అక్షర దక్షిణ

5
2

[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘అక్షర దక్షిణ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]హై[/dropcap] స్కూల్ ఆవరణ పిల్లల అరుపులతో నిండిపోయింది. శాస్త్రి ప్రవేశంతో మొత్తంగా ఒక్కసారిగా నిశ్శబ్ధం ఆవరించింది. కాస్త ఎత్తులో ఉన్న స్టేజి మీదెక్కి చేతిలో కర్రతో అందరి వంకా గంభీరంగా చూసాడు శాస్త్రి. కొద్దిసేపటికి హెడ్ మాస్టర్, మరికొందరు ఉపాధ్యాయులు వచ్చి మౌనంగా నిలబడ్డారు.

ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి కిటికీలో నుండీ వీరందరిని చూసిన శాస్త్రి వెంటనే అక్కడున్న మీట నొక్కాడు. దాంతో వందేమాతరం గీతం మొదలైంది. దాని తర్వాత జనగణమన జాతీయ గీతం మొదలైయ్యింది. అది పూర్తవగానే విద్యార్థులందరూ ఒకే వరసలో నడుస్తూ తమ తమ తరగతుల్లోకి వెళ్లిపోయారు.

మొదటి గంట టంగు మంటూ మ్రోగింది. కాసేపట్లో తరగతుల్లోకి ఉపాధ్యాయులు చేరుకున్నారు. బడి ఆవరణ అంతా నిశ్శబ్దం ఆవరించింది.

ఏడవ తరగతి గదిలో సైన్స్ పాఠం జరుగుతూ వుంది. బోర్డు మీద రాస్తూ విషయాన్ని వివరిస్తున్నాడు శాస్త్రి.

విద్యార్థిని, విద్యార్థులందరూ ఏకాగ్రతతో వింటున్నారు. ఆయన చెప్తున్నది వింటున్న విద్యార్థులందరికీ అయితే డాక్టర్లుగా లేక సైంటిస్ట్ అవ్వాలని అనుకోసాగారు. శాస్త్రి క్లాస్ ఉన్నంత సేపూ విద్యార్థులు మంత్రముగ్ధులై వింటారు.

అతనంటే విద్యార్థులందరికీ ఎనలేని గౌరవం. కాస్త భయం కూడా. పాఠం చెప్తూ ఒక సారి అందరికేసీ చూస్తున్న శాస్త్రి చూపు లక్ష్మి మీద నిలిచింది. పాఠం చెప్పటం ఆపి లక్ష్మిని లేవమని చెప్పి సూటిగా కళ్ళల్లోకి చూసి అడిగాడు “ఏమ్మా బొట్టు పెట్టుకోలేదేం?”

తల కిందకు వేసుకుని నిలబడింది లక్ష్మి.

“ఏంటి ఫ్యాషనా.. ఎంత పెద్దగా ఎదిగినా సరే మనం మన పద్ధతి, సంస్కారం మరవకూడదు.. కూర్చో’’ అని చెప్పి పాఠం చెప్పటం పూర్తి చేసాడు.

***

“ఏరా సుధాకర్ నాలుగు రోజుల నుండీ రాలేదేం?” అడిగాడు శాస్త్రి.

“మా అయ్యతో పొలం కోతలకు వెళ్లాను సార్” అన్నాడు సుధాకర్ లాగును పైకి చెక్కుకుంటూ.

“సరే కూర్చో. మీ నాన్నను రేపు వచ్చి నన్ను కలవమను.” అని చెప్పి, బోర్డు వైపు తిరిగి పాఠం చెప్పసాగాడు.

స్కూల్ ఆఖరి గంట కొట్టారు. విద్యార్థులందరూ బిలబిలమంటూ ఇండ్లకు వెళుతూ వున్నారు. స్కూటర్ ఆపి ఇంట్లోకి వెళ్లి గుమ్మం వద్ద కాళ్ళు కడుక్కుని లోనికి అడుగు పెట్టాడు శాస్త్రి.

కొద్ది సేపటికి పంచె కట్టుకొని వాలు కుర్చీలో కూర్చున్న శాస్త్రి చేతికి కాఫీ కప్ అందించింది భార్య పావని. కప్ అందుకుని భార్య ను తృప్తిగా చూసాడు, నుదుటన నిండుగా ఎర్రని బొట్టు, అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు. చెరగని చిరునవ్వుతో, లక్ష్మీదేవిలా కనిపించింది. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరూ కాలేజీ చదువులకు చేరుకున్నారు.

“ఇదిగో, ఏమండీ, మన చిన్నోడి ఫీజు కట్టాలి” అంది పావని.

“జీతం రాగానే, మొదటి రోజే కట్టెద్దువు గానీ” అన్నాడు.

“చాలా కాలం నుండీ ఇదే సమస్య మనకు. ఆ సుబ్బారావు గారు చూడండి, సాయంత్రం మూడు బ్యాచీలు, ఉదయం మూడు బ్యాచీలు ఇంట్లో ట్యూషన్‌లు. చక్కటి సంపాదన. మీరేమో ట్యూషన్‌లు చెప్పనంటారు. మీకు మంచి పేరు వుంది. చెప్తే మనకు బాగుంటుంది కదా” అంది మెల్లిగా సముదాయించుతూ.

“పిచ్చిదానా, స్కూల్‌లో వున్న సమయంలో మనం చక్కగా చెప్తే ఎవరికీ ఇంటికొచ్చి ట్యూషన్ చెప్పించుకునే అవసరం రాదు.” అన్నాడు చిరునవ్వుతో.

