అలనాటి అపురూపాలు-133

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అందాల తార సాధన:

ఆమె 1950, 60ల దశకాలలో మారుతున్న కాలానికి చెందినవారు. యువతీయువకులు తమని తాము ఆధునికంగా, సమకాలీనంగా వ్యక్తం చేసుకుంటున్న కాలానికి చెందినవారామె. ప్రేమలో పడి, వర్గ పోరాటాలు జరిపి, గెలిచిన కాలానికి చెందినవారు. ఆమే అందాల తార సాధన.

ఆమె తొలి సినిమా ఓ సింధీ చిత్రం. అందులో షీలా రమణికి సోదరిగా నటించారు. ఆమె తొలి హిందీ చిత్రం ‘లవ్ ఇన్ సిమ్లా’ (1960). ఈ సినిమాలో నిర్మాత తనయుడు, హీరో జాయ్ ముఖర్జీ సరసన నాయికగా నటించారు. ఈ సినిమాకి దర్శకుడయిన ఆర్.కె. నయ్యర్, తర్వాతి కాలంలో ఆమె భర్త అయ్యారు. ఆమె నుదురు విశాలంగా ఉండడంతో, ఆమె నుదుటిపై జుట్టు పడేలా చేశారట నయ్యర్. తర్వాత అదే ఆమె ట్రేడ్‍మార్క్ అయింది. నటి ఆడ్రే హెప్‍బర్న్‌ను కేశ శైలిని అనుకరించి ‘సాధన కట్’ అని పిలవబడిన ఆ కేశ శైలిని అమర్చారట నయ్యర్.

తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్‍ భానూ అతయ్యతో కలిసి ‘ఫ్యూజన్ చుడీదార్స్’ అనే దుస్తులని ప్రాచుర్యంలోకి తెచ్చారు సాధన. ఒకసారి ‘వక్త్’ సినిమాలో పాత్ర ధరించే దుస్తుల గురించి సాధనతో చర్చించడానికి వచ్చిన యష్ చోప్రా సాధన ధరించిన దుస్తులను చూసి అవెంతో బావున్నాయనీ, ఆ తరహా చుడీదార్లనే సినిమాలో వాడారు. అవెంతో జనాదరణ పొందాయి.

‘లవ్ ఇన్ సిమ్లా’ లో పాటలు ప్రాచుర్యం పొందాయి (ముఖ్యంగా ‘గాల్ గులాబీ కిస్ కే హైఁ’ అనే పాట). కొత్త హీరోయిన్‍ని పరిచయం చేయడంలో ముఖర్జీ గొప్ప విజయం సాధించారు.

60వ దశకంలో సాధన ఉన్నత స్థానంలోనే ఉన్నారు. నందా, బబిత, సైరా బాను, ఆశా పరేఖ్, షర్మిలా టాగోర్ వంటి వారు ఆమెతో ఎంతో పోటీ పడ్డారు. ఆ కాలంలోని అందరు ప్రముఖ హీరోలు – దేవ్ ఆనంద్, రాజేంద్ర కుమార్, షమ్మీ కపూర్, రాజ్ కుమార్, మనోజ్  కుమార్ – తదితరులతో నటించారు. అద్భుతమైన సంగీతం వల్ల ఆమె చాలా చిత్రాలు (మేరా సాయా, పరఖ్, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా, మేరే మహబూబ్, ఓ కౌన్ థీ, వక్త్) ఘన విజయం సాధించాయి. నైనా బరసే, లగ్ జా గలే, తూ జహా జహా చలేగా, మేరా సాయా సాథ్ హోగా, అభీ నా జావో చోఢ్ కర్ వంటివి గొప్ప హిట్‍లు. సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వంలోని ‘ఝుంకా గిరా రే బరైలీ కీ బాజార్ మే’ అనే పాటలో సాధనలోని చిలిపితనాన్ని మరచిపోలేం.

