ఆకాశవాణి పరిమళాలు-32

0
1

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

దూరదర్శన్‌లో కొలువు:

[dropcap]2[/dropcap]001 ఆగస్టులో డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా 12 మందికి ఒకేసారి ప్రమోషన్ ఇచ్చారు. కానీ పోస్టింగ్స్ విషయంలో ఒక నెల పట్టింది. రేడియోలో పని చేస్తున్నాను నేను. 1990లలో డైరక్టరేట్ వారు ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రోగ్రామ్ సర్వీస్ (ఐబిపిఎస్) ప్రారంభించినప్పుడు నాలుగు విభాగాలుగా చేశారు. రేడియో ప్రొడక్షన్, రేడియో ప్రోగ్రామ్స్, దూరదర్శన్ ప్రొడక్షన్స్, దూరదర్శన్ ప్రోగ్రామ్స్. క్లాస్ వన్ ఆఫీసర్లను ఈ నాలిగింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమన్నారు. ఒకసారి ఎంపిక చేసుకుంటే, అందులో సీనియారిటీని బట్టి ప్ర్రమోషన్లు వస్తాయి. రిటైరయ్యేంత వరకు అదే క్యాడర్‌లో వుండిపోవాలి.

గుంటూరు రఘురాం గారు ఆ రోజుల్లో మాకు సలహాలిచ్చేవారు. ఆయన సూచన మేరకు నేను రేడియో ప్రొడక్షన్ క్యాడర్ ఎంపిక చేసుకున్నాను. అన్ని ప్రమోషన్లు అందులోనే ఇచ్చారు. డి.డి.జి. గా కూడా రేడియోలోనే వుంచాలి. కాని నన్ను దూరదర్శన్‍కు కేటాయించారు. నా సర్వీసులో ఎన్నడూ దూరదర్శన్‌లో పనిచేయలేదు. రేడియో శివాలయమనీ, దూరదర్శన్ వైష్ణవాలయమనీ ఒక నానుడి ఉండేది.

2001 సెప్టెంబరులో నన్ను దూరదర్శన్‌కి పోస్ట్ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి. రేడియో నుండి నన్ను ఒక్కడినే అక్కడ వేశారు. మిగతావారు యథాస్థానం ప్రవేశయామి. నేను లిఖితపూర్వకంగా నా అసమ్మతి తెలియజేశాను. రేడియోలోనే వుంచమని కోరాను.

వ్యక్తిగతంగా సి.ఈ.వో. బైజల్‌ని కలిసి మొరపెట్టుకొన్నాను. ఆయన చిరునవ్వులు చిందిస్తూ “We need you for Kashmir channel” (కాశ్మీర్ ఛానల్ని కషీర్ ఛానల్ అంటారు) అన్నారు. అది భయంకరమైన విబాగం. నాకు బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించారు. కోట్లాది రూపాయలు ప్రొడ్యూసర్లకు పంచిపెట్టే బాధ్యత గల పోస్టు.

నాతో బాటు మండ్లోయిని కూడా దూరదర్శన్‌లో వేశారు. ఆయన దూరదర్శన్‌లో పనిచేసిన వ్యక్తి. “మీరిద్దరూ ఓ వారం తర్వాత వచ్చి చేరండి. దూరదర్శన్‌లో కూచొనే చోటు కూడా లేదు” అన్నారు బైజల్. మా ఇద్దరికీ ఒకే రూమ్ అలాట్ చేశారు. తర్వాత విడివిడిగా గదులు కేటాయించారు.

మంత్రితో ముఖాముఖీ:

నేను దూరదర్శన్‌లో చేరడానికి తటపటాయిస్తున్న రోజుల్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ ఆఫీసు నుండి ఆమె ప్రైవేట్ సెక్రటరీ అంశుమాన్, ఐఎఎస్ ఫోన్ చేశారు. “మేడమ్‌ని మీరు రేపు ఉదయం 11 గంటలకు ఆఫీసులో కలవండి” అని అదేశం.

‘దూరదర్శన్‌లో ఎందుకు చేరరని ప్రశ్నించేందుక’ని ఊహించాను. 11 గంటలకు మేడమ్ గదిలోకి బెరుకుగానే ప్రవేశించాను.

ఆమె తమ కుర్చీ లోంచి లేచి పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నారు. “కమాన్ రావ్ సాబ్!” అని మర్యాదగా సీటు చూపించారు.

ఆమె నన్ను ప్రశ్నించే లోపు నేనే మాట్లాడాను.

“I have a small submission madam. Earlier I am worried about my tension. Now, I am worried about my pension” అన్నాను.

