అలనాటి అపురూపాలు-114

0
2

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటుడు అమర్‌నాథ్, ఆయన వారసత్వం:

 సన్యాసిరావు, రామాయమ్మ అనే పుణ్యదంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. పెద్దబ్బాయి మానాపురం అప్పారావు పేరుతో సుప్రసిద్ధ రచయిత అయ్యారు. రెండో కొడుకు ఎం. సత్యనారాయణ పట్నాయక్ – ప్రసిద్ధ నటుడు ‘అమర్‌నాథ్’ అయ్యారు [వారింటి పేరు పట్నాయక్ అని ఎందుకొచ్చిందో నాకు తెలియదు. బహుశా వారి తండ్రిగారి పేరు సన్యాసిరావు పట్నాయక్ అయి ఉండచ్చు. అమర్‍నాథ్ గారి కూతురు, నటి శ్రీలక్ష్మిగారే ఈ విషయంలో స్పష్టత నీయగలరు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆవిడ తన తండ్రి పేరు అమర్‌నాథ్ అనీ, ప్రముఖ దర్శకులు డి. యోగానంద్ ఆ పేరు పెట్టారని చెప్పారు].

అమర్‌నాథ్ విశాఖ జిల్లాలోని మానాపురంలో పుట్టారు. ఇంటర్మీడియట్ వరకు రాజమండ్రిలో చదువుకున్నారు. టౌన్ మిడిల్ స్కూలు, వీరేశలింగం హై స్కూలు, ఆర్ట్స్ కాలేజీలలో చదివారు. 1943లో చదువు పూర్తి చేసి, విశాఖపట్టణం చేరి సివిల్ సప్లయిస్ రేషనింగ్ ఆపీసులో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. టౌన్ మిడిల్ స్కూలులో చదువుతుండగా అప్పటి ప్రధానోపాధ్యాయులు పెమ్మరాజు రామారావు అమర్‍నాథ్ గారిని మొదటిసారిగా నాటకాలలో నటింపజేశారు, అదీ తులాభారం నాటకంలో సత్యభామ పాత్ర. బాగా నటించండంతో ఆయన అమర్‍నాథ్ గారిని ప్రోత్సహించారు. ఈ నాటకానికి అమర్‍నాథ్ గారికి మేకప్ వేసింది ద్రోణంరాజు చిన్న కామేశ్వర రావు [ఈయన సినిమాల్లోకి వెళ్ళి కచ దేవయాని, జీవన జ్యోతి అనే సినిమాలకు దర్శకత్వం వహించారు]. తులాభారం నాటకంలో అమర్‌నాథ్ నారదుడి వేషం, సత్యభామ వేషం రెండూ వేశారు. గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడిగాను, లవకుశ నాటకంలో లవుడిగాను నటించారు. కృష్ణ అమెచ్యూర్ కంపెనీ వారి హరిశ్చంద్ర నాటకంలో లోహితుడి పాత్ర ధరించారు. అమర్‍నాథ్ కాలేజీలో ఉండగానే ప్రమీలగారిని పెళ్ళి చేసుకున్నారు. వారికి 14 మంది సంతానం కలుగగా, ఆరుగురే మిగిలారు. ఇది ఆయన జీవితంలో మరో కథ. అప్పటి వరకూ ఆయన నాటకాలు వేస్తుండేవారు. 1952 నాటి వరకు ఆయన రేవతి నాట్య మండలి వారి నాటకాలలో నటిస్తూ, అప్పటికే ప్రసిద్ధ రచయిత అయిన తన అన్నయ్య రచించిన నాటకాలలో నటిస్తూండేవారు.

అమర్‍నాథ్ మంచి గాయకులు కూడా. ఎం సత్యనారాయణ పట్నాయక్ పేరిట రికార్డులు కూడా ఉన్నాయి. ‘ఇది నా సంకల్పం’, ‘గౌతమ బుద్ధ’, ‘చల్ మోహన రంగ’ వంటివి ప్రసిద్ధం. కొన్ని హాస్య పాటలు కూడా పాడారు, కానీ అవి ఆయన పాడినవని చాలామందికి తెలియదు.

