అలనాటి అపురూపాలు-113

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బాలీవుడ్ విలక్షణ నటుడు జగ్‌దీప్:

హాస్యనటుడిగా ముద్రపడినప్పటికీ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన హిందీ నటుడు జగ్‌దీప్. నిజానికి ఎ.వి.ఎమ్. వారి ఎన్నో సినిమాల్లో – ఉదాహరణకి భాభీ (1957), బర్ఖా (1959) ఇంకా బిందియా (1960) చిత్రాలలో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి రెండు సినిమాలలో నందా సరసన నటించారు.

‘పునర్‍మిలన్’ (1964) చిత్రంలో ‘పాస్ బైఠో తబీయత్ బహల్ జాయేగీ’ అనే పాటనీ, ‘భాభీ’ (1957) సినిమాలో ‘చల్ ఉడ్ జా రే పంఛీ’ , ‘చలీ చలీ రే పతంగ్’ అనే పాటలను జగ్‌దీప్‌పైనే చిత్రీకరించారు. ఆ తరువాతే ఆయన హాస్యనటులై దాదాపు 400 కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు.

దేశ విభజన ఎన్నో గాయాలు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎందరో పొట్ట చేతపట్టుకుని బొంబాయి చేరారు. సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీగా 29 మార్చ్ 1939 నాడు జన్మించిన జగ్‌దీప్ అలాంటి దురదృష్టవంతుల్లో ఒకరు. తన తల్లితో కలిసి బొంబాయి వచ్చి జీవిక కోసం రకరకాల పనులు చేశారు. ఒకప్పడు తన తల్లి ఎందరో నౌకర్లు, భోగభాగ్యాలతో బ్రతికారని, ఆ పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయని, ఒక అనాథాశ్రయమంలో వంట చేస్తూ తనని పెంచి పెద్ద చేశారని జగ్‍దీప్ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పేవారు. చిన్నారి జగ్‌దీప్ తల్లికి సాయం చేయాలనుకుని ఆరు లేదా ఏడేళ్ళ వయసు నుంచే రైళ్ళలో పండ్లు, తినుబండారాలు అమ్మి కొద్దిగా డబ్బు సంపాదించేవారు. వీధుల్లో బండి మీద వస్తువులు అమ్మారు, హోటల్లో వెయిటర్‍గా కూడా పని చేశారు. ఆయా చోట్ల జీవితాన్ని సన్నిహితంగా చూడడం వల్ల సినిమాల్లో అటువంటి పాత్రలు పోషించాల్సి వచ్చినప్పుడు ఆయనకు చాలా సులువైంది. చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండడం వల్ల బి.ఆర్. చోప్రా గారి ‘అఫ్సానా’ (1951) చిత్రంలో బాలనటుడిగా అవకాశం వచ్చిందని ఆయన చెబుతూంటారు. మొదటి సినిమాలోనే సాధారణం కన్నా రెట్టింపు పారితోషికం లభించడం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాలో ఒక జూనియర్‌గా అవకాశం వచ్చింది. “పిల్లలు వేసే ఒక నాటకాన్ని చిత్రీకరిస్తున్నారు. సన్నివేశం మొదలవగానే, ప్రధాన పాత్రధారి అయిన అబ్బాయి డైలాగ్‌ని సరిగా చెప్పలేకపోతున్నాడు. అది ఉర్దూ. అప్పుడు నేను ముందుకెళ్ళి ఆ డైలాగ్ చెబుతానని అడిగాను. వాళ్ళు సరే అన్నాకా, ఆ డైలాగ్‌ని సులువుగా, సరిగ్గా చెప్పాను. చోప్రా గారు మెచ్చుకుని మామూలుగా ఇచ్చే మూడు రూపాయలకి, మరో మూడు రూపాయలు కలిపి మొత్తం ఆరు రూపాయలు ఇచ్చారు” చెప్పారాయన. ధోబీ డాక్టర్ (1952) సినిమాలో చిన్నప్పటి కిషోర్ కుమార్‌లా నటించారు. బిమల్ రాయ్ దర్శకత్వంలో ‘దో బీఘా జమీన్’ (1953) చిత్రంలో బూట్లు పాలిష్ చేసే కుర్రాడిలా నటించారు.

