Site icon Sanchika

అలనాటి అపురూపాలు-112

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

సీనియర్ సముద్రాల గురించి జూనియర్ సముద్రాల మాటలలో:

సముద్రాల రాఘవాచార్య అంటే సినీ ప్రపంచంలో చిరపరిచితులు. సీనియర్ సముద్రాలగా పేరుపొందిన ఈయన రచయిత, నిర్మాత, దర్శకులు, నేపథ్యగాయకులు కూడా. తన తండ్రి గురించి, తన గురించి జూనియర్ సముద్రాల (సముద్రాల రామానుజాచార్య) ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం. వారి మాటల్లోనే:

“1950ల తొలినాళ్ళలో నటులు కస్తూరి శివరావు ‘అగ్ని మంత్రం’ అనే సినిమా తీద్దామనుకున్నారు. కాని అది మధ్యలో ఆగిపోయింది. ఆయనే నన్ను తొలిసారిగా ‘సముద్రాల జూనియర్’ అని పిలిచారు. ఆ తర్వాత ‘శాంతి’ (1952) సినిమాకి రాయడానికి డి. ఎల్. నారాయణ అవకాశం ఇచ్చారు. దాంతో అది నా మొదటి సినిమా అయ్యింది. ఆయన నా పేరును ‘సముద్రాల జూనియర్’ అని రాశారు. దాంతో అప్పటిదాక ‘సముద్రాల’గా ఉన్న నాన్న పేరు ‘సముద్రాల సీనియర్’ అయ్యింది. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు – వాల్మీకి రామాయణం – రచించిన శ్రీనివాస శిరోమణి నన్ను పిలిచి – “ఒరే, నిన్ను సముద్రాల రాఘవాచార్య కొడుకు అని పిలవరు, మీ నాన్నను సముద్రాల రామానుజాచార్య నాన్న అంటారు రా” అన్నారు. ఆయన చెప్పింది నిజమైంది. ఎన్.టి.రామారావు, ఇతర మిత్రులు నన్ను ‘జూనియర్ భాయ్’ అని పిలుస్తారు. [గమనిక: సముద్రాల జూనియర్, ఎన్.టి.ఆర్. బాగా సన్నిహితులు. ఈ జోడి కలయిక ‘పాండురంగ మహాత్యం’ని గొప్ప హిట్ చేసింది. జయ కృష్ణా ముకుందా మురారి, అమ్మా అని అరిచినా – వంటి పాటలు ఎంతో జనాదరణ పొందాయి. ఎన్.టి.ఆర్.కి ఒంట్లో బాలేకపోతే, జూనియర్ – అటెండెంట్‌గా ఉండేవారు. చాలా ఏళ్ళ తరువాత సముద్రాల జూనియర్ కాన్సర్ బారిన పడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్నప్పుడు ఎన్.టి.ఆర్. ఆయన చికిత్సకి సహకరించారు. ఆయనను ఓదార్చారు]. అయితే మా నాన్న నా పేరులో మా ఇంటి ఇలవేల్పు పేరుతో – వెంకట – చేర్చారు.

మద్రాస్ యూనివర్శిటీ నుంచి నుంచి  బి.ఎస్.సి చేశాను. అక్కడ వాళ్ళు నన్ను ఎస్.వి. రామానుజం, బి.ఎస్.సి. అనేవారు. నా ఇన్‌కమ్ టాక్స్ ఉత్తరాలన్నీ ఆ పేరు మీదే ఉన్నాయి. ఇవన్నీ నా కేశవ నామాలు. ఇంకో విషయం చెప్పాలి. భారతి పత్రికకి నేను కవితలు రాసేవాడిని. వాళ్ళు నా పేరు ‘సముద్రుడు’ అని వేసేవారు. ‘అగ్ని పరీక్ష’ కోసం ఒక పాట రాశాను. అందులో నా పేరు ‘సముద్రుడు’ అని వేశారు. నేనూ, నాన్నా కలిసి కవితలు రాశాం, అవి ‘కడలి పొంగులు’ పేరుతో ‘సముద్రులు’ పేరిట ప్రచురితమయ్యాయి.

