అలనాటి అపురూపాలు-126

1
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

ప్రతిభామూర్తి నటి సుచిత్రా సేన్:

కాస్త ఛాయ తక్కువైనా, అందరినీ ఆకట్టుకునే రూపం అలనాటి ప్రతిభామూర్తి, నటి సుచిత్రా సేన్‌ది. ఆకర్షణీయమైన చిరునవ్వుతో వెండితెరపైకి ఝంఝామారుతంలా దూసుకువచ్చారు. తన నటనతో, సహజ అందంతో ప్రేక్షకులను కట్టి పడేశారు. అనేక చిత్రాలలో ఆమె నటన ఎందరి హృదయాలలో దోచుకుంది. భారత సినీ వినీలాకాశంలో ఆమె ఒక ప్రకాశవంతమైన తార!

తొలి జీవితం:

6 ఏప్రిల్ 1931 నాడు (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న) పబ్నా అనే ఊరిలో జన్మించారు. ఆమె అసలు పేరు రోమా దాస్‌గుప్తా. స్థానికంగా ఉన్న బడిలోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. 1947లో దేశ విభజన సమయంలో వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు తరలివచ్చింది. అదే ఏడాది ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదినాథ్ సేన్ కుమారుడు దీబనాథ్ సేన్‍తో ఆమె వివాహం జరిగింది.

పెళ్ళి, మాతృత్వం, కెరీర్:

తమ వైవాహిక జీవితంలోని తొలి రోజుల్లోనే ఆమె భర్త ఆమె లోని నటనా ప్రతిభని గుర్తించారు. తనకంటూ ప్రత్యేకంగా ఒక కెరీర్‍ని ఏర్పర్చుకోమని ప్రోత్సహించారు. తన సవతి తల్లి సోదరుడైన దర్శకుడు బిమల్ రాయ్‌ని సంప్రదించారు. బిమల్ రాయ్ సుచిత్రను తన సమకాలీన దర్శకుడైన సుకుమార్ దాస్‌గుప్తాకి పరిచయం చేశారు.

సుకుమార్ ఆమెకి స్క్రీన్ టెస్ట్ చేసి, తన సినిమా ‘సాత్ నొంబర్ కోయెది’లో అవకాశం ఇచ్చారు. ఆయన సహాయకులలో ఒకరు – ఆమెకు ‘సుచిత్ర’ అని వెండితెర పేరు పెట్టారు. 1953లో ఆమె కజోరి, షారే చౌత్తర్, భగవాన్ శ్రీ శ్రీకృష్ణ చైతన్య వంటి సినిమాలలో నటించేందుకు సంతకాలు చేశారు. 1954లో ఆమె ఏకైక సంతానం – మూన్ మూన్ సేన్ – జన్మించారు. సుచిత్ర తల్లి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే సినిమాల్లోనూ నటించారు.

మలుపు:

ఆమె కెరీర్‌లో మేలి మలుపు అనదగ్గ చిత్రం ‘షారే చౌత్తర్’. ఈ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఇదే సినిమాలో తొలిసారిగా నటిస్తూ, సుచిత్ర సరసన నటించిన ఉత్తమ్ కుమార్ ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా తరువాత వీరిద్దరూ వెనుతిరిగి చూసుకోలేదు.

ఆకర్షణీయమైన జోడీ:

తరువాతి రెండు దశాబ్దాల పాటు ఉత్తమ్ కుమార్, సుచిత్రల జోడీ బెంగాలీ సినిమాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. సుచిత్రా సేన్ నటించిన దాదాపు 60 సినిమాల్లో 30 సినిమాలలో ఉత్తమ్ కుమార్ హీరో/కథానాయకుడు. ఆ రోజుల్లో ఈ జోడీ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది.  హార్ మానా హార్, ఇంద్రాణి, చావా పావా, శాప్‌మోచన్, సూర్యతోరణ్ వంటి హిట్ చిత్రాలను అందించింది ఈ జంట. వీరిద్దరూ జంటగా నటించిన సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యేవి. 50, 60 దశకాల్లో సినిమా థియేటర్లలో అడ్వాన్స్ టికెట్ల కోసం పాము మెలికల లాంటి (క్యూ) వరుసలు ఉండేవి. ఈ జంటకి లభించిన అమితమైన ప్రజాదరణ – బెంగాలీ సినీ పరిశ్రమలో తతిమా నటీనటులకి ఒక ప్రమాణం (బెంచ్‌మార్క్) ఏర్పరిచింది. 1963లో మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‍లో ‘సప్తపది’ చిత్రానికి గాను ఉత్తమ నటి పురస్కారం పొందడంతో సుచిత్రా సేన్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయురాలు సేన్. ఈమె నటించిన మరో మరపురాని చిత్రం ‘ఉత్తర్ ఫల్గుణి’. ఇందులో సేన్ పన్నాబాయ్, సుపర్ణ అనే తల్లీ కూతుర్లుగా ద్విపాత్రాభినయం చేశారు. కూతురుకి గౌరవప్రదమైన జీవితం అందించడానికి తపనపడే తల్లిగా ఈ సినిమాలో తల్లి పాత్రని అద్భుతంగా పోషించారు సేన్.

