Site icon Sanchika

అలనాటి అపురూపాలు-123

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తమిళ హాస్యనటులలో మోనార్క్ – ఎన్.ఎస్. కృష్ణన్:

తమిళ హాస్యనటులు ఎన్.ఎస్. కృష్ణన్ – ఎన్.ఎస్.కె.గా సుప్రద్ధులు. ‘కళైవనార్’ అనే బిరుదున్న కృష్ణన్ గారి జోకులకి తమిళ ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వేవారు. చాలామంది ఎన్.ఎస్.కె. గారిని చార్లీ చాప్లిన్‍తో పోలుస్తారు. అయితే చాప్లిన్ తన హావభావాలతో నవ్వించగా, ఎన్.ఎస్.కె. తనదైన మాటల చెణుకులతో జనాలని నవ్వించారు. హాస్యంతోనే ప్రేక్షకులకి చక్కని సందేశం ఇచ్చేవారు. ఆయనది సున్నితమైన హాస్యం, ద్వంద్వార్థాలు, అశ్లీలతకు తావుండేది కాదు.

ఎన్.ఎస్.కె. 1908లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు నాగర్‌కోవిల్ సుదలముత్తు కృష్ణన్‌. బాల్యంలో సొంతూరులో ఒక సినిమా థియేటర్‍లో తినుబండారాలు అమ్ముకుంటూ, ఓ టెన్నిస్ క్లబ్‌లో బాల్ బాయ్‌గా పని చేస్తూ జీవనం గడిపారు. పెద్దగా చదువు లేకపోయినా, చక్కని తెలివితేటలు కనబరిచేవారు. కాస్త ఎదిగాకా, టి.కె. షణ్ముగం సోదరులు నడిపే నాటకాల కంపెనీలో చేరారు.

చిత్రం ఏంటంటే, తొలినాళ్ళలో ఎన్.ఎస్.కె. ధరించిన పాత్రలన్నీ హాస్యానికి చెందనివే. ‘సావిత్రి’ నాటకంలో సత్యవంతుడి తండ్రిగా, ‘మనోహర’ నాటకంలో రాజగురువుగా నటించారు. ఏ పాత్ర పోషించినా గొప్ప నిబద్ధతతో నటించేవారు. ఆయన ప్రతిభను గుర్తించిన నాగర్‌కోయిల్ లోని మిత్రులు స్వర్ణపతకం అందజేశారు. ‘విల్లు పాట్టు’ అనే గ్రామీణ కళలోనూ ఆయన నిపుణులు. ఈ నాటక కంపెనీ బృందంతో మద్రాసు ప్రెసిడెన్సీ అంతా తిరిగి ఎన్నో నాటకాలు వేశారు.

నాగర్‌కోయిల్‌కి చెందిన సుప్రసిద్ధ కవి శతావధానం షేక్ తంబి పవలార్ – ఎన్.ఎస్.కె గొప్పవారవుతారని, తమ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకువస్తారని ఆశీర్వదించారు.

తన యువ మిత్రునిలో అపార ప్రతిభ ఉందని గుర్తించిన టి.కె. షణ్ముగం – ఎన్.ఎస్.కె.ని నాటకాలపై మరింత దృష్టి పెట్టమని, వీలైనన్ని వేషాలు వేయమని ప్రోత్సహించారు. సాధన ద్వారానే నటులు విశేషంగా రాణిస్తారని చెప్పారు. ఒకవేళ వేరే పాత్ర పోషించే నటుడు ఎవరైనా రాలేకపోతే, ఆ పాత్ర పోషించడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

టి.కె. షణ్ముగం సోదరుల కంపెనీలో ఎమ్.ఆర్. స్వామినాథన్ హాస్యపాత్రలు పోషిస్తారు. అందరినీ సులువుగా రంజింపజేస్తారని ఆయనకు పేరు. ఆయన నటులే కాదు, నాటక రచయిత కూడా. కాని స్థిరత్వం లేక, నాటక కంపెనీలను తరచూ మారుస్తుండేవారు.

