Site icon Sanchika

అలనాటి అపురూపాలు-125

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

గీత రచయిత/కవి రాజా మెహదీ అలీ ఖాన్:

దేశ విభజన అనంతరం సంఘవించిన మత కలహాలు తదితర ఘటనలలో ఎంతో వేదననీ, బాధలని అనుభవించిన కవులే అద్భుతమైన ప్రేమ గీతాలు రచించిన వైనం విస్తుగొలిపేదే అయినా, అది వాస్తవం. ఇళ్ళు, ఆస్తులు, సంపదలు, ఆప్తులను పోగొట్టుకున్నప్పటికీ, మానసికంగా తీవ్రంగా గాయపడినప్పటికీ సున్నిత స్వభావులైన ఈ కవులు మంచితనం, మానవత్వం పట్ల విశ్వాసం కోల్పోకుండా రాబోవు తరాల కోసం అత్యద్భుతమైన ప్రేరణాయుతమైన గీతాలను రచించారు. అటువంటి గొప్ప గీత రచయితల్లో ఒకరు రాజా మెహదీ అలీ ఖాన్ (జననం 23 సెప్టెంబరు 1915, మరణం 29 జూలై 1966)  ఒకరు. ‘జో హమ్‍నే దాస్తాన్ అప్నీ సునాయె ఆప్ క్యూ రోయే’ (ఓ కౌన్ థీ), ‘హై ఇస్సీ మే ప్యార్ కీ అబ్రూ, ఓ జఫా కరేఁ మై వఫా కరూం’ (అన్‌పఢ్) వంటివి ఆయన కలం నుంచి జాలువారినవే.

అవిభాజ్య భారతంలోని గుజ్రన్‌వాలా జిల్లాలోని వజీరాబాద్ తెహ్‍సిల్‌ లోని కర్మాబాద్ అనే కుగ్రామానికి చెందినవారు మెహదీ. ఫైర్ బ్రాండ్ ఇస్లామిక్ కార్యకర్త, పోరాట యోధుదు, విలేఖరి మౌలాన జాఫర్ అలీ ఖాన్ – మెహదీ మేనమామ. అయితే మెహదీ, తన మేనమామలా కాకుండా పూర్తిగా రొమాంటిక్ స్వభావి, లౌకికవాది, ఉదారవాది.

మెహదీ తండ్రి – మెహదీ నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. ఆయన అమ్మగారు హెబా సాహెబా చక్కని కవయిత్రి. డా. అల్లమా ఇక్బాల్ ఆమె కవిత్వం ‘నవా-ఇ-హరామ్’ని ప్రశంసించారు. అప్పటి లాహోర్ సాహిత్య సంగతులను బట్టి – మెహదీ ఆ నగరంలోనే ఎదిగారట… ఆయనకి పాన్ తినే అలవాటు ఉండేదట.  పేదరికం కారణంగా డిగ్రీ పూర్తి చేయలేనప్పటికీ, ఉర్దూపై మంచి పట్టు ఉన్న కారణంగా – మెహదీ – లాహోర్ లోని అప్పటి సుప్రసిద్ధ పత్రికలు – ‘ఫూల్’, ‘తెహజీబ్-ఇ-నిస్వాన్’ల సంపాదక బృందంలో స్థానం సంపాదించుకోగలిగారు.

ఆ తరువాత ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగంలో చేరినప్పటికీ ఎక్కువ రోజులు కొనసాగలేదు. తన మిత్రుడు సాదత్ హసన్ మంటో పిలుపు నందుకుని హిందీ చలన చిత్రసీమలో ప్రవేశించారు. బొంబాయిలో తొలుత సంభాషణల రచయితగా ప్రారంభించినా – గీత రచయితగా తొలి చిత్రం ‘దో భాయ్’తో పేరు తెచ్చుకున్నారు. ‘మేరా సుందర్ సపనా’, ‘యాద్ కరోగే’ అనే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తర్వాతి కాలంలో ఆయన పాటలు శ్రోతలను అమితంగా ఆకట్టుకొన్నాయి.

