[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
లోక్‌సభకు ఎన్నికలు:
[dropcap]నే[/dropcap]ను ఢిల్లీ ఆకాశవాణి కేంద్ర డైరక్టరుగా మూడేళ్ళు 8 అక్టోబరు 1997 నుండి 30 జూన్ 2000 వరకు పనిచేశాను. ఆ మూడేళ్ళు మూడు ప్రభుత్వాలు కేంద్రంలో మారాయి. 11వ లోక్‌సభకు 1996లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఎన్నికయ్యారు. 13 రోజులు ఆ ప్రభుత్వం నిలబడగలిగింది. 1996 జూన్ నుంచి 21 ఏప్రిల్ 1997 వరకు కర్నాటకు చెందిన హెచ్.డి. దేవెగౌడ 10 నెలలు ప్రధానిగా ఉన్నారు. నేను ఢిల్లీ వెళ్ళే సమయానికి ఐ.కె. గుజ్రాల్ (ఏప్రిల్ 1997 నుంచి 1998 మార్చి వరకు) ప్రధానిగా పనిచేశారు.
1998లో లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రసంగాలకు ఆకాశవాణి, దూరదర్శన్‌లు వివిధ గుర్తింపు పొందిన పార్టీలకు అవకాశం కలిగిస్తాయి. ఎన్నికల సంఘం వారు ఏ ఏ పార్టీకి ఎన్ని గంటలు/నిముషాలు ఆకాశవాణిలో, దూరదర్శన్‌లో కేటాయిస్తారో ఆ నిర్ణయం ప్రకారం ముందుగా ఆ రికార్డింగులు చేస్తాము.
రికార్డింగుల కసరత్తు:
1998లో 16, 22, 28 ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. ఆకాశవాణి భవన్‌లోని కాన్ఫరెన్సు హాల్‌లో జనవరిలో అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం అధికారి సమక్షంలో ప్రాథమిక సమావేశం నిర్వహించాము. నేను దూరదర్శన్ డైరక్టరు ఆ సమావేశానికి కావలసిన హంగులు సమకూర్చాము. ఒక్కొక్క పార్టీకి ఆకాశవాణిలో రెండు దఫాలుగా మాట్లాడే అవకాశం ఇస్తారు. వరుసగా 15 రోజులపాటు రాత్రి సమయంలో దేశవ్యాప్తంగా ఆ ప్రసంగాలు అన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారమవుతాయి. రికార్డింగులో పొరపాటు వచ్చినా, ప్రసారంలో అంతరాయము, తేడా వచ్చినా కొంప కొల్లేరు అవుతుంది.
ప్రసంగ సమయాల కేటాయింపు:
ఆయా పార్టీల సమక్షంలో లాటరీ డ్రా తీసి ఏ రోజు ఎన్ని గంటలకు ఏ పార్టీ ప్రసంగమో నిర్ణయిస్తాము. 15 నిముషాలు ఒక స్లాట్. అలా రోజుకు రెండు ఉంటాయి. ఉదాహరణకు జనవరి 16 రాత్రి 8 గంటలకు కాంగ్రెసుకు డ్రాలో వచ్చిందనుకుందాం. అది బోర్డు మీద ప్రకటిస్తాము. మెందిరెత్తా అనే ఎన్నికల సంఘం అబ్జర్వర్ సమక్షంలో హేమాహేమీలైన రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో దాదాపు మూడు గంటల పాటు ఈ డ్రా జరుగుతుంది. ఒక్కొక్క పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ఈ సమావేశానికి పంపుతుంది. కాంగ్రెస్ పక్షాన జైరామ్ రమేష్, సి.పి.ఐ. తరఫున డి. రాజా వగైరా వచ్చారు.
ఆయా పార్టీల వారు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ గుర్తు రాసుకొని వెళతారు. వారి పార్టీ సూచించిన సీనియర్ నాయకులను ఆ ప్రసంగాల రికార్డింగులకు పంపుతారు.
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో పనిచేసే జెమాజెట్టీలు పదిమందితో ఎలెక్షన్ రికార్డింగ్ టీమ్ ఏర్పాటు చేశాను. వారు ఆయా పార్టీల వారిని ముందుగా సంప్రదించి వారి అనుకూలమూ, మా అనుకూలం సరిపడేలా రికార్డింగులు చేశారు. వారు తమ ప్రసంగ పాఠాన్ని ఒకరోజు ముందుగా మాకు పంపాలి.
