Site icon Sanchika

ఆకట్టుకునే అలనాటి ప్రకటనలు

[box type=’note’ fontsize=’16’] ఆయా వస్తువులని కొన్నా కొనకపోయినా… వీక్షకుల మనసుల్లో నిలిచిపోయిన కొన్ని అలనాటి ప్రకటనల గుర్తు చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్ “ఆకట్టుకునే అలనాటి ప్రకటనలు” అనే రచనలో. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్యకాలంలో మా ఇంటర్‌మీడియట్ కాలేజ్ ఫ్రెండ్స్ రీ-యూనియన్ జరిగింది. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మాలో చాలామంది ఇంటర్ తరువాత మళ్ళీ కలుసుకోనేలేదు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకున్నాం. కుమార్ అనే మిత్రుడు అడ్వర్టయిజింగ్‌ మానేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. హాస్టల్‌లో అతను నా రూమ్‌మేట్. అందరం హాయిగా కబుర్లు చెప్పుకున్నాం. రెండు రోజులు ఇట్టే గడిచిపోయాయి. మా ఇంటర్ రోజుల సినిమాలు, పాటలూ… జోకులతో సమయం తొందరగా గడిచిపోయింది. కుమార్ కుటుంబం కూడా మా ఇంటికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటోందని తెలిసింది. హైదరాబాద్‌లో మళ్ళీ కలుసుకుందాం అనుకున్నాం ఇద్దరం.

***

ఓ ఆదివారం ఉదయం వాళ్ళింటికి వెళ్ళాను.

టీ తాగుతూ, అడిగాను. “నువ్వు చదివింది సైన్స్ కదా, మరి ఈ మార్కెటింగ్ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చావు?” అని. కుమార్ నవ్వేశాడు.

“ఆ వయసులో… ఆ వేడిలో… సైన్స్ తీసుకుని ఏదేదో చేసేయాలనుకున్నాను. కాని ఇంటర్, డిగ్రీ పూర్తయ్యేసరికి మన చుట్టూ వస్తున్న మార్పులను గమనించి బ్రాండింగ్ ఫీల్డ్ అయితే లైఫ్ బావుంటుందనిపించింది. అందుకే అడ్వర్టయిజింగ్‌లో ఎంబిఎ చేశాను” చెప్పాడు.

ఇంతలో నా ఫోన్ మ్రోగింది. చూస్తే ట్రూకాలర్‌లో… ఎవరో ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి అని తెలిసింది… కాల్ కట్ చేశాను. వెంటనే స్క్రీన్ పై పెద్ద యాడ్ ప్రత్యక్షమైంది.

“ఛీ.. వెధవ న్యూసెన్స్..” అన్నాను.

“ఎవరు?” అడిగాడు కుమార్.

“ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, కానీ సమస్య కాల్ కాదు… ఫోన్ చేసినా, కాల్ కట్ చేసినా వెంటనే ఓ యాడ్ ప్రత్యక్షమవుతోంది…” అన్నాను చిరాగ్గా.

మావాడు చిన్నగా నవ్వుకున్నాడు.

అది చూసి “ఏం, ఎందుకు నవ్వుతున్నావ్?” అడిగాను.

“మనమిప్పుడు ప్రచారయుగంలో ఉన్నాం. ఉత్పాదనలూ, విక్రయ వస్తువుల గురించి ప్రకటనలు లేదా కమర్షియల్స్ లేదా యాడ్స్ ఇప్పుడు మన నిత్యజీవితంలో విడదీయరాని భాగమైపోయాయి.”

“ప్రకటనలిచ్చుకోండి.. కాని అవసరం లేని వాళ్ళకు ఎందుకు? వద్దన్నా స్మార్ట్‌ఫోన్ ద్వారా మన అరచేతిలోనే ఉండి విసుగెత్తిస్తుంటాయి. అసలు మనలో చాలామందిమి వాటి జోలికి పోము కదా” అన్నాను.

“ఎవరు ఎప్పుడు కస్టమర్ అవుతారో ఊహించలేం… అందుకే… అందరికీ… చేరేలా రకరకాల మార్గాలను అన్వేషిస్తాం.”

