అలా ముగిసింది

5
2

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘అలా ముగిసింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ల[/dropcap]క్ష్యం
పరిచయమైన రోజున
సన్నగా సన్నజాజి పూవులా ఉంది
తీగ నడుముతో బాపూ బొమ్మలా ఉంది
అందంగా ఆకర్షణీయంగా ఉంది
అందుకునేంత ఎత్తులోనే ఉంది

నిండుగా ఉందిగా కాలం, జేబులో
మెండుగా ఉందిగా ఆత్మవిశ్వాసం, మనసులో
పనిగట్టుకుని వెళ్లి పలుకరించాను తనని

ప్రతిగా తను కూడా..
చిరునవ్వు నవ్వేసింది
పక్కింట్లోనే కదా, నేనుండేది
ప్రతిరోజూ కనిపిస్తుంటానుగా అని అంది

హుషారు స్నేహాలలో
ఊహల, స్వప్నాల వెతుకులాటలో
షికార్ల పగళ్ళను
సరదాల సాయంకాలాలను
కొనుక్కున్నాను విచ్చలవిడిగా
కాలాన్ని ఖర్చుపెడుతూ ధారాళంగా

అలసిన ఒళ్ళు పదేపదే అడుగుతోంటే
టిప్పిచ్చి మరీ తీసుకొచ్చేసుకున్నాను రాత్రిని
విశ్రాంతికై.. ఒళ్ళు మరిచేంత నిద్రకై

ఎందుకో..
ప్రతిరోజూ కనిపించే లక్ష్యం
ఆ తరువాత
అప్పుడప్పుడు మాత్రమే అగుపిస్తుండేది
చిరునవ్వు మాయమైన ఆ మొహంలో
చిరాకు స్పష్టమవుతుండేది

గడుస్తూ.. నడుస్తూ
కాలం కరిగిపోయిన జేబు తేలికైపోయింది
మనసులోని ఆత్మవిశ్వాసం అడుగంటిపోయింది

ఇదిగో.. ఇప్పుడు
అలా అక్కడ.. అగుపించింది లక్ష్యం
అల్లంత దూరంలో నెమ్మదిగా నడిచెళుతూ

అదేంటో
బండగా కొండంత ఎత్తుగా ఉంది
కోరలూ గోళ్ళతో భయంకరంగా ఉంది
గుర్తుపట్టలేనంత ఘోరంగా ఉంది

బెదురు బెదురుగా
ఎదురు వెళ్ళి పలుకరిస్తే
కోపంగా చూసి.. అసహ్యంగా ఏదో అనేసి
ఎటో వెళ్ళిపోయింది లక్ష్యం
నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది
అవును.. సుదూరంగా వెళ్ళిపోయింది
నాకు అందనంతగా
నీళ్ళునిండిన నా కళ్ళకు అగుపించనంతగా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here