[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
మూడు పదుల ఉద్యోగ జీవితం (1967 – 1997)
[dropcap]నే[/dropcap]ను 1947 జనవరి 29న పుట్టాను. నేను పుట్టానని బ్రిటీషువాడు పారిపోయాడు. 1997లో ఢిల్లీ ఆకాశవాణి డైరక్టర్‌గా బదిలీ అయ్యేనాటికి ముచ్చటగా మూడు పదుల ఉద్యోగ జీవితం పూర్తి అయ్యింది. 1947లో పుట్టిన నేను 1967 జూన్ నాటికి ఎం.ఏ. తెలుగు గోల్డ్ మెడల్‍తో పూర్తి చేశాను. 20 ఏళ్ళకు ఎలా సాధ్యమనే సందేహం వెంటనే కలుగుతుంది.
1955 జూన్‌లో నాలుగో తరగతి ప్రాథమిక పాఠశాల విద్యను మా స్వగ్రామం చెన్నూరులోనే పూర్తి చేశాను. 9వ ఏట బుచ్చిరెడ్డిపాళెం దొడ్ల లక్ష్మీనరసారెడ్డి హైస్కూల్‌లో ఒక ఎంట్రన్స్ టెస్ట్ వ్రాసి సరాసరి 7వ తరగతిలో చేరాను. ఆ స్కూలు చాలా ప్రసిద్ధం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా అదే పాఠశాలలలో 1963లో చదివారు.
1960 జూన్ నాటికి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) పరీక్ష ప్యాసయ్యాను. నా జీవితంలో ముఖ్యఘట్టాల పరిమళాలు ఆశ్చర్యకరంగా జరిగాయి. నన్ను హైస్కూలులో చేర్చేడప్పుడు మా బాబాయి వెంకటప్పయ్య నా వయస్సు – పుట్టిన తేదీ – విషయంలో పొరబడ్డారు. మా కజిన్ హరనాథ్ 1946 ఫిబ్రవరి 9న రథసప్తమి రోజు పుట్టాడు. మరుసటి సంవత్సరం రథసప్తమి నాడు (1947) నేను పుట్టాను. నేను ఒక సంవత్సరం చిన్న. పుట్టినతేదీ వేసేడప్పుడు 1946లో ఒకటి తగ్గించి 1945 ఫిబ్రవరి 9గా వ్రాశారు. అదే నా ఉద్యోగ జీవితపు పుట్టినరోజుగా స్థిరపడి 2005 ఫిబ్రవరిలో రిటైరయ్యాను.
మైలురాళ్ళు:
1947లో పుట్టిన నేను 1967లో ఎం.ఏ. పూర్తి చేశాను. 1977లో తెలుగులో పి.హెచ్.డి. – కందుకూరు రుద్రకవి రచనలపై – చేశాను. 1967 డిసెంబరులో కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాను. 1987లో తొలిసారిగా ఢిల్లీ బదిలీపై వెళ్ళాను. 1997లో రెండోసారి ఢిల్లీ కేంద్ర డైరక్టర్‍గా వెళ్ళాను. 2007లో తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేస్తూ శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో షష్టిపూర్తి ఘనంగా జరుపుకున్నాను. 2017లో సప్తతిపూర్తిని కిన్నెర ఆర్ట్స్ రఘురామ్ హైదరాబాదులో వైభవంగా జరిపి స్వర్ణకంకణ ప్రదానం చేశారు.
అంచెలంచెలుగా ఎదుగుదల:
జననతేదీని బట్టి నాది అక్వేరియస్ రాశి. ‘లిండా’ అనే పాశ్చాత్య జ్యోతిష్కురాలు ఈ రాశివారు మేకపిల్లవలె పర్వతశిఖరానికి చకచకా వెళ్తారని వ్రాసిన మాటలు నాకు బాగా గుర్తు. నాకు నాలుగేళ్ళ వయస్సులో మా ఊరికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన రాచగుండ్ల చెంచలరావు నా జాతకచక్రం వేసి మా నాన్నగారితో ఇలా అన్నారట “మీవాడు దేశ రాజధాని దాకా వెళ్ళగలడు. అదృష్టజాతకుడు” అని. అలాంటిదే మరో సంఘటన.
నేను నెలల బాలుడిగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను చాప మీద పడుకోబెట్టి వాకిట్లో ఏదో పని చూసుకుని వచ్చేసరికి నాకు దగ్గర్లో నాగుపాము తల సమీపంలో పాకుతూ వెళ్ళడం చూసి నివ్వెరపోయింది. నన్ను చంకలో ఎక్కించుకుని పరుగు పరుగున పక్కింటికి వెళ్ళి భోరున ఏడవసాగింది. పాము పడగ పట్టిందని బుకాయించి నేనో రాజయోగ జాతకుడనని చెప్పను. అదృష్ట జాతకుడనని మాత్రం చెప్పగలను. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ నా షష్టిపూర్తి సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వ్యాసం వ్రాస్తూ ఇలా అన్నారు – “డి.వి. నరసరాజు తన స్వీయచరిత్రకు ‘అదృష్టవంతుడి ఆత్మకథ’ అని పేరు పెట్టారు. పద్మనాభరావు విషయంలో కూడా అది సరిపోతుంది” అని. భగవంతుడు నా జీవితంలో అన్నీ ఇచ్చాడు. ఎంతో కృతజ్ఞుణ్ణి.
