ఆకాశవాణి పరిమళాలు-35

0
2

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ఢిల్లీలో సాహిత్య సభలు:

[dropcap]నా[/dropcap] 30 సంవత్సరాల ప్రసార భారతి సర్వీసులో పది సంవత్సరాలు రెండు దఫాలుగా ఢిల్లీలో వున్నాను. తొలి దఫా 1987 ఏప్రిల్ నుండి 1990 ఆగస్టు వరకు, రెండోసారి 1997 అక్టోబరు నుండి 2005 ఫిబ్రవరి వరకు వివిధ హోదాలలో ఆకాశవాణి, దూరదర్శన్‍లలో పనిచేశాను. ఆ సంవత్సరాలలో పలు సాహిత్య సాంస్కృతిక సమావేశాలలో ఉపన్యాసాలివ్వడం, అధ్యక్షత వహించడం, ముఖ్య అతిథిగానో వున్నాను.

ప్రధానంగా చెప్పుకోవలసిన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తాను. ఉద్యోగంతో సంబంధం లేని సాహిత్య సభల గురించి ముచ్చటిస్తాను. 2000 సంవత్సరంలో నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. అప్పుడు తెలుగు భాష కన్వీనర్‌గా ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఉన్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీకి నేను రెండు నవలలు అనువాదం చేశాను. ఒకటి – ముల్క్‌రాజ్ ఆనంద్ నవల ‘మార్నింగ్ ఫేస్’. దానిని ‘ప్రభాత వదనం’ పేరుతో అనువదించాను. సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఆ అనువాదానికి 1993లో తెలుగు విశ్వవిద్యాలయ అనువాద పురస్కారం లభించింది.

రెండో నవల అమితావ్ ఘోష్ ఆంగ్ల నవల – ‘షాడో లైన్స్’. దానిని ‘ఛాయారేఖలు’ పేరుతో అనువదిస్తే, సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఆ అనువాదానికి 2000 సంవత్సరంలో అనువాద బహుమతిని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రదానం చేసింది. అప్పటి అకాడమీ అధ్యక్షులు గోపీచంద్ నారంగ్ అవార్డు అందించారు. మర్నాడు నా సాహిత్యం గురించి ఇతర పురస్కార గ్రహీతలతో బాటు నేనూ ప్రసంగించాను.

ప్రపంచ తెలుగు ఫెడరేషన్, బెంగుళూరు వారు 2001లోననుకుంటాను ఢిల్లీలో 5 రోజులు పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేశారు. అందులో సాహిత్య విభాగానికి నన్ను కన్వీనర్‌గా వుండమని కోరారు. ఆంధ్ర దేశం నుంది పలువురు సాహితీ ప్రముఖులను ఆహ్వానించాం. సభల నిర్వహణ భారం నాకప్పగించారు. రోజూ నాలుగు గంటల పాటు సదస్సులు నిర్వహించాం. సినీ నిర్మాత యు. విశ్వేశ్వరరావు W.T.F. పక్షాన ఆ సభలు గొప్పగా ఏర్పాటు చేశారు. దూరాభారాలైనా వారు ఏ.పి.భవన్‌లో జరిగే సభలకు వస్తూ రాత్రి 9 గంటలదాకా హాజరయ్యేవారు. ఆంధ్రా అసోసియేషన్ లోఢీ రోడ్‌లోనూ, అశోకా రోడ్ ఏ.పి.భవన్‌లోనూ సభలు తరచూ జరిగేవి.

రాష్ట్రావతరణ ఉత్సవాలు:

ఢిల్లీ ఏ.పి.భవన్‌లో నవంబరు 1 నుండి వారం రోజులు ఏటా రాష్ట్రావతరణోత్సవాలు ప్రభుత్వం తరఫున జరుపుతారు. 1979లో ప్రసాదరాయ కులపతి (ప్రస్తుత కుర్తాళం పీఠాధిపతి) భువన విజయం నిర్వహించారు. అందులో నేను పింగళి సూరనగా పాల్గొన్నాను. సభానంతరం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్.టి. రామారావు భువన విజయ కవులను సన్మానించారు.

