ఆకాశవాణి పరిమళాలు-38

0
2

[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

సినీ ప్రముఖల పరిచయాలు:

[dropcap]ము[/dropcap]ప్ఫయి ఏళ్ళ ఆకాశవాణి ఉద్యోగ జీవితంలో పలు ప్రాంతాలలో పనిచేసునప్పుడు రాజకీయ సాంస్కృతిక సినీ కళా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మా స్టూడియోకు వచ్చారు. వారితో పరిచయాలు ప్రసారం చేశాం. తొలుతగా చెప్పుకోదగిన విశేషం – సినీ దిగ్గజాలైన యన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్. లిద్దరూ కడపకు 1977లో వరద బాధితుల సహాయ నిధి సేకరణకు సినీ కళాకారుల బృందంతో కలసి వచ్చారు. జోలెలు పట్టుకుని నగర నడివీధులలో తిరిగి విరాళాలు సేకరించారు. వారు బస చేసిన హోటల్‌కి టేప్ రికార్డర్లు పట్టుకొని నేను, మా అనౌన్సర్ గోపీ వెళ్ళాము. ఇద్దరినీ లౌంజ్‌లో కలిసి వారి వాయిస్‌లను రికార్డు చేశాము. తమ వంతు కర్తవ్యంగా కళాకారుల బృందంతో వచ్చామని ఇద్దరూ తమ సందేశాలలో చెప్పారు.

1978లో కడపలోని ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ సినీనటుడు హరనాథ్ వచ్చారు. వారికి అభినందన పత్రం నేనే వ్రాసి సభలో చదివి వారి కందించాను. మర్నాడు స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యు రికార్డు చేశారు. కడప స్టేషన్‌లో 1980-81 మధ్య గొల్లపూడి మారుతీరావు స్టేషన్ అధిపతిగా మద్రాసు నుంచి బదిలీ మీద వచ్చారు. నేను, వారు కలిసి “బావగారి కబుర్లు” కడప నుండి సంవత్సర కాలం ప్రసారం చేశాము. కోడి రామకృష్ణ తీయబోయే సినిమా “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” స్క్రిప్ట్ గూర్చిన చర్చలు అక్కడే జరిగాయి. గొల్లపూడి సినీ ఆరంగేట్రం అక్కడే జరిగింది.

1978లో నేను విజయవాడ బదిలీ మీద వెళ్ళాను. అప్పుడు నేను తెలుగు శాఖ ప్రొడ్యూసర్‍ని. నాకు సహాయకుడిగా వీరభద్రరావు (సుత్తి) రెండేళ్ళు వ్యవహరించారు. జంధ్యాల రేడియోకి సన్నిహితులు. ఆ సాన్నిహిత్యంతో సుత్తి వీరభద్రరావు సినీ నటుడయ్యారు. సహోద్యోగి శ్రీ గోపాల్ శంకరాభరణం సినిమాలో సంగీతం మేస్టారు వేషం వేశాడు. నేను ప్రొడ్యూసర్‌గా నిర్వహించిన సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళనాలలో శ్రీశ్రీ, దాశరథి, ఆరుద్ర, సినారె పలుమార్లు పాల్గొన్నారు. కడపలోనూ, విజయవాడలోనూ శ్రీశ్రీ కవితలు హైలైట్. విజయవాడ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ చేశారు.

విజయవాడ ఆకాశవాణి నాటకాలకు పెట్టింది పేరు. నండూరి సుబ్బారావు, శంకరమంచి సత్యం, సి. రామమోహనరావు, ఏ.బి.ఆనంద్, మరెందరో రేడియో నటులు ఆంధ్రదేశానికి సుపరిచితులు. ఈ కేంద్రం నాటకాల రచయితగా జంధ్యాల ప్రసిద్ధులు. అప్పుడాయన విజయవాడలో వుండేవాడు. తర్వాత సినిమాల కెళ్ళాడు. ఆకాశవాణికి తరచూ వస్తూపోతూ ఉండేవాడు. రేడియో కళాకారులకు సినిమాలలో అవకాశం కల్పించాడు. అందులో కోట శ్రీనివాసరావు, శంకరరావు సోదరులు ప్రముఖులు. కోట శ్రీనివాసరావు బ్యాంకులో పనిచేస్తూ సినిమా రంగానికి తరలివెళ్లాడు.