కె.ఎ. అబ్బాస్ గారి ‘మున్నా’ (1954), రాజ్ కపూర్ నిర్మించిన ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ (1957), ఎ.వి.ఎమ్. వారి ‘హమ్ పంఛీ ఏక్ డాల్ కే’ (1957) చిత్రాలలో బాల/యువనటుడిగా నటించారు. ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ‘హమ్ పంఛీ ఏక్ డాల్ కే’ లో జగ్‍దీప్ నటనని మెచ్చుకుని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూగారు ఆయనకి ఓ ‘వాకింగ్ స్టిక్’ బహుమతిగా ఇచ్చారుట. ఈ సినిమాకి ‘ఉత్తమ బాలల చిత్రం’గా జాతీయ అవార్డు కూడా లభించింది.

ఆ తర్వాత ఎ.వి.ఎమ్. వారు జగ్‌దీప్‌కి హీరోగా అవకాశం ఇచ్చారు. ‘భాభి’ చిత్రం మినహాయిస్తే, మిగతావి ఏవీ ఆర్థికంగా విజయవంతం కాలేదు. దాంతో ఆయన సహాయక పాత్రల వైపు మళ్ళి, ఆ తరువాత హాస్యనటుడిగా స్థిరపడ్డారు.

షమ్మీ కపూర్ నటించిన ‘బ్రహ్మచారి’ (1968) చిత్రం ద్వారా జగ్‌దీప్ కమెడియన్‍గా ప్రసిద్ధి చెందారు. ఆ సినిమాలో మురళీ మనోహర్ అనే పాత్ర పోషించారు. తన మానరిజమ్స్‌తో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఆయనకి అత్యంత పేరు ప్రతిష్ఠలు తెచ్చిన పాత్ర ‘షోలే’ (1975) చిత్రంలోని ‘సూర్మా భోపాలి’ పాత్ర. ‘హమారా నామా సూర్మా భోపాలి ఐసే హీ నహీ హై’ అనే డైలాగ్ బాగా ఆదరణ పొందింది.

ఆ సినిమాకి పనిచేసిన రచయితల ద్వయం సలీమ్ – జావేద్, ఇద్దరూ మధ్యప్రదేశ్ వారే కావడంతో, జగ్‍దీప్ పాత్ర ద్వారా భోపాలీ ఉచ్చారణని అద్భుతంగా పలికించారు. సహజంగానే, మెరుగుపరచడంలో దిట్ట అయిన జగ్‌దీప్ సంభాషణలను అద్భుతంగా పలికించి, ఆ పాత్రను ఓ మధుర జ్ఞాపకంగా మార్చారు. ఎన్నో ఏళ్ళ తరువాత 1988లో ఆ పాత్ర జనాదారణని ఆధారంగా చేసుకుని అదే పేరుతో సూర్మా భోపాలి’ పేరిట తానే దర్శకత్వం వహించి, ఓ సినిమాను నిర్మించారు. ఆ సినిమాలో అలనాటి స్టార్‍లు – అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రేఖ, డానీ, ఫరూక్ షేక్ వంటి వారు; ఇంకా దర్శకుడి మిత్రులు కొందరు అతిథి పాత్రలలో కనిపించినా – సినిమా పెద్దగా ఆడలేదు.

‘సురక్షా’ (1979) చిత్రంలో మిథున్ చక్రవర్తికి సమాచారం అందించే వ్యక్తిగా; ఫిరోజ్ ఖాన్ ‘ఖుర్బానీ’ (1980) చిత్రంలో ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీకి స్పూఫ్‍గా; ‘షెహెన్ షా’ (1988)లో తారాచంద్ బద్లానీగా; ‘అందాజ్ అప్నా అప్నా’ (1994)లో బంకేలాల్ భోపాలీగా; ‘చైనా గేట్’ (1998) చిత్రంలో సుబేదార్ రామయ్య గా ఆయన పోషించిన పాత్రలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. ‘ఖుర్బానీ’ (1980) చిత్రంలోని పాత్ర ఆయనకి ఎంత పేరు తెచ్చిందంటే – ఒక మసీదుకు నిధుల సేకరణ కోసం జగ్‌దీప్‌కీ, ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీకీ మధ్య అమెరికాలో మాక్ ఫైట్ ఏర్పాటు చేసేటంతగా!