ఒకనాడు కారైకూడిలో ఈ బృందం ‘మనోహర’ నాటకం వేయాల్సి ఉండగా, అందులో ఎమ్.ఆర్. స్వామినాథన్ – వసంతసేన కొడుకుగా వసంతన్ పాత్ర వేయాల్సి ఉంది. నాటకంలో అది గొప్ప పాత్ర. అంతకుముందు వరకు ఎమ్.ఆర్.ఎస్. దాన్ని జనరంజకంగా పోషించి పేరు తెచ్చుకొన్నారు. దురదృష్టవశాత్తు, ఒకనాడు ఆయన ఎవరికీ చెప్పకుండా బృందాన్ని వదిలి వెళ్ళిపోయారు. షణ్ముగం సోదరులు కంగారు పడ్డారు. అప్పుడు షణ్ముగం గారికో ఆలోచన వచ్చింది. ఆ పాత్రని ఎన్.ఎస్.కె. చేత ఎందుకు చేయించకూడదు అని.

మర్నాడు ఎన్.ఎస్.కె. నిద్ర లేవగానే తన ఆలోచనని ఆయనకి చెప్పారు. ఎన్.ఎస్.కె. అంగీకరించడం, ఆ పాత్రలో సమర్థంగా రాణించడం, హాస్య రారాజుగా పేరు తెచ్చుకోడం జరిగిపోయాయి. అక్కడ్నించి ఆయన హాస్య పాత్రలు ప్రత్యేకంగా పోషించడం మొదలుపెట్టారు. ఎమ్.ఆర్. స్వామినాథన్ గారు తిరిగి వచ్చినా, ఆయనకి చిన్న చిన్న పాత్రలే దొరికాయి. ఎన్.ఎస్.కె. తనకి కీర్తి ప్రతిష్ఠలు లభించినా, ఎమ్.ఆర్. స్వామినాథన్ గారిని తన గురువుగానే భావించేవారు. తాను సొంతంగా ఫిల్మ్ యూనిట్ స్థాపించి కామెడీ షార్ట్స్ చేస్తున్నప్పుడు వాటికి ఎమ్.ఆర్. స్వామినాథన్ గారినే స్క్రిప్ట్ రైటర్‌గా పెట్టుకున్నారు.

షణ్ముగం సోదరులు ప్రదర్శించే విశిష్ట నాటకం ‘మేనక’. దీనికి వడువూరు దురైస్వామి అయ్యంగార్ గారి రచన మూలం. ఈ రచనని తమిళ రంగస్థల గురువుగా పరిగణించే ఎం. కందస్వామి ముదలియార్ నాటకీకరణ చేశారు.

‘మేనక’ నాటకం – కోయంబత్తూరు సమీపంలోని గోబిశెట్టిపాల్యం అనే ఊరిలో విజయవంతంగా  ప్రదర్శితమవుతున్న రోజులు. ఒక రాత్రి ఎం. సోమసుందరం, ఎస్.కె. మొహిద్దిన్ అనే ఇద్దరు తిరుప్పురుకి చెందిన వ్యాపారవేత్తలు, స్నేహితులు ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. వారికి ఈ నాటకం నచ్చి, సినిమాగా తీయాలన్న ఆలోచన కలిగింది. ఈ మిత్రులిద్దరూ కలిసి ‘జుపిటర్ పిక్చర్స్’  అనే సంస్థని స్థాపించి ఈ సినిమా తీశారు. సోమసుందరం గారికి ‘జుపిటర్ సోము’ అనే పేరు వచ్చింది. దక్షిణ భారత సినీ పరిశ్రమలో వీరు అగ్రశ్రేణి నిర్మాతలయ్యారు. అప్పట్లో 14,000/- రూపాయలకి మొత్తం టి.కె. షణ్ముగం గారి యూనిట్‌ని అంతా సినిమాలోకి తీసుకున్నారు. ఎన్.ఎస్.కె. ఒక మంచి పాత్ర ఇచ్చి, ఆరు వందల రూపాయల పారితోషికం ఇచ్చారు. ఈ విధంగా 1935 సెప్టెంబరులో ఆయన సినీ ప్రస్థానం మొదలయింది.

