అలనాటి అపురూపాలు-103

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

పూర్తిస్థాయిలో ప్రతిభని ఉపయోగించుకోలేకపోయిన గాయని ముబారక్ బేగం:

రాజస్థాన్ లోని చురు జిల్లా లోని సుజన్‌ఘర్‌లో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు ముబారక్ బేగం. పెద్దయ్యాకా ఆమెకి షేక్ అనేవారితో వివాహమై, ఒక కొడుకు, ఓ కూతురు జన్మించారు. తదుపరి కాలంలో ఆమె భర్తా, కుమార్తె చనిపోయారు. ఆమె తన కొడుకు, కోడలితో, మనవరాలితో జీవించారు. ప్రసిద్ధ గాయనియే అయినా, తన ప్రతిభని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు ముబారక్ బేగం. వినోద పరిశ్రమలో నెగ్గుకురావడానికి కావల్సినన్ని ‘నెట్‍వర్కింగ్’ నైపుణ్యాలు లేవు ఆమెకి. ఫలితంగా ఆమె కెరీర్ దూసుకుపోలేదు. ప్రజ్ఞ గల గాయని అయినప్పటికీ, వ్యాపారపరంగా ఆమె రాణించలేకపోయారు. ఆమె దృష్టంతా ఎంతసేపూ సంగీతం పైన ఉండేది తప్ప, ధనం మీద కాదు.  రోజూవారీ ఖర్చులు, దాతృత్వం కారణంగా ఆమె పెద్దగా డబ్బు దాచుకోలేకపోయేవారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు 2016లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో – పాకిస్థాని గజల్ గాయకుడు గులాం అలీ తన అభిమాన గాయకుడని ఆమె పేర్కొన్నారు.

పార్కిన్సన్ వ్యాధితో బాధపడిన ముబారక్ బేగం కూతురు అక్టోబరు 2015లో చనిపోయింది. ఆ ఘటన తర్వాత ముబారక్ బేగం ఆరోగ్యం మరింత క్షీణించింది. మే 2016లో – ముబారక్ బేగం ఆసుపత్రిలో ఉన్నారనీ, ఆమె కుటుంబం ఆసుపత్రి బిల్లులు కట్టలేకపోతోందన్న వార్తలు పత్రికల్లో వచ్చాయి. ఆమె అప్పట్లో ముంబయి శివారల్లోని జోగేశ్వరిలోని బెహ్రామ్ బాగ్‍లో ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు. కొడుకు కోడలు, మనవరాలుతో ఉండేవారు. అప్పట్లో ఆమెకున్న ఆదాయమల్లా, గతించిన భర్త పని చేసిన సంస్థ ఇచ్చే ఫించను మాత్రమే. ఆ పెన్షన్ నెలకి రూ.800/- లని ఎన్‌డిటివి న్యూఛ్ ఛానెల్, నెలకి రూ.3000/-లని డిఎన్‌ఎ పత్రిక పేర్కొన్నాయి. ఏ మొత్తాన్ని తీసుకున్నా, భారతీయ ప్రమాణాల ప్రకారం దాన్ని చాలా తక్కువ మొత్తంగా పరిగణించాల్సిందే. ఒక మనిషి జీవితం ఆ డబ్బుతో ఎటూ గడవదు. ఫ్రీలాన్స్ డ్రైవర్‍గా పని చేసే ఆమె కొడుకు హుస్సేన్ షేక్‌కి నిలకడైన ఆదాయం లేదు. ఆమె సంరక్షణా భారమంతా కోడలు చూసుకునేది.

హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తమ కుటుంబానికి సాయం చేసిన ఏకైక వ్యక్తి – హీరో సల్మాన్ ఖాన్ మాత్రమేనని ఆమె కోడలు జరీనా హుస్సేన్ షేక్ – పత్రికల వాళ్ళకి తెలిపారు. సల్మాన్ ఆ కుటుంబానికి దీర్ఘకాలంగా సాయం చేస్తూ, ముబారక్ బేగం వైద్య ఖర్చులను భరించారు. 2016 జూన్ నెలలో మహారాష్ట్ర ప్రభుత్వంలోని బిజెపి మంత్రి శ్రీ వినోద్ తావ్డే ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వ పరంగా ఏ పథకమూ ఆ కుటుంబానికి వర్తించకపోవడంతో, ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమెకు కొంత ఆర్థిక సాయం చేయించారు.

