ఆకాశవాణి పరిమళాలు-27

1
3

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రసారభారతి ఆవిర్భావం:

[dropcap]1[/dropcap]997 అక్టోబరు 8న నేను ఢిల్లీ కేంద్ర డైరక్టరుగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. సెప్టెంబరులోనే ప్రసారభారతి చట్టం రూపొందింది. ఛైర్మన్, ఆరుగురు పార్ట్‌టైం మెంబర్లు, డిజి ఆకాశవాణి, డిజి దూరదర్శన్, మెంబర్ ఫైనాన్స్, మెంబర్ పర్సన్నెల్, ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా బోర్డును మూడేళ్ళపాటు నియమిస్తారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా సమావేశాలు కనీసం మూడు నెలలకొకసారి నిర్వహిస్తారు.

1997 నవంబరు 22న నిఖిల్ చక్రవర్తి ఛైర్మన్‌గా తొట్టతొలి బోర్డు నియమించబడింది. నిఖిల్ చక్రవర్తి సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు. బి.జి.వర్గీస్ (పత్రికా సంపాదకులు) సభ్యులుగా నియమితులయ్యారు. సీఇవోగా యస్.యస్.గిల్ నియమితులయ్యారు. ఆయన కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా 1985లో పని చేసిన ఐఎఎస్ అధికారి. అప్పుడు మా ఆకాశవాణి డైరక్టర్ జనరల్ ఓ.పి. కెజ్రివాల్.

ఏదైనా విధాన నిర్ణయం అమలు చేయాలంటే డైరక్టర్ జనరల్ ద్వారా ఢిల్లీ కేంద్రానికి సమాచారం అందివ్వాలి. కాని, గిల్ స్వయంగా నాకు ఫోన్ చేసేవారు. నేను డి.జి.కి తెలియజేసి కార్యాచరణ మొదలుపెట్టేవాడిని. గిల్‌తో మాట్లాడడానికి సీనియర్ అధికారులు కూడా భయపడేవారు.

ప్రసారభారతి ఏర్పడి సంవత్సరం కావస్తోంది. జైపాల్ రెడ్డి కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా ఉన్నారు. దశాబ్దాల తరబడి ఆకాశవాణి, దూరదర్శన్‌లకు స్వయంప్రతిపత్తి కలిగించాలని పార్లమెంటులో జరిగిన తర్జనభర్జనల తరువాత ఎట్టకేలకు ప్రసారభారతి ఆవిర్భవించింది. దాని శైశవదశను దగ్గరగా వుండి దర్శించినవారిలో నేనొకడిని. వయోభారం పైబడిన నిఖిల్ చక్రవర్తి దైనందిన కార్యకలాపాలలో జోక్యం చేసుకునేవారు. గిల్ సర్వంసహాధికారి. తొలి సంవత్సరంలోనే మంత్రిత్వశాఖ పెత్తనం చెల్లదంటూ ప్రసారభారతి గొడవపడేది.

ఒకరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మా డి.జి. స్వయంగా ఫోన్ చేశారు. “రావ్! నిఖిల్ చక్రవర్తి ఆకస్మికంగా మరణించారు. అంతిమ సంస్కారాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మీరు వెంటనే వారి యింటి వద్దకు వెళ్ళి ఏర్పాట్లను పరిశీలించండి” అన్నారు. మంత్రిత్వశాఖకు చెందిన అధికారులు, రాజకీయ నాయకులు, పత్రికా సంపాదకులు, పాత్రికేయులు వందల సంఖ్యలో వచ్చి పార్థివ శరీరానికి శ్రద్ధాంజలి ఘటించారు. సాయంకాలంలోగా అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యాయి.

బాలారిష్టాలు ప్రసారభారతిని చుట్టుముట్టాయి.

ప్రసారబారతి సిబ్బంది ప్రభుత్వోద్యోగులుగా పరిగణింపబడరనీ, వారికి కేంద్ర ప్రభుత్వ వసతి సౌకర్యాది సదుపాయాలు వర్తించవని ఆదేశాలు జారీ అయ్యాయి. వేలాది ఉద్యోగులు ఆందోళన చేశారు. ఫలితంగా కొన్నాళ్ళ పాటు కొనసాగుతాయని ఆదేశాలు సవరించారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ప్రోగ్రామ్ సిబ్బంది నియామకాలు జరిగేవి. వాటిని ఆపివేశారు. ప్రసారభారతి సిబ్బంది నియామక బోర్డు ఏర్పాటు కాలేదు. త్రిశంకు స్వర్గం పరిస్థితి నెలకొంది. గిల్ తన అధికార ప్రతాపం చూపసాగారు. ప్రభుత్వాన్ని ఎదిరించసాగారు. ఉద్యోగులు అయోమయ స్థితిలో పడ్డారు. ఎన్నో ఏళ్ళుగా కలలు కని, ప్రసారభారతితో తమకు వైభవము, స్వయం ప్రతిపత్తి కలుగుతాయనుకొన్నది ఎండమావిగానే మిగిలిపోయింది.