అప్పుడే మూకీ సినిమాలు మొదలై మద్రాసు చుట్టుపక్కల టెంట్ సినిమా హాళ్ళలో ఆడుతుండేవి. వాటిలో ఎక్కువగా అమెరికా నుంచి వచ్చే సీరియల్స్ ప్రదర్శిస్తుండేవారు. వాటన్నింటిని ఎన్.ఎస్.కె. తప్పనిసరిగా చూసేవారు. తన ఆరాధ్య నటుడు చాప్లిన్ ప్రదర్శనలకు అబ్బురపడేవారు. అలాగే హారోల్డ్ లాయిడ్‌ని కూడా అభిమానించేవారు. ప్రతీ సినిమాని అధ్యయనం చేసి, దాని గురించి పుస్తకంలో రాసుకునేవారు.

‘మేనక’ సినిమాని రాజా శాండో గారి దర్శకత్వంలో బొంబాయిలోని రంజిత్ స్టూడియోలో చిత్రీకరించారు. ఒక సన్నివేశంలో ఒక యువతికి కౌగిలించుకోవాల్సి వచ్చినప్పుడు, ఎన్.ఎస్.కె. – తాను పతివ్రతుడనిని, ఊర్లో తనకి భార్య ఉందని, అందుకని అలా చేయలేనని తిరస్కరించారట (పతివ్రతన్ అనే మాట తమిళంలో లేదు, ఆయన హాస్యం కోసం ఆ పదాన్ని సృష్టించారు). దర్శకుడికి కోపం వచ్చినా, నవ్వేశారట. తమిళ సినీరంగానికి గొప్ప హాస్యనటుడు లభించినట్టు ఆయన ఆ రోజే గుర్తించారు. 1936లో విడుదలయిన ‘మేనక’ గొప్ప హిట్ అయింది.

ఎన్.ఎస్.కె. నటించిన ‘భక్త ధ్రువ’ అనే పౌరాణిక నాటకంలో రచయిత చిదంబర భాగవతార్ రాసిన ఓ పాటని పాడారాయన. టీ, టిఫిన్, కాపీ టెన్నిస్… లాంటి పదాలతో కూడిన పాట విష్ణుమూర్తికి చెందిన నాటకంలోనా అని కొందరు అనుకున్నా, ప్రేక్షకులు అవేం పట్టించుకోకుండా నాటకాన్ని ఆదరించారు. వన్స్ మోర్ అనేవారు.

ఇదే సమయంలో ఆయనకు టి.ఎ. మధురం గారు పరిచయమయ్యారు. తర్వాతి కాలంలో ఆయన ఆవిడను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఎన్.ఎస్.కె. సరసన కొత్త నటి కోసం అన్వేషిస్తున్న రోజులవి. ప్రొడక్షన్ మేనేజరుతో కలిసి ఎన్.ఎస్.కె. తిరుచ్చి వెళ్ళి మధురం గారిని కలిసారు.

మధురం శ్రీరంగనికి చెందినవారు. వారిది వినోదరంగంలోని కుటుంబం. ఆవిడ చాలా అందంగా ఉండేవారు. తొలి చూపులోనే ఆమె ఆయనకి నచ్చేశారు. అప్పుడు వారి  యూనిట్ ‘వసంతసేన’ సినిమా తీయడానికి పూనా వెళ్తోంది. మధురం వారితో చేరాలని ఉత్సాహపడ్డారు. ఆమె తల్లీ, అమ్మమ్మ భయపడినా, మధురం మాత్రం పూనా వెళ్లడానికి సిద్ధపడ్డారు. రైలెక్కే హడావిడిలో యూనిట్ సభ్యులు తమ డబ్బు సంచీని స్టేషన్‌లోనే మరిచిపోయారు. అప్పుడు ఎన్.ఎస్.కె. చొరవ తీసుకుని మధురం దగ్గర నుంచి డబ్బు ఇప్పించారు. ఆమె చాల ఎక్కువ నగలు ధరించి ఉండడం గమనించిన ఎన్.ఎస్.కె. ఆమెని సాయం అడిగారు. మొదట సంకోచించినా, నగలిచ్చి సాయం చేశారామె. పూనా వెళ్లాకా, ఆమె డబ్బు ఆమెకి ఇచ్చేశారు.