“అంటే మిగతా వారందరూ చెప్తున్నారుగా, మీకెందుకు ఆ డబ్బులు చేదు” అంది పావని నిష్ఠురంగా, కొంగుతో మొహం తుడుచుకుంటూ.

“పావని.. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలున్నాయి. నీకు తెలుసుగా” అన్నాడు శాస్త్రి పావని కేసి చూసి నవ్వుతూ.

“దానికెవరు అడ్డుపడటం లేదండి. మనకు డబ్బులు వస్తాయిగా” అంది.

“ఏం.. మనకు జీతాలు రావడం లేదా? మనం న్యాయంగా చదువు చెప్పటానికి ప్రభుత్వం మాంచి జీతాలిస్తోంది. మన ఖర్చులు తగ్గించుకుని, ఉన్నంతలో స్కూల్‍లో విద్యార్థులకు న్యాయం చేయాలి. అంతే గానీ స్కూల్‌లో సరిగ్గా చెప్పకుండా, వాళ్ళను ఇంటికి పిలిపించుకుని డబ్బులు సంపాదించడం సరి అయిన మార్గం కాదు” అన్నాడు.

“సరే.. నా పిచ్చి గానీ ఇన్నేళ్లు వినని వారు ఇప్పుడు మాత్రం వింటారా?’’ అని నవ్వి భర్త కేసి అభిమానంగా చూసి, ఖాళీ కప్ తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది పావని.

కళ్ళు మూసుకుని ఆలోచనల్లో పడి ఇరవై అయిదు సంవత్సరాలు వెనక్కి గతం లోకి వెళ్లి పోయాడు.

***

ఆ రోజు బి.యిడి.లో సీట్ వచ్చింది. ఇంట్లో శాస్త్రి తల్లి రుక్మిణి, తండ్రి నారాయణ, గుడికి శాస్త్రిని తీసుకెళ్లి దేవుడి మ్రొక్కు తీర్చుకుని ఊపిరి పీల్చుకున్నారు.

“ఈ చదువు అయిపోగానే నీకు ఉద్యోగం ఖాయమట కదురా, కన్నయ్య” అంది రుక్మిణి తృప్తిగా కొడుకు తల నిమురుతూ.

“అవునే అమ్మా” అన్నాడు శాస్త్రి తృప్తిగా.

“ఏదో నాయనా, ఆ టీచర్ ఉద్యోగం వస్తే చాలు, మన కుటుంబానికి దేవుడు పెద్ద సాయం చేసినట్లే. ఆ జీతంతో నీ జీవితం సాఫీగా గడిచిపోతుంది.’’ అని నిట్టూర్చింది రుక్మిణి.

“గురువు ఉద్యోగం అంటే జీతం రాళ్లు కాదు, రుక్మిణి. అదో పెద్ద గురుతర బాధ్యత. వాడి జీవితంలో ఎన్నో వేల పిల్లల జీవితాలను తీర్చిదిద్దే అతి పవిత్రమైన కార్యం. అందులో ఎంతో మంది చేతుల్లో భావి తరంలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి. అదీ ఒక గురువు చేసే పని. అంతే కానీ దాన్ని ఒక మామూలు ఉద్యోగం లాగా అనుకోకూడదు. అలా ఉద్యోగం చేసి, సంపాదనే కావాలంటే ఇంకా చాలా చాలా ఉద్యోగాలున్నాయి” అని చెప్పి కొడుకు వైపు చూశాడు నారాయణ.

తండ్రి కళ్ళలోకి కళ్ళు పెట్టి, గౌరవంగా చూసి “అవును నిజమే నాన్నగారు” అన్నాడు శాస్త్రి.

కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు పోస్ట్ మ్యాన్ తెచ్చిన, బ్యాంకు ఉద్యోగంలో భర్తీ కమ్మనే ఉత్తరంతో ఇంట్లో సంతోషాలు వెల్లివిరిశాయి.

భార్య మొహం చూసాడు శాస్త్రి. పావని మొహం వెలిగిపోతూ వుంది. “ఈ రోజు భలే శుభ దినం కదూ” అంది.

“నాకా ఉద్యోగానికి వెళ్లాలని లేదు పావని” అన్నాడు కాఫీ చప్పరిస్తూ.

అది విని బిత్తర పోయింది “ఎందుకని.. జీతం పెరుగుతుంది. భవిష్యత్తులో ప్రమోషన్లుంటాయి. పైగా మీరింకా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిపించాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.” అంది .

“ఏమో పావని, నాకీ టీచర్ ఉద్యోగం చాలా తృప్తినిస్తోంది. ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వచ్చు.” అన్నాడు నిట్టూరుస్తూ.

“కానీ బ్యాంకు ఆఫీసర్‌గా మీకు, మాకందరికీ ఆర్థికంగా ఉన్నత స్థితి లోకి వెళ్ళడానికి వుండే సౌలభ్యం ఇప్పుడున్న ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కడుంది?” అడిగింది దిగాలుగా.

“ప్రతి పనిలో మానసిక ఆనందం, జీవితంలో తృప్తి కూడా అవసరం పావని. నువ్వే అర్థం చేసుకో. నాకిక్కడ ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎంతో మంది బీద విద్యార్థులకు, తెలివైన పిల్లలకు వారి భవిష్యత్తుకై మంచి మార్గం చూపుతున్నాను. అందులో వున్న ఆనందం ఇంకెక్కడొస్తుంది చెప్పు.” అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు.

