Site icon Sanchika

అలా జరగనివ్వను

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జి. వాత్సల్య గారి ‘అలా జరగనివ్వను’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]త్తయ్యగారూ బాగున్నావా?”

గుమ్మంలోకి అడుగుపెడుతున్న శాంతని ఆప్యాయంగా పలకరించింది లిఖిత.

“లిఖీ! బాగున్నావా కాదు, బాగున్నారా అనాలి” నవ్వుతూ సరిదిద్దాడు సుహాస్.

“ఏదో ఒకటిలేరా! పరాయిదేశంలో పుట్టి పెరిగినా తెలుగు నేర్చుకుని మాట్లాడుతోంది” అంటూ కోడలిని వెనకేసుకొచ్చింది శాంత.

శాంత ముఖం కడుకున్ని వచ్చేసరికి టేబుల్ మీద వేడి వేడి పొంగల్, ఇడ్లీ, కొబ్బరి పచ్చడి, సాంబార్ అందంగా గాజుగిన్నెల్లో సర్ది ఉన్నాయి.

వాటిని చూడగానే శాంతకి ఆకలి రెట్టింపయ్యింది. అందరూ కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలెట్టారు.

“అమ్మా! ఈ అరవ రబ్బర్ ఇడ్లీలు తినలేకపోతున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు చేసే ఇడ్లీ తనకి నేర్పించమ్మా”

“అత్తయ్యగారూ! నాకు ఇడ్లీ అంటే ఇదే తెలుసు. అప్పటికీ ఇంటర్నెట్‍లో చూసి రవ్వ వేసి ప్రయత్నించాను కానీ సరిగ్గా కుదరలేదు” కినుకగా అంది లిఖిత.

“ఏ రవ్వ వేసావు?”

“ఉప్మా రవ్వ వేసాను. రవ్వ అంటే అదే కదా?” ఆశ్చర్యపోతూ అడిగింది లిఖిత.

“కాదమ్మా! ఇడ్లీ రవ్వ అని ఉంటుంది. నేను నేర్పిస్తానులే!” అని కోడలికి చెప్పి,

“అన్నీ నీకు నచ్చినవే ఉండాలంటే ఎలాగరా? సంసారం అంటేనే సర్దుకుపోవాలి. పైగా నీకు నచ్చినట్టుగా చెయ్యట్లేదని తనని అనే బదులు నువ్వే ప్రయత్నించచ్చు కదా?” అని కొడుకుని అడిగింది శాంత.

“ఏదో లేమ్మా! నాకు ఖాళీ ఉండదు. అయినా నువ్వు నేర్పిస్తే తను ఇట్టే పట్టేస్తుంది” అంటూ భోజనం ముగించి వెళ్తున్న కొడుకు కనీసం పళ్ళెం కూడా తీసి సింకులో వెయ్యకపోవడం, లిఖిత ఒక్కర్తే వంటిల్లు సర్దుకుంటోంటే సాయం చెయ్యకపోవడం శాంత గమనించింది.

కానీ ఆ అమ్మాయి అన్నీ సర్దుతూనే ముఖంలో చిరునవ్వు చెదరకుండా మాట్లాడటం శాంత దృష్టి దాటిపోలేదు.

బ్యాంకు ఉద్యోగస్తులైన శాంత, రఘులకి ఏకైక సంతానం సుహాస్. మాస్టర్స్ చెయ్యడానికి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడే పరిచయమయ్యింది లిఖిత. ఆమె తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితమే అక్కడకి వలస వెళ్ళారు. లిఖిత అక్కడే పుట్టి పెరిగిన పిల్ల.

లిఖితని పెళ్ళిచేసుకుంటానని సుహాస్ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ఇద్దరికీ అభ్యంతరమేమీ కనిపించలేదు.

తాను మాస్టర్స్ చెయ్యడానికి మాత్రమే సింగపూర్ వచ్చానని, ఉద్యోగం మాత్రం ఇండియాలోనే చేస్తానని సుహాస్ లిఖితకి ముందే చెప్పాడు. లిఖిత తల్లిదండ్రులు కూడా ఇండియాకి తిరిగొచ్చెయ్యాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయికి ఇది ఒక సమస్యగా అనిపించలేదు. ఆర్నెల్ల క్రితం పెళ్ళిచేసుకున్న కొత్త దంపతులు హైదరాబాదులో కాపురం పెట్టారు.

