అలనాటి అపురూపాలు-121

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

భారతీయ సినీ దిగ్గజం దేవికా రాణి:

నటి, స్టార్, నిర్మాత, స్టూడియో యజమానిగా దేవికా రాణి భారతీయ సినీరంగంలో ఏ మహిళా  అందుకోలేని ఎత్తుకి ఎదిగారు.

దేవికా రాణి లీలా దేవి చౌదరి, మన్మథనాథ్ చౌదరి దంపతులకు 30 మార్చ్ 1908న అలనాటి వాల్తేరులో (నేటి విశాఖపట్టణం) జన్మించారు. ఆమె తండ్రి మద్రాసు ప్రెసిడెన్సీలో తొలి భారతీయ సర్జన్-జనరల్. ఆమెకి రవీంద్రనాథ్ టాగోర్ దగ్గరి బంధువు. తొమ్మిదేళ్ళ వయసులో ఆమె లండన్‍లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకునేందుకు వెళ్ళారు. 16 ఏళ్ళ వయసులో ఆమె రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ వారి స్కాలర్‍షిప్ పొందారు. లండన్ మెట్రిక్ పాసయిన తరువాత, ఆమె అప్లయిడ్ ఆర్ట్స్ చదివి, టెక్స్‌టైల్ డిజైన్‍, డెకోర్, ఆర్కిటెక్చర్‌లో స్పెషలైజేషన్ చేశారు. 1928లో ఆమె నాటక రచయిత నిరంజన్ పాల్ ఇంట, హిమాంశు రాయ్‌ని కలిసారు. లండన్‍లో బారిస్టర్ చదవడానికి వచ్చిన హిమాంశు మనసు మార్చుకుని రంగస్థలం, సినిమా రంగాలలో కృషి చేశారు. అప్పట్లో ఆయన ఇండో-యూరోపియన్ ప్రొడక్షన్స్‌కి చెందిన ప్రేమ్ సన్యాస్ (1925), షిరాజ్ (1928) వంటి సినిమాలకు పనిచేస్తున్నారు. దేవిక – ప్రపంచ పాశ్ (1929) – ఇంగ్లీషులో A Throw of Dice – అని పేరున్న మూకీ సినిమాకి కాస్ట్యూమ్స్, సెట్ డిజైనింగ్ పనులు చూశారు. 1929లో దేవిక తనకన్నా 16 ఏళ్ళు పెద్దయిన, అప్పటికే మేరీ హెయిన్‌లిన్ అనే జర్మన్ నటిని పెళ్ళాడి, ఆమె ద్వారా నీలిమ అనే కూతురున్న హిమాశు రాయ్‌ని పెళ్ళి చేసుకున్నారు.

తరువాత ఈ దంపతులు బెర్లిన్ లోని యూఎఫ్ఎ స్టూడియోలో చేరారు. రాయ్ నిర్మాతగా చేరగా, దేవిక సినీ నిర్మాణంలోని పలు అంశాలలో శిక్షణ పొందారు. “ఓ స్పెషలిస్ట్ అవాలని నేనా శిక్షణ పొందలేదు, కానీ నటిగా రాణించాలంటే – సినీరంగంలోని అన్ని అంశాలలోనూ పట్టు ఉండాలని హిమాంశు కోరుకున్నారు” అని 1957లో – ఫిల్మ్‌పేర్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు దేవిక. జర్మనీలో ఆమె ఎరిక్ పోమర్ ప్రొడక్షన్ యూనిట్‍కి సహాయం చేశారు. దర్శకుడు GW Pabst  వద్ద నటన అధ్యయనం చేశారు. ‘ది బ్లూ ఏంజల్’ (1930) చిత్రానికి గాను నటుడు Marlene Dietrich కి మేకప్ అసిస్టెంటుగా పని చేశారు. “నేను తొలుత ఒక సామ్యాన కార్మికురాలిగా ప్రవేశించాను, మేకప్, కాస్ట్యూమ్, సెట్ విభాగాల్లో అప్రెంటీసుగా చేశాను. ఓ ప్రముఖ మేకప్ మ్యాన్ వద్ద పని చేశాను. అయినా రెండేళ్ళ సాధారణ శిక్షణ తర్వాత, అవన్నీ మరిచిపొమ్మని, మనల్ని మనలా ఉండమని చెబుతారు” అన్నారు దేవిక ఒక ఇంటర్వ్యూలో.