ఆదివిష్ణు నాటకాలు చాలా రేడియో ప్రసారం చేసింది.  రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాదులో పి.ఆర్.ఓ.గా పనిచేసేవారు. సినిమాలను వ్రాశారు. రేడియోకు వ్రాస్తూ సినిమా రంగానికి వెళ్ళినవారిలో ఆకెళ్ళ చెప్పుకోదగినవాడు. బి.యస్.యన్.యల్.లో తిరుపతిలో పనిచేస్తూ తర్వాత హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆయనకు నందులపంట పండింది. ఒంగోలులో స్థిరపడ్డ యం.యస్. హరనాథరావు రేడియోకి, సినిమాలకు రచనలు చేశాడు.

రచయితలలో నేను పరిచయం చేసిన మరో ప్రముఖుడు డి.వి. నరసరాజు. ఆయన 1996లో విజయవాడ వచ్చారు. స్టూడియోకి ఆహ్వానించాం. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆయన నాతో ఒక సహాయం కోరారు. నరసరాజు గారి గురువు విజయవాడ ఏలూరు రోడ్డు సమీపంలో ఎక్కడో ఉన్నారు. అడ్రసుగాని, ఫోన్ నెంబరు గాని లేవు. పేరు మాత్రం తెలుసు. మా ఉద్యోగులు సాయంకాలంలోగా గాలించి ఆయన అడ్రసు పట్టుకున్నారు. నరసరాజు గారు వారింటికి వెళ్ళి వారికి పాదాభివందనం చేశారు.

రచయితలలో మా నెల్లూరి వాడైన వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ డబ్బింగ్ రచయితగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు అనగానే గుర్తుకువచ్చే మరో దిగ్గజం – యస్.పి.బాలసుబ్రహ్మణ్యం. కడపలో, విజయవాడలో వారిని పలుమార్లు రికార్డు చేశాను. 2004 సంవత్సరంలో మా నాన్నగారి స్మారకార్థం ఏర్పాటు చేసిన అనంతలక్ష్మీకాంత సాహితీ పురస్కారాన్ని బాలూకి నెల్లూరు టౌన్‌హాల్‌లో ఇచ్చి స్వర్ణ కంకణం ప్రదానం చేశాను. ఆకాశవాణితో అవినాభావ సంబంధాన్ని నిరంతరం కొనసాగించే గాయకు డాయన.

గాయకులు:

సినీ గాయకులు పలువురు మా స్టూడియోకు నా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు విచ్చేశారు. విజయవాడలో పి. సుశీల గారిని రికార్డు చేశాం. ఆమె తన ఇంటర్వ్యూలో ఓ విషయం గుర్తుకుతెచ్చుకున్నారు. పెండ్యాల నాగేశ్వరరావు తమిళంలో ఓ సినిమా తీస్తున్నారు. దానిలో కొత్త వాయిస్ ప్రవేశపెడదామని ఆలోచించారు. మదరాసు ఆకాశవాణి డైరక్టర్‍ని సంప్రదించారు. ఆడిషన్ అయిన స్త్రీల పేర్లు సూచించమన్నారు. ఆకాశవాణి ఐరు పేర్లు పంపించింది. పెండ్యాల వారికి ఆడిషన్ టెస్ట్ పెట్టారు. సుశీలను సెలెక్ట్ చేశారు. అలా ఆకాశవాణి తన భవిష్యత్తుకు సోపానం వేసిందన్నారు.

పి.బి.శ్రీనివాస్ మరోసారి వచ్చారు. మా సహచర మిత్రులు యం.యస్. శ్రీరాం‌మ్‌కు శ్రీనివాస్ మంచి స్నేహితులు. ఆయన తీసిన పెళ్ళిరోజు, మంచి రోజు సినిమాలకు శ్రీనివాస్ పాడారు. శ్రీనివాస్‌ని ఇంటర్వ్యూ చేశాం. అలానే యస్. జానకిని విజయవాడలో రికార్డు చేశాం.

ఢిల్లీలో ఉండగా సుప్రసిద్ధ గాయనీమణి ఆశా భోస్లే స్టూడియోకి వచ్చి  తమ అనుభవాలు (1998) పంచుకున్నారు. ఆశాజీని కలిశాను గానీ, లతాజీని కలవలేదనే కొరత వుండేది. 2008లో తిరుపతి దేవస్థానంలో నేను పని చేస్తున్నప్పుడు డా. కె.వి. రమణాచారి కార్యనిర్వహణాధికారి. వారి చొరవతో నాదనీరాజన కార్యక్రమంలో లతాజీ పాల్గొన్నారు.

తాళ్ళపాకలో 2008లో అన్నమాచార్య 600 జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల బాధ్యతను రమణాచారి నాకు అప్పగించారు. భూమన కరుణాకర రెడ్డి బోర్డు అధ్యక్షులు. రాజంపేట నుండి తాళ్ళపాక దాక 3 కి.మీ. పాదయాత్ర చేశారు. అందులో సినీ నటీమణులు కాంచన, మంజుభార్గవి, శోభన పాల్గొన్నారు.