***

“మా నాన్నా, పెద నాన్న పళ్ళు అమ్మేవారు. నన్ను సినిమాలకి తీసుకువెళ్ళమని గట్టిగా అడిగేదాన్ని. కానీ ఒకసారి లైట్స్ ఆరిపోయి, సినిమా మొదలయ్యాకా, నేను నిద్రపోయేదాన్ని. కానీ నాకు సంగీతం అంటే ఇష్టం. నూర్జహాన్ గారిలా పాడడం అసాధ్యం, కానీ నేను సురయ్యా గారిని ప్రేరణగా తీసుకున్నాను. ‘దూర్ పపిహా బోలా’, ‘పంఛీ జా’ పాటలు పాడేదాన్ని.” అన్నారు ముబారక్ బేగం. ఆమెది చాలా సరళమైన స్వరం. అందులో కృత్రిమత్వం ఉండేది కాదు.

తన కొద్దిపాటి ఆదాయంతో విసిగిపోయిన ముబారక్ బేగం తండ్రి, చిన్నారి ముబారక్‍ని బొంబాయి తీసుకెళ్ళి తన అదృష్టాన్ని, ఆమె ప్రతిభని పరీక్షించుకోవాలనుకున్నారు. 1950లో ఆకాశవాణిలో గజళ్లు పాడడం ద్వారా ఆమె తన కెరీర్‍ని ప్రారంభించారు. స్వరకర్తలు – మొదట రఫీక్ ఘజ్నవీ ఖాన్, తదుపరి రామ్ దర్యాని ఆమెకి సినిమాల్లో అవకాశమిచ్చారు. కానీ తనకి అప్పుడు వయసు కేవలం 11 ఏళ్ళే కావడంతో, చిన్నారి ముబారక్ మైక్ భయాన్ని అధిగమించలేకపోయారు. కానీ ఆమెకి చక్కని బ్రేక్ మాత్రం ‘మోహే ఆనే లగీ అంగ్డాయీ’ (Aiye చిత్రం) ద్వారా వచ్చింది. ఆ పాటకి సంగీతం కూర్చింది షౌకత్ దెహ్ల్వి. ఆ తరువాత కమల్ అమ్రోహి గారి Daera (1953) చిత్రంలో ఏడు పాటలు పాడే అవకాశం లభించింది. దురదృష్టవశాత్తు, ఈ సినిమా పరాజయం పాలవడంతో, ఆమెకు తగిన గుర్తింపు రాలేదు.

అయితే ఆమెకి మంచి పేరు మాత్రం బిమల్ రాయ్ గారి ‘దేవ్‌దాస్’ (1955) చిత్రంలో లభించింది. “నాకు మొదట రెండే వాక్యాలు పాడడానికి ఇచ్చారు – ‘వో నా ఆయేంగే పలట్ కర్, ఉన్హే లాఖ్ హమ్ బులాయేఁ’ అనేవి. అయితే నేను పాడిన విధానం సాహిర్ గారికి (గీత రచయిత) నచ్చడంతో, మొత్తం పాట రాశారు. బర్మన్ దా (స్వరకర్త స్వర్గీయ ఎస్.డి. బర్మన్) కూడా నచ్చి, నన్ను మెచ్చుకున్నారు. కానీ ఆయన అంతకు ముందు నన్ను స్వరం సరిజేసుకోమని హెచ్చరించిన సంగతి గుర్తొచ్చింది.”