దేశ విభజన తరువాత ఆయన ఆప్త మిత్రుడు మంటో పాకిస్థాన్ వెళ్ళిపోయినా, మెహదీ, ఆయన భార్య తాహిర మాత్రం భారత్ లోనే ఉండిపోయారు. ఆయన రాసిన దేశభక్తి గీతం ‘వతన్ కీ రాహ్ మే వతన్ కే నౌజవాన్  షహీద్ హోఁ’ (షహీద్) గీతంలోని దేశభక్తి ఆయన హృదయంలో నిండిపోయింది. సౌకర్యాల కోసం తన సంపాదనతో ఉదారంగా ఉండేవారు. ప్రతిభని మెచ్చుకునేవారు. హాస్యాన్ని ఆస్వాదించేవారు. లాహోర్ మోడల్ టౌన్ వెనకాల సోమ్ ఆనంద్ అనే హిందువు నివసించేవారు. ఆయన తండ్రి లాలా ఫకీర్ చంద్ ఒక ప్రసిద్ధ బ్యాంకర్. సోమ్ – ఓ ముస్లిం యువతిని పెళ్ళి చేసుకుని ఇస్లాం మతం స్వీకరించారు. ఆయనకి మెహదీ కుటుంబం బాగా పరిచయం. బొంబాయి నుంచి లాహోర్‍కి మెహదీ డబ్బు పంపేవారని ఆయన చెప్పారు.

సీనియర్, జూనియర్లతో కలిసి ఒకేలా పని చేస్తూ, మెహదీ కొన్ని అద్భుతమైన పాటలు అందించారు. ‘ఆంధీ మే గునాహోం కా దియా’ (సర్దార్ మాలిక్), ‘జబ్ ఛాయే కభీ సావన్ కీ ఘటా’ (బాబుల్), ‘కర్తే హో ముజ్ సే కిత్నీ మొహబ్బత్’ (ఎస్. మొహిందర్), ‘జిధర్ భీ మై దేఖూఁ ఉధర్ తూహీ తు హై’ (రోనో ముఖర్జీ), ‘అకేలా హమ్ హై హమ్‌సఫర్ డూంఢతా హూఁ’ (లక్ష్మీకాంత్ ప్యారేలాల్), ‘మై ప్యార్ కా రాహీ హూఁ’ (ఓ.పి. నయ్యర్) వంటి గీతాలు ఇందుకు ఉదాహరణలు. అయితే మదహ్‍మోహన్, మెహదీల జోడీ మాత్రం మరపురాని  మధురమైన పాటలు అందించింది.

మదహ్‍మోహన్, మెహదీల జోడీ పలు సినిమాలలో అందించిన మధుర గీతాలలో గజళ్ళు కూడా ఉన్నాయి. తన తొలి చిత్రం ‘ఆంఖేఁ’ (1950)లో మదన్ మోహన్ – మెహదీ రాసిన రెండు గీతాలను ఉపయోగించారు. ‘ప్రీత్ లాగే కే మైనే ఈ ఫల్ పాయా’ అనే మెహదీ గీతాన్ని తన స్వరంలో అద్భుతమైన విషాదాన్ని ఒలికిస్తూ ఆలపించారు ముకేశ్. ‘హమ్ ఇష్క్ మే హైఁ’ అనే మరో మెహదీ గీతాన్ని తనదైన నైపుణ్యంతో లో-పిచ్ నుంచి హై-పిచ్‌కి మారుతూ గానం చేసి పాటకి ప్రాణం పోసారు మహమ్మద్ రఫీ. మదహ్‍మోహన్, మెహదీల కాంబినేషన్‍లో వచ్చిన తరువాతి సినిమా ‘అదా’ (1951). ‘ప్రీతమ్ మేరీ దునియా మే దో దిన్ తో రహే హోతే’ అనేది అద్భుతమైన పాట. ‘మధోష్’ (1951) చిత్రంలో వీరిద్దరూ కలిసి  ‘మేరీ యాద్ మే తుమ్ నా ఆన్సూ  బహానా’ అనే అజరామరమైన పాటని అందించారు. తన మృదువైన స్వరంతో తలత్ మహమూద్ మనసుకి హాయిగొలిపేలా ఆలపించారు.

