Site icon Sanchika

ఆకుపచ్చ పురుగు

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన రాచమళ్ళ ఉపేందర్. [/box]

[dropcap]చీ[/dropcap]కట్లో వొళ్ళు విరుచుకుంటోంది వెల్తురు. కోడికూతల మోతకు చటుక్కున మేల్కొన్నాడు శేషయ్య. హడావిడిగా లేచి వాకిలి ఊడ్చాడు. పక్కనే ఉన్న బావిలోంచి నీళ్ళు తోడి కల్లాపు చల్లాడు. ఆవులకు కుడితి పెట్టాడు. వేప చెట్టు మండను వంచి పుల్ల విరుచుకొని పళ్ళు రుద్దుకుంటూ కట్టెల పొయ్యి వెలిగించాడు. గిన్నెలో టీ పొడి, చక్కెర, పాల పోసి పొయ్యి మీద పెట్టాడు. గాబు దగ్గరకు పోయి ముఖం కడుక్కున్నాడు. టీ కాసేపు మరగగానే గిన్నెను గుండ్రంగా తిప్పుతూ గ్లాస్‌లో పోసుకున్నాడు. టీ తాగుతున్నంత సేపు కొడుకు ఎట్లున్నడో ఏమో అని గుబులు పడుతూనే వున్నాడు.

***

కార్పొరేట్ స్కూల్ ప్రచారం పల్లెలను హోరెత్తిస్తున్నాయి. కంప్యూటర్ బోధననీ, డిజిటల్ క్లాసులని, ఎసి గదులని చెప్తూ వేల కరపత్రాలతో పల్లెలను ముంచెత్తుతున్నాయి. అయినప్పటికీ శేషయ్య వూరిలో మాత్రం అటువంటి ప్రచారం జరుగలేదు. కారణం మారుమూల ప్రాంతం కావడమే. మూడేళ్ళ క్రితం తన వూరులోకి ఆ ప్రచారం వ్యాపించింది. ఫలితం ఊళ్ళో ఉన్న పిల్లల్లో చాలామంది టౌన్‌లో ఉన్న స్కూల్లో చేరారు. ఈ క్రమంలో ఆ ఇంటమ్మా, ఈ ఇంటమ్మా శేషయ్య భార్య పార్వతి దగ్గరకు వచ్చి తమ పిల్లలు ఏసీ గదులలో ఉంటూ, కంప్యూటర్ చదువులు చదువుకుంటున్నారని గొప్పలు చెప్పసాగారు. దీంతో గౌతమ్‌ను కూడా టౌన్‌లో బడికి పంపిద్దామని భర్త దగ్గర పోరు పెట్టింది.

“వాడు చదివేదే ఏడు. ఆ బడేందో ఈ ఇల్లేందో ఈ రెండు తప్ప వారికి మరో లోకం తెలియదు. మనం లేకుండా ఒక్క రోజైన నిద్రపోతాడా? అందులోనూ హాస్టల్లో ఒక్కడే ఎలా ఉంటాడు? వాడు లేకుండా మనం ఎలా ఉంటామే! ఆ చదువేదో మనూరి బడిలోనే చదవనీ… పెద్ద చదువులప్పుడు ఆలోచిద్దాం…!” వెన్నెల కాంతిలో కొడుకుని గుండెల మీద వేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తల్లిదండ్రుల మాటలు ఎటూ అర్థం గాక, చింతచెట్టు కొమ్మల మీద సందడి చేస్తున్న కొంగలను పరిశీలిస్తూ తనూ నిద్రలోకి జారిపోయాడు గౌతమ్.

శేషయ్య నిరక్షరాస్యుడేమీ కాదు. వూరి బడిలోనే పది చదివాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పై చదువులకు వెళ్ళలేదు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ చేను పనులు చేయసాగాడు. పెళ్ళైన కొన్నేళ్ళకు తండ్రి చనిపోవడంతో తనే భూమిని సాగు చేయడం మొదలెట్టాడు. శేషయ్యకు పచ్చని పైరన్నా, పైరగాలన్నా చచ్చేంత ఇష్టం. నలుగురికి అన్నం పెట్టే వృత్తిని ఎన్ని కష్టాలు ఎదురైనా నిర్విరామంగా చేస్తూనే వస్తున్నాడు. పంటకు ఎప్పుడు ఏ మందు వేయాలో, చీడపురుగులను హతమార్చడానికి ఎలాంటి పురుగుమందు కొట్టాలో బాగా నేర్చుకున్నాడు.

తెల్లవారగానే మళ్ళీ మొదలెట్టింది పార్వతి. “గౌతమ్ కూడా మనలాగే మట్టి పిసుక్కొని బతకాలంటావా? ఈ ఒక్కసారికి నా మాట వినరాదు. హస్టల్‌లో మన ఊరి పిల్లలు ఉంటున్నారు కదా! వారితో పాటు నాలుగు రోజులు ఉంటే అలవాటు పడతాడు. అంతకీ వాడు ఉండలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం” అదే పనిగా బ్రతిమలాడింది.