కాసేపు భర్త కేసి ప్రేమగా చూసి చిరునవ్వు నవ్వి లోని కెళ్ళి పోయింది పావని.

***

“ఏమండి” అన్న భార్య పిలుపుతో గతంలో నుంచీ ఈ లోకంలో కొచ్చాడు శాస్త్రి.

“ఏంటి?” అన్నాడు ఉలిక్కి పడి, భార్య వైపు చూసి.

“రండి, చపాతీలు వేడిగా వున్నాయి” అంది.

లేచి డైనింగ్ టేబుల్ వద్దకు నడిచాడు శాస్త్రి.

***

ఆ రోజు వర్షం విపరీతంగా కురుస్తోంది. పైగా హోరుగాలి. దాంతో ఆ గాలికి వర్షం జల్లు ఎడా పెడా కొట్టసాగింది. రోడ్లన్నీ వర్షంతో మునిగి మోకాలి లోతున పారుతూ వున్నాయి నీళ్లు.

స్కూల్‌లో విద్యార్థులు దాదాపు రాలేదు. ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉపాధ్యాయులందరూ కూర్చొని బడిని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు? అని చర్చించుకుంటున్నారు. అందరూ తలా ఒక సూచన చేసారు.

శాస్త్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం గమనించిన ప్రధాన ఉపాధ్యాయులు రామయ్య “శాస్త్రీ, మీరేంటి ఏమీ చెప్పటం లేదు” అన్నాడు.

ఆ మాట విని లేచి నించున్నాడు శాస్త్రి. అందరూ మాట్లాడుకోవడం మానేసి ఆసక్తిగా శాస్త్రి వైపు చూసారు.

అప్పుడు చెప్పటం మొదలు పెట్టాడు శాస్త్రి.

“ముందుగా విద్యార్థులకు సరి అయిన మరుగుదొడ్లు కావాలి. వారికి విషయం సులభంగా అర్థం కావడానికి దేశ, ప్రపంచ పటాలు అవసరం. సైన్సుకు సంబంధించినవైతే, అవెంత అత్యావశ్యకమో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా సైన్సు పరికరాలు కొన్ని ఉంటే పై తరగతిలో వాళ్లకు వాటి గురించి అవగాహన పెరిగి విజ్ఞానం పెంపొందడమే కాక వికాసం కూడా పెరుగుతుంది.” అని చెప్పడం ఆపి అందరి వంక చూసాడు శాస్త్రి.

చాల మంది ఉపాధ్యాయులు నిరాసక్తతతో చూసారు. కొందరు అసహనంగా కదిలారు.

“అవన్నీ ప్రభత్వం చూసుకోవాలి. మన పని కాదు” అన్నాడు, లెక్కల మాస్టర్ అప్పారావు.

‘‘అవును, అవన్నీ పెద్ద పెద్ద ప్రణాళికలు, మనకెందుకు” కాస్త చిరాకుగా అన్నాడు సోషల్ మాస్టర్ సూరి.

అవన్నీ గమనించిన ప్రధానోపాధ్యాయుడు రామయ్య, శాస్త్రి వేపు చూసి “నిజమే, మీరు చెప్పిన అంశాలు బాగున్నాయి. కానీ వాటికి బోలెడు ఖర్చు. మనకంత బడ్జెట్ ఎక్కడుంది?” అన్నాడు నిస్సహాయంగా మొహం పెట్టి.

“ఇవన్నీ చొప్పదంటు ప్రణాళికలు. వాటి గురించి మాట్లాడటం సమయం వృథా” అన్నాడు తెలుగు మాస్టర్ శర్మ.

అందరి వైపు నవ్వుతూ చూసాడు శాస్త్రి. “ప్రణాళిక అంటూ ఒకటుంటే మనం ముందడుగు వేయొచ్చు” అన్నాడు శాస్త్రి.

“అబ్బా శాస్త్రి .. నీవన్నీ పగటి కలలు.. ఊరుకో” అన్నాడు హిందీ మాస్టర్ ప్రకాష్ వెక్కిరింతగా నవ్వుతూ.

బాధగా చూసాడు శాస్త్రి “మన ఊరి పంచాయతీని కూడా కలుపుకుని వారిని కూర్చోబెట్టి ఈ విషయాలను వారి దృష్టికి తెస్తే బాగుంటుంది” అన్నాడు. ఆ మాట విని ఆలోచనలో పడ్డారందరూ.

“అంతే కాదు, మన విద్యార్థుల తల్లిదండ్రులను, డి.యి.ఓ.ను కలిపి ఓ మీటింగ్ పెట్టి, వారి సహకారంతో కూడా ముందుకు వెళ్లొచ్చు” అని చెప్పి అందరి వైపు చూసాడు శాస్త్రి.

“ఆలోచించాల్సిన విషయం’’ అన్నాడు ప్రకాష్.

“ప్రస్తుతం మనం ఒక్కొక్కరం అన్ని రకాలైన విషయాలను భోధిస్తున్నాం. అది సమంజసంగా లేదు. ఉదాహరణకు నేను సైన్స్ చదివాను, కానీ హిస్టరీ కూడా చెప్పాల్సి వస్తోంది. గేమ్స్ టీచర్ లేరు. నా వ్యక్తిగత అభిలాషతో నేను చేస్తున్నాను. నాలాగా చాలా మందికి మన స్కూల్‌లో ఇదే సమస్య. దాన్ని కూడా పరిష్కరించాలి. ఎలా అనేది ఆలోచించాలి’’ అని చెప్పి కూర్చున్నాడు శాస్త్రి.

