ఆకాశవాణి పరిమళాలు-36

0
2

[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రసారమాధ్యమ గ్రంథాలు:

[dropcap]నే[/dropcap]ను ఆకాశవాణి కడపలో 1975 ఆగస్టులో చేరడానికి ముందు ఐదారు గ్రంథాలు ప్రచురించాను. అందులో ‘వి.వి.గిరి జీవితచరిత్ర’ (నా తొలి రచన), ‘మారని నాణెం’ (తొలి నవల) ప్రధానం. రేడియోలో చేరిన తర్వాత పల్లెసీమలు కార్యక్రమంలో వారం వారం ‘రాయలసీమ రత్నాలు’ అనే పేర ప్రముఖ రాజకీయ సాంస్కృతిక రంగాల వ్యక్తులను పరిచయం చేశాను. అది రెండు భాగాలుగా ప్రచురించాను.

2018 చివరి నాటికి నావి వంద పుస్తకాలు పూర్తయ్యాయి. అందులో ప్రక్రియా వైవిధ్యం రీత్యా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశాను. పదికి పైగా జీవిత చరిత్రలు వ్రాశాను. నా తొలి బోణీ వి.వి.గిరి జీవిత చరిత్ర. ఆ తర్వాత మన ప్రకాశం, ఆంధ్రకేసరి, బెజవాడ గోపాలరెడ్డి, శంకరంబాడి సుందరాచార్య (ఇంగ్లీషు, తెలుగు), జమలాపురం కేశవరావు, ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, కాంతయ్య, యంత్రీంద్రులు – పుష్పగిరి శంకరాచార్య ప్రధానాలు. ఈ పది పుస్తకాల మీద శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో డా. కట్టమంఛి చంద్రశేఖర్ పరిశోధన చేసి పి.హెచ్‌డి. సంపాదించాడు. ఆ గ్రంథం ప్రచురితమైంది. తలపుల తలపులు, ఋషి పరంపర ఈ కోవలోవే.

నా తొలి నవల ‘మారని నాణెం’ 1973లో ప్రచురించాను. కందుకూరులో ఉండగా వారపత్రికల ఉగాది నవలల పోటీకి వరుసగా మూడు నవలలు వ్రాశాను. గ్రామీణ వాతావరణంలోని కుల రాజకీయాలు, కుటిల ప్రవర్తనలు ఇతివృత్తంగా ‘సంజె వెలుగు’ నవల వ్రాశాను.  యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు కుల రాజకీయాలు నడపడం ఆధారంగా ‘వక్రించిన సరళరేఖ’ నవలగా తయారైంది. అన్ని ఉద్యోగాలలో ‘కలెక్టరు బంట్రోతు’ ఒక విశేష పాత్రధారి. అతడి దర్జా, దర్పం, అధికారుల వద్ద ఆగ్రహానుగ్రహాలు – ‘స్వగతాలు’ అనే మరో నవలకు ప్రాణం పోశాయి. ఈ నాలుగు నవలలు నాకు పేరు తెచ్చాయి. సంజె వెలుగు, వక్రించిన సరళరేఖ నవలలు విజయవాడలోని సిద్ధార్థ పబ్లిషర్స్ 1988లో ముద్రించారు. స్వగతాలు – నవలిక రూపంలో ఆంధ్రభూమి మాసపత్రికకు అనుబంధంగా 1992 ఆగస్టులో సి. కనకాంబరరాజు ప్రచురించారు. మొదటి మూడు నవలల మీద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆచార్య కొలకలూరి ఇనాక్ పర్యవేక్షణలో టి. శ్యాంప్రసాద్ యం.ఫిల్. సంపాదించాడు. పుస్తకం ముద్రించాడు.

ప్రసార ప్రముఖులు:

ప్రసార మాధ్యమానికి సంబంధించి పది దాకా పుస్తకాలు వ్రాశాను. ‘ఆకాశవాణి ప్రసారాలు-తీరుతెన్నులు’ అనే పుస్తకాన్ని 1993లో హైదరాబాద్ లోని ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ప్రచురించింది. విజయవాడలో పనిచేస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. ఆకాశవాణిలో ఎందరో ప్రముఖులు పనిచేశారు గదా- వారి జీవన రేఖలు యువతరానికి తెలియజేయాలనుకున్నాను. దాదాపు వందమంది సంగ్రహ జీవన రేఖలను ‘ప్రసార ప్రముఖులు’ అనే పేర వ్రాశాను. వ్రాయడం ఒక ఎత్తు, ముద్రించడం ఒక ఎత్తు. దానిని మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు. ఒక సభలో మాట్లాడుతూ ప్రచురణలో నేను పడ్డ ఇబ్బందులు చెప్పాను. వెంటనే ఆ సభలో వున్న వణుకూరుకి చెందిన దీవి కోదండరామాచార్యులు ‘నేను ప్రచురిస్తానని’ సభాముఖంగా ప్రకటించారు. 1996లో ఆ గ్రంథం వెలువడింది.

