అలనాటి అపురూపాలు-130

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మురిపించిన బాలనటి తబస్సుం:

బాలనటిగా బేబీ తబస్సుం బాల్యం విశిష్టమైనది, ఎందుకంటే మహామహులైన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, నర్గిస్‍లతో తెరను పంచుకున్నారామె. ‘బచ్‍పన్ కే దిన్ భులా నా దేనా’ (దీదార్, 1951) పాట – ఆమె ప్రభ దివ్యంగా వెలిగిపోయిన ఆనాటి రోజులని గుర్తు చేస్తుంది. హిందీ పరిశ్రమ వందేళ్ళ ఉత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఆమె వాటిల్లో 65 సంవత్సరాలు గడిపారు. తన పేరు లోని అర్థాన్ని నిజం చేస్తూ, ఆమె నవ్వులు పంచుతూనే ఉన్నారు.

ఆమె మాటల్లోనే:

‘జిందగీ కో సమఝో తో కుషియాఁ, వర్నా ఘమ్ కా దరియాఁ హై, సుఖ్ యా దుఖ్ కుఛ్ భీ నహీ, అప్నా అప్నా నజరియాఁ’

(జీవితాన్ని అర్థం చేసుంటే అంతా సంతోషమే, లేదంటే దుఃఖం. సుఖదుఃఖాలు లేనే లేవు, అంతా చూసే పద్ధతిలో ఉంటుంది)

దిలీప్ కుమార్:

నేను కిదర్ శర్మ గారి ‘జోగన్’ (1950) సినిమాలో నర్గిస్, దిలీక్ కుమార్ గార్లతో నటిస్తున్నాను. మొదట్లో దిలీప్ గారిని అంకుల్ అని పిలిచేదాన్ని. కాని త్వరలోనే ఆయన ‘భయ్యా’ అయిపోయారు. ఒకసారి మేం మహరాష్ట్రలోని ఆప్టే నది వద్ద షూటింగ్ చేస్తున్నాము. దిలీప్ భయ్యా నుదుటి మీద జుట్టు పడుతూండేది ఎప్పుడూ. తన జుట్టును ఇతరులు తాకడం ఆయనకి ఇష్టం ఉండదు. దాన్ని వెనక్కి లాగమని కిదర్ గారు నాతో అన్నారు. నేను అలాగే చేస్తూ – “బాబూజీ, మీ హెయిర్ స్టైల్ సరిచేసుకోండి, లేదంటే వీధుల్లో పిల్లలు మిమ్మల్నే అనుకరిస్తారు” అన్నాను. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ‘ర’ పలికేది కాదు. కిదర్ శర్మ గారు ‘ఓం ప్రభు శాంతి’ అనమని చెప్పినప్పుడల్లా నేను ‘ఓం ప్లభు శాంతి’ అనేదాన్ని. ఆయన సరిగ్గా వచ్చేవరకు రీ-టేక్ చేస్తునే ఉండేవారు. నాకు విసుగొచ్చి ‘అబ్ మల్ (మర్) జాయేంగే’ అన్నాను. దిలీప్ భయ్యా నవ్వేసి, “నువ్వెందుకు చావడం, పోవాల్సింది శర్మగారు” అన్నారు. ‘మొఘల్-ఏ-ఆజం’ సినిమాలో నేనూ ఉన్నాను. కానీ నా సీన్లన్నీ ఎడిటింగ్‍లో పోయాయి. ఆర్టిస్టులకి – మిగతా అందరికీ పెట్టే ఆహారం లాంటిది కాకుండా వారి నిర్దిష్టమైన ఆహారం వారికి ఇవ్వాలని దిలీప్ భయ్యా సూచించారు. అప్పటి నుంచి ఆయనకి, మధుబాలకి మొఘలాయి పదార్థాలు, దుర్గా ఖోటేగారికి మహారాష్ట్రియన్ పదార్థాలు, పృథ్వీరాజ్ కపూర్ గారికి పంజాబీ వంటకాలు, ఫైనాన్సియర్ షాపూర్జీ పాలోంజీకి పార్సీ ఆహారం వడ్డించేవారు. ఎవరి హృదయానికైనా దారి వారి కడుపు ద్వారా అని నేను తొలి రోజుల్లోనే గ్రహించాను.