మోనాలిసా నవ్వు లాంటి నవ్వు కలిగిన ఈ నటి కొన్ని అద్భుతమైన రొమాంటిక్ పాటలలో నటించారు. ‘జహాన్ మే ఐసా కౌన్ హై’ (హమ్ దోనోం), ‘లగ్ జా గలే’ (ఓ కౌన్ థీ), ‘మేరా సాయా సాథ్ హోగా’, ‘నైనేం మే బదరా ఛాయే’ (మేరా సాయా) వీటిల్లో ముఖ్యమైనవి. “ఇంత మంచి పాటలు దొరకడం నా అదృష్టం. లతా మంగేష్కర్ నా పాటలను ఆమె కచేరీలలో పాడేవారు” చెప్పారు సాధన. తన తోటి నటీమణులతో తనకెలాంటి విభేదాలు లేవని చెప్పారు. “నేను, సైరా బాను, ఆశా పరేఖ కలిసి ఉండేవాళ్ళం. నిర్మాతలకి అందమైన నాయిక కావాలనుకుంటే సైరాని తీసుకునేవారు, నాట్యం బాగా చేసే నాయిక కావాలనుకుంటే ఆశాని తీసుకునేవారు. అభినయం కావాలంటే నన్ను ఎంచుకునేవారు. అందుకని మాకు శత్రుత్వం ఉండేది కాదు. ఆశా నేను ఇప్పటికీ టచ్‍లో ఉన్నాము. ఒకరి పుట్టినరోజులకు ఒకరం శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ప్రస్తుతం నేను వహీదా, ఆశా, నందా, హెలెన్ తరచూ భోజనానికి కలుస్తున్నాం. నేను, నందా పబ్లిక్ ఫంక్షన్‍లకి అసలు హాజరు కాము” చెప్పారామె.

మామూలు భారతీయ హీరోయిన్ పాత్రలకి నప్పేవారు కాదు సాధన. “మొదటగా నేను కాన్వెంటులో చదువుకున్నాను. రెండవది, నాది సాంప్రదాయక సౌందర్యం కాదు. కానీ నాలో ఏదో తాజాదనం ఉండేది” అన్నారామె. “నాకు నాట్యంలోనూ, నాటకీయతలోనూ ఇష్టం ఉందేది. నేను సింధీ కాలేజీలో చదుతున్నప్పుడు నేను ఒక నాటకంలో నటించాను. ఒకాయన ఆ నాటకాన్ని మాలో నలుగురిని – దేశ విభజన ఆధారంగా తీస్తున్న – ‘అబానా’ అనే ఒక సింధీ సినిమాలో నటింపజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సినిమా ప్రకటన పేపర్లో వచ్చింది. ఎస్. ముఖర్జీ (నిర్మాత) అది చూసి నన్ను సంప్రదించారు.” అని ఆమె గుర్తు చేసుకున్నారు. “ఎస్. ముఖర్జీ గారి ఫిల్మాలయ స్టూడియో కోసం నన్ను తీసుకున్నప్పుడు – ఆ సంస్థ అప్పుడే ప్రారంభమైంది. అందువల్ల కొత్త కెమెరా వచ్చినప్పుడు ‘ కెమెరా టెస్ట్ చేయాలి, సాధనకి మేకప్ వేయండి’ అనేవారు. అందువల్ల నేను మొదటిసారిగా ‘లవ్ ఇన్ సిమ్లా’ (1960) కోసం కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను కంగారు పడలేదు” అన్నారు. తరువాత బిమల్ రాయ్ గారి ‘పరఖ్’ సినిమా చేశారు సాధన. “ఆ సినిమాలో ‘ఓ సజనా బర్ఖా బహార్ ఆయే’ పాట చిత్రీకరిస్తున్నప్పుడు – నేను నూతన్ గారిలా అనిపిస్తున్నానని బిమల్‍దా అన్నారు. నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం. ఆమె ఎంతో సహజంగా ఉండేవారు, ఆమె వదనంలో ఒకరకమైన విషాదం వ్యక్తమయ్యేది” అన్నారు సాధన.

సాధనని ఎంతో అందమైన కళ్లు (మేరే మహబూబ్ చిత్రంలో బుర్ఖాలోంచి కనిపించే ఆమె కాటుక కళ్లను ఎందరో ప్రేక్షకులు అభిమానించారు).

