[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
హృదయాలను తాకిన పాటలను అందించిన షకీల్ బదాయూనీ:
ఆయన నవ్య భారతదేశానికి చెందినవారు, అప్పుడే స్వాతంత్ర్యం పొందిన జాతికి చెందినవారు. ఆనాటి విప్లవ భావాల, పురోగమనవాద కవిత్వం లోనూ షకీల్ బదాయూనీ – తన భావకవిత్వ అభిరుచి పట్ల నిబధ్ధతతో ఉన్నారు. విప్లవానికి ప్రతినిధిలా కన్నా, ప్రేమ యోధుడిగా ఉండడానికి ఇష్టపడ్డారు. సంగీత దర్శకులు నౌషాద్‌తో కలిసి రొమాంటిక్ గీతాలకు అందంగా ప్రాణం పోశారు. సెక్యులరిజమ్‍కి అనుకూలంగా సాగిన ‘గంగా జమునా తెహజీబ్’కు ఆయన మద్దతుదారు. ‘బైజు బావరా’ చిత్రం కోసం – నౌషాద్, షకీల్, రఫీ కలిసి ‘హరి ఓం… మన్ తరపత్ హరి దర్శన్ కో ఆజ్’ అనే అత్యద్భుతమైన భజన గీతం అందించారు. రాగ్ మాల్‌కౌన్స్ బాణీలో సాగిన ఆ గీతం ఎందరిని హృదయాలనో తాకింది. ఈ భజన రికార్డింగ్ సాగుతున్నప్పుడు – తన బృందంలోని అందరినీ – తనువుని శుద్ధి చేసుకున్నాకే రికార్డింగ్‌కి రమ్మన్నారట నౌషాద్. అదీ వారి కళలోని పవిత్రత!
వీరి కలయికలో వచ్చిన మరో గొప్ప చిత్రం ‘మొఘల్-ఏ-ఆజామ్’! అంతఃపుర కుట్రల నేపథ్యంలో విఫల ప్రేమ లోని చిత్తభ్రమని, భ్రమరాహిత్యాన్ని కూడా ఈ సినిమా పాటలు ప్రదర్శిస్తాయి. రవి, హేమంత్ కుమార్‍ల సంగీత దర్శకత్వంలో వెలువడిన పాటలకి గాను వరుసగా మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ఏకైక గీత రచయిత షకీల్ గారే (1960, 1961, 1962). చౌదవీ కా చాంద్ పాటలో స్త్రీ సహజ సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించినందుకు ఆయనకు బ్లాక్ లేడీ లభించింది. వహిదాకు అజరామరమైన కీర్తి దక్కింది. ఆ తరువాత ఆయన మరో రెండు సార్లు ఫిల్మ్‌పేర్ అవార్డు పొందారు – ఒకసారి ‘హస్నేవాలే తేరా జవాబ్ నహీ’ గీతానికి; మరోసారి ‘కహీ దీప్ జలే కహీ దిల్’ అనే విషాద గీతానికి. సినిమాలకి సంబంధించి ఆయన గీతాలలో ప్రాకృతికమైన ఉత్ప్రేక్ష ఉన్నా; ఆయన కవిత్వం మాత్రం జీవితం, ప్రేమల సంక్లిష్టతల నడుమ సాగింది. ఆయన కవిత్వం ఘజల్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. షకీల్ రాసిన – ‘మేరే హమ్నఫస్ మేరే హమ్‍నవా’ అనే ఘజల్‌ని బేగం అఖ్తర్ గానం చేయడంతో షకీల్ గొప్పవారి సరసన చేరారు.
