పరిశోధక విమర్శకుడు జి. చెన్నకేశవరెడ్డి

0
2

[box type=’note’ fontsize=’16’] “చెన్నకేశవరెడ్డిలో ఒక అన్వేషకుడు, ఒక పరిశోధకుడు, ఒక విమర్శకుడు దాగివున్నారు. తులనాత్మక పరిశీలనలోనయినా, ప్రాంతీయ చరిత్రలోనయినా, వారి పరిశోధనా దృష్టి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది” అంటూ ‘అక్షరన్యాసం’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్‌కుమార్. [/box]

[dropcap]తె[/dropcap]లుగు కవిత్వంలో భాషా ఛందోః పరిశీలన చేసేవారు ఒక్కొక్కరు కనుమరుగవుతున్న దశలో మనకు ఆశాకిరణంలా కనిపించే వ్యక్తి ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి. కవిత్వంలోని అన్ని ప్రక్రియలను విశ్లేషించే సామర్థ్యం వున్నప్పటికీ, వారి అభిమాన పరిశోధనా విషయం గేయ కవిత్వం కాబట్టి ఎక్కువ వ్యాసాలను గేయ రచనలను విశ్లేషించడం కనిపిస్తుంది. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని వారు సూచిస్తారు.

తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీలలో సుదీర్ఘకాలం పనిచేసిన రెడ్ది గారు – వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా అనేకానేక పరిశోధనా వ్యాసాలను రచించారు. గత ఇరవై ఏళ్ళ కాలంలో ప్రచురించిన వ్యాసాలతో ఇప్పుడు కొత్తగా “అక్షరన్యాసం” అనే సాహిత్య వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ఇందులో గేయ కవిత్వం, నాటికలు, వచన కవిత్వం, పద్య కవిత్వంపై రాసిన వ్యాసాలతో పాటు భిన్నమైన అంశాలతో రాసిన విమర్శనాత్మక వ్యాసాలు కూడా వున్నాయి.

ఏ వాగ్గేయకారుని కృతులయినా ఛందశ్శాస్త్ర లక్షణాన్ని అనుసరించి గతుల నిర్ణయం చేయడం సాధ్యం కాని పని. త్యాగరాజ కృతులకు ఇది మరీ కష్టం అంటూనే ఏ ఏ రచనా విశేషాల వల్ల త్యాగరాజ కృతులకు నాదమాధుర్యమబ్బినదో తెలియజేస్తూ ధాతు కల్పనలోనే కాక, మాతు కల్పనలో కూడా త్యాగరాజు మహోన్నతుడని కొనియాడారు.

పల్లా దుర్గయ్యగారు పద్యాన్ని ఎంత ప్రౌఢ గంభీరంగానూ, కొన్ని చోట్ల సుమధురంగాను, సుమ సుందరంగానూ నడిపినట్లే – గేయాన్ని కూడా అంతే దక్షతతో నడిపిన సిద్ధహస్తులని, వారు రచించిన “పారిజాతాపహరణ గేయ ప్రబంధం”, “పాలవెల్లి” గేయకావ్యాల ఆధారంగా నిరూపించారు.

సినారె గారికి ఎక్కువగా పేరు తెచ్చింది గేయ రచనలు, సినిమా పాటలే. ప్రధానంగా గేయకవి అయిన సినారె గేయ కవిత్వంలో వివిధ ప్రక్రియలు సృజించారు. “సినారె గేయానికి బృహత్కావ్య గౌరవాన్ని కలిగించడమే కాక, పద్య రచనలో పూర్వకవులు చూపించినంత వైవిధ్యాన్ని, తానొక్కరే గేయ కవిత్వంలో చూపించారు. ముఖ్యంగా తెలుగు భాషలో సాధ్యమైన లయ విన్యాసాలన్నింటిని కొల్లగొట్టారు” అనడం అక్షర సత్యాలే. తెలుగులో గజల్‌కున్న అన్ని నియమాలను పాటిస్తూ, తఖల్లూస్‌తో సహా ప్రవేశపెట్టిన కీర్తి సి.నారాయణరెడ్డి గారికే చెందుతుంది. అయితే గజల్ అంటేనే ప్రేయసితో రహస్య సంభాషణ. ప్రేయసీ, విరహం, మధువు లాంటి వాటి జోలికి పోకుండా, తన గజళ్ళలో మానవీయ దృక్పథాన్ని, ప్రగతిశీలాన్ని, మెత్తని అధిక్షేపాన్ని ప్రవేశపెట్టారని తెలియజేస్తారు.

కృష్ణశాస్త్రి రేడియో నాటకాలను భక్తి రసాత్మకాలు, చారిత్రకాలు, సాంఘికాలు అని విభజించుకున్నా, ఏ నాటిక ప్రత్యేకత ఆ నాటికదే. వస్తువులోనూ, రచనా నిర్వహణలోనూ ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకున్న నాటికలని చెబుతారు.

