అలనాటి అపురూపాలు-108

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ఫటాఫట్ జయలక్ష్మి మరణం గురించి ఆమె తండ్రి మాటల్లో:

సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఫటాఫట్ జయలక్ష్మి అకాల మరణం పాలయ్యారు. 1982లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తండ్రి దశరథరామిరెడ్డి తన కూతురు గురించి పలు వివరాలు చెప్పారు.

~

“నాన్నా, సుకుమార్‍ని మరిచిపోయి, జీవితంలో ముందుకువెడతాను. ఇంకొన్ని సినిమాలలో నటిస్తాను…” అని చెప్పిన నా కూతురు మమ్మల్ని మోసం చేసి 19 జూన్ 1982 నాడు ఆత్మహత్య చేసుకుంది” అని వాపోయారాయన.

“మా అమ్మాయి ‘కుంకుమమ్ కథై సొల్గిరదు’ సినిమాలో నటించినప్పుడు సుకుమార్‍తో తనకి పరిచయం అయ్యింది. అతనితో పీకల్లోతు ప్రేమలో పడింది. చేసుకుంటే అతన్నే పెళ్ళి చేసుకుంటాననీ, లేకపోతే చనిపోతానని మాతో అంది. మేం భయపడ్డాం, మా అందరికీ మా అమ్మాయి అంటే ఎంతో ప్రేమ. సరే, అలాగే పెళ్ళి చేసుకో అన్నాం. సుకుమార్ అంటే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ గారి అన్న కొడుకు. పెళ్ళికి వాళ్ళు కూడా అంగీకరించారు. సుకుమార్ ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు కూడా పెళ్ళికి ఆమోదం తెలిపారు. అన్ని సందర్భాలకీ మా అమ్మాయి వారి ఇంటికి వెళ్ళి వచ్చేది. అయితే ఆ ఇంట్లో తాను ఒంటరిననే భావం కలిగిందని మా అమ్మాయి మాతో అంది. ఆ కుటుంబ సభ్యులు కూడా మా ఇంటికి చాలా సార్లు వచ్చారు. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అర్థం కావడం లేదు. కారణాలు నాకు నా సమాధిలోనే లభిస్తాయోమో!

మా అమ్మాయి ఇప్పుడు లేదు, ఆ కుటుంబాన్ని మేమిప్పుడు ఏం అనగలం? కనీసం బాధను కూడా వ్యక్తం చేయలేదు వారు, అది మరీ బాధగా ఉంది మాకు. మేం మౌనంగా ఉండిపోయి, ఇక్కడ్నించి వెళ్ళిపోవడమే వాళ్ళకి కోరుకుంటున్నారని మాకు అర్థం అవుతోంది. మా అమ్మాయికి వేరే ఎవరితోనూ సంబంధాలు లేవు. తన కెరీర్‍లో ఎంతో కష్టపడింది. అతన్ని పెళ్ళి చేసుకోమని అడిగితే, సినిమాలు మానేయ్ అన్నాడట. అందుకని – ఆరోగ్య కారణాల వల్ల సినిమాలు విరమించుకుంటున్నట్టు ప్రకటన ఇచ్చింది. కానీ ఆ తర్వాత పెళ్ళి మాటెత్తినప్పుడల్లా అతను మా అమ్మాయిని పట్టించుకునేవాడు కాదు, తనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు. అమ్మాయి – నిద్రమాత్రలు మింగి – చనిపోవడానికి రెండు సార్లు ప్రయత్నించింది. అమ్మాయి చనిపోయిందని ఆ కుటుంబానికి తెలిపినా, ఎవరూ చూడడానికి రాలేదు. తెలుగు, తమిళ భాషల నుంచి నటీనటులు ఎవరూ చూడడానికి రాలేదు, కనీసం సంతాపం కూడా తెలపలేదు.