షకీల్ బదాయునీ 1916లో ఉత్తర్ ప్రదేశ్ లోని బదయూన్‌లో జన్మించారు. అది సూఫీయిజం, కవిత్వం వర్ధిల్లిన నేల. ఆయనది విద్యావంతుల కుటుంబం. ఆయన తండ్రి అరబిక్, ఉర్దూ, పెర్షియన్, హిందీ భాషలలో పండితులు. బాల్యంలో షకీల్‍కు వారి సమీప బంధువు జియా-ఉల్-ఖాస్రి బదాయూనీ ప్రేరణ. ఆయన మతపరమైన కవిత్వం రాసేవారు. షకీల్ 1930లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఆయనకు నీరజ్, జిగర్ మురాదాబాదీ వంటి కవులతో పరిచయం కలిగింది. వీరిద్దరిలో షకీల్ కవిత్వంపై జిగర్ మురాదాబాదీ ప్రభావం ఎక్కువ. షకీల్ మెహ్‍ఫిల్, ముషాయిరాలలో పేరు తెచ్చుకున్నారు. రొమాన్స్ ఆయన బలం కావడంతో, త్వరలోనే ప్రసిద్ధి చెందారు. కొంత కాలం ఢిల్లీలో రేషన్ సప్లయిల విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేశాక, దానిని విడిచిపెట్టి, 1944లో బొంబయి వచ్చేశారు.
నౌషాద్, షకీల్:
మాస్ట్రీ నౌషాద్‍ను షకీల్ మొదటిసారిగా 1946లో ఒక ముషాయిరాలో కలిశారు. అక్కడ నౌషాద్ షకీల్‍ని తన ప్రతిభని ప్రదర్శించమని కోరడంతో –
‘హమ్ దర్ద్ కా అఫ్సానా దునియా కో సునా దేంగే
హర్ దిల్ మే మొహబ్బత్ కీ ఆగ్ లగా దేంగే’
అన్న ద్విపద వినిపించారట షకీల్.
అంతే, రెండు దశాబ్దాలలో 22 సినిమాలకు కలిసిపనిచేసి ప్రేక్షకులను/శ్రోతలను మధురమైన సంగీతంలో ఓలలాడించేతటి స్నేహానికి బీజం పడింది వాళ్ళిద్దరి మధ్య. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షకీల్ పాడగలరు, నౌషాద్ కవిత్వం రాయగలరు. ఇది ఈ సంగీత ఆత్మీయుల మధ్య ఉన్న పరస్పర సహకారానికి నిదర్శనం. కర్దార్ గారి ‘దర్ద్’ సినిమాకి షకీల్ వ్రాసిన గీతాలకు నౌషాద్ సమకూర్చిన బాణీలతో గొప్ప హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఉమాదేవి (టున్ టున్) పాడిన ‘అఫ్సానా లిఖ్ రహీ హు’ పాట! వీళ్ళిద్దరూ కలిసి – దులారి (1949), బాబుల్ (1950), దీదార్ (1951), బైజు బావరా (1952), అమర్ (1954), మదర్ ఇండియా (1957), మొఘల్-ఏ-ఆజామ్ (1960), కోహినూర్ (1960), గంగా జమున (1961), మేరే మెహబూబ్ (1963), లీడర్ (1964) ఇంకా దిల్ దియా దర్ద్ లియా (1966) వంటి సినిమాలకు అద్భుతమైన పాటలను అందించారు.
మొఘల్-ఏ-ఆజామ్ చిత్రం రాగాల, ప్రణయాల గుచ్ఛం. ఈ సినిమాలోని ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అనేది షకీల్ సొంత ఊరిలో పాడుకునే జానపద గీతం ‘ప్యార్ కియా కై,క్యా చోరీ కీ హై’ ఆధారంగా సృజించారు. ‘మోహె పన్‌ఘాట్ పే’ అనే భజన గీతం, ‘తేరీ మెహ్‍ఫిల్ మే కిస్మత్ ఆజ్మా కే’ అనే ఖవ్వాలి, ‘బేకస్ పె కరమ్ కీజియే’ అనే భక్తి గీతం, క్లాసిక్ ‘ప్రేమ్ జోగన్ బన్ కే’; బడే గులాం ఖాన్ పాడిన ‘శుభ్ దిన్ ఆయో’ – ఇవన్నీ షకీల్ కలంలోని వైవిధ్యానికి సూచికలు. నౌషాద్, షకీల్ జోడీ మాస్టర్‌పీస్ మొఘల్-ఏ-ఆజామ్.
