[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
బర్మింగ్‌హామ్‌లో సీతారామ కల్యాణం:
[dropcap]1[/dropcap]998 డిసెంబరులో ఓ ఉదయం నేను పండారా రోడ్డు (ఢిల్లీ) క్వార్టర్స్‌లో సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రీ జపంలో వున్నాను. ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. మా ఆవిడ (శోభ) తీసింది. “లండన్ నుండి ఫోన్. మీతో మాట్లాడాలంటున్నారు” అని పిలిచింది.
ఇదేదో ‘మిస్‌డ్ కాల్’ అయి ఉంటుందనుకుంటూనే ముగించి లేచాను.
“హలో! పద్మనాభరావు రావూ! నా పేరు డా. హరగోపాల్! నేను యు.కె.లో బర్మింగ్‌హామ్‌లో వుంటాను. మాది ఖమ్మం జిల్లా. మొన్న శ్రీరామ నవమికి మీరు భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర కల్యాణానికి చేసిన రేడియో వ్యాఖ్యానం విన్నాను. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో బర్మింగ్‌హామ్‌లో ఆంధ్రులందరం జరిపే సీతారామచంద్ర కల్యాణానికి మీరు వ్యాఖ్యాతగా రావాలి” అన్నారు.
“అంతా ఆ గాయత్రిమాత అనుగ్రహం” అన్నాను.
డా. హరగోపాల్ బర్మింగ్‌హామ్‌లో డాక్టరుగా 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వారి శ్రీమతి కూడా డాక్టర్. 1996 నుంచి ఏటా శ్రీరామనవమిని బర్మింగ్‌హామ్‌లో కొందరు ఆంధ్ర ప్రముఖులు నిర్వహిస్తున్నారు. 300 కుటుంబాల వారు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తొలిసారి ఏలూరుపాటి అనంతరామయ్య వ్యాఖ్యాం చేశారు. 1997లో వేదాల శ్రీనివాసాచార్యులు, 1998లో ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం చేశారు. 1999లో నాకు శ్రీరామచంద్రుడు హరగోపాల్ ద్వారా అవకాశమిచ్చాడు. గత 20 సంవత్సరాలుగా వారు కల్యాణాలు వైభవంగా జరుపుతున్నారు. 1997లో ద్విదశాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికను ప్రచురించారు. అందులో నేను – ‘సమాజానికి రామాయణ సందేశం’ అనే వ్యాసం వ్రాశాను.
ఏటా ఒక వ్యాఖ్యాతను, ఒక హరికథ/సంగీత కచేరీ, ఇద్దరు పురోహితులను ఆంధ్రదేశం నుండి బర్మింగ్‌హామ్ పిలుస్తారు. అదొక పండుగ వాతావరణంలో జరుపుతారు. దానికిగా శ్రీరామనవమి ఉత్సవ కమిటీ డా. ధనంజయరావు సారథ్యంలో ఏర్పాటు చేసుకున్నారు.
1999 జనవరి ఆఖరులో డా. హరగోపాల్ నాకు ఒక ఇన్విటేషన్ లెటర్ పంపారు. వీసా ప్రక్రియ మొదలుపెట్టాము.
హరగోపాల్ గారికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో పనిచేసే కె.ఎస్. శర్మ, ఐఎఎస్ సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్ నుండి చాలామంది ఐఎఎస్ అధికార్లు ఒక సంవత్సరం అడ్వాన్స్‌డ్ శిక్షణ/విద్య కోసం బర్మింగ్‌హామ్ వెళ్తారు. వారికి తొలి అతిథి హరగోపాల్. అలా చాలామంది సీనియర్ ఆఫీసర్లు ఆయనకు సన్నిహిత మిత్రులు.
నేను యు.కె. వెళ్ళడానికి మా డైరక్టర్ జనరల్‌ను అనుమతి కోరాను. ఫిబ్రవరి నెలాఖరుకు అనుమతి లభించింది. బ్రిటీషు కాన్సులేట్ జనరల్‌కు వీసా కోసం అప్లయి చేశాను. రానుపోనూ టికెట్లు ఎయిర్ ఇండియాలో బుక్ చేసి హరగోపాల్ పంపారు. ఆకాశవాణిలో పి.ఆర్.ఓ.గా పనులు చూసే మిత్రుడు ‘కంగ్’ నన్ను ఎయిర్ ఇండియా అధికారికి పరిచయం చేసి, నా ప్రయాణాన్ని అప్‌గ్రేడ్ చేయించి ఎగ్జిక్యూటివ్ క్లాసుకు పెంచేలా చేశాడు.