ఉద్యోగం చేస్తున్నా, ఆయన నాటకాలు వేయడం మానుకోలేదు. నెలకొకసారి విశాఖ నాటక మండలి వారి  చంద్రగుప్త, ఆంధ్ర జ్యోతి, వినాయకుడి పెళ్ళి, బ్లాక్ మార్కెట్ వంటి నాటకాలలో నటిస్తుండేవారు. పూర్ణా పిక్చర్స్ మంగరాజు ఆ నాటకాలని చూసి, అమర్‌నాథ్ గారిని మద్రాసు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నించమని పంపారు.

అప్పటికి చాలా ఏళ్ళ ముందు, కె.వి.సుబ్బారావు ఆయనను లవకుశ నాటకంలో చూసి, శారదాలయ సీమ వారు నిర్మిస్తున్న ‘జయప్రద’ అనే సినిమాలో నటించమని పిలిచారు. సిఎస్‌ఆర్, బళ్ళారి లలిత, వంటి వారు నటిస్తున్నారు ఆ సినిమాలో. సంగీత దర్శకుడిగా యస్. రాజేశ్వరరావు గారి మొదటి సినిమా అది. అమర్‌నాథ్ వయసు అప్పుడు 13 ఏళ్ళు. సినిమాల్లో కొన్ని రోజులు పని చేశాకా, ఆయన తిరిగి విశాఖపట్టణం వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మద్రాసు వెళ్ళారు. దర్శకులు యల్లా అప్పారావు ద్వారా ప్రముఖ దర్శకులు డి. యోగానంద్‌తో పరిచయం కలిగింది. యోగానంద్ గారి ద్వారా ఎల్.వి. ప్రసాద్ పరిచయమయ్యారు. ఎల్.వి. ప్రసాద్ గారు ఆయనను పరీక్షించి – తెలుగు తమిళ ద్విభాషా చిత్రం ‘అమ్మలక్కలు’ సినిమాలో ఎన్.టి.ఆర్. తమ్ముడిగా వేషం ఇచ్చారు.

ఆ తరువాత చిత్రపు నారాయణ రావు గారి ‘నా చెల్లెలు’, భరణీ పిక్చర్స్ వారి చండీ రాణి, చక్రపాణి సినిమాల్లో నటించారు. సొంత బ్యానర్ పై నిర్మించిన ‘పిచ్చి పుల్లయ్య’ సినిమాలో అవకాశం ఇచ్చారు ఎన్.టి.ఆర్. తరువాత రాజరాజేశ్వరి వారి ‘లక్ష్మి’ వచ్చింది. ఆపై తన కెరీర్ బెస్ట్ చిత్రం, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తొలి చిత్రం అయిన ‘అమర సందేశం’లో నటించారు. వదిన గారి గాజులు, కనక తార, చెరపకురా చెడేవు, సంతానం, ఇంకా కన్నడ సినిమా ‘భక్త మల్లికార్జున’లో నటించారు. 1960లో ‘మగవారి మాయలు’ అనే సినిమా నిర్మించి, ఉన్నదంతా పోగొట్టుకున్నారు.

