[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
హైదరాబాదు సాహితీ మిత్రులు:
[dropcap]హై[/dropcap]దరాబాదు ఆకాశవాణిలో 1982-87 మధ్య ఐదేళ్లు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా పని చేశాను. పదవీ విరమణ అనంతరం 2005 నుంచి నేటి దాకా పలు సాహితీ సాంస్కృతిక సభలలో వేదికలెక్కాను. అందువలన లెక్కకు మించిన సాహితీ బృందం పరిచయాలున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ వివిధ విభాగాచార్యులు ఆకాశవాణి ద్వారా పరిచితులే. సి.నారాయణరెడ్డి, దివాకర్ల వెంకటావధాని, పాటిబండ్ల మాధవశర్మ, పల్లా దుర్గయ్య, అమరేశం రాజేశ్వర శర్మ, భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, బషీరుద్దీన్ (జర్నలిజం), ముదిగొండ వీరభద్రశాస్త్రి, సుమతీ నరేంద్ర, ముదిగంటి గోపాలరెడ్డి సుజాత దంపతులు, వేటూరి ఆనందమూర్తి, కె. గోపాలకృష్ణారావు, పుల్లెల శ్రీరామచంద్రుడు, మొదలి నాగభూషణ శర్మ, కొత్తపల్లి వీరభద్రరావు, శ్రీహరి, భీమ్ సేన్ నిర్మల్, బిరుదరాజు రామరాజు, వెలుదండ నిత్యానందరావు, నాయక్, కమలాకర శర్మ నాకు హితులు, సన్నిహితులు.
తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులందరూ పరిచిత సన్నిహితులే. సినారె, జి.వి.సుబ్రహ్మణ్యం, పేర్వారం జగన్నాథం, ఆవుల మంజులత, ఎల్లూరి శివారెడ్డి, యన్. గోపి, నాయని కృష్ణకుమారి, సూర్యనారాయణ, రిజిస్ట్రార్లు శివరామమూర్తి, టీ గౌరీ శంకర్ రెడ్డి, శ్యామల, అలేఖ్య పుంజాల అధ్యాపకులు పలువురు.
రాయప్రోలు సుబ్బారావు చివరిరోజుల్లో వెస్ట్ మారేడ్‌పల్లి లోని వారి ఇంటికి వెళ్లి రికార్డింగ్ ఇంటర్వ్యూ చేసి ఆర్కైవ్స్‌లో భద్రపరిచాను. అరుదైన కంఠం. గుంటూరు శేషేంద్రశర్మ ఇందిరాదేవి ధనరాజ్ గిరిల శ్యాన్‌బాగ్ ప్యాలెస్‌లో వారిని ఆంధ్రప్రభ కోసం ఇంటర్వ్యూ చేశాను. కేంద్ర సాహిత్య అకాడమీ విశిష్ట పురస్కార సమయంలో చాలా సేపు శేషేన్‌తో అశోక హోటల్‌లో గడిపాను. పలువురు కవిపండితులు తరచూ రేడియోకి వచ్చేవారు. అందరినీ పేర్కొంటే ఓటర్ల లిస్టు అవుతుందని నా భయం. బోయి భీమన్న హైమావతి దంపతులు, కుందుర్తి ఆంజనేయులు, శీలా వీర్రాజు, శారదా అశోకవర్ధన్, సి. వేదవతి, వి.వి.ఎల్ నరసింహారావు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, నందిని సిద్ధారెడ్డి, ఇరువెంటి కృష్ణమూర్తి, దేవులపల్లి రామానుజరావు, మల్లాది కృష్ణమూర్తి, మల్లాది చంద్రశేఖరశాస్త్రి, విద్వాన్ విశ్వం, సోమరాజు సుశీల, సి.మృణాళిని, అనంతలక్ష్మి, ఓల్గా, చెరబండరాజు, నగ్నముని, అక్కిరాజు రమాపతిరావు, సుందర రామకృష్ణ, వెల్చాల కొండలరావు, ముకురాల రామారెడ్డి, పోరంకి దక్షిణామూర్తి, బి.వి. పట్టాభిరామ్, ఎమెస్కో విజయకుమార్ సన్నిహితులు. ఇటీవలి కాలంలో కస్తూరి మురళీకృష్ణ, సాధనాల వెంకటస్వామినాయుడు మిత్రులయ్యారు.