ఈ సినిమా రాజా శాండో దర్శకులు. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా, ఎన్.ఎస్.కె. మధురం పెళ్ళి చేసుకున్నారు. అయితే తనకి అప్పటికే వివాహం అయిందని, మొదటి భార్య నాగమ్మాళ్ నాగర్‌కోయిల్‌లో ఉంటారని ఎన్.ఎస్.కె. మధురంకి చెప్పలేదు.

ఎన్.ఎస్.కె., మధురంల జంట సినిమాల్లో విశేషంగా రాణించారు. క్లాసు, మాసు అనే తేడా లేకుండా దక్షిణాది సినీ ప్రేక్షకులందరినీ అలరించారు. హాస్యానికి ఉన్న విశ్వవ్యాప్త గుణం కారణంగా భాషా సమస్యలు ఎదురుకాలేదు. వీరిద్దరూ ఎంతగా ఆదరణ పొందారంటే – నిర్మాతలు పోస్టర్లలో – ‘ఎన్.ఎస్.కె. టి.ఎ.ఎమ్.ల హాస్యం – మిస్ కావద్దు’ అని వేసేవారు. సినిమా పోస్టర్ల మీద, పాటల పుస్తకాలలోను హీరోలతో సమానంగా ఈ ఇద్దరి ఫోటోలుండేవి.

తమకి ఆదరణ పెరిగే కొద్దీ – నిర్మాతలతో కూర్చుని పారితోషికం గురించి, సినిమా రషెస్ గురించి మాట్లాడేవారు ఎన్.ఎస్.కె. రషెస్ చూసి కామెడీ ట్రాక్ బాగా వచ్చిందో లేదో నిర్ధారించుకునేవారు. తన బృందంతో కూర్చిని హాస్య సన్నివేశాలను కూర్చి, సంభాషణలు రాసేవారాయన. ఒక్కోసారి పాటలు కూడా రాసేవారు. కొన్నాళ్ళకి ముందుగా ఆయన ఎడిట్ చేసిన తర్వాతే దర్శక నిర్మాతలు చూసేవారు. ఏం చేస్తే సినిమా బాగా వస్తుందోనని ఆయన తగిన సూచనలిచ్చేవారు. ఎన్.ఎస్.కె. ఒక మంచి టెక్నీషియన్. టెంట్ సినిమాలు, మూకీ సినిమాలలో పనిచేసిన కారణంగా ఆయనకు కెమెరాలు, లెన్సులు, లైటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, దర్శకత్వ విభాగాలపై మంచి పట్టు ఉండేది.

ఎన్నో సినిమాలు చేతిలో ఉండడంతో ఎన్.ఎస్.కె మద్రాసు, సేలం, కోయంబత్తూరుల మధ్య తిరుగుతూ ఉండేవారు. సమయాన్ని ఆదా చేసుకోడం కోసం తన బృందంతో – ప్రయాణాల్లో కూడా తమ సీన్‌ల గురించి చర్చించేవారు. అయన బృందంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, రచయితలు ఉండేవారు. ఆయనకి సొంతంగా కోయంబత్తూరులో ‘అశోక ఫిల్మ్స్’ అనే కంపెనీ ఉండేది. ఆయన ఈ టైక్స్‌టైల్ టౌన్‌లోనే ఉంటూ కామెడీ షార్ట్స్ తీయడానికే ఇష్టపడేవారు.

బొమ్మి కళ్యాణం, ఎలండ కాదల్, చంద్రహారి వంటి షార్ట్స్ తీసి వాటిలో కొన్నింటిని సినిమా హాళ్ళలో ప్రదర్శించారు. ‘సిరిక్కతే’ అనేది ఘన విజయం సాధించింది.

ఈ షార్ట్స్‌ కోసం ఆయన ఎన్నో కామెడీ, పారడీ పాత్రలు పోషించారు. నవీన విక్రమాదిత్య అనే షార్ట్ లో విభిన్నమైన కాస్ట్యూమ్‌లో అలరించారు.

కొన్నాళ్ళకి ఎం.ఎస్. శ్రీరాములు నాయుడు వంటి స్టూడియో అధినేతలు పూర్తి స్థాయి సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కోసం ఎన్.ఎస్.కె – ఆలీబాబు నలభై దొంగలు – అనే సినిమా తీసారు. మధురంతో కలిసి నటించారు. కానీ సినిమా పరాజయం పాలయ్యింది.