ఉద్యోగపర్వం:
1967 డిసెంబరులో కళాశాల అధ్యాపకుడిగా చేరిన నేను అందులోనే ఉంటే తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా 2005లో రిటైరయ్యేవాడిని. అలాకాకుండా నేను పోటీ పరీక్షలో నిలబడి 1975లో ఆకాశవాణి ప్రొడ్యూసర్‍ని అయ్యాను. అలానే వుండి వుంటే నా మిత్రుల వలె నేను కూడా అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా రిటైరయ్యేవాడిని. 1982లో యు.పి.యస్.సి పోటీలో విజయం సాధించి అసిస్టెంట్ డైరక్టర్‍ని అయ్యాను. దాదాపు 300 మంది మీద సీనియారిటీ లభించింది. 1987లో యు.పి.యస్.సి పోటీలో సెలెక్షన్ ద్వారా స్టేషన్ డైరక్టర్‌ని అయ్యాను. 200 మంది మీద సీనియారిటీ దక్కింది. అలానే వుండి వుంటే అందరిలా రిటైరయ్యేవాడిని. అలా కాకుండా 2001లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో (సి.ఎ.టి) రిట్ వేసి నాకు రావలసిన డిప్యూటీ డైరక్టర్ జనరల్ ప్రమోషన్ ఇవ్వమని వాదించాను. అప్పటి మెంబరు శ్రీ తంబి – మూడు నెలలలోపు అర్హులందరికీ ప్రమోషన్ ఇవ్వమని తీర్పునిచ్చారు. ఫలితంగా నాతో బాటు అర్హులైన మరో 11 మంది డి.డి.జి.లుగా ప్రమోట్ అయ్యారు. అది భగవంతుని తీర్పుగా భావిస్తాను. రేడియోలో వున్న నన్ను ఒక్కడినే డి.డి.జి.గా దూరదర్శన్ ఢిల్లీలో వేశారు. అదొక విచిత్రం.
రచనా వ్యాసంగం:
చాలామంది నన్ను అడిగే ప్రశ్న – “మీరు ఇప్పటికి వంద పుస్తకాలు వ్రాశారుగదా? ఆఫీసులో ఉన్నతోద్యోగంలో వుంటూ అది ఎలా సాధ్యం?” అని. నా సమాధానం: నేను ఆఫీసు ఫైళ్ళు ఎన్నడూ ఇంటికి పట్టుకెళ్ళలేదు. ఇంట్లో వ్రాసే గ్రంథరచనను ఆఫీసులో చేయలేదు. వారాంతపు రెండు రోజుల సెలవుల్లో చాలా పుస్తకాలు నేను డిక్టేట్ చేస్తుంటే నా శ్రీమతి శోభాదేవి వ్రాసి పెట్టేది. జిరాక్స్ సౌకర్యం లేని ఆ రోజుల్లో కార్బన్ కాపీ పెట్టి వ్రాసేది.
1970లో నా తొలి రచన ‘వి.వి. గిరి జీవితచరిత్ర’ ప్రచురించాను. అప్పటి నుండి 1997 వరకు దాదాపు నలభై పుస్తకాలు ప్రచురించాను. అందులో వివిధ ప్రక్రియలు ఉన్నాయి. 1976 వరకు అష్టావధానాలు వందకు పైగా ఆంధ్రదేశంలోని పలు ప్రదేశాలలో చేశాను. ఆ అవధాన పద్యాలను – ‘అవధాన పద్మ సరోవరం’ పేర 2008లో ప్రచురించాను. 2008లో నేను వంగూరి ఫౌండేషన్, అమెరికా వారి ఆహ్వానం మేరకు చిట్టెన్‌రాజు గారి సౌజన్యంతో అమెరికా వెళ్ళినప్పుడు ఆ గ్రంథాన్ని ఫ్రిమాంట్‍లో ఆవిష్కరించారు.
వైవిధ్యభరిత రచనలు:
2017 వరకూ వచ్చిన రచనలలో నవలలు 4 ప్రచురించబడ్డాయి. ‘మారని నాణెం’ నా తొలి నవల 1973లో వచ్చింది. ఆ తరువాత 1980లో సిద్ధార్థ పబ్లికేషన్స్, విజయవాడ వారు ‘వక్రించిన సరళరేఖ’, ‘సంజ వెలుగు’ నవలలు, ‘హరివంశం’ రేడియో ధారావాహిక ప్రచురించారు. 1996లో సికరాజు సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రభూమి వారపత్రికకు అనుబంధంగా ‘వారసత్వం’ నవలిక ప్రచురించారు. మూడు కథానికా సంపుటులను ప్రచురించాను. నా తొలి మూడు నవలలపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ పర్యవేక్షణలో టి. శ్యాంప్రసాద్ యం.ఫిల్ చేశారు. అది ముద్రితం.