పాత్రికేయ మిత్రులు:
ప్రసారమాధ్యమంలో వుండటం వల్ల పలు సందర్భాలలో వివిధ పత్రికా కార్యాలయాలకు వెళుతూండడంతో సంపాదక వర్గంతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈనాడు రామోజీరావును రెండు మూడుసార్లు కలిశాను. చలసాని ప్రసాద్, చంద్రప్రతాప్, జంధ్యాల శరత్ బాబు, కె.బి. లక్ష్మి ఈ తరం వారు. పాతతరంలో ఏబీకే ప్రసాద్, సి కనకాంబరరాజు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఎం.వి.ఆర్.శాస్త్రి, పన్యాల రంగనాథరావు, సాక్షి రామచంద్రమూర్తి, వై.ఎస్.ఆర్. శర్మ, గోపరాజు నారాయణరావు, నవ్య జగన్నాథశర్మ ఇలా పలువురు పరిచితులు.
ఆధునికులలో తిరుమల శ్రీనివాసాచార్య, వీరాజీ, ఆచార్య తిరుమల రావికంటి వసునందన్, బలభద్రపాత్రుని రమణి, మాడపాటి సరళ రాణి, చీమకుర్తి శేషగిరిరావు, ఆంజనేయులు, జ్యోత్స్నా రాణి హితులు.
హైదరాబాదులోని పలు సాంస్కృతిక సంస్థలు నన్ను ఆత్మీయంగా ఆదరించాయి 1987లో వంశీ ఇంటర్నేషనల్ పక్షాన రామ రాజు దంపతులు త్యాగరాయగానసభలో సాహితి రజతోత్సవం జరిపారు. దోణప్ప, భద్రిరాజు, సినారె, ముగ్గురు వైస్ ఛాన్స్‌లర్‌లు, గవర్నర్ కోన ప్రభాకరరావు, పుష్పగిరి స్వామీజీ నన్ను ఆశీర్వదించారు.
కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ రఘురాం పరమ ఆత్మీయుడు. అనేక సభలలో నేను పాల్గొన్నాను. అహ్మదాబాదులో ఆధునిక భువన విజయము వేశాము. 2005లో నేను రిటైర్ అయిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. సప్తతి సందర్భంగా రవీంద్రభారతిలో స్వర్ణకంకణం తొడిగారు. ఆ సభలన్నిటికీ డాక్టర్ కె.వి.రమణాచారి, ఆర్ ప్రభాకరరావు, రఘురాం దంపతులు సూత్రధారులు.
1982 నుండి నాకు ‘ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ’ కార్యకలాపాలతో అనుబంధం. తొలుత జి.రామిరెడ్డి, యం. రామకృష్ణయ్య అధ్యక్షులు. టంగుటూరి సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి. నేను ఢిల్లీ నుండి వచ్చి సైన్స్ వర్క్‌షాప్ నిర్వహించాను. సి. జి. కె. మూర్తి, శ్రీరామ్, గంధం సుబ్బారావు, మంగళగిరి ప్రమీలాదేవి దాని కార్యకలాపాలు చూశారు. ‘చైతన్య భారతి’కి రెండేళ్లు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. వివిధ సంస్థలతో బాటు మోతీనగర్‌లో ‘సత్య సాహితి’ గౌరవాధ్యక్షునిగా 2016 నుండి అనేక సభలు వైభవంగా నిర్వహిస్తున్నాము.
మోతీనగర్‌లో రాళ్ళబండి కవితా ప్రసాద్, రావికొండలరావు, వైజాగ్ ప్రసాద్, ఆకెళ్ళ, శశికాంత్ శాతకర్ణి, యన్.తారక రామారావు, మండపాక అరుణ కుమారి, సత్యప్రసాద్ వుండడం విశేషం. హాస్యబ్రహ్మ శంకరనారాయణ మాకు సలహాదారు.