ఆమె పగలబడి నవ్వారు. నాకు ముందున్న ఇద్దరు, ముగ్గురు దూరదర్శన్ డి.డి.జి.లకు పెన్షన్ రాలేదు. ఆ విషయం ఆమెకూ తెలుసు.

“మీరు భయపడనవసరం లేదు. కాశ్మీర్ ఛానల్‌కు నిజాయితీగల అధికారిని నియమించామని మీ సి.ఈ.ఓ. చెప్పారు. మీ కార్యకలాపాలలో నేను ఎన్నడూ జోక్యం చేసుకొని సిఫారసులు పంపను. ఒకవేళ నా మీద ఒత్తిడి వచ్చి ఏదైనా పేరు పంపినా బెంచ్ మార్క్ దాటితేనే శాంక్షన్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అంశుమాన్‌కి చెప్పండి” అని కాఫీ తెప్పించి ఇచ్చారు.

ఆమె మంత్రిగా వున్నంత కాలమూ ఏ విధమైన సిఫారసు రాలేదు. ఒకసారి ఒక సభకు ఆమెను ఎస్కార్ట్ చేసే డ్యూటీ నాకు పడింది. వారి బంగ్లాకు వెళ్ళి వారి కార్లోనే సభావేదిక వద్దకు వెళ్లాను. దారిలో ఆమె “కశ్మీర్ ఛానెల్ ప్రొడ్యూసర్లు హ్యాపీగా వున్నారు. పారదర్శకంగా సెలెక్షన్లు చేస్తున్నారని మీ నిజాయితీని నాతో చెప్పారు” అన్నారు.

“థాంక్యూ మేడమ్” అంటూ గత సంవత్సర కాలంగా నేను చేసిన ముఖ్యమైన పనుల జాబితా కాగితం ఆమె చేతిలో పెట్టాను.

“అంశుమాన్ చెప్పాడు. మీ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ పనితీరును వేలెత్తి చూపలేరు” అన్నారు. అంశుమాన్ ఆమె వ్యక్తిగత కారదర్శి.

అంశుమాన్ హర్యానా క్యాడర్‌ సీనియర్ ఐఎఎస్ అధికారి. ఆయన ప్రముఖ నాట్య కళాకారిణి స్వప్న సుందరిని వివాహామాడారు.

కొత్త డైరక్టర్ జనరల్:

బైజల్ వద్ద నుండి సి.ఇ.వో.గా కె.ఎస్.శర్మ 2002లో ఛార్జి తీసుకున్నారు. డైరక్టర్ జనరల్‌గా హర్యానా క్యాడర్‌ ఐఎఎస్ అధికారి వై.ఎస్. ఖురేషీని నియమించారు. ఆయన లోగడ సుష్మా స్వరాజ్ హర్యానా రాష్ట్రమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కార్యదర్శిగా పనిచేశారు. ఏ విధమైన ఆర్భాటం లేని వ్యక్తి. నా పనితీరును అనేక సమావేశాలలో మెచ్చుకున్నారు.

బైజల్ సి.ఇ.వో.గా ఉన్న రోజుల్లో నేను ఒక సాయంకాలం గోప్యంగా వారి చెవిలో ఓ వార్త వేశాను. ఆయన ‘నాకు తెలుసులే’ అన్నట్టు దరహాసం చేశారు. మర్నాడు సాయంకాలం 5.05 నిముషాలకు నేను ఆపీసు నుండి ఇంటికి బయల్దేరాను.

తెల్లవారి హిందూస్థాన్ టైమ్స్‌లో వార్త చూసి ఆశ్చర్యపోయాను. నా దగ్గర కాశ్మీర్ ఛానెల్‍లో పని చేస్తున్న డైరెక్టర్ టి.కె.దాసు ఒక పెద్ద హోటల్లో ఒక ప్రొడ్యూసర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సి.బి.ఐ. విచారణకు తీసుకెళ్ళారు. ఆఫీసుకు వచ్చి డిప్యూటీ డైరక్టర్ ఏ.కె. మొహంతీని, అసిస్టెంట్ డైరక్టర్ (కాశ్మీరీ ముస్లిం)ని విచారణకు తీసుకెళ్ళారు. మర్నాడే మొహంతీని వదిలేశారు. మిగిలిన ఇద్దరినీ సస్పెండ్ చేసి రెండేళ్ళు విచారణ చేశారు.

ఖురేషీ గారికి నా పనితనం బాగా నచ్చింది. బాగా పని చేసే వాడికే తల బొప్పి గడుతుంది. కాశ్మీర్ ఛానెల్‌తో బాటు డి.డి. భారతి, దానికి తోడు పార్లమెంట్ సెక్షన్ నాకప్పగించారు.