శాంత భర్త రఘురాం రిటైరయ్యాడు కానీ ఆమెకి ఇంకా మూడేళ్ళ సర్వీసుంది. హైదరాబాదులో వారంపాటు బ్యాంకు సమావేశాలున్నాయి కానీ అత్యవసర కారణాలవల్ల తాను వెళ్ళలేనని, తన బదులు శాంతని వెళ్ళమని పై అధికారి చెప్పగానే కొడుకు, కోడలిని కూడా చూసినట్టుంటుందని సంతోషంగా ఒప్పుకుంది శాంత.

ఆ రోజు శనివారం కావడంతో ముగ్గురూ కలిసి కాసేపు బయటకెళ్ళి మరుసటి వారానికి కావలసిన కూరలవీ కొనుక్కుని వచ్చారు.

మరునాడు కూడా ఇంట్లో పనులన్నీ లిఖితే ఎక్కువగా చెయ్యడం, సుహాస్‌కి ఏదైనా పని చెప్పబోతే చేస్తానని వాయిదా వెయ్యడం శాంత గమనించినా అది వారిద్దరి మధ్యా అవగాహనకి సంబంధించిన విషయమని కలగజేసుకోలేదు.

సోమవారం నుండీ తను క్యాబ్‍లో వెళ్తానన్నా వినకుండా లిఖిత తనని రోజూ ఆఫీసు దగ్గర దింపి మళ్ళీ సాయంత్రాలు స్వయంగా పికప్ చేసుకునేది. కోడలితో మరింత సమయం గడుపుతూ ఆమె ఇష్టాఇష్టాలు, అభిరుచులూ తెలుసుకునేందుకు శాంత ఇదొక అవకాశంగా భావించింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం చిటికెలో ఇంటికొస్తోంటే రోజూ ఇంట్లో అంత కష్టపడి వండుతావెందుకని ఒకరోజు కోడలిని అడిగింది శాంత.

తను పుట్టిపెరిగిన చోట ఎవ్వరూ ఇంట్లో వండుకోరనీ, కానీ బయట తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడంతో తల్లి ఇంట్లోనే వండటం మొదలుపెట్టడం, తన తండ్రి కూడా ఆమెకి సహాయం చెయ్యడం, వారాంతాలు అందరూ కలిసి ఇంటిపని చేసుకోవడం ఆటవిడుపుగా భావించేవారమని అదే అలవాటు ఇక్కడా కొనసాగిస్తున్నానని లిఖిత కళ్ళల్లో మెరుపుతో చెప్పడం చూసి శాంతకి ముచ్చటేసింది.

ఒకరోజు సాయంత్రం కార్లో ఇంటికొస్తోంటే, “అత్తయ్యా! ఈ ప్రక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో బజ్జీ మిరపకాయలు బాగుంటాయి, కొనుక్కుని వెళ్తాము” అని కోడలు అనగానే శాంత ఆశ్చర్యపోయింది.

“ఏడవుతోంది లిఖితా! ఇప్పుడు బజ్జీలెందుకమ్మా” అనబోయినా ఏమీ అనలేదు.

సూపర్ మార్కెట్ విపరీతమైన రద్దీగా ఉంది, దానికి తోడు రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల ఐదునిమిషాల్లో ఇంటికి చేరాల్సినవాళ్ళు ముప్పావుగంటకి కానీ చేరలేదు.

ఇంటికెళ్ళేసరికి సుహాస్ ఫోనులో ఏదో గేమ్ ఆడటంలో మునిగి ఉన్నాడు.

లిఖిత కాళ్ళు కడుక్కుని నేరుగా వంటింట్లోకెళ్ళి స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసింది.

“థాంక్యూ లిఖీ! నేను బజ్జీలు చేస్తాను, అత్తా కోడళ్ళిద్దరూ టీవీ చూడండి” అని చెప్పడంతో శాంత ఆశ్చర్యపోయినా లిఖిత మాత్రం అక్కడే నిల్చుంది.

