అలనాటి అపురూపాలు-119

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

వైవిధ్య నటనకు చిరునామా సంధ్య:

అలనాటి హిందీ నటి సంధ్య అసలు పేరు విజయ దేశ్‍ముఖ్. సంధ్యా, ఆమె సోదరి వత్సల మొదట రంగస్థల కళాకారులు. వారి తండ్రి గారు – నాటకాలలో తెర వెనుక ఉండి బాధ్యతలు నిర్వహించే బృందంలో ఒకరు. కొన్నాళ్ళు కష్టాలు పడ్డాకా, అక్క చెల్లెళ్ళిద్దరూ పని కోసం బొంబాయి వచ్చారు. అదే సమయంలో తన కొత్త సినిమా ‘అమర్ భూపాలి’ (1951) కోసం కొత్త నటి కోసం ప్రకటన ఇచ్చారు వి. శాంతారామ్.  వత్సల తన సోదరిని విజయని ఆడిషన్ కోసం పంపారు. కానీ విజయ వి. శాంతారామ్‌ని ఆకట్టుకోలేకపోయారు. ‘ఈ యువతికి విశేష ప్రతిభ లేదూ, అందమూ లేదు’ అనుకున్నారట ఆయన. కాకపోతే ఆమె గొంతు తన రెండవ భార్య జయశ్రీ గొంతులా ఉందని గుర్తించారు. అయితే విజయ అదృష్టమో ఏమో, ఆ పాత్రకి సరైన వారెవ్వరూ లభించనందున – దర్శకనిర్మాత – ఆ పాత్రకి విజయనే ఎంపిక చేసి – నాట్యం నేర్చుకోవాలనే షరతు విధించారు. విజయ పేరును ‘సంధ్య’గా మార్చారు శాంతారామ్. కఠినమైన శిక్షణ పొందిన సంధ్య తన పాత్రని గొప్పగా పోషించారు. ‘అమర్ భూపాలి’ గొప్ప హిట్ అయింది, 1952 కేన్స్ ఉత్సవాలలో గ్రాండ్ పిక్స్‌కి నామినేట్ అయింది. తన తదుపరి చిత్రం ‘పర్‍ఛాయేం’ (1952)లో సంధ్య – ఆ సినిమాలో నాయిక పాత్ర పోషించిన జయశ్రీతో పాటు నటించారు. ఓ మహిళ కారణంగా ప్రమాదవశాత్తు చూపు పోగొట్టుకున్న వ్యక్తి కథ ఇది. అయితే తన బాగోగులు చూసుకునే మహిళ స్వరంలాంటి స్వరం ఉన్న మరో మహిళని అతను ఇష్టపడతాడు. సంధ్య, జయశ్రీల స్వరంలో ఉన్న పోలికని ఈ చిత్రం అద్భుతంగా చూపిస్తుంది.

***

వి. శాంతారామ్ గారి కూతురు మధుర జస్‌రాజ్ తన తండ్రి రెండవ భార్య జయశ్రీ గురించి, మూడవ భార్య సంధ్య గురించి ఇలా చెప్పారు:

~

నాన్న జయశ్రీగారితో పని చేస్తున్నప్పుడు వారి మధ్య ప్రేమ మొదలైంది. ఆమెతో నాన్న ‘శకుంతల’ (1942) సినిమా తీశారు. అది బొంబాయిలో 104 వారాలు ఆడింది. తరువాత జయశ్రీ సూపర్ హిట్ ‘డా. కొట్నీస్‍ కీ అమర్ కహానీ’లో నటించారు. జయశ్రీ గారి పిల్లలు (కిరణ్ శాంతారామ్, తేజశ్రీ, రాజశ్రీ) మేమూ ఒకే కుటుంబంగా పెరిగాం. సినిమా ప్రదర్శనలకి కలిసే వెళ్ళేవాళ్ళం. రాజ్ కమల్ స్టూడియోస్ ప్రాంగణంలో టెన్నిస్, ఇతర ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే జయశ్రీ హజరై, ఆతిథ్యం ఇచ్చేవారు. నాన్న జయశ్రీ గారిని పెళ్ళి చేసుకున్నాకా కూడా మా వద్దకు వచ్చి రోజూ గంట సేపు గడిపి వెళ్తుండేవారు. మమ్మల్ని సర్కస్‌కి, ఐస్ షో కి, ఇంకా ఇతర ప్రదేశాలకి తీసుకువెళ్ళేవారు. మొత్తం కుటుంబం అంతా రెండు కార్లలో ఇరుక్కుని వెళ్ళేవాళ్ళం. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (సంధ్య) చిత్రం నిర్మాణం కోసం నాన్న – అమ్మవీ, జయశ్రీ గారివి బంగారు నగలు తాకట్టు కోసం అడిగారు. ఆ నగలన్నీ ఆయనిచ్చినవే కనుక, ఆయన వాటిని ఏమైనా చేసుకోవచ్చు అంటూ అమ్మ ఇచ్చేసింది. కానీ ఎందుకో జయశ్రీగారు ఇవ్వలేదు. ఇది వారిద్దరి మధ్య అపోహలకి దారితోసింది. నాన్న సంధ్య గారికి దగ్గరవుతున్నారని జయశ్రీ భావించారు. తన నగలని సంధ్యకి ఇచ్చి ఆమెతో స్నేహం చేసుకోవాలనుకున్నారు జయశ్రీ. కానీ సంధ్య – తాను నగలు ధరించనని, వాటిని తిరస్కరించారు. నాన్న, జయశ్రీ 13 నవంబర్ 1956 నాడు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 22న నాన్న సంధ్యని పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్న జయశ్రీ గారిని మరువలేకపోయారు, ఆమె కూడా నాన్నని మర్చిపోలేరని నా నమ్మకం.

సంధ్య నాన్న తీసిన ‘దో ఆంఖేం బారహ్ హాత్’లో నటించారు. ఆ తరువాత ఝనక్ ఝనక్ పాయల్ బాజే, జల్ బిన్ మఛిలీ నృత్య్ బిన్ బిజ్లీ, పింజరా, నవరంగ్‌ లలో నటించారు. నిలకడ సంధ్య గారి సుగుణం. ఎంతో శ్రమించేవారు. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ కోసం నాట్య గురువు గోపి కిషన్ గారితో కలిసి రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు కథక్ సాధన చేసేవారు. ఆమె దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. డబ్బు కోసమే నాన్న వెంటపడ్డారని ఆమెని కొందరు నిందిస్తే, ‘నాకు ఆయన డబ్బు అక్కర్లేదు. నేను రాజ్ కమల్‌కి చెందినదాన్ని. దానికి కట్టుబడి ఉంటాను’ అన్నారు. ఆమె వేరే ఏ సంస్థకు పని చేయలేదు. స్వర్గీయ మహబూబ్ ఖాన్ ఆమెకి పెద్ద మొత్తం ఇవ్వజూపారట, కానీ సంధ్య అంగీకరించలేదట. ఆమెని నాన్న పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు 20 ఏళ్ళు. మేము కొంత బాధ పడిన మాట నిజం.

