అలనాటి అపురూపాలు-101

1
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మరుగున పడిన ప్రతిభ – పి.ఎస్. శ్రీనివాస్:

పి.ఎస్. శ్రీనివాస్ 21 డిసెంబరు 1908వ తేదీన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 1930లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి బి.ఎ. పాసయ్యారు. ఆయన చక్కని విద్యార్థే అయినా, చిన్నతనం నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. అరుదైన రికార్డులను కొనేవారు, అంతకంటే అరుదైన కచేరీలకు హాజరయ్యేవారు. సంగీతం పట్ల అమిత శ్రద్ధాళువు అయిన ఆయన తాను విన్న సంగీతాన్ని – మద్రాసులో తాము స్థాపించిన అమెచ్యూర్ మ్యూజిక్ అండ్ డ్రామా క్లబ్‍లో ప్రవేశపెట్టేవారు. అది ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఫలితంగా 1934లో తమిళ చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’లో నటించే అవకాశం వచ్చింది. సుప్రసిద్ధ మరాఠీ/హిందీ చిత్రాల దర్శకులు వి. శాంతారాం ఈ సినిమా చూసి, తాను తీస్తున్న ‘చంద్రసేన’ చిత్రంలో శ్రీనివాస్‍కి రాముడి పాత్ర ఇచ్చారు. దీని తరువాత ఆయన మూడు తమిళ సినిమాలు, ఐదు హిందీ సినిమాలలో హీరోగా చేశారట, దురదృష్టవశాత్తు నాకు వాటి పేర్లు తెలియవు.

హిందుస్తానీ సంగీతంలో మంచి పట్టు ఉండడంతో ఆయనకీ అవకాశాలు వచ్చాయి. పై సినిమాలలో ఆయనకి విభిన్నమైన పాత్రలు దొరికాయి, ఒక సినిమాలో విలన్‍ అవకాశం కూడా వచ్చింది. 1941లో తాను హీరోగా నటిస్తూ, ‘శాంత’ అనే తమిళ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించి, హీరోగా నటించారు. కానీ ఆ సినిమా పరాజయం పాలయ్యింది.

ఆయన మళ్ళీ నటనలో ప్రవేశించి, ‘గీత’ అనే మరాఠీ సినిమా, ‘తులసి’, ‘ముకాబలా’, ‘ఆంఖ్ కీ శ్రమ్’ వంటి హిందీ సినిమాల్లో నటించారు. 1943లో బొంబాయిలోనే ‘పతి భక్తి’ అనే తెలుగు సినిమాలో నటించారు. ఆయన సరసన దాసరి సుభద్ర నటించారు (ఫోటో చూడండి).

1943 నుంచి 1947 వరకు సైన్యంలో పనిచేసి కెప్టెన్ కూడా అయ్యారు. అక్కడ కూడా ఆయన సమయం వృథా చేయలేదు. అన్ని భారతీయ భాషలలో ఉన్న నిరుపయోగమైన ప్రచార చిత్రాలను తొలగించారు. బొంబాయిలో ఉంటూనే 1949లో ‘వీర వనిత’, ‘జీవన జ్యోతి’ అనే తమిళ చిత్రాలలో నటించారు. మరో మూడు హిందీ చిత్రాలలో కూడా నటించారు, కానీ నాకు వాటి పేర్లు తెలియవు.

1949 నాటి ‘అప్నా దేశ్’ చిత్రాన్ని తెలుగు, తమిళంలో డబ్ చేయడానికి ఆయనే కారకులు. ఈ విధంగా ఈ సినిమా ఈ రెండు భాషలలో డబ్ చేయబడిన మొదటి చిత్రంగా నిలిచింది. ఆయన లింటాస్ ఏజన్సీ కోసం తెలుగు, తమిళ భాషలలోకి దాదాపు 30 ప్రకటనలను డబ్ చేశారు.

1952లో ఆయన మద్రాసుకి వచ్చి, ‘యజమాని’ అనే తమిళ చిత్రం ప్రారంభించారు. ఎ.పి. నాగరాజన్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో రావు బాల సరస్వతి పాడిన పాటలని రికార్డు కూడా చేశారు. కానీ ఈ చిత్రంలో మధ్యలో ఆగిపోయింది, తరువాత ఎన్నడూ వెలుగు చూడలేదు.

1954లో ఆయన ‘నంబన్’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ తెలుగు నటులు నాగయ్య గారి వినతిపై శ్రీనివాస్ 1959 నుంచి 1964లో విడుదలయ్యే వరకు ‘భక్త రామదాసు’ చిత్రానికి ప్రొడక్షన్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. కాగా 1963లో ఆయన ‘తల్లీ బిడ్డలు’ అనే తెలుగు సినిమాకి దర్శకత్వం వహించారు.