సుచిత్రా సేన్, సౌమిత్ర ఛటర్జీ:

‘సాత్ పాకే బంధా’ చిత్రం సుచిత్రని మరోసారి ప్రాచుర్యంలోకి తెచ్చింది. సౌమిత్ర ఛటర్జీ సరసన నాయికగా నటించారామె. ఆదర్శభావాలున్న భర్తకీ, ఆధిపత్యం చలాయించే తల్లికీ మధ్య నలిగిపోయే గృహిణి పాత్రని అద్భుతంగా పోషించారు సుచిత్ర. క్లయిమాక్స్‌లో భర్త దుస్తులని చించివేసే దృశ్యంలో సుచిత్ర ప్రదర్శించిన నటన ఆమె అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. మాస్కో ఫిలిం ఫెస్టివల్‍లో ఈ సినిమాకి పురస్కారం దక్కింది.

బాలీవుడ్‌లో సుచిత్రా సేన్:

సుచిత్ర – బిమల్ రాయ్ సాయంతో బాలీవుడ్‍లో అడుగుపెట్టారు. శరత్ చంద్ర నవల ‘దేవ్‌దాస్’ ఆధారంగా అదే పేరుతో తీసిన హిందీ సినిమాలో నటించారు. అప్పటి సూపర్ స్టార్స్ – దిలీప్ కుమార్, వైజయంతి మాల సరసన నటించడం ఆమెకి దక్కిన అదృష్టం. అయితే సుచిత్ర త్వరలోనే బాలీవుడ్‌పై తనదైన ముద్ర వేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హీరో దేవ్ ఆనంద్ సరసన ‘బొంబాయి కా బాబూ’ చిత్రంలో నటించారు. గుల్జార్ తీసిన ‘ఆంధీ’ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాలో ఒక మహిళా రాజకీయనేతగా ఆమె నటన పలువురి ప్రశంసలు అందుకుంది. ఐతే ఆ సినిమా కథ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జీవితాన్ని, కెరీర్‍ని పోలి ఉండడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ సినిమాలోని సున్నితమైన పాత్రకి గాను ఆమె ఉత్తమ నటిగా నామినేట్ అయ్యారు. అయితే విధి రాత ఏమో, బెంగాలీ సినిమాల దిగ్గజాలు అనదగ్గ సత్యజిత్ రే, రిత్విక్ ఘాటక్, మ్రిణాళ్ సేన్‌లతో మాత్రం ఆమె పని చేయలేకపోయారు. రే – ఆమెను తన సినిమాలో నటింపజేయాలనుకున్నా, ఎందుకో కుదరలేదు.

1972లో ఆమెకి ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది.

సంసారంలో విభేదాలు, వ్యక్తిగత విషాదం:

తొలిరోజుల్లో దీబనాథ్ సేన్‍ భార్యని విశేషంగా ప్రోత్సహించినా, తరువాతి రోజుల్లో ఆమెకి పేరు ప్రతిష్ఠలు రావడం భరించలేకపోయారంటారు. ఆమె సెలబ్రిటీ హోదా ఆయనకు నచ్చలేదట. వారి మధ్య దూరం పెరిగింది. 1969లో అమెరికాలో ఒక కారు ప్రమాదంలో మరణించారు దీబనాథ్ సేన్‍.

ఈ దుర్ఘటన అనంతరం సుచిత్ర – కావాలనే తెరమరుగు అయ్యారు. ప్రజలలో కనబడడం మానేశారు. ఎవరినీ కలవలేదు. ఫలితంగా సినీ అభిమానులు ఆమెను హాలీవుడ్ స్టార్ గ్రేటా గార్బోతో పోల్చారు.

తన ఏకాంతాన్ని బహిర్గతం చేయడం ఇష్టం లేని సుచిత్ర, 2005లో తనని ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కె పురస్కారాన్ని కూడా తిరస్కరించారు. 17 జనవరి 2014న గుండెపోటుతో సుచిత్ర మరణించారు. అయినప్పటికీ లక్షలాది అభిమానుల హృదయాలలో ఆమె చిరంజీవి!

ఆమె సినిమాలు తెలుగువారికి చిరపరిచితమే. మాంగల్య బలం (బెంగాలీ మూలం – అగ్నిపరీక్ష -1954; సుచిత్రా సేన్, ఉత్తమ్ కుమార్); ఆరాధన (1962) బెంగాలీ భాషలో ఆమె నటించిన సినిమాల రీమేక్‍లే.