తరువాత బిమల్ రాయ్ గారి ద్వారా ‘మధుమతి’ (1958) చిత్రంలో ‘హాల్ ఏ దిల్ సునాయేగీ’ పాట ద్వారా మరో హిట్ లభించింది.  ఆమె కొన్ని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. హమ్‌రాహి చిత్రంలోని ‘ముఝ్‌కో అప్నే గలే లగా లో’ పాటని 1960 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాడడాన్ని గుర్తు చేసుకున్నారు. “అప్పటి ఉత్తమ గాయని రికార్డింగ్‌కి రాకపోవడంతో నాకా అవకాశం దక్కింది. అది హమ్‌రాహీ చిత్రం థీమ్ సాంగ్.  కానీ నేను పాడిన తరువాత ఆ విషయం ఆమెకి తెల్సి అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ అప్పటికి పాడడానికి మరెవరూ లేరంటూ సంగీత దర్శకులు జైకిషన్ సర్దిచెప్పారు. ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్ కోసం నేను కశ్మీర్ ఎంపోరియం‍కి వెళ్ళి మంచి చీర కొనుక్కొన్నాను. రంగ్‍ భవన్‍లో తలత్ మహమూద్ గారితోనూ, మన్నాడే గారితోనూ పాటలు పాడుతుంటే, వేదిక బయట జనాలు కార్ల మీద ఎక్కి కూర్చుని విన్నారు. నా పాట ‘వో నా ఆయేంగే పలట్ కర్’కి విపరీతంగా చప్పట్లు కొట్టారు. ఆరోజు నాకు కప్పిన శాలువా ఇప్పటికీ నా దగ్గర ఉంది” చెప్పారామె.

Daera (1953) చిత్రం హీరోయిన్ మీనాకుమారితో ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. “నేను ధరించే కుర్తాలు, రాజస్థానీ మోజ్రీలంటే మీనాకుమారికి బాగా ఇష్టం. అందుకని ఆమె కోసం వాటిని తెప్పించి ఇచ్చేదాన్ని. ఆమె నాకోసారి వంగ పండు వన్నె అంచు ఉన్న తెల్ల చీర బహుకరించింది. ఆ చీర నాకెంతో అదృష్టాన్నిచ్చింది. దాన్ని ధరించినప్పుడల్లా రికార్డింగ్ సజావుగా జరిగిపోయేది. కానీ మీనా తరచూ విచారంగా ఉండేది. తల్లి కాలేకపోయినందుకు బాధపడేది. ఆమెది సరదా స్వభావం. తరచూ మోసపోతుండేది. ఆమె చివరి రోజుల్లో ఎవరూ ఆమెతో లేరు” చెప్పారు ముబారక్ బేగం.

‘కబీ తన్హాయియోం మే’ పాట పాడిన తరువాత జరిగిన సంఘటన గురించి ఇలా చెప్పారు: “రికార్డింగ్ జరుగుతుండగా, కేదర్ శర్మ అక్కడ కూర్చుని, కళ్ళు మూసుకుని పాట మొత్తం విన్నారు. పాట అయిపోయాకా, ఆయన లేచి నా చేతిలో నాలుగు అణాలు పెట్టారు. నేను తీసుకోడానికి సందేహించాను. అప్పుడు సంగీత దర్శకులు స్నేహల్ భత్కర్ ‘తీసుకో, ఆయనిచ్చిన డబ్బులు తీసుకున్నవారికి పేరొచ్చింది’ అన్నారు. ఆ పాట సూపర్ హిట్ అయింది. జనాలు జ్యూక్‍బాక్స్‌లో నాలుగు అణాలు వేసి రోజంతా ఆ పాటే వింటుండేవారు. పైగా ఆ పాట నేను పాడనా, లతాజీ అనా పందేలు వేసుకునేవారు”.

ఆమెకి చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. “గాయని స్వర్గీయ గీతా దత్ ఎవరినీ హేళన చేసేవారు కాదు. కానీ మిగతావారు చేసేవారు. నేను తట్టుకోలేకపోతే, నన్ను వెళ్ళిపొమ్మనేవారు. మరోసారి నాకో ఫోన్ కాల్ వచ్చింది. నేనా గొంతు గుర్తు పట్టలేక, ఎవరని అడిగాను. బదులుగా ‘నేను తలచుకుంటే నువ్వీ ఇండస్ట్రీలో ఉండవు’ అన్నారట ఆమె. ఆ తర్వాత గట్టిగా నవ్వేసి, తాను ఎవరో చెప్పారట. తనకేం కావాలో చెప్పారు.” అలాగే ఒకసారి రంజాన్ మాసం సందర్భంగా రూ.500/- ఉన్న కవర్ నాకు అందింది. దాని మీద అడ్రసులో ఓ ప్రసిద్ధ గాయని పేరు ఉంది. నేను ఆ చిన్నపాటి మొత్తం చూసి విస్తుపోయాను, అయినా దాన్ని ఓ శుభ శకునంలా బావించాను. ధన్యవాదాలు చెబుతామని ఆమెకు ఫోన్ చేస్తి, ఆమె చెల్లి మాట్లాడింది. ‘నాకు సాయం చేయాలని మీకు అనిపిస్తే, కాస్త పెద్ద మొత్తం పంపచ్చు కదా’ అని అన్నాను. ‘మా ఖర్చులకి కూడా పూర్తిగా సరిపోవడం లేదు’ అని ఆమె చెప్పింది.”