భార్య చెప్తుంటే ఒక కోణంలో మంచి కనబడుతున్నా, కొడుకు ఒంటరిగా ఉంటాడా అనే అనుమానం మరో వైపు పట్టి పీడించసాగింది. తల గోక్కుంటూ “ఏమైతదో ఏమో? నాకేం అంతుపట్టి చావడం లేదు. ఎంత కడ్తున్నారో సీతయ్య భార్యను అడిగి చూడు…” చిరాకుగా చేనుకెళ్ళాడు.

గాల్లో తేలుతున్నట్లైంది. పట్టరాని సంతోషంతో పక్కింటికురికింది పార్వతి. “వదినమ్మా ఓ వదినమ్మో! ఏం చేస్తున్నావ్” అంటూ ఇంట్లోకెళ్ళింది. “మా వాణ్ణి కూడా టౌన్‌లో స్కూల్‌కి పంపుదామనకుంటున్నాం. మీ వాడు హాస్టల్లో మంచిగా ఉంటున్నాడా, బాగా చదువుతున్నాడా? సంవత్సరానికి ఫీజు ఎంత కడుతున్నారు?” గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల  మీద ప్రశ్నలు కుమ్మరించింది.

“మా వాడికేం వదిన! బ్రహ్మాండంగా చదువుతున్నాడు. కాకపోతే సంవత్సరానికి లక్ష కట్టాల్సి వస్తుంది.”

“అమ్మో లక్షే” అనుకుంది. అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని ఇంటికి చేరింది.

అరుగు మీద కూలబడి మనాదిలో మునిగింది. పొద్దంతా అరక దున్ని అలిసిపోయి ఇంటికి వచ్చిన శేషయ్య భార్య వాలకాన్ని చూసి, “మూతి ముడుచుకుని కూర్చున్నావేంటే? పిల్లాడి చదువు నువ్వు చెప్పినట్టే చేద్దామన్నానుగా” అన్నాడు ఆవులకు వరిగడ్డి వేస్తూ.

“ఏం చెప్పమంటావ్! అన్నీ అందరికీ రాసి పెట్టి ఉండవు. ఏడాదికి లక్ష కట్టాలంటా” చెప్పలేక చెప్పింది పార్వతి.

తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ భార్య పక్కన కూర్చున్నాడు. “ఇప్పటికిప్పుడు లక్ష అంటే యాడనుంచి తేవాలి? మనిద్దరిది రెక్కల కష్టమేనాయే. వ్యవసాయం సంగతి చూస్తే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం. ఎక్కడన్నా ఒక రూపాయి వెనకేసిందుందా? అంత డబ్బు మనతో అయ్యే పని కాదు గాని, నేనో మాట చెప్తా విను… గౌతమ్‌ను పది వరకు మనూరి బడిలోనే చదివిద్దాం! ఏమంటావ్” అరుగు మీద నడుము వాల్చుతూ అన్నాడు.

“ఇక అనేదేముంది?” నులకమంచంలోకి ఒరుగుతూ అన్నది పార్వతి,

రోజులు గడుస్తున్నాయి. శేషయ్య దూరపు బంధువు ఒకాయన ఇంటికొచ్చాడు. మాటల సందర్భంలో గౌతమ్ చదువు ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు కార్పోరేట్ స్కూల్లో చదివిన వారికి పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తున్నాయని, అవసరమైతే తాను స్కూల్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి ఫీజు తగ్గించే ఏర్పాటు చేస్తానన్నాడు. అతని మాటలు విన్న తరువాత కొడుకు భవిష్యత్ కళ్ళముందు కదలాడింది. మళ్ళీ వారిలో ఏవో ఆశలు. ‘కానీ అంత డబ్బు ఎలా?’ రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాడు శేషయ్య.