జగ్‍దీప్ మూడు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి భార్య నసీమా బేగమ్‌ ద్వారా ఒక హుస్సేన్ అనే కొడుకు పుట్టాడు, అతను 2009లో మరణించాడు. ఈ దంపతులకు సురయ్యా, షకీరా అనే కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన సుగ్రా బేగం‍ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. మూడోసారి జగ్‌దీప్ నజీమా అనే ఆవిడని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ముస్కాన్ జాఫ్రీ అనే కూతురు పుట్టింది. జావేద్ జాఫ్రీ తన నటనకీ, నృత్యాలకి పేరు తెచ్చుకున్నారు. నవేద్ జాఫ్రీ విజయవంతమైన టివి నిర్మాతగా స్థిరపడ్డారు.

జావేద్ జాఫ్రీ తన తండ్రి గతాన్ని గుర్తు చేసుకుంటూ – వీధుల్లోంచి – సినిమాల్లోకి రావడం గొప్ప విశేషం అని అన్నారు. “దేశ విభజన తర్వాత జీవిక కోసం వెతుక్కున్న పిల్లాడు నాన్న. సినిమాల్లో నటిస్తావా? అని ఎవరో అడిగితే నాకు ఉద్యోగం కావాలి అని చెప్పారట. అలా వీధిలోంచి ఎంపిక చేసుకోబడిన స్టార్ నాన్న. పరిశ్రమలో ఉండాలని రాసి పెట్టి ఉన్నట్లుంది, అది విధి” అన్నారు.

తనకి 81ఏళ్ళ వయసులో ఓ రాత్రి 8.30 కి వృద్ధాప్య సంబంధింత అనారోగ్యంతో ముంబయిలోని తన బాంద్రా నివాసంలో కన్నుమూశారు జగ్‍దీప్.

జగ్‌దీప్ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు, కానీ ‘సూర్మా భోపాలి’గా ఆయన పంచిన వినోదం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

***

జగ్‌దీప్‍తో కలిసి ‘షోలే’ (1975) చిత్రంలో నటించిన అనుభవాలను, తరువాత ఆయన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ధర్మేద్ర – “తనతో గడిపిన ప్రతీ క్షణం ఉల్లాసంగా ఉండేలా చేసేవారు జగ్‌దీప్. కామెడీ నిజంగా కష్టం. ఎవరినైనా ఒక్క క్షణంలో భావోద్వేగాలకు గురి చేయవచ్చు. కానీ నవ్వించటం అంత సులువు కాదు. ప్రారంభంలో బిమల్ రాయ్ చిత్రం నుంచి – నాతో ఎన్నో సినిమాలు చేశారు.

వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని, ఆయన భార్యని, పిల్లలని పలకరించేవాడిని. ఆయన నా కుటుంబంలో ఒకరు. ఆయన నాకు కొన్ని పాత నాణేలను ఇచ్చారు. నేటికీ వాటిని చూస్తుంటాను. దో అనా, చార్ అనా – ఆనాటి నాణేలు. నాకు నాణేలంటే ఇష్టమని తనకి తెలుసని అన్నారు. వాటిని నాతో ఎప్పుడూ ఉంచుకోమని చెప్పారు. ఆయన ఎంతో ప్రేమతో ఇచ్చారు కాబట్టి వాటిని తీసుకున్నాను. ఆయనతో గడిపిన సమయం ఎంతో మధురమైనది…. ఆయన లేరిప్పుడు… తప్పదు. జీవితంతో రాజీపడి ముందుకు సాగాల్సిందే” అన్నారు ధర్మేంద్ర.

మళ్ళీ మాట్లాడుతూ “నాలాగే ఆయన కూడా పల్లెటూరి నుంచి బొంబాయికి వచ్చారు. తన కెరీర్‍లో ఎన్నో సాధించారు. ఆయన లేని లోటు తెలుస్తోంది. ఈ ఏడాది (2020) ఎందరో కళాకారులను కోల్పోయాము. నాకు చాలా బాధగా ఉంది. నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని. నేను ఇష్టపడే మనుషులతో బాగా సన్నిహితమవుతాను. జగ్‌దీప్ ‘సూర్మా భోపాలి’ అనే సినిమా తీశారు. నన్ను అందులో నటించమన్నారు. నేను ధర్మేంద్ర పాత్రలోనే నటించాను. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో నటించాము, ఎన్నో లొకేషన్స్‌లో ఉన్నాము. క్షణాల్లో రూపురేఖలు మార్చుకోగలగడం ఆయన విశిష్టత. ఆయనకి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే ఆయనో మంచి మనిషి! ఆయనని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాను. ఈ దుఃఖాన్ని తట్టుకోగలిగే ధైర్యం వారి కుటుంబానికి, కుమారులకు లభించాలని వేడుకుంటాను” అన్నారు ధర్మేంద్ర.

