Site icon Sanchika

అక్కడ పాట లేదు

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘అక్కడ పాట లేదు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]క్కడ చెట్టూచేమ లేదు
ఆత్మగల ఆత్మీయ చెట్టుమనిషీ లేడు

నేలను కరిచిపట్టిన వంకరటింకర సిమెంట్ రోడ్లు
నింగి నెత్తిన ఎత్తైన బహుళ అంతస్తులు
నాట్యమాడే పచ్చని ఆ కేసరాల నడుమ
పాపిట మోము తీర్చిన సుందర బృందావనం
మట్టి మనిషి చిరునామాలే సుఖదుఃఖాల పాట

ఆరోగ్యగీతం ఆలపించే పైరు పచ్చదనం మాయం
ఆత్మీయబంధువు వెచ్చని కరస్పర్శ కూడా

గుడిసెగుండె సన్నాయి ఊరుగుడి కోయిల గొంతు
బడి పలక పాదాలే అక్షరాల వొడి
అంతా బోసిపోయిన చోట
మైదానాల ఖేల్ వీచింది మత్తుగా

సుభాషితాల చెరువు నాఊరు
మాట్లాడే పల్లె దరువు ఏడ
ఆ పల్లీయం జాడ?!

మట్టిదారెంట నిటారు సమాధులు
నడుమ రణగొణనిశ్శబ్దం
నది అలల తీపిబాధ అంతరించే
రాలిన ఎండుటాకుల సంద్రమై
మౌనరాగం ఊరేగే శూన్యనిర్మిత గుహల నిర్జనశబ్దం

ఆ పాట ఓ అనాథ!
కనిపించని చెవులకూ వినిపించని కళ్ళకూ
కష్టజీవి ఊరు తత్వం తెలియని పిడికిలికి

Exit mobile version