నా పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం కందుకూరి రుద్రకవి – 1977లోనూ, తెలుగు కావ్యాలలో ప్రకృతి వర్ణనలు – ప్రకృతి కాంత – పేర ప్రచురించాను. జీవితచరిత్రలు వ్రాయడం నాకిష్టం – వరుసగా రాయలసీమ రత్నాలు – 2 భాగాలు, మన ప్రకాశం, ముత్తుస్వామి దీక్షితులు వ్రాసి ప్రచురించాను. ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు, ప్రసార ప్రముఖులు, ప్రసార రథ సారథుల జీవన రేఖలు.
అనువాద రచన:
నా రచనల్లో 25 శాతం అనువాద రచనలు ఉన్నాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే నిలిచి పోతాననే భయం వుంది. అనువాద రచయితగా నాకు రెండు బహుమతులు వచ్చాయి.
- 1993 – తెలుగు విశ్వవిద్యాలయ బహుమతి – ఆంగ్లంలో ముల్క్‌రాజ్ ఆనంద్ వ్రాసిన Morning Face కు తెలుగు అనువాదం – ప్రభాత వదనం.
- 2000 – కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి – అమితావ్ ఘోష్ – Shadow Lines తెలుగు అనువాదం – ఛాయారేఖలు.
నేను చేసిన ఇతర అనువాదాలు –
- Women in Valmiki – డా. ఇలపావులూరి పాండురంగారావు – రామాయణంలో స్త్రీ పాత్రలు
- Water – రామా – నీరు
- Trees – రామా – చెట్లు
- Low Cost or No Cost Books – బోధనోపకరణాలు
- Hebrew Short Stories – మధుక్షీరాలు
- Mother Teresa – Mehta – మదర్ తెరెసా
- Valmiki – డా. ఇలపావులూరి పాండురంగారావు – వాల్మీకి
- Indian Classics – భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలకు ఆంగ్లానువాదం (తెలుగు మూలం నాదే)
- వేయి పడగల ఆంగ్లానువాద సంపాదకవర్గ సభ్యత్వం.
ఇక నా ఆంగ్ల రచనలు:
1984లో Literary Heritage, 2012లో Job Interviews (ఢిల్లీలోని జాన్ పబ్లికేషన్స్ ప్రచురణ), Ethics, Integrity and Aptitude (తెలుగు అకాడమీ ప్రచురణ), Marathon Race to Civil Services (అంతర్వేది వశిష్ఠాశ్రమ ప్రచురణ), Sankarambadi (ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురణ).
జీవిత చరిత్రలలో బెజవాడ గోపాలరెడ్డి (సి.పి.బ్రౌన్ అకాడమీ), శంకరంబాడి సుందరాచారి (ఎమెస్కో ప్రచురణ), కాంతయ్య, జమలాపురం కేశవరావు (తెలుగు అకాడమీ), దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రముఖులు.
నా రచనలపై పరిశోధనలు:
నాలుగు విశ్వవిద్యాలయాల నుండి ఐదుగురు పరిశోధకులు యం.ఫిల్, పి.హెచ్.డి డిగ్రీలు పొందారు.
- అనంత పద్మనాభరావు నవలల పరిశీలన – టి. శ్యాం ప్రసాద్ – శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యం.ఫిల్ – పర్యవేక్షణ: ఆచార్య కొలకలూరి ఇనాక్ –
- పద్మనాభరావు అనువాద రచనలు – కట్టమంచి చంద్రశేఖర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. యం.ఫిల్ – పర్యవేక్షణ: పి.సి. వెంకటేశ్వర్లు –
- పద్మనాభరావు రచించిన జీవితచరిత్రలు – కట్టమంచి చంద్రశేఖర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. పి.హెచ్.డి- పర్యవేక్షణ: పి.సి. వెంకటేశ్వర్లు –
- పద్మనాభరావు సమగ్ర సాహిత్యం – ధన్యంరాజు నాగమణి, తెలుగు విశ్వవిద్యాలయం. పి.హెచ్.డి- పర్యవేక్షణ: టి. గౌరీశంకర్ –
- పద్మనాభరావు సృజనాత్మక సాహిత్యం – బి. చిట్టెమ్మ – హైదరాబాదు విశ్వవిద్యాలయం.
పి.హెచ్.డి- పర్యవేక్షణ: గోనా నాయక్ – త్వరలో సమర్పితం (2019).
- పోతులయ్య ఆచార్య బ్రహ్మానంద వద్ద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి.కి కృషి చేసి అసమగ్రంగా నిలిపివేశాడు.
ఇదీ నా రచనా వ్యాసంగం.
(సశేషం)