ఎందుకంటే జయశ్రీ గారితో విడిపోయాక, నాన్న మాతో ఉంటున్నారు. ఆయన సమక్షాన్ని మేమెంతో ఇష్టపడేవాళ్ళం. కానీ సంధ్యగారిని పెళ్ళి చేసుకున్నాక, నాన్న మళ్ళీ స్టూడియోలో ఉండసాగారు. సంధ్య నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. తెల్లటి ప్లెయిన్ చీరలు కట్టుకునేవారు, ఆకుపచ్చని గాజులు వేసుకుని బిందీ పెట్టుకునేవారు. మెడలో మంగళసూత్రం. జయశ్రీగారితో మూడో సంతానం పుట్టాకా, నాన్న ఆపరేషన్ చేయించుకున్నారు. అందుకని సంధ్యకి పిల్లలు పుట్టలేదు. ‘మీరంతా నా పిల్లలే’ అనేవారు. ఆమె మా అమ్మని ఎంతో గౌరవించేవారు. మా అబ్బాయి సారంగ్ దేవ్ ఉపనయన కార్యక్రమంలో ఆమె అథిథులకు వడ్డించారు. నాన్న ప్రతీ రోజూ స్టూడియోకి వెళ్ళేవారు. ఒక రోజు స్టూడియోలో ఉండగా పడిపోయారు, తొడ ఎముక విరిగింది. బాంబే హాస్పిటల్‍లో చేర్చాము. నాన్న బలహీనమైపోయారు, ఆహారం తీసుకోడం మానేసారు. సరిగా స్పృహ లేని స్థితిలో కూడా కెమెరామాన్‌ని పిలుస్తూ, తగిన సూచనలు చేసేవారు. సంధ్య నాన్నని జాగ్రత్తగా చూసుకునేనారు. ఓసారి నాన్న వాంతి చేసుకుంటే, సంధ్య దాన్ని తన చేతులలో పట్టుకున్నారు. ఓ గొప్ప స్త్రీ మాత్రమే ఇలా చేయగలదు. ఆయన పిల్లలం, మేం కూడా అటువంటి పని చేయలేమేమో! నాన్న అటువంటి గొప్ప మహిళలను ఆకర్షించారా లేక వాళ్ళే నాన్న ప్రభావానికి లోనయ్యారా అని నేనేప్పుడూ ఆలోచిస్తూంటాను. నాన్న 1990లో మరణించారు. అంత్యక్రియలకి జయశ్రీ హాజరయ్యారు.

ప్రస్తుతం సంధ్యగారికి 89 సంవత్సరాలు. ఇంట్లోనే ఉంటూ, చదువుకుంటూ, టివి చూస్తూ విశ్రాంత జీవితం గడుపుతున్నారు.”


నటి సాధన, దర్శకుడు ఆర్.కె. నయ్యర్ వివాహం:

తమ ప్రేమ గురించి, పెళ్ళి గురించి అలనాటి హిందీ నటి సాధన వివరించారు. టీనేజ్‌లో ఉండగానే ఆమె ప్రేమలో పడ్డారు. 16 ఏళ్ళ వయసులో ‘లవ్ ఇన్ సిమ్లా’  (1960) చిత్రంలో నాయికగా నటిస్తుండగా, ఆ సినిమా దర్శకుడు ఆర్.కె. నయ్యర్‌తో ప్రేమలో మునిగారు. “నాకు ఆయనంటే, ఇష్టం కంటే గొప్పదైన భావం కలిగింది. కాని నాపై ఆధారపడిన కుటుంబం ఉందని నాకు తెలుసు. దేశ విభజన తర్వాత ఆస్తులన్నీ వదులుకుని పాకిస్తాన్ నుంచి వచ్చాం. అందుకని మా ప్రేమని మనసులోనే దాచుకున్నాను. సినిమా షూటింగ్ అయిపోయింది. ఎవరి దారిని వారు వెళ్ళిపోయాం. ఆయన తన పనులు చేసుకున్నారు, నేను నా పనులు! మొదటిసారి విడిపోయాకా, మా బంధం మళ్ళీ కలిసింది. ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి పెళ్ళి చేసుకుందామన్నారు. మా అమ్మానాన్నలకి ఈ పెళ్ళి ఇష్టంలేదు. కానీ నాన్న మాత్రం ‘జబ్ మియా బీవీ రాజీ తో క్యా కరేగా ఖాజీ’ అని అన్నారు. చివరికి అమ్మ కూడా ఒప్పుకుంది. నయ్యర్ గారి పాలి హిల్ ఇంట్లో మా నిశ్చితార్థం జరిగింది. నేను నిశ్చితార్థానికి రక్తవర్ణం బెనారస్ చీర కట్టుకున్నాను. వెయ్యిమందిని ఆహ్వానించాను. ఒక హీరోయిన్ నిశ్చితార్థానికి అంతమంది ఆహ్వానించడం ఓ విశేషం. మా పెళ్ళికి (1966) నేను వజ్రాలు, వెండి ఎంబ్రాయిడరీ చేసిన గులాబీరంగు చీర కట్టుకున్నాను, దానికి అదనంగా ‘మాజెంటా స్టోల్’ ధరించాను.” వివరించారు సాధన.