విజయవాడ స్టూడియోలో రికార్డు చేసిన సినీతారలలో భానుమతితో ఇంటర్వ్యు హైలైట్. రోజాతో ఇంటర్వ్యూ రోజు స్టాఫ్ అందరూ ఫోటోలు దిగారు. షావుకారు జానకి మదరాసు కేంద్రంలో ఎన్నో రేడియో నాటకాలలో పాల్గొన్నారు. గొల్లపూడి మారుతీరావు మనవరాలి వివాహం మదరాసులో ఫిభ్రవరి 2016లో జరిగినప్పుడు జానకి, ఆమె సోదరి విచ్చేశారు. ఆమెతో నేను మాట్లాడినపుడు తన రేడియో జ్ఞాపకలు గుర్తుకు తెచ్చుకున్నారు. జమున ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షురాలిగా ఉండగా 1978లో కడపలో ఇంటర్వ్యూ చేశాను.

2004లో హైదరాబాదులో నాకు నాగభైరవ కళాపీఠం వారి అవార్డు ఇచ్చారు. ఆ సభలో ముఖ్య అతిథిగా గుమ్మడి పాల్గొని నన్ను అభినందించారు. విజయవాడలో 1995-97లో నేను ఆకాశవాణి డైరక్టర్‌ని. ఆ సమయంలో సినీ దిగ్గజాలు స్టూడియోకు విచ్చేశారు. తమ అనుభవాలు పంచుకున్నారు. వారిలో కొంగర జగ్గయ్య 1995 డిసెంబరులో ఆకాశవాణి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాయంకాలం మా యింట్లో ఆతిథ్యం స్వీకరించారు.

ఓ మధ్యాహ్నం (ఆదివారం) రెండు, మూడు గంటల ప్రాంతంలో మా క్వార్టర్స్ కాలింగ్‌బెల్ మోగింది. ఎదురుగా అల్లు రామలింగయ్యగారు. ఆ సాయంకాలం నందిగామలో జాలాది ఏర్పాటు చేసిన సభలో మేమిద్దరం ముఖ్య అతిథులం. కాఫీ తాగి ఇద్దరం కలిసి కార్లో వెళ్ళి స్టూడియో రికార్డింగ్ పూర్తి చేసి నందిగామ వెళ్ళాం. దారి పొడుగునా ఎన్నో కబుర్లు చెప్పారు.

మిక్కిలినేని వారు నేనున్న రెండేళ్ళలో పలుమార్లు స్టూడియోకి వచ్చి నటరత్నాల గురించి మాట్లాడారు. గుంటూరు నుండి ధూళిపాళ వచ్చారు ఇంటర్వ్యూకి. నెల్లూరులో ఆకాశవాణి ఏర్పాటు చేసిన సభలో దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేశారు. తర్వాత కొద్ది నెలలకే సన్యాసాశ్రమ స్వీకారం చేసి మారుతీ ఆలయం నిర్మించారు.

జె.వి. సోమయాజులు, రమణమూర్తి దంపతులు 1994లో కడపలో కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు. స్టూడియోకి వచ్చి రికార్డు చేశారు. మరో విశేషం నేను దూరదర్శన్‌లో అడిషనల్ డైరక్టర్‌గా వున్నప్పుడు సోమయాజులు, సి.యస్.రావు (నాటక రచయిత), కళాపూర్ణోదయం సీరియల్ తీయడానికి దరఖాస్తు చేసుకుని కమిటీ ముందుకు వచ్చారు. ఆ కమిటీకి నేను అధ్యక్షుడిని.

కడప, విజయవాడ స్టూడియోకి వచ్చిన మరికొందరు ప్రముఖులు దాసరి నారాయణరావు, పద్మనాభం, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, రావి కొండలరావు, అక్కినేని నాగేశ్వరరావులు.

నాగేశ్వరరావు చేతుల మీదుగా విజయవాడలో మా సిబ్బందికి వార్షిక బహుమతులు ఇప్పించాను. ఢిల్లీలో దూరదర్శన్ కార్యాలయానికి అమితాబ్ బచ్చన్ స్వయంగా విచ్చేశారు. ఏ.బి.సి. సంస్థ ఋణ విమోచన సందర్భంగా ఆయన సంప్రదింపులకు వచ్చారు. దలేర్ మెహందీ, పీనాజ్ మసాని, ఇలా సినీతారలతో పలు సందర్భాలలో పరిచయాలు, వారితో ఫోటోలు – జీవితంలో మధురస్మృతులు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here