అలనాటి అపురూపాలు-118

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బాలీవుడ్‍లో తొలితరం తెలంగాణ నటుడు పైడి జైరాజ్:

పైడి జైరాజ్ నాయుడు ఓ భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత. ఆయన ముఖ్యంగా హిందీ, మరాఠీ, గుజరాతీ భాషలలో పని చేశారు. తెలుగు రంగస్థలంలోనూ పని చేశారు. భారతీయ సినిమాల్లో 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఆయనది.

జైరాజ్ ఆనాటి హైదరాబాద్ స్టేట్ లోని (నేటి తెలంగాణ) కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో 28 సెప్టెంబరు 1909 నాడు జన్మించారు. ఆయనకి పైడిపాటి సుందరరాజ నాయుడు, పైడిపాటి దీన్‌దయాళ్ నాయుడు (ఆర్టిస్ట్) అనే ఇద్దరు అన్నలు ఉండేవారు.

హైదరాబాదు లోని నిజామ్ కాలేజీలో డిగ్రీ చదువుతూండగా, జైరాజ్‌కు సినిమాలు, నాటకాలపై ఆసక్తి కలిగింది. నటనపై ఆయనకు కలిగిన ఈ ఆసక్తి, ఆయనని ఉన్నత చదువులకు లండన్ పంపించాలనే వారి తల్లిదండ్రుల ఆశలపై నీళ్ళు జల్లింది. గ్రాడ్యుయేషన్ పూర్తి కాకుండానే జైరాజ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.

1928లో ఆయన బొంబాయి వెళ్ళి అక్కడ శారద ఫిల్మ్ కంపెనీలో డూప్లికేట్ స్టంట్‌మాన్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. తొలి రోజుల్లో కెమెరా ముందు ఆయన ఎదుర్కున్న ఇబ్బందులు ఆయనకు ప్రేరణ కల్పించి సినీ నిర్మాణానికి సంబంధించిన అన్నీ అంశాలను అధ్యయనం  చేసారు. కెమెరా, సెట్ వర్క్, ఎడిట్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ అన్నీ నేర్చుకున్నారు. కొన్ని రోజులకి జైరాజ్‌ చేయలేనిది అంటూ ఏదీ లేదనిపించుకున్నారు.

ఆయన నటించిన తొలి సినిమా 1929లో విడుదలయింది. ఆ సినిమాలో సైలెంట్ ఫిల్మ్ స్టార్ క్లింగ్ యూత్‌తో నటించారు. ఆ తరువాత ఆయన ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతృభూమి, ఆల్ ఫర్ లవ్, మహాసాగర్ మోతి, ఫ్లయిట్ ఇన్‍టు డెత్, మై హీరో వంటి 11 మూకీ సినిమాలో నటించారు.

గొప్ప శరీర సౌష్టవం, గ్రీకు వీరుడి లాంటి రూపంతో ఆయన – ఆనాటి గొప్ప రచయితలు – మామా వారీర్కర్, ఇందులాల్ యాజ్ఞిక్‍లను మెప్పించారు. వారితో కలిసి పనిచేయసాగారు. వారు జైరాజ్‌ను కథానాయకుడిగా పెట్టి ‘జగ్‌మాగతి జవానీ’ (1929) అనే సినిమా తీశారు. కానీ ఆ తర్వాత తీసిన రెండవ సినిమా ‘రసీలీ రాణి’ మొదట విడుదలయింది. 1929-31- మధ్యకాలంలో ఆయన 11 మూకీ సినిమాలలో నటించారు.