రాష్ట్రేతర ఆంధ్ర మిత్రులు:
కేవలం ఆంధ్ర దేశంలోనే కాక నేను పని చేసిన ప్రసార మాధ్యమం ద్వారా వివిధ రాష్ట్రాలలో సాహితీ మిత్రులు సన్నిహితులయ్యారు. అక్కడి సభలలోనూ పాల్గొన్నాను. 2004 డిసెంబరులో బెంగళూరులో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య సభలలో ఇందిరా దత్తు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బి.యస్.ఆర్ కృష్ణ నన్ను ఘనంగా సన్మానించారు.
బెంగళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులు తంగిరాల వెంకట సుబ్బారావు నేను తిరుపతిలో చదివే రోజులలో (1965-67) అక్కడ జానపద సాహిత్యంపై పరిశోధన చేస్తున్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు కొలకలూరి జ్యోతి ఆకాశవాణి అనంతపురంలో నేనున్నప్పుడు కొంతకాలం క్యాజువల్ అనౌన్సర్‌గా పనిచేసింది. మైసూరు విశ్వవిద్యాలయంలో రాళ్ళపల్లి సుందరం మా నెల్లూరు వాడు. మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆరాధ్యులు. వారి దత్త పీఠం విద్వాంసులు కృష్ణమూర్తి చక్కని పండితులు. ‘ఐ సర్వ్’ అనే సంస్థను హైదరాబాదులో చాలా కాలం నడిపారు. ఆకాశవాణిలో (బెంగళూరు) పనిచేస్తున్న డి. పద్మావతి పరిశోధకురాలు. బళ్లారిలో టి. బి. యం. అయ్యవారు, లక్ష్మీనారాయణ, వెంగమ్మ సుపరిచితులు. మనసు ఫౌండేషన్ (బెంగళూరు) అధిపతి అయిన యం. వి. రాయుడు ఆధునిక సాహిత్య ప్రచురణకు కంకణం కట్టుకొన్న సాహితీ ప్రియులు.
మదరాసు:
నేను పి.హెచ్.డి. పరిశోధన చేస్తున్న సమయంలో ఆరుద్రను, రామలక్ష్మిని కలిసాను. తరువాత అనేక కవి సమ్మేళనాలకు ఆరుద్రను నేను ఆహ్వానించాను. సినీ సాహిత్యంపై అథారిటీ వి.ఎ.కె.రంగారావు. నేను కందుకూరులో అధ్యాపకుడిగా ఉండగా రుద్రకవి జనార్ధనాష్టకం పద్యాలను ఆయన వేషధారణ చేసి జనార్ధనస్వామి ఆలయంలో ఆరుద్ర సమక్షంలో నృత్యం చేశారు. శ్రీనివాస మంగాపురంలోని కార్వేటి నగరంలోను వారి నృత్యాలు చూశాను. మంచి మిత్రులు. మదరాసులో నేను కేంద్ర సాహిత్య అకాడమీ డిప్యూటీ సెక్రటరీ ఇంటర్వ్యూకి వెళ్ళాను (1982 ఏప్రిల్ లో). అప్పుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అకాడమీ అధ్యక్షులు ఉమాశంకర్ జోషి, ఉపాధ్యక్షులు డా. వి.కె. గోకక్, డాక్టర్ కె ఆర్ శ్రీనివాస అయ్యంగార్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సాయంకాలం పార్థసారథి కోవెలకి వెళ్లి పక్కనే ఉన్న శ్రీనివాస అయ్యంగార్ ఇంటికి వెళ్ళాను. ఆప్యాయంగా మాట్లాడారు. ‘మిమ్మల్ని సెలెక్ట్ చేశామ’ని చెప్పారు. వారి కుమార్తె శ్రీరంగంలో వుంటారు. చక్కటి విదుషీమణి. శ్రీరంగం వెళ్ళినప్పుడు చినమౌలానా మనుమలు కాశిం సోదరులు వారి ఇంటికి నన్ను తీసుకు వెళ్లారు. అక్కడి నుండి తంజావూరు లైబ్రరీకి వెళ్లి పండితులు రవిని కలిసాను. 1974లో వెళ్ళినప్పుడు విశ్వనాథం పండితులుగా వుండేవారు.
