Site icon Sanchika

ఆకాశవాణి పరిమళాలు-9

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

[dropcap]అ[/dropcap]ది 1981వ సంవత్సరం.

అప్పటికి నాకు 34 సంవత్సరాలు (1947 జనవరి 29న నెల్లూరులో రథసప్తమి నాడు నేను పుట్టాను). ప్రొడ్యూసర్‌గా ఆకాశవాణిలో ఆరేళ్ళ సర్వీసు పూర్తి అయింది. నేను చేస్తున్న ఉద్యోగం ఎదుగూ బొదుగు లేనిది. ప్రమోషన్ లేని పోస్టు. అందుకని నేను అవకాశం దొరికినప్పుడల్లా, యు.పి.ఎస్.సి. వారి ప్రకటన వచ్చినప్పుడల్లా దరఖాస్తు ఆఫీసు ద్వారా పంపేవాడిని. 1973లో ఒక ప్రకటన అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ పోస్టుకు వచ్చింది. కళాశాల ప్రిన్సిపల్ ద్వారా అప్లికేషన్ పంపాను. ఆ ప్రకటన రద్దు చేశామని తర్వాత ఉత్తరం పంపారు.

1976 అక్టోబరులో నేను ఢిల్లీ లోని ఆకాశవాణి శిక్షణా సంస్థలో మూడు నెలల ట్రైనింగ్‍కు హాజరవుతున్నాను. ఆగస్టులో మొదలైంది ఆ శిక్షణ. రాజంపేట పార్లమెంటు సభ్యులు పి. పార్థసారథి గారు (ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల డిప్యూటీ మంత్ర్రిగా) జంతర్‌మంతర్ రోడ్‌లో పెద్ద బంగళాలో ఉండేవారు. బెజవాడ గోపాలరెడ్డి ద్వారా పరిచయమైన వారి క్వార్టర్స్‌లో నేను ఆ మూడు నెలలు రాజ లాంఛనాలతో బస చేశాను. ఆ తర్వాతి సంవత్సరాలలో ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా, ఆయన బంగ్లాలో బస చేశాను. తమిళ వంటవాడు ఉండేవాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి, బెజవాడ పాపిరెడ్డి, ఏ.యస్. చౌదరి తదితర పార్లమెంటు సభ్యులు తరచూ పార్థసారథి గారితో సాయంకాలాలు గడిపేవారు.

ఎప్పుడో నేను యు.పి.ఎస్.సి. వారికి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తు చేశాను. నా ట్రైనింగ్ పూర్తయిన వారం రోజుల తర్వాత దాని ఇంటర్వ్యూ అక్టోబరు 12న ఢిల్లీలో వచ్చింది. సెప్టెంబరు నెలాఖరులో ఓ శని, ఆదివారాలు నేను బెనారస్ వెళ్ళాను. అక్కడికి నా శ్రీమతి శోభాదేవి వాళ్ళ నాన్నగారితో వచ్చి వాళ్ళ బాబాయి – పట్టాభి రామారావు (డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, బెనారస్‌లో మెకానికల్ ఫోర్‌మన్) ఇంట్లో బస చేస్తోంది.

మేం దంపతులిద్దరం మా చిన్నబ్బాయితో కలసి పట్టాభి రామరావు వెంట గంగాస్నానానికి వెళ్ళాము. ఆయన, మా కుర్రాడు జనార్ధన్ – సంవత్సరన్నర పిల్లవాడు గంగానది ఒడ్డున ఉన్నారు. మేమిద్దరం నదిలోకి దిగాం. ఉధృతమైన వరద నీటిలో మా కాళ్ళు అదుపు తప్పాయి.

ఆ ప్రవాహంలో వంద గజాలు కొట్టుకుపోయాం. ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎవరినో పంపినట్టు పక్కనే ఉన్న ఒక వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. నేను మా ఆవిడ చేయి గట్టిగా పట్టుకున్నాను. అతడు ఇద్దరినీ ఒడ్డుకు లాగివేశాడు. లేకుంటే ఆ రోజుతో మా యిద్దరికీ జలోదకాలే గతి! జలగండం తప్పింది!

ఇంటర్వ్యూ: యు.పి.యస్.సి. వారి ధోల్‌పూర్ హౌస్ మెట్లు తొలిసారిగా 1976 అక్టోబరులో ఎక్కాను. ఇంటర్వ్యూ 30 నిమిషాల దాకా చేశారు. ఆచార్య ఎస్.వి.జోగారావు తెలుగు విశిష్ట వ్యక్తిగా ఇంటర్వ్యూ బోర్డులో నన్ను ప్రశ్నించారు. వారు లోగడ నేను విజయవాడ శాతవాహన కళాశాలలో చేసిన అష్టావధాన ప్రదర్శన తిలకించి అభినందించారు. నేను సుగ్రీవ విజయ యక్షగానంపై పి.హెచ్.డి పరిశోధన చేసే సమయంలో వారిని విశాఖపట్టణంలో కలిశాను కూడా. మరు నిమిషంలో ఇంటర్వ్యూ ముగుస్తుందనగా బోర్డ్ చైర్మన్ ఒక ప్రశ్న వేశారు.

