[dropcap]అ[/dropcap]నేక పత్రికలలో పని చేసిన ‘నిజం’ పత్రికలలో చిన్నగా మొదలై పెద్ద పెద్ద పదవులకు స్వయంకృషితో ఎదిగిన జర్నలిస్టు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలకు ఎడిటర్‍గా, ప్రస్తుతం ‘మన తెలంగాణా’కు అడ్వయిజరీ ఎడిటర్‌గా ఉన్న నిజం ఎప్పుడో గాని కలాన్ని ఝుళీపించని ‘అరుదు అరుగు’ దిగి ఈ మధ్య ఉధృతంగా రాస్తూ, పలు పత్రికలలో తన కవితలు ప్రచురించారు. 2019 చివర్లో నిజం గారి ‘నాలుగో పాదం’ కవితలు కొన్ని రాసీ రాయగానే హాట్ హాట్‍గా విన్న అనుభవం శ్రీ.శా.ది. అభివ్యక్తి ఉరవడి నిజం వరవడి. అందులో మొదటగా కొన్ని ఉక్కిరిబిక్కిరిలు నావే కావడం నాకు సంతోషం. ఆయన స్వేదవేదానికి నమస్సులు.
ఆయన అంతరంగం స్త్రీ అని చెప్పదలచుకొన్నాను. ఈ విషయంలో నాన్పుళ్ళకు తావు లేదు యెంత మాత్రం.
ప్రకృతిని తెంపుకొచ్చి దాచి వ్యాఖ్యానించే మంటల కెరటాలు నిజం అనలపు అలలు. భావాలకు సూక్ష్మంగా చిత్రిక పడుతూ కవితా ప్రపంచానికి కొత్త సొబగులు అద్దుతున్న లఘురూప కవితలు ఈ ‘అలలు’ . మేఘాలు పూరించిన శంఖాలు ఇవన్నీ. సౌందర్య దృష్టిని విడవకుండా తనని తాను విపరీతంగా నియంత్రించుకుంటూ, స్పష్టపరుచుకోడం కవి నిబద్ధతకు నిరూపణం. స్వేద బిందువులకు భావం తురాయి తొడగడం ‘అలలు’లో మనం చూస్తాం. ఎర్ర మందారాలలో ఆదిలో విప్లవ పుష్పాలు పూయించిన కలం గార శ్రీరామ మూర్తిది. అతడే నిజం.
సుమారుగా నాలుగున్నర దశాబ్దాల క్రింద వెలువడ్డ ఈ ఎర్రమందారాలు నిజం గారి అగ్నిపూలు!
ఆ నిజం గారి ఈనాటి అలలు అభివ్యక్తి పూలు. కవితా వస్తువును అభివ్యక్తితో తాకి కవిత్వాన్ని పూయించడం ‘అలలు’లో మనం చూస్తాం.
వస్తువు, అభివ్యక్తి, కవిత్వం సమపాళ్ళలో ఉన్న ‘అలలు’ ఎన్నో. అతి కొద్ది సంఖ్యంలో ‘అలలు’ ఈ తూకం తప్పినా, కవిత్వం పాలు ఎక్కువై, విందు చేసేవే!
నిజంగారు వ్యక్తిగా నాకు చాలా దశాబ్దాలుగా తెలుసు. ఆయన ఓ మౌన ఋషి. పలుకు తీక్షణం. ‘అలలు’లో నిజం సున్నితత్వంలో అక్కడక్కడ ఆశ్చర్యపెట్టారు. ఆయన తీక్షణత సున్నితత్వంలోంచి పుట్టుకొచ్చిన ఆగ్రహం లాంటిది.
***
(కవిత్వం)
పేజీలు: 192
వెల: ₹ 125/
ప్రచురణ, ప్రతులకు..
నిజం ప్రచురణలు
ఎ-26, జర్నలిస్ట్ కాలనీ,
జూబ్లీహిల్స్,
హైదరాబాద్ 500033
ఫోన్: 9848351806,
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు