[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
రాజధాని నగర సింహాసనం:
[dropcap]వి[/dropcap]జయవాడ ఆకాశవాణిలో పనిచేస్తుండగా దైవికంగా నన్ను ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టరుగా నియమిస్తూ అక్టోబరు 1997లో ఆదేశాలు వచ్చాయి. ఔత్తరాహులు ఎక్కువమంది ఆ పదవిలో ఉన్నారు. 1960 దశకంలో విజయవాడ వాస్తవ్యులు సూరి నారాయణమూర్తి ఢిల్లీ డైరక్టరుగా పనిచేశారు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఆ సీట్లో కూర్చోగలిగాను. 20 సంవత్సరాల తర్వాత 2017లో మళ్ళీ శ్రీమతి శైలజా సుమన్ ఆ పదవి నందుకోగలిగారు.
1994-1997 సంవత్సరాల మధ్య నోరిన్ నక్వీ డైరక్టరుగా పనిచేశారు. మూడేళ్ళు పూర్తయ్యాయి కాబట్టి ఆమెను డైరక్టరేట్‌లో అత్యంత కీలకమైన ‘డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ – పాలసీ’ గా వేశారు. ఆ ఖాళీలో నన్ను వేశారు. రెండేళ్ళ తర్వాత మళ్ళీ నేను ఆమె పోస్టులో కెళ్ళాను. అది మరో మారు ప్రస్తావిస్తాను.
1997 అక్టోబరు 8న నేను ఢిల్లీ విమానాశ్రయంలో దిగాను. నాకు స్వాగతం పలకడానికి అప్పట్లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా పనిచేస్తున్న యన్.సి.నరసింహాచార్యులు వచ్చారు. ఆయన, నేను కడప, విజయవాడలలో పనిచేసి వున్నాము. ఆ సమయంలో ఢిల్లీలో బ్రిటానియాలో పనిచేస్తున్న మా పెద్దబ్బాయి రమేష్ చంద్ర కూడా విమానాశ్రయానికి వచ్చాడు.
ఆకాశవాణికి గెస్ట్ హవుస్ లేదు. నాకు ఢిల్లీలో బంధువులు లేరు. వసతి ఎక్కడ వుండాలా? అని సందిగ్ధంలో వున్న సమయంలో మా బుచ్చిరెడ్డిపాళెం వారు, ఒంగోలు పార్లమెంటు సభ్యురాలు అయిన మాగుంట పార్వతమ్మను ఓ మిత్రుని ద్వారా అడిగాను. ఆమె ఉదార స్వభావురాలు. “మా యం.పి. క్వార్టర్సులో వుండండి స్వామీ!” అని కబురు పంపారు. ప్రగతి మైదాన్‌కు సమీపంలో వారి క్వార్టర్సు. వారి పక్కనే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి షీలా దీక్షిత్ నివాసం. సరాసరి పార్వతమ్మ క్వార్టర్లో దిగాను. ఓ నెల రోజులకు గాని నాకు ప్రభుత్వ క్వార్టరు కేటాయించలేదు. విశాలమైన ఆ క్వార్టర్లో వారి భోజన సదుపాయాలతో హాయిగా వున్నాను.
1997 అక్టోబరు 8న ఉదయం పది గంటలకు ఆఫీసు కార్లో పార్లమెంట్ స్ట్రీట్‌లో వున్న బ్రాడ్‌కాస్టింగ్ హవుస్ – ఢిల్లీ కేంద్రంలో అడుగుపెట్టాను.