1999లో జరిగిన రాష్ట్రావతరణ ఉత్సవాలలో నా ‘Indian Classics – Telugu’ అనే ఆంగ్ల గ్రంథాన్ని అప్పటి కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఆ గ్రంథాన్ని పబ్లికేషన్స్ డివిజన్ కోసం వ్రాశాను. 1997లో వారే నా చేత ‘భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు – తెలుగు’ అనే గ్రంథం వ్రాయించారు. 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన 15 ఉత్తమ తెలుగు గ్రంథాలను సంక్షిప్తపరచి 450 పుటల తెలుగు గ్రంథం వ్రాశాను. దానిని నేనే ఇంగ్లీషులోకి అనువదించాను. ఆ గ్రంథాన్ని జైట్లీ ఆవిష్కరించారు. ఆ గ్రంథం హిందీ, ఒరియా భాషలలోకి కూడా అనువదించబడింది.

2000 నవంబరులో ఢిల్లీలో జరిగిన రాష్ట్రావతరణ ఉత్సవాలలో నా మరో గ్రంథం – ‘ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు’ ఏ.పి.భవన్ ప్రాంగణంలో అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.యం.సి. బాలయోగి ఆవిష్కరించారు. 1950 నుండి 2000 వరకు ఢిల్లీలో రాజకీయ సాంస్కృతిక కళారంగానికి చెందిన ఎందరో ప్రముఖులు పనిచేశారు. రెండేళ్ళు శ్రమపడి వారి జీవన రేఖలు సేకరించాను. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధమైన అంతర్జాతీయ తెలుగు సంస్థ పక్షాన ప్రచురించాను.

ఆంధ్రా అసోసియేషన్:

డా. వి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆంధ్రా అసోసియేషన్ భవనంలో ఏటా ఒకటి, రెండు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన సాహితీ ప్రముఖుల సత్కార సభలు ఏర్పాటు చేసేవారు. ఆ సభలలో నేను ముఖ్య అతిథిగానో, వక్తగానో పాల్గొనేవాడిని. ఒక సంవత్సరం సహస్రావధాని గరికపాటి నరసింహారావు సన్మాన సభకు అధ్యక్షత వహించాను. అంతకుముందు రోజు ఆంధ్ర సాహిత్యంపై ఒక గంట మాట్లాడాను.

ఇందిరా జగదాచారి గారు ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేసేవారు. విష్ణు సహస్రనామ సంఘం పక్షాన రామారావు ఏటా సీతారమ కళ్యాణం శ్రీరామనవమికి జరిపేవారు. లోఢీ రోడ్‌లో హోం సెక్రటరీ కె. పద్మనాభయ్యగారి ఇంట్లో రామనవమి ఉత్సవాలు ఢిల్లీ తెలుగు సంఘ ప్రధాన కార్యదర్శి, మిత్రులు యస్.వి.యల్ నాగరాజు ఏటా జరిపేవారు. అందులో ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాను.

ఢిల్లీ తెలుగు అకాడమీ:

గత మూడు దశాబ్దులుగా ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రతిష్ఠాత్మకంగా ఉగాది పురస్కారాలు అందిస్తోంది. రామనవమి, కార్తీక పూర్ణిమ, ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుతోంది. దానికి వెన్నెముక యస్.వి.యల్ నాగరాజు. ఆ సంస్థ కార్యవర్గంలో చాలామంది సీనియర్ సెక్రటరీలు సలహాదారులు. వారి సభలలో నాకూ భాగస్వామ్యం ఉండేది. 2000 సంవత్సరం నాకు ఉగాది పురస్కారం అందించారు. కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. నాగరాజు కార్యదక్షుడు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డాడు.

ఉగాది సంబరాలు:

ఏటా ఉగాది ఉత్సవాలను ముప్పవరపు వెంకయ్యనాయుడు తమ యింట్లో జరిపేవారు. ఆయన అప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. మాడుగుల నాగఫణిశర్మచే పంచాంగ శ్రవణం చేయిస్తారు. ఢిల్లీ తెలుగు ప్రముఖులు వందమందికి పైగా హాజరయి ఉగాది పచ్చడి, ఫలహారాలు స్వీకరించి వెళ్ళేవారు. ఒకటి రెండు సభలలో నేను మాట్లాడాను. అటల్ బిహారీ వాజ్‌పేయి, యల్.కె.అద్వాని ప్రభృతులు, కేంద్రమంత్రులు వచ్చారు. వెంకయ్యనాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఆ ఉగాది సంబరాలు కొనసాగించారు.