వివాహం తరువాత సాధన అప్పుడప్పుడు నటించారు. ‘ఏక్ ఫూల్ దో మాలి’, ‘ఇంతకామ్’, ‘గీతా మేరా నామ్’ (ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు) చిత్రాల్లో నటించారు. “నేను ‘గీతా మేరా నామ్’ తర్వాత నటన విరమించుకున్నాను, నాకు ఆరోగ్యం బావుండేది కాదు (ఆమె అప్పట్లో థైరాయిడ్ సంబంధిత వ్యాధితో బాధపడ్డారు). అది దృష్టి దోషమని కొందరు అన్నారు. చికిత్స కోసం అమెరికా కూడా వెళ్ళాను. నిర్మాతలు నన్ను తప్పించుకు తిరిగేవారు. పైకి వెళ్లినది, కిందకి తిరిగి రాక తప్పదని అర్థమయింది.” అన్నారు.

“సినిమాలు మానేసిన తర్వాత జీవితం ఆటంకాలు లేని సెలవు కాలంలా అయింది. పారిస్, అమెరికా, ఇంకా ప్రపంచమంతా తిరిగాను, సినిమాలు చూసాను, సాధారణ జీవితం గడిపాను. నా 15 ఏట తర్వాత, మళ్ళీ ఇప్పుడే నేను సెలవు తీసుకున్నది” అన్నారు 22 ఏళ్ళకే పెళ్ళి చేసుకున్న సాధన.

“మావారు భోజన ప్రియులు. నేను చైనీస్, యూరోపియన్, తదితర అన్ని రకాల వంటలూ నేర్చుకున్నాను. మేము బయట తినడం మానేశాం. ‘ప్రపంచంలోని ఉత్తమమైన ఆహారం ఇంట్లో తయారవుతుంది. మార్పు కోసం అయినా కూడా నేను నచ్చని పదార్థాలు తినను’ అని ఆయన అనేవారు. ‘వంటవాళ్ళు ఎంతమంది మారినా ఇంట్లో తయారయ్యే పదార్థాల నాణ్యత ఏ మాత్రం మారదు’ అని ఆయన నాకు గొప్ప ప్రశంస నిచ్చారు. వేసవి, వానాకాలం, చలికాలం – కాలం ఏదైనా దానికి తగ్గ వంటలు ఉండేవి. నెలలో కనీసం నేను 20 రకాల పప్పు వంటకాలు చేసేదాన్ని” చెప్పారు సాధన.

“మేం కూడా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాం. మా పెళ్ళయ్యాకా, నయ్యర్ గారి ‘యే జిందగీ కిత్నీ హసీఁ  హై’ పరాజయం పాలయింది.  తరువాత సినిమాలు – పతి పరమేశ్వర్, కత్ల్ వంటి సినిమాలు కూడా బాగా ఆడలేదు. ఎన్నో అప్పులు తీర్చాల్సి ఉంది. వాళ్ళ అప్పులు తీరుస్తానని అందరూ నా మీద భరోసా పెట్టుకున్నారు” అని చెప్పారు.

తన భర్త చనిపోయిన రోజును గుర్తు చేసుకుంటూ “ఆయనకి ఆస్తమా ఉండేది. ఆ రోజు మందు ఇచ్చినా ఎందుకో చాలా అసౌకర్యంగా ఉన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోగానే, స్పృహ తప్పారు. చనిపోవడానికి ఒక వారం ముందు ఆయన తన మరణాన్ని ఊహించారు. ‘నువ్వు దృఢమైనదానివి, గట్టి మనిషివి. కానీ నాకేదైనా అయితే కొద్ది రోజులు నీకు కష్టకాలం’ అన్నారు. ‘మరి నాకేదైనా అయితేనో’ అన్నాను. ‘అప్పుడు ఇంట్లో రెండు శవాలు లేస్తాయి’ అన్నారు. ‘నువ్వు లేకుండా నేను జీవించలేను’ అన్నారు” అని చెప్పారు సాధన.

1995లో భర్త మరణం తర్వాత, సిబ్బంది అందరికీ మూడు నెలల నోటీసు ఇచ్చి, నిర్మాణ సంస్థను మూసివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here