రాజ్ కపూర్:

రాజ్ కపూర్ గారు నన్ను ‘బడీబీ’ అని పిలిచేవారు, ఎందుకంటే నేను పెద్దవాళ్ళల్లా మాట్లాడుతానుట. “జాగ్రత్త కిన్నీ (కిన్నీ మా ముద్దు పేరు), నీ వయసుని తెలియనివ్వకు, ఎందుకంటే నిన్ను పెద్దదానివనుకుంటారు” అనేవారు. పి.ఎల్. సంతోషి గారి ‘సంగ్రామ్’ (1950) సినిమాలో మా ఇద్దరి మీద ‘మేరా నామ్ భీమ్ పలాసి’ అనే పాటని చిత్రీకరిస్తున్నారు. నన్ను రాజ్ గారిని ఆపకుండా నాట్యం చేయిస్తున్నారు సంతోషి గారు. రాజ్ గారు అలసిపోయారు, కాస్త ఆపమని నన్ను గిల్లారు, కానీ నేనది గమనించకుండా నాట్యం చేస్తునే ఉన్నాను. ఇద్దరం బాగా అలసిపోయాం. ఓ రోజు రాజ్ గారు తాను ‘బర్సాత్’ సినిమా కోసం ద్వితీయ నాయికగా ‘నవాబ్ బానో’ అనే కొత్త హీరోయిన్‍ని పరిచయం చేస్తున్నానని, ఆమె పేరు ‘కిన్నీ’ అని పెడదామనుకుంటున్నాని మా అమ్మానాన్నలతో చెప్పారు. నాకేదో ఇబ్బంది అనిపించి, మారాం చేస్తూ, “వద్దు, వద్దు, నా పేరు మీ హీరోయిన్‍కి పెట్టద్దు” అన్నాను. సరేనని, ఆయన ఆమెకు ‘నిమ్మీ’ అని పేరు పెట్టారు. “నేను, దిలీఫ్, దేవ్ ఆనంద్‍ లలో నీకు ఎవరంటే ఇష్టం” అని రాజ్ అడిగేవారు. “మీరే” అనేదాన్ని. దిలీప్ భయ్యా ఇదే విధంగా అడిగినా, “మీరే” అనేదాన్ని. ఒకరోజు ఇద్దరూ వచ్చి, నా చేయి పట్టుకుని “మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టం” అని అడిగారు. నేను కంగారు పడ్డాను. ‘దిలీప్ భయ్యా’ అని చెప్పబోతుండగా, రాజ్ నాకు చాక్లెట్ చూపించారు. వెంటనే ‘రాజ్ అంకుల్’ అనేసాను.

అమితాబ్ బచ్చన్:

‘బచ్చా హో యాకీ బుడ్డా సబ్ కా కరార్ తు హై, జిస్తో ఫిజా నా ఆయే ఐసీ బహార్ తూ హై’

నేను రాసిన ఈ కవితని అమితాబ్‍కి అంకితమిచ్చాను. 1980-90లలో అమితాబ్, కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీలతో కలసి ఎన్నో స్టేజి షోలు చేశాను. ఒకసారి నాకు కాలు ఫ్రాక్చర్ అయింది, వీల్ చైర్‌లో ఉండి షోలో పాల్గొన్నాను. ఉన్నట్టుండి ఏదో గందరగోళం చెలరేగింది. అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. నేను బెదిరిపోయి, కాపాడమని అరిచాను. అప్పుడు రెండు చేతులు నా భుజాల మీద పడ్దాయి. నన్ను నా చక్రాల కుర్చీలోనే ఉంచి, సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళాయి. అతనే అమితాబ్. ఆ రోజే అతను నిజమైన సూపర్ స్టార్ అని గ్రహించాను. స్టేజ్ షో లలో అతను ఎప్పుడూ ‘మేరే అంగానేమే’ (లావారిస్) పాటకి డాన్స్ చేసేవాడు. ‘జిస్ కీ బీవీ మోటీ’ అన్న వాక్యాలొచ్చిన చోట నన్ను పట్టుకుని వేదిక పైకి లాగే వాడు. “మీరు కొంచెం బరువు తగ్గితే, నేను మిమ్మల్ని ఎత్తుకొని మోయగలను” అనేవాడు. జయ, అమితాబ్ లది చూడచక్కని జంట. నా ఇంటర్వ్యూలో ఒకసారి తమ జోడీ గురించి జయ బాగా చెప్పింది. తమ బంధం గురించి ఆమె ఘనంగా చెప్పకపోయినా, ఆ వ్యక్తీకరణలో వారి ప్రేమ గురించి తెలిసింది.

