[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
నేను ఇంటర్వ్యూ చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు:
[dropcap]తొ[/dropcap]లి దఫా నేను కడప ఆకాశవాణిలో 1975-78 మధ్య మూడేళ్ళు, రెండో దఫా 1980-82 మధ్య రెండేళ్ళు వెరసి ఐదేళ్ళు ప్రొడ్యూసర్‌గా పనిచేశాను. సినిమా పరిశ్రమ వారికి నన్ను నేను కడప ఆకాశవాణి ప్రొడ్యూసర్‌ని అని పరిచయం చేసుకుంటే, వాళ్ళు కడప స్టేషన్ నా పెట్టుబడితో పెట్టారని భావించేవారు. సినిమాల్లో ప్రొడ్యూసర్ అంటే అంతే గదా. రికార్డింగ్ అయిన తర్వాత దీనిని, డబ్బింగ్, ఎడిటింగ్ చేసి ప్రసారం చేస్తామని చెప్పేవాడిని. “నా వాయిస్ బాగోలేదా, ఎవరి వాయిస్ అయిన పెట్టి ‘డబ్’ చేస్తారా?” అని ప్రశ్నించేవారు.
ప్రొడ్యూసర్‌గా నా పని ప్రముఖులతో ఇంటర్వ్యూ చేయడం. చేరిన కొత్తల్లో ప్రశ్నలు వేయడానికి కొద్దిగా బెరుకుగా వుండేది. ప్రశ్నలు ముందుగా తయారు చేసి వారితో చర్చించి రికార్డింగుకు వెళ్ళేవాడిని. 1975 నాటికి దూరదర్శన్ గాని, ఛానళ్ళు గాని లేవు కాబట్టి రేడియో ఇంటర్వ్యూలకి మంత్రులు ముచ్చటపడేవారు. సభలో కలిసినప్పుడు స్టూడియోకి రమ్మని కోరితే కలెక్టర్‌తో చెప్పి, టైం అడ్జస్టు చేసుకుని ఆకాశవాణికి వచ్చి కనీసం ఓ గంట గడిపి వెళ్ళేవారు.
ఒకసారి నేదురుమిల్లి జనార్దన రెడ్డి ముఖ్యమంత్రిగా అనంతపురం వచ్చారు. కలెక్టరుని “20 నిమిషాలు సి.యం. టైమ్ ఇప్పించండి రికార్డింగుకు” అని అడిగాను. “టైట్ ప్రోగ్రామ్. కుదరదు” అన్నారు. నేను అప్పుడు అక్కడ స్టేషన్ డైరక్టరుని. సి.యం. హెలీపాడ్‌లో దిగారు. నేను నమస్కారం చేశాను.
“ఏం పద్మనాభరావ్! ఇక్కడ ఆకాశవాణిలో ఉన్నావా?” అన్నారు.
“గెస్ట్ హవుస్‌లో పది నిమిషాలు ఇంటర్వ్యూ రికార్డు చేద్దాం” అన్నాను.
“పబ్లిక్ మీటింగ్ కాగానే సాయంత్రం ఆరుగంటలకు చేద్దాం” అని వెంటనే కలెక్టరు వైపు చూశారు.
“అలానే సార్” అన్నారు కలెక్టర్.
గెస్ట్ హవుస్‌కి వచ్చిన జనార్దన రెడ్డి రికార్డింగు మొదలుపెట్టడానికి ముందు “నా గొంతు సరిగా లేదు. తులసి దళాలు తెప్పించండి కలెక్టర్!” అన్నారు.
ఆఘమేఘాల మీద రెవెన్యూ అధికారులు ఊరు మీద పడి ఆ సాయంత్రం పది నిమిషాల్లో పది తులసిదళాలు ఒక వెండి భరిణెలో తెచ్చి పెట్టారు.
రికార్డింగ్ పూర్తి చేశాం. ఇలా ఎన్నో జ్ఞాపకాలు.