ఐదేళ్ళ తర్వాత ఢిల్లీ లోని పబ్లికేషన్స్ డివిజన్ వారి కోరికపై మార్పులు, చేర్పులు, కూర్పులతో ‘ప్రసార రథసారథులు’ రాశాను. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారికి ఎం.ఎ. పాఠ్యగ్రంథంలో – ‘రేడియోకి ఎలా వ్రాయాలి’ అనే అంశాలు వ్రాశాను.

కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారి స్కాలర్‌షిప్ మీద రేడియో నాటకాలపై పరిశోధనాత్మక గ్రంథం 2007లో ప్రచురించాను. జర్నలిజం విద్యార్థులకు అది కరదీపిక. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2012లో ‘ప్రసార మాధ్యమాలు – ఆకాశవాణి’ అనే మోనోగ్రాఫ్ వెలువరించాను.

‘అలనాటి ఆకాశవాణి’ పేరుతో ఆకాశవాణి పుట్టుపూర్వోత్తరాలు, వివిధ విభాగాల సమగ్ర సమాచారాన్ని నది మాసపత్రికలో దాదాపు రెండేళ్ళు ప్రచురిమ్చాను. వాటిని మెట్రో రైల్ యం.డి. యన్.వి.ఎస్. రెడ్డి సౌజన్యంతో గ్రంథ రూపంలో తెచ్చాను. గత సంవత్సరంగా ‘సంచిక’ వెబ్ మ్యాగజైన్‌లో మిత్రులు కస్తూరి మురళీకృష్ణ ‘ఆకాశవాణి పరిమళాలు’ ప్రచురిస్తున్నారు. పాఠకుల ఆదరాభిమానాలు కూడా సంపాదించింది.

టి.వి. ఛానళ్ళ సునామీలో ‘రేడియో ద్వీపకల్పం’ కొట్టుకుపోయే స్థితి వచ్చింది. అయినా మా తరానికి చెందిన మేమందరం  రేడియో – ప్రసారమాధ్యమాలలో రాజ్యమేలిన 70, 80 దశకాలలో పనిచేశాం. రజని, గొల్లపూడి మారుతీరావు, శంకరమంచి సత్యం, శ్రీ గోపాల్, ప్రపంచం సీతారం, ఉషశ్రీ, వోలేటి వెంకటేశ్వర్లు, రావూరి భరద్వాజ, మంచాళ జగన్నాథరావు, ఇలా మరెందరో రేడియో పతాకాన్ని ఎగురవేశారు.

పాతతరం యోధులు సరేసరి.

నా అనువాదాలు:

సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్టులు కొందరుంటారు. వారికి జీవితమంతా డబ్బింగ్ ఆర్టిస్టుగానే గుర్తింపు వస్తుంది. అలాగే తెలుగులో బొంతలపాటి శివరామకృష్ణ శరత్ సాహిత్యాన్ని అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాలు కూడా ఏటా ఉత్తమ అనువాద గ్రంథాలను బహుమతులిస్తున్నారు. ఆ రెండు సంస్థల బహుమతులు నాకు వచ్చాయి. ‘ప్రభాత వదనం’, ‘ఛాయారేఖలు’ గాక మరో పది గ్రంథాలు అనువదించాను. వివిధ సంస్థలకు అనువదించి పెట్టాను. ఆ అనువాద గ్రంథాలపై కట్టమంచి చంద్రశేఖర్ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో యం.ఫిల్. సాధించాడు.

నేషనల్ బుక్ ట్రస్ట్ వారికి, తదితరులకు నేను అనువదించిన గ్రంథాలు:

క్రమ సంఖ్య ఆంగ్ల గ్రంథం మూలం తెలుగు పేరు ప్రచురణా కాలం
1. Water రామా నీరు 1994
2. Women in Valmiki ఇలపావులూరి పాండురంగారావు రామాయణంలో స్త్రీ పాత్రలు 1981
3. Trees చెట్లు 1999 (ఎన్.బి.టి)
4. Valmiki ఇలపావులూరి పాండురంగారావు వాల్మీకి 2000 (సాహిత్య అకాడమీ)
5. Low Cost No Cost Books బోధనోపకరణాలు 2000 (ఎన్.బి.టి)
6. Honey and Milk మధుక్షీరాలు 2002 (ఎన్.బి.టి)
7. Mother Teresa మెహతా మదర్ తెరిసా 2007 (పబ్లికేషన్స్ డివిజన్)

ఇంగ్లీషు నుండి తెలుగులోకి గాక, తెలుగు నుండి ఇంగ్లీషులోకి కూడా చేశాను.

నేను తెలుగులో వ్రాసిన ‘భారతీయ సుప్రసిద్ధ గ్రంథాలు – తెలుగు’ అనే గ్రంథాన్ని – ఆంగ్లంలో Indian Classics – Telugu గా పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించింది. ఆంగ్లంలో స్వయంగా Literary Heritage 1984లో ప్రచురించాను. విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలలో ఐదు ప్రకరణలు ఇంగ్లీషులోకి అనువదించాను. Thousand Hoods పేర దానిని ప్రచురించారు.

అవధానిగా జైతయాత్రలు సాగించిన అవధాన పద్యాలను ‘అవధాన పద్మ సరోవరం’ పేరుతోనూ, విడిగా వివిధ పత్రికలలో వ్రాసిన పద్యాలను ‘పద్మసరోవరం’ పేర ప్రచురించాను. వచన కవితలను ‘భయం వేస్తోందా భారతీ’ పేర 1987లో వేశాను. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్ర మహా భారత విరాట పర్వంలోని కొన్ని పద్యాలకు, ఆంధ్ర మహా భాగవతంలోని చతుర్థ స్కందానికి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రచురించిన వర్ణనీ రత్నాకరంలో కొన్ని పద్యాలకు టీకా తాత్పర్యం వ్రాశాను. ‘పండుగలు – సంపద్రయాలు’, ‘మన పండుగలు’, ‘పండుగలు – పరమార్థం’ అనే మూడు గ్రంథాలు ఆరాధన మాసపత్రికలో వచ్చిన వ్యాసాల సంపుటులు.

రాఘవ పాండవీయ వ్యాఖ్యానం:

నేను చేసిన రచనలన్నింటిలోనూ నేను ఎక్కువ శ్రమపడి రాసిన గ్రంథం – పింగళి సూరన రాఘవ పాండవీయ టీకా తాత్పర్య సహిత వ్యాఖ్యానం. వావిళ్ళ రామస్వామి శాస్త్రుల ప్రచురణ సంస్థ కోరిక మేరకు ద్వ్యర్థి కావ్యమైన రాఘవ పాండవీయ వ్యాఖ్యానం వ్రాయడానికి రెండేళ్ళు పట్టింది. వ్రాసి మూడేళ్ళు అయినా దాన్ని వావిళ్ళ వారు ప్రచురించలేదు.

పరిశోధనాత్మక గ్రంథాలు:

నేను పి.హెచ్‌డి. పరిశోధన కందుకూరి రుద్రకవి రచనలపై చేశాను. అది 1977లో గ్రంథ రూపంలోకి వచ్చింది. సాహిత్య అకాడమీ (హైదరాబాదు) పోటీకి వ్రాసిన ‘తెలుగు కావ్యాలలో ప్రకృతి వర్ణన – ప్రకృతి కాంత’ పేర 1977లో వేశాను. పురాణాలలో దంపతుల జీవితాల ఆధారంగా ‘దాంపత్య జీవన సౌరభం’ వ్రాశాను. గొల్లపూడి మారుతీరావు సంపాదకత్వం వహించిన సురభి (టైమ్స్ ఆఫ్ ఇండియా)లో సీరియల్‌గా వచ్చింది.

రామాయణ గ్రంథాలు:

వాల్మీకి రామాయాణాన్ని సంగ్రహంగా ‘సంగ్రహ వాల్మీకి రామాయణం’ పేర ప్రచురించాను. రామాయణంలోని స్త్రీ పాత్రల అంతరంగాన్ని ‘అంతరంగ తరంగం’ (సీతాయనం) 2015లో ప్రచురించాను. అది సాహితీవేత్తల మన్నలందుకొంది.

మూడు కథా సంపుటులు:

నేను వేలు పెట్టని ప్రక్రియ లేదనడానికి నిదర్శనంగా వివిధ వార మాస పత్రికలలో వంద కథలు వ్రాశాను. స్వాతి వార పత్రికలో ‘వట్టి రాకపోక లొనర్చె వానిసతియు’ కథకు పదివేల బహుమతి లభించింది. వేదగిరి రాంబాబు సౌజన్యంతో ‘కథా – కమామీషూ’ కథల సంపుటి వచ్చింది. ‘గోరింట పూచింది’, ‘కథా మందారం’ మరో రెండు కథా సంపుటాలు.

సివిల్స్ గ్రంథాలు:

2011లో నేను నారాయణ ఐఎఎస్ అకాడమీ స్థాపక ప్రిన్సిపల్‍గా హైదరాబాదులో ఓ ఏడాది పనిచేశాను. తర్వాత 21st సెంచరీ వంటి సంస్థలలో పాఠాలు చెబుతున్నాను. యుపియస్‍సితో అనుబంధం వుంది. సివిల్స్ పరీక్షలకు వెళ్ళేవారికి పది దాకా ఇంగ్లీషు, తెలుగు పుస్తకాలు వ్రాశాను. తొలి ప్రయత్నం Job Interviews ఢిల్లీ పబ్లిషర్ ప్రింట్ చేశాడు. తెలుగు అకాడమీ వారికి పోటీపరీక్షలు – లక్ష్యసాధన, Ethics, Integrity, Aptitude వ్రాశాను. నీతి, నిజాయితీ, అభిరుచి వరుసగా మూడు ఎడిషన్లు వచ్చాయి. Marathon Race to Civil Services, ప్రిలిమ్స్ తయారీ ఇతర రచనలు.

ఈ విధంగా 50 ఏళ్ళలో ‘సెంచరీ’ కొట్టి ముందుకు సాగుతున్నాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here