“ప్రస్తుతం మీ ఉద్యోగానికి బేసిక్ ఎంత?”

“రూ.350/- సార్” అన్నాను.

“ఈ ఉద్యోగానికి కూడా అదే బేసిక్. నిరుద్యోగికి ఇస్తే మేలు” అంటూనే నా కళ్ళ ముందే ‘సున్నా’ చుట్టారు.

“నేను చేసే పోస్టుకు ప్రమోషన్ లేదు సార్!” అన్నా వినిపించుకోలేదు.

గతం గతః. మనకు ఏది ప్రాప్తమో అది లభిస్తుందనే సిద్ధాంతం నాది. నా తొలి ఇన్నింగ్సు – యు.పి.యస్.సి.తో అలా ముగిసింది.

మరో ఇంటర్వ్యూ: 1977లో యు.పి.యస్.సి. వారు అసిస్టెంట్ డైరక్టర్ ఉద్యోగానికి ప్రకటన చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా దరఖాస్తు పంపాను. ఆకాశవాణిలో ఐదేళ్ళ సర్వీసు లేదని నన్ను ఇంటర్వ్యూకి పిలవలేదు.

1981లో మరోమారు అసిస్టెంట్ డైరక్టరు ఉద్యోగానికి ప్రకటన వచ్చింది. దరఖాస్తు పంపడమే కర్తవ్యం. ఇంటర్వ్యూకి ఆహ్వానం వచ్చింది. అప్పటికి నాకు జర్నలిజంలో పి.జి.డిప్లోమా వచ్చింది. విజయవాడలో వుండగా 1980లో భారతీయ విద్యాభవన్ కళాశాల సాయంకాలం కోర్సులో అది పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ సాధించాను. పది పుస్తకాలు ప్రచురించాను. ఆరేళ్ళ సర్వీసు.

పార్లమెంటు సభ్యులు యం. అనంతరాములు గారి క్వార్టర్స్‌లో బస. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, నా శ్రేయోభిలాషి అయిన పెండేకంటి వెంకట సుబ్బయ్య గారిని కలిశాను. అప్పట్లో తెలుగువారైన వెంకట్రామయ్య యు.పి.యస్.సి. సీనియర్ సభ్యులు. కాని, ఆయన మా ఇంటర్వ్యూ బోర్డులో లేరు.

యు.పి.యస్.సి.లో అధికార భాషా విభాగం డైరక్టరుగా బహుభాషావేత్త డా. ఇలపావులూరి పాండురంగారావు పనిచేస్తున్నారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత వారిని కలిశాను. నేను లోగడ వారు రచించిన ఆంగ్ల గ్రంథం ‘Women in Valmiki’ని తెలుగులోకి అనువదించి పెండేకంటి వెంకట సుబ్బయ్యగారికి అంకితమిచ్చి వున్నాను. ఇంటర్య్వూ కాగానే ఆ సాయంకాలం వెంటనే కడపకు తిరుగుప్రయాణామయ్యాను. దాదాపు 15 పోస్టులు ఖాళీ ఉన్నాయి.

మూడు నెలల వరకూ ఏ విధమైన సమాచారం లేదు.

నేను పది రోజులకొకసారి పాండురంగారావు గారికి ఫోన్ చేసేవాడిని. ఐదారుసార్లు ఆయన ఏమీ చెప్పలేదు. చివరకు ఒకరోజు “మీ పేరు అందులో వున్నట్టు లేదు” అని తేల్చి చెప్పారు. ‘హత విధీ’ అనుకొన్నాను. ఆ తర్వాత కొద్ది నెలలకు తాడిపత్రిలో పెండేకంటి వారిని కలిసినప్పుడు ఆయన సానుభూతి ప్రకటించారు.

1982 నాటికి యు.పి.యస్.సి. నుంచి నాకు ఓ లెటర్ (సైక్లోస్టయిల్డ్) వచ్చింది. ‘మీరు సెలక్టు కాలేదని తెలియజేయడానికి చింతిస్తున్నాం. మీ ప్రతిభకు అది కొలమానం కాదు.’ అని అందరికీ పంపే కాగితం నాకూ వచ్చింది. అంతటితో ‘దింపుడు కళ్ళం’ ఆశ కూడా తీరిపోయింది.

ఇన్నాళ్ళు ఆకాశవాణిలో పని చేసి గోల్డ్ మెడల్, గ్రంథ ప్రచురణ, జర్నలిజం డిగ్రీ వుండి కూడా ప్రతిభకు పట్టం కట్టలేదనే బాధ నాలో ఏర్పడింది. 1967లో నేను జూన్ నెలలో ఎం.ఏ. తెలుగు – శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్య్యాలయం, తిరుపతి నుండి యూనివర్సిటీ ఫస్ట్ సాధించి స్వర్ణపతకం పొంది ఉన్నాను – అష్టావధానాలు చేసాను, కానీ ఏం ప్రయోజనం?