నాకు వ్యక్తిగత కార్యదర్శి సత్నామ్ కౌర్. ఆమెకు సహాయకురాలు శ్యామా పాఠక్. ఇద్దరూ శ్రద్ధగా పనిచేసే స్వభావం కలవారు. సత్నామ్ కౌర్ పదిమందికి పైగా డైరక్టర్ల దగ్గర పని చేసింది. రిటైర్ అయిన తర్వత కూడా శైలజా సుమన్ హయాం 2017 చివరి వరకూ 65 సంవత్సరాల వయస్సు దాకా పనిచేసింది. చెప్పిన పనిని నిముషాల మీద చేసి పెట్టగల సమర్థురాలు. ప్రతి ఆఫీసు ఆర్డరుకు కాపీ ఒకదానిని ఫైలులో వేసి ఉంచేది. శ్యామా పాఠక్ స్టెనోగ్రాఫర్. నేను వ్రాసిన ఇండియన్ క్లాసిక్స్ ఆంగ్ల గ్రంథాన్ని సెలవు దినాలలో ఇంట్లో టైపింగ్ చేసి పెట్టిన వ్యక్తి. ఆ పుస్తకాన్ని పబ్లికేషన్స్ డివిజన్ వారు 2000లో ముద్రించారు. తెలుగు మూలం నాదే. దానిని కెజ్రివాల్ – మా డైరక్టర్ జనరల్ – 1997లో హైదరాబాదులో ఆవిష్కరించారు. ఆ పుస్తకం వల్లనే నా ప్రతిభ గుర్తింపబడి ఢిల్లీ కేంద్ర డైరక్టర్ కాగలిగానని నా విశ్వాసం.
డైరక్టరేట్‌లో హేమాహేమీలు:
1997లో నేను చేరినప్పుడు ఆకాశవాణి డైరక్టర్ జనరల్‌గా వార్తా విభాగాధిపతిగా పని చేసిన ఓం ప్రకాశ్ కెజ్రివాల్ (బెనారస్ వాస్తవ్యులు) వున్నారు. డి.డి.జి.లుగా యం.డి. గైక్వాడ్, పి.సి. హేంబ్రం తదితరులున్నారు. నోరిన్ నక్వీ పాలసీ డైరక్టరు. ఢిల్లీ కేంద్ర డైరక్టర్‌గా వీరందరితో సమన్వయం చేసుకుంటూ నడవాలి.
మంత్రిత్వశాఖలో కేంద్రమంత్రిగా యస్. జైపాల్‌రెడ్ది వ్యవహరిస్తున్నారు. ఆయన నన్నెరుగరు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖలో లోగడ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన కె.యన్. శర్మ దూరదర్శన్ డైరక్టర్ జనరల్. అటు మంత్రిత్వశాఖతోనూ, డైరక్టరేట్‌తోను – దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 180 కేంద్రాలతోనూ సమన్వయం అవసరం.
డైరక్టరేట్‌లో ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. అటు డిజి – కెజ్రివాల్ – ఇటు గైక్వాడ్, వీరు పరస్పరం బాణాలు సంధించి ఫైళ్ళ మీద నోటింగులు వ్రాస్తున్నారు. ఏదైనా దేశవ్యాప్త రిలే జరగాలంటే అది ఢిల్లీ కేంద్రం నుండి నా ద్వారా జరగాలి. పాలసీ డైరక్టరు నోరిన్ నక్వీ నాకు ముందుగా ఫోన్లో చెబుతారు. తర్వాత ఆర్డర్లు పంపిస్తారు. ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య మేకపిల్లలాగా నేను కొన్ని సందర్భాలలో నలిగిపోయాను. స్వభావసిద్ధంగా నేనెవరి మీదా కోప్పడి ఎరుగను. పేరుకు మాత్రం క్రమశిక్షణ గల స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు వచ్చింది. 1990లలో అనంతపురం, 1993లో కడప, 1995లో విజయవాడ కేంద్రాల డైరక్టర్‌గా పనిచేసిన అనుభవం వుంది. కార్యక్రమ రూపకల్పనలోనూ, యాజమాన్యంలోనూ నాది ప్రత్యేక శైలి. అటు ఇంజనీరింగ్ విభాగంతోనూ, ఇటు అడ్మినిస్ట్రేషన్‌తోను మంచిగా నెట్టుకొచ్చాను.