సాధనకి ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. “ఒకరోజు నేను చీరలు కొనడానికి అమ్మతో కలిసి కళానికేతన్‍కి వెళ్ళాను. ఒక అరగంటలో అక్కడ దాదాపు 5000 మంది పోగయ్యారు. సిబ్బంది భయపడి – ‘మా షోరూమ్ అద్దాలు పగిలిపోతాయి’ అని అన్నారు. చివరికి వాళ్లు తలుపులు మూసేశారు. కానీ మేం బయటకు ఎలా వెళ్ళేది? పోలీసులని పిలిచారు. ఓ చిన్న ద్వారం గుండా మమ్మల్ని బయటకు తెచ్చి, తమ వాహనంలో మమ్మల్ని ఇంటి దగ్గర దింపారు. కళానికేతన్ సిబ్బంది ‘మేమే చీరలు ఇంటికి తెచ్చి చూపిస్తాము దయచేసి మీరు రావద్దు’ అని బ్రతిమాలుకున్నారు” చెప్పారు సాధన. అలాగే తాను ఒకసారి బుర్ఖా ధరించి స్నేహితురాళ్ళతో కలిసి చోర్ బజార్ వెళ్ళాననీ, అక్కడ ఓ కొట్టు యజమాని తనని గుర్తించి గట్టిగా అరిచాడని, తామంతా కారులోకి దూకి అక్కడ్నించి వచ్చేసామని చెప్పారు.

సాధన చాలా చిన్న వయసులోనే ప్రేమలో పడ్డారు. 16 ఏళ్ళ యువనటి తన తొలి సినిమా దర్శకుడితోనే (ఆర్.కె. నయ్యర్) ఆ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. “నాకు ఆయనంటే, ఇష్టం కంటే గొప్పదైన భావం కలిగింది. కాని నాపై ఆధారపడిన కుటుంబం ఉందని నాకు తెలుసు. దేశ విభజన తర్వాత ఆస్తులన్నీ వదులుకుని పాకిస్తాన్ నుంచి వచ్చాం. అందుకని మా ప్రేమని మనసులోనే దాచుకున్నాను. సినిమా షూటింగ్ అయిపోయింది. ఎవరి దారిని వారు వెళ్ళిపోయాం. ఆయన తన పనులు చేసుకున్నారు, నేను నా పనులు!” చెప్పారామె.

మరి హీరోల మాటేమిటి అని అడిగితే. “సమస్య ఏమిటంటే – వాళ్ళంతా పెళ్ళయిన వాళ్ళు – రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, శశి కపూర్, సునీల్ దత్, మనోజ్ కుమార్ – రాజేంద్ర కుమార్.. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి” అంటూ నవ్వేశారు సాధన. “మేము ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పని చేసేవాళ్ళం. ఇంటికొచ్చి మేకప్ తీసేసాకా, నేను బాగా అలసిపోయేదాన్ని. సోషల్ లైఫ్‍కి సమయం ఉండేది కాదు. పని, ఇల్లు – అంతే. నా హీరోలకి కూడా తెలుసు నేను ఆషామాషి అమ్మాయిని కాదని. షూటింగ్ విరామాలలో నేను పుస్తకాలు చదువుకునేదాన్ని. నేను అందరు హీరోలతోనూ బాగానే ఉండేదాన్ని, అయితే షమ్మీ కపూర్, రాజేంద్ర కుమార్ నా ఫేవరెట్లు. రాజేంద్ర కుమార్ గారితో చేసిన ‘ఆప్ ఆయే బహార్ ఆయే’ సినిమా 70లలో విడుదలయినప్పుడు ఫ్లాప్ అయింది. కానీ 11 ఏళ్ళ తరువాత మళ్ళీ విడుదలైనప్పుడు గొప్ప హిట్ అయింది” చెప్పారు సాధన.

తన భర్త నయ్యర్ గురించి చెబుతూ, “మొదటిసారి విడిపోయాకా, మా బంధం మళ్ళీ కలిసింది. ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి పెళ్ళి చేసుకుందామన్నారు. మా అమ్మానాన్నలకి ఈ పెళ్ళి ఇష్టంలేదు. కానీ నాన్న మాత్రం ‘జబ్ మియా బీవీ రాజీ తో క్యా కరేగా ఖాజీ’ అని అన్నారు. చివరికి అమ్మ కూడా ఒప్పుకుంది. నయ్యర్ గారి పాలి హిల్ ఇంట్లో మా నిశ్చితార్థం జరిగింది. నేను నిశ్చితార్థానికి రక్తవర్ణం బెనారస్ చీర కట్టుకున్నాను. వెయ్యిమందిని ఆహ్వానించాను. ఒక హీరోయిన్ నిశ్చితార్థానికి అంతమంది ఆహ్వానించడం ఓ విశేషం. మా పెళ్ళికి (1966) నేను వజ్రాలు, వెండి ఎంబ్రాయిడరీ చేసిన గులాబీరంగు చీర కట్టుకున్నాను, దానికి అదనంగా ‘మాజెంటా స్టోల్’ ధరించాను.” వివరించారు సాధన.

వివాహం తరువాత సాధన అప్పుడప్పుడు నటించారు. ‘ఏక్ ఫూల్ దో మాలి’, ‘ఇంతకామ్’, ‘గీతా మేరా నామ్’ (ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు) చిత్రాల్లో నటించారు. “నేను ‘గీతా మేరా నామ్’ తర్వాత నటన విరమించుకున్నాను, నాకు ఆరోగ్యం బావుండేది కాదు (ఆమె అప్పట్లో థైరాయిడ్ సంబంధిత వ్యాధితో బాధపడ్డారు). అది దృష్టి దోషమని కొందరు అన్నారు. చికిత్స కోసం అమెరికా కూడా వెళ్ళాను. నిర్మాతలు నన్ను తప్పించుకు తిరిగేవారు. పైకి వెళ్లినది, కిందకి తిరిగి రాక తప్పదని అర్థమయింది.” అన్నారు.

“సినిమాలు మానేసిన తర్వాత జీవితం ఆటంకాలు లేని సెలవు కాలంలా అయింది. పారిస్, అమెరికా, ఇంకా ప్రపంచమంతా తిరిగాను, సినిమాలు చూసాను, సాధారణ జీవితం గడిపాను. నా 15 ఏట తర్వాత, మళ్ళీ ఇప్పుడే నేను సెలవు తీసుకున్నది” అన్నారు 22 ఏళ్ళకే పెళ్ళి చేసుకున్న సాధన.

“మావారు భోజన ప్రియులు. నేను చైనీస్, యూరోపియన్, తదితర అన్ని రకాల వంటలూ నేర్చుకున్నాను. మేము బయట తినడం మానేశాం. ‘ప్రపంచంలోని ఉత్తమమైన ఆహారం ఇంట్లో తయారవుతుంది. మార్పు కోసం అయినా కూడా నేను నచ్చని పదార్థాలు తినను’ అని ఆయన అనేవారు. ‘వంటవాళ్ళు ఎంతమంది మారినా ఇంట్లో తయారయ్యే పదార్థాల నాణ్యత ఏ మాత్రం మారదు’ అని ఆయన నాకు గొప్ప ప్రశంస నిచ్చారు. వేసవి, వానాకాలం, చలికాలం – కాలం ఏదైనా దానికి తగ్గ వంటలు ఉండేవి. నెలలో కనీసం నేను 20 రకాల పప్పు వంటకాలు చేసేదాన్ని” చెప్పారు సాధన.

“మేం కూడా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాం. మా పెళ్ళయ్యాకా, నయ్యర్ గారి ‘యే జిందగీ కిత్నీ హసీఁ  హై’ పరాజయం పాలయింది.  తరువాత సినిమాలు – పతి పరమేశ్వర్, కత్ల్ వంటి సినిమాలు కూడా బాగా ఆడలేదు. ఎన్నో అప్పులు తీర్చాల్సి ఉంది. వాళ్ళ అప్పులు తీరుస్తానని అందరూ నా మీద భరోసా పెట్టుకున్నారు” అని చెప్పారు.

తన భర్త చనిపోయిన రోజును గుర్తు చేసుకుంటూ “ఆయనకి ఆస్తమా ఉండేది. ఆ రోజు మందు ఇచ్చినా ఎందుకో చాలా అసౌకర్యంగా ఉన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే లోగానే, స్పృహ తప్పారు. చనిపోవడానికి ఒక వారం ముందు ఆయన తన మరణాన్ని ఊహించారు. ‘నువ్వు దృఢమైనదానివి, గట్టి మనిషివి. కానీ నాకేదైనా అయితే కొద్ది రోజులు నీకు కష్టకాలం’ అన్నారు. ‘మరి నాకేదైనా అయితేనో’ అన్నాను. ‘అప్పుడు ఇంట్లో రెండు శవాలు లేస్తాయి’ అన్నారు. ‘నువ్వు లేకుండా నేను జీవించలేను’ అన్నారు” అని చెప్పారు సాధన.

1995లో భర్త మరణం తర్వాత, సిబ్బంది అందరికీ మూడు నెలల నోటీసు ఇచ్చి, నిర్మాణ సంస్థను మూసివేశారు.