కడప గడపలో:
కడపలో నేను పని చేసిన కాలంలో 1975 చివర్లో పి.యల్. సంజీవరెడ్డి కలెక్టరు. ఆయన మంచి పబ్లిక్ రిలేషన్స్ వ్యక్తి. నవంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ ఉత్సవాలు పది రోజులు ఘనంగా జరిపారు. రాష్ట్ర తాత్కాలిక గవర్నరు జస్టిస్ యస్. ఓబుల్‌రెడ్డి వచ్చారు. ఆయన చదువుకున్న నందలూరు హైస్కూలుకి వెళ్ళి అప్పట్లో ఆయన కూర్చున్న బెంచీలో కూర్చుని ఆనందించారు. ఆ పది రోజుల్లో మంత్రులు వచ్చారు. వారంతా ఇంటర్వ్యూలకు అంగీకరించారు. మా ఆకాశవాణికి 1975-78 మధ్య ఇంటర్వ్యూలిచ్చిన మంత్రుల వివరాలు:
సాంఘిక సంక్షేమశాఖ మంత్రి – భాట్టం శ్రీరామమూర్తి (సాంస్కృతిక శాఖ కూడా)
గ్రంథాలయ శాఖామాత్యులు – డా. సి.హెచ్. దేవానందరావు (మూడుసార్లు వచ్చారు)
రవాణా శాఖ మంత్రి – జువ్వాది చొక్కారావు
రవాణా శాఖ మంత్రి – కొణజేటి రోశయ్య
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి – డా. వై.యస్. రాజశేఖర రెడ్డి (తరువాత విద్యాశాఖ)
విద్యాశాఖ మంత్రి – యం. వి. కృష్ణారావు
విద్యాశాఖ మంత్రి – భవనం వెంకట్రామ్, జి.యం.సి. బాలయోగి
సాంకేతిక విద్యాశాఖ మంత్రి – టి. హయగ్రీవాచారి
రెవెన్యూ శాఖ మంత్రి – పి. నరసారెడ్డి
దేవాదాయ శాఖ మంత్రి – పి.వి. చౌదరి (శ్రీశైలం గెస్ట్ హవుస్‌లో రికార్డింగ్)
నీటి పారుదల శాఖ మంత్రి – సి. దాస్
నీటి పారుదల శాఖ మంత్రి – అగిశం వీరప్ప (శ్రీశైలంలో)
రెవెన్యూ శాఖ మంత్రి – యన్. జనార్దన రెడ్ది
భూగర్బ జలాల మంత్రి – టి. రవీంద్ర నాయక్
శాసన సభ స్పీకర్ – అగరాల ఈశ్వరరెడ్డి
రాయలసీమ అభివృద్ధి మండలి – కె.బి. నరసప్ప
పంచాయతి రాజ్ శాఖా మంత్రులు పలువురిని ఇంటర్వ్యూ చేశాను. యం. బాగారెడ్డి, టి. హయగ్రీవాచారి, పి. శేషావతారం, నల్లపురెడ్ది శ్రీనివాసులు రెడ్డి, పరకాల శేషావతారం, కరణం రామచంద్రరావులను ఇంటర్వ్యు చేశాను. పరకాల శేషావతారంను స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు నేను, ఆయన ఫోటో దిగాము. అప్పట్లో ‘వాణి’ పక్షపత్రికలో వేసేవారు. 2006 ప్రాంతమ్లొ పరకాల ప్రభాకర్‌ని (శేషావతారం కుమారులు) కలిసినప్పుడు ఆ విషయం చెబితే, మా నాన్న రేడియో ఫోటో నాకు పంపండని నేను ఢిల్లీలో వుండగా కోరారు. పంపాను.
మంత్రి హోదా కలిగిన అధికార భాషా సంఘం అధ్యక్షులు నలుగురిని ఇంటర్వ్యూ చేశాను – వందేమాతరం రామచంద్రరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, డా. సి. నారాయణ రెడ్డి, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు.
జ్ఞానీ జైల్‌సింగ్ హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేసినప్పుడు రాష్ట్రపతి సందేశం రికార్డు చేశాను.
ముఖ్యమంత్రులను తిరుపతి/కడప పర్యటనలలో రికార్డు చేశాను. అందులో డా. మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, భవనం వెంకట్రామ్, యన్.టి.రామారావు ప్రముఖులు. శ్రీమతి ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు, రాజీవ్ గాంధీ వంటి ప్రధానుల రికార్డింగ్‌లు చేశాను. ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి. సత్యనారాయణ రెడ్డిని ఢిల్లీలో రికార్డు చేశాము.
కేంద్ర మంత్రులు పలువురిని కడప, విజయవాడలలో ఇంటర్వ్యు చేశాను. వారిలో ప్రముఖులు – కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య. వారు తాడిపత్రి గెస్ట్ హవుస్‍లో రికార్డు చేశారు. కేంద్ర నీటి పారుదాల శాఖ మంత్రి జడ్. ఆర్. అన్సారీని కడప గెస్ట్ హౌస్‌లొ రికార్డ్ చేశాను. కేంద్ర మంత్రులను గాని రాష్ట్రమంత్రులను గాని ఇంటర్వ్యూ చేసే ముందు వారికి చెందిన బ్యాక్‌గ్రౌండ్ మెటీరియల్ సమకూర్చుకునేవాడిని.
అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపికయ్యారు. నా ప్రశ్నలో ఆ విషయం జత చేసి, “మీరు ఉన్నావ్ నుండి గెలిచారు. అది వ్యవసాయ ప్రధాన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాధారిత ప్రదేశం…” అంటూ ప్రశ్నించాను. ఆయన అభినందించారు.
రేణిగుంటలో రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవానికి 1978లో రేణిగుంట విచ్చేసిన రైల్వేశాఖ సహాయమంత్రి సి.కె. జాఫర్ షరీఫ్, ఉపమంత్రి మల్లికార్జున్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఆ వర్క్‌షాప్‌ని రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు.