38 ఏళ్ళ క్రితం నేను మద్రాసు వచ్చాను. ప్రతిభ, పద్మిని ఫిల్మ్స్ వారికి సహాయ దర్శకుడిగా పని చేశాను. 20 ఏళ్ళు జెమినీ ఫిల్మ్స్‌లో పని చేశాను. ఎస్.ఎస్. బాలన్ సినిమా ‘అందరూ మంచివాళ్ళే’ కి మాటలు రాశాను. భానుమతి గారి ‘బాటసారి’, బి.ఎన్.రెడ్డి గారి ‘పూజాఫలం’తో సహా అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించాను.

అప్పట్లో నేను వాహినీ సంస్థలో ప్రొడక్షన్ విభాగంలో పని చేస్తున్నాను. మా అమ్మాయి నన్ను చూడడానికి వచ్చేది. బి.ఎన్.రెడ్డి గారికి మా అమ్మాయి ఎంతో నచ్చేసింది. తనతో మాట్లాడి, ‘మీ అమ్మాయి బాగా మాట్లాడుతుందయ్యా, తెలివైనది’ అనేవారు. బి.ఎన్.రెడ్డి గారు ‘బంగారు పంజరం’ తీస్తున్నప్పుడు ఆ సినిమాకి ఒక టీనేజ్ పాప కావలసి వచ్చింది. ఆ విధంగా మా అమ్మాయికి ఆ సినిమాలో అవకాశం వచ్చింది. బి.ఎన్.రెడ్డి గారి ఆప్తమిత్రుడు మల్లిప్రియ నాగరాజు ‘బంగారు పంజరం’ రషెస్ చూశారు. ఆ సినిమాలో నాయిక వాణిశ్రీ హీరో శోభన్ బాబు నుంచి వేరవుతుంది. రైల్లో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడో ముసలామె అంధురాలైన తన 12 ఏళ్ళ మనవరాలితో – ఒక పాట పాడుతుంది. ‘తుమ్మెదా తుమ్మెదా పాలరాతి మీద తుమ్మెద’ అనేది ఆ పాట. ఆయనకి ఆ పాటలో ఆ పాప నటన బాగా నచ్చేసింది. వాణిశ్రీ కూడా ఆ అమ్మాయి భవిష్యత్తులో గొప్ప నటి అవుతుందని ఆశీర్వదించారు. కొన్నాళ్ళకి నాగరాజు గారు వాహిని స్టూడియోలో ఒక అమ్మాయిని చూశారు. ‘మన దశరథ రామిరెడ్డి కూతురు’ అని బి.ఎన్.రెడ్డి పరిచయం చేశారు. ‘మన సినిమాలో గుడ్డి పిల్లగా నటించింది ఈ అమ్మాయే’ అన్నారు. తర్వాత వ్రాసిన ఓ వ్యాసంలో నాగరాజు – ‘ఇంత అందమైన అమ్మాయిని మేకప్‌తో బిచ్చగత్తెగా మార్చేశారు’ అని వ్రాశారు.

[ఆమెని ఎవరైనా మీకిష్టమైన దర్శకులు దాసరియా లేక బాలచందర్ గారా అని అడిగితే, ఆమె – వాళిద్దరూ కాదు, బి.ఎన్. రెడ్డి గారు అని చెప్తారు. తన చివరి చిత్రం ‘చందమామ’లో ఆమె ప్రేమలో విఫలమయి, ఆత్మహత్య చేసుకునే మహిళ పాత్రలో నటించారు, ఆమె నిజజీవితంలో కూడా అలాగే జరగడం విషాదం.]

