అక్షరాల నీడ

4
3

[ఇయర్‍హుక్ 2023 ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ]

[dropcap]“ఇ[/dropcap]దొక్కటీ చదవద్దు” అని వ్రాసి ఉన్న లైన్ దగ్గర అతని కళ్ళు ఆగాయి. మనిషికి ఉండే సాధారణ జిజ్ఞాస వల్ల రవి ముందుకు వెళ్లకుండా ఉండలేకపోయాడు.

పేజీ తిప్పాడు.

“నువ్వు వెతుకుతున్నది నీకు దగ్గరగానే ఉందని తెలిసాక మరణం ఒక్కటే నీకు సుఖమనిపిస్తుంది. అది నేనే నీకు ఇస్తాను.”

రవి కళ్ళు ఒత్తిడితో మూతలు పడుతున్నాయి.

జ్వలిత్ ఎడిటర్ గారికి ఫోన్ చేసాడు.. “సార్! కిందటి వారం మా ఇంట్లోంచి మీకో పుస్తకం పొరపాటున వచ్చింది. అదెక్కడుంది?” అని అడిగాడు.

“మొదటి కాపీతో పాటు ఒరిజినల్ కూడా మన బుక్ డిస్ట్రిబ్యూటర్ రవి తీసుకెళ్ళాడు” అని ఎడిటర్ రామనాథం చెప్పాడు.

“ఓ మై డెవిల్!” జ్వలిత్ తల పట్టుకున్నాడు. “సార్! దయ చేసి ఆ బుక్స్‌ని ఎవరూ చదవకుండా చూడండి” అంటూ ఫోన్ పెట్టేసాడు.

కొద్ది నిమిషాల్లో జ్వలిత్ బైక్ రవి ఇంటి ముందు ఆగింది. కాలింగ్ బెల్ కొట్టి చూసాడు. ఎవ్వరూ రాలేదు. “రవీ తలుపు తియ్యి” అని తోసాడు. తలుపులు తెరుచుకున్నాయి. డాబా మీద గదిలో రవి పడుకుని ఉన్నాడు.

“రవీ! రవీ!” అంటూ తట్టి లేపాడు. అతనిలో చలనం లేదు. జ్వలిత్ కళ్ళలో బాధ, భయం రెండూ రెట్టింపయ్యాయి. వెంటనే ఆంబులెన్స్ రప్పించి అతణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేసాడు.

రవి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, వారు వచ్చేంత వరకూ అక్కడే ఉన్నాడు. ఏదో షాక్ వల్ల స్పృహ కోల్పోయి ఉండొచ్చు అని డాక్టర్ చెప్పాడు.

అందరూ హాస్పిటల్లో ఉండగా జ్వలిత్ మళ్ళీ రవి ఇంటికి వెళ్ళాడు. పుస్తకాల కోసం వెతికాడు. రవి పడుకున్న మంచం కింద చూసాడు. ఒరిజినల్ పుస్తకం దొరికింది.

రివర్స్ ఉన్న త్రిభుజం, దాని చుట్టూ వింత గుర్తులు. రవి ఆ పుస్తకాన్ని చదివినట్టున్నాడు. అంటే ఆ పుస్తకం ఇచ్చిన వ్యక్తి చెప్పిందంతా నిజమేనా?..

ఫస్ట్ కాపీ డైనింగ్ టేబుల్ కింద దొరికింది. ఆ రెండు పుస్తకాలు బ్యాగులో పెట్టుకుని బయటికి వెళ్ళాడు.

ఇంతలో సత్య ఫోన్ చేసింది.

“మర్చిపోయావా? ఫస్ట్ కాఫీ డేకి రా” అంది. ఇక తప్పదన్నట్టు బైక్ కాఫీ డే వైపు తిప్పాడు.

జ్వలిత్ కాఫీ తాగకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు.

“ఏమైంది” అని అడిగింది సత్య. “ఏం లేదు. ఇప్పుడే ముఖం కడుక్కుని వస్తాను” అని రెస్ట్ రూం దగ్గరికి వెళ్లాడు.

ముఖం మీద నీళ్ళు చల్లుకోవాలని సింక్ వైపు వంగాడు.

ఎవరో గట్టిగా మెడను వంచిన ఫీలింగ్. నీళ్ళు వేగంగా తల మీద పడుతున్నాయి. గట్టిగా ఊపిరి పీల్చుకుని చేతుల్ని ఆడించాడు. ఎవరో ఉన్నట్టు స్పర్శ తెలిసింది. మరుక్షణం బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు.

అద్దంలో దుప్పి కొమ్ముల లాంటి నీడ కనిపించి కదిలిపోయింది. వెనక్కి తిరిగి అడుగుల తడి చూస్తూ బయటికి నడిచాడు.