“నేను విజయవంతం కాకపోవడానికి కారణం ఎవరో ప్రపంచానికి తెలుసు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను గాయని నయ్యాను. పేరు కోసమో ప్రతిష్ఠ కోసమో నేనిక్కడకి రాలేదు. కొన్ని సినిమాలలో నా పాటలు తీసేశారు, లేదా వేరే వాళ్ళతో మళ్ళీ పాడించారు. ఇలా ఎందరో గాయనీ గాయకులకి జరిగింది. ‘ఫలానా వాళ్ళతో పాడిస్తే, మేం నీకెన్నడూ పాడం’ అని సంగీత దర్శకులని బెదిరించేవారు, వారు భయపడేవారు. వాళ్ళకి తమపైన తమకి నమ్మకం లేదు” అన్నారు ముబారక్ బేగం బాధగా.

డిప్రెషన్ లోకి వెళ్ళిన ముబారక్ బేగం నిద్రమాత్రలకి అలవాటు పడ్డారు. “నేను దిగులుగా, అన్నీ కోల్పోయిన దానిలా మారేసరికి నన్నో సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకువెళ్ళారు. నేను నా ఉపాధి కోల్పోయాను” అన్నారు.

జీవన పోరాటంలో ఎన్నో అవమానాలను సహించారు. “ఆయన కార్యక్రమాలలో అవకాశం ఇవ్వమని అడగడానికి రాజేంద్ర మెహతా (గజల్ గాయకుడు) ఇంటికి వెళ్ళాను. కానీ ఆయన నాకేం పని లేదన్నారు. నేను నితిన్ ముకేష్, తారీఖ్ హుస్సేన్ లను కూడా కలిసి వాళ్ళ కార్యక్రమాలలో అవకాశం అడిగాను. అయినా నిరాశే మిగిలింది. హెచ్‌ఎం‌వి వంటి మ్యూజిక్ కంపెనీలు నాకు రాయల్టీ ఇవ్వలేదు.  ప్రసిద్ధ గాయనీగాయకులు మాత్రం రాయల్టీ రాబట్టుకోగలిగారు” అన్నారు ముబారక్ బేగం.

అయితే ఆమె హృదయనాథ్ మంగేష్కర్‍ని మాత్రం తెగ మెచ్చుకునేవారు. “అతని మరాఠీ స్వరకల్పనలంటే నాకు ఇష్టం. ఒకసారి అతనికి పాడే అవకాశం వచ్చింది. నేను అక్కడి వెళ్ళినప్పుడు నేను అడగకుండానే అతను కొంత డబ్బు నా పర్సులో పెట్టాడు. చక్కని మర్యాదస్థుడు” అన్నారు. జావేద్ అఖ్తర్ గురించి కూడా ఆమె మంచిగా చెప్పేవారు. జావేద్ అఖ్తర్ పూనుకుని కళాకారుల కోటాలో ముఖ్యమంత్రి ద్వారా ఫ్లాట్ ఇప్పించారు. ఇటువంటి ఘటనల ద్వారా మంచితనం ఇంకా మిగిలి ఉందని, మంచి రోజులు ముందున్నాయన్న నమ్మకం కలుగుతుందని అన్నారు.

