Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-33

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

పార్లమెంటరీ కమిటీలు:

[dropcap]ఢి[/dropcap]ల్లీ దూరదర్శన్‌లో డిప్యూటీ డైరక్టర్ జనరల్‌గా పనిచేసిన సమయంలో (2001-2005) కాశ్మీర్ ఛానల్ వ్యవహారాలు మాత్రమే గాక, డిడి భారతి పర్యవేక్షణ, పార్లమెంటరీ వ్యవహారాలు కూడా నాకు అప్పగించారు. ముగ్గురు డి.జి.లు వచ్చారు ఆ నాలుగేళ్ల కాలంలో. ముందుగా  అనిల్ బైజల్. ఆపైన యస్.వై. ఖురేషీ. తర్వాత నవీన్ కుమార్.

ఖురేషీ నాపై ఎక్కువ విశ్వాసం ఉంచారు. పని భారం ఎక్కువైంది. అప్పటివరకు సీనియర్ డి.డి.జి. అయిన కున్నికృష్ణన్ పార్లమెంటరీ వ్యవహారాలు చూసేవారు. ఆయన చాలా కాలం చూశారు. భుజం మార్చుకోవాలనుకున్నారు. డిజి నాకు అప్పగించారు.

పార్లమెంటు జరుగుతున్న రోజుల్లో అహోరాత్రాలు ఒకటే హడావిడి. రాజ్యసభ, లోక్‌సభలలో దూరదర్శన్‌కి సంబంధించి పార్లమెంటు సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయాలి. ఒక్కొక్కసారి దేశవ్యాప్తంగా వున్న అన్ని కేంద్రాలకు మెసేజ్‌లు పంపి వివరాలు సేకరించాలి. బద్ధకస్తులైన కొందరు డైరక్టర్లు పంపకపోతే, ఫోన్ చేసి సేకరించాలి.

ఆ సమాధానాలు time bound. ముందుగా డి.జి. ఆమోదం పొంది, ప్రసారభారతి సిఇఓకి పంపాలి. అక్కడి నుండి సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు పంపాలి. చివరకు మంత్రిగారు పార్లెమెంటులో సమాధానం ఇస్తారు. ప్రతి వారం ఏదో ఒక సభలో స్టార్ క్వశ్చన్ వచ్చేది. మంత్రిని ప్రతిపక్షాలవారు చెండాడే సమయమది. ఒక్కో ప్రశ్నకు 40 పేజీల దాకా సమాచారం, ఉపప్రశ్నలకు సరిపడా తయారుచేయాలి.

ఆ ప్రశ్న సభలో వచ్చే రోజు ఉదయం మంత్రి యింటికెళ్ళి బ్రీఫింగ్ చెయ్యాలి. సీఇఓ, డీజీ, నేను వెళ్ళేవాళ్ళం. జైపాల్ రెడ్డిగారు ఆ సమయంలో మంత్రి. ప్రతిపక్షంలో తూటాలు పేల్చిన వ్యక్తి కాబట్టి ఆయన సమాధానాలు వేగంగా చెప్పగల దిట్ట.

ఆ సంవత్సరాలలో కలకత్తాలోని ఒక అడ్వర్టయిజింగ్ కంపెనీవారు దూరదర్శన్‌కు కోటి రూపాయలకు పైగా బాకీపడ్డారు. సుప్రీంకోర్ట్ కెళ్ళారు. ఏళ్ళ తరబడి పెండింగ్‌లో వున్న వ్యవహారమది. సోమనాథచటర్జీగారికి ఆ కంపెనీపై వివరీతమైన కోపం. స్టార్ క్వశ్చన్ వచ్చింది. జైపాల్ రెడ్దిగారికి బ్రీఫింగ్ ఇచ్చాం. ఆయన పద్మవ్యూహంలో అభిమన్యుడిలా విజృంభించి సమాధానాలు చెప్పారు.

రెండు మూడేళ్లు నేను ఉభయ సభలకు వెళ్ళి ఆఫీసర్ల గ్యాలరీలో కూచొని మంత్రిగారికి సమాచారం అందివ్వడానికి సిద్ధంగా వుండేవాడిని. ఒకరోజు నేదురుమిల్లి జనార్ధనరెడ్దిగారు లోక్‌సభ లాబీలో కన్పించారు.

“పద్మనాభరావ్! మాలాగా నువ్వు రెగ్యులర్‌గా వస్తున్నవే!” అన్నారు. రాజ్యసభ, లోక్‌సభలు రెండింటికి నాకు పాస్ ఇచ్చారు. తరచూ మన ఆంధ్ర ఎంపిలను కలిసేవాడిని. ఉభయసభల్లోనూ ఆంధ్రా ఎంపిలు 40 మంది దాక నాకు పరిచయం.