తన రెండో సినిమా – ఇద్దరు అమ్మాయిలు అనే తెలుగు సినిమా. దీనిలో అతను అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెలుగా నటించింది. అదే ఏడాది, ఎ. విన్సెంట్ గారి మలయాళం సినిమా ‘తీర్థయాత్ర’లో సుప్రియ అనే పేరుతో నటించింది. తర్వాతి సినిమా 1973లో వచ్చిన ‘ఇదు మనుష్యానో’. 1974లో హీరోయిన్‌గా తమిళ చిత్రాలలో ప్రవేశించింది. మొదటి సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలో ‘అవల్ ఒరు తొదర్ కథై’ (తెలుగులో ‘అంతులేని కథ’). ఈ సినిమాలో తన పేరు ‘జయలక్ష్మి’ అని వేశారు. 1975లో ‘దేవర కన్ను’ సినిమాతో కన్నడంలో హీరోయిన్‍గా అయ్యింది. ‘అంతులేని కథ’ సినిమాలో ‘ఫటాఫట్’ అనే డైలాగుతో అమ్మాయికి బాగా పేరు వచ్చింది. చివరికి అది తన ఇంటిపేరు అయిపోయింది. అవల్ ఒరు తొదర్ కథై, అంతులేని కథ, ఆరిలిరింతు అరుబతు వారై, ముల్లుం మలారం, వంటి సినిమాలు మా అమ్మాయికి పేరు తెచ్చాయి. మా అమ్మాయి – రజనీకాంత్, కమల్  హాసన్, చిరంజీవి వంటి వారితో నటించింది [2018లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో – తామిద్దరం కలిసి నటించినవి కొన్ని సినిమాలే అయినా, ఫటాఫట్ జయలక్ష్మి తన అభిమాన నటి అని చెప్పారు రజనీకాంత్].

మా అమ్మాయి తెలుగులో 30; తమిళం, కన్నడం, మలయాళం భాషలలో 45 సినిమాలలో నటించింది. మా అమ్మాయి అత్యధిక పారితోషికం తీసుకున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అమ్మాయి మద్రాసులో చదువుకుంది. తెలుగు, తమిళం, ఇంగ్లీషు బాగా మాట్లాడుతుంది. పెద్దన్న మనుచరిత్ర కావ్యం బాగా నేర్చుకుంది. పుస్తకం తీయకుండా ఏ పద్యాన్నయినా సులువుగా చదివేస్తుంది. అంత తెలివైనది. డబ్బింగ్‍లో మా అమ్మాయికీ, సరితకీ మంచి పోటీ ఉండేది. డబ్బింగ్‍లో తన చివరి సినిమా ‘న్యాయం కావాలి’. హీరోయిన్ రాధిక పాత్రకి డబ్బింగ్ చెప్పింది. పైగా ఆ సినిమా మా అమ్మాయి నటించింది కూడా. టైలరింగ్ తన హాబీ. ఖాళీ సమయం దొరికితే ఏదైనా కుట్టుకునేది. కింద నేల మీద కూర్చొని వాళ్ళమ్మతో కబుర్లు చెప్పేది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, అలా గంటల కొద్దీ నవ్వుకునేవారు. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఎలా ఓదార్చను?

 

నాకిప్పుడు 59 ఏళ్లు. నాకు దర్శకత్వం చేసే అవకాశం ఎన్నడూ రాలేదు. ఆరుగురు సభ్యులున్న మా కుటుంంబం మద్రాసు వదిలి ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. నా గుండె నిండా వ్యథ. మా అమ్మాయి చనిపోవడానికి పాతికేళ్ళు ఏమయినా పెద్ద వయసా?”.


తన గురించి తాను ఎం.ఎస్. విశ్వనాథన్:

మలయాళం, తెలుగు, తమిళ సినిమాలకు తమ ప్రతిభతో మధురిమలు అందించిన సంగీత దర్శకులు ఎందరో. వారిలో శ్రీ ఎం.ఎస్. విశ్వనాథన్ ప్రముఖులు. ఆయన జీవిత చరిత్ర ఇప్పటికే ఇంటర్‍నెట్‌లో అందుబాటులో ఉంది. కానీ ఆయన గురించి ఆయన చెప్పిన విషయాలని ఇప్పుడు చదువుదాం:

“నేను సాంప్రదాయక మలయాళీ కుటుంబానికి చెందినవాడిని. నేను 24 జూన్ 1928 నాడు పాలక్కాడ్ తాలూకాలో ఎలప్పళి గ్రామంలోమనయంగత్ సుబ్రమణియణ్, నారాయణి (నారాయణకుట్టి లేదా నానికుట్టి) దంపతులకు జన్మించాను. నాకు నాలుగేళ్ల వయసులో మా నాన్న చనిపోయారు. పేదరికాన్నీ, ఆసరా లేకపోవడాన్ని భరించలేక మా అమ్మ, నన్నూ, మా సోదరిని చంపేసి, తనూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ చివరి నిమిషంలో మా తాతగారు రావడంలో మాకు ప్రమాదం తప్పింది. మా తాతగారు కృష్ణన్ నాయర్ కన్నూరు సెంట్రల్ జైలుకి వార్డెన్‌గా పనిచేసేవారు. మా దుస్థితి గమనించి మమ్మల్ని ఆయన తనతో కన్నూరుకి తీసుకెళ్ళిపోయారు. ఒకసారి జైలులో ప్రదర్శించిన ‘హరిశ్చంద్ర’ నాటకంలో నాచేత లోహితాశ్యుడి పాత్ర వేయించారు తాతయ్య. అది నా మొదటి నాటకం. చిన్నవాడిగా ఉండగా, నేనో సినిమా థియేటర్‍లో, జీతం లేకుండా తినుబండారాలు అమ్మాను; పాటలు వినవచ్చనే కారణంతో. సంగీతం పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన తాతయ్య నాకు సరైన పద్ధతిలో సంగీతంలో శిక్షణ ఇప్పించాలనుకున్నారు. ఆనాటి గొప్ప గాయకుడు, నటుడు అయిన నీలకంఠ భాగవతార్ వద్ద చేర్పించారు. నేను వారి ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తూ నెలకి రెండు రూపాయల జీతం తీసుకున్నాను. బాగా పని ఎక్కువగా ఉండడంతో, నాకు సంగీతం నేర్చుకునే అవకాశమే ఉండేది కాదు. అయినా తోటి విద్యార్థులతో పాడుతూ, ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడిని. అతి కష్టం మీద హార్మోనియం వాయించడం నేర్చుకున్నాను. ఒక రోజు హార్మోనియం వాయిస్తున్నాను, గురువుగారు వింటున్నారని నాకు తెలియదు. అది ఆయనకి నచ్చింది. “సరైన శిక్షణ లేకుండానే ఇంత బాగా వాయిస్తున్నావు, మంచి శిక్షణ ఇస్తే ఇంకా రాణిస్తావు” అంటూ నాకు ఉచితంగా శిక్షణ ప్రారంభించారు. తరువాత ఏడేళ్ళ వయసు నుంచి కచేరీలు చేయసాగాను. కేరళ అంతా తిరిగి ప్రదర్శనలిచ్చాను. మూడు గంటల పాటు ఏకధాటిగా పాడేవాడిని. ఆ వయసులో నాకు త్యాగరాజ భాగవతార్, యం.యస్ సుబ్బులక్ష్మి గార్లంటే బాగా అభిమానం. ఆయన పాటలు తెగ వినేవాడిని, సుబ్బులక్ష్మి సినిమాలు బాగా చూసేవాడిని. సినిమాల కన్నా నాకు సంగీతం అంటేనే ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఒకసారి తిరువూరులో ఉండే మా మావయ్య ఎల్.ఆర్.జి. నాయుడు వద్దకు వెళ్ళాను. ఆయన సిఫార్సుతో ఎం. సోమ సుందరం, ఎస్.కె. మొహియుద్దీన్ గారి వద్ద జుపిటర్ ఫిల్మ్స్‌లో చేరాను. కన్నాంబ గారితో ‘కన్నగి’ సినిమా తీస్తూ, ఈ బృందం తిరువూరు నుంచి మద్రాసు వెళ్ళిపోయింది. నేను కూడా మొదటిసారిగా మద్రాసు వెళ్ళాను వాళ్ళతో పాటు.  సినిమా రంగంలో ఇది నా తొలి అడుగుగా చెప్పవచ్చు.