60వ దశకం చివర్లో షకీల్ గారికి క్షయవ్యాధి సోకింది. శానిటోరియంలో చేర్చాల్సి వచ్చింది. మిత్రుడికి ఉత్సాహం కల్గించేందుకు, ఆర్థికంగా మేలు చేసేందుకు నౌషాద్ – షకీల్‌ని మూడు ప్రాజెక్టులలో – రామ్ అవుర్ శ్యామ్ (1967), ఆద్మీ (1968) ఇంకా సంఘర్ష్ (1968) – లలో చేర్పించారు. సాధారణంగా ముట్టే పారితోషికం కంటే పది రెట్లు ఎక్కువ ఇప్పించారని అంటారు. 1970లో షకీల్ చనిపోయేంతవరకు మ్యాస్ట్రో మరే గీత రచయితతోనూ పని చేయలేదు.
షకీల్, ఇతరులు:
షకీల్ స్వరకర్త హేమంత్ కుమార్‍తో కలిసి – ఘరానా (1961), ఘూంఘట్, గృహస్థి, నర్తకి (అన్నీ 1963లోవే), ఫూల్ అవుర్ పత్థర్, దో బదన్ (రెండూ 1966 లోవే) వంటి చిత్రాలతో సహా 15 సినిమాలకు పని చేశారు. షకీల్ మరో స్వరకర్త రవికి అదృష్టంగా మారారు – గురుదత్ సినిమా ‘చౌదవీ కా చాంద్’ (1960) కోసం షకీల్ రాసిన గీతాలు రవికి కూడా ఎంతో పేరు తెచ్చాయి. రవికి ‘ఘరానా’ చిత్రానికి గాను తొలిసారి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌పేర్ లభించింది. కాగా షకీల్‌కి ఉత్తమ గేయ రచయితగా ‘చౌదవీ కా చాంద్’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ లభించింది. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలలో – మోరీ ఛమ్ ఛమ్ బజే పాయలియా (ఘూంఘట్), జిందగీ కే సఫర్ మే (నర్తకి), లో ఆ గయీ ఉన్కే యాద్ (దో బదన్) – ప్రసిద్ధమైనవి. వీటిలో – దో బదన్ చిత్రానికి గాను షకీల్‍కి మరోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. గృహస్థి సినిమాలోని ‘ఔ ఔరత్ హై జో ఇన్‌సానోం కీ’ అనే పాట స్త్రీల గౌరవాన్ని చాటింది.
షకీల్ హేమంత్ కుమార్‌తో ‘బీస్ సాల్ బాద్’ (1962) కోసం పని చేశారు. వీరిద్దరి కలయికలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్న ‘కహీ దీప్ జలే కహీ దిల్’, ‘సపనే సుహానే లడక్‌పన్ కే’ వంటి పాటలు వచ్చాయి. ఈ జోడీ ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962)తో శిఖరానికి చేరింది. ఈ సినిమా లోని పియా ఐసే జియా మే, నా జావో సైయా, చలే ఆవో వంటి పాటలు జనాలని ఉర్రూతలూగించాయి. షకీల్ గీతాలకి మీనా కుమారి అభినయం తోడై పాటలను జనరంజకం చేశాయి.
షకీల్ ఎస్.డి బర్మన్‍తో కైసే కహూ, బేనజీర్ (రెండూ 1964 లోవే) సినిమాలకు పనిచేశారు. సి. రామచంద్ర గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన జిందగీ ఔర్ మౌత్ (1965), వహా కే లోగ్ (1967) చిత్రాలకు పనిచేశారు. రోషన్ గారితో బేదాగ్ (1965) నూర్జహాన్ (1967) సినిమాలకు పనిచేశారు. షకీల్ నౌషాద్ మాజీ సహాయకుడు గులామ్ మహమ్మద్ గారితో కూడా పని చేశారు. కానీ ఈ జోడీ అంతగా విజయవంతం కాలేదు. వీరిద్దరి కలయికలో యే దునియా హై (షైర్ 1949), షికాయక్ క్యా కరూం (కుందన్ 1955) పాటలు ప్రసిద్ధమయ్యాయి. భారత ప్రభుత్వం షకీల్ గారిని ‘గీత్‌కార్-ఏ-ఆజమ్’ బిరుదుతో గౌరవించింది.