“త్వరలో నీకు ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టర్ అవుతావుగా, అప్పుడు నువ్వు పరిష్కరించుదువు గానీ.” అని వెకిలిగా నవ్వాడు రాజయ్య.

రాజయ్య అన్నట్లుగానే ఆరు నెలల తర్వాత శాస్త్రి అదే స్కూల్‌లో హెడ్ మాస్టర్ అయ్యాడు. ఒక వారం తర్వాత ఆ ఊరి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను ఆహ్వానించాడు శాస్త్రి. వారితో, పాఠశాల అధ్యాపకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసాడు.

పాఠశాల అభివృద్ధికి కావాల్సిన సహకారాన్ని అర్థించాడు. విద్యార్థులకు అవసరమైన పరికరాలు కావాలని, వాళ్లను చదువు నుండీ మనసు దారి మళ్లే పనులు చెప్ప వద్దని అర్థించాడు.

శాస్త్రి మాటలు విన్న గ్రామ పెద్దలు ఆశ్చర్య పోయారు. వూరినుండీ చందాలు వసూలు చేసి ఇస్తామని మాట ఇచ్చారు. శాస్త్రి చెప్పే విషయాల్లో వున్ననిజాన్ని అందులో గల శాస్త్రి నిజాయితీని గమనించారు.

“వచ్చే సంవత్సరం ప్రాథమిక పాఠశాలను తప్పనిసరిగా ఉన్నత పాఠశాల చేస్తాను. అయితే మీరు ఎవరు కూడా మీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపనని నాకు మాట ఇవ్వండి’’ అన్నాడు శాస్త్రి.

“మీరు మంచి విద్య ఇచ్చి, మంచిగా పాఠాలు చెప్తుంటే అలాగే ఇక్కడే ఉంచుతారు సార్” అన్నాడు ప్రెసిడెంట్ రంగయ్య.

“ఆ కృషి చేస్తాం.. దానికి మా అధ్యాపకుల తరఫున హామీ ఇస్తున్నాను” అని చెప్పి, ముందు కూర్చున్న అధ్యాపకుల వైపు చూసాడు శాస్త్రి. అందరూ అవునని తలలూపారు.

ఆ రోజుతో సమావేశం ముగించి తృప్తిగా ఇంటికి వెళ్ళాడు శాస్త్రి. గేట్ బయట మెట్ల పక్కన కూర్చున్న ఒక విద్యార్థిని గమనించి పిలిచాడు.

ఆ అబ్బాయి భయపడుతూ వచ్చి శాస్త్రి ముందు నిలబడ్డాడు.

“ఏంటి ఇంకా ఇంటికెళ్ళకుండా ఇక్కడే వున్నావ్” అడిగాడు.

“రేపటి నుంచి స్కూల్‌కు రావద్దని చెప్పారు సార్ “ అన్నాడు ఏడుపు మొహంతో.

“ఏం.. ఏం జరిగింది?” అన్నాడు.

“అసలు స్కూల్ ఫీజు కట్టలేదు సార్ మా నాన్న “అన్నాడు తల వంచుకుని.

“అదేం లేదు గానీ నువ్వు రోజూ రా, ఏ క్లాస్ నీది” అడిగాడు.

చెప్పాడా విద్యార్థి.

“సరే రోజూ స్కూల్‌కి రా, మానొద్దు. మీ సార్‌కి నే చెప్తానులే.. ఫీజు సంగతి నేను చూసుకుంటా” అన్నాడు అబ్బాయి తల నిమిరి.

సరేనంటూ నవ్వుతూ సంతోషంగా పరిగెడుతున్న ఆ అబ్బాయిని చూసి తృప్తిగా ఇంటికి వెళ్ళాడు శాస్త్రి.

***

ఒక సంవత్సర సమయంలో పాఠశాల చాలా అభివృద్ధి చెందింది. విద్యార్థుల సంఖ్య పెరిగింది. శాస్త్రి ఆఫీస్ రూమ్‍లో రోజంతా కూర్చోకుండా కొన్ని తరగతులకు కొన్ని పాఠాలు చెప్పసాగాడు. సైన్స్ విద్యార్థులకు చిన్న ల్యాబ్ ఏర్పాటు చేసాడు.

పెద్ద తరగతుల విద్యార్థులకు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉదయం, సాయంకాలం ప్రత్యేక బోధన ఏర్పాటు చేయించాడు. పాఠశాల మానకుండా ప్రతీ రోజు వచ్చిన విద్యార్థులకు ప్రతీ నెల బహుమతులు అందచేయటం మొదలు పెట్టాడు. తరగతుల్లో అడిగిన ప్రశ్నలకు వెంటనే లేచి సమాధానం చెప్పే విద్యార్థులకు కూడా చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం అలవాటు చేసాడు. మెల్లిగా పాఠశాలలో విద్య మీద అందరికీ ఆసక్తి హెచ్చి, మంచి పేరు రావడం మొదలయ్యింది.