1933 నాటి ‘కర్మ’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు దేవిక. ఆ సినిమాలో ఆమె నటననీ, అందాన్ని లండన్ పత్రికలు ప్రశంసించాయి. అయితే ‘కర్మ’ సహనిర్మాత, ఆమె తోటినటుడు అయిన రాయ్ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. “మనం భారతీయులం, మనకు మన సినీ నిర్మాణ ప్రమాణాలున్నాయి. ఆ ప్రమాణాలను కాపాడడం మన బాధ్యత. అందుకని మనం మన దేశంలోనే సినిమాలు నిర్మించాలి అని ఆయన అన్నారు” ఫిల్మ్‌పేర్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు దేవిక. ‘కర్మ’ సినిమా భారతీయులని అంతగా ఆకట్టుకోలేకపోయినా, ‘అఛూత్ కన్య’ (1936) ఆమెకి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా ద్వారా బాంబే టాకీస్ సంస్థ దేశంలోని ఉత్తమ సినీ నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. బొంబాయిలో రాక్సీ థియేటర్‌లో ఈ సినిమా ప్రివ్యూ చూడడానికి జవహర్‌‌లాల్ నెహ్రూ హాజరయ్యారు. అంటరాని వనిత కస్తూరిగా ఆమె ప్రదర్శనని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో దేవికా, అశోక్ కుమార్ పాడిన యుగళగీతం ‘మై బన్ కే చిడియా’ పెద్ద హిట్ అయింది. “మేము ఆ పాటని మా స్నేహితుల ముందు పాడుతున్నట్లుగా పాడాము. మేము మాత్రమే ఆ పాటని పాడగలమని జనాలు ఆశిస్తారు. ఈరోజుల్లోలాగా నేపథ్య గానం కాకుండా, మాకు మేమే పాడుకోవడం గొప్ప సంతృప్తి నిచ్చింది” అని చెప్పారామె.

అప్పటికే, ఆ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. ‘జీవన్ నయా’ షూటింగ్ ముందు దేవికా రాణి తన సహ నటుడు నజమ్-ఉల్-హుస్సేన్‌తో కలిసి కలకత్తా వెళ్ళిపోయారు. హిమాంశు రాయ్ ఆమెని మళ్ళీ స్టూడియోకి తీసుకువచ్చినా, ఆయన హుస్సేన్‍తో పని చేయడానికి నిరాకరించారు. అప్పుడు లాబొరేటరీ అసిస్టెంట్‌గా ఉన్న కుముద్‌లాల్ కుంజిలాల్ గంగూలీకి ‘అశోక్ కుమార్’ అని పేరు పెట్టి, ఆమె సరసన నటింపజేశారు. ‘అఛూత్ కన్య’ విజయవంతం అయ్యాకా, దేవిక, అశోక్ కుమార్‌ల జంట దాదాపు 10 సినిమాలలో నటించారు. వీటిలో అధికంగా బలమైన స్త్రీ పాత్రలుండేవి, సామాజిక వాస్తవ అంశాలతో నడిచేవి. ‘జీవన్ ప్రభాత్’ (1937) సినిమాలో దేవిక దురదృష్టవంతురాలయిన బ్రాహ్మణ యువతిగా నటించారు. మాతృత్వం కోరుకునే మహిళగా ‘నిర్మల’ (1938)లోనూ; ఓ అనాథ యువతిగా ‘దుర్గ’ (1939) లోనూ నటించారు. జన్మభూమి (1936), వచన్ (1938), కంగన్ (1939), బంధన్ (1940) ఝూలా (1941) వంటివి విజయవంతమైన మరొకొన్ని చిత్రాలు.