మా కాలంలో నాన్నలంటే ఎంతో కఠినంగా ఉండేవారు. నాన్నలు ముందు గుమ్మం నుంచి వస్తుంటే, పిల్లలు పెరటి గుమ్మం నుంచి బయటకి పారిపోయేవారు. తాము తండ్రులైనా, తమ నాన్నలని చూస్తే పిల్లలు వణికిపోయేవాళ్ళు. ఆ పెంపకం అలాంటింది. మా నాన్న అలాకాదు. నాతో చక్కగా ఉండేవారు, నన్ను ఎప్పుడూ కొట్టలేదు. 16 ఏళ్ళు వచ్చేసరికి పిల్లలని స్నేహితుల్లా చూడాలని అంటారు. నాన్న నాకు కామ శాస్త్రం నుంచి వ్యోమ శాస్త్రం వరకూ అనీ నేర్పించారు. ఇప్పుడు కూడా మేం కాసేపు కలిసి చదువుకుంటాం, ఆ తర్వాతే నిద్రపోతాం.

నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా ‘ప్రేయసి పద్యాలు’ రాశాను. వాటిని నాన్నకి చూపించాను. ఏవైనా తప్పులుంటే దిద్దేవారు. నేను సాహిత్యం చదువుకోవాలనుకున్నాను, నాన్న నన్ను బిఎస్‍సి చదివించారు. ఆ తర్వాత నాతో రేడియో ఇంజనీరింగ్‍లో డిప్లొమా చేయించారు. తన పలుకుబడితో నన్ను వాహిని స్టూడియోలో రికార్డిస్ట్‌గా చేర్పించారు. ఆ వయసులో ఏ ఉద్యోగమైనా బానిసత్వంలా ఉంటుంది, కానీ ఈ ఉద్యోగంలో కొంత స్వేచ్ఛ ఉంటుంది అన్నారాయన. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఆయన ఎంతో కష్టపడ్దారు, బహుశా అటువంటి కష్టాలు నేను పడకూడదనేది ఆయన ఉద్దేశం కాబోలు. ఇది జరిగినది 1949లో.  ఆ రోజుల్లో నేను పాటలు రాసి ఇచ్చి, ఆయన పేరు వేసేవాడిని [ఇద్దరూ ఒకరి పేరు మీద ఒకరు రాసేవారనీ, ఎవరు రాసినది ఏ పాటో తెలుసుకోవడం కష్టమని వాళ్ళ అమ్మాయి చెప్పారు]. నేను సినిమా రచయితని అవ్వాలని జనాలు నాన్నతో అనేవారు. మూడేళ్ళ తర్వాత అదృష్టం కలిసొచ్చింది, నాన్న వద్దన్నా, నేను ‘సముద్రాల జూనియర్’ పేరుతో రచయితనయ్యాను.

నాకు పదమూడేళ్ళు వచ్చేవరకు నేను నా సొంత ఊరు పెదపులివర్రు (రేపల్లె తాలూకా) లోనే చదువుకున్నాను. ఆ తర్వాత పై చదువులకి మద్రాసు వెళ్లాను. ఓ రోజు బి.ఎన్.రెడ్డి గారు నన్నూ, నాన్నని చూసి – మేం అన్నదమ్ములమా? అని అడిగారు. ఎందుకో తెలియదు కానీ, చాలా మంది ఇదే అనేవారు. నాన్నతో కలిసి జోకులు వేసుకుంటూ నవ్వుకునేవాడిని. నాన్నతో కలిసి సిగరెట్ తాగేవాడిని. జనాలకి అది వింతగా వుండేది. నాన్నది అంత విశాల దృక్పథం!

మా నాన్న మహారాజు కాకపోవచ్చు, కానీ నాకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేవారు. నాకు నచ్చినది చేసే స్వేచ్ఛ ఉండేది. కానీ నా జీవితపు కళ్ళేలు ఆయన చేతిలో ఉండేవి. నన్ను మందలించాల్సిన అవసరం ఆయనకి ఎన్నడూ రాలేదు. అవ్యక్తంగా ఉండే నియమాలు నాకు తెలుసు. ఒకవేళ నాకు రాత్రిళ్ళు ఆలస్యమయితే, నాన్న మేలుకొని ఉండి, నేను వచ్చాకే, నాతో పాటు అన్నం తినేవారు. ఒకవేళ ఆయనకి ఆలస్యం అయితే, నేను పడుకుని ఉన్నా, నన్ను ఒకసారి చూసి వెళ్ళిపోయేవారు. అందుకే ‘కన్న మనసు వెన్న లాంటిది, బిడ్డ మనసు గడ్డ లాంటిది’ అంటారు.