“కాని మన చిన్నప్పుడు వ్యాపార ప్రకటనలంటే దూరదర్శన్‍లోనూ, సినిమా ప్రారంభానికి ముందు థియేటర్‌లోనూ, దినపత్రికల్లోనూ కనబడేవి. రేడియోలో వినబడేవి. దినపత్రికల్లో కనబడే ప్రకటనల సంగతి పక్కన పెడితే దూరదర్శన్, థియేటర్లలో వచ్చే ప్రకటనలు కనువిందు చేసేవి, రేడియో ప్రకటనలూ ఆకట్టుకునేవి. ఇప్పటి యాడ్స్‌లా విసిగించేవి కావు…” అన్నాను.

“ఈ కాలంలోనూ మంచి యాడ్స్ ఉన్నాయి…” చెప్పాడు మావాడు.

“ఉన్నాయిలే. కానీ మన చిన్నతనంలో వచ్చే ప్రకటనలు – కుటుంబమంతా ఉపయోగించగలిగే వస్తువులవి కదా… ఇప్పుడు బంగారం, వజ్రాల యాడ్స్, ఈఎమ్‌ఐల జోరుతో హోరెత్తిస్తున్నాయ్.”

“తమ ఉత్పత్తులను అమ్ముకోడానికి తయారీదారులెప్పుడూ మార్కెట్ రీసెర్చ్ చేస్తారు, సోషల్ డైనమిక్స్ అధ్యయనం చేస్తారు. ఏ కాలంలోనైనా ఆనాటి సామాజిక స్థితిలనీ, ప్రజల కొనుగోలు శక్తిని అంచనా వేసి ప్రకటనలు రూపొందిస్తారు.”

“అయితే ఇప్పుడు వస్తున్నంతగా బంగారం ప్రకటనలూ, వజ్రాల యాడ్స్ అప్పట్లో ఉండేవి కావు. 20-25 ఏళ్ళక్రితం ప్రకటనలన్నీ కుటుంబ ఆధారంగా ఉండేవి. కుటుంబంలోని వ్యక్తులందరూ ఉపయోగించేలా ప్రభావితం చేయడానికి ప్రయత్నించేవి” వివరించాడు కుమార్.

“ఒకరిద్దరి సంపాదనతో కుటుంబం నడిచిన రోజులవి. కాబట్టి ప్రకటనల ధోరణి అంతా మధ్య తరగతి కుటుంబ నేపధ్యంగా ఉండేవి. వాటి తుది లక్ష్యం అమ్మకాలు/వ్యాపారమే అయినా… కుటుంబ విలువలని ప్రతిబింబించేవి. అందుకే ఆయా వస్తువులని కొన్నా కొనకపోయినా… ఆ ప్రకటనలు మాత్రం వీక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి” చెప్పాను. మా వాడు తలూపాడు.

ఇద్దరం 80-90లలో వచ్చిన ప్రకటనల గుర్తు చేసుకున్నాం. ఇంటికొచ్చాకా కూడా నన్ను ఆ ప్రకటనల జ్ఞాపకాలు వెంటాడాయి.

***

నేను కాలంలో వెనక్కి వెళ్ళిపోయాను. నేనే ఓ ప్రకటనదారుని అయిపోయాను. నేనిప్పుడు ఓ ఉమ్మడి కుటుంబంతో మాట్లాడుతూ, వాళ్ళ రోజూవారీ జీవితంలో నిత్యావసరాలతో మొదలుపెడతాను. నిద్ర లేవగానే చేసే పని దంతధావనం.

మీకు పళ్ళపొడితో దంతధావనం చేయడం ఇష్టమా? అయితే ముత్యాల్లా మెరిసే దంతాల కోసం ‘డాబర్ లాల్ దంత్ మంజన్‘నే వాడండి. టూత్‌పేస్ట్ వాడే అలవాటుంటే, ‘వీకో వజ్రదంతి’ వాడండి. ఆయుర్వేద వనమూలికలతో తయారైనది. పేస్టు, పళ్ళపొడి సరే, బ్రష్‌ల సంగతేంటంటారా? ఉందిగా కుటుంబపు బ్రష్… ‘అజంతా టూత్‌బ్రష్’. “పప్పా కా మమ్మీ కా భయ్యా కా ఔర్ మేరా…” అంటూ ఓ పాప తామంతా అజంతా బ్రష్‌నే వాడతామంటుంది.

సరే బ్రషింగ్ అయింది, నెక్స్టేంటి? వేడివేడిగా టీయో కాఫీయో తాగేద్దాం రండి.