సి. అన్నాదురై దర్శకత్వంలో ఆయన ‘నల్లతంబి’ అనే హిట్ సినిమాని నిర్మించారు. ఆయన స్వయంగా పాణం, మనమగళ్ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్. వాసన్ గారి మాగ్నం ఓపస్ ‘చంద్రలేఖ’లో ఎన్.ఎస్.కె హాస్య పాత్ర పోషించారు. ఒకానొక సమయంలో ఎన్.ఎస్.కె. లేని తమిళ సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.

ఎంజిఆర్, శివాజీ గణేషన్ వంటి అగ్రహీరోలతోనూ ఆయన నటించారు.

1944 నవంబరులో ఆయన అనుకోకుండా ఓ హత్యానేరంలో ఇరుక్కున్నారు. 30 నెలల పాటు జైల్లో మగ్గిన తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం ఆ కేసులోంచి బయటపడ్దారు.

తర్వాత తేరుకొని మళ్ళీ సినిమాల్లో ప్రయత్నించినా, మునుపటి వైభవం రాలేదు. అదృష్టం తిరగబడింది. ఆస్తులు కరిగిపోయాయి. ఎన్.ఎస్.కె.కి జైలు శిక్ష పడినప్పుడు మధురం సినిమాలు మానేసి – న్యాయపోరాటం కోసం నిధులు సమకూర్చడంలో లీనమయ్యారు.

భర్త జైల్లో ఉండగా మధురం ‘ఎన్.ఎస్.కె. నాటక సభ’ని స్థాపించి పలు నాటకాలు ప్రదర్శించారు. వారు 1947లో ప్రదర్శించిన ‘పైత్యకారన్’ అనే నాటకాన్ని సినిమాగా తీశారు. కృష్ణన్-పంజూ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగులో ఉండగా ఎన్.ఎస్.కె. జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో తను గడిపిన కాలం గురించి జోకులు వేస్తూ, తోటి ఖైదీల గురించి వివరిస్తూ – ఆ సినిమాలో ఒక సహాయక పాత్ర పోషించారు ఎన్.ఎస్.కె.

1947లో జైలు నుంచి విడుదలయ్యాకా, రంగస్థల పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన పమ్మల్.కె.సంబంధ ముదలియార్ చేతుల మీదుగా – ట్రిప్లికేన్‍కు చెందిన నటరాజ ఎడ్యుకేషనల్ సొసైటీ – ఎన్.ఎస్.కె. గారికి ‘కళైనవార్’ అనే బిరుదును ప్రసాదించింది. ఈనాటికీ ఆ బిరుదు ఆయనకి గుర్తింపుగా ఉంది.

1951లో ఎన్.ఎస్.కె. దర్శకత్వం వహించిన ‘మనమగళ్’లో ప్రధాన పాత్రలో పద్మిని నటించారు.ఈ సినిమాకి గాను – తర్వాతి కాలంలో గొప్ప దర్శకుడిగా పేరు పొందిన – ఎ. భీమ్‌సింగ్- సహాయ దర్శకుడిగా పనిచేశారు. మనమగళ్ సినిమాలో గొప్ప నటన ప్రదర్శించినందుకు బాలయ్యకు ఒక కారు కొన్నిచారు ఎన్.ఎస్.కె.

1952లో ఎన్.ఎస్.కె. దర్శకత్వం వహించిన ‘పాణం’ చిత్రం ద్వారా ఎమ్.ఎస్.వి-టి.కె.ఆర్‌లు సంగీత దర్శకులుగా సినీరంగ ప్రవేశం చేశారు.

తనకాలంలోని గొప్ప రంగస్థల, సినీ కళాకారులని ఎన్.ఎస్.కె. సముచితంగా గౌరవించారు. గాంధీగారి సిద్ధాంతాలను పాటించే ఆయన ద్రావిడ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. మహత్మా గాంధీ హాత్యానంతరం – ఎన్.ఎస్.కె. తన ఊరిలో మునిసిపల్ పార్కులో తన సొంత ఖర్చుతో మహాత్మాగాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. సౌత్ ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ సంస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. ఈ సంస్థ కోసం తన సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.