“జ్వలిత్! ఎక్కడికి” అంటూ సత్య ఆపడంతో అతడికి ఒళ్లు జలదరించింది. “ఏంటి దువ్వుకోకుండా వచ్చేసావ్” అంటూ అతడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టింది.

“గౌహతి వెళ్లి వచ్చినప్పటినుంచీ నన్నెవరో వెంబడిస్తున్నారనిపిస్తోంది” అని మెల్లిగా గొణిగాడు.

“అవునా. సరే పద. బైక్ నేను చెప్పిన చోట ఆపు” అని చెప్పి అతణ్ణి హత్తుకుని కూర్చుంది సత్య.

భయంతో అతడికి పట్టిన చెమట గాలికి ఆరుతోంది. ఓ ఖరీదైన బంగ్లా ముందు ఆపమని సత్య చెప్పింది.

“ఈవిడ బెస్ట్ ఫార్చ్యూన్ టెల్లర్ అని అందరూ చెబుతుంటారు. ఒక్కసారి కలువు” అంది.

రిసెప్షన్ దాటి గదిలోకి వెళ్ళాడు జ్వలిత్. లోపల తెర జరిపి ఒక వృద్ధ మహిళ వచ్చి కూర్చుంది.

ఓ నీళ్ళ గిన్నెలో ఆమె బంగారు కడియం వేసింది.

అతను ఆశ్చర్యపోతుండగా ఆ నీటిలో ఒక క్రిస్టల్ బాల్ ప్రత్యక్షమయ్యింది. అతడి చేతులు క్రిస్టల్ బాల్ మీద ఉంచి వాటి మీద ఏదో పొడి లాంటిది చల్లింది.

అతని మీద ఒక కాంతి ప్రసరించింది. ఓ పెద్ద నీడ గోడ మీద ప్రతిఫలించి విచిత్రమైన శబ్దం చేసింది. కొమ్ముల నీడ కనిపించగానే జ్వలిత్ ఆ నీడను తాకాలని చేతులు క్రిస్టల్ బాల్ మీద నుంచి తీసివేశాడు. ఆ బాల్ మాయమైంది.

“ఇదే నన్ను వెంటాడుతుంది. ఏంటిది” అన్నాడు జ్వలిత్.

వృద్ధురాలు నవ్వింది. “నీది కానిది ఏదో నీ దగ్గరకు చేరింది. దాన్ని వదులుకుంటే గానీ నువ్వీ సమస్యలోంచి బయటపడవు” అంది. జ్వలిత్ బ్యాగ్ వైపు చూసాడు.

“కానీ.. ఇది నాకు దొరికిన అవకాశం.” జ్వలిత్ నీళ్ళు నములుతూ అన్నాడు.

“నా చేతికివ్వు” అంది ఆ వృద్ధురాలు. అతను బ్యాగ్ లోంచి ఫస్ట్ కాపీని తీసి ఆమెకిచ్చాడు. “ఇదేనా? ఇంకేమీ లేదా?” అందామె.

“ఇదే. గౌహతిలో ఒకరు నాకిచ్చిన పుస్తకాన్ని నా పేరుతో తెలుగులో అచ్చు వేయాలి అనుకున్నాను. ఆ పుస్తకం పూర్తయినప్పటినుంచీ నన్ను ఎవరో వెంటాడుతున్నట్టనిపించింది. ఇంతలో నాకు తెలీకుండా పుస్తకం ప్రింటింగ్ జరగడం, అది చదివిన మొదటి వ్యక్తి హాస్పిటల్ పాలవ్వడం జరిగింది. నాకేమీ అర్థం కావట్లేదు” అని జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాడతను.

వృద్ధురాలు పుస్తకంలోని గుర్తులు చూసింది. “ఇదిగో ఈ సంజ్ఞ మొదటగా మనిషిలోని చేతనా శక్తిని ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇదే నీ మిత్రుడు ప్రయత్నించి ఉంటాడు” అని ఓ గుర్తును చూపించింది.

రవి మంచం కింద గీసుకున్న గుర్తు. రివర్స్ ఉన్న త్రిభుజం. పైన ఒక రేఖ. వృద్ధురాలు ఒక పెయింటింగ్ తీసుకుని వచ్చింది. అందులో ఒక పురుషుని ఛాతీ నుంచి నాభి వరకూ ఉన్న త్రిభుజం, నాభి కింద గీసిన రేఖ నుంచి శక్తి భూమిలోకి వెళ్ళడం చిత్రీకరించబడి ఉంది.

జ్వలిత్ తల భారంగా అనిపించింది. “ఇంతకూ ఇదంతా ఏంటి” అని అడిగాడు. “ముందు ఈ పుస్తకం నీకు ఎవరిచ్చారో, ఏం చెప్పారో అది చెప్పు” అందామె.