రంగు, రుచి, చిక్కదనం ఉన్న త్రీ రోజెస్ టీ తాగుదామా లేక చక్కని అనుబంధాలకు చిక్కని టీ అయిన జెమినీ టీ తాగుదామా? ఓహ్ మీరు కాఫీ ప్రియులా? గొప్ప రుచి కోసం గ్రాన్యులేట్ చేసిన నెస్‌కెఫె వారి సన్‌రైజ్ కాఫీ తాగండి… వద్దా ఫిల్టర్ కాఫీ కావాలా… అయ్యో లేదే! ఏం పర్వాలేదు. ఫిల్డర్ కాఫీకి ఇంచుమించుగా సరిసాటి అయిన బ్రూ ఇన్‌స్టంట్ కాఫీ తాగండి. కానీ ఆపరేషన్ ఫ్లడ్ వారు ‘దూద్ దూద్ పీయో గ్లాస్ ఫుల్‘ అంటున్నారే! పోనీ ఈసారికి పాలు తాగేద్దామా?

పెద్దలు సరే పిల్లల మాటేవిటి? హార్లిక్స్ ఇవ్వండి… ఆ గడుగ్గాయి… నేను హార్లిక్స్ తాగను, తింటాను అంటోంది చూశారా! అరే, ఈ పాప నేను ఎదుగుతున్నాగా మమ్మీ అంటోందే.. ఓహో కాంప్లాన్ గర్లా? ఆ పిల్ల తమ్ముడు కూడా కప్పు ముందుకు జరుపుతున్నాడే.. కాంప్లాన్ బోయ్ అన్నమాట! వీళ్ళ పక్కింటి పిల్లాడు ‘బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటాడట పొద్దున్నే బూస్ట్ తాగుతూ!

ఏంటి, మీటింగ్ ఉంది, షేవింగ్ చేసుకోవాలా? ఉదయాన్నే గడ్డం చేసుకోడానికి సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్, పామోలివ్ షేవింగ్ క్రీమ్ ఉన్నాయిగా. ‘పామోలివ్ కా జవాబ్ నహీ’ అన్న కపిల్ దేవ్ మాటల్ని గుర్తు చేసుకుని వాటితో త్వరగా కానివ్వండి.

సరే, స్నానాలకి లేవండి. తలస్నానం చేయాలనుకునేవాళ్ళు కాస్తా ఆగాలి. ముందు మామూలు స్నానం చేసేవాళ్ళని చేసేయమందాం. బాడీ కాన్ఫిడెన్స్ ఇచ్చే సింథాల్ సోప్ లేదా సినీతారల సౌందర్య రహస్యమైన లక్స్… లేదా వయసుని కనబడనీయని సంతూర్… ఇవన్నీకాదు మాకు ఆరోగ్యమే ముఖ్యం అనుకుంటే… “లైఫ్‌బోయ్ ఎక్కడో ఆరోగ్యం అక్కడ…” అంటూ లైఫ్‌బోయ్‌తో కానిచ్చేయడం బెటర్. ‘రూప్ రంగ్ కేలియె అమృత్’ అయిన మార్గో వారి నీమ్ సబ్బు కూడా పర్వాలేదు.

తలస్నానం చేసే వారికి షాంపూ కావాలాంటే “మాధురీ, నీకేమిష్టం…” అని అడిగితే ఆమె చెప్పే జవాబు చిక్ షాంపూ! ఇది వాడండి లేదా మీరా కుంకుడు కాయ పొడిని వాడండి. తల స్నానం చేసిన రోజున తలకి నూనె రాయరుగా, అందుకని మీ ‘ప్యారాచూట్’ కొబ్బరి నూనెని లేదా ‘డాబర్ ఆమ్లా కేశ్ తేల్‌’ని పక్కన పెట్టండి!

మీ మీటింగ్‌కి ఫార్మల్ వేర్ అయితే సియారామ్స్ గాని దినేష్ స్యూటింగ్స్ గాని వేసుకోండి. ఆడవాళ్ళు ఓన్లీ విమల్ చీరలు ధరించండి.

“కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా?….” అవును కదా ఇక తదుపరి కార్యక్రమం ఉపాహారామే.