డి.డి.భారతి సాంస్కృతిక ఛానెల్. ఉత్తరదేశంలో కేబుల్ ఆపరేటర్లు కంపల్సరీగా చూపించాల్సిన ఛానల్. దాని రెండవ వార్షికోత్సవం ఫిక్కీ ఆడిటోరియంలో ఏర్పాటు చేశాము. మంత్రి విచ్చేశారు. పద్మా సుబ్రహ్మణ్యం నాట్య కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ విభాగంలో నా వద్ద ఒక డైరక్టరు, ఒక డిప్యూటీ డైరక్టరు, ఒక అసిస్టెంట్ డైరక్టరు పనిచేసేవారు.

కొత్త కార్యక్రామాల రూపకల్పన చేశాము. టి.వి. ఛానెళ్ళ సునామీలో అది మరుగున పడిపోయింది. కేవలం సంస్కృతి, నాట్యం, చిత్రలేఖనం అంటే ఎవరు చూస్తారు? అదే మాట అన్నాడు ఆహుతుల సమక్షంలొ – కార్యక్రమానికి విచ్చేసిన యం.ఎఫ్. హుస్సేన్. రెండేళ్ళు ఆ ఛానల్ బాధ్యతలు నేను చూశాను. ప్రారంబ సమయంలో నా సహచర మిత్రులు డి.ది. జి. శ్రీనివాసన్ పర్యవేక్షించారు. ఇప్పటికి ఆ ఛానల్ ప్రసారాలు వస్తూనే ఉన్నాయి.

కొత్త మంత్రి:

ఖురేషీ దూరదర్శన్ డైరక్టర్ జనరల్‌గా వున్న కాలంలో సుష్మా స్వరాజ్ అనంతరం రవిశంకర్ ప్రసాద్ కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అయ్యారు. రాగానే ఆయన డి.డి.జి. (దూరదర్శన్‌)లతో వ్యక్తిగతంగా ముఖాముఖీ జరిపారు.  ముందుగా వారి సెక్రటరీ ఫోన్ చేశారు. “మీరు రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రిగారిని కలవాలి. వచ్చేడప్పుడు దూరదర్శన్ కార్యకలాపాల పనితీరు మెరుగుపరచడానికి మీ సలహాలు సూచనలు ఒక కాగితం మీద వ్రాసి తిసుకురండి” అన్నారు.

నేను ఆ సాయంకాలం నా సెక్రటరీకి డిక్టేట్ చేసి నాలుగు పేజీల నోట్ తయారు చేశాను. మండీ హవుస్ (దూరదర్శన్ కార్యాలయం) ఆఫీసుకు నిత్యం ప్రొడ్యూసర్లు వస్తూ పైరవీలు కొనసాగిస్తున్నారు. వారు రాకుండా రిసెప్షన్‌లో అడ్డుపడేలా చూడమని వ్రాశాను. ఆయన ఆ  వాక్యాలు చదివి ‘ఎక్స్‌లెంట్’ అన్నారు.

మామూలుగా అధికారులెవరైనా మంత్రిగారికి కాగితం ఇవ్వాలంటే అది డైరక్టర్ జనరల్ ఆమోదంతో వెళ్లాలి. కానీ, కొత్త మంత్రి ఒక లెవెల్ దాటి రెండో లెవెల్ వాళ్ళతో మాట్లాడడం కొత్త సంప్రదాయం. నేను మంత్రికిచ్చిన పేపర్ల కాపీ ఒకటి తర్వాత ఖురేషీకిచ్చాను. ఆయన తన పర్సనల్ ఫైల్లో పెట్టుకున్నారు. నాలాగా మిగతా అధికారులు కూడా సలహాలిచ్చారు. అవి ఏ ఒక్కటీ అమలు కాలేదు.

ఖురేషీ తర్వాత యువజన శాఖ కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. ఆ తర్వాత ఎలెక్షన్ కమీషనర్ అయ్యారు. ఛీఫ్ ఎలెక్షన్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నిర్వాచన్ సదన్ (ఎన్నికల సంఘం కార్యాలయం)లో వారిని నేను 2006లో లాంఛనంగా కలిశాను. అప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్నాను.

ఆయన కులాసాగా కబుర్లు చెప్పారు. నా పనితీరును గుర్తుకు తెచ్చి “కషీర్ ఛానల్‌ను క్రమపద్ధతిలోకి తెచ్చారు” అని ప్రశంసించారు. “తిరుమలలో చాలా రద్దీగా ఉంటుందట! నేను ఈసారి వస్తే దర్శనం బాగా చేయిస్తారా?” అని చమత్కరించారు. సరదాగా మాట్లాడి ఆదరాభిమానాలు చూపారు. ఐ.ఎ.ఎస్. అధికారులు మెచ్చుకుంటే చిరకాలం గుర్తు పెట్టుకుంటారనడానికి అది ఒక ఉదాహరణ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here