అలనాటి అపురూపాలు-128

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తల్లి పాత్రలలో మేటి నిరుపా రాయ్:

పరిపక్వ వదనం, తల్లి పాత్రలో లీనమవగలిగే సామర్థ్యం – ఆ రోజుల్లో తల్లి పాత్రలకి ఆమెని మొదటి ఎంపికగా చేశాయి.

 

బాలీవుడ్‍లో ‘ఆల్ టైమ్ మదర్’గా నిరుపా రాయ్‍కి సుస్థిర స్థానం కల్పించిన చిత్రం ‘దీవార్’. కన్నుల నిండా నీటితో, వేదన నిండిన హృదయంతో – తప్పు చేస్తున్న కొడుకుని సరిదిద్దాలన్న గట్టి పట్టుదలను కనబరుస్తారా చిత్రంలో. తల్లి గొప్పదనాన్ని చాటిన చిత్రం ‘మదర్ ఇండియా’ కావచ్చు; కానీ నిరుపా రాయ్ పోషించిన పాత్రలు విలక్షణమైనవి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పాత్రలు, విధిని ఎదిరిస్తూ పిల్లల మీద అపారమైన ప్రేమని కురిపిస్తూండే పాత్రలతో సినీ అభిమానులను సంపాదించుకున్నారు. నిరుపా రాయ్ గురించి ప్రస్తావిస్తూ ‘మేరే పాస్ మా హై’ అన్న డైలాగుని ఎవరు మర్చిపోగలరు? ఈ సినిమా తరువాత నిరుపా రాయ్ – అమర్ అక్బర్ ఆంథోని, మర్ద్, ముకద్దర్ కా సికందర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అమితాబ్‍కు తల్లిగా నటించారు. మన్‍మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో – సినిమా ప్రారంభంలోనే పిల్లల్ని, కంటిచూపుని పోగొట్టుకునే తల్లి పాత్రలో నిరుపా అద్భుతంగా రాణించారు. ఎన్నో కష్టాల అనంతరం విడిపోయిన కుటుంబం అంతా తిరిగి కలవడం గొప్పగా ఉంటుంది. ‘లాల్ బాద్‌షా’ చిత్రంలో మళ్ళీ ఆమె అమితాబ్‌కు తల్లిగా నటించారు. తల్లి పాత్రలో ఆవిడ వెండితెరపై కనబడడం అదే చివరిసారి.

 

1976లో ‘మా’ అనే సినిమాలో ధర్మేంద్రకి తల్లిగా అత్యంత భావోద్వేగాలు నిండిన పాత్రను పోషించారు. 1983లో ‘బేతాబ్’ చిత్రంలో ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్‍కి తల్లిగా నటించారు. వయసు తేడాని కనబడనీయకుండా, తల్లిగా నటించిన అన్ని సినిమాలోనూ అమ్మ పాత్రని రక్తి కట్టించారు.

 

నిరుపా రాయ్ అసలు పేరు కోకిల కిశోర్‌చంద్ర బుల్సారా. ఆమె గుజరాత్‌లోని వల్సాద్ లో 4 జనవరి 1921 నాడు జన్మించారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. నాలుగో తరగతి వరకే చదువుకున్నారు, ఆమెకి 15 ఏట పెళ్ళయిపోయింది. కమల్ రాయ్ అనే ప్రభుత్వోద్యోగిని వివాహం చేసుకున్నారు. నిరుపా అందమైన వ్యక్తి. సాధారణంగా భర్తతో కలిసి కూర్చుని దినపత్రిక చదువుకునేవారు. ఒకరోజు దినపత్రికలో ‘నటీనటులు కావలెను’ అన్న ప్రకటన చూశారు. సినిమాల్లో నటించేందుకు ఇద్దరూ బొంబాయి వెళ్ళారు. కానీ కోకిల (నిరుపా) మాత్రమే ఎంపికయ్యారు. కోకిల తన తెర పేరును నిరుపాగా మార్చుకున్నారు. నిరుపా మొదటి సినిమా ‘రనక్‍దేవి’ 1946లో విడుదలైంది. ఆ సినిమాని గుజరాతీ భాషలో తీశారు. నిరుపా తొలి హిందీ సినిమా ‘అమర్ రాజ్’ కూడా 1946లోనే విడుదలైంది. ఈ రెండు సినిమాల అనంతరం నిరుపా విజయవంతమైన నటిగా గుర్తింపు పొందారు, ప్రేక్షకుల అభిమానం, ఆదరణ పొందారు.