ముబారక్ బేగం 18 జూలై 2016 నాడు సుదీర్ఘ అనారోగ్యం కారణంగా తన ఇంట్లోనే మృతి చెందారు. ఆమె పాటలు ఈ క్రింది లింక్‌లలో చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=rpYFab53aqM

https://youtu.be/p609uIE2jCk

https://www.youtube.com/watch?v=ZPql6bs_4Dc


ప్రతిభ ఉన్నా గుర్తింపు పొందని నటుడు రహమాన్:

విధి అనండీ, దురదృష్టం అనండీ… తమ సామర్థ్యానికీ, ప్రతిభకి తగిన గుర్తింపుకు నోచుకోనివారు ఎందరో ఉన్నారు. హిందీ చిత్ర పరిశ్రమకి వస్తే, నటులు రహమాన్ అటువంటి దురదృష్టవంతుడే. తెరపై ఆయన అద్భుతమైన ప్రదర్శనలకు సహజంగా రావల్సిన మెచ్చుకోలు లభించని నటుడు. ఆయనను – అద్భుతమైన నటనాపటిమ, భగవద్దత్తమైన ప్రతిభ గల నటుడిగా ఎందరో ప్రేక్షకులు పేర్కొంటారు.

‘వక్త్’లో విలక్షణమైన షెనాయ్ శేఠ్ అయినా; ‘ప్యాసా’లో అధునాతన ప్రచురణకర్త అయినా; ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో దుర్మార్గుడైన జమీందారు (ఛోటే సర్కార్) అయినా; ‘చౌదవీ కా చాంద్’లో నవాబ్ అయినా – రహమాన్ (పూర్తి పేరు రహమాన్ ఖాన్) ఈ పాత్రలని ప్రశస్తమైన యుక్తితో పోషించారు. ఆయనలోని నట మేధావి దరిదాపుల్లోకి వచ్చేవారు నేటికి కూడా ఎవరూ లేరు.

1950, 60వ దశకాలలో నిర్మాతదర్శకులకు, ప్రేక్షకులకు ఈయన అభిమాన నటుడు. ‘ప్యార్ కీ జీత్’ (1948), ఇంకా ‘బడీ బెహన్’ (1949) వంటి సినిమాలతో కథానాయకుడిగా ప్రవేశించినా, త్వరలో సహాయక, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోకి మారిపోయారు. ‘ప్యార్ కీ జీత్’, ‘బడీ బెహన్’ చిత్రాలలో అందాల తార సురయ్యా హీరోయిన్.

ఎన్నో ప్రతినాయక పాత్రలు, నెగటివ్ పాత్రలు పోషించినా, వాటిని కూడా ఎంతో నైపుణ్యంగా, ఆకట్టుకునే హావభావాలతో, నిండైన స్వరంతో ప్రదర్శించారు. పైప్ తాగుతూ కళ్ళెగరేయడం, ప్యాంటు జేబులో ఒక చేయి పెట్టుకుని ఉండడం వంటివి ప్రేక్షకులని ఆకర్షించాయి. వ్యంగ్యాత్మక స్వరం, శుద్ధ ఉర్దూ ఉచ్చారణ – ఆయనకు మరింత ఉపకరించాయి.

రహమాన్ 1921లో లాహోర్‍లో జన్మించారు. కాలేజీ చదువు జబల్‍పూర్‌లో సాగింది. కొన్నాళ్ళు ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసారు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు వచ్చారు. ఒక సినిమాలో తలపాగా ధరించే పఠాన్‍ పాత్రకి ఎవరూ వెంటనే దొరకక, ఈయనే ఆ పాత్ర చేయవలసి వచ్చింది. బాగా నప్పడంతో, నటనలోకి ప్రవేశించారు.

కఠినమైన రూపం, విశాలమైన భుజాలు, గుచ్చి చూసే కళ్ళు, కరకు గొంతు లతో రహమాన్ సినిమాలో ఎన్నో పాత్రలలో ఒదిగిపోయారు. అది ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’లో 1850ల నాటి తాగుబోతు జమీందారు (భూస్వామి) పాత్ర కావచ్చు; లేదా ‘ఏ రాస్తే హైఁ ప్యార్ కే’ చిత్రంలోని సరసలాడే పోకిరి పాత్ర కావచ్చు.