మదహ్‍మోహన్, మెహదీల జోడీ

‘అన్‌పఢ్’ (1962) చిత్రంతో ఈ జోడీ మళ్ళీ మాయ చేసింది. లతా మంగేష్కర్ పాడిన రెండు గజళ్ళు – ‘ఆప్‌ కీ నజరోం నే సమఝా ప్యార్ కా కాబిల్ ముఝే’, ‘హై ఇస్సీ మే ప్యార్ కీ అబ్రూ’ – అనేవి కలెక్టర్స్ ఐటమ్స్‌గా నిలిచాయి. సెమీ-క్లాసికల్ స్టైల్‌లో సాగే ‘జియా లే గయో రి మెరా సావరియా’ కూడా జనరంజకమైనదే. ‘ఆప్‌ కీ నజరోం నే సమఝా ప్యార్ కా కాబిల్ ముఝే’ పాటకి మదన్ మోహన్‍ ఉత్తమ స్వరకర్తగా, మెహదీ ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్లు పొందినప్పటికీ ప్రభావ వర్గాల కారణంగా వేరే వారికి ఆ అవార్డులు దక్కాయి. ‘ఓ కౌన్ థీ’ (1964) చిత్రంలో లత పాడిన – ‘లగ్ జా గలె కె ఫిర్ యె రాత్ హో నా హో’, ‘జో హమ్‍నే దాస్తాన్ అప్నీ సునాయె ఆప్ క్యూ రోయే’, ‘నైనా బరసే రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్’ ఆణిముత్యాల వంటివి. ‘ఆప్ కీ పర్‌ఛాయాయేఁ’ (1964) చిత్రంలో లత పాడిన గజల్ – ‘అగర్ ముఝ్ సే ముహబ్బత్ హై ముఝే సబ్ అప్నే ఘమ్ దే దో’ అత్యంత విలువైన పాట, చిరకాలం దాచుకోవలసిన పాటగా నిలిచింది. ‘మేరా సాయా’ (1966) చిత్రంలో లత ‘నైనోం మే బద్రా ఛాయె’ పాటని సెమీ-క్లాసికల్ శైలిలో పాడారు. ఈ సినిమాలోవే – రఫీ పాడిన ‘ఆప్ కే పహలూ మే ఆకర్ రో దియే’, ఆశా ఆలపించిన ‘ఝుంకా గిరా రే బరేలీ కే బాజార్ మే’ ప్రేక్షకులని/శ్రోతలని ఎంతగానో అలరించాయి. ఈ మధుర గీతాలన్నీ మదన్ మోహన్ – మెహదీ ద్వయం అద్భుతంగా సృజించి అందించినవే. హిందీ చలనచిత్ర చరిత్రలో వీరిద్దరిదీ ఓ ప్రత్యేక అధ్యాయం. 1954 నుంచి దేశంలో విశేషంగా గుర్తింపు పొందిన ఫిల్మ్‌ఫేర్ అవార్డును ఈ జోడీ పొందకపోయి ఉండచ్చు, కానీ అవార్డులు ఆయా సృజనశీలుర సంపూర్ణ ప్రతిభకి కొలమానం కాదు. కళాకారుడిది ఎంత గొప్ప ప్రతిభ అయినా, ఒక్కోసారి ఎన్నో ఇతర అంశాలు అవార్డులని ప్రభావితం చేస్తాయి. వీరిద్దరు చిన్న వయసులోనే మృతి చెందడం శోచనీయం. కానీ ఉన్నంత కాలం గొప్పగా జీవించారు. అందరూ అభిమానించేలా బ్రతికారు.

రాజా మెహదీ అలీ ఖాన్ ఇతర సంగీత దర్శకులతో కూడా పని చేశారు. 1947లో ‘దో భాయ్’ చిత్రానికి మెహదీ రాసిన అద్భుత గీతాలు – ‘మేరా సుందర్ సపనా టూట్ గయా’, ‘యాద్ కరోగే ఇక్ దిన్ హమ్ కో యాద్ కరోగే’ – అనే గీతాలను అంతే అద్భుతంగా పాడారు గీతా రాయ్ (దత్). ఈ చిత్రానికి సంగీతమ్ ఎస్. డి. బర్మన్ అందించారు. ‘షహీద్’ (1948) చిత్రంలో ‘వతన్ కీ రాహ్ మే వతన్ కే లోగ్ షహీద్ హోఁ’ అనే దేశభక్తి గీతాన్ని రాశారు మెహదీ. బాలీవుడ్‍లో పంజాబీ బీట్ ప్రవేశ పెట్టిన మాస్టర్ గులామ్ హైదర్ ఈ చిత్రానికి స్వరాలందించారు. ‘ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా’ (1962) చిత్రంలో మెహదీ రచించిన ‘మై ప్యార్ కా రాహీ హూఁ, తేరీ జుల్ఫ్ కే సాయే మే’ అనే యుగళగీతాన్ని రఫీ, ఆశా గానం చేశారు. సంగీతం ఓ.పి.నయ్యర్.

మెహదీని ‘కింగ్ ఆఫ్ లిరిక్స్’ అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన అన్ని పాటలు గొప్ప హిట్‌లు కాకపోయి ఉండచ్చు, కానీ ఆయన కవిత్వం అన్నివేళలా బంగారంలా మెరిసింది. ఆయన ఈ ప్రపంచాన్ని చిన్న వయసులోనే విడిచినా, తన రచనల ద్వారా తన వారసత్వాన్ని విడిచి వెళ్ళారు. ఆయన పాటలను శ్రోతలను ఆనందింపజేసినట్లే, ఆయన కవితా సంకలనాలు – ‘అందాజ్-ఇ-బయాన్ ఔర్’, ‘మిజ్రాబ్’ పాఠకులను ఆకట్టుకొన్నాయి. ఆయనకి సెన్సాఫ్ హ్యుమర్ చాలా ఎక్కువని, పిల్లలు లేకపోవడంతో, ఇరుగుపొరుగు పిల్లలనే తన సొంత పిల్లలుగా చూసుకునేవారని అంటారు.

ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నా కూడా, తనని పరామర్శించడానికి వచ్చిన వారిని నవ్వుతూ పలకరించారు. 29 జూలై 1966 నాడు బొంబాయిలో మృతి చెందారు.


అలనాటి మేటి నటి మినూ ముంతాజ్:

డాన్సింగ్ యాక్టర్‌గా పేరు పొందిన ముంతాజ్ అలీ కుమార్తె సుప్రసిద్ధ నటి మినూ ముంతాజ్. ప్రముఖ హాస్యనటుడు మెహమూద్‌కి ఈమె సొంత చెల్లెలు. 26 ఏప్రిల్ 1942న జన్మించిన మినూ అసలు పేరు మాలికున్నీసా అలీ.

ముంతాజ్ అలీ అలనాటి గొప్ప నటుడు. తన సవతి తల్లి అకృత్యాలను భరించలేక, సౌదీ అరేబియాలోని తమ ఇంటి నుంచి పారిపోయి, ఒక ఓడ ఎక్కి బొంబాయి చేరుకున్నారు. ఓడలో నిద్రపోతే, మెలకువ వచ్చేసరికి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్నారుట. వేలాది వీధి బాలల వలె జీవిక కోసం పలు రకాలైన పనులు చేశారు. ఇంతలో ఆయనకు హోర్నిమన్ సాహెబ్ అనే ఓ కవి ఆదరణ లభించింది. ఆయన ముంతాజ్ అలీని చేరదీశారు. ఆయన ద్వారా ముంతాజ్ అలీ రంగస్థలం లోకి, అటునుంచి సినిమాల్లోకి ప్రవేశించారు. ముంతాజ్ అలీకి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. మినూ ముంతాజ్, మెహమూద్ వారిలో ప్రసిద్ధులు. తండ్రితో కలిసి మినూ ముంతాజ్ నాటకాలకి, థియేటర్లకి వెళ్ళేవారు. ఆమె నాట్య ప్రతిభ చాలా వేగంగా ప్రసిద్ధి చెందింది. ఓసారి మద్రాసు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆర్కాటు రాచకుటుంబం వారసుడు ఆమెని చూడడం జరిగింది. ఆమెని ఇష్టపడి వివాహం చేసుకున్నారు సయ్యద్ అలీ అక్బర్.

ఆమె సోదరుడు మెహమూద్ కూడా జీవితంలో ఎంతో కష్టపడ్డారు. తొలి రోజుల్లో జీవిక కోసం రైల్లో తినుబండారాలు అమ్మేవారు, మిమిక్రీ చేసేవారు. అయితే ఆయనకి బాగా పేరు వచ్చాకా, పెద్ద పెద్ద నటులు కూడా ఆయన సరసన నటించడానికి భయపడేవారు ఎందుకంటే, ఆయా సన్నివేశాలలో ఆయనే ప్రేక్షకుల దృష్టి ఆకర్షిస్తారని. ‘పర్వరీష్’ చిత్రం తరువాత రాజ్ కపూర్ ఆయనతో నటించనన్నారు. ‘అబ్దుల్లా’ చిత్రంలో వాళ్ళిద్దరు రెండు సెకన్ల సన్నివేశంలో కనిపించడం దీనికి మినహాయింపు. మెహమూద్ తొలిసారిగా నిర్మించిన ‘ఛోటే నవాబ్’ చిత్రానికి ఎస్.ఎ. అక్బర్ దర్శకత్వం వహించారు.

మినూ ముంతాజ్ తొలి చిత్రం ‘సఖి హాతిమ్’. ఇందులో ఆమెతో పాటు దల్జిత్, చిత్ర నటించారు. ఆమె చివరి చిత్రం పాల్కి. బాలరాజ్ సహాని సరసన హీరోయిన్‌గా నటించిన  బ్లాక్ కాట్, చిరాగ్ కహా రోషనీ కహా, ఘరానా, తాజ్ మహల్, హౌరా బ్రిడ్జ్ వంటివి ఈమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సాహిబ్ బీబీ ఔర్ గులామ్ మరో ప్రముఖమైన చిత్రం.

తన జీవితం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

***

బి.జి. హోర్నిమన్ సాహెబ్ మా నాన్నని దత్తత తీసుకున్నారు. నాన్న సౌదీ అరేబియా నుంచి పారిపోయి ఓ ఓడలో భారత్ వచ్చారు. నాన్న అసలు పేరు అన్వర్ అలీ. కానీ, కారణం ఏమిటో తెలియదు కానీ, హోర్నిమన్ గారు నాన్న పేరుని ముంతాజ్ అలీగా మార్చారు. నాట్యం నాన్న రక్తంలో ఉండేది. ఆ రోజుల్లో బొంబాయిలో చాలా నాటక సంఘాలుండేవి, వాటిల్లో నాన్న నృత్యం చేసేవారు. హోర్నిమన్ గారికి ఇష్టం లేకపోయినా, నాన్న ఆసక్తిని గమనించి, అంగీకరించారు.

