[డా. నాగసూరి వేణుగోపాల్ గారి సంపాదకత్వంలో వెలువడిన ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ అనే సంకలనం సమీక్ష. ఇది రెండవ భాగం.]
[dropcap]“ఒ[/dropcap]క పువ్వు తక్కవ పూజ్జేయడం వల్లనేమో దురదృష్టవశాత్తు బాపిరాజు గారు తెలుగువాడిగా పుట్టారు. ఈయనా రచయిత కావచ్చు – చరిత్రకారుడు కావచ్చు – శిల్పి కావచ్చు – గేయ రచయిత కావచ్చు – ఇందుగలడందు లేడని సందేహము వలదన్నట్టు ఠాగోరు గారి లాగానే అతను పట్టని ప్రక్రియ లేదు. ఎటొచ్చీ పాపం.. తెలుగువాడిగా పుట్టాడు – ఇంతే సంగతులు”.
‘ఎటొచ్చీ.. పాపం.. తెలుగువాడిగా పుట్టాడు – ఇంతే సంగతులు’ అనే వాక్యాలు ‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ మలి సంపుటంలో శ్రీ. ఎ.బి. సుందరరావు రాసిన – ‘దళిత జీవితాలను కథలుగా చిత్రించిన తొలి సాహసి’ అనే వ్యాసంలోనివి. ఈ వాక్యాలు ప్రతి సాహిత్యాభిమాని మనసును తొలుస్తున్న భావనను వ్యక్తీకరిస్తాయి. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగోర్ రచనలకు ఏ మాత్రం తీసిపోనటువంటి అద్భుతమైన రచనలను విభిన్నమైన ప్రక్రియలలో చేసిన తెలుగు సృజనాత్మక రచయితలు అనేకులున్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం గత 30 ఏళ్ళుగా, తెలుగు సాహితీ గతం అంతా ‘హతం’ చేశారు. ఎవరో ఓ గుప్పెడు రచయితల పేర్లు మాత్రమే పదే పదే ప్రస్తావిస్తూ, వారు తప్ప తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగ్గ రచయితలు లేరు, రచనలు లేవు అన్నట్టు ప్రచారం చేశారు. ‘వారి తరువాత మేమే’ అంటూ అరస, విరస, కురస, నీరస, నోరస రచయితలు ముందుకు వచ్చారు. ఫలితంగా అత్యంత ప్రతిభావంతులయి, అత్యంత ఉత్తమమైన రచనలను సృజించిన మహా రచయితలు కూడా పోషించి నిలిపేవారు లేక ‘ఎటొచ్చీ.. పాపం.. తెలుగువాడిగా పుట్టాడు – ఇంతే సంగతులు’ అనేట్టు మరుగునపడిపోయారు. అందుకే డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం వహించిన ఈ రెండు అడిపి బాపిరాజు సంకలనాలు అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి. ఏదో ఓ ఉద్యమంలో చేరకపోతే, ఏదో ఓ మూక తోక పట్టుకుని వేలాడకపోతే ‘ఇంతే సంగతులు’ తెలుగు రచయితల పరిస్థితి అన్న మాట నిజమేనని అర్థమవుతుంది.
‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ మలి సంపుటంలో – నవనవోన్మేషం, నిండు ఇంద్రధనుస్సు, ఆఖరులో అందినవి అన్న మూడు విభాగాలలో రచనలున్నాయి. బాపిరాజు సాహితీ కళా విజ్ఞాన విశ్వరూపం చూపించే నవనవోన్మేషం విభాగం ‘సౌమ్య శీతల మనస్వి’ అనే ఆవంత్స సోమసుందర్ వ్యాసంతో ఆరంభమవుతుంది. “శిల్పిగా, చిత్రకారునిగా, కవిగా, నవలాకారుడిగా, కథకునిగా, పత్రికా రచయితగా, సినిమా దర్శకునిగా, గాయకునిగా, రసాయన శాస్త్రవేత్తగా, నాట్యకారునిగా, నటునిగా, ఉపన్యాసకునిగా, వేయేల – సకలా కళా వైభవశ్రీగా మానవతావాదిగా బాపిరాజు గారు అవిస్మరణీయుడు” అని తీర్మానిస్తారు ఆవంత్స సోమసుందర్.