రెండు పరస్పర వైరుధ్యాల మధ్య, ఈ నటుడు తెర మీద కొన్ని విశిష్ట పాత్రలు పోషించి, అద్భుతమైన నటనా పటిమని ప్రదర్శించారు. గత కాలపు పాత సినిమాల మార్గంలో ప్రయాణిస్తే మనకు – ‘చౌదవీ కా చాంద్’, ‘ప్యాసా’, ‘ధర్మ్‌పుత్ర’, ‘గజల్’, ‘దిల్ దియా దర్ద్ లియా’, ‘వక్త్’, ‘ఇంతకామ్’ వంటి ఎన్నో గొప్ప సినిమాలు తటస్థిస్తాయి. ఈ అన్ని సినిమాలో ఈ విశిష్ట నటుడి ప్రతిభ కళ్ళకు కడుతుంది.

రహమాన్ ఎన్నో పాత్రలు పోషించినప్పటికీ, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో విశేషంగా రాణించారు. అది ఆయన మాజీ సమకాలీనులకు అంత సులువుగా ఉండేది కాదు.  విలన్‍లు గట్టి కేకలతో, క్రూరంగా, మోటుగా ఉండే వందలాది సీన్‍లు భారతీయ సినిమాల్లో ఉంటాయి. అసాధారణమైన వైవిధ్యం, ఉత్తమమైన ఉడుపులతో పరమ క్రూరంగా, గోలగోలగా ఉండే వేషాలలో కొంత మేరకు ప్రాణ్ రాణించారు. కానీ రహమాన్‌ అందరి కంటే ఒక మెట్టు పైనే. విశ్వాస ఘాతకాన్ని నియంత్రణతో ప్రదర్శిస్తూ అతిపాపిష్టిగా కనబడేవారు. కేవలం కొన్ని ఉదాహరణలు చాలు ఆయన స్థాయి ఏంటో తెలిపేందుకు. ‘ప్యాసా’ సినిమాలో పార్టీ సీన్ తీసుకోండి, కవి విజయ్ హృదయ విదారకమైన ‘జానే వో కైసే లోగ్ థే జిన్ కో ప్యార్ సే ప్యార్ మిలా’ అని కవిత చదువుతున్నప్పుడు – రహమాన్ పిడికిలి బిగించి, కనుబొమలు ఎగురవేసి, తన అసంతృప్తిని, తిరస్కారాన్ని ప్రదర్శిస్తారో – చూసి తీరాలి. ఆ నిశ్శబ్ద క్రోధం ఎంత శక్తివంతమైనదంటే, ప్రేక్షకులు కవులంటే ఎంతో బెదిరిపోతారు. భావ వ్యక్తీకరణలో క్లుప్తతకి ఇది గొప్ప ఉదాహరణ. ఆ పాత్ర థియేటర్‍లో అందరి క్రోధానికి లోనయ్యే క్షణం అది!

రహమాన్‌కి గంభీరమైన, శక్తివంతమైన, ఆకట్టుకునే స్వరం ఉంది. అయితే ఆయన గొంతు కాన్సర్‍తో మరణించడం గొప్ప విషాదం. 1965 నాటి బి.ఆర్. చోప్రా సినిమా ‘వక్త్’లో షెనాయ్ శేఠ్‌గా ఆయన ప్రదర్శన ఎంతో విలక్షణమైంది. ఆ సినిమాలో రాజ్‍కుమార్ పట్ల వైషమ్యం ప్రదర్శించినా, ప్రేక్షకులు రహమాన్ శైలిని, రూపాన్ని ఇష్టపడ్డారు. ‘జాని’ రాజ్‍కుమార్‌కి సరైన జోడీ అనిపించుకున్నారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే దృశ్యాలు – ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గరి దృశ్యాలు – మన చిత్ర పరిశ్రమ యొక్క తొలి మల్టీ-స్టారర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి. విలక్షణమైన స్వరం, గంభీరమైన డైలాగ్ డెలివరీకి పేరుపొందిన రాజ్‍కుమార్‌కి ధీటుగా రహమాన్ ప్రతినాయక పాత్రలో ఇమిడిపోయారు. నిజానికి ‘జాని’ కన్న రహమానే ఎక్కువ నియంత్రణ చూపించారు. ఎంత పొందికగా, ఎంత మర్యాదగా ఒక దుష్ట వ్యక్తి తాను అనుకున్నది సాధించగలడో ‘వక్త్’లో షెనాయ్ శేఠ్‌ పాత్ర తెలుపుతుంది. గుర్తుంచుకోదగ్గ ప్రదర్శన!

