[డా. నాగసూరి వేణుగోపాల్ గారి సంపాదకత్వంలో వెలువడిన ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ అనే సంకలనం సమీక్ష. ఇది మొదటి భాగం.]
[dropcap]రెం[/dropcap]డు సంపుటాలలో, 826 పేజీలున్న ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ అనే ఈ పుస్తకం చూడగానే ఆనందం కలుగుతుంది. అడవి బాపిరాజు సృజనాత్మక వ్యక్తిత్వాన్ని పలు విభిన్నమైన కోణాల్లో విశ్లేషించి దర్శింపచేసే వ్యాసాలను ఒకచోట చేర్చి అందిస్తుందీ పుస్తకం. డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం వహించిన ఈ పుస్తకంలోని వ్యాసాలను మొత్తం 7 విభాగాలలో కూర్చారు.
మొదటి భాగం ‘కళా వ్యక్తిత్వ దిగంతం’ ఈ విభాగంలో అంతేవాసుల అనుశీలన అంటూ విశ్వనాథ, పిలకా గణపతి శాస్త్రి, దేవుల పల్లి, దాశరథి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, తిరుమల రామచంద్ర, పింగళి లక్ష్మీకాంతం, రాయప్రోలు వంటి వారితో సహా పలువురు లబ్ధప్రతిష్ఠులు అడవి బాపిరాజు వ్యక్తిత్వం గురించి ఎంతో ఆర్ద్రంగా తలచుకున్నారు. ఈ వ్యాసాలు చదువుతుంటే నిజంగా అలాంటి సున్నిత మనస్కుడు, సృజనశీలి ఈ భూమి మీద నడయాడాడా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది.
‘అతడు గీసిన గీత బొమ్మై/అతడు పలికిన పలుకు పాటై/అతని హృదయము లోని మెత్తన/అర్ధవత్కృతియై’ అని విశ్వనాథ వర్ణించారు అడివి బాపిరాజును. ‘ఏ సుకుమారాంగుళి సోకినా ఆ వీణా హృదయం మ్రోగవలసిందే. పశువుల కాంతి రేఖ సోకినా ఆ స్వచ్ఛ హృదయం చిత్రశాల కావలసిందే’నని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి అభిప్రాయపడ్డారు. ‘జాతీయ కవి, భావుకోత్తముడు, త్యాగమూర్తీ, ఆంధ్రాభిమానీ, చిత్రకారుడూ, సంపాదకుడూ, శిల్పి, కథకుడు, నవలాకారుడూ, వక్తా, కళాతపస్వీ, ప్రసంగ చతురుడు, ప్రేమైక మూర్తి, రసలోలుడు, దేశికోత్తముడూ, గాంధీ పరోక్ష శిష్యుడూ’ అంటూ బాపిరాజు సర్వతోముఖ కళాప్రతిభా విశేషాలను ఉటంకించారు పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. ఇలా ఈ విభాగంలోని ఒక్కో వ్యాసం చదువుతుంటే బాపిరాజు గారి వ్యక్తిత్వంలోని విభిన్నమైన పార్శ్వాలు మనకు పరిచయమౌతాయి. , అనంత వైవిధ్యం కల సృజనాత్మకత ఆయనది అని అర్థమవుతుంది.
రెండవ విభాగం ‘స్మరణిక’. ఆరంభంలోనే అడివి బాపిరాజు ‘చేతివ్రాత’ కనిపిస్తుంది. ఈ విభాగంలో ‘ఆత్మీయ స్మృతుల పరంపర’ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ‘భవదీయుడు బాపిరాజు’ విభాగంలో మొత్తం బాపిరాజు గారు రాసిన వ్యాసాలు, కథలు, కవితలు ఉంటాయి. బాపిరాజు గారి నవలలు మాత్రమే, శశికళ లాంటి రచనలు మాత్రమే చదివిన వారికి బాపిరాజు గారి సృజనాత్మక విశ్వరూపం సూక్ష్మంలో ప్రదర్శిస్తుందీ విభాగం. ఈ విభాగంలో కళల గురించి, రాజకీయాల గురించి, విద్యా విధానం గురించి ఉన్న వ్యాసాలు – ఆయా అంశాలలో బాపిరాజు గారి లోతైన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తాయి.
“యువకులనేకులు సామ్యవాదం, సాంఘికవాదం అని కబుర్లు చెప్తున్నారు. వారలకు అవి ఏమిటో తెలియదు. రాజనీతిశాస్త్రం పూర్ణంగా చదువుకొన్న గాని వారి హృదయమే వారికవగతం కాదు. రాజ్య పాలనా భావాలు పొగమంచు లాగ రూపం లేకుండా ఉన్నవి” (పేజీ 316) అనే మాటల అర్థం ఆ కాలంలో కన్నా ఈ కాలంలో మరింతగా వర్తిస్తుంది.