అసలే తొందరలో ఉన్నారు, బయటకు వెళ్ళి బాబాయ్ హోటల్ ఇడ్లీలో, చిరంజీవి దోశో తినేంత సమయం ఉండదు. అందుకే ‘సండే హో యా మండే రోజ్ ఖావో అండే’ స్లోగన్ గుర్తుంచుకుని ఓ బాయిల్డ్ ఎగ్గు తినండి. కోడి గుడ్దు శాకాహారమేనని ఎన్ఇసిసి వాళ్ళు చెప్తున్నారుగా! లేదా బ్రిటానియా బ్రెడ్‌కి కిసాన్ జామ్ పూసుకుని రాహుల్ ద్రావిడ్‌లా జామీ అయిపొండి. లేదూ దో-మినట్ న్యూడుల్స్ మ్యాగీ లాగించేయండి!

ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీయా? ‘హమారా కల్ హమారా ఆజ్’ అనుకుంటూ బజాజ్ స్కూటర్ తీయండి బయటకి! లేదా ‘నో ప్రాబ్లమ్ బైక్’ సుజుకి సమురాయ్ ఎక్కండి. లేదా ‘చల్ మేరీ లూనా‘ అంటూ కదం తొక్కండి.

పిల్లలకి స్కూల్ టైం అవుతోంది… ‘యాక్షన్ కా స్కూల్ టైమ్’ అంటూ యాక్షన్ బూట్లు వేసి పంపండి. నట్‌రాజ్ పెన్సిల్స్ ఇచ్చి పంపండి. అన్నట్టు మీ పెద్దాడి స్కూల్లో ప్రిన్సిపల్ ఈ రోజు రిటైరవుతున్నారట… పిల్లలంతా కల్సి ఆయనకేదో గిఫ్ట్ ఇస్తారట. కొంత డబ్బిచ్చి పంపండి. అవును మీ చిన్నోడి పుట్టిన రోజు కదా ఈ రోజు, తోటి పిల్లలకి పంచడానికి న్యూట్రిన్ కోకోనట్ కూకీస్ ఇచ్చి పంపండి.

అరే, లోపలి నుంచి చంటాడి ఏడుపు వినబడుతోంది… క్రమంగా పెరుగుతోంది… ‘ఉడ్‌వర్డ్స్ గ్రైప్ వాటర్‘ పట్టమని వాళ్ళమ్మకి చెప్పండి.

మీకు కూడా ఏదో పార్టీ ఉందన్నారుగా… రడీ అవరేం… ‘వీకో టర్మరిక్’ లేదా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’యో రాసుకోండి…

పనమ్మాయి వచ్చింది… ఉతకడానికి బట్టలు వేయాలిగా, ‘రంగుల బట్టలనూ ఉతికేదే నిర్మా’ అనుకుంటూ ‘నిర్మా‘ ఇవ్వండి లేదా ‘సర్ఫ్‘ ఇవ్వండి. లేదా రిన్ సోప్ ఇవ్వండి. 501 లేదా ‘ఫేనా హీ లేనా!’.

తెల్లబట్టల కోసం రాబిన్ బ్లూ లేదా ‘చార్ బూందో వాలా’ ఉజాలా ఉపయోగించండి.

గిన్నెలు కడిగేందుకు విమ్ బార్ మర్చిపోవద్దు. సబీనా అయినా ఓకే.

మీకు మీ శ్రీమతి అంటే ఎంతో ప్రేమ ఉందడానికి నిదర్శనంగా మీరు కొన్న ప్రెస్టీజ్ ప్రెజర్ కుక్కర్ వంటకి సిద్ధమవుతోంది. ప్రీతీకి నేను గ్యారంటీ అంటూ స్నేహితులు భరోసా ఇవ్వడంతో మీ శ్రీమతిగారు కొన్న ప్రీతీ మిక్సర్ గ్రైండర్‌లో కొబ్బరి చట్నీ చేస్తున్నట్టున్నారు… సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో, ఎంటిఆర్ వారి మసాలాలతో చేసిన వంటలు ఘుమఘుమలాడుతున్నాయి. అరే ఎవరో అతిథులు వచ్చినట్లున్నారు. గదిలోనే మలయమారుతం, గదిలోనే సాగర సమీరం వీయించి గదిలోనే మధుర విహారం చేయించే గంగా సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయండి. ఎండన పడివచ్చారు, చల్లని జ్యూస్ ఇవ్వండి. రస్నా లేదా డాబర్ వారి షర్బత్-ఏ-ఆజామ్ అయితే బావుంటుంది. సాంబార్ అన్నంలోకి లిజ్జత్ పాపడ్ మరువకండి.

