ఆకాశవాణి పరిమళాలు-34

0
2

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

అమెరికాకు తొలి పర్యటన -2002

2002లో దూరదర్శన్‌లో పనిచేస్తున్నాను. అమెరికాలో అన్నమాచార్య కీర్తనలకు సంస్థను ఏర్పాటు చేసి విశేష ప్రాచుర్యం చేస్తున్న శ్రీమతి డా. శారదాపూర్ణ శొంఠి అన్నమయ్య మీద ప్రసంగించమని నన్ను ఆహ్వానించారు. 2002 అక్టోబరులో 19, 20 తేదీలలో డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ వారు సభలు జరుపుతూ వంగూరి చిట్టెన్‌రాజు ఆహ్వానం పంపారు. రెండూ కలుపుకొని తొలిసారిగా అమెరికా బయలుదేరాను.

ప్రముఖ చిత్రకళాకారులు, మిత్రులు పద్మశ్రీ యస్.వి.రామారావు చికాగోలో వుంటారు. వారు నాకు సన్నిహిత మిత్రులు. వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సభకు నేను కూడా హాజరయ్యాను. ఆయన చికాగోలో నాకు సాదర స్వాగతం పలికి వారి యింట్లో ఆతిథ్యమిచ్చారు. అన్నమాచార్య సభ కూడా చికాగోలోనే.

శారద దంపతులు (డా. శ్రీరామ్) గత 20 సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నేను కడపలో పనిచేస్తున్న కాలంలో 1996లో ఈ దంపతులు కడప స్టూడియోకి వచ్చి రికార్డింగ్ చేశారు. కె.వి.రమణాచారి అప్పుడు కడప కలెక్టరు. తాళ్లపాకలో అన్నమయ్య జన్మస్థలాన్ని అభివృద్ధి చేయాలని శొంఠి దంపతుల సంకల్పం. 2007లో రమణాచారి, కరుణాకరరెడ్డి హయాంలో టి.టి.డి. ఆధ్వర్యంలో అన్నమయ్య విగ్రహావిష్కరణతో అది సాకారమైంది.

2002 అక్టోబరు 4న నేను అమెరికా ప్రయాణమయ్యాను. ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఏవో కారణాల వల్ల చికాగో వెళ్ళే విమానం రద్దయి మర్నాడు చికాగో చేరాను. చికాకు పడవలసివచ్చింది. రామారావు విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకెళ్ళారు. చికాగోలో వివేకానందుడు ఉపన్యసించిన మందిరానికి తీసుకెళ్ళారు. ఎంబసీలో విదేశాంగ శాఖాధికారితో ముఖాముఖి ఏర్పాటు చేశారు. చికాగోలో ఎన్నో ఏళ్ళుగా ప్రముఖ పాత్రికేయులు జె.లక్ష్మణరావు ‘ఇండియా ట్రిబ్యూన్’లో పని చేస్తున్నారు. ఆయన నన్ను మధ్యాహ్న విందులో కలిసే ఏర్పాటు చేశారు రామారావు.

సరదాగా ఓ గంట గడిపి నేను పర్యవేక్షిస్తున్న దూరదర్శన్ కాశ్మీర్ ఛానల్ వ్యవహారాలు ముచ్చటించుకున్నాం. మామూలు ఇంటర్వ్యూలో లాగా ఆయన నన్ను ప్రశ్నలు వేయడం, నేను సమాధానాలు చెప్పడం జరగలేదు. ఆయన చేయి తిరిగిన పాత్రికేయుడు కావడం వల్ల – 19 అక్టోబరున ఓ పెద్ద రిపోర్టు ప్రచురించారు. అమెరికాలో నా గురించి అలా రావడం అరుదైన సందర్బం.

అన్నమయ్య సభ:

శారదగారు చక్కని సభ ఏర్పాటు చేశారు. 200 మంది ఆహ్వానితులు వచ్చారు. ఇంగ్లీషులో నా ప్రసంగం కొనసాగించాను. ఆ సభలో మొదటి వరుసలో రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసి, అమెరికాలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‍లో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‍గా పనిచేస్తున్న వై.వి.రెడ్డి కూచుని వున్నారు. సభానంతరం ఆయన నన్ను అభినందించారు. 1966లో నేను తిరుపతి యస్.వి. యూనివర్సిటీలో నేను ఎం.ఏ. తెలుగు చదువుతున్నప్పుడు ఆయన చిత్తూరులో అసిస్టెంట్ కలెక్టరుగా వచ్చి మా విద్యార్థుల నుద్దేశించి ప్రసంగించి – ఐఎఎస్ పరీక్షలకు ఎలా తయారుకావాలో వివరించారు. ఆ స్ఫూర్తితో నేను 1969లో ఐఎఎస్ పరీక్షలు వ్రాసి క్షతగాత్రుడి నయ్యాను.

