[డా. రేవూరు అనంత పద్మనాభరావు గారి స్వీయచరిత్ర – ‘ఆకాశవాణి పరిమళాలు’, ‘అనంతుని ఆత్మకథ’ లను సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[dropcap]ఆ[/dropcap]కాశవాణిలో వివిధ హోదాలలో పనిచేసి, దూరదర్శన్, ఢిల్లీ కేంద్రంలో అదనపు అడిషనల్ డైరెక్టర్ జనరల్‍గా పదవీవిరమణ చేసిన డా. రేవూరు అనంత పద్మనాభరావు గారి జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి వ్యక్తిత్వం ఆదర్శప్రాయం. వారు తమ జీవితచరిత్రని రెండు పుస్తకాలుగా ‘ఆకాశవాణి పరిమళాలు’, ‘అనంతుని ఆత్మకథ’ అనే పేరుతో అందించారు. ‘ఆకాశవాణి పరిమళాలు’కి ‘అదృష్టవంతుడి ఆత్మకథ’ అనేది ఉపశీర్షిక. మొదటి పుస్తకంలో వృత్తిపరమైన అనుభవాలు, రెండవ పుస్తకంలో వ్యక్తిగత జీవితం ప్రస్తావించారు.
ఒక వ్యక్తి సంపూర్ణ జీవితాన్ని సమగ్రంగా వివరించడం కాస్త కష్టమే. అందుకే ఆ జీవితాన్ని పలు శకలాలుగా పరిశీలిస్తే, పలు ఆసక్తికరమైన విషయాలు మన ముందుకొస్తాయి. వారి జీవితాన్ని రేఖామాత్రంగా స్పృశిస్తూ ఆ క్రమంలో సాగుదాం.
~
బాల్యం:
29 జనవరి 1947 నాడు శారదాంబ, లక్ష్మీకాంతరావు దంపతులకు నెల్లూరులో జన్మించారు పద్మనాభరావు. ఆ దంపతులకు అంతకు ముందు ఇద్దరు పిల్లలు పుట్టినా దక్కలేదు. అందుకని పిరిపెం ఎత్తి పద్మనాభరావుగారికి ముక్కుపోగు కుట్టించారట. దాన్ని తీసేసినప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది రావడంతో, ఎం.ఎ. పూర్తయి మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళేవరకూ ఉంచుకున్నారట. పద్మనాభరావు గారికి నాలుగేళ్ళ వయసుండగా వాళ్ళ ఊరికి వచ్చిన రెవెన్యూ ఇన్‍స్పెక్టర్ రాచగుండ్ల పెంచలరావు అనే ఆయన వారి జాతక చక్రం వేసిచ్చి, “మీ వాడు దేశరాజధాని దాకా వెళ్ళగలడు. అదృష్టజాతకుడు” అని లక్ష్మీకాంత రావుగారితో అన్నారట. భవిష్యత్తులో ఈ మాట నిజమవడం కొందరికి యాదృచ్ఛికం అనిపించవచ్చు గాని, పద్మనాభరావు గారికి మాత్రం దైవికం!