1998లో ఒకరోజు రాత్రి 11.30కి నాకు ఫోన్ వచ్చింది. మా డి.జి. కెజ్రివాల్ ఫోన్ చేశారు.

“రావ్ సాహెబ్! I want a car at my residence within 20 minutes” అన్నారు.

“సార్!” అని ఏదో చెప్పబోయాను.

“ఏదో విధంగా నాకు కారు పంపే ఏర్పాటు చూడండి. I know you can manage.”

ఏం చేయాలో పాలుపోలేదు. అర్ధరాత్రి డ్రైవర్లు ఉంటారా? నేను ట్రావెల్ సర్వీస్ నడపడం లేదు గదా!

వెంటనే ఢిల్లీ ఆకాశవాణి డ్యూటీ రూమ్ – ఎఫ్.ఎమ్. స్టేషన్‌కి ఫోన్ చేశాను. ఎదుటివాడు సమాధానం చెప్పే అవకాశం యివ్వకుండా – “హలో!  నేను ఎస్.డి. మాట్లాడుతున్నాను. మరో 10 నిముషాలలో డిజి గారి యింటికి ఒక కారు అర్జెంటుగా పంపండి. డ్రైవర్ అక్కడికి చేరిన తర్వాత నాకు ఫోన్ చెయ్యమనండి!” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

ఢిల్లీ స్టేషన్‌లో దాపు పది టాక్సీలు రోజూ నడుస్తూంటాయి. రాత్రి పూట డ్యూటీ అవగానే యిళ్ళ వద్ద సిబ్బందిని దించడానికి ఒక కారు వుంటుంది. మంత్రిత్వశాఖకు సంబంధించిన సీనియర్ ఆఫీసర్లు కూడా వారికేవయినా అవసరాలు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసేవారు. అంగీకరించేవాణ్ణి.

పదిహేను నిముషాలలో డి.జి. ఫోన్ చేసి, “థాంక్యూ రావ్, కారు వచ్చింది. వివరాలు రేపు ఉదయం నేనే ఫోన్ చేసి చెబుతాను” అన్నారు.

ఆ మర్నాడు ఉదయం ఫోన్ చేశారు. “సి.ఇ.ఓ.గా నేను అర్ధరాత్రి ఛార్జ్ తీసుకున్నాను. గిల్‌ను పదవి నుండి తొలగించారు. ఆయన కోర్టుకు వెళ్ళకుండా నన్ను ఛార్జి తీసుకోమని మంత్రిత్వశాఖ ఆదేశించింది” అన్నారు. గిల్ 1952 బ్యాచ్ అధికారి.

కొద్ది నెలలు తాత్కాలిక సి.ఇ.ఓ.గా కెజ్రివాల్ వ్యవహరించారు. కొద్ది రోజులలో యు.పి. క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఆర్.ఆర్. షా సి.ఇ.ఓ.గా నియమితులయ్యారు. ఆయన అధికార హోదా చూపించేవారు. గంభీరమైన శరీరము, హుందాతనం కనిపించే ముఖవర్చస్సుగల అధికారి. ఆయన ఒకరోజు ఆకాశవాణి కేంద్రం పనితీరు పరిశీలించడానికి వస్తారని కబురు అందింది.

స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాం. ఆయనతో బాటు కారులో వారి సతీమణి కూడా దిగారు. దాదాపు గంట సేపు అన్ని విభాగాలను దర్శించి నా ఆఫీస్ రూమ్‌కి వచ్చి టీ తాగి సరదాగా మాట్లాడి వెళ్ళారు. పార్లమెంట్ స్ట్రీట్‌లోని ఆకాశవాణి భవనం వైభవంగా వుంటుంది. మూడంతస్తుల భవనం.

అందులోనే విదేశీ ప్రసారాల విభాగము, వార్తా విభాగము ఉంటాయి. అన్ని భాషలలో వార్తలు ప్రసారమవుతాయి. 24 గంటలూ వార్తాప్రసారాలు కొనసాగుతూ నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా వుంటుంది. కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, సుప్రసిద్ధ సినీతారలు, హిందూస్థానీ కళాకారులు రికార్డింగులకు వస్తారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి – రికార్డింగుకు మాత్రం మేము వారి వద్దకు వెళ్తాము.

రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశాలు రాష్ట్రపతి భవన్‌లోనే రికార్డు చేస్తాము. ‘జన్‌మంచ్’ అనే పేర కేంద్ర మంత్రులకు శ్రోతలు ఫోన్ ద్వారా ప్రశ్నలు సంధించవచ్చు. వాటికి వారు సమాధానాలు ఇస్తారు.  నేను డైరక్టరుగా ఉన్న రోజుల్లో రక్షణశాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుమార్, సోమ్‌పాల్, ఉమాభారతి స్టూడియోకి విచ్చేశారు.