తన విశ్రాంత జీవితం గురించి తరువాత ఇలా చెప్పారు:

“ఉదయాన్నే రెండు గంటలు తోటపని చేస్తాను. తర్వాత ఒక్కోసారి మసాజ్ చేయించుకుంటాను. మధ్యాహ్నం భోజనం తర్వాత క్లబ్‍కి వెళ్ళీ కార్డ్ ఆడతాను. సాయంత్రం టివి. చూస్తాను. సినిమా రంగానికి సంబంధించని కొందరు మిత్రులు కూడా ఉన్నారు” చెప్పారామె. తనకు సంతానం లేనందుకు బాధ లేదని అన్నారు. “ఇప్పుడు ఎందరో అమ్మలని చూస్తున్నాను. కొడుకుల వల్లనో, కోడళ్ళ వల్లనో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు వాళ్ళు. అప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు నా పట్ల జాలి చూపాడని. అయితే నాకేదైనా అయితే, ఎవరు లేరనే భయమూ ఉంది.  అయితే పిల్లలు ఉన్నవారు కూడా వాళ్లపై ఆధారపడలేరు” చెప్పారామె. “అయితే పుట్టిన ఐదు నిమిషాలకి నేనొక పాపని దత్తత తీసుకున్నాను (అధికారికంగా కాదు), పాప తన తల్లిదండ్రులతో కలిసి నాతోనే ఉంటుంది. ఆ పాప పేరు రియా. రియాకి ఇప్పుడు పదేళ్ళు. నేను తన నుంచి ఏమీ ఆశించను, కాని తను మాత్రం నాకెంతో ప్రేమను పంచుతుంది. నన్ను నానమ్మ అంటుంది. ఆ పిల్ల చదువుకి, పెళ్ళికి నేను ప్రణాళికలు వేశాను. నేను కర్మని నమ్ముతాను. మనం ఋణం తీర్చుకోవాలి. ఆశకి అంతే లేదు. నేను నా జీవితంలో అన్నీ చూశాను – దుస్తులు, ఆభరణాలు, డబ్బు. నాకు మెర్సీడెస్ అక్కరలేదు, ఓ చిన్న కారు చాలు. నేనే నడుపుకుంటాను. నేను ఒంటరితనాన్ని అస్సలు అనుభవించాను. సంతోషంగా ఉన్నాను” చెప్పారామె.

నిర్మాతలు ఆమె కేశ శైలిని మార్పించాలని చూశారు. కానీ విఫలమయ్యారు. తన అభిమానులు ఆ కేశ శైలి అలాగే ఉండాలని కోరుకున్నారనీ, అందుకే దాన్ని కొనసాగించానని చెప్పారామె. 70లలో తన చివరి ఐదు సినిమాలకి (ఒకటి ఆమె దర్శకత్వం వహించారు) కూడా ఆ కేశ శైలి కొనసాగింది. తన పూర్వపు రూపమే జనాలకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఆమె బహిరంగంగా కనిపించడం మానేశారు. ఆమె నివాసం ఉంటున్న ఇల్లు చట్టపరమైన వివాదాల్లో ఉందని వార్తలు వినిపించాయి. 2014లో రణబీర్ కపూర్‍తో కలిసి ఓ షో పాల్గొన్నారు సాధన. ఆ కేశ శైలి, ఆ హుందాతనం అలాగే ఉన్నాయి.

తర్వాతి రోజుల్లో సాధన ఆరోగ్యం పాడయ్యింది, కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. 2014లో నోటికి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా కె.జె.సోమయ్య మెడికల్ కాలేజి హాస్పిటల్‍లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

హై ఫీవర్‍తో హిందూజా హాస్పిటల్‍లో చేరిన సాధన 25 డిసెంబర్ 2015 నాడు కన్ను మూసారు. ముంబయిలోని ఓషివారా క్రెమెటోరియంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అనుష్క శర్మ, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, మాధుర్ భండార్కర్, లతా మంగేష్కర్ తదితరులు ఆమె మరణంపై విచారం వ్యక్తం చేశారు.

సాధన నటించిన కొన్ని పాటలు:

https://www.youtube.com/watch?v=BV0-rrdPJKw

https://www.youtube.com/watch?v=TFr6G5zveS8

https://www.youtube.com/watch?v=Wl0zG3XxmeI

https://www.youtube.com/watch?v=UcFVSXL93u8

https://www.youtube.com/watch?v=E5KJpGaXgwE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here