విద్యార్థిగా:
చిన్నతనం నుంచి గారాబంగా పెరిగారు. తల్లి కసిరి చదివించేవారని, చిరుదెబ్బలు వేసేవారని రావు గుర్తుచేసుకున్నారు. అవి గోరుముద్దల లాంటివేనని భావించారు. బాబాయి తర్ఫీదులో ప్రత్యేక శిక్షణ పొంది ఎంట్రన్స్ పరీక్ష వ్రాసి నాల్గవ తరగతి నుంచి – ఏడవ తరగతిలో చేరారు. అది తన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనగా పేర్కొన్నారు. అలా రెండేళ్ళు కలిసిరావడం తదుపరి కాలంలో ఉపకరించింది. థర్డ్ ఫారంలో ఉండగా చంద్రమతి మీదనో హరిశ్చంద్రుడి మీదన పద్యం రాస్తే, బాబాయి మందలించారట. కవిత్వం మీద కాక, చదువుపై దృష్టి పెట్టమన్నారట. 1960లో ఎస్.ఎస్.ఎల్.సి. పాసయ్యారు. ఆపై వి.ఆర్. కాలేజీలో బైపిసిలో చేరారు. మేనమామ ఇంట్లో బస. చదువు మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో పరీక్ష తప్పారు. అదే తొలిసారి, చివరిసారి ఫెయిలవడం! 1962లో పియుసి పూర్తి చేసి డిగ్రీ కాలేజీలో అడుగుపెట్టారు. అత్తెసరు మార్కులు కావడం, మార్చి/సెప్టెంబరులో పాస్ కావడం వల్ల బిఎస్‍సిలో సీట్ రాలేదు. గోపాలకృష్ణయ్య గారి సలహాతో బి.ఎ. తెలుగులో చేరారు. అది పద్మనాభరావు గారికి జీవితంలో కీలకమైన మలుపు అయింది. భావిజీవితానికి దిశానిర్దేశం చేసింది. జానకిరామశర్మ గారి మార్గదర్శనం! డిగ్రీ రెండో సంవత్సరంలో కాలేజ్ ప్రిన్సిపాల్ ఆర్. సుబ్బారెడ్డి గారి మీద పద్యం రాశారు. జానకిరామశర్మ గారు దానిని కొద్దిగా సవరించి సభలో చదివించారు. అలా పద్మనాభరావు గారి పద్య రచన ప్రారంభమైంది. కొద్ది రోజులకి కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి సినీనటులు బాలయ్య రాగా, ఆయనపై ప్రశంసా పద్యాలు రాసి సభలో చదివారు. గురువుల ప్రోత్సాహంతో ఆకాశవాణికి సమస్యాపూరణలు పంపడం ప్రారంభించారు. 1965 జూలైలో బిఎ పాసయ్యారు.
1965-67 మధ్య శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ. పూర్తి చేసారు. ఎన్ని అనుభవాలు! ఎన్ని మధురస్మృతులో! వివిధ పత్రికలలో కవితలు, పద్యాలు, వ్యాసాలు ప్రచురితమైన – రచయితగా తొలి అడుగులు! ఎం.ఎ. 75% మార్కులతో పాసయి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు. అప్పటికి వారి వయసు 20 ఏళ్ళు కూడా నిండలేదు.
అధ్యాపకుడిగా/లెక్చరర్‍గా:
లక్ష్మీకాంతరావు గారు అప్పటి ఎం.ఎల్.ఎ. పాపిరెడ్డి గారిని కలిసి తమ కుమారుడు ఎం.ఎ. ఫస్ట్ క్లాసులో పాసయ్యాడనీ, ఎక్కడైనా ఉద్యోగం చూడమని కోరారు. దాంతో ఎం.ఎల్.ఎ. గారి సిఫార్సుతో నాయుడుపేట తాలూకా అరవపాలెంలో ఓ హైస్కూలులో అన్‌ట్రైన్డ్ గ్రేడ్ 2 తెలుగు పండిట్‍గా ఉద్యోగం వచ్చింది. హైస్కూలు టీచర్ ఉద్యోగంలో చేరనని తండ్రితో అంటే, వచ్చిన ఉద్యోగాన్ని వదలకూడదని ఆయన అన్నారట. తండ్రిగారితో కల్సి వెతుక్కుంటూ ఆ ఊరెళ్ళి అక్కడ చేరిన పద్మనాభరావుగారికి ఆ వాతావరణం నచ్చలేదు. అదే రోజు సాయంత్రం వరకు పని చేసి, రెండు రోజులు శెలవు పెట్టి బంధువుల ఇళ్ళన్నీ తిరిగి వారం తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అమ్మానాన్నల కంగారు! ఆ తర్వాత మర్రిపాడు స్కూల్లో ఉద్యోగం.. అదీ నచ్చక అసంతృప్తి! కొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా ఓ అవకాశం!
ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిపిఐ ఆఫీసులో ఇచ్చిన అప్లికేషన్ ఆధారంగా కందుకూరు కాలేజీలో లెక్చరర్‍గా ఉద్యోగం! ఇక ఇక్కడ్నించి ఆయన జీవిత గమనం వేగం పుంజుకుంది. కొత్త పరిచయాలు కొత్త స్నేహితులు, కొత్త ఆలోచనలు! ఇష్టంగా బోధన!
అవధానిగా:
కందుకూరులో ఉండగా ఒక అవధాన సభలో పృచ్ఛకుడిగా పాల్గొని, పూర్తయ్యాక గదికి వచ్చి, అక్కడి పద్యాలన్ని మిత్రులకి అప్పజెప్పారట. దాంతో తాను కూడా అవధానాలు చేయగలగలనే నమ్మకం కలిగింది. తర్వాత తమ కాలేజీ లెక్చరర్ ఇంటి మిద్దెపై నిషిద్ధాక్షరి లేకుండా ఒక అవధానం చేసి మెప్పించారు. కాలేజీలో తెలుగు హెడ్ జంధ్యాల నారాయణ శాస్త్రి గారు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. మర్మం గ్రహించిన పద్మనాభరావు గారి తరువాత ఎన్నో అష్టావధానాలు చేశారు. అద్భుతమైన ధారణాశక్తి వారిది.
సాహితీసంస్థ నిర్వాహకుడిగా:
కందుకూరులో ఉండగానే 1975లో కందుకూరు రచయితల సంఘం స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. పవని నిర్మల ప్రభావతి, విక్రాల శేషాచార్యులు గౌరవాధ్యక్షులు. ఈ సంస్థ తరఫున కవి సమ్మేళనాలు, కవుల జయంతులు నిర్వహించారు. పలు గ్రంథాలు ప్రచురించారు. 1977లో కందుకూరు రుద్రకవిపై పిహెచ్.డి. డిగ్రీ సాధించారు.
వివాహం:
శోభగారితో 8 మే 1969 నాడు బిట్రగుంటలో వివాహం జరిగింది. నూతన దంపతులు కందుకూరులో కాపురం. 1971లో శైలజ 1973లో రమేశ్ చంద్ర, 1975లో జనార్దన్ అనే పిల్లలు కలిగారు. ఆపై పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే, పద్మనాభరావు గారి తల్లిదండ్రులు కోపగించుకున్నారట. సంతానం వద్దనుకోవడం ఆ తరం వాళ్ళకి నచ్చని విషయం! 1967-75 మధ్య ఉద్యోగ రీత్యా స్థిరత్వం, స్థానచలనం లేకపోవడం జరిగాయి.
ఆకాశవాణిలో:
1975లో ఆకాశవాణిలో చేరారు. వివిధ కేంద్రాలలో వివిధ హోదాలలో పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. సహోద్యోగుల అభిమానానికి పాత్రులయ్యారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసి, కొన్నింటిలో స్వయంగా పాల్గొని రక్తికట్టించారు. పలు ప్రముఖులని ఆకాశవాణి కోసం ఇంటర్వ్యూలు చేశారు. 1978లో రేణిగుంటలో రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవం అనంతరం అప్పటి రైల్వేశాఖ మంత్రి సహాయమంత్రి సి.కె. జాఫర్ షరీఫ్ గారిని ఇంటర్వ్యూ కోసం కలవడం ఆసక్తికరం. జాఫర్ షరీఫ్ గారు ఎంత నిరాడంబరులో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. అలాగే మరో ఇంటర్వూ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ గారి ఆతిథ్యం గురించి తెలుస్తుంది. కాన్పూరు కేంద్రం వాణిజ్య విభాగంలో జరిగిన అవకతవలని పై అధికారుల దృష్టికి తెచ్చి అక్కడి పరిస్థితిని చక్కదిద్దడం వంటివి పద్మనాభరావు గారి నిబద్ధతని, కార్యదక్షతని వెల్లడిస్తాయి.
దూరదర్శన్‍లో;
2001లో ప్రమోషన్ మీద ఆకాశవాణి నుండి దూరదర్శన్‍కి మారారు. కాశ్మీర్ ఛానెల్‍కి డి.డి.జి.గా దూరదర్శన్‍లో ప్రవేశించారు. పద్మనాభరావు గారు ఆకాశవాణి వదిలి దూరదర్శన్‍కి వెళ్ళడానికి తొలుత ఆసక్తి చూపలేదు. అప్పటి సమాచారప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడం, ఆమె హామీతో దూరదర్శన్‍లో చేరిన వివరాలు చదువుతుంటే ఆసక్తికరంగా ఉంటాయి.