ఎన్.ఎస్.కె. 49 ఏళ్ళ వయసులో 30 ఆగస్టు 1957 నాడు మృతి చెందారు. టి.ఎ. మధురం 1974లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.


అలనాటి ప్రసిద్ధ సినిమాటొగ్రాఫర్ బొమన్ దిన్‌షా ఇరానీ:

సినిమాటొగ్రాఫర్ బొమన్ దిన్‌షా ఇరానీ – భారతదేశపు తొలి టాకీ సినిమా ‘అలం అరా’ దర్శక నిర్మాత అర్దేషిర్ ఇరానీ, మరో సినిమాటొగ్రాఫర్ రుస్తుం ఇరానీల కుటుంబానికి చెందినవారు.

ఆయన 1906లో బొంబాయిలో జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకూ చదివారు. వారి తండ్రి గారికి అర్దేషిర్ ఇరానీ ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ అధినేత అని తెలుసు. బొమన్‍ ఆ కంపెనీలో లాబొరేటరీ అసిస్టెంట్‌గా చేరారు. కానీ ఆయనకి అక్కడ ఏమీ పని ఉండేది కాదు. ఏదైనా ఫిల్మ్‌ని ఎక్స్‌పోజ్ చేయాల్సి వస్తేనే ఆయనకి పని ఉండేది. మిగతా సమయాల్లో ఆయన షూటింగ్స్ చూస్తూ, విషయాలు గమనించేవారు. ఆయనకి షూటింగ్స్ నచ్చేవి, ఆయన ఆసక్తిని గమనించిన రుస్తుం ఇరానీ ఆయనని ఫొటోగ్రఫీ విభాగానికి బదిలీ చేశారు. ఆయనతో పాటు ఫరేదూన్ ఇరానీ (మహబూబ్ ప్రొడక్షన్స్ వారి కెమెరామాన్) కూడా అక్కడే ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. అయితే వారిద్దరికీ ఏవైనా సందేహాలు కలిగితే, వాళ్ళు రుస్తుం ఇరానీని అడగకూడదు. “జాగ్రత్తగా పరిశీలించి, మీ అంతట మీరు నేర్చుకోవాలి” అన్నదే ఆయన జవాబుగా ఉండేది. పరిశీలన ద్వారా, ఫొటోగ్రఫీపై వచ్చిన అంతర్జాతీయ పుస్తకాలు చదవడం ద్వారా వారు లైటింగ్, కంపోజింగ్ తదితర అంశాలు నేర్చుకొన్నారు. భారతదేశంలోనూ, విదేశాలలోనూ సినిమాలు ఎలా నిర్మితమవుతాయో అవగతం చేసుకొన్నారు. భిన్న కెమెరాలో ప్రయోగాలు కొనసాగించారు. మోటర్ లేకుండా నడిపే ఫిల్మ్ కెమెరాల నుంచి కొత్త సాంకేతికతో పని చేసే ‘ఆల్ న్యూ కెమెరా’ వరకు అన్నింటినీ నేర్చుకొన్నారు.

ఈ అనుభవంతో బొమన్ తొలిసారిగా మూకీ సినిమా ‘సెకండ్ వైఫ్’ (1928)కి స్వతంత్ర సినిమాటొగ్రాఫర్‍గా పని చేశారు. అది నటి మెహతాబ్‌కి తొలి చిత్రం [కాగా ఫరేదూన్ ఇరానీ మహబూబ్ ఖాన్ ఫిల్మ్స్‌లో చేరి అన్‌మోల్ ఘడీ (1946), అందాజ్ (1949), ఆన్ (1952) – ఇంకా భారతదేశపు తొలి టెక్నికలర్ చిత్రం అమర్ (1954) మదర్ ఇండియా (1957) చిత్రాలకు పని చేశారు].