గ్రామ ప్రజల సహకారంతో, విద్యార్థుల తల్లిదండ్రుల సహాయంతో అదనపు తరగతుల భవనం కట్టించాడు. చుట్టు పక్కల గ్రామాలల్లో పాఠశాల పేరు అందరికీ తెలిసి తమ పిల్లలను ప్రైవేట్ నుండీ ఈ పాఠశాలకు మార్పించసాగాడు. దీంతో వారికి మిగిలిన డబ్బులతో వారు తమ వంతుగా పాఠశాలకు ఆర్థిక సహాయం చేయ సాగారు.

ఆ రోజు శాస్త్రి, రాత్రి భోజనం చేసి బయట వరండాలో కూర్చొని పావనితో మాట్లాడుతూ ఉండగా, ఇంటి ముందు గేట్ దగ్గర నిలబడి ఇద్దరు వ్యక్తులు ఇంటి బెల్ కొట్టారు.

వచ్చిన వారెవరో తెలియక లేచి నుంచుని, “లోనికి రండి” అన్నాడు శాస్త్రి.

ఆ ఇద్దరూ వచ్చి నమస్కారం పెట్టి, శాస్త్రి చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు

తాను తిరిగి కూర్చుని “చెప్పండి, మీ పరిచయం?” అన్నాడు శాస్త్రి.

వాళ్లలో ఒకరు గొంతు సవరించుకుని చెప్పారు.

“నేను ప్రైవేట్ స్కూల్ అండ్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇతను సెక్రటరీ’’ అని చూపించి నమస్కారం పెట్టారు.

‘‘చెప్పండి మీరు వచ్చిన పని?” అన్నాడు శాస్త్రి చేతులు కట్టుకుని.

కాసేపు నవ్వు మొహం పెట్టి అన్నాడు సెక్రటరీ “మీరు వచ్చిన తర్వాత మా పాఠశాలల్లో పిల్లలు తగ్గి పోతున్నారు. కాస్త దయ చేసి మీరు మాకు సహాయం చేయాలి సార్. మీకు మేమూ సహాయం చేస్తాం.” అరచేతులు రుద్దుకుంటూ.

“నేనే విధంగా చేయగలను?” అడిగాడు శాస్త్రి.

“మీరు ఏదో విధంగా ఈ సంవత్సరం కొత్త విద్యార్థులను తీసుకోకుండా వుండి, కాస్త మీరు మీ స్కూల్ మీద ఆసక్తి తగ్గిస్తే మేము పుంజుకుంటాం. దానికి ప్రతీ నెలా మేము మా తరఫున కాస్త పెద్ద మొత్తం అందజేస్తాం. అంతే కాదు మా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం జాయిన్ చేయిస్తే దానికి కూడా మీకు.. మాకీ సహాయం చేయండి.” అన్నాడు సెక్రటరీ మెల్లిగా, గొంతు తగ్గించి.

అది వినగానే శాస్త్రి నరాలు బిగుసుకున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని “మీరు ఇక లేచి బయలు దేరండి. నాకు కాస్త పనుంది.” అని చెప్పి లేచి నిలబడ్డాడు శాస్త్రి.

“మరొక్క సారి ఆలోచించండి. ఇదుగో మా విజిటింగ్ కార్డు” అని ఒక కార్డు అక్కడున్న బల్ల మీద పెట్టి, వెళ్లిపోయారు.

వారిద్దరూ గేటు దాటగానే ఆ కార్డు తీసుకుని కోపంగా దాన్ని పరపరా చింపేసి బయటకు విసిరేసాడు శాస్త్రి.

***

ఆఫీస్ గదిలో కూర్చుని పని చేసుకుంటూ ఉండగా టేబుల్ మీద ఉన్న ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తి “హలో” అన్నాడు శాస్త్రి.

“మీ పేరు ఉత్తమ జాతీయ ఉపాధ్యాయునిగా ఎంపిక అయ్యింది. మీరు దానికి అవసరమైన పేపర్లు పంపండి’’ అంది అటునుండి డీఈఓ కంఠం.

‘‘సరేనండి.. కానీ వాటి పైన నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు. దయచేసి మీరేమనుకోవద్దు’’ అన్నాడు వినమ్రంగా.

‘‘మీలాంటి వారికి ఆసక్తి లేకపోతే, అది అనర్హులకు లభిస్తుంది. అది జాతికి మనం చేసిన అన్యాయం అవుతుంది. కనుక శాస్త్రి గారు.. ఆ ఫారాలు నింపి పంపండి’’ అంది డి.ఈ.ఓ.

ఒక క్షణం ఆలోచించి “సరేనండి. అలాగే పంపిస్తాను” అని ఫోన్ పెట్టేసాడు శాస్త్రి.

కొన్ని రోజులకు శాస్త్రి ఆ బహుమతికి ఎంపిక అయినట్లుగా పేపర్లో వచ్చింది. అది చూసిన శాస్త్రి వెంటనే ఇంటికి వెళ్లి తల్లి తండ్రికి పేపర్ చూపించి వారి కాళ్లకు దండం పెట్టాడు. చుట్టూ పక్కల ఊర్లో శాస్త్రి పేరు మారు మ్రోగిపోయింది.

అవార్డు తీసుకోటానికి ఢిల్లీకి వెళ్లి అది తీసుకుని తిరిగి వచ్చాడు శాస్త్రి. అతని పేరు ప్రతి వార్త పత్రికల్లో, అన్నిటీవీల్లో వచ్చింది.