సుహాస్ ఆమెని బలవంతంగా హాల్లోకి తోసినా ఏదో ఒకదానికోసం పిలుస్తూనే ఉన్నాడు.

లిఖిత అన్నీ అందించాకా పిండి కలిపి బజ్జీలేసి అందరికీ ప్లేట్లో సర్ది తీసుకొచ్చాకా ఇక తన పనైపోయిందన్నట్టుగా టీవీలో మునిగిపోయాడు.

ప్లేటు సింకులో పెడదామని వెళ్ళిన శాంతకి ఆ వంటిల్లు వానరాలు చెరచిన మధువనాన్ని గుర్తు చేసింది. స్టవ్వు, నేల, పిండితో, నూనెబొట్లతో అలంకరించబడి ఉన్నాయి మరి.

కోడలు అలసిపోయి వచ్చిందని శుభ్రం చెయ్యడానికి ఉపక్రమించబోతుండగా లిఖిత వచ్చి సుహాస్ వంట చేస్తే ఇలాగే ఉంటుందని చెప్పి రాత్రి భోజన ఏర్పాట్లు చేస్తూనే మొత్తం శుభ్రం చేసేసింది.

సుహాస్ తమ కంటే ముందే ఇంటికి వచ్చినా అలా ఫోను చూస్తూ పడుకుని ఉండేవాడు లేదా ఆ పూటకి వండాల్సిన కూరగాయలు ఫ్రిజ్జులోంచి తీసి బయటపెట్టి తన పనైపోయిందనుకునేవాడు.

ఎప్పుడైనా కోడలు ఏదైనా పని చెప్పబోతే పట్టించుకోనట్టే ఉండటం, తనకిష్టమైనప్పుడు మాత్రమే లేచి సాయంచెయ్యడం చూసి శాంత మనసులోనే నిట్టూర్చింది.

మూడ్రోజులు ఇలాగే గడిచాయి. గురువారం ఉదయం శాంత లేచి వంటింట్లోకెళ్ళేసరికి తనని చూసి లిఖిత కళ్ళు తుడుచుకోవడం గమనించింది. ఏడ్చి నిద్రలేనట్టుగా పాలిపోయి ఉన్న కోడలి ముఖాన్ని చూసి “లిఖితా! ఏమయ్యిందమ్మా?” అనునయంగా అడిగింది శాంత.

“నెలసరి సమస్య అంతే అత్తయ్యా!” అంటూ ముభావంగా చెప్పి లిఖిత తన పనిలో మునిగిపోయిది.

నిద్ర లేచిన సుహాస్‌లో కూడా ఉత్సాహం లేదు. ఆఫీసుకెళ్తూ కూడా గోడకి చెప్పినట్టు లిఖితకి చెప్పి వెళ్ళిపోయాడంతే!

ఆ రోజు సాయంత్రం భోజనాలయ్యాకా సుహాస్‌కి ఇష్టమైన గులాబ్ జాం బౌల్లో వేసి లిఖిత అతడికివ్వడం, కనీసం నోరు కూడా తెరిచి చెప్పకుండా సుహాస్ చేత్తోనే వద్దని సైగ చెయ్యడం శాంత చూసినా చూడనట్టే నటించింది.

తన ముందు బయటపడకూడదని మాట్లాడుకుంటున్నారే తప్ప ఇద్దరిలోనూ మునుపటి ఉత్సాహం లేదు అని ఆవిడకి తెలిసిపోతోంది.

రెండ్రోజులు ఇలాగే ఉంది పరిస్థితి. రోజూ తనని కార్లో తీసుకెళ్తూ బోలెడు కబుర్లు చెప్పే లిఖిత గంభీరంగా మారిపోయింది.

శుక్రవారం తాను క్యాబ్‍లో వెళ్తానని చెప్పి క్యాబ్ ఎక్కిన శాంత మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె మనసు గతంలోకి జారిపోయింది.

***

రఘురాం స్వతాహాగా మంచివాడే కానీ తాను చెప్పిందే జరగాలనే పట్టుదల చాలా ఎక్కువ. భార్య కూడా ఉద్యోగం చేస్తోంది, కొడుకు ఆలనాపాలనతో సతమతమవుతోందని తెలిసినా అలా టీవీ చూస్తూ కూర్చునేవాడు. ఎప్పుడైనా గట్టిగా చెప్తే నేను చేస్తా కదా కంగారెందుకు అనేవాడు తప్ప కదిలేవాడు కాదు.

