[dropcap]ఆ[/dropcap]ధునిక సాంకేతికతని అందిపుచ్చుకుని, తెలుగు వెలుగులను సరికొత్త కిటికీ ద్వారా ప్రసరించడానికి ‘ఆవిర్భవ’ సంస్థ పూనుకుంది. ఇందులో భాగంగా భాగ్యనగరంలో ఈమధ్యన కొన్ని వినూత్న ఆవిష్కరణలు చేసింది ఈ సంస్థ. ఈ సంస్థకు సూత్రధారులు ఇద్దరు ఔత్సాహికులైన దంపతులు శ్రీమతి రచన మరియు శ్రీ శ్రీదత్త.
ఈ సభలో కవి, రచయిత, వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి దుర్గాప్రసాద్ రచించిన కవితల, చిరు వ్యాసాల సంకలనం “అక్షర విలాసం”, గౌరవ అతిథి, ప్రముఖ రచయిత్రి, పత్రికారంగంలో సేవలందిస్తున్న శ్రీమతి జ్యోతిర్మయి గారు ఆవిష్కరించారు.
దేవులపల్లి దుర్గాప్రసాద్ గారి రచనలు, మనసులను తట్టిలేపే మలయమారుతాలని, ‘అక్షర విలాసం’ పుస్తకానికి ముందుమాట రాసిన శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు, ఆవిర్భవ పత్రిక సంపాదకులు అభివర్ణించారు.
ముఖ్య అతిధి శ్రీ రాంపా గారు, ప్రముఖ హాస్య రచయిత, నటుడు, చిత్రకారుడు మాట్లాడుతూ అక్షర విలాసం, అనుభూతుల తోరణమని, తెలుగువెలుగులను మరింత ప్రకాశింప చేసే కవనపు చిరు దివ్వె అని అభివర్ణించారు.
సభలో శ్రీ ఇందూ రమణ గారు, ప్రసిద్ధ రచయిత, శ్రీ సి.ఎస్. రాంబాబు గారు, ప్రముఖ కవి, ఆకాశవాణి అధికారి, శ్రీ శ్రీధర్ చౌడారపు, కవి, రచయిత, డైరెక్టర్, తెలంగాణా ప్రభుత్వ ఎస్. సి. స్టడీ సర్కిల్ మరియు శ్రీమతి మణి గోవిందరాజులు, కవయిత్రి, రచయిత్రి – తమ ప్రసంగాలతో ఆహుతులను అలరించారు.
సభను ఆద్యంతం తమ సమయస్ఫూర్తితో, చక్కని వ్యాఖ్యలతో, సూచనలతో ఉత్సాహవతంగా నడిపించారు శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు.
సభ ప్రారంభంలో ఆహ్వానపు పలుకులు శ్రీ శ్రీ దత్త పలుకగా, చిరంజీవులు హర్షిత, మేఘనలు ప్రార్ధనా గీతం తో నిండుదనం తెచ్చారు.
శ్రీమతి రచన వందన సమర్పణ చేసారు.