‘ప్యాసా’ సినిమాలో సంపన్న ప్రచురణకర్త ‘మిస్టర్ ఘోష్’గా కనిపిస్తారు రహమాన్. భద్రలోకపు వ్యక్తిగా కనిపించేలా ధోతీ-కుర్తాతో, ఒక తెల్లని అంగవస్త్రంతో ఉంటారు. విశ్వాసం కలిగిన ప్రొఫెషనల్‍గా కనిపిస్తూనే, అభద్రతతో కూడిన స్వాధీన భర్త పాత్రలో లీనమయ్యారు. జానీ వాకర్, అబ్రార్ అల్వీ వలె రహమాన్ కూడా గురుదత్ టీమ్‍లో కీలకమైన వ్యక్తి. ప్యాసా, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, చౌదవీ కా చాంద్ – చిత్రాలలో విశేష ప్రతిభ కనబరిచారు.

వీటన్నిటిలోనూ, ఆయన గురుదత్‌తో పని చేశారు. వాళ్ళిద్దరిదీ సంతులనమైన, నియంత్రితమైన నటనా విధానం. ఈ క్లాసిక్ చిత్రాలు విజయవంతమవడానికి దోహదం చేశారు. నెగటివ్ పాత్రలను పోషించనప్పుడు ఆయన ప్రతిభ మరీ వెల్లడయేదనేది బహిరంగ రహస్యం. మేరే హమ్‍దమ్ మేరే దోస్త్, బహారోం కీ మంజిల్, వక్త్, బహరేఁ ఫిర్ భీ ఆయేంగీ వంటి చిత్రాలు ఇందుకు ఋజువులు. ప్యాసా, బహారోం కీ మంజిల్, ఆంధీ చిత్రాలో బెంగాలీ పాత్రలు పోషించగా, ఎన్నో సామాజిక చిత్రాలలో ముస్లిం పాత్రలు పోషించారు రహమాన్.

సుప్రసిద్ధ ‘తాజ్‍మహల్’ (1953) చిత్రంలో ఆయన చక్రవర్తి జహంగీర్ పాత్రలో విశేష నటన కనబరిచారు. పాల్కి (1967) చిత్రంలో ఆయన నవాబ్ మీర్జా; దిల్ నే ఫిర్ యాద్ కియా (1966) చిత్రంలో అంజాద్‌గా; ధర్మేంద్ర ఆప్త మిత్రుడిగా నటించారు. ధర్మపుత్ర (1961) సినిమాలో, బానో (మాలా సిన్హా)ని పెళ్ళి చేసుకున్న జావేద్‍గా; గజల్ (1964) సినిమాలో అఖ్తర్ నవాబ్‌గా రాణించారు. ఈ సినిమాలకి ఈ పాత్రల ఎంతో ముఖ్యమైన మలుపులిచ్చారు. 1974 నాటి ఆప్ కీ కసమ్ చిత్రంలో హీరోయిన్ ముంతాజ్‌కి తండ్రిగా నటించారు రహమాన్. సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో ఆయన సన్నివేశాలు అందరికీ ఆకట్టుకున్నాయి.

మేరే హమ్‍దమ్ మేరే దోస్త్ చిత్రంలో అజిత్ నారంగ్‍గా షర్మిలా టాగూర్‍ని; బహరేఁ ఫిర్ భీ ఆయేంగీ చిత్రంలో మిస్టర్ వర్మగా మాలా సిన్హాను వెంటాడి వేధించే ఆకతాయి పాత్రలలో ఆయన నటన గొప్పగా ఉంటుంది. రహమాన్ నటనని ఒక్క మాటలో చెప్పాలంటే ‘సునాయాసం’ అని చెప్పచ్చు. ఆయన ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. తన పనే తన గురించి మాట్లాడాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయనకు ఆయనే సాటి, ఆయనతో పోల్చేందుకు మరో నటులు అలాంటివారు లేరు. చూపుల్లో తీక్షణత, దృఢమైన వైఖరి, కళలో పూర్తి నియంత్రణ ఉన్న రహమాన్‍ని ప్రేక్షకు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు, అభిమానిస్తారు. ఏ రకం దుస్తులు ధరించినా, భారతీయత ఉట్టి పడేవైనా, విదేశీ దుస్తులైనా ఆయన ఎంతో అందంగా కనబడేవారు.