మధుబాల:

మధుబాలతో నేను నటించిన అనేక సినిమాలలో ‘ఆరామ్’ (1951) ఒకటి. ఒకసారి నేను ఆమెని “మీ సౌందర్య రహస్యం ఏమిటి?” అని అడిగాను. “బ్యూటీ ట్రీట్‍మెంట్ ఎప్పుడూ చేయించుకోవద్దు, అది తాత్కాలికం. పైగా కాస్మొటిక్స్ చర్మాన్ని పాడుచేస్తాయి. వీలైనంత కీర దోసకాయ తిను, దాని రసం తాగు, ముఖానికి రాసుకో” అని చెప్పారామె. నేనూ హీరోయిన్ అవుదామనుకున్నాను, కానీ కాలేకపోయాను. “మీ అమ్మానాన్నలు నీతో ఉన్నంత వరకూ – నువ్వు హీరోయిన్ కాలేవు” అని మధుబాల నాతో అన్నారు. తల్లితండ్రులకు బిడ్డలపై ఉండే అతి ప్రేమ చేటు చేస్తుందని ఆమె భావన. “పెళ్ళయ్యాకా, మళ్ళీ సినిమాల్లోకి రావద్దు. ఈ మేకప్ కూడా మద్యం లాగా ఓ వ్యసనం. యవ్వనం, కెరీర్‍లు తాత్కాలికం. నీ వ్యక్తిగత జీవితమే నీ గమ్యం” అని చెప్పారామె. మధుబాల ఎప్పుడూ తన తలని ఒక తెల్లని దుపట్టాతో కప్పుకునేవారు. ఆమెకి బాగా జబ్బు చేసినప్పుడు (ఆమె హృద్రోగంతో బాధపడ్డారు), నేను ‘మీరెంతో అందంగా ఉన్నారు’ అంటే విషాదంగా నవ్వేశారు. ఆమె చనిపోయినప్పుడు నేను, ఒ.పి.రాల్హన్, నర్గిస్ గారు అందరికన్నా ముందు వెళ్ళాం. మధుబాల గారి ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ శరీరం వడలిపోయింది. నర్గిస్ ఆమె కళ్ళు మూసి, కాలి వేళ్ళు ముడివేసి, శరీరమంతా చాదర్‍ని కప్పారు

నర్గిస్:

బాలనటిగా నా మొదటి సినిమా నర్గిస్‍గారితో (1946). అది నర్గిస్ గారి రెండో సినిమా. ఆమె చిన్న చెల్లెలి పాత్ర పోషించాను నేను.  అప్పుడు నా వయసు రెండేళ్ళు. తర్వాత ‘దీదార్’ (1951) సినిమాలో చిన్నప్పటి నర్గిస్ పాత్రలో నటించాను. చాలా ఏళ్ళ తరువాత ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ. “సునీల్ దత్‍ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు?” అని అడిగితే, అమె నవ్వేసి, “చిన్నప్పుడు నా ఒళ్ళో కూచుని ఆడిన తబస్సుం నన్ను ఈరోజు ఈ ప్రశ్న అడుగుతోంది” అంటూ నవ్వేసారు. “మదర్ ఇండియా సినిమా షూటింగ్‍లో జరిగిన అగ్ని ప్రమాదంలో దత్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడారు. ఆయనని మించిన మంచి జీవిత భాగస్వామి మరొకరు ఎవరు దొరుకుతారు?” అని చెప్పారు. నర్గిస్ గారి తల్లి జద్దన్ బాయి నర్గిస్ గారిని దిలీప్ కుమార్ గారికిచ్చి పెళ్ళి చేయాలనుకున్నారు. రాజ్ కపూర్, నర్గిస్‍ల మధ్య ప్రేమ అంటూ వచ్చిన వార్తలు విని ఆమె బాధపడ్డారు. కుమార్తెకి మంచి భర్త దొరకాలని ప్రార్థించారు. ఆమె ప్రార్థనలు ఫలించాయి. ఒకసారి ‘జోగన్’ సినిమా దూరదర్శన్‍లో వస్తోంది. నర్గిస్ ఫోన్ చేశారు. “కిమ్మీ, నేను అక్కడికి వస్తాను. అక్కడే వండుకుని, కలిసి సినిమా చూస్తూ తిందాం” అన్నారు. వారి వివాహం అయ్యాకా, నేను దత్ గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన నా పేరుని ‘తబస్సం’ అని పలికారు. “కాదండి, నా పేరు ‘తబస్సుం’ అని నేను సరిచేశాను. “అందుకే నేను దీన్ని నానమ్మ అంటాను” అన్నారు నర్గిస్. వెంటనే దత్ గారు వంగి ఆశీర్వదించమని కోరారు! నర్గిస్ అక్క చనిపోయినప్పుడు, ఆమె పార్థివ శరీరాన్ని పూర్తిగా హిందూ పెళ్ళికూతురిలా అలంకరించారు కానీ, ముస్లిం పద్ధతిలోనే అంత్యక్రియలు జరిగాయి. తరువాత దత్ గారు నేను చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మదర్ ఇండియా సినిమాలోని ‘దునియా మే ఆయే హైఁ తో’ పాట చూపించినప్పుడు ఆయన ఎంతగానో విలపించారు.

***

‘బచ్‍పన్ కే దిన్ భులా నా దేనా’ పాట యూట్యూబ్‍లో

https://www.youtube.com/watch?v=NTNzuUGMmUY


ప్రతిభశాలి నటి జయశ్రీ శాంతారామ్:

జయశ్రీ గుర్తింపు పొందిన నటి. ప్రముఖ దర్శకులు వి. శాంతారామ్ గారి రెండవ భార్య. ఆమె ప్రధానంగా హిందీ, మరాఠీలలో – తన భర్త దర్శకత్వం వహించిన సినిమాలలో నటించారు.

ఆమె 4 మార్చ్ 1924నాడు బొంబాయిలో మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రిగారు శాస్త్రీయ సంగీతాభిమాని. బాల్యం నుంటే నాట్యంలోనూ, గానంలోనూ ఆమె ప్రతిభ కనబరిచారు. తమ కూతురు కళాకారిణి అవుతుదని భావించిన తల్లిదండ్రులు చదువు గురించి పట్టుపట్టలేదు. ఆమె 12 ఏళ్ళ వయసులో ఓ గుజారాతీ నాటకంలో నారద మహర్షి పాత్ర పోషించి రంగస్థల ప్రవేశం చేశారు. ఆమె అద్భుతమైన ప్రతిభని గుర్తించిన జనులు – నాటకరంగంలో గొప్ప తార జనించిందని గ్రహించారు. రంగస్థలం నుంచి సినిమాలకి ఆమె ప్రస్థానం సాఫీగా సాగిపోయింది. ఆమె తొలి సినిమా మరాఠి చిత్రమైన ‘చంద్ర్రరావు మోరె’ (1939) నేషనల్ స్టూడియో వారి నిర్మాణం. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. అదే ఏడాది ఆమె ‘నందకుమార్’లో రాధగా నటించారు. తరువాత వచ్చిన ‘మాఝి లడకీ’ సూపర్ హిట్ అయింది. మరాఠీ చిత్రపరిశ్రమలో ఆమెకి పేరు తెచ్చిపెట్టింది. కొద్ది కాలానికే ఆమె దర్శకనిర్మాత వి.శాంతారామ్ దృష్టిలో పడ్డారు. ‘పడోసి’ అనే హిందీ చిత్రం ఆధారంగా ఆయన తీస్తున్న ‘షెజారి’ (1941) అనే మరాఠీ సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు, స్నేహం ప్రేమగా మారింది. 1940లో వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఆవిడ ఆయనకి రెండో భార్య.