 

ఈనాడు నిరుపా రాయ్ అంటే తల్లి పాత్రలే గుర్తొస్తాయి. కానీ అంతకుముందు ఆవిడ హీరోయిన్‍గా నటించారు. తన కెరీర్ తొలినాళ్ళలో నిరుపా ఎన్నో సినిమాల్లో నాయికగా నటించారు. ఎన్నో హిందీ హిట్ సినిమాల్లో నటించారు, చాలా సినిమాల్లో ఆవిడే కథానాయిక. ‘దో బీఘా జమీన్’ చిత్రంలో కథానాయిక పాత్ర పోషించగా, ఆ సినిమా సూపర్ హిట్ అయి ఆమెకి ఎంతో పేరు తెచ్చింది. దీని తరువాత ఆమె త్రిలోక్ కపూర్‍తో 18 సినిమాల్లో నటించారు. అదే సమయంలో భరత్ భూషణ్, బాల్‌రాజ్ సహానీ, అశోక్ కుమార్‍ల సరసనా నటించారు. అన్నింటిలోనూ ఆమెవి ప్రధాన పాత్రలే. ‘టాంగేవాలీ’, ‘దో బీఘా జమీన్’, ‘గుణసుందరి’, ‘రాణి రూపమతి’, ‘గరమ్ కోట్’ సినిమాల్లో అద్భుతాలు చేశారు. 1951లో విడుదలయిన ‘హరహర మహాదేవ్’ చిత్రంలో నిరుపా పార్వతీదేవి పాత్రలో నటించారు. ఈ చిత్రంతో ఆమెకి దేవత ఇమేజ్ వచ్చేసింది. ఆ సమయంలో పార్వతీదేవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ సమయంలో నిరుపా ఇంటి ముందు ఎక్కడెక్కడి నుండో వచ్చిన జనాలు – ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు – క్యూలో నిల్చునేవారట. మూడు సినిమాలకి ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెల్చుకున్న ఏకైక నటి నిరుపా. మునిమ్‌జీ, ఛాయ, షెహనాయి – ఈ మూడు సినిమాలు.

బాలీవుడ్‍లో భావోద్వేగ పాత్రలు, బాధ పడే పాత్రలు పోషించిన నిరుపా నిజజీవితంలోనూ ఎన్నో బాధలు అనుభవించారు. సినిమాల్లోనే కాక నిజ జీవితంలోనూ ఆమె రోదించారు. నిజజీవితంలోనూ కొడుకుల వల్ల ఆమె కష్టాలు అనుభవించారు. యోగేష్, కిరణ్ అని ఆమెకు ఇద్దరు కొడుకులు. నిరుపా రాయ్ చిన్న కోడలు 2001లో కట్నం కోసం వేధిస్తున్నారని అత్తమామల మీద, బావగారి మీద కేసు వేసింది.  ఆ సమయంలో నిరుపా అరెస్ట్ అవ్వవలసిందే, కానీ త్రుటిలో తప్పిపోయింది. అదే సమయంలో ఆ కోడలు ఇంట్లో చాలా నల్లధనం ఉందని ఆరోపణలు చేసింది. అంతేకాదు, అత్తగారు తనని ఇంట్లోంచి బయటకి తోసేసిందని కూడా ఆరోపించింది. తెర మీద కొడుకుల దుష్ప్రవర్తన వల్ల బాధలు పడ్డ నిరుపా, నిజజీవితంలోనూ అటువంటి కష్టాలు అనుభవించారు. నిజజీవితంలోనూ ఆమెకు ఆమె ఇద్దరు కొడుకుల నుంచి ప్రేమ దక్కలేదు. వెండి తెర కొడుకుల కంటే దారుణంగా వేధించారామెను కన్నకొడుకులు.