హీరోగా నటించినందు వల్ల, సహాయక పాత్రలలో నటించలేదు [నటించి ఉంటే, గుమ్మడిలాగా గొప్ప కారెక్టర్ ఆర్టిస్ట్ అయి ఉండేవారు, ఆ ప్రజ్ఞ ఉంది ఆయనలో]. ఆయనకి బహు సంతానం, ముందు చెప్పుకునట్టు మొత్తం 14 మంది పుట్టి, ఆరుగురే బ్రతికారు. ఆ రోజుల్లో పిల్లలని ఆస్తిగా భావించేవారు, డబ్బుని కాదు. తన సంతానంతో ఆయన హైదరాబాద్ వచ్చేశారు. శ్రీలక్ష్మి మాడపాటి హైస్కూలులో చదువుకున్నారు. కుటుంబాన్ని పోషించుకోడానికి ఆయన హైదరాబాదులో పలు డాక్యుమెంటరీలు తీశారు. పిల్లలు ఏది అడిగినా కాదనేవారు కాదు, అలా అని అతి గారాబం చేయలేదు. ఆ రకంగా తనని తాను గొప్పగా భావించుకునేవారుట. వారి ప్రసూతి వైద్యులు మాత్రం చిరాకు పడ్డారు, పిల్లలని కనడమే ఉద్యోగమా అని అడిగారట. పెద్ద కూతురు, పెద్ద కొడుకు చిన్నవయసులోనే పోయారు. ఆ తర్వాతి కూతురు శ్రీలక్ష్మి. ఇంకో కొడుకు రాజేష్. మరో కొడుకు ప్రేమలో విఫలమై, డబ్బు పోగొట్టుకుని, జీవితంపై ఆసక్తి కోల్పోయి తాగుడికి బానిసై, మరణించాడు.

తండ్రి అనారోగ్యం పాలయితే, కుటుంబాన్ని పోషింషడానికి శ్రీలక్ష్మి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదట్లో చిన్నా చితక పాత్రలు పోషించారు. కామెడీ పాత్రలు పోషించడంలో ఆమె ప్రతిభని గమనించిన దర్శకులు జంధ్యాల ఆమెకి ‘రెండు జళ్ళ సీత’ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు, అది ఆమె కెరీర్‌ని మార్చివేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ప్రసిద్ధ దర్శకులు జంధ్యాల, కె. విశ్వనాథ్ సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో దాదాపు 500లకి పైగా సినిమాలలో నటించారు. ఆ తరువాత టివి సీరియల్స్‌కి మళ్లారు. ఆమె ప్రధానంగా హాస్య పాత్రలలోనే నటించారు. కుటుంబం కోసం చేయగలిగినంత చేశారు.

ఇప్పుడు ఆమె మేనకోడలు ఐశ్వర్య తనకంటూ సొంతంగా పేరు తెచ్చుకుంది. ఐశ్వర్య, ఆమె తల్లి – శ్రీలక్ష్మి వారికేమీ చేయలేదని చెప్పడం విచారకరం! అన్నం పెట్టి, తల దాచుకోవడానికి చోటు నివ్వడం కూడా సాయమే అంటారు శ్రీలక్ష్మి, నేను ఆమెతో అంగీకరిస్తాను. రాజేష్, అతని కుటుంబం విషయానికొస్తే, అది మరొక కథ.

‘పుణ్యభూమి కళ్ళు తెరు’ చిత్రంలో శ్రీధర్, సంగీత‍లది ప్రధాన జోడీ. రెండవ జంటగా శ్రీలక్ష్మి, గుమ్మడి గారి అబ్బాయి (ఆయన నటించిన ఒకే ఒక చిత్రం) నటించారు. లక్కవరంలో జరిగిన అవుట్‌డోర్ షూటింగ్ సందర్భంగా, రాజేష్ (అసలు పేరు ప్రసాద్) తన వెంట ఉంటే తోడు ఉన్నట్టు ఉంటుంది అని తీసుకెళ్ళారు శ్రీలక్ష్మి. ఆ షెడ్యూల్‌లో రాజేష్, సినిమా వ్యక్తి అయిన నాగమణితో ప్రేమలో పడ్డారు. అప్పటికి అమర్‍నాథ్ చనిపోయి కొద్ది రోజులే అవడంతో వారి కుటుంబం విస్తుపోయింది. అక్కలకి ఇంకా పెళ్ళి కాలేదని, తల్లి అంగీకరించలేదు. కానీ ప్రేమికులు పట్టుబట్టారు. సినిమా రంగంలో తనకి దాసరి, కె. రాఘవేంద్రరావు వంటి పెద్దవాళ్ళు తెలుసునని నాగమణి – రాజేష్‌ని నమ్మించారని శ్రీలక్ష్మి భావించారు.  అయితే ‘రెండు జళ్ళ సీత’, ‘నెలవంక’ వంటి సినిమాల తర్వాత రాజేష్‍కి సినిమాలు తగ్గాయి. తను ఇంట్లోనే ఉండవలసి రావడం, అదే సమయంలో ఒక డాన్సర్‍గా భార్య నాగమణికి అవకాశాలు దొరకడం రాజేష్‌ని మానసికంగా క్రుంగదీసింది. ఆమెని షూటింగ్‌లకి వెళ్ళకుండా అడ్డుపడ్డారు. కుటుంబ పోషణకు పనికొస్తుందని, కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా, ఎవ్వరి మాట వినలేదు రాజేష్. ఈ దంపతులకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. నిరుత్సాహం పెరిగిపోయి, రాజేష్ 38 ఏళ్ళకే మరణించారు.