ఘజల్ రారాజు:
తన తోటి వారి వలె కాకుండా షకీల్ గారికి రాజకీయ భావజాలం పట్ల ఆసక్తి బాగా తక్కువ. పురోగమనవాద కవులైన ఫైజ్ అహ్మద్ ఫైజ్, మజ్రూహ్ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, సర్దార్ జాఫ్రి తదితరులతో కలవలేదు. జిగర్ మురాదాబాదీ షకీల్‌ని ‘షాయర్-ఎ-ఫిత్రత్’ అని వర్ణించారు. ఆయన కవిత్వం ఆయన వ్యక్తిత్వానికి కొనసాగింపు అని అన్నారు. ఆయన కవిత్వం, ఆయన ఘజళ్ళలోని వేదన – ఆ కళ లోని నిష్ణాతులు – బేగమ్ అఖ్తర్, తలత్ మహమూద్ వంటి వారిని ఆకట్టుకున్నాయి. బేగమ్ అఖ్తర్ ప్రతీ కచేరీలోనూ, ప్రతీ టీవీ షో లోను షకీల్ ఘజళ్ళను పాడేవారు. ఇందులో – మేరే హమ్నఫస్ మేరే హమ్‌నవా, అయే మొహబ్బత్ తేరే అంజామ్ పె రోనా ఆయా – తప్పనిసరిగా ఉండేవి.
హంగామా-ఎ-ఘమ్, ఘమ్-ఎ-ఆషికీ సె కహదో -అనేవి తలత్‌కి ఇష్టం. షకీల్ సినిమాయేతర రచనలో – రంగీనియాన్, రనాయైన్, షబిస్తాన్. ఆయన ‘నగ్మా-ఎ-ఫిర్దౌస్’ అనే భక్తి కవిత్వం కూడా ప్రచురించారు. ఆయన కవిత్వంలో అధికంగా ప్రేమ, మనస్తాపాలను చిత్రించినా, హాస్యం కూడా ఉండేది. షకీల్ గారికి – నౌషాద్, రఫీ, జానీ వాకర్ వంటి స్నేహితులతో కలిసి బాడ్మింటన్ ఆడడం, పిక్నిక్ లకి వెళ్ళడం, వేటకి వెళ్ళడం, గాలిపటాలు ఎగరేయడం బాగా ఇష్టం. ఆయన ఆప్త మిత్రులలో దిలీప్ కుమార్, రచయిత వజాహత్ మిర్జా కూడా ఉన్నారు.
వీడ్కోలు:
షకీల్ బదాయునీ మధుమేహ సంబంధిత వ్యాదితో 53 ఏళ్ల వయసులో 20 ఏప్రిల్ 1970నాడు మృతి చెందారు. ఆయనకి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే కాలేజీలో చదుతువున్న ఆయన కూతురు నజ్మా కూడా చనిపోయారు. ఆయన మరణాంతరం ఆయన మిత్రులు ‘యాద్-ఎ-షకీల్’ అనే ట్రస్ట్‌ని స్థాపించారు. ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు. నేడు ఆయన పాటలు రెట్రో ఛానళ్ళలో వినిపిస్తుంటాయి, కాలాన్ని అధిగమించిన పదబంధాలని వినిపిస్తుంటాయి. బదౌన్‌లో వీధిలో ఈ కుటుంబం షకీల్ పేరుతో నిర్వహించే గ్రంథాలయం ఉంది, ఓ గొప్ప కవి ఆ వీధిలో తిరుగాడారనేందుకు నిదర్శనంగా!