ఎలక్షన్ కోడ్:
ఎన్నికల నియమావళి ననుసరించి వ్యక్తిగత దూషణలు లేకుండా విమర్శించే హక్కు ఆయా పార్టీలకుంది. వారి ప్రసంగాన్ని సరిదిద్దడానికి/ఆమోదించడానికి ఆకాశవాణి ఒక కమిటీని ఎన్నికల సంఘం అనుమతితో నియమించింది. వారు రోజూ మా ఆఫీసుకు వచ్చి ఆయా ప్రసంగ పాఠాలు చదివి ఆమోదించేవారు. అభ్యంతరకర పదాలు, వాక్యాలు, ఆరోపణలు వుంటే తెలిపేవాడిని. వారు అంగీకరించేవారు. లేని పక్షంలో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళేవాడిని. హేమాహేమీలైన రాజకీయ నాయకులు ఆ సందర్భంలో మా స్టూడియోకి రికార్డింగులకు వచ్చారు.
ఐకె గుజ్రాల్, హెచ్.డి.దేవెగౌడ, యల్.కె. అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్, డి. రాజా తదితర నాయకులు హుందాగా రికార్డింగులు పూర్తిచేశారు. తొలి వరుసలో ప్రసంగాలు పూర్తి అయిన రెండో రౌండులో అన్ని పార్టీలకు మళ్ళీ అవకాశం వచ్చేది. అప్పుడు వారు పరస్పరం కత్తులు దూసుకుని మాట్లాడేవారు. ఎన్నికల నియమావళి కనుగుణంగా అవి కొనసాగాయి.
రెండు సెట్ల టేపులు:
ఆకాశవాణీలో ప్రతి అంశానికీ స్టాండ్ బై ఉంటుంది. అందువల్ల ఆ రికార్డింగులకు నా రూమ్‌లోని సేప్టీ లాకర్‌లో రెండు సెట్లు విడిగా దాచి ఉంచేవారం. రాత్రి 7.30 గంటలకు నేను ఆఫీసుకు వెళ్ళి ఆ రోజు ప్రసారమయ్యే రెండు టేపులను డ్యూటీ రూంకి పంపేవాడిని ఒక డిప్యూటీ డైరక్టరు బి.యమ్. గుప్త, ఒక అసిస్టెంట్ డైరక్టరు, ముగ్గురు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యవేక్షణలో ఆ ప్రసారాలు కొనసాగేవి.
విద్యుచ్ఛక్తిలో అంతరాయంగాని, మరే కారణం చేతనైనా ప్రసారం నిలిచిపోతే మళ్ళీ మొదటి నుండి అది ప్రసారం చెయ్యాలి. దేశంలోని అన్ని కేంద్రాలు రిలే చేయాలి. పార్టీల వారు ఇంగ్లీషులో గాని, హిందీలో గాని ప్రసంగించవచ్చు. రాత్రి 8.30కు ఆ ప్రసారాలు పూర్తి అయ్యేవి. అప్పటిదాక నేను నా ఆఫీసు రూమ్‌లో రేడియో వింటూ అప్రమత్తంగా వుండేవాడిని. మా సిబ్బంది రాత్రింబవవళ్ళు కష్టించి పనిచేశారు. ఎన్నికల తర్వాత వారికి ప్రశంసాపూర్వక ఉత్తరాలు అందించాను.
ఐకె గుజ్రాల్ ప్రభుత్వం పడిపోవడంతో 1998లో వాజ్‌పేయి మళ్ళీ ప్రధాని అయ్యారు. 1999 వరకు 13 నెలలు ఆయన ఆ పదవిలో వున్నారు. ఒక్క ఓటు తేదాతో వాజ్‌పేయి ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రాష్ట్రపతి లోక్‌సభకు ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ఫలితంగా 13వ లోక్‍సభకు ఎన్నికలు జరపాల్సి వచ్చింది.
1999 సెప్టెంబరు 5, 11, 18, 25 తేదీలు, అక్టోబరు 3న ఐదు అంచెలుగా లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రసారాల బాధ్యత మళ్ళీ నా పై పడింది. దాదాపు రెండు నెలలు ఈ కసరత్తు జరుగుతుంది. సంవత్సరంన్నర క్రితం జరిపిన అనుభవం వుంది కాబట్టి మా టీమ్‌వర్క్‌తో అవలీలగా గట్టెక్కాము. ఎన్నికల సంఘంతోను, రాజకీయ పార్టీలతోనూ, వివిధ రాష్ట్రాల ఆకాశవాణి కేంద్రాలతోను సమన్వయం అవసరం.
1999 అక్టోబరులో బిజెపి ప్రభుత్వం ఏర్పడి ఏ.బి. వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. ప్రమోద్ మహాజన్ కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన మహబూబ్‌నగర్ ప్రాంతంలో వుండేవారు. తర్వాత బొంబాయికి వెళ్ళి స్థిరపడ్డారు.
ఒక సాయంకాలం ఆకాశవాణిలో పనిచేసిన ప్రసిద్ధ కళాకారులను సన్మానించే కార్యక్రమం ఆకాశవాణి మేడమీద షామియానా వేసి ఏర్పాటు చేశాం. ఆ సభకు ప్రమోద్ మహాజన్‌ను ముఖ్య అతిథిగా పిలిచాము. ఆయనకు స్వాగతం పలకుతూ పోర్టికోలో కారు దిగగానే తెలుగులో వారిని పలకరించాను. ఆయన కూడా నన్ను తెలుగులో అభినందించారు. పక్కనే ఉన్న మా డైరక్టర్ జనరల్ – నాకు మంత్రిగారితో సన్నిహిత పరిచయం వుందనుకొన్నారు.
ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి:
జలవనరుల శాఖా మంత్రిణి ఉమాభారతిని స్టూడియో రికార్డింగుకు పిలిచాము. ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకు ఆమెకు స్వాగతం పలకడానికి నేను పోర్టికో దగ్గర మా సిబ్బందితో నించున్నాను. 4.15 నిముషాల వరకు ఆమె రాలేదు. ఇంతలో నా సెక్రటరీ సత్నాం కౌర్ పరుగు పరుగున వచ్చింది. మినిస్టర్ గారిని గేట్ వద్ద సెక్యూరిటీ అతను “కారు లోపలికెళ్ళడానికి మా డైరక్టర్ ఆఫీసునుంది పర్మిషన్ రాలేదు, మీ కారు నెంబరు నాకు పంపలేదు. మీరు దిగి నడుచుకుంటూ వెళ్ళండి” అన్నాడు.
మంత్రిగారి పి.ఎ. – “ఆమె ఎవరనుకొన్నావ్? మంత్రి ఉమాభారతి” అన్నాడు.
“నమస్కారం మేడమ్” అని రెండు చేతులెత్తి అభ్యంతరపెట్టాడు.
కారు వెనక్కి తిప్పమంది. సరాసరి వెళ్ళిపోయారు.
జరిగిన ఉదంతం తర్వాత విచారించి కనుక్కున్నాను. ఆకాశవాణికి పక్కనే ఆకాశవాణి భవన్ కార్యాలయం వుంది. ఆమె డ్రైవర్ తెలియక ఆమెను ఆ భవనం గేటు వద్దకు తీసుకెళ్ళాడు. అతని వద్దకి ఈ కారు నెంబరు వెళ్ళలేదు. ఢిల్లీ కేంద్ర గేట్ వద్ద సెక్యూరిటీకి పంపారు.
వెంటనే నేను నా రూమ్ లోకి వెళ్ళి ఉమాభారతి పి.ఎ.కి ఫోన్ చేసి పొరపాటుకు చింతిస్తున్నామని తెలియజేయమన్నాను. ఆయన ఫోన్ మంత్రిగారికిచ్చారు.
“సారీ! మేడమ్…” అని నేను భయపడుతూ చెప్పాను.
“యువర్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ రైట్. ఐ విల్ కమ్ ఇన్ ఫ్యూ మినిట్స్ థ్రూ యువర్ మెయిన్ గేట్” అన్నారు.
ఊపిరి పీల్చుకున్నాను. ఢిల్లీలో సెక్యూరిటీ పటిష్టంగా అమలు జరపవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెజావర్ మఠాధిపతి వద్ద ఆమె ఆశీర్వచనం తీసుకోడానికి వచ్చారు. అప్పుడు నన్ను ఆప్యాయంగా పలకరించారు. ఆమె కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి.
ఢిల్లీ కేంద్రానికి రికార్డింగుకు వచ్చిన ప్రముఖులలో సినీ గాయని ఆశాభోస్లే, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, యువనటి నందితా దాస్, దలేర్ మెహెందీ – ఇలా ఎందరో.
షెహనాయ్ మాంత్రికుడు:
బిస్మిల్లా ఖాన్ చాలా నిరాడంబర వ్యక్తి. ఆయనతో ఆయన మనుమలు కూడా వచ్చారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక అంశం గమనార్హం. అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం వారు ఆయనను హిందూస్థానీ సంగీతంలో ఆచార్యులుగా నియమిస్తూ ఆర్డరు పంపారు. వారి రిజిస్ట్రారు ఫోన్‌లో షెహనాయ్ మాంత్రికుడిని అభ్యర్థించాడు.
బిస్మిల్లా ఖాన్ ఇలా జవాబిచ్చారు. ‘నాకు ప్రతి రోజూ వారణాసిలోని గంగా తీరంలో షెహనాయి వాయిస్తూ ఆ పరమేశ్వరునికి ప్రణమిల్లడం అలవాటు. మీ యూనివర్సిటీ పక్కనే గంగానది ప్రవహింపజేయగలరా?’ అని సున్నితంగా తిరస్కరించారు. చిన్నతనంలో కష్టపడి తాను షెహనాయ్ వాద్యం అభ్యాసం చేయడం, వివాహాలలో కచేరి చేసే సంప్రదాయం నెలకొల్పడం వివరించారు. ఏ విధమైన హంగామా లేకుండా అందరితో కలసి మాట్లాడారు. అదొక వింత అనుభవం.
(సశేషం)