నాన్నకి 16 ఏళ్ళు, అమ్మకి 11 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెళ్ళి జరిగింది. అమ్మకి14 ఏళ్ళ వయసులో తొలి సంతానం కలిగింది. ఒకరి తరువాత ఒకరు అలా పిల్లలు పుడుతూనే ఉన్నారు. కాస్త ఎడం ఉన్నదల్లా నాకు ఉస్మాన్ అన్నయ్యకే. అన్నయ్య పుట్టిన మూడేళ్ళకు నేను పుట్టాను. మొత్తం మేం ఎనిమిది మంది తోబుట్టువులం. అందరికంటే పెద్ద అక్క హుస్సేనీ బేగమ్. తను పాకిస్థాన్‌కి వెళ్ళిపోయింది, ఈ మధ్యే చనిపోయింది. ఆ తరువాత మెహమూద్ అన్న, తర్వాత హేతున్నిసా, ఉస్మాన్ అలీ, తర్వాత నేను, నా తర్వాత జుబేదా బేగం, షౌకత్ అలీ, ఆఖరున అన్వర్ అలీ. హిందీ సినిమాల్లో నృత్యాలను ప్రవేశపెట్టింది నాన్నే. దేవికా రాణి నాన్నను మెచ్చుకుని బాంబే టాకీస్ స్టూడియోలో ఉద్యోగం ఇచ్చారు. ‘మై తో దిల్లీ సే దుల్హన్ లాయా’ అనే పాటకి నాన్న చేసిన డాన్స్ సూపర్ హిట్. మా తోబుట్టువులలో ముందుగా నేను సినిమాల్లోకి వచ్చాను. తర్వాత మెహమూద్ అన్న. అన్వర్ అలీ కూడా సినిమాల్లోకి వచ్చాడు, కానీ నిర్మాత. ‘ఖుదా గవా’ సినిమా నిర్మించాడు. నా మొదటి సినిమా ‘సఖి హాతిమ్’. ఇందులో దల్జిత్, చిత్రలతో పాటు నటించాను. ఈ సినిమాలో నాకు డాన్సులు లేవు. నా పాత్ర ఓ జలకన్య. అయితే నాట్యం మా రక్తంలోనే ఉంది. నృత్యాలు నేను నాన్న దగ్గర నేర్చుకున్నాను. ఇంటి దగ్గర నాన్న మాతో పాటు ఇంకా చాలామంది అమ్మాయిలకి నాట్యం నేర్పేవారు. ‘సఖి హాతిమ్’ సెట్‍లో నన్ను కుల్దీప్ కౌర్ చూశారు, నేను ముంతాజ్ అలీ కూతురునని తెలుసుకున్నారు. డాన్స్ చేస్తావా అని అడిగారు. నాకూ కావల్సింది అదే. నేను మొదటిసారిగా నాట్యం చేసింది ‘మిస్ కోకా కోలా’ సినిమాలో. ఆ తరువాత ‘సొసైటీ’ సినిమాలో డాన్స్ చేశాను. ‘హలాకు’ సినిమాలో ఒక గీతానికి నేనూ హెలెన్ పోటీ పడి నాట్యం చేశాం. నేను తనని అధిగమించానని అనుకుంటాను. నేను బాగా నాట్యం చేస్తానని పేరొచ్చింది. చాలా సినిమాల్లో నృత్యాలు చేసే అవకాశాలు లభించాయి.

కొన్నాళ్ళకి నాకు నృత్యాలంటే విసుగొచ్చింది. నటించాలని అనిపించిది. ఆనాటి టాప్ కమెడియన్స్ – జానీ వాకర్, ఓం ప్రకాశ్, సుందర్ అంకుల్, ఇంకా అన్న మెహమూద్‍తో నటించే అవకాశం లభించింది. ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలో అన్న మెహమూద్‌తో ఓ రొమాంటిక్ పాటలో ఏ ఇబ్బంది లేకుండా నటించాను. కానీ అన్నా చెల్లెల్లు రొమాన్స్ పాత్రలలో ఎలా నటిస్తారంటూ జనాలు గొడవ చేశారు. అప్పటి నుంచి మేం – అన్నా చెల్లెళ్ళ పాత్రలుంటేనే కలిసి నటించాలని అనుకున్నాం. ఎన్నో సినిమాల్లో జానీ వాకర్ సరసన నటించాను. ‘కాగజ్ కే ఫూల్’ చిత్రంలో నాకు ఆయనతో ‘హమ్ కో ప్యార్ కర్నా మాంగ్తా’ అనే పాట కూడా ఉంది. ‘పైగామ్’ సినిమాలో కూడా మా ఇద్దరికీ ఓ పాట ఉంది. ‘సిఐడి’ సినిమాలో నా మీద చిత్రీకరించిన ‘బూఝ్ మేరా క్యా గాఁవ్’ పాటకి బాగా పేరొచ్చింది. ‘ఇన్సాన్ జాగ్ ఉఠా’ చిత్రంలో నాకూ మధుబాలకీ ‘జాను జాను రే’ అనే యుగళ గీతం ఉంది. ఇద్దరు మిత్రురాళ్ళు తమ తమ ప్రియుళ్ళ గురించి చెప్పుకునే సందర్భంలోనిది ఆ పాట. కొన్నాళ్ళకి నాకు నృత్యాలన్నా, హాస్య పాత్రలన్నా విసుగు కలిగింది. ‘చిరాగ్ కహా రోషనీ కహా’ సినిమాలో సైడ్ హీరోయిన్ పాత్ర లభించింది. ఈ సినిమాలో నా మీద రెండు పాటలు చిత్రీకరించారు. హీరోయిన్‍గా నా తొలి చిత్రం ‘హమ్ హై రాహీ ప్యార్ కే’. తర్వాత బ్లాక్ కాట్, ఘర్ ఘర్ కీ బాత్, ఘజ్ బసా కే దేఖో – వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలలో నటించాను.