నాన్న ఆస్తమా రోగి. ఆయన జబ్బు పడినప్పుడల్లా నేను ఆయన పక్కనే ఉండేవాడిని. ఆయన ఏదైనా వేరే ఊర్లో ఉండి, అనారోగ్యానికి గురైతే, టెలిగ్రాం ఇచ్చేవారు. నేను వెంటనే వెళ్ళి వాలిపోయేవాడిని. ఉపచారాలు చేసేవాడిని. దీని తర్వాత మేం మరింత సన్నిహితమయ్యం. ఆయన వేరే ఊరు వెళ్ళి, చెప్పిన సమయానికి తిరిగి రాకపోతే నాకు బాగా కోపం వచ్చేది. నాకు నాన్న అంటే భయం ఉండేది కాదు. నాకు చెప్పకుండా ఆయన ఏదీ చేసేవారు కాదు, నేనూ అంతే. మాకు కార్లు ఉన్నా, రాత్రి రెండో ఆట సినిమాకి వెళ్ళడానికి ఒప్పుకునేవారు కాదు.

నాన్నని ఎప్పుడైనా బాగా దగ్గు వస్తే, చుట్టూ ఎంత మంది ఉన్నా, నన్ను పిలిపించేవారు. నేను ఆయన పక్కనే ఉండి, వీపు మీద మెల్లగా రాస్తూ, ‘తగ్గిపోతుంది నాన్నా’ అనేవాడిని. నిజంగా నాన్నకి తగ్గిపోయేది. మా అనుబంధం అలాంటిది. సాధారణంగా తండ్రులు పిల్లలకు గొడుగు లాంటి వారు. మా నాన్న నాకు అంత కంటే ఎక్కువ. నాకు ఆప్త మిత్రుడి లాంటి వారు. నాకు బ్రహ్మోపదేశం చేశారు. ఆయన ఓ నడిచే, మాట్లాడే ఎన్‌సైక్లోపీడియా! ఆయన మెదడు పాదరసం లాంటిది. నేనెప్పుడయినా దాన్ని పాడుచేసినా, మన్నించమంటే ఎంతో దయతో నన్ను క్షమించేవారు. మా నాన్న లాంటి నాన్న అందరికీ ఉంటే అంతటా సంతోషమే ఉంటుంది.

నాన్న అవధానాలు చేశారు, కానీ డబ్బు మనిషి కాదు. అందుకే వినోదా ఫిల్మ్స్‌లో భాగస్వామి అయినా – కవిగానే ఉండిపోయారు. సముద్రాల సీనియర్ అంటే జగమెరిగిన బ్రాహ్మడు. తన పేరు ప్రతిష్ఠలను తన తండ్రి చూడలేకపోయారనే మా నాన్న బాధపడేవారు. కానీ నా అదృష్టం – నాన్న ఉండగానే నాకు మంచి పేరు వచ్చింది. ‘ఆచారీ, మీ అబ్బాయి మీ పేరు నిలబెట్టాడు’ అని జనాలు అంటూండేవారు. ఆ మాటలు వినగానే నాన్న హృదయం ఉప్పొంగేది. అది ఆయన పుత్రభాగ్యం. అందరికీ లభించేది కాదు.

నాన్న ఇప్పుడు బాగా వృద్ధులైపోయారు. మంచం మీద బక్క చిక్కిన బ్రాహ్మడైపోయారు. బాగా దగ్గు వస్తోంది. విశ్రాంతి కోసం, నిద్ర పట్టడానికి ఆయనకి ఏ నిద్ర మందు ఇచ్చారో దేవుడికే తెలియాలి. చాలా సేపటి వరకు లేవరు. నేనెన్ని సార్లు పిలిచినా పలకరు. అలాంటప్పుడు భయం వేస్తూంటుంది. ఆయన పక్కనే కూర్చుని, నాన్నని నా నుంచి దూరం చేయద్దని దేవుడిని ప్రార్థిస్తాను.”

గమనిక:

సముద్రాల జూనియర్ ఈ మాటలు రాసిన ఏడాది తర్వాత, సముద్రాల సీనియర్ 16 మార్చి 1968 నాడు దివంగతులయ్యారు. సముద్రాల జూనియర్ 1985లో మృతి చెందారు. దీంతో తెలుగు సాహిత్యంలోనూ, సినీ రచయితల్లోనూ ఒక శకం ముగిసింది.