తెలుగు సాహితి:

50 ఏళ్ళకి పైబడి తెలుగుసాహితిని ఢిల్లీలో ఆంగ్లోపన్యాసకులు ఆర్. ఎస్. గణేశ్వరరావు నడిపారు. వారు ఢిల్లీకి వచ్చిన సాహితీవేత్తలకు వేదిక కల్పిస్తారు. సాహిత్య అకాడమీ పురస్కారం పొందడానికి వచ్చిన ప్రముఖులతో ముందు రోజు సభ ఏర్పాటు చేసి సత్కరిస్తారు. గణేశ్వరరావు మాటలలో చెప్పాలంటే ఆ సంస్థకు అప్రకటిత అధ్యక్షుడిని నేను. ఆయన కార్యదర్శి. ఏల్చూరి మురళీధరరావు, ప్రభల జానకి ప్రభృతులు క్రియాశీల సభ్యులు. ఆచార్య యస్.వి. జోగారావు తదితరులు అకాడమీ అవార్డు తీసుకోవడానికి వచ్చినప్పుడు సభలు జరిపారు. గణేశ్వరరావు ఢిల్లీ నుండి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు.

ఆంధ్రా ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్ర మహిళా సభ, ఆంధ్రా అసోసియేషన్ – ఇలా మరికొన్ని సంస్థలు కూడా నన్ను ఆదరంగా సభలకు పిలిచేవారు. నేనూ వెళ్ళి మాట్లాడేవాడిని. బాలకోటేశ్వరరావు – ఏ.పి.భవన్‌లో ఎకౌంట్స్ ఆఫీసర్. ఒక సంస్థ ప్రారంభించి నన్ను గౌరవాధ్యక్షుడిగా ప్రకటించాడు.

ఢిల్లీలో వున్న పది సంవత్సరాలు సాహితీ సాంస్కృతిక కళారంగ ప్రముఖులు ఎవరు వచ్చినా ఆ సభలో ప్రసంగించే అవకాశం నాకు ఇచ్చారు. నన్నొక పెద్దగా ఆదరించారు.

అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం:

ఢిల్లీలో నేనుండగా 2000 ఆగస్టు 5న మా నాన్నగారు లక్ష్మీకాంతరావు పరమపదించారు. 2001లో ఆయన స్మారకార్థం నేను అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం ఏర్పాటు చేశాను. వారి జీవన రేఖలను వివరిస్తు ‘కాంతయ్య’ అనే స్మారక సంచిక వేశాను. ఏటా ఒక సాహితీవేత్తను సన్మానించాలని సంకల్పించాను. ఆ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర గామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ యం. వెంకయ్యనాయుడిని ఆహ్వానించాను. వారి ఆఫీసు మీటింగ్ హాలులోనే డా. ఇలపావులూరి పాండురంగారావు గారికి తొలి పురస్కారం మంత్రి చేతుల మీదుగా ఇప్పించాను. మా తండ్రి గారి పేర పురస్కారం ఏర్పాటు చేసినందుకు వెంకయ్యనాయుడుగారు నన్ను సభలో అభినందించి ‘కాంతయ్య’ సంచికను ఆవిష్కరించారు.

2002లో సత్కార సభను లోఢీ రోడ్ లోని ఆంధ్రా అసోసియేషన్ హాల్‌లో ఏర్పాటు చేశాను. సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సి.హెచ్. విద్యాసాగరరావు, విశిష్ట అతిథిగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి విచ్చేశారు. డా. రావురి భరద్వాజకు సత్కారం చేశాము.

అది మొదలు ఏటా ఈ పురస్కారం అందిస్తునే వున్నాను.

గత 15 సంవత్సరాలుగా ఈ అవార్డు అందుకున్న ప్రముఖులు:

డా. యస్.పి. బాలసుబ్రమణ్యం (2004), ఆచార్య హెచ్. యస్. బ్రహ్మానంద (2005), పొన్నాల రామసుబ్బారెడ్డి (2006), ముదివర్తి కొండమాచార్యులు (2007), డా. ధారా రామనాథశాస్త్రి (2008), ప్రొఫెసర్ సి.ఆర్. విశ్వేశ్వరరావు (2009), డా. కె.వి. రమణాచారి (2012), మంగళగిరి ఆదిత్యప్రసాద్ (2013), కె. శ్రీనివాసరావు (2014), ప్రభల జానకి (2015), డి.వి. మోహనకృష్ణ (2016), వై.యస్.ఆర్. శర్మ (2017), డా. అక్కిరాజు రమాపతిరావు (2018).

ఈ విధంగా సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలు గత నాలుగు దశాబ్దులలో కొనసాగించడం భగవత్ కృప.

 (సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here