సలహా సంఘ సమావేశాలు:

పార్లమెంటులో ప్రతి మంత్రిత్వశాఖకు రెండేసి సంఘాలను స్పీకర్ నామినేట్ చేస్తారు. సమాచార మంత్రిత్వశాఖ సలహాసంఘం (Consultative Committee) ఒకటి. దానికి ఆ శాఖ మంత్రి అధ్యక్షులు. 15 మంది దాకా సభ్యులు. రెండు మూడు నెలలకొకసారి పార్లమెంటులోని సమావేశ మందిరాలలో సమావేశాలు జరిగేవి. ఆ రెండు నెలల్లో జరిగిన దూరదర్శన్ ప్రగతిని నివేదిక రూపంలో అందించేవాడిని. మంత్రిగారు అధ్యక్షోపన్యాసం చేసిన తర్వాత సభ్యులు వివిధాంశాలపై ప్రశ్నలు సంధించేవారు. గతంలో యిచ్చిన హామీల గురించి ప్రశ్నించేవారు.

పార్లమెంటు కిచ్చిన సమాధానాలలో ఏదైనా ఒక అంశం మూడు నెలలలో పూర్తి చేస్తామని మంత్రిగారు చెబితే ఖచ్చితంగా జరిగితీరాలి. లేకపోతే పార్లమెంటులో అస్యూరెన్స్ కమిటీ (వాగ్దానాల కమిటీ) కొరడా ఝుళిపిస్తుంది. అలాంటి సమావేశాలకు కూడా నేను వెళ్ళాను.

రెండో కమిటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ఇందులో సమాచార ప్రసార మంత్రిత్వశాఖతో బాటు కమ్యూనికేషన్ శాఖ కూడా కలిపి ఉండేది. సోమనాథచటర్జీ ఈ కమిటీకి అధ్యక్షులు. ఈ కమిటీవారు వివిధ కేంద్రాలలో సమావేశాలు జరిపేవారు. సోమనాథచటర్జీ చాలా నిక్కచిగా నిలదీసేవారు. మంత్రిత్వశాఖ నుంచి ఒకరు, డైరక్టర్ జనరల్ ప్రతినిధిగా నేను హాజరయ్యాం.

పోర్టుబ్లెయర్:

ఒకసారి స్టాండింగ్ కమిటీ సమావేశాలు పోర్ట్‌బ్లెయర్‌లో పెట్టారు. అక్కడ దూరదర్శన్ వారు ఏర్పాట్లు చూశారు. పార్లమెంటు సభ్యులకు రాచమర్యాదలు చేశారు. మీటింగ్ కాగానే వివిధ ప్రదేశాలకు బృందాన్ని తీసుకెళ్ళారు. స్టీమర్‌లో వెళ్తుంటే గ్లాసు కింద సముద్రజలాల్లో తిమింగలాలు, అద్భుత జలచరాలు కనిపించాయి. అండమాన్ జైలు ప్రసిద్ధం. అక్కడ చాలాసేపు గడిపాం.

అక్కడి ఆంధ్రా అసోసియేషన్ వారు తెలుగు ఎంపిలను ఆహ్వానించి సభ ఏర్పాటు చేశారు. నేను కూదా ఆ సభలో మాట్లాడాను. తెలుగువారి సాధకబాధకాలను వారు చెప్పుకున్నారు. ఒకరోజు సాయంకాలం సముద్ర స్నానానికి వెళ్లాం. తెలుగువారైన ఎం.పి. డా. మందా జగన్నాధం తదితరులు సముద్రస్నానాలు చేశారు. ఆ కమిటీలో ఉండవల్లి అరుణ్ కుమార్, పళ్లంరాజు భిన్న సమయాలలో ఉన్నారు.

పళ్ళంరాజు కొంతకాలం కమిటీ అధ్యక్షులు కూడా – చాలా మర్యాదగా మాట్లాడేవారు. వారి తండ్రిగారు ఇందిరాగాంధీ ప్రభుత్వంలొ సహాయమంత్రి. కమిటీ సమావేశం కోసం వివిధ ప్రాంతాలు సందర్శించే అవకాశం, పార్లమెంటు సబ్యుల రాజ లాంఛన భోజన సత్కారాలు మాకూ (అధికారులకూ) అందేవి.  కాదంటే సభలో చురుకైన, వాడి, వేడి బాణాలు ప్రయోగించేవారు. టెలిఫోను శాఖవారు కూడా మాకు అనుబంధం కాబట్టి వసతి సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు పెద్ద స్థాయిలో వుండేవి.