ఆర్. ఎన్. నాగరాజారావు – చక్కని స్టిల్ ఫోటోగ్రాఫర్:

సుప్రసిద్ధ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆర్.ఎన్. నాగరాజారావు గారు మద్రాసులోని ఎగ్మోర్ లో వీధి నెంబరు 9Aలో నివసించేవారు. ఆయన ఇల్లు అప్పట్లో చిరపరిచితం అందరికీ. నల్ల కారు ఇంట్లో పార్క్ చేసి ఉందంటే – ఆయన ఇంట్లో ఉన్నారని గుర్తు. కళ్ళల్లో మెరుపులతో ఎందరో కళాకారులు ఆయన వద్దకు వెళ్ళి స్టిల్స్ తీయించుకునేవారు, తత్ఫలితంగా, తమ అవకాశాలు మెరుగవుతాయని విశ్వసించేవారు. ఆయన తీసిన మొదటి స్టిల్ నటి కె.ఎల్.వి. వసంత గారిది.

ఆయన విశాఖపట్టణంలో 25 మే 1912 నాడు జన్మించారు. ఆయన తండ్రి వెటర్నరీ వైద్యులు, తల్లి గృహిణి. విశాఖలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఆ తరువాత ఎల్.ఎం.ఇ. కోర్సు చేయడానికి మద్రాసు వెళ్ళారు. అయితే అనుకోకుండా వోల్‌కార్ట్ బ్రదర్స్ వారి రిఫ్రిజిరేటర్‍ల వింగ్‍లో మంచి ఉద్యోగం రావడంతో ఆయన ఆ కోర్సు వదిలేశారు. వారి ఆఫీసుకు ఎదురుగా ఉన్న భవంతిలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉండేది. ఆ సంస్థ వైస్ ప్రిన్సిపాల్ వి.ఆర్. చిత్ర గారితో నాగరాజారావుకి పరిచయం ఏర్పడింది. నాగరాజారావుకు ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి కలిగింది. ఆయన ఒక మామూలు బాక్స్ కెమెరా కొనుకున్నారు. ఎగ్మోరు వంతెన వద్దకు వెళ్ళి ఎన్నో ఫోటోలు తీసేవారు. చిత్ర గారు స్వయంగా ఆ నెగటివ్ లను కడిగి డెవలప్ చేసేవారు. ఆ ఫోటోల అందం ఆయనను అమితంగా ఆకట్టుకుంది. సజీవంగా ఉన్న పెయింటింగ్స్ అవి అన్నట్లు అనిపించాయి.

నాగరాజారావు వోల్‌కార్డ్ బ్రదర్స్ వద్ద ఉద్యోగం మాని ‘ది హిందూ’ దినపత్రికలో ఫోటోగ్రఫీ-బ్లాక్ మేకింగ్ డివిజన్‍లో అప్రెంటీస్‍గా చేరారు. అక్కడ ఒక సంవత్సరం పని చేశాకా, స్వదేశీ మిత్రన్ పత్రికలో చేరారు. ఇక్కడ ఈయనకు మంచి స్వేచ్ఛ లభించింది. చక్కని స్టిల్స్ తీయడమే కాకుండా, తను తీసిన స్టిల్స్‌ని ఇతర మాగజైన్‍లకు, దినపత్రికలకు పంపుకునే అవకాశం లభించింది. ఈ పత్రిక కోసం ఆయన 18 ఏళ్ళు పని చేశారు.  అదే సమయంలో ఎస్.ఎస్. వాసన్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు, నాగరాజారావుని తమ తొలి స్టిల్ ఫోటోగ్రాఫర్‍గా జెమిని స్టూడియోలో నియమించారు. నందనార్, బాలనాగమ్మ వంటి సినిమాలకు స్టిల్స్ తీశారు. అక్కడ రెండేళ్ళు పని చేశాకా, తన భార్య అనారోగ్యం కారణంగా మానేశారు. పైన చెప్పుకున్న అడ్రసులోని తన ఇంటిలోనే స్టూడియో నెలకొల్పారు. ఆయన కెరీర్ రాకెట్‍లా దూసుకుపోయింది. ఆయన కొత్తవారివి, సుపరిచితులైన ఆర్టిస్టులకి స్టిల్స్ తీసేవారు. అలుపు అన్నది లేకుండా తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు; ఇంకా బొంబాయిలో చిత్రించిన రెండు ఇంగ్లీషు సినిమాలకు, కొన్ని  హిందీ సినిమాలకు పని చేశారు.