‘బడీ బెహన్’ సినిమాలో సురయ్యాతో ఆయనపై చిత్రీకరించిన ‘చుప్ చుప్ ఖడే హో, జరూర్ కోయి బాత్ హై’ పాట ఎన్నటికీ  జ్ఞాపకాలలో నిలిచి ఉంటుంది. అక్కడి సాగిన ఆయన ప్రస్థానం సుదీర్ఘం. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఠీవి – ఎందరో దర్శకులను ఆయనకు అభిమానులుగా చేసింది. ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారు.

అయితే రహమాన్ ఫర్‌ఫెక్షనిస్ట్ అనీ, అంత తొందరగా ఏ షాట్‌నీ అంగీకరించేవారు కాదని సుప్రసిద్ధ నిర్మాత సతీందర్ సింగ్ బ్రోకా చెబుతూ, “ఎక్స్‌ట్రా టేక్స్ కోసం ఆయన పట్టుబట్టడం చూసి చాలామంది ఆయనని కోడాక్ (ఫిల్మ్ రోల్స్ సప్లయి చేసే కంపెనీ) ఏజంట్ అని అంటుండేవారు” అని అన్నారు. గురుదత్, డి.డి. కశ్యప్, రమేష్ సైగల్, యాష్ చోప్రా వంటి అభిమాన దర్శకులు మాత్రం ఎక్స్‌ట్రా టేక్స్ కోసం ఆయన పట్టుదలని ఆర్థం చేసుకునేవారనీ, ఇతర దర్శకులు అదనపు వ్యయం గురించి ఆలోచించేవారి సతీందర్ సింగ్ చెప్పారు. సీన్ ఉత్తమంగా రావడానికి అది ఆయన పడే తపన అని గ్రహించిన వారెవ్వరూ ఎటువంటి ఫిర్యాదులు చేసేవారు కాదు.

బొంబాయిలో కొలాబా ప్రాంతంలో రీగల్ సినెమా వెనుక నివాసం ఉండేవారు అన్న విషయం తప్ప ఆయన వ్యక్తిగత విషయాలేవీ ఎవరికీ పెద్దగా తెలియవు. భార్య పట్ల గౌరవంగా ఉండేవారట. దర్శకుడు లేఖ్ టాండన్ అందించిన వివరాల ప్రకారం – 1950లలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తనకి అండగా ఉన్న నేస్తాన్నే రహమాన్ పెళ్ళి చేసుకున్నారు. భార్య తన కోసం చేసిన త్యాగాన్ని గ్రహించిన ఆయన ఆమె పట్ల నిబద్ధతతో నడుచుకున్నారు. సినీరంగంలోని మిత్రులయిన గురుదత్, జానీ వాకర్, అబ్రార్ అల్వీ లతో సన్నిహితంగా ఉండేవారు. ఇతరత్రా సినీరంగానికి దూరంగా ఉండడం వల్ల, ఆయన గురించి, కుటుంబం గురించి ఎలా పుకార్లు, పత్రికల్లో కథనాలు లేవు. “ఎలాంటి పాత్ర లభించినా, దాన్ని తనదైన రీతిలో గొప్పగా పోషించే అరుదైన నటులలో ఆయన ఒకరు” అని లేఖ్ టాండన్ అన్నారు. అలాగే ప్రేక్షకులకి కూడా నటుడిగా ఆయన గొప్పతనం తెలుసు. కొద్దిగానే జ్ఞాపకం ఉన్నప్పటికీ, ఎన్నటికీ మరువరాని మెలొడీ లాంటి రహమాన్ మన హృదయాలలో మెరుస్తారు.

***

‘బడీ బెహన్’ సినిమాలోని ‘చుప్ చుప్ ఖడే హో, జరూర్ కోయి బాత్ హై’ పాట:

https://www.youtube.com/watch?v=-btaTuMDqbE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here