అలనాటి అపురూపాలు-134

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మధుర గాయని సుమన్ కళ్యాణ్‌పూర్:

పోటీ తీవ్రంగా ఉండే సినిమా ప్రపంచంలో, హిందీ నేపథ్య గాన రంగంలో తనదైన శైలిలో విశేషంగా రాణించారు సుమన్ కళ్యాణ్‌పూర్.

సుమన్ కళ్యాణ్‌పూర్ అసలు పేరు సుమన్ హెమ్మది. ఆమె ఢాకా (ఇప్పటి బంగ్లాదేశ్‍)లో 28 జనవరి 1937 నాడు జన్మించారు. ఆమె తండ్రి శంకర్ రావు హెమ్మది మంగుళూరుకు చెందిన సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. హెమ్మది అనేది కర్నాటక రాష్ట్రంలో ఉడిపి జిల్లాలోని కుందాపుర్ తాలూకాలోని గ్రామం. ఆమె తండ్రి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కీలక పదవిలో ఉండి చాలా కాలంపాటు ఢాకాలో పని చేశారు. సుమన్ తల్లి సీత హెమ్మది. ఈ దంపతులకు ఐదుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరందరిలోకి సుమన్ పెద్ద. 1943లో ఈ కుటుంబం బొంబాయికి మకాం మార్చింది. 1958లో సుమన్ ముంబయికి చెందిన రామానంద్ కళ్యణ్‌పూర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి సుమన్ కళ్యాన్‍పూర్ అయ్యారు. పెళ్ళయిన తరువాత ప్రతీ రికార్డింగ్‌కి ఆమె భర్త తోడుగా వచ్చేవారు. వారికి చారుల్ అగ్ని అనే కూతురు పుట్టింది. ఈమె వివాహం తరువాత అమెరికాలో స్థిరపడింది. సుమన్ మనవరాలు ఐక్షణి అగ్ని ఇండియాకి తిరిగి వచ్చి, తన అమ్మమ్మ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది.

పోలికలు రోతైనవి. అయితే మంగేష్కర్‌ల వలే సుమన్ సంగీతంలో జన్మించలేదు. అలాగే సంగీతం సదా వినిపించే వాతావరణంలో ఆమె పెరగలేదు.

సినిమాల్లోకి ఆమె ప్రవేశం కూడా అనుకోని పరిస్థితులలో జరిగినదే.

ఓ భిన్నమైన గాయని ఆమె, సినిమా వాతావరణానికి దూరంగా ఉన్నారు. నిజానికి ఆమె బాగా సిగ్గరి, అతి మర్యాదస్థురాలు, వినయశీలి. సుమన్ ‘నా తుమ్ హమే జానో’ పాడినప్పుడు, చాలామంది ఆ పాటని లతా మంగేష్కర్ పాడారని భ్రమపడ్డారు. తన శ్రావ్యమైన కంఠంతో, స్పష్టమైన గానంతో, స్వరశ్రేణుల సరైన ప్రయోగంతో సుమన్ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. తన గాత్రానికి లత గాత్రానికి పోలికలున్నా, సుమన్ ఎన్నడూ లతను అనుకరించలేదు. లతతో పాడిన ఓ యుగళగీతంలో ఆమెతో సమానంగా పాడారు కూడా. సుమన్ పాడిన ‘చలే జా, చలే జా’ అనే మాధుర్య గీతం ఇప్పటికీ సంగీత ప్రేమికులను అలరిస్తుంది.

పాటలు పాడాల్సిన పని లేనప్పుడు – సుమన్ – సాధారణ గృహిణిలానే ఇంటి పనులు చూసుకుంటారు.

తన గురించి తాను ఈ విధంగా చెప్తున్నారు సుమన్:

“సినిమాలకి నేపథ్య గానం పాడతానని నేనెన్నడూ ఊహించలేదు. అలా అని సినిమాలంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదు. నన్ను, నమ్మండి – నాకు పదిహేనేళ్ళు వచ్చేవరకు నేనసలు సినిమాలే చూడలేదు.

నాకు ఏడేళ్ళ వయసునుండే పాటలు పాడడం మొదలుపెట్టాను. కానీ ఎదుగుతున్న కొద్దీ డ్రాయింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, పూల అలంకరణ వంటి ఇతర అభిరుచుల మీదకి నా దృష్టి మళ్ళింది.

తరువాతి కాలంలో నూర్జహాన్ గారి గానం నా మీద ప్రభావం చూపింది. నాకిష్టమైన ఆవిడ పాటలను ఆవిడని అనుకరిస్తూ పాడుకునేదాన్ని. అందరం కలిసినప్పుడు మా కుటుంబ సభ్యుల ముందో, తోటి బడి పిల్లల ముందో పాడేదాన్ని.

అలాంటి ఒక సందర్భంలో నేను పాడుతుండగా ప్రభాత్ ఫిల్మ్ కంపెనీకి చెందిన ప్రసిద్ధ సంగీత దర్శకులు, ఆధునిక మరాఠీ సంగీతంలో దార్శనికులు అయిన కేశవ్‍రావు భోలె గారు విన్నారు. అప్పట్లో ఆయన ఆకాశవాణి బొంబాయిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‍గా ఉండేవారు, మా పొరుగింటిలో నివాసం.