13 అక్టోబరు, 2004 న ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు నిరుపా.  ఆమె మరణాంతరం ఆమె ఆస్తుల కోసం ఇద్దరు కొడుకులు కొట్లాడుకున్నారు. సినీ నటిగా కెరీర్ పూర్తిగా ఊపు అందుకోని సమయంలో 1963లో నిరుపా ముంబయి లోని నేపియన్ సీ రోడ్ లో ఒక ప్రాపర్టీని పది లక్షలకి కొనుగోలు చేశారు. ఇంత ఖరీదైన ప్రాపర్టీ ఈమేం చేసుకుంటుంది అని అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారుట కూడా. ఆ ప్రాపర్టీలో ఒక భవంతి మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ, భవనం చుట్టూ తోట ఎనిమిది వేల చదరపు అడుగుల వైశాల్యంలోనూ ఉన్నాయట. ఇప్పుడా ప్రాపర్టీ విలువ దాదాపు వంద కోట్లు. నిరుపా మరణం తర్వాత ఆమె ఆస్తంతా భర్త కమల్ పేరిట మారింది. కమల్ కూడా మరణించాకా కొడుకులిద్దరూ ఆ ఆస్తి కోసం గొడవలు పడ్దారు. అన్నయ్య యోగేష్ తనని బాగా ఇబ్బంది పెట్టాడనీ, అందుకే అమ్మానాన్నలు ఆస్తి తన పేర రాశారని చిన్న కొడుకు కిరణ్ చెప్పాడు. యోగేష్ మాత్రం దీని గురించి అసలేం మాట్లాడలేదు.

జీవితంలో అన్నీ ఉంటాయనీ, సినీతారల జీవనం సర్వ సౌఖ్యాలతో సాగుతుందని చాలామంది పొరబడతారు. అది పూర్తి నిజం కాదు. ప్రతీ నటి లేదా నటుడు చక్కని జీవితం గడపలేరు. తెరపై చక్కని పాత్రలు పోషించే స్టార్స్ – కొన్నిసార్లు నిజజీవితంలో చేదు సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారిలో నిరుపా ఒకరు.

***

నిరుపా సినిమాలలోని కొన్ని పాటలు:

https://www.youtube.com/watch?v=mwKc1KV78lM

https://www.youtube.com/watch?v=k02eUMFJUWE

https://www.youtube.com/watch?v=lGAZZUjNVg8


రాజసం ఉట్టిపడే నటి వీణ:

అలనాటి హిందీ సినీ ప్రేక్షకులను అలరించిన నటీమణుల్లో వీణ (4 జూలై 1926 – 14 నవంబర్ 2004) ఒకరు. వీణాకుమారి అనే పేరుతోనూ చిరపరిచితురాలైన ఈమె అసలు పేరు తాజౌర్ సుల్తానా. ఒకానొక సమయంలో వీరి కుటుంబం లాహోర్‍కి తరలి వెళ్ళి అక్కడ నివసించింది.

నటుడు – హీరో అయిన అల్ నసీర్‌ను వీణ 1947లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు జన్మించారు. అల్ నసీర్ భోపాల్‌కి చెందిన రాజకుటుంబానికి చెందినవారు. ఆయనకు అప్పటికే నటి మీనా షోరే తోనూ, మనోరమతోనూ పెళ్ళిళ్లు అయ్యాయి. వీణా, అల్ నసీర్ ఇద్దరూ ‘అమర్‍ సింగ్ రాథోడ్’ వంటి సినిమాలలో నటించారు. కానీ ఆ సినిమా పరాజయం పాలయ్యింది. అల్ నసీర్ 1957లో ధనుర్వాతం కారణంగా మృతి చెందారు.