వారి స్టూడియో ఉన్నత స్థితికి చేరడానికి కారణం దేవికా రాణి ప్రతిభే అని అంటారు. ఒక స్టూడియో యజమానిగా, తన స్టూడియోని బాంబే స్టాక్ ఎక్సేంజిలో నమోదు చేయించారు. స్రిప్టులలో, సెట్ డిజైన్‌లలో, పాత్రల రూపకల్పనలో సహాయం చేసేవారు. హిమాంశు స్టూడియో నిధుల సంగతి చూసుకుంటే, దేవిక కళాకారుల విషయాలు చూసుకునేవారు. ఆమె సలహాలను ఆయన గౌరవించేవారు. “బాంబే టాకీస్‌లో ఉన్న ఏకైక స్టార్ దేవికా రాణే” అని రచయిత, దర్శకుడు కె.ఎ. అబ్బాస్ 1939లో ఫిల్మ్ ఇండియాలో వ్రాశారు. స్టూడియోలో అతి పెద్ద స్టార్ అయిన ఆమె నిధుల సేకరణలో కూడా సహకరించారని దేశాయ్ తెలిపారు. “ఆమె ఓ మామూలు విషయంలా ఇన్వెస్టర్లతో మాట్లాడేవారు. చాలామంది ఫైనాన్సియర్లకు ఆమె అంటే మంచి అభిప్రాయం ఉన్నట్టు నేను భావిస్తాను” అన్నారాయన.

ప్రశంసలే కాదు ఆమెపై పుకార్లు కూడా ఉండేవి.

1959లో చనిపోవడానికి ముందు రచించిన తన అత్మకథ ‘Such is Life’లో బాంబే స్టూడియోకి చెందిన స్క్రీన్ రైటర్ నిరంజన్ పాల్ దేవికా రాణికి ఇతర సంబంధాలు ఉండేవని రాశారు. “లార్డ్ బ్రబౌర్న్ మారు వేషంలో – గుర్తింపు లేని మోటారు కారులో వాకేశ్వర్ లోని తమ ప్రభుత్వ నివాసం నుంచి మలాద్ (దేవికని కలిసేందుకు) వచ్చేవారు” అని రాశారు.

జర్మన్ సినిమాటొగ్రఫర్ Josef Wirsching మనుమడు, నటుడు అయిన Georg Wirsching “దేవికా రాణి ఒక చక్కని ప్రొఫెషనల్. స్టూడియోని శ్రద్ధగా నిర్వహించి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారిని బాగా చూసుకునేవారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా మా నానమ్మని నాన్నని (అప్పుడు నాన్న చిన్నపిల్లాడు) మహారాష్ట్రలోని సతారాలో ఉన్న క్యాంపుకి పంపించారు. దేవికా రాణి ప్రతి క్రిస్‌మస్‌కీ నానమ్మకి శుభాకాంక్షలు పంపేవారు. నాన్నకి కానుకలు దుస్తులు పంపించేవారు. పెంపుడు జంతువులకు అనుమతి లేని ఆ క్యాంపులో దేవికా రాణి జోక్యం వల్ల నానమ్మ పెంపుడు కుక్కని అనుమతించారు” అని చెప్పారు.

తన మీద విపరీతమైన విమర్శలున్నాయని ఆమెకు తెలుసు, అయినా వాటిని లెక్కజేయలేదు. 2009లో వచ్చిన నీపా మజుందార్ పుస్తకం ‘Wanted Cultured Ladies Only!: Female Stardom and Cinema in India, 1930s-1950s’ లో “దేవికా రాణి ఎగువ మధ్య తరగతి, పాశ్చత్య పెంపకం – ఒక పేద, అంటరాని గ్రామీణ బాలికకు ఆమెను దూరం చేస్తాయి” అని రాసారు. “ఆమె ఓ స్టూడియోని నిర్వహిస్తున్నా – అక్కడ స్క్రీన్ రైటర్‌గా పని చేసిన సాదత్ హసన్ మంటోతో సహా కొందరు, పనిలో ఆమె నిబద్ధతని శంకించేవారు. ధూమపానం, మద్యపానం, కోపం వంటి లక్షణాల వల్ల ఆమెను ‘డ్రాగన్ లేడీ’ అని వ్యవహరించేవారు” అని చెప్పారు దేశాయ్.

అయితే అవన్నీ కాలక్రమంలో కొట్టుకుపోయాయి. ఆమె ప్రతిభే నిలిచింది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా (NFAI), పూణె, వ్యవస్థాపక డైరక్టర్, స్వర్గీయ పి.కె. నాయర్ “భారతీయ సినీ రంగాన్ని ప్రకాశవంతం చేసిన దేవికా రాణికి ‘ది ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ స్క్రీన్’ అనే బిరుదు సరిగ్గా నప్పుతుంది. ఆమె నటికన్నా ఎక్కువ. నిర్మాత అయిన తన భర్తతో కలిసి బాంబే టాకీస్ స్థాపనలో, నిర్వహణలో పాలుపంచుకున్నారు” అని చెప్పారు.

“ఈ సంస్థకి బలం దేవికా రాణి. ఈ సంస్థ నిర్మించిన 15 సినిమాలలో భాగం పంచుకున్నారామె.  ఆమె ఉన్నత విద్యావంతురాలు, మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఈ నేపథ్యం నుంచి వచ్చినవారు సినిమా రంగాన్ని ఎంచుకుంటే, అది మరి ఎందరికో ప్రోత్సాహం ఇస్తుంది. అప్పట్లో నటన అంటే అంతా విముఖత చూపేవారు. గాయని, నర్తకి నేపథ్యం ఉన్నవారే ఎక్కువగా వచ్చేవారు. ఆ కాలం నాటి తవాయఫ్‌లకు శాస్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉండేది, వారు గొప్ప వ్యాపారవేత్తలుగా రాణించారు. కానీ వారికి గౌరవం దక్కేది కాదు”.

1940లో బాంబే టాకీస్ వ్యవస్థాపకులు హిమాంశు రాయ్ మరణించారు. ఆయన స్థానానికి ఎందరో పోటీపడ్దారు. కానీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ – దేవికా రాణిని ఎంపిక చేశారు. మలాద్ లోని స్టూడియో నిర్వహణ బాధ్యతని అప్పగించారు. తాను స్టూడియోని నిర్వహించిన ఐదేళ్ళ కాలంలో నయా సంసార్ (1941), కిస్మత్ (1943) వంటి గొప్ప హిట్ చిత్రాలను అందించారు. అంతే కాదు. సిగ్గరిగా ఉన్న ఓ కుర్రాడిలోని ప్రతిభని గమనించి, దర్శకుడు అమియా చక్రవర్తికి చెప్పి ఆ కుర్రాడికి ‘జ్వార్ భాటా’ (1944)లో నాయకుడిగా అవకాశం కల్పించారు. ఆ కుర్రాడే దిలీప్ కుమార్.

అప్పటికీ, ఇప్పటికీ సినీ పరిశ్రమలో మగవారిదే ఆధిపత్యం. స్టూడియోని నడిపించడం అనే బాధ్యత అనేక సవాళ్ళతో కూడుకొన్నది. బాంబే టాకీసులో కీలకమైన ఇద్దరు సబ్యులు శశధర్ ముఖర్జీ, అమియ చక్రవర్తికి ఒకరంటే ఒకరికి పడడం లేదు. 1943 ముఖర్జీ బయటకు వెళ్ళిపోయారు. తనతో పాటు తన బావ అశోక్ కుమార్‌ని, మరికొందరిని తీసుకువెళ్ళిపోయి ‘ఫిల్మిస్థాన్’ అనే సంస్థను నెలకొల్పారు. బాంబే టాకీస్ నిర్మించిన పలు చిత్రాలలో నటించిన లీలా చిట్నిస్ ‘స్క్రీన్’ (5 అక్టోబరు 1984) పత్రికలో “మగవారి ఆధిపత్యం నిండిన ఈ ప్రపంచంలో – ఎంతటి ప్రతిభావంతురాలయినా, అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమని ఎవరైనా ఊహించవచ్చు. ముఖర్జీకి తన సామర్థ్యం తెలుసు, దేవికా రాణితో ఉన్న స్నేహాన్ని కూడా లెక్క చేయలేదు, సత్సంబంధాలు అవసరమని అనుకోలేదు” అని రాశారు.

దేవికా రాణి స్టూడియోని వదిలేసాకా, బాంబే టాకీస్ ఇంక కోలుకోలేదు. బకాయిలు, నష్టాలు, అప్పులు, పన్నులు – వీటిన్నటి వల్ల కొన్నేళ్ళ తరువాత స్టూడియో బహిరంగ వేలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. “కంపెనీలోని ప్రతీ అంగుళం అమ్ముడయింది. ఫిల్మిస్థాన్ యజమాని, ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఆ ఖాళీ స్టూడియోని కొనుగోలు చేశారు” అని రాశారు లీలా చిట్నిస్. 2014లో ఒకసారి, మళ్ళీ 2018లో ఒకసారి భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి, స్టూడియో శిథిలాలను దగ్ధం చేశాయి. ఇప్పుడంతా చెల్లాచెదురైన శిథిలాలతో ఉన్న ఆ స్థలంలో వస్తు తయారీ యూనిట్లు, ఓ డంప్ యార్డ్ వచ్చాయి. ఏప్రిల్ 1934లో మలాద్ లోని 18 ఎకరాల స్థలంలో హిమాంశు రాయ్, దేవికా రాణిలు – అన్ని విభాగాలు ఒకే చోట ఉన్న దేశంలోనే మొదటి స్టూడియోని స్థాపించారు. భారతీయ సినీ నిర్మాణాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలని ఆ ఇద్దరూ కలలు కన్నారు. జర్మనీకి చెందిన సాంకేతిక నిపుణలను నియమించుకున్నారు, యువ ప్రతిభని ప్రోత్సహించారు, సినీ నిర్మాణానికి గౌరవాన్ని, ప్రొఫెషలిజమ్‌ని అందించారు.

జ్వార్ భాటా, హమారీ బాత్ (1943), ప్రతిమ (1945) వంటి సినిమాలు పరాజయం పాలవడంతో కత్తులు బయటకు వచ్చాయి. అప్పటిదాకా దేవికకు మద్దతుగా ఉన్న అమియ చక్రవర్తి – సినిమాల నిర్మాణానికి తనకొక్కడికే బాధ్యత ఉండాలి – అని అన్నారు. “దేవికా రాణి అవసరం లేదు. ఆమెను వదులుకుంటే మంచిది అని అమియ చక్రవర్తి అంటే, దేవిక కోపం పట్టలేకపోయారు, కానీ మౌనంగా ఉండిపోయారు.” అని చెప్పారు లీలా చిట్నిస్. అప్పుడే స్టూడియోలో తన బాధ్యతలు వదులుకోవాలనుకున్నారు దేవిక.

బాంబే టాకీస్ లో సెట్‌లో సిబ్బంది, తమ గొప్ప స్టార్, యజమాని కోసం వేచి చూస్తున్నారు. ఆమె రాలేదు కానీ, ఓ కాగితం వచ్చింది. “ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ నిర్ణయాలు మీరు తీసుకోండి… ఇది కంపెనీకి నా రాజీనామా” అని ఉంది దానిలో. అది 1945 సంవత్సరం. 10 సంవత్సరాల కాలంలో 15 సినిమాలు నిర్మించి, ఐదేళ్ళ పాటు స్టూడియో అధినేతగా ఉన్న దేవిక రాణి ఇక చాలనుకున్నారు. తన వాటాలు అమ్మేసారు. ప్రముఖ రష్యన్ చిత్రాకారుడు నికోలస్ రోరిక్ కుమారుడు అయిన చిత్రకారుడు స్వెతస్లోవ్ రోరిక్‌ని వివాహం చేసుకుని కులూ లోయకి వెళ్ళిపోయారు.

దీంతో ఓ నటి-నిర్మాత ఘన వైభవం క్షీణించింది. అయితే భారతీయ సినీరంగంలో స్టూడియోని నడిపిన తొలి మహిళగా తన ముద్ర వదిలే వెళ్ళారామె.

స్వెతస్లోవ్ రోరిక్‌తో వివాహం అనంతరం ఆమె, ఆయనతో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని కులూ లోయలోని నగ్గర్ ఎస్టేట్‌లో నివసించారు. తర్వాతి కాలంలో వారు బెంగుళూరు శివార్లలోని 468 ఎకరాల Tataguni ఎస్టేట్‍లో, కొలను సమీపంలో ఏకాంతంగా నివసించారు. వారింటి నిండా చిత్రపటాలు, విలువైన కళాఖండాలు, అపురూప వస్తువులు ఉండేవి. ప్రచారానికి దూరంగా ఉన్నా కూడా వారు సంతోషంగా ఉండలేకపోయారు. వ్యక్తిగత సహాయకురాలు మోసం చేయడంతో, వారి మలిదశలో అభద్రత తోనూ, బెంగలతోనూ గడిపారు.

1989లో వారు బెంగుళూరులోని హోటల్ అశోకాలో ఒక స్యూట్ కి మారారు. మిగతా కాలం అక్కడే గడిపారు. 30 జనవరి 1993న రోరిక్ మరణించారు. ఆయన మరణించిన 14 నెలలకు 9 మార్చ్ 1994న దేవికా రాణి మృతి చెందారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ప్రభుత్వం ఆ ఎస్టేట్‌ని దక్కించుకుంది. ఒక మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలా ఆ ఎస్టేట్‌ని మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికి అమలు కాలేదు.

1992 సెప్టెంబరులో (అప్పుడు ఆమెకి 83, ఆయనకి 89 ఏళ్ళ వయసు) న్యూస్‌ట్రాక్‌కి తమ హోటల్ గదిలో దేవికా రాణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ గది అంతా ఔషధాల సీసాలతో నిండి ఉంది. బలహీనంగా ఉన్న దేవికా రాణికి సహాయంగా ఒక నర్స్ ఉన్నారు. దేవిక ఆ రోజు గులాబీ రంగు సిల్క్ చీర ధరించారు. కొంగు అంచును స్థిరంగా ఉంది. జుట్టు ముడివేసి బన్ పెట్టి గజ్రా ధరించారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు ఆమె రోరిక్ చెయ్యి పట్టుకునే ఉన్నారు. ఆయన దాదాపుగా మౌనంగానే ఉన్నారు. ఒక్కోసారి ఆమె మనసు చలించేది.

అయితే పోరాడకుండా తన ఓటమిని అంగీకరించేందుకు ఆమె సిద్ధంగా లేరు. “నా ఇల్లు నేనెందుకు వదులుకోవాలి? నా డబ్బు, నా స్థలం, నా ఇల్లు.. ఇదంతా హాస్యాస్పదం కదా. నా జీవితంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వారికి కష్టాలు తప్పవు” అన్నారు. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వం వారి ఎస్టేట్‍ని స్వాధీనం చేసుకొనే యోచనలో ఉంది. ‘ప్రభుత్వం ఆర్డినెన్స్ పాస్ చేసి, మీ ఎస్టేట్‌ని స్వాధీనం చేసుకుంటే ఏం చేస్తారు?’ అన్న ప్రశ్నకి “నేనేం చేస్తాను? వాళ్లను బయటకు వెళ్ళగొడతాను” అన్నారు. ప్రధానమంత్రి నుంచి సహాయం అందుతుందని ఆమె భావించారు. ఒకప్పడు దేవికకి నెహ్రూ తోను, ఇందిరా గాంధీ తోను సత్సంబంధాలు ఉండేవి. ఆమె భర్త కూడా – భూ కబ్జాదారుల నుంచి – తాము గుడ్డిగా నమ్మిన వ్యక్తిగత సహాయకురాలి నుంచి – ప్రభుత్వం తమ ఆస్తులని కాపాడుతుందని విశ్వసించారు.

“జీవితం చాలా సంక్లిష్టమైనది. వివరించడం చాలా కష్టం. సుదీర్ఘ జీవితం… చాలా ఎక్కువ కాలం… ఎవరూ ఇంత కాలం బ్రతకకూడదు. వాళ్ళు (న్యాయవాదులు, అధికారులు) మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాగితం మీద ఒక రోజు ఒకలా, మరో రోజు ఒకలా రాస్తున్నారు. ప్రయోజనం ఏమిటి? దీనివల్ల ఎవరు లాభపడతారు?” అని ప్రశ్నించారు దేవిక ఆ ఇంటర్వ్యూలో. ఆ తరువాత – “ఏదో ఒక రోజు నేనూ వెళ్లిపోతాను. నేనెవరో కూడా జనాలకి తెలియదు” అని అన్నారు. (అయితే మనం సంచికలో ఆమెను స్మరిస్తున్నాం!)


విభిన్న చిత్రాల దర్శకనిర్మాత చందూలాల్ షా:

రంజిత్ స్టూడియో వ్యవస్థాపకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా విశిష్ట కీర్తి, గుర్తింపు పొందినవారు చందూలాల్ షా. 1898లో గుజారాత్‍లోని జామ్‌నగర్‌లో జన్మించిన ఆయన, యాదృచ్ఛికంగా సినీరంగంలోకి ప్రవేశించారు.

లక్ష్మి ఫిలిం కంపెనీ వారు తీస్తున్న ‘విమల’ (1925) సినిమా దర్శకుడు మణిలాల్ జోషి తీవ్ర అనారోగ్యానికి గురైతే, ఆ సంస్థ వారు చందులాల్ షాని ఆ సినిమాకి దర్శకత్వం వహించమని కోరారు. అప్పటికి ఆయన ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, పౌరాణిక చిత్రాల రచయిత అయిన తన సోదరుడు జె.డి.షాకి సహాయం చేస్తూ ఉన్నారు. చందూలాల్ ఈ సినిమాకి మాత్రమే కాకుండా ఆ సంస్థ నిర్మించిన ‘పాంచ్ దండ’ (1925), ‘మాధవ్ కామ్ కుండల’ (1926) అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వతంత్ర్యంగా దర్శకత్వం వహించిన తొలి సినిమా కోహినూరు సంస్థ నిర్మించిన ‘టైపిస్ట్ గర్ల్’ (1926). సులోచన, గోహర్ నటించిన ఈ సినిమాను 17 రోజులలో పూర్తి చేశారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో, ఈ స్టూడియోకే, గోహర్ నటించే మరో ఐదు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం చందూలాల్‍కి దొరికింది. ఇందులో ‘గుణసుందరి’ (1927) ముఖ్యమైనది.

1929లో చందూలాల్ షా బొంబాయిలో రంజిత్ స్టూడియో స్థాపించారు. ఈ సంస్థ 1929 నుంచి 1970వ దశకం మధ్య వరకు సినిమాలు నిర్మించింది. 1929లో ఈ సంస్థ రంజిత్ ఫిల్మ్ కంపెనీ పేరిట మూకీ సినిమాల నిర్మాణం ప్రారంభించింది. 1932 నాటికి 39 సినిమాలు నిర్మించింది, వీటిలో అధిక శాతం సాంఘిక చిత్రాలు. 1932లో ఈ సంస్థ తన పేరును రంజిత్ మూవీటోన్‌గా మార్చుకుంది. 1930 దశకంలో ఈ సంస్థ పలు విజయవంతమైన చిత్రాలను సంవత్సరానికి ఆరు చొప్పున నిర్మించింది. ఈ సమయంలో స్టూడియో దాదాపు 300 మంది నటులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి ఉద్యోగాలిచ్చింది. స్టూడియోల శకంలో – బాంబే టాకీస్, న్యూ థియేటర్స్ ఇంకా ప్రభత్ ఫిల్మ్ కంపెనీలతో బాటు చందూలాల్ గారి శ్రీ రంజిత్ మూవీటోన్ కంపెనీ కూడా ఒక గొప్ప సంస్థ. గోహర్, ఇ. బిల్లిమోరియా, మాధురి, మోతీలాల్, ఖుర్షీద్, కె.ఎల్. సైగల్ వంటి స్టార్స్ ఆ సంస్థ సిబ్బందిలో ఉండేవారు. ఈ సంస్థ కూడా హాలీవుడ్ లోని ఎంజిఎం సంస్థ లాగా “ఆకాశంలోని తారల కంటే రంజిత్‍లో ఉండే తారల సంఖ్య ఎక్కువ” అని ప్రకటించుకునేది.

సినిమాలని నిర్మించడమే కాకుండా, చందూలాల్ చిత్ర పరిశ్రమలోని సంస్థాగత బాధ్యతలు కూడా నిర్వహించేవారు. భారతీయ సినీ పరిశ్రమ రజతోత్సవం (1939), స్వర్ణోత్సవం (1963) ఆయన మార్గదర్శకత్వంలోనే జరిగాయి. 1951లో స్థాపితమైన ‘ది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’కు ఆయన తొలి అధ్యక్షులు. అదే ఏడాది హాలీవుడ్‌ని సందర్శించిన భారతీయ సినీ బృందానికి నేతృత్వం వహించారు. ఆయన సినిమాలు నిర్మించే పద్ధతి – ఫ్యాక్టరీ పద్ధతి. దీని వల్ల ఆ రోజుల్లో ఆయన పెద్ద నిర్మాత కాగలిగారు. 1930 దశకంలో ఆయన ఏడాదికి ఆరు చొప్పున పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు. తన సినీ నిర్మాణానికి – అసెంబ్లీ లైన్- పద్ధతి అవలంబించింది ఈ సంస్థ. మధ్య స్థాయి బడ్జెట్‌తో సాంఘిక చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు, పోరాట చిత్రాలు తీసేది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో భాగమైన – తల్లి పాత్రలలో నిరుపా రాయ్‌తో పౌరాణిక చిత్రాలు, మోతీలాల్, సైగల్ వంటి వారితో సాంఘిక చిత్రాలు తీస్తూ – అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సతీ సావిత్రి (1932), బారిస్టర్స్ వైఫ్ (1935), అఛూత్ (1940), తాన్‍సేన్ (1943), మూర్తి (1943) జోగన్ (1950) ఈ సంస్థ నిర్మించిన ముఖ్యమైన సినిమాలు. రంజిత్ మూవీటోన్ నిర్మించిన చివరి చిత్రం – మీనా కుమారి రాజేంద్రకుమార్ నటించిన – అకేలే మత్ జాయో (1963), ఈ చివరి సినిమాకి నందలాల్ జస్వంత్‌లాల్ సహదర్శకత్వం వహించారు.

దురదృష్టవశాత్తు, 1950వ దశకం చివరికొచ్చేసరికి సంస్థ ఆర్థిక సమస్యలలో కూరుకుపోయింది. తీసిని సినిమాలు ఆడలేదు. 13 ఏళ్ళ తరువాత రాజ్ కపూర్ – నర్గీస్‍ నటించిన ‘పాపి’ (1953) చిత్రంతో దర్శకుడిగా మళ్ళీ ప్రయత్నించినా, ఆ ప్రయత్నం విఫలం అయింది.

చందూలాల్‌కి షేర్ మార్కెట్ లోనూ, గుర్రపు పందేలలోను విపరీతమైన ఆసక్తి ఉండేది. వీటిల్లో విపరీతంగా నష్టపోయారు. ఫలితంగా వారి సొంత స్టూడియో చేజారిపోయింది. చివరిదశలో బొంబాయి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తూ కనిపించారు. బొంబాయిలో 25 నవంబర్ 1975 నాడు పేదరికంలో మృతి చెందారు. గత కాలపు సినీ పథనిర్ణేత జీవితానికి విచాకరమైన ముగింపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here