హోవార్డ్ హ్యుస్ – అమెరికన్ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత:
హోవార్డ్ హ్యుస్ పూర్తి పేరు హోవర్డ్ రాబర్ట్ హ్యూస్ జూనియర్ (ఈయన 24 డిసెంబర్ 1905నాడు అమెరికాలోని టెక్సాస్ లోని హ్యూస్టన్‌లో జన్మించారు. 5 ఏప్రిల్ 1976న సదరన్ టెక్సాస్ గగనతలంలో ఓ విమానంలో మరణించారు). ఈయన వస్తుతయారీదారు, ఏవియేటర్, సినీ నిర్మాత, ఇంకా దర్శకులు. తాను చేపట్టిన విభిన్న వ్యాపారాల ద్వారా బాగా ధనం సంపాదించారు. తన విపరీత మనస్తత్వానికి, ఒంటరితనం కోరుకోవడానికి బాగా ప్రసిద్ధి చెందారు.
1909లో ఆయన తండ్రి హోవర్డ్ ఆర్ హ్యూస్ సీనియర్ – ఆయిల్ డ్రిల్లింగ్‌కి ఉపకరించే ఒక రోటరీ బిట్‌ని కనుగొన్నారు. దాని వల్ల ఆ కుటుంబం సంపన్న కుటుంబం అయింది. యువ హోవర్డ్ తొలుత ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి చూపారు. ఆపై పాసడేనాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ, హ్యూస్టన్ లోని ది రైస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోనూ చదివారు. అదే సమయంలో ఆయన తల్లి (1922), తండ్రి (1924) మరణించారు. ఆయన చదువు విడిచిపెట్టి తన తండ్రి వ్యాపారం – హ్యూస్టన్ లోని – హ్యూస్ టూల్ కంపెనీ – సారథ్యం చేపట్టారు. 1972లో ఈ కంపెనీ ఆయన అమ్మేసేనాటికి అది బిలియన్ డాలర్ల ఆస్తి అయింది.
1926లో హోవర్డ్ హాలీవుడ్‌కి వచ్చి సినిమాలు నిర్మించసాగారు. ఆయన సినిమాలు బడ్జెట్ పరిమితిని దాటిపోయేవి, సెన్సార్ వద్ద ఇబ్బందులు ఎదుర్కునేవి. ఆయన పలు సినిమాలు నిర్మించారు. అందులో అకాడమీ అవార్డు గెలిచిన – టు అమెరికన్ నైట్స్ (1927) ముఖ్యమైనది. 1927లో – హెల్స్ ఏంజెల్స్ – సినిమా ప్రారంభించినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. తొలుత మూకీగా అనుకున్న సినిమాని టాకీగా మార్చారు. ఎందరో దర్శకులు మారారు. చివరికి హోవర్డ్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఎట్టకేలకు ఈ సినిమా 1930లో విడుదలయింది. కథా పరంగా ఈ చిత్రం నిరాశపరిచినా, చిత్రంలోని వైమానిక విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. నిర్మాణ వ్యయాన్ని రాబట్టలేకపోయినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద హిట్ అయింది, మూడు మిలియన్ డాలర్లకు పైనే వసూలు చేసింది.
ఆ తరువాత హోవర్డ్ దర్శకత్వానికి వీడ్కోలు చెప్పి నిర్మాతగా మిగిలారు. 1948 లో ఆర్.కె.ఓ. పిక్చర్ కార్పోరేషన్‌లో అధిక వాటాలు కొన్నారు, కానీ 1953లో వాటిని అమ్మేసారు. మరుసటి ఏడాది ఆ మొత్తం కంపెనీనే కొన్నారు, కానీ 1955లో అమ్మేసారు. అయినా ఆర్.కె.ఓ. పిక్చర్ కార్పోరేషన్ బోర్డ్ ఛైర్మన్‍గా ఆయన 1957 వరకూ కొనసాగారు. ఆ ఏడాదే ఆయిన సినీరంగం నుంచి విరమించుకున్నారు. ఆ ఏడాది ఆయన ఎందరో నటీమణులతో సంబంధాలు పెట్టుకున్నారు, జీన్ పీటర్స్‌ని పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులు 1971లో విడాకులు తీసుకున్నారు.