తిరుమల శ్రీనివాసాచార్య “తెలుగు గేయ నాటికలు” మిద చేసిన పరిశోధనా సిద్ధాంత గ్రంథంలో, గేయ నాటికలలోని గేయగతుల అందచందాల రహస్యాలను విప్పి చెప్పారని తెలియజేస్తారు.

“అమ్మంగి వేణుగోపాల్ సంగీత రూపకాలు”లో తెలంగాణ వైతాళికుల మీద రాసిన పాటలకు చిరువ్యాఖ్యానాన్ని జోడించి ‘తెలంగాణ భారతి’ రూపకాన్ని రాశారు. గోలకొండ సామ్రాజ్య దశ నుంచి ప్రజాస్వామ్య దశకు చేరిన ఆ పరిణామాన్ని ‘గోలకొండ వైభవం’ అనే చారిత్రకాత్మక గేయ నాటకంలో చక్కగా సూచించారని తెలియజేశారు.

వస్తువు మారినప్పుడల్లా రూపం మారుతుంది. అయినా వస్తువులో వచ్చిన మార్పును గుర్తించినంత తేలికగా రూపంలో వచ్చిన మార్పును గుర్తించలేము. తెలుగు కవిత్వం ప్రధానంగా పద్యం, గేయం, వచనం అనే మూడు రూపాల్లో వెలువడినా వస్తు వైవిధ్యం వల్ల అభివ్యక్తి అనంతముఖాలుగా వెలువడిమ్దని “యాభై ఏళ్ళ తెలుగు కవిత్వం – వస్తు రూప వైచిత్రి”లో వివరించారు.

దాశరథి కవితావాహిని పద్యం, గేయం, వచన కవిత అనే మూడు రూపాల్లోనూ ప్రవహించింది. దాశరథి మొదట పద్యరూపంలోనే కవిత రాశారు. దానికి కారణం దాశరథి కలం పట్టిన కాలాన తెలంగాణ కవులకు పద్యరూపం తప్ప, మరో రూపం పరిచయం కాలేదు. దాశరథి మొదట పద్యరూపంలో, ఆ తర్వాత గేయ, వచన కవితా రూపాల్లో కవిత రాసినా పద్యరూపాన్ని విడిచిపెట్టలేదు. దాశరథి తన కవితల్లో ‘అతి వేగం’ వుందని పేర్కొన్నాడు. దాశరథి ఈ అతివేగవంతమైన కవితాధారను మూడు కవితా రూపాల్లో ఎలా సాధించాడో ఉదాహరణలతో సహా నిరూపించారు. మట్టిని గురించి, మట్టి మనుషులను గురించి, మట్టిలో పుట్టిన సమస్త సంపదలూ అందరికీ సమానంగా చెందాలనే ‘భూమి స్వప్నం’ లోని వస్తుశిల్పాలను మరో వ్యాసంలో విశ్లేషించారు.

విజ్ఞాన సర్వస్వాల నిర్వచనం, పాశ్చాత్య విజ్ఞాన సర్వస్వాలు, భారతీయ భాషల్లో విజ్ఞాన సర్వస్వాలు, తెలుగు విజ్ఞాన సర్వస్వాల గురించి తెలియజేస్తూ తెలుగులో విజ్ఞాన సర్వస్వాల కొరత వుండనీ, వున్న వాటిని అప్‌డేట్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తారు.

తర్వాత “జీవిత చరిత్రలు” అంటే ఏమిటో నిర్వచించి, అవి ఎలా వుండాలో చెబుతూ, ఇప్పటివరకు తెలుగులో వచ్చిన జీవిత చరిత్రల గురించి తెలియజేశారు. అయితే స్కెచ్, గల్పిక గురించి తెలియజేసే వ్యాసాన్ని విడిగా ఇవ్వకుండా ఇందులో కలిపేయడం విచిత్రం. ఈ రెండు వ్యాసాలు ఆచూకీ సేవల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాయి.

గద్వాల సంస్థానాధీశులు తెలుగు సాహిత్యాన్ని, కళలను పోషించిన విధానం తెలియజేస్తూ “విద్వద్గద్వాల విశిష్టత”ను కొనియాడారు. ప్రపంచ తెలుగు సాహిత్య సభల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన “జోగులాంబ గద్వాల జిల్లా సాహిత్యాన్ని” పునశ్చరణ చేసుకోవడం మరో వ్యాసంలో కనిపిస్తుంది. ఈ రెండు వ్యాసాలు ప్రాంతీయ చరిత్రను – సాహిత్యాన్ని తెలియజేస్తాయి.