అప్పట్లో నేను జుపిటర్ పిక్చర్స్ వారి ఆఫీసులో పని చేస్తునే కన్నగి, మహా మాయ, కుబేర – కుచేల వంటి సినిమాలలో నటించాను. హార్మోనియం కూడా వాయించేవాడిని. నాకు అప్పట్లో నెలకు మూడు రూపాయలిచ్చేవారు. నా ముఖం సినిమాలకు పనికిరాదని, నటన మానేసి, సంగీతంపై దృష్టి నిలపాలని నిర్ణయించుకున్నాను. అప్పట్లో నాకు ఎస్.వి. వెంకట్రామన్ గారి ప్రాపకం దొరకటం నా అదృష్టం. సినీ సంగీతం సృజించటంలోని మెలకువలెన్నో ఆయన నాకు నేర్పారు.

నటులు టి.ఎస్. బాలయ్య నన్నెలాగో ఒప్పించి మళ్ళీ నాటకాలలో నటింపజేశారు. అన్నీ చిన్నా చితకా పాత్రలే. వాటితో విసుగుపెట్టి, అవన్నీ వదిలేసి మళ్ళీ జుపిటర్ పిక్చర్స్ వారి వద్ద పనికి చేరాను. ఈసారి కె.వి. మహదేవన్ గారి సిఫార్సు మీద – స్వరకర్త ఎస్.ఎమ్. సుబ్బయ్య నాయుడు గారి వద్ద హార్మోనిస్టుగా పని దొరికింది.

స్వరకర్తలు సి.ఆర్. సుబ్బరామన్, టి.కె. రామమూర్తి – ‘వెలైక్కరి’ కోసం జుపిటర్ ఫిల్మ్స్ వారి దగ్గర చేరారు. నేను వాళ్ళని పరిచయం చేసుకున్నాను. ముగ్గురం మిత్రులం, సహోద్యోగులయ్యాం. వారితో పాటు నేను మళ్ళీ మద్రాసు వచ్చాను. నేను వైరం అరుణాచల చెట్టియార్ అండ్ కంపెనీలో వారి ఆర్కెస్ట్రా బృందంలో పని చేస్తుండగా, అక్కడ ఎస్.ఎమ్. రాజా అనే వ్యక్తి ఉండేవారు. ఆయన నాకు ‘జనోవా’ అనే సినిమాకి సొంతంగా సంగీత దర్శకత్వం చేసే అవకాశం ఇప్పించారు. ఆ సినిమాకి ఎం.జి.ఆర్. హీరో. నా ప్రతిభ ఆయనకి నచ్చింది. నాతో చాలా సినిమాలు చేశారు.

1952లో సి.ఆర్. సుబ్బరామన్ అనుకోకుండా చనిపోయారు. నేను – రామమూర్తి కలిసి ఒక జట్టుగా ఏర్పడి – సుబ్బరామన్ అప్పటికే అంగీకరించిన/సగం చేసిన సినిమాలు – దేవదాస్, చండీరాణి, అమ్మలక్కలు/మరుమగళ్ వంటివాటికి నేపథ్య సంగీతం పూర్తిచేసాం. తరువాత మాకు 1952లో ‘పాణం’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం దొరికింది. అప్పట్నించి మేం వెనుదిరిగి చూసుకోలేదు.”

***

ఎన్.టి.ఆర్, జమున, అంజలీదేవి నటించిన ‘సంతోషం’ చిత్రంలో విశ్వనాథన్ సంగీతం అందించిన పాట చూడండి

https://www.youtube.com/watch?v=GY7TzRPIam4

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here