***

కొన్ని నెలల తర్వాత, ఒక రోజు స్కూల్ నుండీ రాగానే కాఫీ తాగి భార్యను పిలిచాడు శాస్త్రి .

“ఏంటీ, అలా దిగులుగా ఉన్నారు?” అంది పావని , భర్త మొహం చూసి.

“వచ్చే నెల నా రిటైర్మెంట్” అన్నాడు శాస్త్రి.

భర్త కేసి తేరిపార చూసింది పావని. వెంట్రుకలన్నీ నెరిసిపోయాయి. మొహం నీరసంగా వుంది.

“అలసిపోయారు. చాలా పని చేశారు జీవితమంతా. ఇక చాలు.” అని భర్త మొహాన్ని కొంగుతో తుడిచింది.

***

“శాస్త్రి గారు, వచ్చే నెలనే కదా రిటైర్మెంట్? ఇక హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకు గడపడమే.” అంటూ నవ్వాడు ఎదురింటి సుబ్బారావ్.

“అవునండి” బలవంతంగా నవ్వు తెచ్చుకుని ముందుకు నడిచాడు శాస్త్రి.

వెంటనే శాస్త్రి మనసులో దిగులు మొదలయ్యింది.

స్కూల్‌లో ఆఫీస్ గదిలో కూర్చొని గుమాస్తాను పిలిచాడు. కాసేపటికి ఎదురుగా వచ్చి నుంచున్న క్లర్క్ సాయన్నను చూసి మెల్లిగా అడిగేడు “సాయన్నా.. నాకు పెన్షన్ ఎంతొస్తుంది?”

చెప్పాడు సాయన్న.

అది విని దీర్ఘాలోచనలో పడ్డాడు శాస్త్రి.

“సార్.. నేను వెళ్ళనా” మెల్లిగా అడిగాడు సాయన్న.

“అంటే.. సగానికి తక్కువ వస్తుందన్నమాట” సాలోచనగా అన్నాడు శాస్త్రి.

“అవునండి” అని అలాగే నిలబడ్డాడు సాయన్న.

ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తున్న శాస్త్రిని చూసి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సాయన్న.

ఆఖరి గంట కొట్టగానే, అన్యమనస్కంగా అందరితో మాట్లాడి, ఇంటికి బయలుదేరాడు శాస్త్రి.

రాత్రి చపాతీలు తిని, ఆరుబయట మల్లె పందిరి కింద కూర్చున్నాడు శాస్త్రి. కాసేపటికి పావని వచ్చి ఇంకొక కుర్చీలో కూర్చుంది.

నీరసంగా కూర్చున్న భర్త ని చూసి “ఏవిటండీ.. నెల నుండీ చూస్తున్నాను, ఎందుకు అదొలాగ ఉంటున్నారు. స్కూల్‌లో ఏదైనా సమస్యా?” అంది.

“ఏవిటన్నావ్?” అడిగాడు శాస్త్రి ఆలోచనల నుండి తేరుకుని.

“అదే ఈమధ్య అదోలా వుంటున్నారు, ఎందుకు?” అడిగింది మళ్ళీ.

“ఏమీ లేదోయ్.. చిన్న దాని పెళ్ళికి నా కొచ్చే పీ.ఎఫ్., గ్రాట్యుటీ వగైరాలు సరిపోతాయి. ఇక చిన్నవాడి చదువు మరో మూడు సంవత్సరాలయితే అయిపోతుంది. రిటైర్మెంట్ ఇంకొంత కాలం తర్వాత ఉంటే బాగుండేది.” అన్నాడు.

‘‘కొందరు విద్యార్థులకు మీరే ప్రతీ నెల, మీ జీతం నుండీ ఫీజులు కడుతూ వస్తున్నారు.. ఇక అలాంటప్పుడు మన దగ్గర ఏం మిగులుతుంది?” అంది పావని.

మళ్ళీ శాస్త్రి మనసులో బాధ అలుముకుంది.

“బ్యాంకులో ఎంతుంది?” అన్నాడు తనలో తాను గొణుక్కుంటూ.

“ఏదో.. వెయ్యి ఉంటుందనుకుంటా” అంది పావని.

మళ్ళీ కళ్ళు మూసుకుని ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు శాస్త్రి. అతనికి కణతల్లో నొప్పి మొదలైంది

నెల రోజులుగా సరిగా అన్నం సహించలేదు శాస్త్రికి. నీరసంగా కనపడసాగాడు. మనసంతా దిగులుతో నిండిపోయింది.

ప్రతి రోజూ చుట్టూ పక్కల ఊర్లలో వున్న సహోద్యోగులు, అధ్యాపకులు వచ్చి కలిసి పదవీ విరమణ అభినందనలు చెప్పసాగారు. వారి ముందు నవ్వుతున్నాడు కానీ మనసు లోపల ఏదో తెలియని దుఃఖం అలుముకుంది.

ఆఖరున, ఆ రోజు పదవీ విరమణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. పై అధికారులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు శాస్త్రి జీవితాన్ని, అతను చేసిన మంచి పనులను అభినందించి, బోలెడు శాలువాలతో, పూల దండలతో ముంచెత్తారు.

అంగరంగ వైభవంగా సభ జరిగింది. పైకి నవ్వుతున్న శాస్త్రి మనసులో దిగులు మాత్రం తగ్గలేదు.

ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న శాస్త్రి, ధోవతి కట్టుకుని మంచం పైకి చేరుకున్నాడు.