నేను దారాసింగ్ గారికి గొప్ప అభిమానిని. ఆయనతో పని చేయాలనుకున్నాను. ఆ కోరిక 1962లో తీరింది. ఆయన సినిమాలో హీరోయిన్‍గా నటించాను. నేను 1963లో పెళ్ళి చేసుకున్నాను. నా చివరి సినిమా ‘పాల్కీ’. ఈ సినిమా నిర్మాణానికి నాలుగేళ్ళు పట్టింది. ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడే పెద్ద పిల్లలు – అజాజ్, మెహ్నాజ్ పుట్టారు. సినిమా పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాం. ఒకసారి ఎనిమిదో నెల గర్భంతో నటించాను. ఆ సన్నివేశాలను దర్శకుడు చాలా తెలివిగా – ఇంట్లో జరిగే వేడుకగా – తీశారు. తరువాత షెహనాజ్, గుల్నాజ్ పుట్టారు.

పదేళ్ళ క్రితం, నా మెదడులో నాలుగు అంగుళాల ట్యూమర్‌ని గుర్తించారు. అది దాదాపుగా గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఉందనీ, మెల్లిగా పెరుగుతోందని వైద్యుడు చెప్పారు. నాకు షాక్ అనిపించింది. అయితే నాకెప్పుడూ ఏ ఇబ్బందీ అనిపించలేదు. అంతా మామూలుగానే ఉండేది. కానీ క్రమంగా నా చూపు మందగించింది, జ్ఞాపకశక్తి పోయింది. నేనెవరినీ గుర్తు పట్టలేకపోయాను. నాకు బొంబాయికి చెందిన డా. ఘా ఆపరేషన్ చేశారు. నాకేం అవుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. నేనిక తిరిగిరానేమో అనుకుని నా పిల్లలు నాకు వీడ్కోలు పలికారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చకా, నేను స్పష్టంగా చూడగలిగాను. నాకు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. నా బుర్ర మామూలుగా అయిపోయింది, అక్కడ కుట్టు జాడ ఇప్పటికీ ఉంది. మరణం అంచుల నుంచి బతికి వచ్చాను. భగవంతుని కృప.

ఇప్పుడు మేము కెనాడాలో ఉంటున్నాము. నా పిల్లలందరూ ఇక్కడే స్థిరపడ్డారు. ఐనా నేను మన దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నాను. భారత్‍లో ఆరు నెలలు ఉంటాను. నాకు బొంబాయిలోను, పూనే లోను అద్దె ఇళ్ళు ఉన్నాయి. బొంబాయి వచ్చినప్పుడల్లా నా స్నేహితులైన నందా, శ్యామా, వహీదాలను కలుస్తాను. మేమంతా బాగా ఆస్వాదిస్తాం. అలాగే మా అన్న మెహమూద్ కొడుకు, నా మేనల్లుడు లక్కీ అలీ ఇంట్లో బెంగుళూరులో కొన్ని రోజులు ఉంటాను. మావారు సయ్యద్ అలీ గారి బంధువులు ఉన్నందున్న హైదరాబాద్ కూడా వస్తుంటాను. దేవుడి దయవల్ల మేమంతా సంతోషంగా ఉన్నాం.

***

మినూ ముంతాజ్ 79 ఏళ్ళ వయసులో 23 అక్టోబరు 2021 నాడు మరణించారు. ఆమెకి భర్త సయ్యద్ అలీ అక్బర్, ఒక కొడుకు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

Exit mobile version