వేమన పద్యాలలోని అంతరార్థాన్నీ, తత్త్వాన్నీ మనసుకు పట్టించుకుని, తాను పొందిన అనుభూతిని అనుమాండ్ల భూమయ్యగారు “వేమన అనుభవసారం”గా వెలువరించారు. తర్వాత రవ్వా శ్రీహరిగారితో గల స్నేహానుబంధాన్ని వివరిస్తూ, వారు రచించిన “అన్నమయ్య నవ్వులు” అనే పుస్తకాన్ని విశ్లేషించారు. “రామప్ప రచన” అనే వ్యాస సంపుటిలోని రామప్పలో ఆళ్వారుస్వామి అగుపిస్తాడు. ఆళ్వారుస్వమి అన్ని రచనల్లో కంటే ఇందులోనే ఆయన వ్యక్తిత్వం, ఆశయాలు, వివిధ విషయాల పట్ల ఆయన దృక్పథం, అభిప్రాయాలు కనిపిస్తాయి. ఇది పదహారు కథల సంకలనం. ఒక్కొక్క కథనంలో కొన్ని సమస్యలు, అన్యాయాల చిత్రణ – వాటి పట్ల రామప్ప చేసిన రభసను చూపిస్తారు.  ఈ మూడు వ్యాసాలలో ఆయా రచయితల హృదయ విశ్లేషణ కనిపిస్తుంది.

‘కృషీవలుడు’, ‘కాపుబిడ్డ’ కావ్యాల పేర్లకు తగినట్టుగా మొదటిది సంస్కృత భాషా ప్రాబల్యంతో వ్రాయబడిన శైలిలో, కావ్య భాషల మర్యాదల ననుసరించి రచితమైనది కాగా, కాపుబిడ్డ తెలుగు భాషా ప్రాబల్యంతో అందునా తెలంగాణ పలుకుబడిని పుణికి పుచ్చుకుని, దేశఛందస్సులలో రచితమైన కావ్యమని తెలియజేశారు.

“విప్రనారాయణ”, “భార్యాభర్తలు” అనే రెండు చిత్రాలను ఎంతో తెలివిగ పడుగుపేకల్లా పకడ్బందీగా అల్లి “బుద్ధిమంతుడు” అన్న చిత్రాన్ని నిర్మించారని నిరూపించారు. ఈ రెండు వ్యాసాలు విమర్శకుడి ఆలోచనాత్మక పరిశీలనకు నిదర్శనంగా నిలుస్తాయి.

వీటితో పాటు తెలంగాణ తేజోమూర్తులు కాళోజీ, ముకురాల రామారెడ్డి, ఉత్పల సత్యనారాయణాచార్య, తిరుమల శ్రీనివాసాచార్య పై రాసిన వ్యాసాలున్నాయి. ఎస్.వి.రామారావు, నోముల సత్యనారాయణ, వేణు సంకోజు, వి.ఆర్. విద్యార్థిలపై వచ్చిన అభినందన సంచికలకు రాసిన వ్యాసాలలో ఆత్మీయత, ఆర్ద్రత కనిపిస్తుంది. గడియారం రామకృష్ణ శర్మ, బిరుదురాజు రామరాజు, పొత్తూరి వెంకటేశ్వరరావులపై రాసిన ప్రశంసాపత్రాలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.

కవిత్వంలోనే కాదు, వచన రచనల విశ్లేషణలో కూడా చెన్నకేశవరెడ్డి ప్రతిభను మనం ఈ వ్యాసాలలో చూడవచ్చు. చెన్నకేశవరెడ్డిలో ఒక అన్వేషకుడు, ఒక పరిశోధకుడు, ఒక విమర్శకుడు దాగివున్నారని ఈ వ్యాసాలను బట్టి మనం గ్రహించవచ్చు. తులనాత్మక పరిశీలనలోనయినా, ప్రాంతీయ చరిత్రలోనయినా, వారి పరిశోధనా దృష్టి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏదో ఒక కొత్త విశేషాన్ని తెలియజేయాలన్న తపన వారిలో కనబడుతుంది. వారి బహుముఖీనమైన అభిరుచికి నిదర్శనమ్గా ఈ వ్యాసాలు రూపొందాయి. సమాచారాత్మకాలు, విమర్శనాత్మకాలు అయిన ఈ వ్యాసాలు సాహిత్యపరులనే కాకుండా సామాన్యులను కూడా అలరిస్తాయి.

***

అక్షరన్యాసం (సాహిత్య వ్యాస సంపుటి)

ఆచార్య జి. చెన్నకేశవరెడ్ది

ప్రచురణ: జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక, హైదరాబాద్

పుటలు: 288, వెల: రూ.250/-

ప్రతులకు అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు మరియు 9492047027

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here