కొన్నాళ్ళ పాటు ఆయన రావు బాల సరస్వతి దేవి గారికి హిందూస్తానీ సంగీతం నేర్పించారు. యం.యస్. సుబ్బులక్ష్మి గారితో సాధన చేయించి, భారతీయ విద్యా భవన్ కోసం ఎన్నో భాషలలో పాటలు పాడించి వాటి ఎల్.పి.లను విడుదల చేయించారు. 1968లో ఆయన సినిమాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుని మద్రాసులోని భారతీయ విద్యా భవన్‍లో డివోషనల్ మ్యూజిక్ ప్రొఫెసర్‍గా స్థిరపడ్డారు. దీన్ని తన వానప్రస్థమని ఆయన పేరొన్నారు. జీవితం ముగిసేవరకు అక్కడే, అదే పనిలో ఉన్నారు. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి అని ప్రశ్నించేవారాయన!

తెలుగు నాటకాలలో, సినిమాలలో రాణించిన తమిళ నటుడు:

నటుడు దొరైస్వామి తమిళుడు, తెలుగు వ్యక్తి కాదు. జీర్ణించుకోవడం కష్టమే… ఆయన నెల్లూరికి చెందినవారైనా, వారి పూర్వీకులు మాత్రం మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన చెంగల్పేటకి చెందినవారు. ఆయన తండ్రి రంగాచారి గారు చెంగల్పేట నుంచి నెల్లూరుకి వచ్చి, అక్కడ టీచరుగా పని చేశారు.

దొరైస్వామి 14 నవంబరు 1897న జన్మించారు. ఆయన తెలివైన విద్యార్థి, చక్కని జ్ఞాపకశక్తి. కానీ అల్లరి పిల్లాడు. అయినప్పటికీ, ప్రతీ తరగతి పాస్ అవుతూ పై తరగతులకు చేరారు. అయితే ఆయన పాసవడం వల్ల వారి కుటుంబానికి ఆర్థికంగా ఏమీ ప్రయోజనం కలగలేదు. అప్పట్లో స్కూలు టీచర్లకు జీతాలు బాగా తక్కువ ఉండడంతో, ఆ కుటుంబానికి డబ్బు అవసరం చాలా ఉండేది. ఫలితంగా, ఇంటర్మీడియట్ అయ్యేసరికి, చదువు ఆపేశారు. ఉద్యోగం వెతుక్కోవాలనుకున్నారు. అవి మొదటి ప్రపంచ యుద్ధం రోజులు. కాబట్టి సైన్యంలో చాలా ఉద్యోగాలు ఉండేవి. సైన్యంలో గుమాస్తాగా చేరి ప్రపంచమంతటా తిరిగారు. ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలను దర్శించారు. మిలిటరీ క్లర్క్‌గా ఆయనను మెసపటోమియాకు పంపారు. అక్కడ కూడా పని చేసి ఆయన 1924లో ఇండియాకి తిరిగి వచ్చారు. దీని తర్వాత యుద్ధంలో సేవలందించిన వారందరికీ ప్రభుత్వం తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పించినా, దొరైస్వామి మాత్రం సైన్యంలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదు. ఆయన కనుక ప్రభుత్వం ఇవ్వజూపిన ఉద్యోగంలో చేరి ఉంటే, తరువాతి కాలంలో రిటైరయి, హాయిగా పెన్షన్ తీసుకునేవారు. మనం ఓ మంచి నటుడిని కోల్పోయి ఉండేవాళ్ళం.

ఆయనకి సినిమాల్లో నటించే ఓ మంచి స్నేహితుడు ఉండేవారు. ఆయన తరచూ నెల్లూరు నుంచి బెజవాడ వెళ్ళి నాటకాలలో నటించేవారు. నిరుద్యోగిగా ఉన్న దొరైస్వామిని ఆయన ఒకసారి బెజవాడ తీసుకువెళ్ళారు. ఆ స్నేహితుడి పేరు కూడా దొరైస్వామే. ఆయన వల్ల మన దొరైస్వామి కూడా కొంత కాలం బెజవాడలో ఉన్నారు. ఆయనకెందుకో నాటకాలు నచ్చలేదు. అక్కడ ఉండి నాటకాలు చూడడం అంత ఉత్సాహంగా అనిపించలేదు. ఆయన నటించడం కేవలం విధి రాత మాత్రమే!

ఆయన మిత్రుడు భక్త రామదాసు నాటకం వేయబోతున్నారు. అందులో తానీషా నవాబు పాత్ర కోసం హింధీ ధారాళంగా మాట్లాడగలిగే వ్యక్తి కోసం చూస్తున్నారు. అప్పుడాయనకి తట్టింది – మన దొరైస్వామి సైన్యంలో పని చేశారనీ, హిందీ బాగా మాట్లాడుతారనీ. వెంటనే దొరైస్వామిచే ఆ పాత్ర చేయించారు. మొదట్లో కాస్త భయపడినా, ధైర్యం తెచ్చుకుని ఆ పాత్రను సజావుగా పోషించారు. ఆశ్చర్యకరంగా, నాటకం ముగిసాకా, ప్రేక్షకులు ఆయన చుట్టూ మూగి బాగా నటించారని ప్రశంసించారు. ఇప్పుడే నాటకాల పురుగు ఆయననూ కుట్టింది. తనంతట తాను గానే – మరిన్ని నటనావకాశాలు ఇప్పించమని స్నేహితుడిని అడిగారట. నెల్లూరు వెళ్ళిపోయిన దొరైస్వామి అక్కడ కూడా ఎన్నో తెలుగు, ఆంగ్ల నాటకాలలో నటించారు. అదే సమయంలో మళ్ళీ సైన్యంలో చేరాల్సి వచ్చింది. ఈసారి ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన జీవితమే ప్రమాదంలో పడింది. అదే సంవత్సరంలో ఆయన తండ్రి మరణించారు. తానే పెద్ద కొడుకు కాబట్టి కుటుంబ బాధ్యతలు ఆయన మీదే పడ్డాయి. నాటకాలలో నటిస్తూ, ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని ఆదుకున్నారు. మంచి రోజుల కోసం ఓపికగా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. మద్రాసులో ఆంధ్ర నాటక కంపెనీ చేరారు.

తాను వేసిన నాటకాల ద్వారానే ఆయన బి.ఎన్. రెడ్డిగారికి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభ నచ్చిన బి.ఎన్.రెడ్డి గారు దొరైస్వామిని – అప్పుడు ‘గృహలక్ష్మి’ సినిమా తీస్తున్న హెచ్.ఎమ్.రెడ్డిగారికి పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆయనకి తాగుబోతు పాత్ర లభించింది. అతి సులువుగా నటించిన దొరైస్వామి ప్రతిభ చూసిన హెచ్.ఎమ్.రెడ్డిగారు అదే సినిమాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర కూడా ఇచ్చారు. ఒకప్పుడు తాను అసహ్యించుకున్న సినీరంగమే తనకు పేరు ప్రతిష్ఠలూ, జీవనోపాధి కల్పిస్తోందని దొరైస్వామి గ్రహించారు.

‘గృహలక్ష్మి’ విడుదలయ్యాకా, బి.ఎన్.రెడ్డి – హెచ్.ఎమ్.రెడ్డి విడిపోయారు. బి.ఎన్.రెడ్డి ప్రసిద్ధమైన వాహిని సంస్థను స్థాపించారు. తాను తీసిన ప్రతీ సినిమాలోనూ – విశ్వమోహిని, భాగ్యలక్ష్మి, మీరా, త్యాగయ్య – వంటి చిత్రాలలో దొరైస్వామికి అవకాశం ఇచ్చారు. వీటి తర్వాత ఆయనకెందుకో అవకాశాలు తగ్గాయి. నిరాశ చెందిన దొరైస్వామి, తనకి హిందీ బాగా వచ్చు కాబట్టి; హిందీ సినిమాలలో అదృష్టం పరీక్షించుకునేందుకు బొంబాయి వెళ్ళారు. కానీ అక్కడా సరైన అవకాశాలు రాక మళ్ళీ మద్రాసు వచ్చేశారు. మళ్ళీ ఆయనకి అదృష్టం కలిసొచ్చింది. బి.ఎన్.రెడ్డి – ‘స్వర్గసీమ’, ‘మల్లీశ్వరి’ చిత్రాలలో అవకాశం కల్పించారు.

ఆ తరువాత దొరైస్వామి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మంగళ, సంసారం, సువర్ణమాల, జీవితం, సౌదామిని, ధర్మ దేవత, నిరపరాధి, ప్రేమ, నా ఇల్లు, పెళ్ళి చేసి చూడు, పరివర్తన, దేవదాసు, చంద్రహారం, మిస్సమ్మ, బీదల ఆస్తి తదితర చిత్రాలలో నటించారు. తన మాతృభాష తమిళంలోనూ పలు సినిమాలలో నటించారు. అదో పెద్ద జాబితా. ఆయన వ్యక్తిగత విషయానికొస్తే – ఆయన 1918లో వివాహం చేసుకున్నారు. కానీ 1939లో ఆయన భార్య చనిపోయారు. మళ్ళీ జీవితంలో పెళ్ళి చేసుకోకుండా – సినిమాల్లో నటిస్తూ – జీవనం గడిపేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here