జైరాజ్ స్వర్ణ యుగం అని చెప్పుకోదగ్గవి కాలం 1950వ దశకం, 1960వ దశకం తొలినాళ్ళు. ఏ పాత్రనైనా అవలీలగా రక్తి కట్టించేవారు. హీరో, విలన్, ఇంకా కమేడియన్‍గా కూడా నటించారాయన. కానీ చారిత్రక పాత్రలు ఆయన విశిష్టత. చక్కని శరీర సౌష్టవం, అద్భుతంగా డైలాగులు చెప్పగల సామర్థ్యంతో చారిత్రక పాత్రలకు ఆయన ప్రథమ ఎంపిక అయ్యేవారు. చంద్రశేఖర ఆజాద్, అమర్ సింహ్ రాథోర్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, షహీద్ భగత్ సింగ్, టిప్పు సుల్తాన్ పాత్రలను సునాయసంగా పోషించారు.

జైరాజ్ మూడు అంతర్జాతీయ సినిమాలలో కూడా నటించారు. అవి – ఒక రష్యన్ నిర్మాణ సంస్థ తీసిన ‘పర్‌దేశి’, ఎం.జి.ఎం. వారి ‘మాయా’, ట్వెంటీయెత్ సెంచురీ ఫాక్స్ వారి ‘నైన్ అవర్స్ టు రామా’. జైరాజ్ గుజరాతీ, మరాఠీ సినిమాలలో నటించినా – మాతృభాష తెలుగులో నటించకపోవడం ఆశ్చర్యం గొలుపుతుంది.

ఆయన నటించిన చిత్రాలలో – ‘అమర్ సింహ్ రాథోర్’ (1957), ‘పృథ్వీరాజ్ చౌహాన్’ (1959), ‘ మహారాణా ప్రతాప్’ (1960) – విశిష్టమైనవి. షాజహాన్ (1947), టిప్పు సుల్తాన్ (1959), హైదర్ అలీ (1962) పాత్రలలో గొప్పగా నటించారు. ఆయన పోషించిన ఇతర పాత్రలలో – సస్సి పున్ను (1947), హతీమ్‌తాయ్ (1956), చంద్రశేఖర ఆజాద్ (1963), దుర్గాదాస్ (1964) – ముఖమైనవి. 1940-50ల మధ్య ఆయన సురయ్యాతో ఆరు సినిమాలు చేశారు. అందులో ఐదు సినిమాల్లో – హమారీ బాత్ (1943), శింగార్ (1949),  అమర్ కహానీ (1949), రాజ్‌పుత్ (1951) రేషమ్ (1952) – హీరోగాను, లాల్ కున్వర్ (1952)లో సెకండ్ హీరో గాను నటించారు. 1952లో ఆయన సొంతగా దర్శకత్వం వహించి ‘సాగర్’ అనే సినిమాని నిర్మించారు. అది అంతగా విజయంతం కాలేదు. అయినా ఆయన సినిమాల పట్ల విముఖత పెంచుకోలేదు.

జైరాజ్ సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‌లో 1939 నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. సైన్యం కోసం, జాతీయ కార్యక్రమాల కోసం నిధుల సేకరణకై ఎన్నో మ్యూజికల్ షోస్ ఏర్పాటు చేశారు. జైరాజ్‌ శాస్త్రీయ నృత్యాన్నీ, సంగీతాన్ని కూడా ప్రోత్సహించారు

ఆయన ఢిల్లీకి చెందిన సావిత్రి అనే పంజాబీ మహిళని పెళ్ళి చేసుకున్నారు. పృథ్వీరాజ్ కపూర్ తండ్రి గారు ఈ సంబంధం తెచ్చారు. జైరాజ్‌కి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఆయన కన్నా ఒక ఏడాది ముందు ఆయన భార్య కేన్సర్‌తో చనిపోయారు. చివరిరోజుల్లో ఆయన కూతురు గీత – ఆయన్ని చూసుకున్నారు. ఆయన మొత్తం కుటుంబంలో ఒక్క మనవడు (కూతురి కుమారుడు) రంజన్ షాహి మాత్రమే టివి నిర్మాత దర్శకుడిగా బాలీవుడ్‌లో ఉన్నారు. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ అవార్డు పొందిన పొందిన రెండవ తెలుగువారు, మొదటి తెలంగాణవారు జైరాజ్. ఇన్ని ఘనతలున్నా, తెలుగు సినీ పరిశ్రమ ఆయనను విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి, తెలంగాణా ఏర్పడ్డాకా – తెలంగాణా ప్రభుత్వం ఆయనను గౌరవించింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న రవీంద్రబారతిలోని రెండవ అంతస్తులో ఉన్న ప్రివ్వూ థియేటర్‌కి ఆయన పేరు పెట్టింది. రవీంద్రభారతిని – తెలంగాణా ప్రభుత్వం వారి భాషా సాంస్కృతిక విభాగం నిర్వహిస్తోంది.

చివరి రోజులు:

91 ఏళ్ళ వయసులో జైరాజ్ – తనకంటూ కొంత చోటు కోసం పోరాడారు.

ఫలితంగా జైరాజ్ ఫ్లాట్‌లో ఉంటున్న ఆయన కొడుకు దిలీప్ రాజ్ కుటుంబాన్ని మూడు రోజుల్లోగా ఖాళీ చేయవల్సిందిగా బాంబే సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి ఆదేశించారు. ఇకపై తండ్రిని చూడాలనుకుంటే, ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటలలోపు రావచ్చని న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. తర్వాత జైరాజ్ తన సొంత ఇంటిలో ప్రశాంతంగా జీవనం గడిపారు.

Jairaj with Zeb unnissa

అంతకుముందు జైరాజ్ తన కొడుకు దిలీప్ రాజ్ వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కున్నారు. జైరాజ్ ఇంటిని తన కుటుంబంతో సహా ఆక్రమించుకున్న దిలీప్ రాజ్, తండ్రిని ఒక గదికి పరిమితం చేశారు. తనని ఫోన్ కూడా ఉపయోగించుకోనివ్వలేదని జైరాజ్ తెలిపారు. తన కోసం వచ్చే మిత్రులని, సందర్శకులని రానీయలేదని, తనని గుమ్మం దాటనివ్వలేదని జైరాజ్ పేర్కొన్నారు.

అప్పటికే 60 ఏళ్ళ వయసున్న దిలీప్ రాజ్, జీవితంలో ఏమీ సాధించలేదని తండ్రి జైరాజ్ వాపోయారు. తన భార్య చెప్పినందు వల్ల తన ఆస్తులలో చాలా భాగం కొడుకు చేసే వ్యాపారాలలో పెట్టుబడిగా పెట్టాననీ చెప్పారు.

With Madhav Kale in Fight until death

పదిహేనేళ్ళ క్రితం తన తాజా పథకానికి తండ్రి ఆర్థిక సహాయం చేయడానికి నిరాకరించడంతో, దిలీప్ రాజ్ ఒక హాకీ బ్యాట్‌తో తండ్రిని కొట్టబోయారుట. అప్పుడు జైరాజ్ నలుగురిని కేకేసి, కొడుకుని ఇంట్లోంచి బయటకి పంపేశారట. ఇది మరింత వ్యయానికి దారితీసింది. కన్న కొడుకు కాబట్టి, జైరాజ్ అతనికి ఓ ఫ్లాట్ కొనిచ్చి, నెల నెలా కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది.

జైరాజ్ భార్య కేన్సర్‌తో సుదీర్ఘంగా పోరాడి మరణించారు. ఆమె చనిపోగానే, దిలీప్ రాజ్ కుటుంబం వచ్చి వాయువ్య బొంబాయిలోని పాలి హిల్ లో తండ్రి ఉంటున్న ఫ్లాట్‌ని బలవంతంగా ఆక్రమించుకున్నారు.

With Madhuri in My Hero

ఒకరోజు – ఆ ఇంటిపై అధికారం తనదని దిలీప్ రాజ్ ప్రకటించుకున్నాడని హౌసింగ్ సొసైటీ వాళ్ళు జైరాజ్‌కు తెలియజేశారు. అప్పుడే జైరాజ్‍కు అర్థమైంది, అనారోగ్యంగా ఉన్న తన తల్లితో తన కొడుకు అతనికి అనుకూలంగా ఆస్తి వచ్చేలా వీలునామా రాయించుకున్నాడని తెలిసింది. దాంతో ఆయన ఉగ్రడయ్యారు. “నేను జీవించి ఉండగానే నా ఆస్తి నా కొడుకు ఎలా రాయించుకుంటాడు?” అని ప్రశ్నించి, కోర్టుకు వెళ్ళారు.