ఇంపీరియల్ కంపెనీకి అనుబంధ సంస్థగా సాగర్ ఫిల్మ్ కంపెనీ ఉండేది. బొమన్ ఈ కంపెనీలో చేరి మూకీ సినిమాలు – జ్యువెల్ ఆఫ్ రాజ్‍పుతానా, వెబ్ – తదితర చిత్రాలకు పనిచేశారు. ఇవి చిన్న చిత్రాలు, అప్పట్లో 30,000 రూపాయల బడ్జెట్‌తో పూర్తయ్యేవి. షూటింగ్ కూడా పది, పదిహేను రోజుల్లో  పూర్తి అయిపోయేది.

తరువాత సౌండ్, ఫిల్మ్‌ని ఒకేసారి కాప్చర్ చేయగల సింగిల్ సిస్టమ్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ రోజుల్లో సౌండ్ ఇంజనీరు, సినిమాటొగ్రాఫర్ ఒకరే అయి ఉండేవారు లేదా ఇద్దరూ కలసికట్టుగా బహుజాగ్రత్తగా పనిచేసేవారు. డెవలప్ చేస్తున్న సమయంలో ఫిల్మ్ లో కనుక కేవలం ధ్వని ఉండి దృశ్యం లేకపోయినా – లేక – దృశ్యం ఉండి ధ్వని లేకపోయినా – ఆ ఫిల్మ్ పనికిరాకుండా పోయేది. అప్పట్లో ‘ఎక్స్‌పోజ్ మీటర్లు’ ఉండేవి కావు. సాధారణ నేత్రాలలో వెలుతురుని చూసి ఎక్స్‌పోజర్‌ని గణించేవారు. ధ్వని లేదా దృశ్యం రెండూ ఒకేసారి రాకపోయినట్లయితే మళ్ళీ చిత్రీకరించేవారు. ఆ రోజుల్లో ధ్వని సక్రమంగా వచ్చేది కాదు. నేపథ్యంలో వినిపించే శబ్దాలు కూడా రికార్డయ్యేవి. తొలి టాకీ చిత్రం ‘అలం అరా’ (1931)ని ఈ పద్ధతిలోనే చిత్రీకరించారు. బొమన్ గారి తొలి టాకీ ‘వీరాభిమన్యు’ (1931). తరువాత సుభద్రా హరణ్, అబుల్ హసన్, మీరాబాయి, జరీనా వంటి చిత్రాలు వచ్చాయి. వీటన్నింటిని సాగర్ కంపెనీ నిర్మించింది. దాదాపుగా వీటన్నింటిలోనూ జుబైదా, జై మర్చంట్ నటించారు. ఇవన్నీ సింగిల్ సిస్టమ్ కెమెరాలతో చిత్రీకరించబడ్డాయి, ధ్వని అంత సంతృప్తికరంగా ఉండేది కాదు. అంతలో కలకత్తాకి చెందిన మదన్ థియేటర్స్ వారు అధిక వ్యయంతో డబుల్ సిస్టమ్ కెమెరాలను దిగుమతి చేసుకున్నారన్న వార్త వెలువడింది. బొమన్ సమయం వృథా చేయకుండా, సాగర్ ఫిల్మ్స్‌ని వీడి, కలకత్తా వెళ్ళి మదన్ థియేటర్స్‌లో చేరారు. సుప్రసిద్ధ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ నిర్మాత ఎజ్రా మీర్ కూడా ఆయనతో పాటు చేరారు.