ఏదైనా పని చెప్తే ఇప్పుడే ఆఫీసునుండి వచ్చాననేవాడు. కాసేపయ్యాకా చెప్తేనేమో స్నానం చెయ్యకముందు చెప్పచ్చు కదా అనేవాడు.

మొదట్లో భర్త ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు. అతడితో ఏది చెప్పాలన్నా ఎలా స్పందిస్తాడో తెలియక భయం భయంగా ఉండేది. తల్లికి చెప్పుకుంటే త్రాగొచ్చి కొడుతున్నాడా, తిడుతున్నాడా అనేది. అత్తమామలు, ఆడపడచులు సరేసరి.

ఒకరోజు చిందరవందరగా ఉన్న బట్టలని చూసి ఇంటిని ఎలా సర్దుకోవాలో మా అమ్మని చూసి నేర్చుకో అని రఘు అనగానే శాంత కోపం తారాస్థాయికి చేరింది.

మీరు నాకు కాస్తైనా సహాయం చేస్తే అంత కంటే శుభ్రంగా ఉంచుకుంటాను అని ఎదురు సమధానం చెప్పడంతో అతడి అహంకారం దెబ్బతిని మాటల తూటాలు విసిరి బయటకెళ్ళిపోయాడు.

అసలు తను చేసిన తప్పేమిటో తెలీక రాత్రంతా ఏడుస్తూ పడుకున్న భార్యని కనీసం సముదాయించలేదు, దగ్గరకీ తీసుకోలేదు.

ఎప్పుడైనా సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తాను చెప్పేది తప్పు అని భార్య సరిదిద్దితే మాత్రం అతడిలో అహంకారం నిద్రలేచేది. తానే రైటని మొండిగా వాదించి మాట్లాడటం మానేసేవాడు. తన మాటే నెగ్గాలనే పంతం అతడిలో కొత్తకోణాన్ని శాంతకి చూపేది.

మొదట్లో ఈ ధోరణి శాంతకి అర్థమయ్యేది కాదు. అలా చెయ్యడం వల్ల తన మనసెంత గాయపడుతోందో వివరించి చెప్పడానికి ప్రయత్నించినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉండేది. తన తప్పు కాకపోయినా సరే శాంతే వచ్చి మాట్లాడించాలి. ఆమె మాట్లాడించినా బెట్టు చేసి ఎప్పటికో మాట్లాడేవాడు.

ఒక్కోసారి శాంతకి కోపం వచ్చి గట్టిగా అరిచేది, వినకపోతే కన్నీళ్ళతో బ్రతిమాలేది. అప్పుడప్పుడు తన పంథా మార్చుకున్నట్లు అనిపించినా రెండ్రోజులకి మళ్ళీ మామూలైపోయేవాడు.

నేనూ నీలాగే నేనూ ఉద్యోగం చేస్తాను, అలసిపోతాను. పైగా ఇంట్లో పనికి పనిమనిషి ఉంది, ఇంక నీకు పనేమిటి అంటూ ఎకసెక్కాలాడేవాడు.

ఇంట్లో వంటకి అక్షయపాత్ర లేదనీ, పనిమనిషి తోమిన అంట్లు, ఉతికిన బట్టలు తమంత తాము వంటింట్లోకి, బీరువాల్లోకీ చేరవనీ, మనిషన్నాకా ఎవరికైనా అనారోగ్యం మామూలేననీ అతనికి తెలియక కాదు, పని తప్పించునే మార్గం అని అర్థమైన శాంత ఇంక అతడితో వాదించదలచుకోలేదు.

క్రమంగా ఆమె మానసికంగా అతడికి దూరం జరిగింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా వారిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. అడిగితే సమాధానం చెప్పేది, సమయానికి అన్నీ అమర్చేది, అతడేది చెప్పినా అవును మీరే రైట్ అనేది.