ఆర్.ఆర్. షా రెండేళ్ళ లోపు బదిలీ అయ్యారు. ఆయనను ప్రణాళికా సంఘం కార్యదర్శిగా నియమించారు. ప్రసారభారతిలో పనిచేశారు కాబట్టి ఆకాశవాణి, దూరదర్శన్‌లకు కొత్త కార్యక్రమాల రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం ఆమోదంతో నిధులు మంజూరు చేస్తుందని ఆర్.ఆర్. షా ఒక హైలెవెల్ మీటింగును ఏర్పాటు చేశారు. అందులో నేను ఆకాశవాణి నిధుల గూర్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాను.

ఆర్.ఆర్. షా తర్వాత అనిల్ బైజాల్ సీ.ఇ.ఓ.గా వచ్చారు. ఆయన తర్వాత కేంద్రంలో హోం సెక్రటరీగా ఉన్నారు. ఆయనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుగా మోడీ ప్రభుత్వం నియమించింది. ఆప్ ప్రభుత్వాన్ని, కెజ్రివాల్ దూకుడును అదుపులో పెట్టడానికి కేంద్రం ఆ నియామకం జరిపింది.

అనిల్ బైజాన్ రెండేళ్ళ పాలన తర్వాత ఆంధ్రులైన కె.యస్. శర్మ సీ.ఇ.ఓ.గా నియమితులయ్యారు. లోగడ సమాచార ప్రసారమంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. మానవ వనరుల మంత్రిత్వశాఖలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

కార్యదర్శి పదవికి శర్మ ప్రమోట్ కాబోయే సమయమది. ఆకాశవాణి, దూరదర్శన్ పాలనావ్యవస్థతో సన్నిహిత పరిచయము, అనుభవము వున్న ఆయన ప్రసారభారతి సీ.ఇ.ఓ. పదవికి ఎంపికయ్యారు. సీ.ఇ.ఓ. పదవి 62 ఏళ్ళ వరకు కొనసాగుతుంది. సెలక్షన్ కమిటీకి అధ్యక్షులు ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్‍గా ఉన్న జస్టిస్ కె. జయచంద్రారెడ్డి సభ్యులు. ఆ కమిటీ శర్మను ఎంపిక చేసింది.

1968 సంవత్సరపు ఐఎఎస్ బ్యాచ్‌కి చెందిన ఆంధ్రా క్యాడర్ అధికారి కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ. సి.ఇ.ఓ.గా చేరడానికి ముందు స్వచ్ఛంద పదవీ విరమణ రాజీనామా చేయాలనే షరతు విధించారు. ప్రసారభారతిలో ఆయన 14-3-2002 నాడు చేరి 30-6-2006 నాడు రిటైరయ్యారు. నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన సుదీర్ఘానుభవం వారిది. దూరదర్శన్ ప్రసారాల నాణ్యతను పెంచారు.

నేను 1997 అక్టోబరు నుంచి 2005 ఫిబ్రవరి వరకు వివిధ హోదాలలో ఢిల్లీలో ఉన్నాను. నాకు గృహవసతి తొలుత ప్రగతి విహార్ హాస్టల్లో ఇచ్చారు. ఫర్నిష్డ్ భవనం అది. 1997 డిసెంబరు నుంచి ఒక సంవత్సరం రోజులు అందులో ఉన్నాను. 1999 జనవరిలో టైప్-4 వసతిని పండారా రోడ్‌లోని ఎ-223లో ఇచ్చారు. ఆ ఇంట్లో అప్పటివరకూ రాజ్యసభ సభ్యురాలు, గాంధేయవాది అయిన నిర్మలా దేశ్‌పాండే వుండేవారు. ఆమె అవివాహిత. గాంధీ రాజ్‌ఘాట్ ట్రస్ట్ తదితర సంస్థల యాజమాన్యం చూసేవారు.

ఆమె ఒకసారి స్టూడియోకి వచ్చారు.

“మీరున్న ఇల్లు మీ తర్వాత ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు” అన్నాను.

“ఎవరు?” అంది

“నేనే” అన్నాను.

“ఐయామ్ హ్యాపీ” అన్నారు.

మా పండారా రోడ్డు ప్లాట్స్ పక్కనే పండారా పార్క్ వుంది. అందులో లాల్‌బహాదూర్ శాస్త్రి కుమారులు సునీల్ శాస్త్రి, ఎలక్షన్ కమీషనర్ టి.యస్. కృష్ణమూర్తి, గ్రామీణభివృద్ధి శాఖ కార్యదర్శి డా. పి.ఎల్. సంజీవరెడ్ది, విజిలెన్స్ కమీషనర్ హెచ్.జె. దొర ఉండేవారు. మెయిన్ రోడ్ మీద కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్లమెంటు సభ్యులు ముద్రగడ పద్మనాభం, కె. రామమోహనరావు, శ్రీమతి జయంతి నటరాజన్ ప్రభృతులు ఉండేవారు. ఇటువైపు షాజహాన్ రోడ్‌లో కేంద్రమంత్రులు సి.హెచ్.విద్యాసాగరరావు, కృష్ణంరాజు, యు.పి.యస్.సి. మెంబరు పి. అబ్రహం, శ్యాంబాబు ఉండేవారు. వీరందరితో నేను కలిసి మెలిసి తిరిగే అవకాశం లభించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here