[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
సామీ రూబెన్‌తో నా సంభాషణ
సాధారణంగా సెలబ్రిటీల వివరాలు అందరికీ తెలుస్తాయి. కానీ వారితో సన్నిహితంగా మసలిన వారి నుంచి సేకరించిన వివరాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఖచ్చితమైనవిగా ఉంటాయి. అలాంటివే సామీ రూబెన్‌తో సంభాషించి గీతా దత్ గురించి నేను తెలుసుకున్న ఈ విషయాలు.
సామీ రూబెన్ ప్రసిద్ధ పియానో-అకార్డినిస్ట్. తన కెరీర్‌ని గీతా దత్ నటించిన ‘అనుభవ్’ (1971) సినిమాలోని ‘ముఝే జా నా కహో మేరీ జాన్’ పాటతో ప్రారంభించారు. వారితో జరిపిన ప్రశ్నోత్తరాల సంభాషణలో గీతా దత్ గురించి నేనేంతో తెలుసుకున్నాను. 1968లో ఆయన గీతా దత్‌ని ఎలా కలుసుకున్నదీ చెప్పారు.
10 అక్టోబరు 1964న గురు దత్ చనిపోయిన రోజున ఆయన పూనే నుంచి బొంబాయి (ఇప్పటి ముంబై)కి వచ్చారు. ఆ సమయంలో గీతా దత్ సర్వం కోల్పోయినట్టు ఉండేవారు. ఆవిడ మానసికంగా క్రుంగిపోయారు. ఈ గాయాన్నుంచి కోలుకోవడానికి ఆమె మళ్ళీ గానాన్ని ఆశ్రయించారు, దుర్గా పూజల కోసం డిస్క్‌లు రూపొందించారు, స్టేజ్ షోలలో పాడారు, ఇంకా ‘బధు బరన్’ (1967) అనే బంగ్లా సినిమాలో నాయికగా నటించారు.
1968లో ఈ పరిస్థితుల్లో సామీ గీతాదత్‌ని మొదటిసారిగా కలిసారు. తన స్వంత ఊరు అయిన పూనె నుంచి బొంబాయి వచ్చి తన బంధువులింట పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. సాయంత్రాల పూట ఆయన తరచుగా గీతా దత్ గారి ఇంటికి వెళ్ళేవారు.
గీతా దత్ గారి ఇంట్లో ఓ గదిలో ఉంటున్న నటి టున్‌టున్ (గాయని ఉమాదేవి) రోజంతా 555 సిగరెట్లు కాల్చారని సామీ గమనించారట. గీతా దత్ ఆతిథ్యాన్ని టున్‌టున్ విస్తృతంగా ఉపయోగించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సామీ టున్‌టున్ గారి కూతుర్లను కూడా కలిసారు, వాళ్ళల్లో ఒకరు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసేవారు. ఆమె కూతుర్ల దగ్గర ఉండకుండా, గీతా దత్ ఇంట్లో ఎందుకుంటున్నారో సామీ లాగే నాకు కూడా అర్థం కాలేదు. ఇందుకు కారణం – బహుశా ఆమె – గీతా దత్ భర్త రూపొందించే సినిమాలలో ఎక్కువగా నటించడం కావచ్చు, అందుకే గురు దత్ చనిపోయినా వాళ్ళింట్లోనే ఉండిపోయారు. కీర్తి ప్రతిష్ఠలు ఉచ్చదశలో ఉండగా గీతాదత్‌కి నటి స్మృతి లాంటి నేస్తాలు ఎందరో ఉండేవారు. కానీ భర్త పోయిన దుఃఖంలో ఉన్న గీతాదత్‌ని చూడడానికి ఒక్కరు కూడా రాలేదని సామీ గుర్తు చేసుకున్నారు. వారందరూ ఆమెని వదిలేశారనిపించింది. కనీసం తాను వెళ్ళిన రోజుల్లో అయితే ఎవరూ రాలేదని సామీ జ్ఞాపకం చేసుకున్నారు.
తన వ్యక్తిగత సమస్యలను ఆవిడ ఎవరితోనూ చెప్పుకునేవారు కాదని, పైగా ఇతరుల సమస్యలను గమనించి వీలయితే సానుభూతితో వాటిని పరిష్కరించేవారని సామీ చెప్పారు. ఆవిడ ఎంతో హుందాయైన, అద్భుతమైన వ్యక్తి అని సామీ పలుమార్లు గుర్తు చేసుకున్నారు. ఆవిడ జ్ఞాపకాలలో లీనమైన సామీ ఎన్నో విషయాలు గుర్తు చేసుకున్నారు. గురు దత్ చనిపోయినప్పుడు ఆమె, ముగ్గురు పిల్లలు ఒక ఆడమనిషి ఉండేవారు (ఆవిడ పేరు సామీకి గుర్తు రాలేదు, ఆవిడే పిల్లల్ని చూసుకునేది, ఇంటి పని, వంట పని చేసేదట. గీతా దత్ షో లలో తబలా వాయించే దేబు చక్రవర్తి – ఆమె ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారట. వాళ్ళ వివాహానికి గీతా దత్ కూడా సాయం చేశారట. తరువాతి కాలంలో దేబు ఆర్.డి. బర్మన్‌కి, ఇంకా హేమంత్‌కుమార్‌కి కూడా తబలా వాయించారు. ఇప్పుడాయన తన కొడుకు వద్ద అమెరికాలో ఉంటున్నారు. ఆమె కి పెళ్ళయి వెళ్ళిపోయాకా, గీతాదత్ దగ్గర ఎవరు పనిచేశారో గుర్తు లేదన్నారు సామీ). వీళ్ళూ, టున్‌టున్ కాకుండా ఆవిడ కజిన్, సెక్రటరీ అయిన హీరూ ఉండేవారు. గీతా గారి ఆర్థిక వ్యవహారాలన్నీ హీరూ చూసుకునేవారు, షోల ఏర్పాట్లు, చెల్లింపులు అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగేవి. నటుడవ్వాలని వచ్చి కాలేకపోయిన మోనిష్ అనే మంచి మనిషి కూడా గీతాదత్‌కి తోడుగా ఆ ఇంట్లో ఉండేవారట. రాత్రి భోజనాలయ్యాకా వారిద్దరూ కొద్దిగా మద్యం పుచ్చుకునేవారట. అప్పట్లో తాను చిన్నవాడినని, వారి మధ్య సంబంధమేమిటో అన్నది పట్టించుకోలేదని సామీ చెప్పారు (ఆమెలో ధైర్యం నింపే బంధమే అయి ఉంటుందని నేనంటే, ఆయనా అంతేనన్నారు). మద్యం తాగినా గీతా దత్ ఎన్నడూ అదుపు తప్పి ప్రవర్తించలేదన్నారు. ఎప్పడూ తనని తాను నియంత్రణలో ఉంచుకునేవారు, ఇతరుల పట్ల ఎంతో సానుభూతి కలిగి ఉండేవారు. బహుశా తన బాధల్ని మరిచిపోవడానికి ఆమె తాగేవారేమో అని సామీ చెప్పారు… ‘అయ్యో పాపం!!’ అనే పదే పదే అన్నారు (ఆవిడ కనుక ఇప్పుడు – ఈ ఇంటర్‌నెట్ కాలంలో, మ్యూజిక్ గ్రూప్‌ల కాలంలో – జీవించివుంటే, నిజమైన అభిమానుల మధ్య అంతటి ఒంటరితనం అనుభవించేవారు కాదేమో). అప్పుడెప్పుడో వారు కలుసుకున్నప్పుడల్లా ఆశా భోస్లే గీతాదత్‍కి పాద నమస్కారం చేశారని సామీ గుర్తు చేసుకున్నారు. తరువాత ఓ.పి.నయ్యర్ ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలో హీరోయిన్ పాటలన్నీ తనకి సన్నిహితమైన ఆశాకీ, క్లబ్ సాంగ్ గీతా దత్‌కి ఇచ్చినా గీతా దత్ బాధపడలేదు. ఆ సినిమాలో అన్ని పాటలకన్నా గీతా పాడిన మేరా నాం చించించూ అనే పాట సూపర్ హిట్ అయింది. ఆ మాట కొస్తే, ఆమె ఎవరీ చెడూ కోరుకోలేదు.
గీతా దత్ – సామీ, టున్‍టున్, హీరూ, ఇంకా మోనిష్‌లతో కలిసి తరచుగా సినిమాలకి లేట్ నైట్ షోలకి వెళ్ళేవారు. ఒకసారి పూనెలో ఒక షో జరిగింది. పూనె సామీ సొంత ఊరని తెలుసుకున్న గీతా దత్ పబ్లిసిటీ పోస్టర్లపై అతని పేరు ప్రముఖంగా ముద్రించేట్టు చూశారట. సామీ స్వర్గస్థులైన తన తండ్రిగారి కారుని బయటకు తీసి నడిపారట. అది బ్రహ్మాండమైన వాక్స్‌హాల్ కారు. దాంతో సామీ కారు నడపగలరని గీతా దత్‌కి తెలిసింది. బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత, అప్పట్నించి రాత్రి పూట సినిమాలకీ, షోలకి వెళ్ళేడప్పుడు డ్రైవర్‌ని ఇంటికి పంపించేసి, సామీని కారు నడపమనేవారు.
శోకంతో క్రుంగిపోయి ఉన్న గీతా దత్, పిల్లలు అల్లరి చేస్తే ఉన్నట్టుండి చిరాకు పడేవారు. తెలిసిన ఆసుపత్రికి వెళ్ళి రెండు లేదా మూడు రోజులు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకునేవారు. మళ్ళీ మామూలయి తిరిగి వచ్చేవారు. మరి దీనికి పిల్లలు ఎలా తట్టుకున్నారని సామీని అడిగాను. తను చూసినంతవరకు, తనకి తెలిసినంత వరకూ పిల్లల్ని బాగా చూసుకునేవారన్నారు. మరి దీని ప్రభావం పిల్లల మీద పడలేదా అని అడిగితే, ‘ఉండి ఉండవచ్చు’ అన్నారు. అప్పడు తరుణ్ దత్ వయసు 14 ఏళ్ళు. పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. అరుణ్ దత్‌కి 12 ఏళ్ళు, నీనాకి 6 ఏళ్ళు ఉండేవి. గీతా దత్ చనిపోయాకా, వీళ్ళంతా ఏమయ్యారు అని అడిగాను. తనకి తెలిసినంతవరకు మగపిల్లలని గురు దత్ గారి సోదరుడు ఆత్మారామ్ గారు చూసుకున్నారనీ చెప్పారు, ‘పాప నీనాని లలితా లజ్మీ చూసుకున్నార’ని చెప్పాను (ఫిల్మ్‌పేర్‌లో ఈ విషయం చదివానని ఆయనతో చెప్పాను). ఆయన ‘అయ్యుండచ్చు’ అన్నారు, గీతా దత్ చనిపోయినప్పుడు తాను బొంబాయిలో లేనని అన్నారు. అప్పుడు ఆయన పూనెలో ఉన్నారని, టున్‌టున్, హీరూ, మోనిష్‌ల సంగతులు తెలియలేదని చెప్పారు.
అనుభవ్ (1971) సినిమా రికార్డింగ్ విషయానికి వస్తే – గీతా దత్ స్వరం పట్ల ఎంతో ఆరాధన ఉండేది సామీకి. ఆ పాట పాడడానికి ఆమె నేరుగా ఆసుపత్రి నుంచి వచ్చారని సామీ చెప్పారు… “ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించండి…” అన్నారు. పాపం, ఎంతో క్రుంగిపోయి ఉంటారు. అయినా పాటలోని సూక్ష్మభేదాలను సులువుగా గ్రహించి, వెంటనే పాడేసారు. ‘ముఝే జా నా కహో మేరీ జాన్’ పాటకు ఆయన పియానో వాయించారు. ఆమె ఆ పాటని పెద్దగా రిహార్సల్స్ చేయకుండానే, నేర్చుకున్నారు, రికార్డింగ్ గంటలో అయిపోయింది. ఆవిడ కెరీర ఉచ్చదశలో ఉండగా ఆమె రికార్డింగ్ చేయడం ఎన్నడూ చూడలేదని సామీ చెప్పారు; కాకపోతే వ్యక్తిగత జీవితంలో విషాదం ఎదురయ్యాకా, దానిని తట్టుకుంటూ అద్భుత గాయనిగా నిలవడం గొప్ప విషయమని అన్నారు. ఎక్కువ సాధన, రిహార్సల్స్ లేకుండా సహజంగానే అద్భుతంగా పాడేవారామె. ‘ముఝే జా నా కహో మేరీ జాన్’ పాటతో ఆమె ఎంత ప్రసిద్ధి చెందారో అందరికీ తెలిసిందే. ఆ పాటలో వచ్చే ఆమె నవ్వు గురించి అడిగాను, ఆమె అలా ఎలా నవ్వగలిగారో తనకి తెలియదనీ, బహుశా దర్శకుడు బాసూ భట్టాచార్య ఆమెని అలా నవ్వమని చెప్పి ఉంటారని అన్నారు. ఆ పాటకి సంగీతం సమకూర్చినది అద్భుతమైన స్వరకర్త కానూ రాయ్. పాపం, ఆయన ఎంతో నిరాడంబరులు అని, ఇప్పుడు గతించారని చెప్పారు సామీ. ఆయనా, కానూ ఘోష్ (వీరు కాన్ రాయ్ అంత ప్రతిభావంతులు కారని సామీ అన్నారు) స్వరకర్త సలీల్ దా వద్ద సహాయకులని సామీ చెప్పారు. ఈ పాటకి దేబూ తబలా వాయించగా, సామీ పేటీ వాయించారు. ఏ నౌటంకి కోసమైనా ఈ పరికరం రంగస్థలంపై ఉండేది. దానిలో హార్మోనియం వలె ఉంటుంది, వాయించే వ్యక్తి రెండు చేతులు ఉపయోగించాల్సి వచ్చేది. కాలి కుట్టు మిషన్‌లా – కాలితో పెడలింగ్ చేస్తూంటే వాయిద్యంలోకి గాలి వచ్చేది. దాన్ని పేటీ అనేవారు, ఎందుకంటే అది చూడడానికి చెక్కపెట్టెలా ఉండేది. కొంతమంది దీనిని దేశీ పియానో అనేవారు (ఈ విషయం నాకు మూల్‌నారాయణ సర్దానా జీ తెలిపారు). సామీ చెప్పినదాని ప్రకారం ఆయన ఈ పరికరాన్ని ‘ముఝే జా నా కహో మేరీ జాన్’ పాటకి వాయించారని అర్థమైంది. ఆమె అంత అద్భుతంగా పాడగలిగినప్పుడు, మరిన్ని అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే, ‘బహుశా ఆమె పట్టించుకోడం మానేసి ఉండాలి, స్టేజ్ షోల ద్వారా కావల్సినంత డబ్బు అందేది’ అన్నారాయన. ఆమెకి షోలు చాలా తరచుగా ఉండేవి. ప్రతీ రెండు వారాలకి ఉండేవనీ అంటే, ఆవిడకి ఎంత డబ్బొచ్చేదని నేను అడిగాను. షోకి 5000 వచ్చేవనీ, ఆ రోజుల్లో అది పెద్ద మొత్తమని ఆయన చెప్పారు… అప్పట్లో సౌత్ ఇండియన్ భోజనం ఒక్క రూపాయి ఉండేది. ఆర్కెస్ట్రాకి 1500 ఇచ్చేవారట, మిగతావి ఆవిడ రోజూవారీ ఖర్చులకీ, ఆసుపత్రి ఖర్చులకీ తగినంతగా సరిపోయేవట. మద్యానికి కూడానా అని అడిగాను. బదులుగా డబ్బు ఎన్నడూ ఆమెకి సమస్య కాదు అని చెప్పారాయన. కనీసం కాలేయం సమస్య వల్ల ఆసుపత్రికి వెళ్ళని రోజుల్లో… అన్నారు. ఆమె డిప్రెషన్‌తో విచారంగా ఉండేవారని అన్నారు. ఆమె కాలేయం సమస్యతో ఎప్పుడు జబ్బుపడ్డారో తనకి తెలియదని ఆయన అన్నారు.