 

వి. శాంతారామ్ తాను కొత్తగా స్థాపించిన రాజ్‍కమల్ కళామందిర్ బ్యానర్ పై నిర్మించి దర్శకత్వం వహించిన ‘శకుంతల’ (1943) – జయశ్రీ తొలి హిందీ సినిమా. ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషించారు. సినిమా విడుదలయ్యాకా, పెద్ద స్టార్‍లా ఆమెకి గుర్తింపు వచ్చింది. అమెరికాలో ప్రదర్శించిన తొలి భారతీయ సినిమా ఇదే. 1947లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ సినిమాను, నటీనటులను గొప్పగా ప్రశంసిస్తూనే, ‘ఓ మోటైన ప్రదర్శనం’ అని పేర్కొంది. ఈ సినిమా సూపర్ హిట్ అయి భారతదేశంలో ఒకే థియేటర్‍లో ఏకధాటిగా 104 వారాలు ప్రదర్శితమైంది. 1947 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ఈ సినిమా గ్రాండ్ ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయింది.

ఈ సంస్థ నుంచి వచ్చిన తరువాతి సినిమా ‘డా. కోట్నిస్ కీ అమర్ కహానీ’ (1946). ఇది కూడా సూపర్ హిట్ అయింది. జయశ్రీ అభిమానులు పెరిగిపోయారు. దీని తరువాత 1950 లో ‘దహేజ్’, 1952లో ‘పర్‌ఛాయీఁ’ వచ్చాయి.

 

1953లో జయశ్రీ ఒక ఇంటర్వ్యూలో ఇల్లే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. శాంతారామ్ గారితో కలిసి అమెరికా వెళ్ళినప్పుడు, మొదట వారి ప్రయాణం మూడు నెలలు మాత్రమే, ఎందుకంటే అప్పుడు అక్కడ ‘శకుంతల’, ‘డా. కోట్నిస్ కీ అమర్ కహానీ’  సినిమాలు ఆడుతున్నాయి. అక్కడ మరో నాలుగు నెలలు ఉండాల్సి వచ్చింది. మరికొన్ని రోజులు ఉంటే హాలీవుడ్ సినిమాలను అధ్యయనం చేయవచ్చని శాంతారామ్ గారు చెప్పినా, ఆమెకు కొంతమంది హాలీవుడ్ నటీనటులను పరిచయం చేస్తానని చెప్పినా – ఆమె ఇంక అక్కడ ఉండలేకపోయారు. ఇంటి కోసం, కుటుంబం కోసం భారతదేశం వచ్చేశారు. గానం, సితార్ వాయించటం, నృత్యం, కుటుంబం కోసం వంట చేయడం, మరాఠీ సాహిత్యం చదవడం ఆమె అభిరుచులు. షూటింగ్ లేని రోజుల్లో పొద్దున్నే లేచి పిల్లలని బడికి తయారు చేసేవారు. మధ్యాహ్నాలు హాయిగా విశ్రాంతి తీసుకుని, సాయంత్రాలు రాజ్‌కమల్ స్టూడియోకి వెళ్ళి టేబుల్ టెన్నిస్ ఆడేవారు. షాపింగ్ చేసేవారు. స్టూడియోలోని కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‍తో పని చేసేవారు. రకరకాల హెయిర్ స్టయిల్స్ పరీక్షించేవారు. ఆమెకి సినిమాలు చూడడం ఇష్టం. ఫలనా సినిమా చూడండని ఎవరైనా సూచిస్తే, శాంతారామ్ గారిని ఆ సినిమాకి బయల్దేరదీసేవారు. అయితే షూటింగ్‍ల సందర్భంగా తనని కూడా మామూలు నటిగానే పరిగణించడం ఒక్కటే భర్త మీద ఆమెకి ఉన్న ఫిర్యాదు. తనకి నప్పని పాత్రలను ‘నేను ఆ పాత్రకి నప్పుతాన’ని ఆమె వాదించినా సరే, ఆమెకు అసలు ఇచ్చేవారు కాదు శాంతారామ్. అయితే ఆయన మెల్లిగా నటి సంధ్య వైపు ఆకర్షితువడం గమనించి భర్త పట్ల possessiveness పెంచుకున్నారు.