చనిపోవడానికి ముందు జగ్‌దీప్‌ని ఏమైనా కలిసారా అని అడిగితే, “ఈమధ్య కాలంలో మేం టచ్‍లో లేము. లాక్‌డౌన్ కారణంగా నేను మా ఫార్మ్ హౌస్‌లో ఉండిపోయాను. నేను ముంబైలో ఉంటే ఆయన తరచూ మా ఇంటికి వచ్చేవారు. అలాగే నేనూ వాళ్ళింటికి వెడుతుండేవాడిని. మేం ఒకరికొకరు సొంత కుటుంబం లాంటి వాళ్ళం” అన్నారు ధర్మేంద్ర.

***

‘భాభీ’ సినిమాలోని ‘చలీ చలీ రే పతంగ్’ అనే పాటని ఈ లింక్‌లో చూడవచ్చు

https://www.youtube.com/watch?v=yXnaSU790lw


ప్రతిభాశాలి దుర్గా ఖోటే:

1930ల నుండి 1980 వరకు – ఏభై ఏళ్ళ పాటు – బాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితమైన ముఖం – దుర్గా ఖోటే. ఆ కాలం నాటి సినీ స్టార్‍ల కంటే ఆవిడ భిన్నమైనవారు. ఆవిడ జీవితకాలంలో – మహిళలు చదువులేకుండా, నిరక్షరాశ్యులుగా ఉండడమనేది సాధారణమే. కానీ ఆమె మాత్రం ఆ కాలంలోనే ఓ మిషనరీ స్కూల్ నుంచి హైయర్ సెకండరీ విద్య పూర్తి చేసి, బ్యాచ్‌లర్స్ డిగ్రీలో చేరారంటే – అదొక రికార్డే.

సినిమాలలో స్త్రీ పాత్రలు మగవాళ్ళే ధరిస్తున్న రోజుల్లో – ధైర్యంగా జన బాహుళ్యంలోకి వచ్చి, స్త్రీ పాత్రలు పోషించే సాహసం చేశారావిడ. ఆమె చనిపోయి దాదాపుగా మూడు దశాబ్దాలయినా, సినీ ప్రేక్షకులు ఇంకా ఆమెని సగౌరవంగా గుర్తుంచుకున్నారు. తన పేరు గల దేవత లానే, ఈవిడ కూడా ఆనాటి బాలీవుడ్‌పై చెరగని ముద్ర వేశారు.

ఈవిడ 14 జనవరి 1905 నాడు బొంబాయిలోని సుసంపన్నమైన మహరాష్ట్రియన్/కొంకణ్ కుటుంబంలో జన్మించారు. ఈవిడ అసలు పేరు విటా లాడ్. సంపన్నమైన కుటుంబం కావడంతో ఆమె కెథడ్రల్ హైస్కూలు, సెయింట్ జేవియర్స్ కాలేజీ వంటి సుప్రసిద్ధ విద్యా సంస్థలలో చదువుకోగలిగారు. కాలేజీలో ఉండగానే – బెనారస్ హిందూ యూనివర్శిటీ మాజీ విద్యార్థి, మెకానికల్ ఇంజనీర్ అయిన విశ్వనాథ్ ఖోటే‍తో పెద్దలు పెళ్ళి చేశారు.

వారి వైవాహిక జీవితం సజావుగా సాగి, ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే ఈ ఆనందం స్వల్పకాలికమైనదిగా మారింది. 26 ఏళ్ళ వయసులో భర్త చనిపోయి, దుర్గ వితంతువు అయ్యారు. పైగా ఇద్దరు పిల్లల బాధ్యత ఉంది. అత్తమామలతోనే ఉన్నా, వారిపై ఆధారపడకూడదనుకున్నారు. ఉదారవాద కుటుంబం నుంచి రావడం వల్ల, పాశ్చాత్య విద్య పొంది వుండడం వల్ల సినిమాలలో ఎందుకు ప్రయత్నించకూడదు అని తలచారు.