తి.తి.దే.లో:
ప్రసారభారతిలో రిటైరై హైదారాబాద్ రావడానికి ఢిల్లీ విమానాశ్రయంలో ఉండగా – అప్పటి తి.తి.దే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నారాయణ శర్మగారిని యాదృచ్ఛికంగా కలిసారు పద్మనాభరావు. తితిదేలో పనిచేయలని ఉందని అనుకోకుండానే వారిని అడిగారు. కొన్ని రోజుల తరువాత తిరుమలలో దృశ్య శ్రవణ ప్రాజెక్టు కోఆర్డినేటరుగా నియమితులయ్యారు. తిరుమలలో ఎన్నో ఆడియో కాసెట్లు, రికార్డింగుల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. బ్రహ్మోత్సవాల వీడియో రికార్డింగులు చేయించారు. తితిదే కోసం ఎస్.వి.బి. ఛానెల్ ఏర్పాటులో పద్మనాభరావుగారికి కీలకమైన పాత్ర. అలాగే అన్నమయ్య 600వ జయంతుత్సవాల లోనూ విశేష కృషి చేశారు.
ఉద్యోగ బాధ్యతలలో కొన్ని మరపురాని/మరువలేని సంఘటనలు:
ఆకాశవాణిలో పనిచేసినప్పుడు ఎన్నో మరపురాని/మరువలేని సంఘటనలు జరిగాయి. మచ్చుకు మూడు ఉదాహరణలు.
- 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు రేడియో ప్రసంగం చేయాలనుకుని చేయని సందర్భంగా జరిగిన సంఘటనలు. పార్లమెంటులో వాదోపవాదాలు. విచారణ. పద్మనాభరావు గారి తప్పు కాదని తేలటం.
- కొత్తగూడెం ఎఫ్.ఎమ్. స్టేషన్ ప్రారంభించిన రెండో రోజునుంచే దాన్ని మూసేయాలని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులు. వాటి పరిష్కారం.
- రేడియోలో ప్రసారమయ్యే సినీ ప్రకటనలో అశ్లీల వాక్యాలు – వాటి తొలగింపు విషయంలో ఆ సినిమా నిర్మాతతో జరిపిన సంభాషణ
సాహితీవేత్తగా:
పద్మనాభరావు గారు శతాధిక గ్రంథకర్త. వచన కవితలు, నవలలు, కథలు, వ్యాసాలు, కాలమ్స్, జీవితచరిత్రలు వంటివి ఎన్నో రాశారు. అనువాదాలు చేశారు. ‘ఆచార్యదేవోభవ’, ‘కావ్యపరిమళాలు’, ‘తిరుమలేశుని సన్నిధి’లో వంటి సంచికలో ప్రచురితమైన కాలమ్స్‌ని పుస్తక రూపంలో వెలువరించారు. ముల్క్‌రాజ్ ఆనంద్ గారి ‘మార్నింగ్ ఫేస్’ అనే పుస్తకాన్ని ప్రభాత వదనం పేరుతోనూ, అమితావ్ ఘోష్ ఆంగ్ల నవల ‘షాడో లైన్స్’ ను ‘ఛాయారేఖలు’ పేరుతో అనువదించారు. అనువాదాలకు పలు పురస్కారాలు పొందారు.
ఆత్మకథ చివరి పేజీలలో పద్మనాభరావు గారు రచించిన 120 పుస్తకాల పేర్లు, ప్రచురితమైన సంవత్సరాల వివరాలు పేర్కొన్నారు.
కొడుకుగా కర్తవ్యం:
తల్లిదండ్రుల పట్ల తన కర్తవ్యాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించారు పద్మనాభరావుగారు. 1997లో పద్మనాభరావుగారు ఢిల్లీ వెళ్ళడం తల్లిదండ్రులకు కాస్త అసౌకర్యం కలిగించినా, కుమారుడి కెరీర్ దృష్ట్యా సర్దుకున్నారు. 1999 నుంచి చెన్నూరు వదిలి వారిద్దరూ పద్మనాభరావు గారితోనే ఉండేవారు. ఢిల్లీలో ఉండగా 2000 ఆగస్టు 5న లక్ష్మీకాంతరావు పరమపదించారు. 2001లో ఆయన స్మారకార్థం పద్మనాభరావు ‘అనంత లక్ష్మీకాంత సాహితీ పీఠం’ ఏర్పాటు చేశారు. వారి జీవన రేఖలను వివరిస్తు ‘కాంతయ్య’ అనే స్మారక సంచిక ప్రచురించారు. ఏటా ఒక సాహితీవేత్తను సన్మానిస్తున్నారు.