తన వాదనకి మద్దతుగా – ఆ ఫ్లాట్‌ని తన సోదరీమణులు దక్కించుకోవాలనుకుంటున్నారని, అందుకే తానా పని చేశానని తెలిపారు. అయితే సోదరీమణులు ఆ వాదనని ఖండించారు. తాము తమ అత్తగారింట ప్రశాంతంగా కాపురాలు చేసుకుంటున్నామనీ,  తండ్రి కోరిక పైనే, నాన్న ఉండే ఫ్లాట్‌లో గత రెండు నెలలుగా ఉంటున్నామని, తాము సోదరుడి ఇంట కూడా తినడం లేదని, తాము బయటి నుంచి భోజనం తెప్పించుకుంటున్నామని చెప్పారు.

కలకత్తా, ఢిల్లీ నుంచి తమ ఇళ్ళను వదిలి తాను అక్కా, తండ్రి దగ్గరకు ఎందుకు రావల్సి వచ్చిందో చిన్న కూతురు గీత వివరించారు. “నాన్న నన్ను చూడాలనుకుంటున్నారని అన్నయ ఫోన్ చేశాడు. ఓసారి ఫోన్‍లో నాన్నతో మాట్లాడాను. నాన్న ఏడ్చేశారు, ‘గీతూ నువ్వు రావా, నీ అవసరం ఉంది’ అంటూ. అందుబాటులో ఉన్న విమానం ఎక్కి నేను బొంబాయి వచ్చాను. నాన్న దారుణమైన స్థితిలో ఉన్నారు. శరీరంలో creatinine స్థాయి బాగా పెరిగిపోయింది. ముఖం, పాదాలు వాచిపోయాయి. ఆయనకి మంచి బట్టలు కూడా వేయలేదు. ఆయన చాలా రోజులుగా స్నానం చేయలేదేమో, ఆయన గదంతా విపరీతమైన వాసన. డాక్టర్‌కి కబురు పెట్టాను, ఆయన వచ్చి నాన్నకి వైద్యం మొదలుపెట్టాకా, నేను వెళ్ళి నాన్నకి కొన్ని బట్టలు కొన్నాను. నాన్న కోసం నర్స్‌ని పెట్టాలనుకున్నాను, కానీ ఒప్పుకోలేదు. రెండు నెలల  పాటు మా అన్నయ్య కుటుంబం నన్నెంతో విసిగించారు. శత్రువులా చూశారు. అన్నం పెట్టలేదు, నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు. పైగా వాళ్ళ సొంత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు చేశారు.

నాన్న పడుతున్న బాధలని కళ్ళారా చూస్తూ నేను నా ఇబ్బందులని సహించాను. ఒకరోజు రాత్రి నాన్న లాయర్ దగ్గరకి వెళ్ళమని, పోలీసులకి ఫిర్యాదు చేయమని చెప్పారు. ‘నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాను. వెళ్ళి ఈ జనాల మీద కేసు వేయి. వాళ్లు నా ఇంట్లో ఉండకూడదు’ అన్నారు. నేను నాన్న చెప్పినట్టే చేశాను.

ఢిల్లీ నుంచి అక్కయ్య వచ్చింది, అమెరికా నుంచి తమ్ముడు కూడా వచ్చాడు. కానీ వాడు ఎక్కువ కాలం ఉండలేకపోయాడు.