సినిమా కళ గురించి ఓ ఇంటర్వ్యూలో “ఈనాటి ప్రేక్షక హృదయములో కళ సంపూర్ణముగా మాయమై ఉన్నది. దానికి దేశము యొక్క దౌర్భాగ్య స్థితి కారణము. దేశాభ్యుదయమును సూచించేది ఆ దేశములోని కళల యొక్క ఔన్నత్య దశ. ప్రపంచ చరిత్రలో కళాభ్యుదయమునకు ప్రయత్నించినప్పుడే స్వతంత్రత లేని దేశాలు స్వతంత్రం తెచ్చుకోగలిగాయి” అన్న వ్యాఖ్య ఎంతో లోతుగా విశ్లేషించవలసిన వ్యాఖ్య.
అలాగే ‘విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వము’ గురించి, విశ్వనాథ గురించి అడివి బాపిరాజు గారి వ్యాఖ్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటుంటే ఆయన సునిశిత పరిశీలన, లోతైన అవగాహన, విశ్వనాథ వారి రచనల పట్ల, వ్యక్తిత్వం పట్ల ఉన్న గౌరవాభిమానాలు స్పష్టమవుతాయి.
“సత్యనారాయణ గారు జ్ఞాన – పిపాసి.
ఎడతెగకుండా సర్వ విధములైన విజ్ఞాన సంపాదనకు ఈయన మనసు అధీనమై ఉంటుంది. ఆయా శాస్త్రములలో పండితుడు కావాలనే ఉద్దేశము చేత ప్రేరితుడై కాదాయన ఇట్లు చేయుట. ఆయనలో ఉండే నిరంతర విజ్ఞాన పిపాస – తరిగిపోని ఉత్సాహం వల్ల. అందుకనే ఆయన కావ్యములు ఒక మహా భావనా జగత్తును మన ఎదుట ప్రవచింపజేస్తవి” అంటారు బాపిరాజు.
‘అజంతా’ గురించిన వ్యాసంలో సౌందర్య పిపాసకుడు, సౌందర్యారాధనలో జగతి మరిచిన ఉన్మత్తుడు, ఉన్నతుడూ అయిన అడివి బాపిరాజు కనిపిస్తారు. ‘అలంకార శిల్పంలో భారతీయులతో ఏ దేశపు శిల్పులూ, చిత్రకారులు కొలది మాత్రమైనా చేరలేరు. ప్రపంచంలోని సమస్తమైన వస్తువులలో నున్న రేఖలూ అలంకార రేఖలలో లయం చేశారు’ అన్న వ్యాఖ్య వారి సునిశిత పరిశీలనా శక్తి, భావనా బలం, సౌందర్యానుభూతుల సాంద్రతను స్పష్టం చేస్తుంది.
ఈ రకంగా బాపిరాజు గారి సాహితీ, చిత్రకళ, శిల్ప, నాట్య, సంపాదక, సినీ కళా నైపుణ్యాల విశ్లేషణతో పాటు వారి కాల్పనిక, కాల్పనికేతర, వచన, గేయ, కవితా రచనలను అందించే తొలి సంపుటం ఆద్యంతం ఆనందోత్సాహలను కలిగిస్తూ, సూక్ష్మంలో బాపిరాజు గారి సృజనాత్మక విరాట్ స్వరూపాన్ని మనసుకు చేరువ చేస్తుంది.
ఈ సంపుటి చదువుతుంటే ఆశ్చర్య కలుగుతుంది. ఎంత ప్రతిభావంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సృజనాత్మక ప్రవాహం పలు దిశల ఒకేసారి ఉధృతంగా ప్రవహింప చేసిన కళాకారుడు బాపిరాజు అని అర్థమై ఆనందాశ్చర్యాలు కలుగుతాయి.
మలి సంపుటి చదవటం కోసం మనసు ఉవ్విళ్ళూరుతుంది.
(మలి సంపుటి పరిచయం వచ్చేవారం)
***
‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ (సాహితీ చిత్రలేఖన శిల్ప నాట్య సంపాదక సినీ కళా నైపుణ్యాల విశ్లేషణ, 2 వాల్యూమ్స్)
సంపాదకులు: డా. నాగసూరి వేణుగోపాల్
ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, విజయవాడ.
పేజీలు: 826
వెల: ₹ 1,000.00
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్. 8464055559
ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు:
https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-1-
https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-2-