ఢిల్లీ కేంద్ర సిబ్బంది:
దాదాపు 50 సంవత్సరాలకు పైగా చరిత్రగల స్వతంత్ర్య భారత ప్రసార రంగ చరిత్రలో బ్రాడ్‌కాస్టింగ్ హవుస్‌లో నా గదికి ఓ ప్రత్యేకత ఉంది. తొలి రోజుల్లో ఆకాశవాణి డైరక్టర్ జనరల్ అందులో కూర్చునేవారు. తర్వాత పక్కనే విశాలమైన ఆకాశవాణి భవన్ కట్టారు. అందులోకి డైరక్టర్ జనరల్ తరలి వెళ్ళారు. న్యూస్ విభాగం, విదేశీ ప్రసారాల విభాగం మా బిల్డింగ్‌లోనే ఉంటాయి.
ఢిల్లీ కేంద్రంలో ప్రోగ్రాం విభాగంలో నాతో బాటు ఇద్దరు డిప్యూటీ డైరక్టర్లు (స్టేషన్ డైరక్టరు హోదా), ముగ్గురు అసిస్టెంట్ డైరక్టర్లు, 22 మంది ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు, మొత్తం 600 మంది దాక సిబ్బంది (ప్రత్యక్ష, పరోక్షంగా) పనిచేస్తున్నారు. సంగీత విభాగం చాలా పెద్దది. అందులో చాలామంది హిందూస్థానీ స్టాఫ్ ఆర్టిస్టులు వీలున్నప్పుడల్లా, వాళ్ళకు బయట కచేరీలు లేని రోజుల్లో ఆఫీసుకు దయచేసే సంప్రదాయానికి అలవాటు పడ్డారు. ఈ సందర్భంలో విజయవాడ కేంద్రంలో జరిగిన ఒక సంఘటన గుర్తు వస్తోంది.
మా ఆఫీసులో పనిచేసే వయోలిన్ నిలయ విద్వాంసుడొకాయన రోజూ మధ్యాహ్నం 12 గంటలపైన ఆఫీసుకు వచ్చేవాడు. ఆ విషయం నాకు తెలిసి ఒకరోజు ఆయనను పిలిపించాను. “రావు గారూ! నేను రిటైరయ్యే వాణ్ణి. చూచీ చూడనట్లు వుండండి సార్!” అన్నాడు.
“మీరు ఎప్పుడు రిటైరవుతారు?” అన్నాను.
“ఎంత సార్! ఇంక మరో 12 సంవత్సరాలు” అన్నాడా పెద్దమనిషి. అలా ఉంటాయి కొందరి మనస్తత్వాలు.
ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ ప్రతి రోజూ ఉదయం పది గంటలకు ప్రోగ్రాం మీటింగ్ జరుగుతుంది. నా అధ్యక్షతన జరిగే మీటింగులో నిన్నటి ప్రసారాల లోపాలు, నాణ్యతలు, ఈ రోజు కార్యక్రమాలు, రేపటి కార్యక్రమాలలో మార్పులు, చేర్పులు, ఒక ప్రోగ్రాం ఆఫీసరు చదువుతారు. ఢిల్లీ కేంద్రంలో ఏ, బి, సి, డి – నాలుగు కేంద్రాలు కాక ఎఫ్.ఎమ్ కూడా ఉన్నాయి. 22 మంది ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లలో కొందరికి గైర్హాజరయ్యే అలవాటుంది. దానికిగా నేను హాజరైన వారి సంతకాలు తీయించేవాడిని. రాని వారికి ఆ రోజే ఒక సలహా పంపేవాడిని. దానిని ప్రోగ్రాం స్టాప్ అసోసియేషన్ ద్వారా వాళ్ళు ప్రతిఘటించారు. “మేము గెజిటెడ్ ఆఫీసర్లము. హాజరయినట్టు సంతకాలు 20 ఏళ్ళుగా చెయ్యట్లేదు. ఈ పద్ధతి ఉపసంహరించుకోండి” అని గట్టిగా వాదించారు. మీటింగ్‍కు హాజరైన వారి సంతకాలు తీసుకోవడంలో తప్పు లేదని నేను నా వాదనపై నిలబడ్డాను.