“ఇండో- యూరోపియన్ సమాజంలో ఉన్న ఆఫ్రికన్ బానిస తెగ గురించిన పుస్తకం అది. అందులో వారు ఎలా ఈ దేశానికి తీసుకుని రాబడ్డారో, తూర్పు భారతంలో ఎలా జీవించేవారో, వాళ్ళ తెగ ఎలా అంతమైందో ఉంది. ఆ పుస్తకం చదవమని ఇచ్చి ఒకతను మళ్లీ రాకుండా వెళ్ళిపోయాడు. దాన్నుంచి నేను కథను తెలుగులోకి వ్రాసుకున్నాను” అని చెప్పాడు.

“మూర్ఖుడా! నువ్వు వ్రాసుకుంది వారి గతం కాదు. భవిష్యత్తు కోసం వారి ప్రణాళిక. నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొందరు పేగన్ దేవతలను (Pagan Gods) ఆరాధించే వారు ఎన్నటికీ తమకు అంతం ఉందని ఒప్పుకోరు. వారి మంత్రశక్తి, కర్మలను ఉపయోగించి ఎలాగైనా వారి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇప్పుడు నీ ద్వారా Horned God నిద్ర లేచాడు. ఒక శరీరం అతడికి అర్పించడం కోసమే వాళ్ళు నిన్ను ఎంచుకున్నారు. వారిక్కావాల్సిన విషయం జరిగే వరకూ ఆ కొమ్ముల నీడ నిన్ను విడువదు. ఇప్పుడే నేను దీన్ని నాశనం చేస్తాను” అందామె.

జ్వలిత్‌కు ఇదేమీ అర్థం కావడం లేదు. మరైతే ఆ ఒరిజినల్ బుక్..

ఇంతలో వృద్ధురాలు తన చిటికెన వేలు గాటు పెట్టుకుని ఆ పుస్తకం మీద చల్లింది. ఆ పుస్తకం భగ్గున మండి బూడిదయ్యింది.

“ఆ వ్యక్తి ఇచ్చింది ఇంకేదైనా నీ దగ్గర ఉందా?” అని ఆ వృద్ధురాలు అడిగింది. “ఒరిజినల్ పుస్తకం కనిపించకుండా పోయింది” అంటూ అబద్ధం చెప్పి తన దగ్గర ఇంకేమీ లేదన్నాడు. “అయితే ఆ పుస్తకంలో ఇచ్చిన ప్రక్రియలు నిజంగా ఫలిస్తాయా?” అన్నాడతను.

“అవును. కానీ ఈ తరహా పేగన్ ఆరాధనలు పూర్తి నమ్మకంతో చేయాలి. అప్పుడే మనం అనుకునేది జరుగుతుంది” అని చెప్పి “ఇక నువ్వు వెళ్లొచ్చు” అందామె.

“మరొక్క విషయం. ఇంతకూ నా చేతుల మీద చల్లిన పొడి ఏమిటి?” అడిగాడతను.

“అదా. అదో పక్షి మలం నుంచి తయారు చేసిన చూర్ణం” అని బదులిచ్చింది వృద్ధురాలు.

జ్వలిత్‍కి వాంతి వచ్చినంత పనైంది. బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చి రెస్ట్ రూంకి పరుగెత్తి చేతులు కడుక్కున్నాడు. “ఇప్పుడంతా ఓకేనా?” అడిగింది సత్య.

“ఏం ఓకేనో ఏంటో. ముందు ఇంటికెళ్ళి స్నానం చేయాలి” అన్నాడతను చిరాగ్గా.

“నేనూ రానా..” అందామె.

“అవునా. వస్తావా” అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడతను.

బ్యాగులో ఉన్న ఒరిజినల్ పుస్తకం గుర్తొచ్చి వెంటనే ఆమెకు క్యాబ్ బుక్ చేసి పనుందని చెప్పి ఇంటికి వెళ్ళాడు.

ఇంటికి వెళ్ళి స్నానం చేసి పుస్తకం టేబుల్ మీద పెట్టి దాని చుట్టూ చాకుతో ఫ్లోర్ మీద అపసవ్యంగా ఉన్న త్రిభుజాలు, వివిధ సంజ్ఞలు గీసాడు. కొవ్వొత్తులు వలయంలా చేసి వెలిగించాడు.

పుస్తకాన్ని చేతుల్లో పెట్టుకుని టేబుల్ మీద పడుకున్నాడు.

“నీది కానిది కోరుకుంటున్నావ్. కీర్తి కోసం నీ నైతికతను చంపుతున్నావ్” అని ఎవరో అన్నట్టు కీచు గొంతు వినిపించింది.

జ్వలిత్‍కు తెలుసు. ఇలా చేస్తే ఆ పేగన్ దేవుడు తనతో మాట్లాడ్డానికి వస్తాడని.