కార్మిక శాఖ ఉప మంత్రి పి. వెంకటరెడ్డిని కడపలో రికార్డు చేశాను. 1971లో ఆయన కావలి నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలలో నేను పోలింగ్ ఆఫీసరుగాను, కౌంటింగ్ ఆఫీసరు గాను పనిచేశాను. ఆయన కనిగిరి వాస్తవ్యులు. నేను కందుకూరులో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు పరిచయం వుంది. 1976లో నేను ఢిల్లీకి ట్రయినింగ్‌కి వెళ్ళినప్పుడు శ్రమశక్తి భవన్‌లో వెంకటరెడ్దిని కలిశాను. ఆయన వాళ్ళ లేబర్ డిపార్టుమెంట్ సీనియర్ అధికారులను తన రూముకి పిలిచి నన్ను పరిచయం చేశారు.
పి. పార్థసారథి (రాజంపేట) ఇందిరాగాంధీ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా రెండేళ్ళు పనిచేశారు. ఆయన కడపకు వచ్చిన్ నెహ్రూ జయంతి రోజున ప్రసంగం చేశారు. నేను ఢిల్లీ ట్రయినింగ్‌కి 1976 ఆగస్టులో వెళ్ళినప్పుడు వారి బంగళా 4, జంతర్‌మంతర్ రోడ్డులో- ఆకాశవాణి పక్క వీధిలో – దాదాపు మూడు నెలలు బస చేశాను.
మాజీ మంత్రులను ప్రత్యేకించి రికార్డు చేయడం నా హాబీ. అందులో లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగారు, ఆంధ్ర మాజీ ముఖ్యంతి, ఉత్తరప్రదేశ్ గవర్నరు డా. బెజవాడ గోపాలరెడ్డి, ప్రకాశం మంత్రివర్గంలో మదరాసులో పనిచేసిన నాయకంటి శంకరరెడ్డి (కర్నులు), కడప కోటిరెడ్డి, డా. ఏ. బి. నాగేశ్వరరావు (రాజమండ్రి) ప్రముఖులు. ఆంధ్ర గవర్నర్లు కె. సి. అబ్రహం, రామ్‌లాల్, కుముద్‍బెన్ జోషీలను రికార్డు చేశాను.
విజయవాడలో:
1995-97 మధ్య విజయవాడ ఆకాశవాణి డైరక్టరుగా చేశాను. అప్పుడు పలువురు కేంద్రమంత్రులు స్టూడియోకి వచ్చారు. రాష్ట్ర మంత్రులు వచ్చి రికార్డు చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి బోళ్ళ బుల్లిరామయ్య, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సమాచార ప్రసార శాఖల మాజీమంత్రి పర్వతనేని ఉపేంద్ర, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు యన్.జి. రంగా ప్రముఖులు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరావు, ఆర్థిక శాఖ మంత్రి పి. అశోక్ గజపతి రాజు, విద్యాశాఖ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్, యువజన క్రీడా శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కోన ప్రభాకర రావు, సముద్రాల వేణుగోపాలచారి ప్రముఖులు. కాసు బ్రహ్మానందరెడ్డి మహారాష్ట్ర గవర్నరు పదవీకాలం పూర్తయ్యాక రికార్డు చేశాను.
హిమాచల్‌ప్రదేశ్ గవర్నరుగా పనిచేస్తున్న వి.యస్. రమాదేవి స్టూడియోకి విచ్చేసి 1960లలో హైదరాబాద్ ఆకాశవాణిలో మహిళా విభాగంలో తాను క్యాజువల్‌గా పనిచేసిన వివరాలు ప్రస్తావించారు.
ఢిల్లీ ఆకాశవాణిలో 1997-2000 మధ్య కేంద్ర మంత్రులు ఎందరో జన్‌మంచ్ ప్రోగ్రామ్‌లో శ్రోతలతో ముఖాముఖీ మాట్లాడారు. జార్జ్ ఫెర్నాండెజ్, నితీష్ కుమార్, ఉమా భారతి, సోమ్‌పాల్ (వ్యవసాయం) రంగరాజన్ మణిశంకర్ అయ్యర్, సుష్మా స్వరాజ్, ప్రమోద్ మహాజన్, సత్పాల్ మాలిక్.. ఇలా ఎందరో. ఎన్నికల ప్రసంగాల రికార్డింగ్‍కు అటల్ బిహారీ వాజ్‌పేయి, యల్.కె.అద్వానీ, దేవేగౌడ, ఇతర పార్టీల ప్రముఖులు విచ్చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ శ్రోతల ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఆ మూడేళ్ళలో మూడుసార్లు రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ రిపబ్లిక్ దినోత్సవ సందేశాలు రాష్ట్రపతి భవన్‍లో రికార్డు చేశాము. ప్రధానమంత్రి వాజ్‌పేయిని రేస్‌కోర్స్ రోడ్‍లో రికార్డు చేశాం.
అబ్దుల్ కలాం సరసన స్టేజిపై సర్దార్ పటేల్ మెమోరియల్ ప్రసంగ సభలో కూర్చున్నాను. తర్వాత కొద్ది నెలలకే ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఇలా ఎన్నో తీపి తీపి జ్ఞాపకాలు.
(సశేషం)