మదరాసు విశ్వవిద్యాలయంలోని పలువురు ఆచార్యులు పరిచితులే. పాత తరానికి చెందిన గంధం అప్పారావు, జి ఎస్ ఆర్ కృష్ణమూర్తి, దేవళ్ల చిన్ని కృష్ణయ్య, వి. రామచంద్ర, యన్.అక్కిరెడ్డి, ప్రస్తుత ఆచార్యులు సంపత్కుమారాచార్య, విస్తాలి శంకరరావు మంచి మిత్రులు. ఉషారాణి, మనోజ తిరుపతిలో మా సహాధ్యాయులు.
సాహిత్య అకాడమీలో పనిచేసిన చల్లా రాధాకృష్ణశర్మ, జగతి పత్రికా సంపాదకుడు ఎన్ ఆర్ చందూర్, మాలతి చందూర్ దంపతులు, క్రాంతి ప్రెస్ అధినేత ధనికొండ హనుమంతరావు (నా థీసిస్ వారి ప్రెస్‌లో ముద్రించాను), గుడిమెట్ల చెన్నయ్య, మధురై విశ్వవిద్యాలయానికి చెందిన గిరి ప్రకాష్, జయ ప్రకాష్, హోసూరు రామస్వామి రెడ్డి, బి. యస్. ఆర్. కృష్ణ (అమెరికన్ రిపోర్టరు), సుప్రసిద్ధ సినీ కవి దేవులపల్లి, బాపు రమణలు, బాలు, పి.బి.శ్రీనివాస్, సుశీల, గొల్లపూడి ఆత్మీయులు.
చలం రమణాశ్రమంలో వుండగా 1966లో ఎం.ఏ. విద్యార్థి బృందం విహారయాత్రకు వెళ్లి ఆయనను ఇంటర్వ్యూ చేశాము.
ఢిల్లీ ప్రముఖులు:
నా సర్వీసులో పది సంవత్సరాలు ఢిల్లీలో పనిచేశాను. హిందీ కవులు వృత్తిరీత్యా పరిచయమయ్యారు. ప్రతిభా రాయ్, ఇందిరా, బి.జి.వర్గీస్, సుమిత్రా గుహ, రాజారెడ్డి దంపతులు, యామినీ కృష్ణమూర్తి, వర్షా దాస్, నందితా దాస్, అకాడమీ కార్యదర్శులు ఇంద్రనాథ్ చౌదరి, కె. సచ్చిదానందన్, కృష్ణమూర్తి, శ్రీనివాసరావు పరిచితులు.
తెలుగువారిలో ఇలపావులూరి పాండురంగారావు, ఇచ్చాపురం జగన్నాథరావు, డి.ఎస్.రావు, ఆర్.ఎస్.గణేశ్వరరావు దంపతులు, ఏల్చూరి మురళీధరరావు, జ్యోతిషవేత్త ఎం.ఎన్.రావు, సుజాత, వి రంగారావు, దాసరి అమరేంద్ర, ఏడిద గోపాలరావు, ఏపీ భవన్ రంగయ్య, ఆంధ్రా అసోసియేషన్ కృష్ణమూర్తి ఇలా ఎందరో మహానుభావులు.
బెనారస్ హిందూ విశ్వ విద్యాలయాచార్యులు బయ్యా సూర్యనారాయణ, ప్రస్తుత ఆచార్యులు బి.విశ్వనాథ్ తెలుగు ప్రతిష్ఠ ఇనుమడింపజేస్తున్నారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డా. షేక్ మస్తాన్ వలీ మంచి స్నేహితులు. ఇలా సాహితీ మిత్రులలో వి. కృష్ణదేవరాయలు (విశ్వనాథ పుత్రులు) లండన్ లోనూ, బర్మింగ్‌హామ్‌లో డాక్టర్ హరగోపాల్ మిత్రులయ్యారు.
ఐదు పదుల సాహితీ ప్రస్థానంలో ఎందరో సాహితీ బంధువులు వ్యాసంగానికి దోహదం చేశారు. వారికి కృతజ్ఞతాంజలి. ఎందరినో మరిచాను క్షంతవ్యుణ్ణి.
(సశేషం)