నా స్వరం లలిత సంగీతానికి బాగా నప్పుతుందని, నాకు శిక్షణని ఇస్తానని ఆయన మా అమ్మానాన్నలతో అన్నారు. లలిత సంగీతంలో మౌలిక శిక్షణనిచ్చి, ఆయన 1953 తొలి రోజుల్లో నాతో రేడియోలో మొదటిసారిగా పాడించారు.

అయినా అప్పటికి నేను పెయింటర్‍ అవ్వాలనే అనుకున్నాను. పాఠశాల చదువు పూర్తి చేసి జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాను. ఇక్కడ నేను రెండో సంవత్సరం చదువుతున్నడు నేపథ్య గానంలోకి ప్రవేశించాను. మా విద్యా సంస్థలోని విద్యార్థులు, టీచర్లు కల్సి చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమం అది. అక్కడెందరో యువతీ యువకులు ఉన్నారు. అప్పుడు నా వయసు 17 ఏళ్ళు, నాకు చాలా సిగ్గుగా ఉండేది. ప్రేక్షకులలో తలత్ మహమూద్, మహమ్మద్ షఫీ వంటి ప్రసిద్ధ గాయకులు, సినీ ప్రముఖులు ఉన్నారు. నేనో ప్రసిద్ధమైన పాట పాడాను. ప్రేక్షకుల నుంచి చక్కని ప్రతిస్పందన, మెచ్చుకోలు లభించింది.

సంగీత దర్శకులు షఫీ గారికి నా గానం నచ్చినట్లుంది. అప్పటికప్పుడే నాకో అవకాశం ఇచ్చారు. ‘మంగూ’ అనే సినిమాకి నేపథ్య గాయనిగా కాంట్రాక్టు ఇచ్చారు.

మా ఇంట్లో అందరికీ కళల పట్ల, సంగీతం పట్ల ఆసక్తి ఉంది, కానీ వేదికలపై ప్రదర్శనలంటే అంగీకరించేవారు కాదు. అయినా, 1952లో వచ్చింది ‘ఆకాశవాణి’ వారి ఆఫర్ కాబట్టి నేను కాదనలేకపోయాను. దీని తర్వాత నాకు 1953లో విడుదలయిన మరాఠీ సినిమా ‘సుక్రాచి చాందినీ’ లో పాడే అవకాశం వచ్చింది. అదే సమయంలో నిర్మాత షేక్ ముఖ్తార్ ‘మంగూ’ సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకి సంగీత దర్శకుడు మహమ్మద్ షఫీ గారు. ఆయన ‘సుక్రాచి చాందినీ’ లోని నా పాటలు విని, ఇష్టపడి నాకు ‘మంగూ’లో అవకాశం ఇచ్చారు. నేను మూడు పాటలు పాడాను. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమాకి మహమ్మద్ షఫీ స్థానంలో ఓ.పి.నయ్యర్ సంగీత దర్శకులయ్యారు. నేను పాడిన మూడు పాటల్లో ‘కోయి పుకారే ధీరే సే తుజే’ అన్న జోలపాటని మాత్రమే సినిమాలో ఉంచారు.” చెప్పారు సుమన్.

‘మంగూ’లో పాటలు పాడిన అనంతరం, వెంటనే ఆమెకు నౌషాద్ ‘దర్వాజా’ (1954) చిత్రంలో అవకాశం ఇచ్చారు. సుమన్ ఆ సినిమాలో అయిదు పాటలు పాడారు. మంగూ కంటే ముందు ‘దర్వాజా’ విడుదల కావడంతో చాలామంది ఈ సినిమానే సుమన్ తొలి సినిమా అనుకుంటారు. అదే ఏడాది సుమన్ – ఓ.పి.నయ్యర్ కోసం – ‘ఆర్ ‌పార్’ సినిమాలో గీతాదత్, రఫీలతో కలిసి – ‘మొహబ్బత్ కర్ లో అజి కిస్నె రోకా హై’ అనే పాట పాడారు. అయితే ఈ పాటలో తనతో కేవలం రెండు మూడు వాక్యాలు పాడించి, తనని కోరస్‍లో పాడించినట్లుగా పాడించారని ఆమె అంటారు. నయ్యర్ గారి కోసం ఆమె పాడిన ఒకే ఒక పాట ఇది. సుమన్ తన తొలి యుగళ గీతాన్ని తలత్ మహమూద్‌తో కలిసి నౌషాద్ దర్శకత్వంలో ‘దర్వాజా’ (1954) చిత్రంలో పాడారు. ఒక సాంస్కృతిక కార్యక్రమంలో సుమన్ పాడడం అంతకుముందే తలత్ విని ఉన్నారు. అలాంటి కొత్త గాయనితో పాడడం ద్వారా సినీ పరిశ్రమ ఆమెను గుర్తించడంలో తలత్ తనవంతు పాత్ర పోషించారు. తరువాత ఆమె మియా బీబీ రాజీ (1960), బాత్ ఏక్ రాత్ కీ (1962), దిల్ ఏక్ మందిరి (1963), దిల్ హై తో హై (1963), షగూన్ (1964), జహాన్ అరా (1964), సాజ్ అవుర్ సవేరా (1964), నూర్ జహాన్ (1967), సాథీ (1968), పాకీజా (1971) వంటి గొప్ప చిత్రాలలో పాడారు. శంకర్ జైకిషన్, రోషన్, మదన్ మోహన్, ఎస్. డి. బర్మన్, ఎన్. దత్తా, హేమంత్ కుమార్, చిత్రగుప్త, నౌషాద్, ఎస్.ఎన్. త్రిపాఠీ, గులామ్ మహమ్మద్, కళ్యాణ్‍జీ ఆనంద్‍జీ,  లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి దిగ్దంతులైన సంగీత దర్శకులతో పని చేశారు. మొత్తం మీద సుమన్ 740 సినిమా, సినిమాయేతర పాటలు పాడారు. 1960వ దశకంలో సుమన్ – రఫీతో కలిసి దాదాపు 140 యుగళ గీతాలు పాడారు.