చికాగోలో మూడు రోజులు గడిపి డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సభలకు రామారావు నన్ను తీసుకెళ్ళారు. నేను వ్రాసి ప్రచురించిన బండెడు పుస్తకాలు తీసుకెళ్ళాను. ఒక కౌంటర్‌లో వాటిని పెట్టారు. ఆ సభల్లో నేను తెలుగు సాహిత్యంలో చమత్కారాలు అనే అంశంపై 20 నిమిషాలు మాట్లాడాను. సదస్యులు నా పద్య పఠన భావస్ఫూర్తితో వుందని ప్రశంసించారు.

ఆ సభలలో విశ్వనాథ అచ్యుతదేవరాయలు (విశ్వనాథ సుపుత్రులు) పాల్గొన్నారు. డెట్రాయిట్ తెలుగు సంఘం వారు నన్ను సన్మానించారు. అక్టోబరు 19, 20 తేదీలలో జరిగిన ఆ సభలలో అమెరికా నలుమూలల నుండి ఆంధ్రులు వచ్చారు. వంగూరి చిట్టెన్ రాజు గారు ఉత్సాహంగా సభలు నిర్వహించారు. కథ, కవిత, నవలలపై పలువురు ప్రముఖులు మాట్లాడారు. అమెరికా కథల పేర తర్వాత వంగురి ఫౌండేషన్ వారు గ్రంథాలు ప్రచురించారు.

చిట్టెన్‌రాజుతో ఏర్పడిన ఆ పరిచయం ఇప్పటికీ దినదిన ప్రవర్ధమానమవుతుంది. ఆయన హాస్య చతురుడు. సభా నిర్వహణలో ఆరితేరిన చేయి. ఆ సభలలో రచన ‘శాయి’ కూడా పాల్గొన్నారు.  ఇద్దరం హోటల్ గదిలో బస చేశాం. పలువురు అమెరికా తెలుగు రచయితలు పరిచయమయ్యారు. 1960వ దశకంలో అమెరికా వెళ్ళి స్థిరపడ్డవారు మొదలు, 2000 తర్వాత వెళ్ళినవారి వరకు అందరికీ తెలుగు భాష, తెలుగు సంస్కృతి పట్ల అపారమైన ప్రేమాభిమానాలు. వాళ్ళ పిల్లలకు పెళ్ళి సంబంధాలు తెలుగునేలపై కుదరాలని కోరుకుంటారు.

తెలుగు సాహిత్యం, ప్రత్యేకించి ప్రాచీన సాహిత్యం వినడానికీ, చదవడానికీ వారు ఇష్టపడతారు. నేను వ్రాసిన భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు – తెలుగు (పబ్లికేషన్స్ డివిజన్ వారి ప్రచురణ) పట్ల వారు ఆసక్తి కనబరిచారు. అందులొ నేను 15 ప్రాచీన గ్రంథాలు పరిచయం చేశాను. అవి – ఏనుగుల వీరాస్వామయ్య – కాశీయాత్రా చరిత్ర, నాటకాలలో ప్రతాపరుద్రీయం, సారంగధర, సత్యహరిశ్చంద్ర, పాండవోద్యోగ విజయాలు, కన్యాశుల్కం, వరవిక్రయం వంటి నాటకాలు, నవలలలో రాజశేఖర చరిత్ర, గణపతి, మాలపల్లి, బారిస్టరు పార్వతీశం, దైవమిచ్చిన భార్య, రుద్రమదేవి, అసమర్థుని జీవయాత్రలను వచనంలో సంక్షిప్తపరిచి 450 పేజీల గ్రంథం వ్రాశాను. దానిని ఇంగ్లీషులోకి నేనే అనువదించాను. హిందీ, ఒరియా భాషలలోకి అనువదించబడింది. అమెరికాలోని తెలుగువారు ఈ గ్రంథాల పేర్లు విన్నవారు, కొంత చదివిన వారు కాబట్టి ‘ఫాస్ట్ ఫుడ్’గా ఈ గ్రంథం ఉపయోగపడుతుందని మెచ్చుకున్నారు, 1997లో పబ్లికేషన్స్ డివిజన్ వారు ప్రచురించిన ఆ గ్రంథం కాపీలు ఎప్పుడో అయిపోయాయి. వారు పునర్ముద్రణ చేయరు. నన్ను చేసుకోనీరు.

డెట్రాయిట్‌లో మా కోడలు పద్మ వాళ్ళ అన్నయ్య చక్రధర్ ఫోర్డు కంపెనీలో ఇంజనీరు. అతడు నా అమెరికా ప్రయాణం గురించి తెలుసుకొని నేను కొలంబస్‌లో ఉండగా అక్కడికి వచ్చి నన్ను కారులో డెట్రాయిట్ తీసుకువెళ్ళాడు. ఫోర్డ్ కంపెనీని చూపించాడు. అక్కడ ‘వింటేజ్’ కార్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ల తయారీ కంపెనీ. పురాతనం. వాళ్ళ మ్యూజియం అద్భుతం. దాదాపు మూడు గంటల పాటు చూశాం. ఇంకా ఎంతో చూడలేకపోయాం.

