడ హోటల్లో బస చేశాము. ప్రైవేటు ఎఫ్.ఎమ్. కేంద్రాల పనితీరును పరిశీలించాము.

ఆ మధ్యాహ్నం ఒక గ్రామీణ ప్రాంతానికి తీసుకెళ్ళారు. అది సువిశాల అరణ్య ప్రాంతం. “మీరు అందరూ అలా ఒక గంట సేపు తిరిగి వింతలూ, విశేషాలూ చూసి మళ్ళీ బస్ దగ్గరికి సాయంత్రం ఆరు గంటలకు ఠంచనుగా రండి” అని మా గైడ్ చెప్పాడు. అందరం బయలుదేరాం. ఇంతలో ఒక నిత్యశంకితుడు ఇలా ప్రశ్న వేశాడు:

“ఒక వేళ ఈ అడవిలో ఎక్కడైనా తప్పిపోతే ఎలా?”

“మీరు కంగారుపడనక్కరలేదు. ఏదో ఒక చెట్టు కిందకి వెళ్ళండి. ఆ చెట్టు బెరడు మీద దాని నెంబరు వ్రాసి వుంటుంది. మీరు ఫోన్లో ఆ నెంబరు చెప్పండి. మేము పది నిముషాలలో మీ వద్ద ఉంటాము. ఇక్కడ ప్రతి చెట్టుకూ నెంబరు ఉంటుంది. జిపిఎస్ ఆధారంగా మేం వస్తాం” అన్నాడు గైడు.

ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకోడం మా వంతయింది.

రేడియో లైబ్రరీ:

సువిశాలమైన భవనంలో ఓ పెద్ద గ్రంథాలయం ఉంది. అది ఓపెన్ యాక్సెషన్ వ్యవస్థ గలది. ఎవరైనా వెళ్ళి ఏ వేళలోనైనా పుస్తకాలు చదువుకోవచ్చు. ఆ భవనానికి తలుపులు లేవు, కాపలాదారులు లేరు. ఒక మూల గదిలో లైబ్రరీ స్టాప్ కూచుని మనకి సహకరిస్తూంటారు.

మన దేశంలో కూడా అలా వుంటే బాగుండుననుకున్నాను. ఫోన్లో మర్నాడు మన దేశంలో ఒక పుస్తకాల పురుగుకు ఆ విషయం చెప్పాను. ఆయన చక్కని సందేశ మందించాడు.

“మన దేశంలో అలా వుంటే తెల్లవారేసరికి పుస్తకాలు కాదు గదా, పుస్తకాలుంచిన రాక్స్, బీరువాలు కూడా మాయమైపోతాయి” అని.

దినపత్రికలు:

అక్కడ రోడ్ల కూడళ్ళలో న్యూస్ పేపర్లు కూడా కట్టలు కట్టలుగా ఉంచుతారు. పక్కనే ట్రేలో సరిపడే నాణెం వేసి పత్రిక పట్టుకెళ్తారు. ఆదివారం దినపత్రికలు వెలువడవు. మనం స్పెషల్ సంచికలు వేస్తాము.

సిటీబస్సులు నిముషాలు కరెక్టుగా వస్తాయి. అందులో మనం నాణెం వేసి బస్సులో కెళ్ళి కూర్చుంటాము. కండక్టరు వుండడు. మన ఆర్.టి.సి. బస్సుల్లో కండక్టర్ గొంతు చించుకుని ‘టికెట్, టికెట్’ అని అరిచినా ఎవరో ఒకరు టికెట్ తీసుకోకుండా నిద్రను అభినయిస్తుంటారు.

నెల రోజుల పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకుని మదరాసు నుండి పినాకిని ఎక్స్‌ప్రెస్‍లో విజయవాడ వచ్చిన నాకు మా సిబ్బంది, శ్రేయోభిలాషులు స్వాగతం పలికారు. పత్రికలు మర్నాడు విశేషంగా వార్త ప్రచురించాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here