 

వి. శాంతారామ్ గారి జీవిత చరిత్ర ‘ద మ్యాన్ హూ చేంజ్‌డ్ ఇండియన్ సినిమాస్’ రచించిన, వి. శాంతారామ్ గారి కూతురు మధుర జస్‌రాజ్ (మొదటి భార్య విమల్ సంతానం) ఈ దంపతులిద్దరూ ఎందుకు విడిపోయారో ఇలా చెప్పారు:

~

“నాన్న జయశ్రీగారితో పని చేస్తున్నప్పుడు మొదట్లో వారిది వృత్తిపరమైన సంబంధమే. ఆమెతో నాన్న ‘శకుంతల’ (1942) సినిమా తీశారు. అది బొంబాయిలో 104 వారాలు ఆడింది. తరువాత జయశ్రీ సూపర్ హిట్ ‘డా. కొట్నీస్‍కీ అమర్ కహానీ’లో నటించారు. జయశ్రీ గారి పిల్లలు [కిరణ్ శాంతారామ్ (బొంబాయి మాజీ షరీప్), తేజశ్రీ, రాజశ్రీ] మేమూ ఒకే కుటుంబంగా పెరిగాం. సినిమా ప్రదర్శనలకి కలిసే వెళ్ళేవాళ్ళం. రాజ్ కమల్ స్టూడియోస్ ప్రాంగణంలో టెన్నిస్, ఇతర ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే జయశ్రీ హజరై, ఆతిథ్యం ఇచ్చేవారు. నాన్న జయశ్రీ గారిని పెళ్ళి చేసుకున్నాకా కూడా మా వద్దకు వచ్చి రోజూ గంట సేపు గడిపి వెళ్తుండేవారు. మమ్మల్ని సర్కస్‌కి, ఐస్ షో కి, ఇంకా ఇతర ప్రదేశాలకి తీసుకువెళ్ళేవారు. మొత్తం కుటుంబం అంతా రెండు కార్లలో ఇరుక్కుని వెళ్ళేవాళ్ళం. ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ (సంధ్య) చిత్రం నిర్మాణం కోసం నాన్న – అమ్మవీ, జయశ్రీ గారివి బంగారు నగలు తాకట్టు కోసం అడిగారు. ఆ నగలన్నీ ఆయనిచ్చినవే కనుక, ఆయన వాటిని ఏమైనా చేసుకోవచ్చు అంటూ అమ్మ ఇచ్చేసింది. కానీ ఎందుకో జయశ్రీగారు ఇవ్వలేదు. ఇది వారిద్దరి మధ్య అపోహలకి దారితోసింది. నాన్న సంధ్య గారికి దగ్గరవుతున్నారని జయశ్రీ భావించారు. తన నగలని సంధ్యకి ఇచ్చి ఆమెతో స్నేహం చేసుకోవాలనుకున్నారు జయశ్రీ. కానీ సంధ్య – తాను నగలు ధరించనని, వాటిని తిరస్కరించారు. నాన్న, జయశ్రీ 13 నవంబర్ 1956 నాడు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 22న నాన్న సంధ్యని పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్న జయశ్రీ గారిని మరువలేకపోయారు, ఆమె కూడా నాన్నని మర్చిపోలేరని నా నమ్మకం.”

~

1960లలో జయశ్రీ గారిచ్చిన ఒక ఇంటర్వ్యూలో చదివాను, ఆమె తన కుమార్తె రాజశ్రీని, ఆమె కెరీర్‍ని పొడిగారు. కానీ అది తాత్కాలికమే అయింది. ఆమె కూతురు – రాజ్ కపూర్ సినిమా ‘ఎరౌండ్ ద వరల్డ్ ఇన్ 8 డాలర్స్’ చిత్రం షూటింగ్ సందర్భంగా గ్రెగ్ ఛాప్‌మన్ అనే అమెరికన్‌ ప్రేమలో పడ్డారు. తరువాత సినిమాలు మానేసి, అమెరికాలో స్థిరపడ్డారు.

జయశ్రీ తన మరో కుమార్తెతోను, కొడుకుతోనూ బొంబాయిలో ఉండిపోయారు.

జయశ్రీ 19 అక్టోబరు 2004నాడు బొంబాయిలో మృతి చెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here