ఎంత ఆలోచించినా శేషయ్యకు ఏ దారీ కనిపించడం లేదు. ఉన్నది ఎకరం భూమి. బోరు ఉండటం వలన అందులోనే సగం వరి, మిగతా సగంలో ప్రత్తి, మిరప పండిస్తున్నాడు. అది శేషయ్య దృష్టిలో భూమి మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. అంతలా అనుబంధం అల్లుకుపోయింది. ఎన్నో మధుర స్మృతులు అందించిన నేలది. ఎన్ని రకాల పంటలో పండించిన అనుభవం తనది. అలాంటి భూమిని ఉన్నట్టుండి అమ్మాలంటే మనసు రావటం లేదు. అలాగని అమ్మకుండా ఉండలేడు. బంధువు చెప్పిన మాటలే పదే పదే తన మనసుపై ఒత్తిడిని పెంచుతున్నాయి. గుండె రాయి చేసుకుని అర ఎకరం భూమిని రెండు లక్షలకు అమ్మాడు. లక్ష రూపాయలు డొనేషన్ కట్టి ఎనిమిదవ తరగతిలో చేర్పించాడు. హాస్టల్ కూడా దగ్గరే కావడంతో స్కూల్‌కు కాలి నడకన వెళ్ళొచ్చు. కొత్తలో అయితే రోజుకు గుర్తుకొస్తే చాలు… అర్ధరాత్రి, అపరాత్రని లేదు… టివిఎస్ బండితో హాస్టల్ ముందు వాలేవాడు. తెల్లవార్లూ ముచ్చట్లు పెట్టి, గౌతమ్‌ను స్కూల్‌కి పంపి, ఇంటికొచ్చేవాడు. పోను పోను గౌతమ్ పిల్లలతో కలిసిపోయాడు. హాస్టల్‌కు అలవాటుపడ్డాక ఊపిరి పీల్చుకున్నాడు. వారంలో రెండు సార్లు హాస్టల్‌కి వెళ్ళి చూసి వస్తున్నారు. సెలవులకు గౌతమ్ ఇంటికొస్తే వారికి పెద్ద పండుగలా అనిపించేది. ఇష్టమైన వంటకాలెన్నో చేసి పెట్టేవారు. కొత్త బట్టలు కొనేవారు. అల్లారుముద్దుగా చూసుకునేవారు. గౌతమ్ తప్ప వారికి వేరొక లోకం కనపడేది కాదు.

చూస్తుండగానే రెండు సంవత్సరాలు గిర్రున తిరిగాయి, గౌతమ్ పదవ తరగతిలోకి వచ్చాడు, చదువులో తనే క్లాస్ ఫస్ట్. ఇంకో నెల రోజులైతే యాన్యువల్ పరీక్షలు, గౌతమ్‌కు ఒంట్లో బాగాలేదని సడన్‌గా హాస్టల్ నుండి వార్డెన్ ఫోన్ చేశాడు. అప్పటికే రాత్రి ఏడు దాటింది. తెల్లారే పొలం నాటు వేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు, వాయిదా వేస్తే సమయానికి కూలీలు దొరుకుతారో లేదోనని, నాటు పూర్తికాగానే వెంటనే వస్తానని గౌతమ్ దగ్గరకు పార్వతిని పంపాడు.

***

అప్పటికే ఉదయం ఆరు గంటలు దాటింది. గబగబా ఆవులకు కుడితి పెట్టి, అరకతో పొలానికి వెళ్ళాడు, కూలీలు వచ్చే లోపల పొలం అంతా దున్ని సిద్ధం చేశాడు. పారతో దుగాలు సరిచేస్తూ, కూలీలకు నారు అందించసాగాడు, మధ్యాహ్నం పన్నెండు గంటలకు పొలం నాటు వేయడం అయిపోయింది. నిమిషాల మీద ఇంటికి చేరి, టౌన్ బయలుదేరాడు. ‘ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివాడు. తీరా ఇలా అయిందేమిటి! నా బంగారుతండ్రి ఎలా ఉన్నాడో?’ బస్సులో కూర్చున్నాడన్న మాటే గానీ ప్రతిక్షణం గౌతమ్‌ని కలవరిస్తూనే వున్నారు. బుడిబుడి నడకల బుజ్జోడి అల్లరి పనులు, వేలు పట్టుకుని నడుస్తూ, అడిగిన వేల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తను సతమతమైన సందర్భాలు మనసును తడమసాగాయి. ఒకసారి చేనులోని చింతచెట్టుకు ఉన్న తేనెను తీసుకొచ్చినప్పుడు గౌతమ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. జ్ఞాపకాల దొంతరలో తేలియాడుతుండగానే టౌన్ వచ్చేసింది. బస్సు ఆగిందో లేదో చెంగున కిందకు దూకాడు. పరుగులాంటి నడకతో హాస్టల్‌కు పోయాడు. పార్వతి గౌతమ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిందని తెలిసింది, తన వూరి పిల్లల సాయంతో హాస్పిటల్‌కు చేరాడు. వెయిటింగ్ రూంలో ఉన్న పార్వతి చీర కొంగుతో కళ్ళను హత్తుకుంటోంది, ఆమెను చూడగానే శేషయ్యకు ఇంకా కంగారెక్కువైంది. “ఏమైందే? గౌతమ్ ఎక్కడున్నాడు?” అంటుంటే శేషయ్య ముఖమంతా టెన్షన్‍కు చెమటతో తడిసిపోతుంది,