భార్యలో వచ్చిన ఈ మార్పుని గమనించలేనంత పిచ్చివాడు కాదు రఘురాం. ఆమె ఎందుకలా మారిపోయిందో తెలుసుకోలేనంత అమాయకుడూ కాదు. తప్పు ఒప్పుకుని భార్యని దగ్గరకి తీసుకోవడానికి అతడి అహం అడ్డుగోడలా నిలబడేది.

ఎవరైనా ఇంటికొస్తే మాత్రం వారి మధ్య ఉన్న ఈ కనపడని గోడ గురించి ఇసుమంతైనా అనుమానం రాకుండా ప్రవర్తించేది శాంత. దాంతో అందరూ తమని బెస్ట్ కపుల్ అంటోంటే మనసులోనే నవ్వుకునేది.

రిటైర్ అయ్యే సమయానికి రఘురాంకి పరిస్థితి మెల్లిగా అర్థమయ్యింది. ఏళ్ళ తరబడి తన ప్రవర్తన తామిద్దరి మధ్య పూడ్చలేనంత అగాథం సృష్టించిందని తెలుసుకోగానే మొట్టమొదటిసారి అతడిలో పశ్చాతాపం కలిగింది. భార్య మనసు గెలుచుకోవాలనుకుని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

అయినా శాంత ఎప్పట్లానే ఉంది. అసలు తనలో వచ్చిన మార్పుని పట్టించుకోనట్టు ప్రవర్తించడం చూసాడు. ఇది వరకైతే ఇది మరో నాలుగువారాల మౌనవ్రతానికి దారితీసేది. కానీ రఘు తన ప్రయత్నాలు మాత్రం మానలేదు.

ఇంటిపనిలో బోలెడు సాయం చెయ్యడం మొదలెట్టాడు, తను ఆఫీసు నుండి వచ్చేసరికి ఇంటర్నెట్‍లో చూసి రోజుకో రకం కూర చేసిపెట్టేవాడు. ఆమెతో వాదించడం మాని తను చెప్పేది సావధానంగా వింటున్నాడు. శాంత ఇదంతా గమనించినా ఏమీ ఎరుగనట్టే ఉంది.

ఒక ఆదివారం ఆమె పడుకుని లేచేసరికి రెండు కప్పుల్లో టీ తీసుకొచ్చి ఆమెకొకటి ఇచ్చి తానొకటి తీసుకుని కుర్చీ దగ్గరకి జరుపుకున్న భర్త వంక శాంత ఆశ్చర్యంగా చూసింది.

“శాంతా! ఇదివరకట్లాగే ఇదంతా రెండ్రోజుల సంబరం అని అనుకుంటున్నావని నాకు తెలుసు. నేను పూర్తిగా మారాను అనుకున్నప్పుడే నువ్వు నాతో మళ్ళీ నవ్వుతూ, తుళ్ళుతూ ఉండు. మొదట్లోనే చెయ్యాల్సిన పని మలి సంధ్య వేళలో చేస్తున్నానని నాకు మరింత దూరం జరగకు!” తన ఒడిలో తలపెట్టి బేలగా అంటున్న రఘురాం మాటలు తనలో ఇంకిపోయాయనుకున్న కన్నీళ్ళని కాలవలు కట్టించడం శాంతకి ఇంకా గుర్తు.

భర్తకి ఉన్న అహంకారం వల్ల భార్యాభర్తలుగా తామిద్దరం జీవితంలో ఏమి కోల్పోయారో శాంతకి తెలుసు కాబట్టి కొడుకు అలా ఉండకూడదని అతడితో ఇదే విషయం ఒకటికి పదిసార్లు చెప్పేది.

మరో రఘు తయారవ్వకూడదనీ, తనలాగే మరొక శాంత బాధపడకూడదని ఎంతో ప్రయత్నించింది.

“మేడం! ఏ గేట్ దగ్గర ఆపమంటారు?” అని డ్రైవర్ అడగడంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చింది శాంత.

ఎల్లుండే తన ప్రయాణం. లిఖిత మరో శాంత కాబోతోందా? ఈ ఆలోచన రాగానే ఆమె మనసు ఒప్పుకోలేదు. లేదు, అలా జరగనివ్వను అని గట్టిగా సంకల్పించుకుంది.