“నేను ఎంతో శ్రమకోర్చి వ్రాసిన మొదటి పుస్తకం మరుగున పడిపోయింది. ఉచితంగా ఇచ్చినా ఒక్కరూ చదవడానికి సిద్ధంగా లేరు.

అలాంటిది ఈ పుస్తకం దొరికాక, దీన్ని తెలుగులో వ్రాసాక ఇది ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుందని అనిపించింది. ఆ పుస్తకాన్ని ముద్రించి వెలుగులోకి తెస్తాను అని గౌహతిలో ఆ పుస్తకం ఇచ్చిన వ్యక్తికి మాటిచ్చాను. అదే చేస్తున్నాను” అని చెప్పాడు.

కీచు గొంతుక మళ్లీ వినిపించింది. “ఆ పుస్తకం వ్రాసిన వారి పేరు వేయలేదేం? అది నీ సొంతం కాదు కదా” అని అడిగిందా గొంతుక. “నాకు దొరికిన అవకాశం నేను వదులుకోలేను. ఈ పుస్తకం సక్సెస్ అయితే నాకొచ్చే పేరుతో నేను ఏ హాలీవుడ్ సినిమాలో వెళ్ళిపోతాను” అన్నాడు.

అన్ని కొవ్వొత్తులూ ఆరిపోయాయి. ఒక్కటి మాత్రమే అతి కష్టం మీద వెలుగుతోంది.

చాలా సేపు గడిచింది. కళ్ళు తెరిచి చూసాడు. పుస్తకం కింద పడింది. కిందికి దిగాలని చూసాడు. కాళ్ళు రెండూ టేబుల్ మీద ఇనుప గొలుసుతో కట్టేసి ఉన్నాయి. ఎదురుగా కొమ్ములతో మనిషి ఆకారం. తల లేని మొండెం. తల ఆకారం దాల్చుతోంది.

“నో. నువ్వు ఈ వలయంలోకి రాలేవు. ఇదంతా భ్రమ” అంటూ తన చెంపల మీద చేతుల్తో కొట్టాడు. భయంతో జారిన కన్నీళ్లు టేబుల్ మీద పడ్డాయి.

ఎవరో తన చేతుల్ని వెనక్కి మడిచారు. హా.. ఎముకలు విరిగేంత నొప్పి.

“నాయకా! మీ కోసం మా ఎదురుచూపు ముగిసింది. మమ్మల్ని అనుగ్రహించండి” అంటోంది ఎవరిదో ఆడ గొంతుక. ఆ కొమ్ముల ఆకారం పక్కనే వృద్ధురాలు, సత్య ఉన్నారు.

“సత్యా! థాంక్ గాడ్. నా చేతులు వెనక్కి తిప్పి కట్టేసారు. ప్లీజ్ హెల్ప్ మీ” అన్నాడు.

“నువ్వు తెలివైనవాడినని అనుకుంటున్నావా? నువ్వు చదివిన పుస్తకం హూడూ మ్యాజిక్‍తో నిండింది. నమ్మితే మాత్రమే హూడూ పని చేస్తుంది. నువ్వు నమ్మనంత వరకూ నిన్నెవ్వరూ తాకలేరు. కానీ అతి తెలివితో, పేరాశతో నువ్వే ఆ మ్యాజిక్ ని ఆశ్రయించావు..” అని నవ్వింది వృద్ధురాలు.

“అంటే! ఈ వలయం నన్ను రక్షించదా? మోసం. నన్ను నమ్మేట్టు చేయడానికి ద్రోహం చే..” అతని మాటలు పూర్తి కాకముందే పేగన్ దేవుని శక్తి అతడి శరీరాన్ని ఆక్రమించుకుంది.

జ్వలిత్ ఆత్మ పుస్తకంలో బంధించబడింది. జ్వలిత్ శరీరంలోని ఆ పేగన్ దేవుడు కళ్ళు తెరిచాడు.

“విక్రూర్ నాయకా! మా ప్రణామాలు స్వీకరించండి” అంటూ వృద్ధురాలు, సత్య అతని ముందు మోకరిల్లారు.

గోడకున్న పెద్ద అద్దం మీద జ్వలిత్ ముఖం కనిపించింది. అతడి కొమ్ములు ప్రకాశంగా మెరుస్తున్నాయి. వాటి కాంతి పుస్తకంలోని అక్షరాల మీద పడింది.

“నువ్వు వెతుకుతున్నది నీకు దగ్గరగానే ఉందని తెలిసాక మరణం ఒక్కటే నీకు సుఖమనిపిస్తుంది. అది నేనే నీకు ఇస్తాను.”

ఆ అక్షరాల నీడ ఆ గది మొత్తం ప్రతిఫలించింది. దూరంగా అడవిలో ఎక్కడో ఒక తెగ కొత్త బలి ప్రక్రియను ఆరంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here