వీణ బలూచిస్తాన్ లోని క్వెట్టాలో (నేటి పాకిస్తాన్) జన్మించారు. పదేళ్ళ క్రితం అదే రోజున మరో నటి నసీమ్ బాను జన్మించారు. వీరిద్దరి రూపురేఖలూ ఒకేలా ఉండేవి. ఇద్దరూ ప్రధానంగా 1940-50 దశకాలలోనే నటించారు.

అయితే నసీమ్ బాను సినిమాలనుంచి విరమించుకుని తన కుమార్తె సైరా బానుని నటిగా తీర్చిదిద్దారు, సైరా 1961లో ‘జంగ్లీ’ చిత్రంలో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఇదిలా ఉంటే వీణ తన నటనని కొనసాగించారు.

 

దేశ విభజనకి ముందరి సినిమాల్లో వీణ హీరోయిన్‍గా నటించారు. ఆమె 16 ఏళ్ళ వయసులో ‘గరీబ్’ అనే చిత్రంలో సినిమాల్లోకి ప్రవేశించారు. తరువాత ‘గవంధి’ (1942)లో నటించారు. ‘గరీబ్’ సినిమాని ఉర్దూలోనూ, ‘గవంధి’ చిత్రాన్ని పంజాబీలోనూ తీశారు. ‘గవంధి’ చిత్రానికి మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ‘గరీబ్’ సినిమాలో లత అనే పాత్రను, ‘గవంధి’ చిత్రంలో హీరో శ్యామ్ సరసన నాయికగా నటించారు. దేశ విభజనకి ముందు విడుదలైన హిందీ, ఉర్దూ చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తొలి రోజుల్లో ఆమె నజ్మా (1943), ఫూల్ (1945), హుమాయూన్ (1945). దేశ విభజనకు ముందు ఆమె నటించిన చివరి చిత్రం ‘రాజ్‌పుతానీ’ (1946). ఇందులో ఆమె సహాయక పాత్ర పోషించారు.

 

రాజసం ఉట్టిపడే రూపం, మర్యాద నిండిన ప్రవర్తన కలిగి ఉండడంతో ఆమెకు తరచూ రాజరిక పాత్రలూ లేదా ధనవంతుల కుమార్తె పాత్రలు లభించేవి. దేశ విభజన తర్వాత ఆమె భారతదేశంలో ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. నటన కొనసాగించి 1940లు, 1950లు, 1960లు, 1970లు, 1980ల తొలినాళ్ళ వరకూ నటించారు.

హలాకు (1956), చల్తీ కా నామ్ గాడీ (1958), కాగజ్ కే ఫూల్ (1959), తాజ్ మహల్ (1963) (ఈ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందారు), దో రాస్తే (1969),  పాకీజా (1972) ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. ‘పాకీజా’లో ఆమెది చాలా శక్తివంతమైన పాత్ర, ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సహనటులు అశోక్ కుమార్‌తో వివాదం కూడా రేగింది. ఈ సినిమాలో ఆమె నటన, సంభాషణలు పలికిన తీరు నాకెంతో ఇష్టం. రజియా సుల్తానా (1983) సినిమా తర్వాత, 1983లో ఆమె సినిమాలు విరమించుకున్నారు. ఈ సినిమాలో ఆమె రాణి షా తుర్ఖాన్ పాత్ర పోషించారు.

సినిమాలు విరమించుకున్న 21 సంవత్సరాలకి 2004లో 78 ఏళ్ళ వయసులో అనారోగ్యం కారణంగా బొంబాయిలో మరణించారు. 41 సంవత్సరాల (1942 – 1983) కెరీర్‍లో ఆమె 70కి పైగా సినిమాలలో నటించారు.

‘అఫ్సానా’ (1951) చిత్రంలోని పాట యూట్యూబ్‍లో చూడండి:

https://www.youtube.com/watch?v=9KRuAUEoBDo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here