ఇప్పటికి నేను వచ్చి రెండు నెలలయింది. మావారిని, అత్తవారింటిని వదిలేసి వచ్చాను. కేవలం నాన్నని జాగ్రత్తగా చూసుకోవడానికే. అయితే ఇక్కడి పరిస్థితి చూసాకా, ఇక్కడే కొన్ని రోజులు ఉండాలని, నాన్నకి నా అవసరం ఉందని అర్థమైంది. నాన్నకి అవసరం ఉన్నంత వరకూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆస్తి కోసం ఇదంతా చేసున్నానని అన్నయ్య అంటున్నాడు. అది నిజం కాదు. ఆస్తి, డబ్బు నాకేం అక్కరలేదు. ఆయనకి బాలేదు కాబట్టి నేను నాన్నతో ఉండడానికే వచ్చాను”.

కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జైరాజ్ కష్టాలు కొన్నయినా తీరాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే 11 ఆగస్టు 2000 నాడు జైరాజ్ మృతి చెందారు. ఆ తర్వాత ఆయన కుటుంబం గురించి పెద్దగా వివరాలు తెలియలేదు.

జైరాజ్ గురించి మరింత సమాచారం:

ఆయన సినిమా పరిజ్ఞానం గొప్పది. ఆయన నటించిన 210 సినిమాల్లో ఏ విషయమైనా, ఎవరి గురించి అడిగినా, ఎంతో ఓపికగా జవాబిచ్చేవారు. ఆయన నటించిన ప్రతీ సినిమా గురించి ఆయన వద్ద ఎంతో సమాచారం ఉండేది. తెలియని విషయాలు వివరించేవారు. తన ఫోటోలు, వాటి నెగటివ్‌లు కూడా ఆయన వద్ద ఉండేవి. తన అన్ని సినిమాల గురించి అవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా – ఫైల్లో సమాచారం భద్రపరిచేవారు. సినిమాలపై ఆయనకి ఉన్నంత కలెక్షన్ మరెవరి వద్దా లేదనడంలో అతిశయోక్తి లేదు. ఫిల్మ్ ఆర్కైవ్స్ తర్వాత అతి పెద్ద కలెక్షన్ ఆయన వద్ద ఉంది (ఆయన తదనంతరం అవన్నీ ఏమయ్యాయో?). ఆయన తన బిఎస్‌సి చదువు పూర్తి చేయకుండానే బొంబాయి వచ్చేసారు. అక్కడ రంగయ్య అనే మిత్రుడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ఆయనకి మహావీర్ ఫోటో ప్లే కంపెనీ ఉండేది. తనకున్న పరిచయాలతో  జైరాజ్‌ని సినీరంగంలో సులువుగా ప్రవేశపెట్టగలిగారు. అందుకే కొత్తవాళ్లు ఎదుర్కునే సమస్యలేవీ జైరాజ్‌కి ఎదురవలేదు. ఒడ్డు, పొడుగు, దృఢమైన శరీరం గల జైరాజ్ ఓ నిర్మాత దృష్టిలో పడ్డారు. ఆ నిర్మాత జైరాజ్‌తో ‘జగ్‌మాగతి జవానీ’ అనే సినిమా తీశారు. తరువాత  జైరాజ్ ‘యంగ్ ఇండియా పిక్చర్స్’లో రెగ్యులర్ ఉద్యోగిగా చేరారు. అప్పట్లో ఆయనకి నెలకి 35 రూపాయల జీతం వచ్చేది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు అక్కడ నిర్మితమయ్యే సినిమాలకు సంబంధించి అనేక సీన్లు, పలు పనులు చేయాల్సి వచ్చేది. మాధురి సరసన నటించిన రెండవ సినిమా ‘రసీలీ రాణి’ పెద్ద హిట్ అయింది. అది నాలుగు వారాలు ఆడింది. జైరాజ్ జీతం నెలకి 75 రూపాయలకి పెరిగింది.