ఆకాశవాణిలో పని చేయడానికి ముందు (1975 ఆగస్టు 16) నేను చేసిన ఉద్యోగాలు ఫ్లాష్‌బ్యాక్‌లో చెప్పాలి. 1967 జూన్‌లో ఎం.ఏ. రిజల్ట్స్ వచ్చాయి. మా నాన్నగారు ఒక రోజు బుచ్చిరెడ్డిపాళెం – మా ఊరు చెన్నూరుకు 10 మైళ్ళ దూరం – వెళ్ళారు. బెజవాడ పాపిరెడ్డి మా నియోజకవర్గం – అల్లూరు – శాసన సభ్యులు. మా చెన్నూరు గ్రామం దొడ్లా వారి జమీందారీ గ్రామం. వారితో మా నాన్నకు బాగా పరిచయం. “మా అబ్బాయి ఎం.ఏ. గోల్డ్ మెడల్‌తో ప్యాసయ్యాడు” అని పాపిరెడ్డితో అన్నారు.

“సంతోషం స్వామీ! మీ అబ్బాయి పేరు, అడ్రస్సు వ్రాసి ఇవ్వండి” అని రాయించుకుని తీసుకున్నారు పాపిరెడ్డి.

అప్పట్లో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి పని చేస్తున్నారు. ఆయన శ్రీనివాసులు రెడ్డి అన్నగారు. పాపిరెడ్డికి చాలా సన్నిహితులు. మా నాన్న వ్రాసిచ్చిన చీటీ చంద్రశేఖరరెడ్డి చేతికిచ్చారొక రోజు పాపిరెడ్డి. వారం రోజులలో పోస్టులో నాకొక అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది.

నెల్లూరు జిల్లా నాయుడుపేటకు 10 కిలోమీటర్ల దూరంలోని ‘అరవపాళెం’లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్-2 తెలుగు పండిట్‌గా నన్ను నియమించారు. 1967 జూలై 20న నేను బస్సులో అరవపాళెం మధ్యాహ్నం 11.40 ని.కు చేరాను. రెండు గ్రామాలకు మధ్యలో ఆ స్కూలు భవనాలు కట్టారు. జన సంచారం లేని ప్రదేశం.

మధ్యాహ్నం 12 గంటలలోపు చేరాను గాబట్టి హెడ్మాస్టరు ఆ రోజు డ్యూటీలో చేరినట్లు రిజిస్టర్‌లో సంతకం పెట్టమన్నారు. పది నిముషాలలో బెల్ కొట్టారు. ఫోర్త్‌ఫారం (9వ తరగతి) తెలుగు క్లాసు తీసుకోమని పురమాయించారు. క్లాసులో ఒక కుర్రవాడి దగ్గర టెక్స్ట్ బుక్ తీసుకుని రెండో పాఠం కరుణశ్రీ రచించిన పుష్ప విలాపం పద్యాలు 50 నిముషాల పిరియడ్‍లో బోధించాను. అది నా అరంగ్రేటం.

మధ్యాహ్నం హెడ్మాస్టర్ తాను తెచ్చుకున్న టిఫిన్ క్యారియర్‌లో భాగం నాకూ వడ్డించారు. “మీరు మీ ఊరికెళ్ళి సామాన్లు, వంటసామాగ్రి, బియ్యం తీసుకురండి. నేనూ కాపురం పెట్టలేదు. కలసి కాపురం చేద్దాం” అన్నాడు. ఆ సాయంకాలం ఆరు గంటలకు సమీపంలోని నాయుడుపేట రైల్వే స్టేషన్ చేరాను. ప్లాట్‌ఫామ్ మీద తిరుపతి-విజయవాడ ప్యాసింజర్ సిద్ధంగా ఉంది. టికెట్ కొని నేరుగా మా బాబాయి పనిచేసే కరవదికి చేరాను. అరవపాళెం స్కూలులో పని చేయడం నాకిష్టం లేదు.

మార్కాపురంలో కొత్తగా వాసవీ కన్యకాపరమేశ్వరీ కళాశాల పెట్టారు. ప్రయత్నించమని మా బాబాయి అన్నాడు. మర్నాడు మార్కాపురం సాయంత్రానికి చేరాను. కమిటీ చైర్మన్ ఎక్కాల క్రిష్ణయ్యను కలిశాను. ఈ వారంలో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ‘దరఖాస్తులకు ఆఖరి తేదీ ఎప్పుడో అయిపోయింద’ని ముక్తసరిగా చెప్పారు.

పాపిరెడ్డి చొరవతో మరో దఫా నెల్లూరు జిల్లా మర్రిపాడు హైస్కూల్‌లో గ్రేడ్-1 తెలుగు పండిట్‌గా 1967 అక్టోబరు 23 న చేరాను. 1967 డిసెంబరు 15 వరకూ అక్కడ పనిచేశాను. ఇంతలో కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకత్వం పోస్టింగు వచ్చింది. డిసెంబరు 16న కందుకూరులో కాలు పెట్టాను.

(వివరాలు తర్వాత…).

Exit mobile version