ఆవిడకి నటన అంటే అభిరుచి ఉండేది. మొదటి అవకాశం సోదరి షాలిని ద్వారా లభించింది. ప్రముఖ నిర్మాత జెబిఎస్ వాడియాకు షాలిని స్నేహితురాలు. వాడియా అప్పట్లో ‘ఫరేబీ జాల్’ (1931) అనే మూకీ సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో తొలిసారిగా నటించారు దుర్గ. అయితే సహజంగానే విమర్శలు ఎదురయ్యాయి. ఓ మహిళ అందునా, పేరున్న కుటుంబం నుంచి వచ్చిన స్త్రీ – సినిమాల్లో నటించడమనేది జనాలు జీర్ణించుకోలేకపోయారు. అయితే దుర్గ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు, మరిన్ని సినిమాలలో నటించారు. ఉన్నత కుటుంబాలకు చెందిన ఎందరో స్త్రీలు సినిమాలలో నటించేందుకు మార్గదర్శి అయ్యారు.

ఆమెకి మంచి అవకాశం దిగ్గజ దర్శకుడు వి. శాంతారాం దృష్టిలో పడడం ద్వారా లభించింది. ఆయన తీస్తున్న తొలి ద్విభాషా చిత్రం ‘అయోధ్యేచ రాజా’ లో ‘తారామతి’ వేషం ఇచ్చారు. ఈ పాత్రలో ఆమె అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆ తరువాత కొన్నేళ్ళ పాటు – సైరంధ్రి (1933), ‘అమర్ జ్యోతి’ (1936), ‘మహాత్మా విదుర్’ (1943), ‘వీర్  కునాల్’ (1945) వంటి విశిష్టమైన చిత్రాలలో నటించారు. ఇంకా పలు చిత్రాలలో తన బహుముఖ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు.

ఆమె చారిత్రక, పౌరాణిక, సాంఘిక, వాస్తవిక సినిమాలో ఒకే రకమైన ఆత్మవిశ్వాసంతోనూ, చురుకుదనంతోనూ నటించారు. ఆమె నటించిన పాత్రలు కూడా ఆమె నిజస్వభావానికి అత్యంత సమీపంగా ఉండి, మహిళా సాధికారత కోసం పాటుపడడం విశేషం. ఆమె పోషించిన స్త్రీ పాత్రలు – బలహీనమైన వ్యక్తులవి కాదు; ప్రపంచాన్ని తమదైన శైలిలో ఎదుర్కున్న ధీర వనితల పాత్రలు. అన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొన్న పాత్రలు. ఉదాహరణకి ‘అమర్ జ్యోతి’ (1936) చిత్రంలో ఆమె రాజ్యాన్ని కూలదోయడానికి ప్రయత్నించే మహిళగా కనబడతారు. ‘భారత్ మిలాప్’ (1942) సినిమాలో – రాముడిని రాజ్యానికి దూరం చేసే కైకేయి పాత్రలో నటించారు.

ఇవన్నీ ఒక ఎత్తు, బ్లాక్‍బస్టర్/క్లాసిక్ ‘మొఘల్-ఎ-ఆజామ్’లో అక్బర్ భార్య జోధాగా, సలీం (జహంగీర్) తల్లిగా ఆమె కనబరిచిన నటన అత్యద్భుతం. తన అంతర్గత దయ, హుందాతనం, స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆమె అక్బర్ పాత్ర పోషించిన దిగ్గజం పృథ్వీరాజ్ కపూర్‌‌తో ధీటుగా నటించారు. ఇక్కడ కూడా తనకంటూ సొంత ఆలోచనలూ, పట్టుదల ఉన్న మహిళగా నటించారు. భర్త పట్ల బాధ్యత, కుమారుడి పట్ల ప్రేమ మధ్య నలిగిపోయే దృఢమైన మహిళగా గొప్ప ప్రదర్శన కనబరిచారు. ఒక దయాళువైన రాణిగా రాజ్యానికి నష్టం వాటిల్లకూడదని కుమారుని వేడుకుంటారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా – ఒకసారి చాలామంది నటీనటులను మార్చాల్సి వచ్చిందట దర్శకుడు కె. ఆసిఫ్‌కి. కానీ జోధా పాత్రధారి దుర్గా ఖోటేని మాత్రం మార్చలేదుట. దీన్ని బట్టే అర్థం అవుతుంది దర్శకులు ఆమెకి ఎంత గౌరవం ఇచ్చేవారో.