అమ్మ శారదాంబ గారు వృద్ధాప్య కారణాలతో 2012 ఏప్రిల్ 12న హైదరాబాదులో స్వర్గస్థులయ్యారు.
భర్తగా సాహచర్యం:
భార్యాభర్తలుగా పద్మనాభరావు, శోభాదేవి గార్లది అన్యోన్య దాంపత్యం. 2019 మే 8న ఈ దంపతులు తమ వివాహ స్వర్ణోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా ‘ఆకాశవాణి పరిమళాలు’ పుస్తకాన్ని శోభాదేవికి కానుకగా అందించారు. శోభాదేవి గారు ఐదు పుస్తకాలు రచించారు.
తండ్రిగా బాధ్యతలు:
తండ్రిగా ముగ్గురు పిల్లల్ని చక్కగా చదివించి ప్రయోజకులని చేశారు. వారు ఉద్యోగాల్లో స్థిరపడి, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలతో తమ జీవితాలు ప్రశాంతంగా గడుపుతున్నారు. 1991లో కుమార్తె శైలజకు వివాహం నిశ్చయించారు. పెళ్ళికి రెండు రోజుల ముందు రాజీవ్ గాంధీ హత్య కారణంగా వాద్యకారులు రాలేకపోయారు. డి.జి.జి గారి సాయంతో పోలీసు బ్యాండ్ వారు మంగళవాయిద్యాలు వాయించడం ఓ మధుర జ్ఞాపకం!
తాతయ్యగా ప్రేమ:
ఐదురుగు మనవళ్ళకి తాతయ్యగా వారికి ప్రేమను పంచుతున్నారు పద్మనాభరావు.
~
పలు ఐ.ఎ.ఎస్. శిక్షణా సంస్థలకూ సేవలందించి లక్ష్యసాధన దిశగా విద్యార్థులకు ప్రేరణ కల్పించారు.
ఇన్ని రకాలుగా జీవితాన్ని నిత్యవసంతం చేసుకున్నారు పద్మనాభరావు గారు. వారి ఈ ప్రస్థానంలో వారి తల్లిదండ్రులు, శ్రీమతి శోభాదేవి గారు, పిల్లలు ఎంతగానో తోడ్పడ్డారు. ఉద్యోగబాధ్యతలలో ఎందరో ప్రతిభావంతులైన సిబ్బంది మనస్ఫూర్తిగా సహకారం అందించారు. 2007 జనవరిలో తిరుపతిలో షష్టిపూర్తి. 2017లో సప్తతి పూర్తి. పద్మనాభరావు గారు ఇటీవలే 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరం లోకి అడుగుపెట్టారు. సార్థక జీవితం!
డా. అనంత పద్మనాభరావు వ్యక్తిగా వినమ్రులు, ఉద్యోగి/అధికారిగా సమర్థులు, కుటుంబీకుడిగా పరిపూర్ణులు. వారి జీవితానుభవాలు భావితరాలకు పూలబాటలు!
***
రచన: డా. రేవూరు అనంత పద్మనాభరావు
పేజీలు: 168
వెల: ₹ 160
ప్రతులకు:
డా. రేవూరు అనంత పద్మనాభరావు,
408, సాయికృపా రెసిడెన్సీ,
మోతీనగర్, హైదరాబాద్. 500114
ఫోన్ 9866586805
~
రచన: డా. రేవూరు అనంత పద్మనాభరావు
ప్రచురణ: అజో-విభొ-కందాళం ఫౌండేషన్
పేజీలు: 202
వెల: ₹ 350
ప్రతులకు:
డా. రేవూరు అనంత పద్మనాభరావు,
408, సాయికృపా రెసిడెన్సీ,
మోతీనగర్, హైదరాబాద్. 500114
ఫోన్ 9866586805
~
డా. రేవూరు అనంతపద్మనాభ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-revuru-anantapadmanabha-rao/