ఈ మధ్యలో ఆయన పోర్టయిట్స్ తీయడం నేర్చుకున్నారు. వాటిని పలు అంతర్జాతీయ పత్రికలకు పంపి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. అప్పట్లో అమెరికాకి రాయబారిగా వ్యవహరించిన బి.కె. నెహ్రూ గారి స్టిల్ తీశారు. నాగరాజారావు తీసిన తన ఫోటో అంటే ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీకి ఎంతో ఇష్టం. ఆ ఫోటోనే చాలా ప్రింట్స్ వేయించి తన అభిమానులకు పంచేవారాయన. నాగరాజారావు ఆకాశవాణి కోసం, మద్రాసు ప్రభుత్వం వారి సమాచార కేంద్రం కోసం కూడా పని చేశారు. ఆయన వద్ద – కొడాక్ మాస్టర్ వ్యూ కెమెరా, రోలిప్లెక్స్ కెమెరా, హాసెల్‍బ్లాడ్ కెమెరా వంటి ఖరీదైన కెమెరాలు, పరికరాలు ఉండేవి. తన జీవితాంతం వరకు ఆయన ఇదే రంగంలో విశేష కృషి చేశారు.

ఆసక్తికరమైన సంగతులు:

సావిత్రి గారి తొలి, చివరి స్టిల్ తీసినది నాగరాజారావు గారే. బక్క పలచని అమ్మాయిగా తొలిసారి తన వద్దకు వచ్చిన ఆమెను ఆయన బాగా గుర్తుంచుకున్నారు. తన పెదనాన్నగారితో కలిసి వచ్చారట. మా అమ్మాయికి ఫోటో తీయాలి అన్నారట పెదనాన్న. ఆ అమ్మాయే 1950 నాటి ‘సంసారం’తో తారాపథానికి ఎగిసింది. తర్వాత విషయం ఈ ఫోటోగ్రాఫర్‍తో సహా అందరికీ తెలిసిందే. అప్పుడామె వయసు 12 సంవత్సరాలే (సావిత్రి ఆ ఫోటోలో ఎంత చిన్నగా ఉన్నారో చూడండి). చాలా ఏళ్ళ తరువాత ‘సర్కస్ రాముడు’ (1980 విడుదల) చిత్రం కోసం సెట్‌లో సావిత్రి గారి ఫోటో కావలసి వస్తే, 1979లో సావిత్రి నాగరాజారావుగారి వద్దకే వెళ్ళారు. మళ్ళీ అదే బక్కపలచని రూపం. సావిత్రిని ఆ రూపంలో చూసి చలించిపోయారట నాగరాజారావు. ఆమె తొలి, చివరి స్టిల్స్ ఆయనే తీయడం ఓ వైచిత్రి.

 

 

వహీదా రెహమాన్ ఒకసారి ఎవరితోనే వచ్చి నాగరాజారావు గారిని కలిసారు. వహీదా తరపున ఆ వ్యక్తి మాట్లాడారు. ఆ రోజు ఆమె కొద్దిగా రంగు వెలసిన చీర కట్టుకున్నారట. చీర మార్చుకుని వస్తారా అని నాగరాజారావు అడిగారట. ఆమె చిరచిరలాడుతూ తనకి ఉన్నది ఆ ఒక్క చీరేనని చెప్పారట. సరేనని, ఫోటో తీసారట నాగరాజారావు. ఫోటోలో కనిపించేలా ఎలా అందంగా నవ్వుతున్నట్లు తీయడంలో ఆయన గొప్ప మాయ చేశారు. ఆ ఫోటోలో వహీదా గొప్ప సౌందర్యంతో కనిపించారు. చాలా ఏళ్ళ తరువాత వహీదా ఆయనని ఒక ఫోటో స్టూడియోలో కలిసారట. ‘బావున్నారా’ అంటూ తెలుగులో పలకరించారట. అప్పటికి ఆమె స్టార్‌డం గురించి ఆయనకు తెలుసు. ఆమె తనను గుర్తు పెట్టుకున్నందుకు ఆశ్చర్యపోయారు.

Exit mobile version