మరో విషయంలో కూడా ఈవిడ ప్రథమురాలు. ‘స్టూడియో వ్యవస్థ’ సంకెళ్ళు తెంపుకుని – వాళ్ళతో ఒప్పందాలు లేకుండా – కేవలం ఆ స్టూడియో సినిమాల్లోనే నటించకుండా – ఫ్రీలాన్సర్ అయ్యారు. ఆవిడ – ప్రముఖ దర్శకుడి విజయ్ భట్ నేతృత్వంలోని ప్రకాష్‌ పిక్చర్స్‌ సంస్థ సినిమాల్లోనే కాకుండా కలకత్తాకు చెందిన ‘న్యూ థియేటర్స్‌’, ’ఈస్ట్‌ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ’ వంటి నిర్మాణ సంస్థల సినిమాల్లోనూ నటించారు.

ఆమె ధైర్యం, పట్టుదల – సినిమాల్లోకి రావాలనుకునే తోటి మహిళామణులకు స్ఫూర్తి అయ్యాయి. నటి తనూజ తల్లి శోభన సమర్థ్ ఆమెకు వీరాభిమాని. దుర్గా ఖోటే ఓ తెలివిన వ్యాపారవేత్త అని కూడా మనలో ఎందరికి తెలుసు? 1940లలోనే తన మనసులో జనించిన ఓ ఆలోచనతో – దుర్గా ఖోటే ప్రొడక్షన్స్ – అనే సంస్థని స్థాపించి వ్యాపార ప్రకటనల రంగంలోకి ప్రవేశించారు. ఓ మహిళ నాయకత్వంలోని తొలి అడ్వర్టయిజింగ్ సంస్థ ఇది. ఈ సంస్థ దూరదర్శన్‍ కోసం – అత్యంత జనాదరణ పొందిన – ‘వాగ్లే కీ దునియా’ అనే సీరియల్ నిర్మించింది.

అలాగే ఈవిడ కెరీర్ మొత్తంలో ఎలాంటి వివాదాలూ, కళంకాలు లేకుండా సాఫీగా సాగింది. ‘మొఘల్-ఎ-ఆజామ్’ తరువాత ఆవిడకి మర్చంట్ ఐవరీ తొలి చిత్రం ‘ది హౌస్‌హోల్డర్’ (1963) చిత్రంలో మరో మంచి పాత్ర దక్కింది. ఆ తరువాత గొప్ప హిట్‍లయిన అనేక బాలీవుడ్ చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించారు. ‘బాబీ’ (1973) చిత్రంలో హీరోయిన్‌ అమ్మమ్మ పాత్ర, ‘అభిమాన్‌’ (1973)లో హీరో సుబిర్ అత్త పాత్రను పోషించారు. ‘బిదాయి’ (1974) చిత్రంలో దయాళువైన తల్లి పాత్రలో నటించారు. ఇలాంటివి ఎన్నెన్నో. కెరీర్ చివరి దశలో ఉండగా, ఆమె ‘కర్జ్‌’ (1980) లో హీరో రాజ్‌కిరణ్‌కి అమ్మగా, అతని పునర్జన్మ అయిన రిషి కపూర్‌‌కి తల్లిగా నటించారు.

ఆవిడ ప్రతిభా పాటవాలను ఆమె జీవించి ఉండగానే గౌరవించి అభినందంచడం వారి అదృష్టం! చలనచిత్రాలలో ఉత్తమ ప్రదర్శనకు గాను 1958లో ఆమెకు సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. చరణోం కీ దాసీ, బిదాయి చిత్రాలలో నటనకు గాను ఆమెకు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (బిఎఫ్‌జెఎ) వారి పురస్కారం లభించింది. 1974లో ‘బిదాయి’ చిత్రానికి గాను ఫిలింఫేర్‌ ఉత్తమ సహాయ నటి అవార్డును గెలుచుకున్నారు. 1968లో ఆవిడకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇవే గాక ఆమె కీర్తికిరీటంలో మరో కలికితురాయి 1984లో జీవన సాఫల్య పురస్కారంగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు దక్కడం!

శరదృతువులో ఓ ప్రశాంతమైన రోజున, సెప్టెంబర్‌ 22, 1991న ముంబైలో నటనకీ, వినోద రంగానికి వీడ్కోలు చెప్పి శాశ్వతమైన సెలవు తీసుకున్నారు. కొన్ని నెలలు జీవించి ఉంటే ఆవిడకి 87 ఏళ్ళు వచ్చేవి. విశ్వనాధ్ ఖోటే సోదరుడు నందు ఖోటే పిల్లలు విజు ఖోటే, శుభ ఖోటేలు కూడా నటీనటులుగా పేరు పొందారు. ఈవిడ గౌరవార్థం 2013 మే 3వ తేదీన ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here