కానీ అంతలోనే, నేను చెప్తే అప్పుడు భర్త విన్నాడా? ఇప్పుడు కొడుకు వింటాడా? అని తనకుతానే ప్రశ్నించుకుంది.

“నేను చేస్తున్నది తప్పని నువ్వు తప్ప నాకెవ్వరూ చెప్పలేదు. మా నాన్న ఒకట్రెండు సార్లు చెప్పబోయినా అలా లేకపోతే కోడలు నెత్తికెక్కుతుందని అమ్మ నన్నే వెనకేసుకురావడంతో నేను చేస్తున్నది సరైనదేనని నాకు అనిపించిందే తప్ప నిన్ను దూరం చేసుకుంటున్నాని ఊహించలేని మూర్ఖుడిని శాంతా! కనీసం మా నాన్న నాకు గట్టిగా చెప్పుంటే విలువైన సమయాన్ని కోల్పోయేవాళ్ళం కాదేమో!” అని రఘు అనడం ఆమె మదిలో మెదలగానే ముఖంపై అప్రయత్నంగా చిరునవ్వు మొలిచింది.

ఆరోజు శాంత ఆఫీసునుండి మధ్యాహ్నమే ఇంటికెళ్ళిపోయింది. ఆరింటికి ఇల్లుచేరిన సుహాస్ తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు.

“అమ్మా! అప్పుడే వచ్చేసావేంటి?”

“ఆఖర్రోజు కదా! పని త్వరగా అయిపోయింది. నువ్వెళ్ళి లిఖితని కాంచీపురం కెఫేకి తీసుకురా! అక్కడ తనకిష్టమైనవి తింటుంది. నేను ఆ లోపు రవి మామయ్యని కలిసి నేరుగా అక్కడికే వస్తాను” అంది శాంత.

“ఈ రోజు బయటకొద్దులేమ్మా!” అంటున్న కొడుకు మొహాన్ని శాంత పరిశీలనగా చూసింది. వారం క్రితం ఉన్న ఉత్సాహం కనిపించడం లేదు కానీ భార్యతో ఏర్పడ్డ దూరాన్ని చెరిపేసే ప్రయత్నాలు మాత్రం చెయ్యడం లేదని అర్ధమయ్యింది.

“సుహాస్! బట్టలు మార్చుకునిరా. నీతో మాట్లాడాలి”

వెనకుండి వినిపించిన తల్లి కంఠం అతడికి ఆశ్చర్యమనిపించినా పదినిమిషాల్లో మొహం కడుక్కుని టేబుల్ దగ్గరకి చేరాడు.

కొడుకుకి ఇష్టమైన అల్లం టీ కప్పులో తీసుకుని వచ్చి అతడి ముందు పెట్టి ఎదురుగా కుర్చీలో కూర్చుంది శాంత.

“సుహాస్! లిఖితతో నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు?” సూటిగా ప్రశ్నించింది శాంత.

“అదేమి ప్రశ్నమ్మా? ఆనందంగా ఉండాలనే ఎవ్వరైనా అనుకుంటారు. చిన్న చిన్న గొడవలు మామూలే కదా?” చాలా తేలిగ్గా అన్నాడు సుహాస్.

“చిన్న చిన్న గొడవలంటే నాలుగ్గంటలుండేవా? నాల్రోజులుండేవా? లేదా మన వారసత్వాన్ని కొనసాగిస్తూ నాలుగు వారాలుండేవా?”

తల్లి గొంతులోని తీక్షణత సుహాస్‌ని ఇబ్బంది పెట్టింది.

“అమ్మా.. అసలేమయ్యిందంటే..”

“మీ మధ్య ఏమి జరిగిందో నాకు అనవసరం. ఏమి జరిగిందో తెలుసుకుని తప్పెవరిదని కూడా నేను తీర్పు ఇవ్వను. కానీ ఎన్ని రోజులు ఈ మౌనపోరాటాలు? లిఖిత మాట్లాడాలని ప్రయత్నిస్తోందని నేను గమనిస్తూనే ఉన్నాను. పోనీ నీ కోపం ఎన్ని రోజులకి తగ్గుతుందో ఆ పిల్లకి చెప్పు. తను నిన్ను పనిలో సాయం చెయ్యమని అడగదు, నీకేది కావాలో అవే వండుతుంది, నీతో సమానంగా సంపాదిస్తోంది, అన్నిటికన్నా ముఖ్యంగా నీ కోసం తను పుట్టిపెరిగిన దేశాన్ని వదిలి నీకోసం ఇక్కడికొస్తే ఇదేనా ఆ అమ్మాయికి నువ్విచ్చే గౌరవం? అనుభూతులని మూటగట్టుకుని అనుబంధాన్ని పెంచుకోవాల్సిన వయస్సుని పంతాలకీ, పట్టింపులకీ బలి చేస్తే ఆ తరువాత తప్పు తెలుసుకున్నా సమయం చేజారిపోతుంది సుహాస్.

నువ్వు నీకు ఇష్టమైనప్పుడు మాత్రమే వంటింట్లోకొచ్చి చేసే పావుగంట పనికి ఆ పిల్ల అరంగంట శుభ్రం చేసుకోవాలి. గిన్నెలు లోపల పెట్టమంటే ఎక్కడ పెట్టాలో తెలీదంటావు. ఇక మిగతా పనులేవీ రావంటావు. నీకు ఉద్యోగంలో చేరిన మొదట్రోజే అన్ని పనులు వచ్చా? ఆ అమ్మాయి సహనానికైనా హద్దుంటుందని గుర్తుపెట్టుకో! ఏమో! రేపు నీ ప్రవర్తన విసుగొచ్చి ఆ పిల్ల నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నా ఆశ్చర్యం లేదు. తప్పు ఎవరిదైనా ఒకళ్ళు మాట్లాడించాలని ప్రయత్నించినప్పుడు మాట్లాడి అరమరికలు లేకుండా చర్చించుకుంటే ఇంకోసారి ఈ పరిస్థితి తలెత్తదు. అసలు చిర్రుబుర్రులే లేకుండా ఉంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. నీ అహంకారంతో జీవితాన్ని కళావిహీనం చేసుకుంటావో రంగులద్ది ఇంద్రధనస్సుని సృష్టించుకుంటావో నీ చేతుల్లో ఉంది సుహాస్”

తాను చెప్పాల్సింది అయిపోయిందన్నట్టుగా శాంత లేచి వంటింట్లోకెళ్ళింది.

సుహాస్ ఏమీ మాట్లాడకుండా యథావిధిగా ఫోనులో మునిగిపోవడం చూసి మౌనంగా రాత్రి భోజన ఏర్పాట్లలో మునిగిపోయింది.

“అమ్మా! లిఖితకి లేట్ అవుతుందిట. నేను తనకిష్టమైన సపోటా ఐస్కీం ఆర్డర్ చేస్తున్నాను. నీకూ ఏమైనా కావాలా?” ఓ గంట తరువాత హాల్లోంచి వినబడ్డ సుహాస్ గొంతు ఆమెకి ఎనలేని ఆనందాన్ని కలగజేసింది.

***

“అత్తయ్యా! మీరు హాల్లో కూర్చుని అమ్మ వాళ్ళతో మాట్లాడుతుండండి, నేను పులిహోర, దద్దోజనం చేసి ప్యాక్ చేసెస్తాను. లిఖిత ఇంకో గంటలో ఇంటికొచ్చేస్తానంది”

చెప్పినట్టుగానే అరగంటలో రాత్రి కావాల్సిన భోజనాలు, నీళ్ళసీసాలతో సహా ఒక బ్యాగ్ తయారైపోయింది.

అది చూడగానే లిఖిత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

శాంత ఆతృతగా లేచి వంటింట్లోకెళ్ళింది. కడిగిన ముత్యంలా ఉన్న వంటింటిని చూసి ఆమెకి నోట మాట రాలేదు.

“అమ్మా! స్టవ్వంతా నూనె, క్రిందంతా పోపు గింజలు వెతుక్కుంటున్నావా?”

బాల్కనీలో బట్టలు మడతేస్తున్న సుహాస్ గొంతు ఆవిడకి తెరలు తెరలుగా నవ్వు తెప్పించింది.

ఎప్పుడొచ్చారో కానీ వెనకే నిల్చున్న రఘు కూడా ఆమె నవ్వుతో శృతి కలిపారు.

Exit mobile version