అలా బతికించాను

0
3

[dropcap]శే[/dropcap]ఖరం – పల్లె అనే మారుమూల పల్లెటూళ్ళో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సొంత ఊరు కావడం అక్కడే ఓ ఇల్లు కట్టుకోవడంతో వేరే ఎక్కడికీ వెళ్లకుండా అక్కడైతేనే ప్రాక్టీస్ ప్రశాంతంగా ఉంటుందని భావించాడు. మొదట సూపర్ ఫాస్టు రైలులా జోరుగా ఉన్న ప్రాక్టీస్ కాస్తా తర్వాత్తర్వాత నెమ్మదిగా పాసింజర్ రైలులా నెమ్మదించింది. దానికి కారణం, అతనికి వైద్యం సరిగా రాదనే ప్రచారం జోరందుకోవడం. వచ్చీ రాని వైద్యం చేసి చాలా పశువుల్నీ, కుక్కలూ, పిల్లులూ లాంటి కొన్ని పెంపుడు జంతువులనీ చంపేసాడనీ చుట్టూ రైతులూ, జనాలూ చెవులు కొరుక్కోవడం. అదీ కాక, ఆ ఊరి వాళ్లు చాలా మంది కొంత దూరం అయినప్పటికీ పట్నంలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రినే నమ్ముకోవడం.
అయితే ఓ సారి అతని పెంపుడు కుక్కకి ప్రాణం మీదకి వచ్చింది. పక్కింటి వారూ, కుటుంబ సభ్యులూ, ఇంటి పనిమనిషీ, అంతా పట్నం తీసుకువెళ్లమని తెగ ఒత్తిడి చేశారు.
కానీ శేఖరం అందుకు నిరాకరించాడు. ఇప్పటికే చాలా మంది తన వద్దకి వారి పెంపుడు జంతువులని తీసుకురావడం మానేసారనీ; ఇక ఇప్పుడు తను ఇలా తన కుక్కని అక్కడి పట్నం పశువులాసుపత్రికి తీసుకు వెళితే వారు అన్నది తానే అక్షరాలా నిజం చేసిన వాడిని అవుతానని చెప్పాడు. తన వైద్యంతో పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. దాంతో ఇక ఎవరూ మారు మాట్లాడలేదు.
ఆ మరుసటి రోజు కుక్క లేచి తిరగడం చూసిన పనిమనిషి షాకై పోయి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది దాని వంక. తేరుకుని శేఖరం కాళ్ళ మీద పడింది. “మీరు నిజంగా మూగ జీవాల పాలిట దేవుడయ్యగోరూ. మా ఊళ్ళో అందరం వేలి ముద్ర బాపతు. ఒకడంటే అందరం అరదం, పరదం లేకుండా బాతుల్లా బెక, బెక అంటాం. ఏదో ఒకటి రెండు మూగ జీవాలు మీ చేతుల్లో పోతే ఏదో మీకు వైధ్యమే రాదని పుకార్లు పెట్టారు. కానీ, నిన్న బూడిద గుమ్మడికాయలా చలనం లేకుండా పడున్న కుక్క ఇవాళ బూచక్రంలా తిరిగేట్టు సేసారంటే మీరు నిజంగా దేవుడే సారూ” అంటూ కళ్ళు ఒత్తుకుని వంటింట్లోకి వెళ్లిపోయిందామె. ఆ పనిమనిషి ఆ వార్త నాలుగిళ్ళలో చెప్పడంతో, శేఖరం హాస్పిటల్ ఒక్కసారిగా కొంత కళ సంతరించుకుంది. పట్నం పోయే రైతులు కూడా వారి ఆవులను శేఖరం గారి వద్దకే తీసుకు రావడం మొదలైంది. రాను రాను, పట్నం నుండి కూడా ఇక్కడికి వారి పెంపుడు జంతువులని తీసుకురావడం ప్రారంభం అయింది. ఓ సారి అతని స్నేహితుడు కూడా పట్నం నుండి అతని కుక్కపిల్లని తీసుకుని శేఖరం దగ్గరకే వచ్చాడు. అతను శేఖరం వంక చూస్తూ “నీ పేరు పట్నంలో కూడా మారుమోగిపోతోందిరా. చనిపోయే స్థితిలో ఉన్న మీ కుక్కని బతికించావట. మొన్న ఆ మధ్య బాగా చెప్పుకున్నారు. సాంఘిక మాధ్యమాల్లో కూడా మీ కుక్క దయనీయంగా ఉన్న ఫోటో, ఆ తర్వాతి ఫోటో అంటూ నీ ఫోటోతో పాటు వైరల్ కూడా అయింది. మీ కుక్క ఈ ఊళ్ళో బాగా పాపులర్ ఆట కదా. విన్నాను” చెప్పారు విశ్వం గారు.