“మీరు చాలా అదృష్టవంతులు. మీకు జరిగినట్లుగా పదవీ విరమణ కార్యక్రమం ఎప్పుడూ, నేను ఎవరికీ చూడలేదు” గర్వంతో అంది పావని.

అతని భుజం మీద తల ఆనించి, కాసేపట్లోనే తృప్తిగా నిద్ర పోయింది. మెల్లిగా పక్కకు జరిగి వచ్చేనెల పెన్షన్ మొత్తం గురించి ఆలోచించసాగాడు శాస్త్రి.

పూర్తి జీతం వస్తే ఇంట్లో ఖర్చులు గడుస్తున్నాయి. ‘ఇక మీదట సగంతో ఎలా నెట్టుకు రావాలి?’ అనే ఆలోచనలతో సతమతమవ్వసాగాడు. ఎటు వేపు తిరిగి పడుకున్నా నిద్ర పట్టటం లేదు. ఎలా చేయాలి?, రేపటి నుండీ ఖర్చులు తగ్గించాలి అనుకున్నాడు.

అమ్మ, నాన్నా, పావని, తన మందులు తప్పించి మిగిలిన ఖర్చులు తగ్గించాలి. ఇక సంవత్సరం వరకూ బట్టలు కొనరాదు. బయట టీలు త్రాగరాదు అని అనుకున్నాడు.

‘చిన్నవాడి హాస్టల్, కాలేజీ ఫీజు ఇంకో మూడు సంవత్సరాలు కట్టేస్తే చాలు, ఇంక తర్వాత పెన్షన్‌తో ఎలాగయినా పెద్ద కష్టం లేకుండా జీవితం నెట్టుకు రావచ్చు’ అనుకున్నాడు. కానీ ఈ మూడు సంవత్సరాలు ఎలా? అన్న ఆలోచనలతో లేచి కూర్చున్నాడు. నిద్ర పట్టటం లేదు శాస్త్రికి. దేవుడి గది లోకి వెళ్లి అక్కడున్న అందరూ దేవుళ్ళకు మొక్కాడు.

హాల్‌లో నిద్ర పోతున్న అమ్మ, నాన్నలను చూసి మనసులో మొక్కుకున్నాడు..

తిరిగి మంచం మీద పడుకుని ‘భగవంతుడా రేపటి నుండి నీవే దిక్కు. నీదే భారం’ అని మొక్కుతూ కళ్ళు మూసుకుని నిద్రకు యత్నించాడు

రాత్రంతా దేవుడిని తలూస్తూనే వున్నాడు. తెల్లవారుజామున నిద్ర పట్టింది. నిద్రలో కూడా అతడి కళ్ళ లోనుండీ కన్నీళ్లు కారాయి..

మంచి నిద్రలో పావని పిలుపుతో మెలకువ వచ్చింది శాస్త్రికి. కళ్ళు తెరిచాడు. నిద్రలేమితో కళ్ళు మంటగా అనిపించాయి.

“మీ గురించి ఎవరో వచ్చారు చూడండి. సమయం తొమ్మిది. భలే నిద్ర పోయారు” అంది.

“కూర్చోపెట్టు.. వస్తాను” అని లేచి పెరట్లోకి వెళ్లి అరగంటలో కాలకృత్యాలు తీర్చుకుని వచ్చాడు.

ముందు గదిలో కూర్చున్న వ్యక్తి లేచి నమస్కారం చేసి “సార్ మీ గురించి మా అయ్యగారు రత్నయ్య, మన ఎమ్మెల్యే గారు వచ్చారు. బయట కార్లో వున్నారు.. మీరు సరేనంటే లోనికి తీసుకొస్తాను” అన్నాడు.

అది విని బిత్తరపోయిన శాస్త్రి. “అరే.. బయట ఎందుకున్నారు.., లోనికి రమ్మను” అని చెప్పి అక్కడున్న కుర్చీలు సరి చేసాడు..

కొద్ధి సేపటిలో రత్నయ్య, ఆ ఊరి ఎమ్మెల్యే రాజా గారు లోనికి అడుగు పెట్టి శాస్త్రికి వినయంగా నమస్కారం చేశారు.

రత్నయ్య చేతులు కట్టుకుని కూర్చుని “సార్! నేను రత్నయ్య, మీ విద్యార్థిని సార్,. వీరేమో మన ఎమ్మెల్యే రాజా. సార్. పదవ తరగతిలో మేమిద్దరం మీ విద్యార్థులం సార్. ఆ సంవత్సరం నాకు స్కూల్ ఫీజు తక్కువయితే మీరు ఇచ్చారు. మళ్ళీ తిరిగి ఇస్తే తీసుకోలేదు.” అన్నాడు.

కళ్లద్దాలు సరి చేసుకుని వాళ్ళిద్దరినీ తేరిపారా చూసాడు శాస్త్రి. అసలు గుర్తు పట్ట లేక పోయాడు. “అలాగా బాబు.. ఏమీ అనుకోకండి.. చాలా కాలం గడిచింది కదా.. గుర్తురావటం లేదు” అన్నాడు శాస్త్రి చిరునవ్వుతో.

“సార్ నాకు రెండు సంవత్సరాల పాటు పుస్తకాలన్నీ మీరే ఇప్పించారు. అప్పుడు మేము బీదరికంలో మునిగి వున్నాం సార్” అన్నాడు ఎమ్మెల్యే రాజారావు. అలా చెప్తున్నప్పుడు అతని కంటి చూపుని సన్నని కన్నీటి పొర కప్పేసింది. జేబులోనుండీ తెల్లని రుమాలు తీసి కళ్ళు తుడుచుకున్నాడు రాజారావు.