భోజనాలయ్యాక సులువుగా జీర్ణమవడానికి త్రివేణి లేదా క్రేన్ వక్కపొడో లేక స్వాద్ బిళ్ళలో లేదా పచన్ ఆమ్లానో ఇవ్వండి. అతిథులతో పాటు మీరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి.

సాయంత్రమవుతోంది… అతిథులకి పార్లేజీ బిస్కట్స్ ఇవ్వండి. ‘హమ్ కో పతా హై జీ సబ్ కో పతా హై జీ’ అంటూ వాళ్ళు తినే లోపు చక్కని టీ అందించండి. బామ్మ గారికి తలనొప్పిగా ఉందా… అమృతాంజనం రాయండి. కాసపేటికే ఆవిడ ‘పోయిందే’ అంటారు. తాతగారేంటి దగ్గుతున్నారు. ‘ఖిచ్ ఖిచ్’ దూరం చేసే విక్స్ బిళ్ళలు ఇవ్వండి.

బడి నుంచి పిల్లలు వచ్చినట్టున్నారు… వాళ్ళ ప్రిన్సిపాల్‍కి మీ పెద్దాడి క్లాసువాళ్ళు ఏం బహుమతి ఇచ్చారో కనుక్కోండి… ‘టు ది మాన్ హు టాట్ అజ్ ఎవ్రీథింగ్’ అంటూ రేమాండ్స్ స్యూట్ ఇచ్చారట కదా, రిటైర్ అవుతున్న ప్రిన్సిపాల్‌ని వెళ్ళద్దని బ్రతిమారట కదా! బావుంది!

ఏంటి రెండు రోజుల్లో ఊరు వెళ్తున్నారా, మంచి సూట్‌కేస్ కొనాలా? షాప్‌కి వెళ్ళారా? ఖరీదైనా ఎక్కువా లేదా క్వాలిటీ మరీ తక్కువ ఉంటున్నాయా? విఐపి వారి చౌకయిన కొత్త కానుక ఆల్ఫా స్యూట్‌కేసు తీసుకోండి!

సాయంత్రం కాస్త అటుఇటూ నడవండి – పారగాన్ హావాయి చెప్పులతో!

చీకటి పడుతోంది, అన్నాలు తిని త్వరగా పడుకోండి. రేపటి ఉదయాన్నే తాజాగా నిద్ర లేవడానికి స్లీప్‌వెల్ మాట్రెస్ ఉపయోగించండి.

దోమలు కుట్టకుండా టార్టాయిస్ కాయిల్ లేక ఓడోమాస్ వాడండి.

గుడ్ నైట్!

***

వర్తమానంలోకి వచ్చాను. ఈ విధంగా ఒక్కరోజులో ఇన్ని ఉత్పాదనల ప్రకటనలు మనకెదురవుతాయి. ఇకపోతే, రేడియోలో వచ్చే ప్రకటనలలో నాకు బాగా గుర్తుండిపోయినది చార్మినార్ ఆజ్‌బెస్టాస్ రేకుల యాడ్. “ఏం రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మా ఇంటికి గొడ్ల చావిడికి ఏం రేకులు వేయాలా అని! ఇందులో ఆలోచించడానికి ఏముంది? చార్మినార్ వారి ఆజ్‌బెస్టాస్ రేకులనే వాడు. మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.” ఇన్నేళ్ళయినా ఈ ప్రకటన అలవోకగా నా నోట్లోంచి వచ్చేస్తుంది.

చాలా ప్రకటనలు బావున్నాయనిపించినా, చిరాకు పెట్టేవి కొన్ని ఉండేవి. హీంజ్ వారి కెచప్ యాడ్ ఒకటి. ‘Takes a while to come out’ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చే ఈ ప్రకటనలో ఒకావిడ కిరాణా కొట్టుకు ఫోన్ చేసి సరుకులు ఆర్డర్ ఇవ్వడం ఇరిటేటింగ్‌ వుంటుంది. అలాగే ఫెవికాల్, ఫెవిక్విక్ యాడ్స్ అతిశయోక్తిగా ఉంటాయి. ఇలాంటి వాటిలో మరొకటి ‘అవాక్కయ్యారా’ అంటూ వచ్చే టైడ్ డిటర్జెంట్ ప్రకటన!