మాంగల్యబలంలో మూలంలో ఉన్న ట్యూన్‌లో ఉన్న పాట

https://www.youtube.com/watch?v=F6G_JCbeY8g

మరికొన్ని పాటలు:

https://www.youtube.com/watch?v=rCHw_Sk4_lI

https://www.youtube.com/watch?v=65rHvUzSLrY


అలనాటి అందాల తార అమీతా:

ఒకనాటి అందాల నటి అమీతా అసలు పేరు కామర్ సుల్తానా. ఆమె తల్లి ఆవిడని ముద్దుగా ‘ఇందిర’ అని పిలిచేవారు. ఆమె స్నేహితులు ఇందు అనేవారు. షమ్మీ కపూర్ నటించిన ‘ఠోకర్’ అనే సినిమాలో ‘జేజేవంతి’ అనే పేరు గల చిన్న పాత్రతో వెండి తెరకి పరిచయమయ్యారు. ‘శ్రీ చైతన్య మహాప్రభు’ అనే సినిమాలో హీరోయిన్‌ని తగిన పేరు సూచించమని ఆ సినిమా దర్శకులు విజయ్ భట్ దినపత్రికలో ప్రకటన ఇవ్వగా ఎక్కువమంది పాఠకులు ‘అమీతా’ అనే పేరుని సూచించారు.

అమీతా 11 ఏప్రిల్ 1940 నాడు కొల్‌కతాలో జన్మించారు. ఆమె తండ్రి చౌదరి రియాజ్ అహ్మద్ మరణించినప్పుడు అమీతాకి ఒకటిన్నర సంవత్సరం వయసు. తరువాత ఆమె తల్లి శకుంతలాదేవి కూతురుని తీసుకుని బొంబాయి చేరారు. అమీతాని అక్కడే ఒక బోర్డింగ్ స్కూలులో చేర్చారు.

“మధుబాల నా అభిమాన నటి. ఆమె సినిమాలు చూస్తూ, ఆమె నటించిన పాత్రలని అనుకరించడం నాకు ఇష్టంగా ఉండేది. 1951లో విడుదలయిన ‘బాదల్’ అనే సినిమాలో ఆమె చేసిన కత్తియుద్ధం నన్నెంతో ఆకట్టుకుంది. అప్పుడు నాకు 11 ఏళ్ళ వయసు. ఒకరోజు మా ఇంటి బయట నేను ఆ కత్తి యుద్ధాన్ని అనుకరిస్తుండగా, దర్శక-నిర్మాత లేఖ్‌రాజ్ భక్రి నన్ను చూశారు. నేను ఆయనకి బాగా నచ్చేశాను, వెంటనే తాను తీస్తున్న ‘ఠోకర్’ అనే సినిమాలో నాకు సైడ్ హీరోయిన్ పాత్రనిచ్చారు. షమ్మీ కపూర్, శ్యామా నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రానికి సర్దార్ మాలిక్ సంగీతం అందించారు.” అని చెప్పారు అమీతా.

వాస్తవానికి అమీతా 1952లో ‘కాఫిలా’, ‘అన్‌మోల్ సహారా’ అనే రెండు సినిమాలలో నటించారు, కానీ 1953లో ‘ఠోకర్’ ముందు విడుదలయింది.

‘శ్రీ చైతన్య మహాప్రభు’ సినిమా పరాజయం పాలవడం అమీతా కెరీర్‍ని దెబ్బతీసింది. దాంతో ఆమె – ‘అమర్ కీర్తన్’, ‘బాదల్ ఔర్ బిజిలీ’, ‘బాఘీ సర్దార్’, ‘ఇంద్రసభ’ వంటి కొన్ని బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు అంగీకరించవలసి వచ్చింది. అయితే సైరా బానో అమ్మ – నసీమ్ బానో – అమీతాని ఫిల్మిస్థాన్ కంపెనీ యజమాని శశిధర్ ముఖర్జీకి పరిచయం చేయడంతో – ఆమె దశ తిరిగింది. “ఫిల్మిస్థాన్ వారి ‘అబ్-ఏ-హయత్’, ‘మునిమ్ జీ’ (రెండూ 1955లోవే), ‘హమ్ సబ్ చోర్ హైఁ’ (1956) సినిమాలలో సహాయ పాత్రలలో నటించాకా, శేఖర్ సరసన కథానాయికగా నన్ను ‘అభిమాన్’ సినిమాకి తీసుకున్నారు. ఇది 1957లో విడుదలయింది. ఆ తరువాత కమల్జీత్ సరసన ‘జమానా’ చిత్రంలో నటించాను. ఇక 1957లోనే వచ్చిన ‘తుమ్‌సా నహీ దేఖా’ నన్నో స్టార్‍గా మార్చేసింది” చెప్పారు అమీతా.