ఈ సంస్థలో బొమన్ మై బిలవ్డ్, స్ట్రగుల్, డెవిల్స్ డైస్ వంటి 13 చిత్రాలకు పని చేశారు. ఆయన కలకత్తాలో ఉండగా తిమ్మయ్య అనే వ్యక్తి బెంగుళూరు నుంచి వచ్చి – బెంగుళూరుకు వచ్చి, కొత్తగా ఏర్పాటు చేసిన మైసూరు సౌండ్ స్టూడియోలో చేరమని బొమన్‍ని ఆహ్వానించారు. ఆ సంస్థకు బొమన్ లాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందని ఆయన చెప్పారు. అందుకు అంగీకరించి బొమన్ బెంగుళూరు వెళ్లారు. కాని అక్కడి పరిస్థితులు ఆయనకు నచ్చలేదు. కన్నడ చిత్రం ‘రాజసూయ యజ్ఞ’కి పని చేసారు. అదే సమయంలో జిత్ బెనర్జీ, దిన్‌షా తెహ్రానీ – నేషనల్ మూవీ టోన్ సంస్థని విడిచి – మద్రాసు వచ్చి న్యూటోన్ స్టూడియో స్థాపించారు. వారు తమలో కలవవల్సిందిగా బొమన్‍ని ఆహ్వానించారు. బొమన్ బెంగుళూరు వదిలి మద్రాసు చేరి వాళ్లతో కలిసారు. వాళ్ళు తెలుగులో – మోహినీ రుక్మాంగద, సేతు బంధనం; తమిళంలో రాజమణి అనే సినిమాలు తీశారు. అయితే బొమన్‍కి ఇక్కడ కూడా సంతృప్తి కలగలేదు. తనకి సృజనాత్మక స్వేచ్ఛ లభించడం లేదని భావించారు. అందుకని తన సొంత అవుట్‌డోర్ యూనిట్ ఏర్పర్చుకుని ఫ్రీలాన్సర్ అయ్యారు. ప్రసిద్ధ తెలుగు సినీ నిర్మాతలు ఘంటసాల బలరామయ్య, చిత్రపు నారాయణ మూర్తి వంటి వారు ఆయన ప్రతిభని గుర్తించి ప్రోత్సహించారు. భక్త మార్కండేయ, మైరావణ అనే తెలుగు సినిమాలకు బొమన్ పనిచేశారు. మైరావణలో ఆయన తీసిన ట్రిక్ షాట్స్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.

రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు, చాలామంది మద్రాసుని వదిలిపోసాగారు. బొమన్ అవుట్‌డోర్ యూనిట్‌ని తనకి అమ్మేయమని ఘంటసాల బలరామయ్య అడగగా, అలాగే చేశారు బొమన్. ఆ తర్వాత బొమన్ కోయంబత్తూరులో సెంట్రల్ స్టూడియో వారి వద్ద కెమెరామాన్‌గా చేరారు. అక్కడ ఆయన సినిమాటొగ్రాఫర్‌గా – భక్త ప్రహ్లాద (తమిళం), పరశురామ్, భూలోక రంభ, మణి మేఖలై, సతి మురళి వంటి సినిమాలకు పని చేశారు. కన్నగి, ఆర్యమాల సినిమాలకు దర్శకత్వం వహించారు.

రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రమవడంతో మద్రాసుపై దాడులు జరుగుతాయని పుకార్లు వ్యాపించాయి. దాంతో బొమన్ బొంబాయి వెళ్ళిపోయారు. బొంబాయిలో ఆయన అక్బర్ ది గ్రేట్, సున్ సునాతా హు, ఉస్ పార్ వంటి సినిమాలకు పని చేశారు. ఉస్ పార్ నటి నర్గిస్ ద్వితీయ చిత్రం. ఆయన సేలంలో కుంతలకేసి, లక్ష్మీ విజయం సినిమాలకు కూడా పని చేశారు. ఆయన పనితనాన్ని గమనించిన మోడరన్ థియేటర్స్ యజమని తమ చిత్రం ‘దిగంబర్ స్వామియార్’ కోసం పని చేయమని బొమన్‍ని అడిగారు. తొలుత అంగీకరించినా, సృజనాత్మక విభేదాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు బొమన్. ఆయన మళ్ళీ మద్రాసు వచ్చి కన్నడ సినిమా భక్త కుంభర కోసం పని చేశారు. కన్నడంలో మునస్, ఉమా పిక్చర్స్ వారు రూపొందిన దేవసుందరి; తమిళంలో చిత్తూర్ రాణి పద్మిని, తెలుగులో గాయత్రి ఫిల్మ్స్ వారి కోసం కుచేల వంటి సినిమాలు చేశారు. సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పుడు చాలామంది లానే, బొమన్ కూడా తన ప్రతిభని సంపూర్ణంగా ఉపయోగించుకోవటంలేదని భావించారు. ఆయన జీవితం గురించి, ఎంత కాలం జీవించారన్న విషయం గురించి ఎక్కడా సమాచారం లేదు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి నాకు తెలిసిన స్వల్ప సమాచారం ఇది… విచారకరం.

Exit mobile version