ఒకపక్క సినిమాలు తీస్తునే, మరోవైపు విమానయాన రంగంలోనూ కొనసాగారు హోవర్డ్. 1932లో కాలిఫోర్నియాలోని కల్వర్ సిటీలో హ్యూస్ ఎయిర్‍క్రాఫ్ట్ కంపెనీ స్థాపించారు. తను స్వంతంగా డిజైన్ చేసిన ఒక విమానంతో గంటకి 352.46 మైళ్ళ (567.23 కిమీ) వేగంతో ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 19 జనవరి 1937 నాడు అదే విమానంతో సగటున గంటకి 332 మైళ్ల వేగంతో ప్రయాణించి -ట్రాన్స్‌కాంటినెంటల్ ఫ్లయిట్ టైమ్‌ని – 7 గంటల 28 నిమిషాలకి తగ్గించారు. 1938 జూలైలో లాక్‌హీడ్ 14 విమానం నడుప్తూ 91 గంటల 14 నిమిషాల రికార్డు సమయంలో భూమిని చుట్టివచ్చారు. మరుసటి సంవత్సరం ఆయన ట్రాన్స్‌వరల్డ్ ఎయిర్‍లైన్స్ (TWA) కంపెనీ షేర్ కొన్నారు, తదుపరి కాలంలో ఆ కంపెనీ స్టాక్స్‌లో 78శాతం సొంతం చేసుకున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హోవర్డ్ యుద్ధ విమానాల వైపు మళ్ళారు. ఎన్నో ప్రభుత్వ కాంట్రాక్టులు పొందారు. వీటిలో Hughes XF-11, H-4 Hercules ముఖ్యమైనవి. ఆయన సినిమాల వలే వీటి నిర్మాణం ఆలస్యమైంది, యుద్ధం పూర్తయ్యాక కానీ ఇవి సిద్ధం కాలేదు. 1946లో ఆయన Hughes XF-11 విమానాన్ని తొలిసారిగా నడిపారు, తొలి ప్రయాణంలోనే అది తీవ్ర ప్రమాదానికి గురయింది. ఎనిమిది ఇంజన్‍ల Hercules 750 మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగినది, 1947 నాటికి కానీ పూర్తి కాలేదు. యుద్ధ కాలంలో లాభాలు పోగు చేసుకున్నారానే ఆరోపణతో ఆ ఏడాడి హోవర్డ్‌ని సెనెట్ ముందు నిలబెట్టారు. వాద ప్రతివాదాలు చెలరేగాయి. ఆ తరువాత హోవర్డ్ – స్ప్రూస్ గూస్ అనే Hercules విమానాన్ని తొలిసారిగా ఒక మైలు దూరం (1.6 కిమీ) నడిపారు.
ఎప్పుడూ ఒంటరిగా ఉండే హోవర్డ్, 1950లో పూర్తి ఏకాంతానికి వెళ్ళిపోయారు. అయితే 1953లో ఆయన తన విమానయాన సంస్థలో వచ్చిన లాభాలతో హోవర్డ్ హ్యుస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ స్థాయించారు. ఈ సంస్థ బయోలాజికల్, మెడికల్ రీసెర్చ్‌లో పేరు పొందింది. ప్రపంచంలోనే గొప్ప దాతృత్వ సంస్థ అయింది. మరుసటి దశాబ్దంలో TWA కి సంబంధించిన కోర్టు కేసులో – యాంటీ ట్రస్ట్ ఛార్జెస్‌పై – కోర్టుకి హాజరయ్యేందుకు నిరాకరించి ఆ సంస్థ యాజమాన్య హక్కులు పోగొట్టుకున్నారు. 1966లో కంపెనీలో తన వాటాలను 500 మిలియన్ డాలర్లకు విలువకి పైగా అమ్మారు.
ఆ మరుసటి సంవత్సరం హోవర్డ్ లాస్ వెగాస్‍లో ‘డెజర్ట్ ఇన్’ అనే ఒక కాసినోని కొన్నారు. దానిలోని పెంట్ హౌస్‌ని ఖాళీ చేయమని యజమానులు అడగడంతో, మొత్తం కాసినోనే కొనేసారని అంటారు. దీని తరువాత వరుసగా ఎన్నో కాసినోలను, ఖాళీ స్థలాలను కొనేసారు. 1950 వ దశకంలో ఆయన లాస్ వెగాస్ వెలుపల కూడా స్థలాలు కొని కమ్యూనిటీలు ఏర్పాటు చేయాలని తలచారు. ఈ విధంగా లాస్ వెగాస్ నగరం అభివృద్ధికి, నగరం ఇమేజ్‌కి హోవర్డ్ తోడ్పడ్డారు. నగరానికి ఉన్న మాఫియా ఇమేజ్‍కి కాస్తయినా తగ్గించి, కార్పోరేట్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకువచ్చారు.