నాగమణి తన పిల్లలకి – తమ తండ్రి తమని మోసం చేశారని చెప్పారని శ్రీలక్ష్మి బాధతో చెప్పారు. ఏది ఏమైనా రాజేష్ ఇప్పుడు లేరు అని శ్రీలక్ష్మి బాధపడతారు. రాజేష్ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి, మోసపోయి, 20 వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కొడుకు 21 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను, మరో ఇద్దరు స్నేహితులతో కలసి కారులో చెంగల్పేట నుంచి అతి వేగంగా వస్తున్నాడు. ఒక ఫ్రెండ్ కారు నడుపుతున్నాడు, మరో మిత్రుడు వెనుక సీట్లో కూర్చున్నాడు. కారు డివైడర్‍ని ఢీ కొట్టింది. ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్న ఈ అబ్బాయి అక్కడికక్కడే మరణించాడు, అయితే అతని ఇద్దరు మిత్రులు మాత్రం గాయాలతో బయటపడ్దారు. ఇది ఇలా ఉంటే, శ్రీలక్ష్మి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి, తన ఆస్తులన్నీ పోగొట్టుకోవలసి వచ్చింది. జీవితం ఓ పోరాటంగా మారిందామెకి. ఈలోగా ఐశ్వర్యా రాజేష్, ఆమె తల్లి నాగమణి విడిగా ఉండసాగారు.

***

ఇటీవల ఐఐఎమ్ ట్రిచీలో జరిగిన ‘టెడెక్స్ టాక్’ ఐశ్వర్య తన గురించి, తొలినాటి కష్టాల గురించి, ఎదుర్కున్న సవాళ్ల గురించి, సోదరుల మరణం గురించి, దర్శకుల తిరస్కరణ గురించి, వేధింపుల గురించి చెప్పుకొచ్చారు.

“నా ప్రయాణం ఓ మిశ్రితమైన ప్రయాణం, అందులో బాధ ఉంది, విజయం ఉంది, సంతోషం ఉంది, ఇంకా ప్రేమ ఉంది” అన్నారు.

ఐశ్వర్య చెన్నైలో నలుగురు తోబుట్టువులో చిన్నపిల్లగా పుట్టి పెరిగారు. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో, తాము మురికివాడ లాంటి ప్రాంతంలో నివసించామని ఆమె చెప్పారు. తనకి ఎనిమిదేళ్ళ వయసులో తండ్రి చనిపోయారని, తనని అమ్మే పెంచి పెద్ద చేసిందని చెప్పారు.

“నాన్న లేని లోటు నాకు తెలియకుండా పెంచింది అమ్మ. అమ్మ ఓ యోధ. ఈ రోజు నేనిలా ఉన్నానంటే కారణం అమ్మ. చీరలు అమ్మి, ఎల్.ఐ.సి., రియల్ ఎస్టేట్ ఏజంట్‌గా పని చేసి మమ్మల్ని పోషించింది” చెప్పారు ఐశ్వర్య.