1999 ఏప్రిల్‌లో వారం రోజుల ముందుగా నేను బర్మింగ్‌హామ్ చేరుకున్నాను. హరగోపాల్ ఇంట్లో బస. ఆ మహాతల్లి అతిథి మర్యాదలలో అన్నపూర్ణ. హరగోపాల్ సంభాషణా చతురుడు. తెలుగు సాహిత్యమంటే ఇష్టం. జోక్‌లు బాగా వేస్తారు. ఆ వారం రోజులు ఆయనతో సత్కాలక్షేపం జరిగింది.
వ్యాఖ్యానం:
సీతారామ కల్యాణం ఉదయం 10 గంటలకు మొదలైంది. దాదాపు ఐదారు వందల మంది కూర్చునే హాలు. అందరూ సంప్రదాయ దుస్తులలో వచ్చారు. ఒక పండుగలా భావించారు. వేదికపై సీతారామచంద్రుల విగ్రహాలు పెట్టారు. ఒకవైపు కల్యాణం జరిపే దంపతులు, మరొకవైపు వ్యాఖ్యాతగా నేను.
ఒక్కసారి ఆ భద్రాచల రామచంద్రుని స్మరించుకున్నాను.
‘స్వామీ! నీ దయతో నేను ఇలా బ్రిటన్ రాగలిగాను. అంతా నీ కృప. సరస్వతీ కటాక్షంతో నాలుగు మాటలు చెబుతాను. సీతమ్మ తల్లి దయ నాపై ఉందిగా’ అని వ్యాఖ్యానం మొదలుపెట్టాను.
దాదాపు రెండుగంటలు కల్యాణం కొనసాగింది.
ప్రేక్షకులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తున్నారు.
పురోహితుల మంత్రాలు మధ్యమధ్యలో వినిపిస్తూ, వ్యాఖ్యానం కొనసాగించాను. కల్యాణాంతరం పలువురు – నా వాక్‌ప్రవాహాన్ని, వ్యాఖ్యాన ధోరణినీ, పాండిత ప్రకర్షను, పురాణ పరిచయాన్ని మెచ్చుకొన్నారు. రామచంద్రుని కృప.
మరో వారం రోజులు నేను యు.కె.లో వున్నాను.
బర్మింగ్‌హామ్‌లో పౌరోహిత్యం చేస్తున్న యువకుడు వెంకటరమణ నాకు సహాయకుడిగా అనేక ప్రాంతాలు చూశాను. హరగోపాల్ స్వయంగా నన్ను షేక్స్పియర్ జన్మస్థలమైన స్ట్రాట్‌ఫర్డ్ అపాన్ ఎవాన్ కార్లో తీసుకెళ్లారు.
అదొక అపూర్వ స్మృతి. ఆంగ్లేయులు తమ రచయిత పట్ల చూపిన అపార గౌరవానికి ఆ స్మారక భవనం ఒక నిదర్శనం. షేక్స్పియర్ తీపి గుర్తులన్నీ ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఆయన నాటకాలు, ఆయనపై వచ్చిన పరిశోధనా గ్రంథాలు భద్రపరిచారు. మన తెలుగువారు గురజాడ వంటి రచయితలకు అలా ఘనంగా స్మారక మందిరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుండు ననుకొన్నాను.
టికెట్ కొని స్మారకమందిరంలో ప్రవేశించాలి. ఒక గైడ్ మనకు అన్ని వివరాలు చెబుతాడు. జ్ఞాపకార్థం ఏదైనా మెమొంటోలు కొనవచ్చు. తీపి గురుతుల చిహ్నాలివి.
మరొకరోజు వెంకటరమణ నా వెంటరాగా మేమిద్దరం రైలులో లండన్ వెళ్ళాము. ఉదయం 10 గంటల లోపు లండన్ చేరాము. అక్కడ సిటీ చూసే టూరిస్టు బస్సు ఎక్కాము. బకింగ్‌హామ్ ప్యాలెస్ ముందు సైనికుల కవాతు చూశాము. అద్భుత భవన సముదాయాలు గల లండన్ నగరమంతా తిరిగాము.
మన దేశాన్ని చాలాకాలం పరిపాలించిన తెల్లదొరల విధానాలు, సంస్కృతీ సంప్రదాయాలు గమనించాము. మధ్యాహ్నం వేళకు బి.బి.సి. ఆఫీసు కెళ్లాము. అదొక పెద్ద భవనం.