“మీరు చేసిన సహాయం, మాకు ప్రత్యేకంగా మీరు క్లాసులు తీసుకుని చెప్పిన చదువు, మేమెప్పుడూ మరువలేం సార్” అన్నాడు రత్నయ్య.

అది వినగానే శాస్త్రి మొహం సంతోషంతో విప్పారింది. మనసులో గూడు కట్టుకున్న దిగులు ఎటో యెగిరి పోయింది. సంతోషంలో అన్నీ మరచి పోయాడు.

“చాలా సంతోషం బాబు. మీరు పెరిగి మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చారు. అంతా భగవంతుడి దయ. నేను నా ఉద్యోగ ధర్మాన్ని పాటించాను.” అన్నాడు తృప్తిగా.

“మీతో చిన్న పని మీద వచ్చాము సార్., ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్‌లో స్థిరపడ్డాను. ఇక్కడ పక్క ఊరిలో, బీద విద్యార్థులకు సరస్వతి విద్యాపీఠ్ అనే ఇంగ్లీష్ కళాశాల స్థాపించాను.” అని చెప్పటం ఆపాడు రత్నయ్య.

“నాకు నిన్ననే పదవీ విరమణ అయ్యింది బాబు. నేనేం చెయ్యగలనిప్పుడు. అయినా చెప్పండి నాకు చేతనయ్యింది చేస్తాను” అన్నాడు శాస్త్రి.

“అది తెలిసే వచ్చాము సార్. మా కళాశాల ప్రిన్సిపాల్‌గా మీరుండాలి. మీరే దానికి అర్హులు. చాలా మంది మీ పేరు చెప్పారు. పైగా మీరు మా గురువులు. దయ చేసి మీరు రావాలి. ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టాము కనుక ఎక్కువ ఇచ్చుకోలేము. ప్రస్తుతానికి యాభై వేలు ఇస్తాము సార్.” అన్నాడు ఎమ్మెల్యే రాజా రావు.

ఆశ్చర్యంతో నోట మాట రాలేదు శాస్త్రికి. విస్తుపోయి చూస్తూ వుండిపోయాడు. ‘అంటే దాదాపుగా మళ్ళీ రేపటినుండి పెన్షన్‌తో కలిపితే పూర్తి జీతం వస్తుంది.’ అనుకున్నాడు మనసులో

శాస్త్రి మౌనంగా వుండటం చూసి అన్నాడు రత్నయ్య “సార్ మీరు దయ చేసి ఒప్పుకోవాలి’’ అన్నాడు.

“మీకు తెలుసో తెలీదో, నాకు కాలేజీ నడిపిన అనుభవం ఏమీ లేదు. మీరు పొరబడ్డారు. నేను కాలేజీ ప్రిన్సిపాల్‌గా చేయటం కష్టం” అన్నాడు శాస్త్రి.

“పరవాలేదు సార్, మేమన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తాము. మీరు అక్కడ సీట్లో కూర్చుంటే చాలు. ప్రతీ రోజు కాలేజీ జీప్ వొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీ లాంటి గురువులు దొరకటం మా అదృష్టం.. మీరు కాదనకండి. ఇదుగో అడ్వాన్స్‌గా లక్ష రూపాయల చెక్. మీ మీద మాకు పూర్తిగా నమ్మకం వుంది. నిన్ననే రిటైర్ అయ్యారుగా, సార్, వారం తర్వాత మీరు కాలేజీకి రండి” అని చెప్పి నిలబడ్డారు.

జరుగుతున్నదంతా విని కలో నిజమో తెలీని పరిస్థితిలో సరేనంటూ తలూపాడు శాస్త్రి.

సంతోషంతో వాళ్ళు ఇద్దరూ లేచి రెండు చేతులెత్తి నమస్కారం చేసి బయటకు అడుగులు వేశారు.

తృప్తిగా నవ్వుతూ ఎదురుగా నిలబడ్డ పావని కేసి చూసి “రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్‌తో మూడు సంవత్సరాలు బాబు చదువుకు ఎలా సర్దుబాటు చేయటం అని దాదాపుగా రెండు నెలల నుండీ మానసిక వ్యథను అనుభవించాను పావనీ. ఆ దేవుడే పంపించాడు వీళ్ళను.” గద్గద స్వరంతో అంటూ భార్యను పట్టుకుని విలపించసాగాడు శాస్త్రి. ఇన్నాళ్లుగా అతని కడుపులో దాచుకున్న బాధ, దుఃఖం బయటకు తన్నుకుంటూ రాసాగాయి.

“అవునండీ దేవుడికి కళ్లున్నాయి.. ఆయనెప్పుడూ న్యాయాన్ని కాపాడతాడు. మీరు చేసిన మంచితనం మీ వెంట వుంది. మీరు అందరికీ చేసిన సహాయం మిమ్మల్ని కాపాడుతుంది.” అంది శాస్త్రి కళ్ళు తుడుస్తూ.

వారం తర్వాత ఇంటి ముందు ఆగిన కాలేజీ కారెక్కి తృప్తిగా కూర్చున్నాడు శాస్త్రి. కార్ వేగంగా కాలేజీ వేపు సాగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here