అబ్బూరి వరద రాజేశ్వరరావు గారి ‘గుప్త మోహనమైన అమాయకత్వం’ ఎంతో ఆసక్తికరంగా ఉండి, బాపిరాజు గారిని సజీవంగా కళ్ళ ముందు నిలుపుతుంది. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, అక్కిరాజు రమాపతిరావు, పిలకా లక్ష్మీనరసింహమూర్తి, రాంభట్ల కృష్ణమూర్తి వంటి వారి వ్యాసాలతో సహా ఈ విభాగంలోని అన్ని వ్యాసాలు అలరిస్తాయి. అడివి బాపిరాజు గారి సాహిత్యాన్ని పరిచయం చేస్తూ, విశ్లేషిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని సాక్షాత్కరింప చేస్తాయి. మండలి బుద్ధప్రసాద్ రచన ‘మనిషిని మానవుడిగ మలచిన గురుదేవులు’ చాలా చక్కటి సంఘటనలు వివరిస్తుంది. బాపిరాజు గారి వ్యక్తిత్వాన్ని మరింత చేరువ చేస్తుంది.
‘నిండు ఇంద్రధనుస్సు’ విభాగంలో సమకాలీన విశ్లేషణలు పొందుపరిచారు. ఈ విభాగంలో ముందుగా ఆకట్టుకునేది ఈమని శివనాగిరెడ్డి విశ్లేషించిన అడివి బాపిరాజు రచన ‘నా తీర్థయాత్ర – ఎల్లోరా అజంతా’. అత్యంత ఆసక్తికరంగా ఉంటుందీ రచన. “స్వచ్ఛంద ప్రణయం, వియోగ సంయోగాలు, ప్రకృతి వర్ణన, సంఘ సంస్కరణ, దేశభక్తి లాంటి భావ కవిత్వ ధోరణులను నవలల్లో విస్తృతంగా ప్రవేశపెట్టిన ఘనత బాపిరాజు గారికే దక్కుతుంది” అంటారు కె. పి. అశోక్ కుమార్ ‘బహుముఖీన నవలా ప్రతిభ’ అనే వ్యాసంలో.
ఈ విభాగంలో వ్యాసాల నడుమ పొందుపరిచిన అడివి బాపిరాజు చిత్రించిన చిత్రాలు మనసును దోచేస్తాయి. అడివి బాపిరాజు సృజనాత్మక వ్యక్తిత్వాన్ని ఈ చిత్రాలు మరింత చేరువ చేస్తాయి. అయితే ఈ విభాగంలో పలు రచనలలో పునరుక్తి దోషం కనిపిస్తుంది. తొలి సంపుటంలోనూ పలు వ్యాసాలలో నారాయణరావు, కోనంగి, శశికళతో సహా పలు ఇతర పాపులర్ రచనల ప్రస్తావన పదే పదే కనిపిస్తుంది. అలాగే వేయి పడగలు, నారాయణరావు నవలలకు బహుమతి రావటం కూడా. అయితే ప్రత్యేకంగా, నరుడు, హిమబిందు, అంశుమతి, గోన గన్నారెడ్డి వంటి నవలల గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు ఈ విభాగంలో చోటు చేసుకోవటంతో ఆయన ఇతర రచనలను కూడా సమగ్రంగా విశ్లేషించినట్టయింది. డా. సి. మృణాళిని వ్యాసం ‘గుబాళించిన జాజిమల్లి’లో అరుదుగా వినిపించే ‘జాజిమల్లి’ నవలను పరిచయం చేయటం బాగుంది.
ఈ నేపథ్యంలో ఈ సంపుటాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అడివి బాపిరాజు సృజనను నూతన తరం తెలుసుకుని, విశ్లేషించి, అధ్యయనం చేసి, సమీక్షించే వీలునివ్వటంతో పాటూ, ఇలా, విస్మృతిలో పడిన పలు పరమాద్భుతమైన రచయితలు, వారి రచనలను సాహిత్యాభిమానులు పూనుకుని ప్రకటించే స్ఫూర్తిని ఈ సంపుటాలి కలిగించే వీలు కూడా ఉంది. అందుకే ఈ సంకలనం రూపొందించి, అడివి బాపిరాజును మరోసారి పెద్ద ఎత్తున తెలుగు సాహితీ లోకానికి అందించిన మండలి బుద్ధప్రసాద్ కు, డా. నాగసూరి వేణుగోపాల్‍కి అభినందనలు, కృతజ్ఞతలు.
***
‘అఖిలకళా వైభవశ్రీ అడివి బాపిరాజు’ (సాహితీ చిత్రలేఖన శిల్ప నాట్య సంపాదక సినీ కళా నైపుణ్యాల విశ్లేషణ, 2 వాల్యూమ్స్)
సంపాదకులు: డా. నాగసూరి వేణుగోపాల్
ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, విజయవాడ.
పేజీలు: 826
వెల: ₹ 1,000.00
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్. 8464055559
ఆన్‍లైన్‍లో తెప్పించుకునేందుకు:
https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-1-
https://srpublications.in/product_view.php?bt=AkilakalaaVaibhavasreeADIVIBAPIRAJU-2-