స్టాఫ్ వెల్ఫేర్ మీటింగు:
వివిధ విభాగాల సంక్షేమం డైరక్టరుగా నా బాధ్యత. నా సహచరులు సూపరింటెండింగ్ ఇంజనీరు హెచ్.సి.పంత్ బాగా సహకరించారు. ఒకరోజు ఆ మీటింగులో ఒక ఇంజనీరు లేచి పెద్ద పెద్దగా మాట్లాడడం మొదలుపెట్టాడు. “ఈ బిల్డింగులో కోతుల బెడద ఎక్కువగా వుంది. మూడు నెలల క్రితం జరిగిన మీటింగులో కూడా ఈ ప్రస్తావన చేశాము. మీరు ఏ చర్యలు తీసుకోలేదు. మాకు అపాయం జరిగే అవకాశం వుంది” అంటూ గొడవ చేశాడు.
“బ్రదర్, మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడే దానికిగా ఆఫీసు నిధుల నుండి ముప్ఫయివేల రూపాయలు మంజూరు చేస్తున్నాను. మీరు ఆ బాధ్యత తీసుకుని వారం రోజుల్లో సమస్యను పరిష్కరించండి” అన్నాను.
దిగ్భ్రమ చెందిన అతను – “డబ్బులు ఖర్చుపెడితే కోతులు పోవు సార్! వారం రోజుల్లో మళ్ళీ వస్తాయి. వాటిని చంపకూడదు గదా!” అని కూర్చున్నాడు.
ప్రసారాలలో నాణ్యత:
ఢిల్లీ కేంద్ర ప్రసారాల లొసుగులను పసిగట్టే డ్యూటీ ఆఫీసర్లు ఐదు కేంద్రాలలోనూ 24 గంటలు పని చేస్తూంటారు. ఏ నిముషంలో ప్రసారానికి అంతరాయం వచ్చిందో, ఏ కార్యక్రమంలో దోషాలున్నాయో వారు డెయిలీ ప్రోగ్రామ్ షీట్‌లో నమోదు చేస్తారు. సంగీత కళాకారులకు బి, బి-హై గ్రేడ్లు ఇస్తారు. ఆరోజు వారు గానం చేసిన పరిణతిని గణనలోకి తీసుకుంటారు. అలానే నాటక కళాకారులకు, ప్రసంగకర్తలకు గ్రేడు ఇస్తారు.
నేను ఇంట్లో కూడా రెండు రేడియో సెట్లు పెట్టుకుని కార్యక్రమాలు నిరంతరం వినేవాడిని. ఆకాశవాణిలో నేను చేయని ఉద్యోగం డ్యూటీ ఆఫీసరు, అనౌన్సరు. కాని ఇంట్లో ఠంచనుగా రేడియో వినే డ్యూటీ నాది. వినాలని బలవంతం లేదు. ఒకరోజు ప్రోగ్రాంలో ‘ఢిల్లీ బి’ కేంద్రంలో రాత్రి 12.20 నిముషాలకు ఒక లోపం గమనించాను. మర్నాడు మీటింగులో ప్రస్తావించాను. అందరూ నివ్వెరపోయారు. వెంటనే ఒక చమత్కారి లేచి “సార్, ఆ టైమ్‌లో మీరెందుకు మేల్కొన్నారు?” అన్నాడు.
“నా డ్యూటీలో నేనున్నాను” అని నవ్వాను.
ప్రసారాల కోసం అత్యంత ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రోజూ వచ్చేవారు. మరీ ముఖ్యమైన వారిని నేను స్టూడియోలోని ‘లౌంజ్’లో కలిసి కాఫీ తాగేవాడిని. ఏ రోజు ఏ ముఖ్యవ్యక్తి వస్తుననరో నాకు నా సెక్రటరీ ముందుగా టేబుల్ మీద నోట్ వుంచేది. చాలా మంది సెకండ్ ఫ్లోర్ లోని నా ఆఫీసు ఛాంబర్‌కు వచ్చి కాఫీ తాగి వెళ్ళేవారు. మా అఫీషియల్ ఫొటోగ్రాఫర్ ‘క్లిక్’మనిపించేది. మర్నాడు ఒక కాపీ నాకు తెచ్చి ఇచ్చేది. ఇలా దైనందిన కార్యక్రమాలకు తోడు వివిధ మంత్రిత్వ శాఖలలో జరిగే మీటింగులకు వెళ్ళేవాడిని.
(సశేషం)