తాము చేసిన ఎన్నో షోలలో… పంజాబ్‍లోని కపూర్తలలో జరిగిన మొదటి షోని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే లక్నోలో 40000 మంది శ్రోతల ముందు జరిగిన షోని జ్ఞాపకం చేసుకున్నారు. గీతా దత్ మరణం అనంతరం సామీ వీరందరితోనూ సంబంధాలు తెంచుకున్నారు, అయితే 2002లో ఆమె 30వ వర్ధంతి సందర్భంగా మనోహర్ అయ్యర్ అనే ప్రోగ్రామ్ మేనేజర్ బొంబాయిలో రెండు షోలు ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ పాల్గొన్నారు. మొదటి షో ఈస్ట్ విలె పార్లె లోనూ, రెండవది రెండు రోజుల తర్వాత వెస్ట్ విలె పార్లె లోనూ జరిగింది. ఈ రెండు షోలకు గీతా దత్ రెండవ కుమారుడు అరుణ్ దత్‌ని ఆహ్వానించి ప్రసంగించవలసిందిగా కోరారు. తన తండ్రి గురు దత్ గారికి నివాళిగా తనని ఎన్నో షోలకి ఆహ్వానించారనీ, తన తల్లికి నివాళిగా హాజరవడం అదే మొదటిసారని, అందుకు తానెంతో సంతోషిస్తున్నానని ఆయన చెప్పారు (గీతాదత్ జీవితచరిత్ర రాసిన రచయిత్రి హైమంతిని జీ కూడా ఇదే విషయం నాకు చెప్పారు. అతని తల్లి గురించి పరిశోధన చేస్తున్న సమయంలో ఆమె అరుణ్ దత్‌ని కలిసారు. తన తల్లి గురించి పరిశోధిస్తూ, ఒకరు తనని కలవడం ఎంతో గొప్పగా ఉందని చెప్పారు అరుణ్. సాధారణంగా తనని కలిసేవారంతా తండ్రి గురు దత్ గురించే మాట్లాడుతారని అన్నారయన). షో ముగిసాకా, మనోహర్ అయ్యర్ ప్రతి ఒక్కరినీ పరిచయం చేస్తూ, గీతా దత్ షోలలో ఒరిజినల్ ప్లేయర్ అయిన సామీ రూబెన్ స్వయంగా ఆర్కెస్ట్రాలో ఉన్నారని చెప్పారు. అప్పుడు అరుణ్ దత్ వెంటనే, “నాకు తెలిసిన సామీ అంకులేనా?” అని మనోహర్ అయ్యర్‍ని అడిగారట. తరువాత రెండవ షోలో అరుణ్ దత్ సామీని వేదికపైకి పిలిచి హత్తుకున్నారట. కష్టకాలంలో అమ్మ వెంట నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పారట (ఫోన్‍లో సామీగారు ఈ విషయం చెబుతుంటే నాకు కన్నీళ్ళాగలేదు).
మన అభిమాన గాయని గురించి తన జ్ఞాపకాలను పంచుకున్నందుకు సామీ గారికి వేల వేల కృతజ్ఞతలు చెప్పాను, ఆయన చెప్పినదాని గురించి ఆలోచించాను. మా సంభాషణంతా రికార్డు చేశాను కాబట్టి, మళ్ళీ విని ఇవంతా జాగ్రత్తగా రాశాను. నా వైపు నుంచి ఏవైనా తప్పులుంటే, తెలిసిన పెద్దలు సరిదిద్దగలరు.
వ్యక్తిగత విషాదం, క్షీణిస్తున్న ఆరోగ్యం వల్ల గీతా దత్ మద్యానికి బానిసయ్యారని చాలామంది అంటారు. 1972లో ఆమె లివర్ సిర్రోసిస్ వ్యాధితో మరణించారు, కానీ తగిన అవకాశాలు లభించి ఉంటే- తనలో ఇంకా ప్రతిభ మిగిలి ఉందని నిరూపించేవారు. బాసూ భట్టాచార్య గారి ‘అనుభవ్’ (1971) సినిమాలోని ‘ముఝే జా నా కహో మేరీ జాన్’, ‘కోయీ చుప్‌కే సే ఆకే’, ‘మేరా దిల్ జో మేరా హోతా’ వంటి పాటలు గీతా దత్ అద్భుత గాన కౌశలానికి చిహ్నంగా చిరస్థాయిగా ఉండిపోతాయి.
‘ముఝే జా నా కహో మేరీ జాన్’ పాటని యూట్యూబ్‌లో చూడండి. సినిమా: అనుభవ్, సంగీత దర్శకత్వం: కానూ రాయ్; గాయని: గీతా దత్; సాహిత్యం: గుల్జార్.