కేవలం టాగ్ లైన్స్‌తో గుర్తుండిపోయే కొన్ని యాడ్స్ – ట్రిపుల్ ఎక్స్ (సంస్కారవంతమైన సబ్బు) ఒనిడా టీవీ (నైబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్), అంబికా దర్బార్ బత్తి (భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది).

1996లో వచ్చిన “బొంబాయి ప్రియుడు” సినిమాలో చంద్రబోస్ గారు ‘చందన చీరను చుట్టి’ అంటూ ఒక పాట రాశారు. ఈ పాటలో వివిధ బ్రాండ్ల పేర్లు ఉండడం విశేషం!

***

ఈమధ్య కాలంలో వచ్చిన వ్యాపార ప్రకటనలలో నాకు కొన్ని బాగా నచ్చాయి. “వైర్స్ దట్ డోన్ట్ కాచ్ ఫైర్” అంటూ వచ్చే ‘హావెల్స్ కేబుల్స్’ ప్రకటనలో తల్లి రాళ్ళపొయ్యి మీద చపాతీలు కాలుస్తూ, వేడిగా ఉన్న పెనం మీద నుంచి వాటిని తీసే ప్రయత్నంలో చేయి కాల్చుకుంటుంది. అది చూసిన కొడుకు హావెల్ కేబుల్‌తో పట్టకార తయారు చేసి తల్లికిస్తాడు. ఆమె వాడికేసి తడి కళ్ళతో ఆపేక్షగా చూస్తుంది.

క్యాన్సర్‌ని జయించిన మహిళలకు గౌరవసూచకంగా ‘వాటికా హెయిర్ ఆయిల్’ ప్రకటన ‘బ్రేవ్ అండ్ బ్యూటీఫుల్’ చాలా బావుంటుంది. ‘ఖూబ్‌సూరతీ చహరే పే నహీ’ అని చెప్పే ఈ ప్రకటన ‘సమ్ పీపుల్ డోన్ట్ నీడ్ హెయిర్ టు లుక్ బ్యూటీఫుల్’ అంటుంది. ఎంత వాస్తవమిది!

ఓ కొడుకు తన తండ్రిని సినిమా హీరోగా చూపించే గూగుల్ యాడ్ The Hero – ‘ఖుద్‌కో డూండ్ లే’ అంటూ ముగుస్తుంది. నిన్ను నువ్వు శోధించు అనే ఈ కాప్షన్‍లో లోతైన అర్థం ఉంది. ఎంతో ప్రేరణనిస్తుందీ యాడ్. అలాగే గూగుల్ మరో ప్రకటన – Reunion (పాకిస్తాన్, ఇండియా విడిపోక ముందరి స్నేహితులను కలిపే యాడ్) కూడా బావుంటుంది. బురదలో పడిన చెల్లి కోసం తానూ బురదలో పడి తన బట్టలు పాడుచేసుకున్న అన్న ప్రేమని చూపించే ‘మరక మంచిదే’ ‘సర్ఫ్ ఎక్సెల్’ ప్రకటన ఎమోషనల్‌గా ఉంటుంది.

ఇక కరెంట్ ఎఫైర్స్ లోని తాజా వార్తాంశాలతో రూపొందించే అమూల్ బేబీ ప్రకటనలు నిత్య నూతనంగా ఉంటాయి.

ఉత్పత్తిదారులు తమ అమ్మకాల కోసం ఎన్ని ప్రకటనలు రూపొందించినా, అవెంతగా ఆకర్షించినా వినియోగదారులు తమకేది అవసరమో అదే కొంటారు. అప్పుడప్పుడూ ఈజీ లోన్స్, ఇ.ఎమ్.ఐలు ప్రలోభపరిచి కొందరిని కొన్ని వస్తువులని కొనేలా చేస్తాయి. అందుకే విచక్షణ అవసరం.

‘Learn everything that is good from others, but bring it in, and in your own way absorb it; do not become others.’ అన్న వివేకానందుడి సూక్తిని పాటిస్తూ; క్యాడ్‌బరీ చాక్లెట్ ప్రకటనలోలా – ‘క్యా స్వాద్ హై జిందగీ కా’ అంటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే ఉత్తమం.

(గమనిక: ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, నేను శీతల పానీయల ప్రకటనలను ఈ వ్యాసంలో ప్రస్తావించడం లేదు).

Exit mobile version