నటి యోగీతా బాలీ, ఆమె రెండు వివాహాలు:

1952లో జన్మించిన యోగీతా నటిగా కొన్ని హిట్ సినిమాల్లో నటించారు. ఆమె మొదటి వివాహం భారతీయ గొప్ప సినీ గాయకులలో ఒకరైన కిషోర్ కుమార్‍తో జరిగింది. కానీ ఆ బంధం విచ్ఛిన్నమై ఇరువురు వేరు మార్గాలలో జీవితం కొనసాగించారు. కిషోర్ కుమార్‌కి విడాకులు ఇచ్చాకా, యోగీతా నటుడు మిథున్ చక్రవర్తితో జీవితం పంచుకున్నారు, ఆయన్ని 1979లో ద్వితీయ వివాహం  చేసుకున్నారు.

మిథున్, యోగీతా ఏదో సినిమా సెట్‍లో తొలిసారి కలిసారని అంటారు. తొలి పరిచయంలోనే స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం పరిణయంగా పరిణమించింది. కిషోర్ కుమార్‌కి విడాకులిచ్చిన ఏడాదికి యోగీతా, మిథున్ వివాహం చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితం స్థిరంగా కొనసాగింది. ఈ దంపతులకి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు పుట్టారు.

యోగీతా బాలీ, కిషోర్ కుమార్‌ల బంధం విషయానికి వస్తే, వాళ్ళు ఎలా, ఎప్పుడు కలిసారో సరిగ్గా తెలియదు. కానీ ఆ నట-గాయకుడి కన్నా ఆమె వయసులో 20 సంవత్సరాలు చిన్నది. ఈ వయసు తేడానే వారి వైవాహిక బంధాన్ని విచ్చిన్నం చేసిందని అనుమానాలున్నాయి. వాస్తవానికి, ఒక ఇంటర్వ్యూలో కిషోర్ కుమార్ – తన మాజీ భార్య యోగీతా – తమ వైవాహిక జీవితం పట్ల గంభీరంగా లేదని, తమ బంధాన్ని ఒక జోక్‍గా పరిగణించిందని చెప్పారు. ఆమెకు తన తల్లి అంటే విపరీతమైన ఇష్టమనీ, తనతో కలిసి ఉండడానికి ఎన్నడూ ఇష్టపడలేదని అన్నారు. ఇది యోగీతా మొదటి వివాహం గురించి. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులతో ఆమె సంబంధాల గురించి తెలుసుకుందాం.

యోగీతా తండ్రి పేరు సయ్యద్ ఇర్షాద్ హుస్సేన్. సినీ రంగంలో రాణించేందుకు ఆయన పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు. తన పేరుని జస్వంత్ అని మార్చుకుని సినిమాల్లో నటించారు. జస్వంత్ యోగీతా తల్లి హర్‌దర్శన్ కౌర్‌ని పెళ్ళి చేసుకున్నేటప్పటికే ఆయనకో వివాహం జరిగింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హర్‌దర్శన్ గీతా బాలీ సోదరి. సినీరంగంలో నష్టాలు ఎదురై, నిలదొక్కుకోలేక – యోగీతా తండ్రి తిరిగి పాకిస్థాన్ వెళ్లిపోయారు.

కిషోర్ కుమార్‌తో తన తొలి వివాహం నల్లేరు మీద నడక కాదని యోగీతా వివరించారు. తమ బంధం గురించి వ్యాఖ్యానిస్తూ, “నాకు కొన్ని సమస్యలున్నాయి. కిషోర్ కుమార్ తో నా తొలి వివాహం విఫలమైనా, నాకు ప్రేమ మీద నమ్మకం పోలేదు. నేను ఆయన్ని ఎన్నడూ ప్రేమించలేదు. మాకు పెళ్ళయినా దాంపత్యసిద్ధి లేదు. అందుకని నేను వివాహంలో ఇమడలేదు” అన్నారు. అయితే ఆరా తీస్తే కిషోర్ కుమార్ అన్నారట – “రాత్రంతా మేల్కొని డబ్బులు లెక్కబెట్టుకుంటుంటే కాపురం ఎలా సాగుతుంది? అందుకు నేను ఒప్పుకోవాలా? నేనేమైనా పిచ్చివాడినా? అందుకే, మేం తొందరగా విడిపోవడమే మంచిదయింది” అన్నారట.