ఐశ్వర్య 11 తరగతి చదువుతూనే డబ్బు సంపాదించడానికి ప్రయత్నించారు. రోజుకి 225/- రూపాయల జీతంతో ఒక సూపర్ మార్కెట్ బయట నిలబడి ఒక చాక్లెట్ బ్రాండ్‌ని ప్రమోట్ చేశారు. బర్త్ డే పార్టీల వంటి వేడుకలకు యాంకరింగ్ చేసేవారు. తాను సంపాదించే డబ్బు కుటుంబ పోషణకి సరిపోదని గ్రహించి, రోజుకి 1500/- రూపాయలు లభించే టీవీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించారు.

సినిమా నిర్మాణ సంస్థలని సంప్రదించసాగారు. ‘అవర్గలమ్ ఇవర్గలమ్’ అనే చిత్రంలో అవకాశం దొరికినా, అది పెద్దగా ఆడలేదు. సినిమాల కష్టాల గురించి చెబుతూ, “సినిమాల విషయంలో మనకి తరచూ వినబడేది లైంగిక వేధింపులు… లైంగిక వేధింపులు అన్ని చోట్లా ఉన్నాయి, కానీ ఇది మీడియా రంగం కాబట్టి బాగా ప్రచారం అవుతుంది.  నేను లైంగిక వేధింపులనే కాక ఇంకా – నా రంగు, నా చాయ, నా రూపురేఖలు, నేను కనబడే విధానం… కారణంగా వివక్షని ఎదుర్కున్నాను. నేను తమిళం మాట్లాడుతాను కాబట్టే నన్ను తీసుకోలేదేమో.” అని అన్నారు. తాను ‘హీరోయిన్ మెటీరియల్’ కాదని కొందరు దర్శకులు అన్నారని ఆమె తెలిపారు.

‘అట్టకతి’ సినిమాలో చిన్న వేషం ఆమెకి గుర్తింపుని తెచ్చింది. ‘కాకా ముట్టై’ చిత్రంలోని పాత్రతో ఆమె అందరికీ తెలిసారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆ సినిమా తన కెరీర్‍లో గొప్ప మార్పుకి కారణమని ఐశ్వర్య అంటారు.

ఈ కుటుంబం పట్ల నాకు మిశ్రమ భావాలు కలుగుతున్నాయి. రొటీన్ పాత్రలకి భిన్నంగా మంచి పాత్రలు చేసి ఐశ్వర్య పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఇటీవల ఐశ్వర్య రాజేష్ పై వచ్చిన వార్తలకీ, అమర్‍నాథ్ గారిపై అందిస్తున్న ఈ వ్యాసానికి ఎటువంటి సంబంధం లేదు. అందుకని ఆ రచనని ఇక్కడితో ముగిస్తున్నాను. తన తాతగారి పట్ల ఐశ్వర్యకి ఎలాంటి అభిప్రాయం ఉందో దేవుడికే తెలియాలి….


సంపూర్ణ నటులు కైకాల సత్యనారాయణ:

కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా కౌతవరంలో 25 జూలై 1935 నాడు కైకాల లక్ష్మీనారాయణ గారికి జన్మించారు. ఆయన గుడివాడలో పెద్ద కలప వ్యాపారి. సత్యనారాయణ తన బ్యాల్యాన్ని తాతగారింట గుడ్లవల్లేరులో గడిపారు. అక్కడే హైస్కూలు వరకు చదువుకున్నారు. తరువాత తన తండ్రి వ్యాపారం చేసే గుడివాడకి వచ్చి అక్కడ కాలేజీలో చదివారు. 1951 నుంచి 1955 వరకు అక్కడే ఉండి బి.ఎ. పూర్తి చేశారు. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్ళే.  ఆ తర్వాత ఒక ఏడాది తాతగారి వద్ద ఉండి వ్యవసాయం చేశారు. తరువాత గుడివాడ వెళ్ళి తండ్రిగారికి వ్యాపారంలో సాయంగా ఉన్నారు.  కాలేజీ రోజుల్లో ఆయన నాటకాలు వేసేవారు. ఎన్నో సాంస్కృతిక పోటీలలో ఆయన బహుమతులు సాధించారు. ఆయన క్లాస్‍మేట్స్ అందరూ హీరోలా ఉన్నావనీ, నటనా రంగంలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. చదువు కూడా పూర్తయ్యింది కాబట్టి తన ఆసక్తిని కొనసాగించడానికి స్వేచ్ఛ లభించింది. మిత్రులతో చేతులు కలిపి, మరో మిత్రుడు పామర్తి సుబ్బారావు సాయంతో ‘ప్రభాకర నాట్య మండలి’ అనే సంస్థని స్థాపించారు. పినిశెట్టి, ఆత్రేయ రాసిన నాటకాలను ప్రదర్శించేవారు.

ఆయన పెదనాన్న శ్రీ అంజయ్య – మద్రాసు వెళ్ళి సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. రెండేళ్ళ పాటు వేషాల కోసం ప్రయత్నించారు. పరిశ్రమలోని ఎందరినో కలిసారు, అంతా అవకాశాలిస్తామని చెప్పారే కానీ ఎవరూ ఇవ్వలేదు. కెవి రెడ్డి గారు కూడా టెస్ట్-షూట్ చేసి, అవకాశం ఇస్తామన్నారు. ఈ అనిశ్చింత కాలంతో వీనస్ స్టూడియోకి చెందిన సౌండ్ ఇంజనీరు జె. సత్యనారాయణ – కైకాలగారిని ప్రోత్సహిస్తూ, ధైర్యం చెప్పారు.

కైకాల గారు చందమామ ఫిల్మ్స్ వారి ఆఫీసుకు వెళ్ళి నిర్మాత డి.ఎల్. నారాయణ గారిని, చెందయ్య గారిని కలిశారు. కేవలం అయిదు నిమిషాల వ్యవధిలో – తాము తీస్తున్న ‘సిపాయి కూతురు’ సినిమాలో హీరోని చేసేసారు. జమున కథానాయిక. వారు భవిష్యత్తులో తీయబోయే మూడు సినిమాల ఒప్పందంపై సంతకాలు చేశారు సత్యనారాయణ. ఆయన కలలు నిజమైన సమయం అది. ఆ సంస్థ ఆయన సొంత సంస్థ అయిపోయింది. ఆయనను ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో డి.ఎల్. నారాయణ – ఓ తండ్రి కొడుకుకి నేర్పించినట్లుగా – సత్యనారాయణకీ అన్నీ నేర్పించారు. తన తొలి షాట్‌లోనే ఎంతో అనుభవజ్ఞుడిగా నటించి సత్యనారాయణ అక్కడున్న అందరినీ మెప్పించారు. ఆ సినిమా గొప్పగా ఆడకపోయినా – పరిశ్రమకి చెందినవారు సత్యనారాయణలో లాంగ్‌ షాట్స్‌లో ఎన్.టి.ఆర్. పోలికలను గుర్తించారు. కొద్ది కాలానికి ఆయన ఎన్.టి.ఆర్‌కి ‘బాడీ డబుల్’ అయిపోయారు. అయితే సత్యనారాయణ కెరీర్‍ని మలుపు తిప్పే అవకాశం ఇచ్చింది మాత్రం బి. విఠలాచార్య. ‘కనకదుర్గ పూజా మహిమ’ చిత్రంలో విలన్‌గా వచ్చిన వేషం – సత్యనారాయణ వెనుదిరిగి చూసుకోనక్కరలేకుండా చేసింది. తర్వాత ఎన్నో విలన్ వేషాలు లభించాయి. మిగిలినది అంతా చరిత్రే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here