“అవును ఈ ఊళ్ళో మా కుక్క పెట్ సెలబ్రిటీ. అప్పుడప్పుడూ ఉదయం పూట మా కుక్కతో నడకకి వెళ్ళేవాడిని. అప్పుడు అందరూ దీనితో సెల్ఫీలు దిగేవారు. మా గుమ్మంలో కట్టేస్తే మా వీధి వారు దీన్ని పలకరించి మరీ పోయేవారు. మా అమ్మాయితో చదివే వాళ్ళకి ఇదంటే భలే ఇష్టం. వారంలో ఒక రోజు వచ్చి దీనితో ఆడుకుని వెళ్తుంటారు. ఇది మా కుటుంబంలో ఓ భాగం అయిపోయింది. ఒక వేళ అప్పుడు దీనిని బతికించకపోతే, పట్నం తీసుకెళ్లి ఉంటే బ్రతికేదిగా అని కొందరు అనేవారు. ఈ కుక్క చనిపోతే ఏమో కానీ బ్రతికితే మాత్రం నా ప్రాక్టీస్‌కి చాలా వరకూ ఉపకరిస్తుందని భావించాను. అక్షరాలా అదే జరిగింది. అలాగని నా వైధ్యం కూడా ఎలాంటి లోపం లేనే లేదు. ఈ ఊరి రైతులు కొంత అమాయకులు. పైగా చాలా వరకూ చదువులేని వారు కావడం నా కొంప ముంచడానికొచ్చింది. వారి పశువులనీ, పెంపుడు మేకలూ, గొర్రెల్నీ బాగా వ్యాది ముదిరే వరకూ ఉంచి చివర్లో నా వద్దకి తీసుకు వచ్చి ‘లబో దిబో డాక్టర్ బాబో’ అని బొగ్గుల కుంపటిపై కూర్చున్నట్టు గగ్గోలు పెట్టేసే వారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది అని తెలిసినా, మోహవాట పడి, నా ప్రయత్నం నేను చేసేవాడ్ని. అయినా అవి హరీమనేవి. దాంతో వాళ్ళు నన్ను మంచి టైమ్‍లో విరాట్ కోహ్లీ వికెట్ తీసేసిన పాకిస్తాన్ బౌలర్‌ని చూసినట్టు కసిగా చూసి, ‘ఏటండీ మీరు సేసింది. మీరేదో సేసి బతికిస్తారనుకుంటే ఇదేటండీ ఇలా సచ్చింది గొర్రె?’ అని ఏదో నాకు ఉపకారం చేసినట్టు వారికి నచ్చినంత ఇచ్చి చక్కా పోయేవారు. కొందరు అదీ ఇచ్చేవారు కాదు. అలాంటి వాటిలో నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. కానీ వారు మాత్రం ఆ అక్కసుతో నా వైద్యం సరిగా లేనందునే అవి హరీ అన్నాయని ప్రచారం చేసేవారు” చెప్పాడు శేఖరం చిన్నగా రగిలిపోతూ.
“పోనీలే మొత్తానికి నువ్వు మీ కుక్కని బతికిస్తే అది నీ ప్రాక్టీస్‍౬ని బతికించిందన్నమాట” అన్నాడాయన చిన్నగా నవ్వుతూ.
ఓ క్షణం విశ్వం గారిని దీర్ఘంగా చూసిన శేఖరం గారు, “స్వామి మాల వేసావు. ఎప్పుడు శబరిమల వెళ్ళేది?” అడిగారు.