గోప్యతనీ, ఏకాంతాన్ని ఇష్టపడే ఆయన లక్షణం ఆయనకి వివాదాలు తెచ్చిపెట్టింది. 1971లో ఆయన తన జ్ఞాపకాలను పుస్తక రూపంలో ప్రచురించగా, దానిపై వివాదం చెలరేగి మిలియన్ డాలర్ల దావా నడిచింది. హోవర్డ్ రాసిన ఆ మ్యాన్యుస్క్రిప్ట్, అందులోని ఉత్తరాలు – మోసపూరితమైనవనీ, నకిలీవని తేలింది.
తన చివరి సంవత్సరాలలో హోవర్డ్ తన నివాసాన్ని పలు ప్రదేశాలకు మార్చారు (బహమాస్, నికారాగ్వా, కెనడా, ఇంగ్లండ్, లాస్ వెగాస్, మెక్సికో). డెజర్ట్ ఇన్ లాగానే విలాసవంతమైన హోటళ్ళలో బస చేసేవారు. తన ఉనికిని కొందరు మగ సహాయకులకు తప్ప ఎవరికీ తెలియనిచ్చేవారు కాదు. నల్లటి తెరలు వేసి ఉన్న గదులలో రోజుల తరబడి నిద్ర లేకుండా పని చేయడం వల్ల, మితాహారం తీసుకోవడం వల్ల, డ్రగ్స్ వాడడం వల్ల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 1976లో మెక్సికో నుంచి టెక్సాస్‍కి – వైద్య చికిత్సకై విమానంలో వస్తుండగా మృతి చెందారు.
ఆయన మరణం అనంతరం ఆయన ఆస్తులపై వివాదాలు తలెత్తాయి. ఎన్నో నకిలీ వీలునామాలు పుట్టుకొచ్చాయి. కానీ అవన్నీ ఫోర్జరీలని తేలాయి.
***
- తొలిరోజుల్లో బిల్లీ డోవ్, జీన్ హార్లోతో ఆయనకున్న సంబంధాల కారణంగా హ్యూస్కి సెక్స్ సింబల్ ఏర్పడింది. మొదటిసారి దర్శకత్వం వహించిన ‘హెల్స్ ఏంజిల్స్’ చిత్రంతో ఆయన శక్తిమంతమైన నిర్మాత అయ్యారు.
- కేథరిన్ హెప్‌బర్న్‌తో సంబంధాలు పెళ్ళి వరకూ దారితీసాయని పత్రికల్లో వార్తలు వచ్చినా, అది నిజం కాలేదు. 1938 నాటికే ఆమె ప్రభ మసకబారింది, అమె కెరీర్ ముందుకు సాగలేదు.
- జేన్ రస్సెల్‌తో హ్యూజ్ పరిచయం 1940లో మొదలైంది. కొత్త నటి కోసం అన్వేషిస్తూ ఆమె ఫోటోని బయటకు తీయడంలో వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధం మొదలైంది.
- అలాగే ఆనాటి అందాల తార జీన్ టిర్నేతో కూడా హోవర్డ్కి సంబంధాలుండేవి. ఆమె ఆనాటి కౌబాయ్స్ అన్నవారందరితోనూ ప్రేమ వ్యవహారాలు నడిపారు.
- ఇటలీ నటి Gina Lollobrigida అందానికి ముగ్ధుడై, ఆమెతో ఒప్పందాన్ని ఆలస్యం చేసి, ఆమె మరే అమెరికన్ సినిమాకి పనిచేయకుండా చేసి – హోటల్‌కే పరిమితం చేశారు.