తన మొదటి భార్య హెలెన్ లూక్ పోలికలున్నాయని మిథున్ యోగీతాను చేసుకున్నారని పుకార్లు ఉన్నాయి. స్టార్ డస్ట్ మేగజైన్ వారు యోగీతాని కలిసి ఈ విషయం గురించి అడిగితే, “నాకు తనంటే రోత. ఆమెలా ఉన్నానని మిథున్ నన్ను పెళ్ళి చేసుకున్నారని జనాలు అంటారు. కానీ మా మధ్య అటువంటి పోలికలే లేవు. మిథున్ జావేద్ ఖాన్‌లా ఉంటారని ఆమె అనుకుని ప్రేమించింది కాబట్టి అందరూ ఆమె లాగే ఆలోచిస్తారని ఎందుకు అనుకోవాలి? ఆమెలా నేనెలా కనిపిస్తాను? నేనంత అందగత్తెను కాను” అన్నారు. కిషోర్ కుమార్‌కి విడాకులిచ్చాకా – యోగీతా, మిథున్‍లు అప్పటికే సహజీవనం చేస్తున్నారని, విడాకుల కోసం ఎదురు చూస్తున్నారని వదంతులు వినిపించాయి. “అదంతా అబద్ధం. వాటి గురించి నేనూ విన్నాను. ఈ చెత్తకి అంతా ఎవరు కారణమో నాకు తెలుసు. నేనిక్కడ నా సొంత ఫ్లాట్‌లో మా అమ్మతోనూ, సోదరుడితోనూ ఉంటున్నాను. మిథున్‌తో పెళ్ళయ్యాకనే ఆయన ఇంటికి వెడతాను” అన్నారు యోగీతా.

చివరికి మిథున్‌తో వివాహం అయ్యాకా, తనకి కుటుంబ జీవితమే ముఖ్యమనీ, అందుకు ఇతర విషయాలన్నీ వదులుకుంటాననీ అన్నారు. “నేను సాధారణ గృహవాసిని.  స్టూడియోకి వెళ్ళి స్టార్స్ వచ్చే దాక ఎదురు చూడడం కన్నా – ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకుంటూ – ఆయన బయటకి వెళ్ళి వస్తుంటే చూడడం, వచ్చకా, ఆయనతో సమయం గడపడం నాకు బాగుంటుంది. అందుకే పెళ్ళి కోసం అన్నీ వదిలేసుకుంటున్నాను. నేను కావాలని మిథున్ పిలిస్తే చాలు, వెళ్ళిపోతాను” అన్నారు.

యోగీతా, మిథున్‍ల వైవాహిక జీవితం సుఖంగా సాగింది, పిల్లలతో ప్రతీ క్షణాన్నీ ఆస్వాదించారు!

అయితే 1980 ల తొలినాళ్ళలో నటి శ్రీదేవి – మిథున్ చక్రవర్తిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారనీ వార్తలు వినవచ్చాయి. వారిద్దరూ వాటిని ఖండించినా, తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించలేదు. 1985లో మిథున్, శ్రీదేవి గోప్యంగా వివాహం చేసుకున్నారని చెప్పుకుంటారు. వీరిద్దరి మధ్య ప్రేమ ‘జాగ్ ఉఠా ఇన్‍సాన్’ (1984, తెలుగులో సప్తపది) సినిమా షూటింగ్‍లో మొదలైందని అంటారు.

ఈ వివాహం గురించి తెలుసుకున్న యోగీతా ఆత్మహత్యా ప్రయత్నం చేశారని అంటారు. వీరిద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మిథున్ యోగీతా వైపే మొగ్గారట. యోగీతా ఆయనకి కష్టకాలంతో ఎంతో అండగా నిలిచారు. దాంతో శ్రీదేవికి వియోగమే మిగిలిందని చెప్పుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here