తన అభిమాన నటి మధుబాలతో కలిసి నటించే అవకాశం – దర్శక నిర్మాత అస్పి ఇరానీ తీసిన ‘షిరీన్ ఫర్హద్’ ద్వారా లభించింది. ఈ సినిమా 1956లో వచ్చింది, దీన్ని తన కెరీర్ లోనే గొప్ప విజయంగా భావిస్తారు అమీతా. ఇదిలా ఉంటే 1957 ఆమెకి బాగా కలిసివచ్చిన సంవత్సరంగా మారింది. ఆ ఏడాది విడుదలయిన ‘తుమ్‌సా నహీ దేఖా’ ఘన విజయం సాధించింది. దర్శక-నిర్మాత అమేయ్ చక్రవర్తి తీసిన ‘దేఖ్ కబీరా రోయా’ చిత్రం కూడా సూపర్ హిట్ అయింది. ‘తలాష్’, ‘సంస్కార్’, ‘రాజ్ సింహాసన్’, ‘ఆంగన్’ వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించాకా – ‘గూంజ్ ఉఠీ షెహనాయి’ (1959) మళ్ళీ ఆమెకి గొప్ప విజయాన్ని అందించింది. కానీ ఈ విజయ పరంపర ఎక్కువ కాలం కొనసాగలేదు.

“కొత్త తరం నటీమణులు సినీరంగంలో ప్రవేశిస్తున్న కాలం అది. పోటీలో నిలవడం బాగా కష్టమైన సమయం! అటువంటి పరిస్థితులలో  – అప్పటికే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న – ‘సావన్’, ‘ఛోటే నవాబ్’, ‘రాజ్ నందిని’, ‘పియా మిలన్ కీ ఆస్’, ‘ప్యార్ కీ దాస్తాన్’, ‘ప్యాసే పంఛీ’ ఇంకా ‘హమ్ సబ్ ఉస్తాద్ హైఁ’ – సినిమాల అనంతరం సహాయక పాత్రలకి మళ్ళాల్సి వచ్చింది. ‘రాఖీ’, ‘మేరే మహబూబ్’, ‘రిస్తే నాతే’, ‘ఆస్రా’, ‘ఎరౌండ్ ద వరల్డ్’ వంటి సినిమాలలో సహాయక పాత్రలలో నటించాను. 1968లో వచ్చిన ‘హసీనా మాన్ జాయేగీ’ తర్వాత సినిమాలకు వీడ్కోలు పలికాను” అన్నారు అమీతా.

[అమీతా చెప్పిన దాని ప్రకారం ‘హసీనా మాన్ జాయేగీ’ ఆమె చివరి చిత్రం. అయితే ఆమె ఫిల్మోగ్రఫీ ప్రకారం, ఆ సినిమా తరువాత ఆమె – ‘కభీ ధూప్ కభీ ఛావోఁ’ (1971), ‘మెరా షికార్’ (1973), ‘కిసాన్ ఔర్ భగ్‌వాన్’ (1974) అనే మరో మూడు సినిమాల్లో నటించారు. కాబట్టి ‘కిసాన్ ఔర్ భగ్‌వాన్’ ఆమె చివరి చిత్రం అవుతుంది.]

‘మేరే మహబూబ్’ (1962) చిత్రానికి గాను అమీతా ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు, కానీ ఆ ఏడాది ఆ అవార్డుకు ‘గుమ్రాహ్’ చిత్రానికి గాను శశికళకు దక్కింది.

అమీతా సినిమాల నుంచి విరమించుకుని అంధేరీ (వెస్ట్) లోని సెవెన్ బంగ్లాస్ ప్రాంతంలో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆమె తల్లి శకుంతలా దేవి మరణించారు. అమీతా కూతురు సబీహా కూడా – ‘అనౌఖా రిస్తా’, ‘బాప్ ఏక్ నంబరీ బేటా దస్ నంబరీ’, ‘జై విక్రాంత్’, ‘ఖిలాడీ’, ‘జాలిమ్’ వంటి సినిమాల్లో నటించారు. కానీ ఆ తరువాత ఆమె సినిమాలు మానేసి బంగారు ఆభరణాల డిజైనింగ్ లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆమె ఒక గల్ఫ్ దేశంలో ఒక ఎయిర్‌లైన్ కంపెనీలో పని చేస్తున్నారు.

అమీతా నటించిన పాటలు యూట్యూబ్‌లో

https://www.youtube.com/watch?v=Ezpvc3lNLK0

https://www.youtube.com/watch?v=10c6TeWZmVE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here