డెట్రాయిట్ రావడానికి ముందు నేను చికాగో నుండి బస్సులో కొలంబస్ వెళ్లాను. అక్కడికి ఇక్కడికీ టైమ్ తేడా వుంది. గడియారంలో టైమ్ మార్పుకోవాలి. ఆ బస్సు సౌకర్యవంతంగా ఉంది. రెండు, మూడు స్టాప్‌ల కంటే ఎక్కువ లేదు. చివరి స్టాప్ వచ్చేసరికి నేనొక్కడినే ప్రయాణీకుడిని.

కొలంబస్‌లో మా అన్నయ్య కుమారుడు రామచంద్రరావు ఒక కంపెనీలో సైంటిస్టుగా పని చేస్తున్నాడు. అతడు నన్ను బస్టాండులో స్వాగతించి ఇంటికి తీసుకెళ్ళాడు. ఏడెనిమిది సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. వాళ్ళ రెండో అబ్బాయికి నా చేత అక్షరాభ్యాసం చేయించాడు. అక్షరాభ్యాసం చేయించేడప్పుడు నాకు భయం, వాడు ఎక్కడైనా పరీక్షల్లో తప్పితే, ‘అక్షరాభ్యాసం చేయించిన వాడెవడ’ని అనుకొంటారని. అయితే వాడు బాగా తెలివితేటలతో పరీక్షలు ప్యాసయి ఇంజనీరింగ్‌లో చేరాడు. సంతోషం.

కొలంబస్‌లో పది రోజులున్నాను. ఒకరోజు సాయంకాలం మా ‘రాము’ తెలుగువారితో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేశాడు. చికాగోలో కూడా రామారావు ఇలాంటిదే మిత్రగోష్ఠి ఏర్పరచి నా రచనల గురించి మాట్లాడమన్నారు. అమెరికాలోని ఆంధ్రుల సాహిత్య ప్రియత్వం నాకు నచ్చింది.

కొలంబస్ నుండి సమీపంలో వున్న జంపాల చౌదరి ఇంటికి కార్లో వెళ్ళాం. ఆ దంపతుల ఆతిథ్యం స్వీకరించాము. ‘తానా’ సభల నిర్వహణలోనూ, తెలుగు పత్రిక నిర్వహణలోనూ జంపాల చౌదరి అనుభవజ్ఞులు. తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నారు. కథా సాహిత్యమంటే యిష్టం. తెలుగు మూలాలు, తెలుగు సంస్కృతి నభిమానిస్తారు.

అక్కడి నుండి సమీపంలోని విమాన తయారీ కేంద్రానికి వెళ్ళాను. రైట్ సోదరులు నడిపిన తొలి విమానం కూడా అక్కడ మ్యూజియంలో ఉంది. కొన్ని వేల విమానాల మోడల్స్ ఉన్నాయి. అదొక విమాన లోకం. అక్కడి ప్రజలకు సంస్కృతీ పరిరక్షణ పట్ల వున్న ఆసక్తిని చూసి ఆశ్చర్యమేసింది.

తొలిసారిగా అమెరికా వెళ్ళి దాదాపు 20 రోజులు చికాగో, కొలంబస్, డెట్రాయిట్‌లు చూసుకొని అక్టోబరు 24న ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా లుఫ్తాన్సాలో తిరుగుప్రయాణమయ్యాను.

అన్ని చోట్లా దేవాలయాలు ఉన్నాయి. ఆంధ్రులందరూ శని, ఆదివారాల్లో ఆలయాలు దర్శిస్తారు. అక్కడ మూడు డాలర్లకు అన్నప్రసాదాలు యిస్తారు. తల్లిదండ్రులతో వచ్చిన యువతీయువకులు సాయంకాలం దాకా ఆ గుడులలో గడిపి రాత్రి ఇంటికి చేరుకుంటారు. అక్కడే తెలుగువారు కలిసి మాట్లాడుకుంటారు. ఆంధ్రదేశం నుండి వెళ్ళిన అర్చకులు అక్కడ పండుగ పబ్బాలలోను, వ్రతాలు, జపాలు, శాంతి హోమాలలోనూ పురోహితులుగా ఉంటారు. ఏ నగరానికి వెళ్ళినా అక్కడి కమ్యూనిటీ వారు వివిధ సంస్కృతుల వారు కలిసి మెలసి దీపావళి, సంక్రాంతి, ఉగాది ఉత్సవాలు జరుపుకుంటారు. ఇటీవల ‘రేడియో’ కూడా ప్రారంభించారు. కిరణ్ ప్రభ ఇలాంటి ప్రసారాలకు విరివిగా కృషి చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఆంధ్రులంతా కలిసి సంఘటితంగా నిర్వహించుకుంటారు. నాటికలు, సంగీత కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తారు. అష్టావధానాలు, భువన విజయాలు, సామవేదం వారి ప్రవచనాలు ఎక్కువగా జనాకర్షక కార్యక్రమాలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here