“వెళతాను. నలభై రోజుల దీక్ష పూర్తి కావాలిగా. అప్పుడు వెళతాను” చెప్పాడాయన.
“అలాగా. ఏవీలేదు విశ్వం, మా నాన్న గారు కూడా అయ్యప్ప మాల చాలా సార్లే వేశారు. స్వామి మాల వేసిన ప్రతి స్వామిలోనూ అయ్యప్పస్వామి ఉంటాడని అనేవారు. వారితో అబద్దం చెప్పడం, వారిని మోసం చేయడం చేస్తే అది చాలా చేటని చెప్పేవారు. కనుక నేను నీతో అబద్దం చెప్పలేను. పైగా, నాకూ నీతో పంచుకుంటే ఓ ఊరట” అంటూ శేఖరం నేల చూపులు చూశాడు.
“హార్లిక్సు తాగను, తింటాను అన్నంత మెల్లగా చెబుతున్నావ్. ఇంతకీ ఏవిటా అబద్దం?” అడిగారు విశ్వం గారు ఆసక్తిగా.
“ఏం లేదురా. జబ్బు పడ్డ మా కుక్క ఆ రాత్రే చనిపోయింది.”
“అలాగా! మరి ఇది? అడిగాడు తెల్లమోహంతో నల్లమచ్చలున్న శేఖరం కుక్క వైపు తెగ భయంగా చూస్తూ.
“ఇది మా తమ్ముడిది. వాడూ నేనూ ఒకేసారి ఓ తొమ్మిదేళ్ల కిందట ఒకే రకమైన ఒకేలా కనిపించే రెండు డాల్మేషన్ కుక్కపిల్లలని తీసుకున్నాం. అయితే వాడు ఎలాగో రెండు నెలల్లో అమెరికా వెళతా అన్నాడు. కాబట్టి, వాడి కుక్కని ఎవరికో ఒకరికి ఇచ్చేస్తా అన్నాడు. అది గుర్తుకు వచ్చింది. సరే అని వాడికి విషయం చెప్పాను. వాడూ నన్ను అర్థం చేసుకుని అద్దంకి నుండి అర్ధాంతరంగా అర్ధరాత్రి కారులో ఈ కుక్కని తెచ్చిచ్చి వెళ్లిపోయాడు. చనిపోయిన దాన్ని గోతిలో పెట్టాను. ఆ గొలుసుతో దీన్ని కట్టాను. అనుకున్నట్టే నా ఆలోచన పారింది” చెప్పారు శేఖరం గారు.
“అలాగా! అయినా నీ ప్రాక్టీస్ పెరగడం కోసం నువ్వు మరీ ఇంతకి దిగజారాలంటావా?” అడిగాడాయన ముఖం చిట్లిస్తూ.
“తప్పలేదురా విశ్వం. అందుకే తప్పని తెలిసినా నా వైధ్యంపై మచ్చ కూడా మాసి పోవాలని ఇలా చేశాను. అది అందరికీ తెలియాలని సోషల్ మీడియాలో పెట్టించాను. ఏం చేయను. నాకు ఈ వృత్తే ఆధారం. పైగా కొన్ని అప్పులున్నాయి. ఎదిగిన ఆడపిల్ల కూడా ఉంది. అందుకే ఇలా” అన్నాడాయన తలవంచి మరోసారి నేల చూపులు చూస్తూ.
ఆ మాటలకి విశ్వం గారు చిన్నగా నవ్వుతూ “నువ్వు చేసింది తప్పే. అలా అని ఆ మూగ జీవిని నువ్వు కావాలని చంపలేదు. వైద్యం కూడా చేశావ్. కానీ దాని ఆయివు తీరిపోయింది అంతే. ఓ కుటుంబ పెద్దగా పట్నం పోయి ప్రాక్టీస్ చేసే స్తోమత లేని పేద వైధ్యుడిగా ఆలోచించి ఈ పని చేసావ్. బాధపడకు” అని ఓ క్షణం ఆగి “అలాగే నాకున్నది ఒకే కుక్క. వేరోకటి లేదు. కాస్త జాగ్రత్తగా వైధ్యం చేయి” అన్నాడాయన అతని బుజం తట్టి మరో సారి చిన్నగా నవ్వేస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here