కాశ్మీరు సమావేశం:

ఒకసారి స్టాండింగ్ కమిటీ శ్రీనగర్‌లో సమావేశమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ పార్లమెంటు సభ్యుల గౌరవార్థం ఆ రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఎంతో సరదాగా జరిగిన సమావేశమది. దర్శనీయ స్థలాలు చూపించారు.

శ్రీనగర్‌లో అప్పుడు తెలుగువాడైన రాజేందర్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన సాహసికుడు. దుండగులు అసెంబ్లీపై బాంబు ప్రయోగం చేస్తే, శాసన సభ్యులను సాహసంగా హాలు నుంచి బయటకి తెచ్చిన అధికారి. ఆయన నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు. ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఆదరంగా మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ క్యాడర్‌కి చెందిన పోలీసు అధికారిగా మంచి పేరు తెచ్చుకొని ఇటీవలే రిటైరయ్యారు. కమిటీవారు రెండో రోజు శ్రీనగర్ నుండి జమ్మూ వెళ్ళారు. నేనూ వారిని అనుసరించాను.

సోమనాథ్ యాత్ర:

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకుగా అహ్మదాబాద్ వెళ్ళాము. సమావేశం గంభీరంగా జరిగింది. మరునాదు సోమనాథ్, ద్వారకలకు పార్లమెంటు సభ్యులను, మమ్ములను (అధికారులను) తీసుకెళ్ళారు. సోమనాథ్ ఆలయం అతి ప్రసిద్ధం, పురాతనం. దూరదర్శన్ డైరక్టర్ మంచి ఏర్పాట్లు చేశారు.

పడవలో ప్రయాణించి ద్వారకకు చేరాం. ద్వారకాధీశుని దర్శించాం. అక్కడ శంకరాచార్య స్వామిని కూడా కలిశాం. పశ్చిమ తీరంలోని ఈ విశిష్ట ఆలయ దర్శనం ఆ రూపంలో కుదిరింది. ఆ తర్వాత 2009లో నేను, నా శ్రీమతి ప్రత్యేకంగా అహ్మదాబాదు విమానంలో వెళ్ళి, అక్కడి నుండి సోమనాథ్, ద్వారక వెళ్ళాం.

ఈ మూడు ప్రధాన విశేషాలు పార్లమెంటుకు సంబంధించినవి చదివిన తర్వాత ఇదేదో జల్సాలా వుందే అనిపిస్తుంది. కాని పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నంత కాలం ఒకటే టెన్షను.

వారంలో కనీసం 6 రాజ్యసభ ప్రశ్నలు, 10 దాకా లోక్‌సభ ప్రశ్నలు వచ్చేవి. వాటికి విషయ సేకరణ తలనొప్పి పని. ప్రతి వారం మా సిఇఓ కె.ఎస్.శర్మ సమీక్షా సమావేశం జరిపి ఆ ప్రశ్నలకు సమాధానాలు చర్చించి ఆమోదించేవారు. ఒక సమావేశంలో ఆయన నా పైనున్న పని భారాన్ని చూసి – “డైరక్టరేట్ భారమంతా మీరే చూస్తున్నారే” అన్నారు.

నేను డి.డి.జి.గా పనిచేసిన నాలుగేళ్ళు ఆయన కనుసన్నల్లో పనిచేశాను. డి.జి.కీ ఆయనకు అభిప్రాయభేదాలు ఉన్నాయనేవారు గాని, నా విషయంలో ఉభయులు ఆదరం చూపారు.

నవీన్ కుమార్ గారు సున్నిత స్వభావులు. నన్ను దక్షిణాది రాష్ట్రాల పర్యవేక్షకుడిగా నియమించారు. నేను హైదరాబాద్, మదరాసు, త్రివేండ్రం, బెంగుళూరు కేంద్రాలు పర్యటించి ఒక నివేదిక సమర్పించాను. అప్పుడు కమీషన్డ్ ప్రోగ్రామ్‌లకు కేంద్రాలకు నిధులు కేటాయించి కాలపరిమితితో పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. నాలుగు కేంద్రాల నివేదికలను పరిశీలించిన నవీన్ కుమార్ – మిగతా ప్రాంతాలు – ఈస్ట్, వెస్ట్, నార్త్ – డి.డి.జి.లు కూడా ఈ విధంగా నివేదికలు నెలాఖరులోగా ఇదే పద్ధతిలో సమర్పించాలని ఆదేశించి, ‘వెల్ డన్’ అని నా పైలు పై వ్రాసి పంపారు. అదొక మధుర స్మృతి.

(సశేషం)

Exit mobile version