బి.బి.సి. ప్రసారాలు:
బి.బి.సి.లో భారతీయ ప్రసారాల (హిందీ) విభాగం వుంది. దాని అధిపతి లోగడ ఢిల్లీ స్టేషన్‌కు వచ్చినప్పుడు నన్ను కలిశారు. ఆమెకు ఫోన్ చేస్తే కార్యాలయంలోకి వెళ్ళే అనుమతి లభించింది.
ఆకాశవాణి ప్రసారాలకు మాతృసంస్థ బి.బి.సి. వారి స్వయంప్రతిపత్తి మన ఆకాశవాణికి కూడా రావాలని దశాబ్దాలు పోరాటం చేశాము. చివరకు 1997లో ప్రసారభారతి ఏర్పడింది. ఆ తర్వాత నేను బి.బి.సి.ని దర్శించడం విశేషంగా బావించాను. అక్కడి పనితీరు, వారి శ్రద్ధాసక్తులు ఆశ్చర్యపరిచాయి.
లండన్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు:
2016లో కాబోలు లండన్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నామని ఆహ్వానం పంపారు నిర్వాహకులు. హైదరాబాదులోని బ్రిటీషు కాన్సులేట్‌కు వెళ్ళి వీసా అప్లికేషను పూర్తి చేసి ఇచ్చాను. వీసా ఫీజు ఎనిమిది వేలు కట్టాను. మరో పది రోజుల్లో ప్రయాణం. వీసా అర్జెంటుగా రావాలంటే మరో మూడువేలు కట్టమన్నారు. సాధారణంగా అయితే వారం రోజుల్లో వస్తుంది – అన్నారు. నేను మూడువేలు కట్టడం ఎందుకని లోభత్వం చూపాను.
ఎయిర్‌లైన్స్ మధు టిక్కెట్లు లండకు రానుపోను బుక్ చేశాడు. నేను బర్మింగ్‌హామ్‌లోని హరగోపాల్‌కు ఫోన్ చేశాను. ఆయన లండన్‌లోని తన మిత్రులు మాధవ్ తురిమెళ్ళకు చెప్పారు. వాళ్ల ఇంట్లో ఆతిథ్య సౌకర్యం నిర్ణయించారు.
నాట్యకారిణి రాగసుధ వింజమూరి ఫోన్ చేశారు. ఆమె లండన్‌లో ప్రఖ్యాత కళాకారిణి. వింజమూరి గోవిందరాజన్, ఐఎఎస్ బంధువర్గంలో వ్యక్తి. ఫేస్‌బుక్ పరిచితురాలు. కలుద్దామన్నాను.
నాతో పాటు వీసా కోసం ఆ రోజు దరఖాస్తు చేసినవారిలో కేతవరపు రాజ్యలక్ష్మి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ వున్నారు. అక్కిరాజు సుందర రామకృష్ణ అంతకుముందే అప్లయి చేశారు.
శని, ఆదివారాలు రావడం వల్ల – కాన్సులేట్ మదరాసు వారి ఆలస్యం వల్ల నా వీసా మీటింగ్ లండన్‌లో జరిగేరోజుకు వచ్చింది. నాకు టికెట్ క్యాన్సిలేషన్, వీసా ఖర్చులు తడిసిమోపెడయినాయి.
తర్వాత ఆలోచించాను. ఆ మూడువేలు కట్టివుంటే సంకల్పించిన ప్రయాణం జరిగి వుండేదని, మిగతా సాహితీ మిత్రులందరూ వెళ్ళి వచ్చారు. ఒక్కొక్కసారి అతి తెలివితేటలు అలా చేయిస్తాయి.
మొత్తానికి లండన్ పునర్దర్శన ప్రాప్తి నాకు కలగలేదు. వెళ్ళలేకపోయానన్న బాధ పెద్దగా లేదు. కారణం జర్మనీ వెళ్ళి వచ్చాను (1996), అమెరికాకు 2002లో, 2008లో రెండుసార్లు వెళ్ళాను. 2015లో దుబాయ్ వెళ్ళాను. అమెరికాలో దాదాపు 40 రోజులు సతీసమేతంగా వున్నాను. ఆటా సభలలో సత్కరించారు. జీవితంలో వెలితి లేదు. అతిశయంతో అనే మాట కాదిది.
(సశేషం)