ఇద్దరూ రూమ్‌లోకి వెళ్ళారు. పీక్కుపోయిన మొహంతో, తేలిపోయిన కళ్ళతో అచేతనంగా పడుకున్నాడు గౌతమ్. “నాన్నా! గౌతమ్. కళ్ళు తెరువురా!” ఆతృతపడసాగాడు. మూలుగుతున్నాడు తప్ప, కళ్ళు తెరవడం లేదు గౌతమ్. “అయ్యో! దేవుడా! ఏమైంది వీడికి” రాలిపడుతున్న కన్నీళ్ళను తువ్వాలులో దాచుకుంటూ డాక్టర్ దగ్గరికి పరుగెత్తాడు. గౌతమ్ దగ్గరే కూర్చున్నారు పార్వతి, శేషయ్యతో వచ్చిన పిల్లలు.

డాక్టర్ చెప్పిన విషయం వినగానే శేషయ్య గుండె పగిలినట్లైంది. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కోటి ఆశలు ఒక్కసారిగా కుప్పకూలుతున్న భావన కలుగుతుంటే శరీరమంతా వణుకుతోంది, పెదాలు తడబడుతున్నాయి. ఆపుకుందామని ఎంత ప్రయత్నించినా కళ్ళు తడుస్తూనే వున్నాయి.

ఇకపై మందులు ఎలా వేసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చెప్పాడు డాక్టర్. తన వూరి పిల్లలు అంతమంది వుంటే, గౌతమ్ ఒక్కడే ఇలా ఎందుకయ్యాడు అంతుబట్టడం లేదు. డాక్టర్ రూమ్‌లోంచి గౌతమ్ దగ్గరకు వచ్చాడు. అక్కడున్న పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఏమైనా తెలుస్తుందేమోనని ఆరా తీయసాగాడు.

“గౌతమ్‌దీ మాదీ ఒకే క్లాస్ అయినా, వాడిది ఎ సెక్షన్, మాది బి సెక్షన్. మా క్లాస్ రూములు కూడా వేర్వేరు. స్కూల్ అయిపోయినాక హాస్టల్ దగ్గరే కలుస్తాము. కానీ వాళ్ళ సెక్షన్‌లో కొంతమంది మంచోళ్ళు లేరంకుల్. వారికి చాలా అలవాట్లు ఉన్నాయి. అవే గౌతమ్ కూడా నేర్పించారు. ఈ మధ్యనే బాగా వీక్‌గా వుంటున్నాడు. మేము చాలాసార్లు అడిగాము కూడా, మాతో ఏం చెప్పేవాడు కాదు. వారానికొకసారి కారులో కొంతమంది వచ్చేవారట. గౌతమ్ ఫ్రెండ్స్‌కి ఏవో ప్యాకెట్లు ఇచ్చి వెళ్ళేవారట. మేమంతా కలిసి స్కూల్ ఇన్‌ఛార్జికి కంప్లైట్ చేసాం. అప్పటి నుండి స్కూల్లో కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. అప్పటి నుండి స్కూల్ అయిపోనాక గంట తర్వాత హాస్టల్‌కు వచ్చేవాడు గౌతమ్. వార్డెన్ అడిగితే స్పెషల్ క్లాస్ వుందని చెప్పేవాడు” అంటూ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పారు.

రెండు గంటల తర్వాత మామూలు మనిషి అయ్యాడు గౌతమ్. ముగ్గురూ రోడ్డుపై నడుస్తున్నారు. పావుగంట గడిచింది. మూడు దార్లు కలిసే చౌరస్తా వచ్చింది. ఒక దారి హాస్టల్‌కి వెళ్లింది. మరొక దారి ఊరికి వెళ్ళేది.

ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? శేషయ్య గుండె పిండినట్లవుతోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. రోడ్డు పక్కనున్న సిమెంట్ బల్లపై కూలబడ్డాడు. పంటను నాశనం చేసే ఎన్నో రకాల పురుగులను ఒంటి చేత్తో మట్టి కరిపించిన నైపుణ్యం తనది. అభం శుభం తెలియని పసివాళ్ళను డ్రగ్స్ మత్తులో ముంచుతున్న మనిషి రూపంలోని పురుగులను ఏం చేయలేక కుమిలిపోతున్నాడు.

పార్వతి, గౌతమ్‌లు కూడా దిగులుతో నిలబడిపోయారు. కొడుకు వైపు చూసిన శేషయ్య ఒక్కసారిగా గొంతు పగిలేలా ఏడ్వసాగాడు. మత్తు మాఫియాను తుదముట్టించాలంటే ఒక్క గొంతు చాలదని, వేల గొంతులు ఒక్కటి కావల్సి ఉందనే అర్థం అతని రోదనలో పురుడుపోసుకుంటోంది.

Exit mobile version