మహమ్మద్ రఫీ గారితో సుమన్

మరాఠీలో తొలి హిట్ పాట వసంత్ ప్రభు గారి ‘పసంత్ ఆహే ముల్గి’ సినిమా లోని ‘బాతుక్లిచా ఖేల్ మాండిలా’ అనేది. ఆ తర్వాత 20 ఏళ్ళ పాటు ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. పుత్ర వావా ఐసా, ఎక్తి, మానిని, అన్నపూర్ణ వంటివి ఆమెకు గుర్తింపు తెచ్చాయి. మరాఠీలోనూ ఆమె సినిమాయేతర పాటలు పాడారు భావగీత్, భక్తిగీత్ పేరిట. హేమంత్ కుమార్ గారి సంగీత దర్శకత్వంలో సుమన్ – లతా మంగేష్కర్ తో కలిసి ‘కభీ ఆజ్, కభీ కల్, కభీ పరసోం’ అనే యుగళ గీతాన్ని పాడారు. రఫీ తో పాడిన – ‘ఆజ్‍కల్ తెరే మేర్ ప్యార్ కే చర్చే’, ‘నా నా కర్తే ప్యార్’, ‘తుమ్ సే ఓ హసీనా’, ‘రహే నా రహే హమ్’, ‘పర్వంతో కే పేఢోం పర్ శ్యామ్ కా బసేరా హె’, ‘అజహునా ఆయే బలమా’, ‘తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’, ‘బడే ముద్దత్ కే యే గాడీ ఆయీ’, ‘దిల్ నే ఫిర్ యాద్ కియా’, ‘తుజ్ కో దిల్‌బారీ కీ కసమ్’, ‘చాంద్ తకతా హై ఇధర్’ వంటి యుగళగీతాలను పాడారు. మన్నా డే తో, దత్తరామ్ గారి సంగీత దర్శకత్వంలో సుమన్ ‘నా జానే కహా హమ్ థే’ అనే గొప్ప డ్యూయట్ పాడారు. ముకేశ్‍తో – ‘యే కిస్నే గీత్ ఛెదా’, ‘అఖియా కా నూర్ హై తూ’, ‘మేరా ప్యార్ భీ తూ హై’, ‘దిల్ నే ఫిర్ యాద్ కియా’, ‘షమా సే కోయీ కహ్ దో’ వంటి హిట్ పాటలు పాడారు.

సుమన్ ‘మానమోహన్ మన్ మే హో తుమ్ హీ’, ‘మేరే సంగ్ గా గున్ గునా’, ‘గిర్ గయీ రే మాథే కీ బిందియా’ వంటి శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలను గొప్పగా పాడారు. ఇవన్నీ గొప్ప జ్ఞాపకాలని ఆమె అంటారు. మజ్రూహ్ సుల్తాన్‌పురీ అద్భుతమైన పాటలను రాశారని ఆమె చెప్పారు. దాదా బర్మన్ తన పట్ల ఎంతో దయగా ఉన్నారనీ, రికార్డింగులో ఎంతగానో సహకరించారని, హిట్ అయిన ఒక పాట మేల్ వెర్షన్‌ పాటని ఫిమేల్ వెర్షన్ తనతో పాడించినందుకు ఆమె హేమంత్ కుమార్‍కు కృతజ్ఞతలు తెలిపారు.

సుమాన్ మాట్లాడుతూ, “నేను పాడిన ‘మేరే హమ్ ఓ సనమ్’ పాట ఘనత అంతా స్వరకర్త సర్దార్ మాలిక్‌ గారిదే. నాతో, రఫీ గారితో అద్భుతంగా పాడించారాయన. రఫీ గారు ఎంతో ప్రేమతో నాకు సహకరించారు. నా కన్నా ఎంతో గొప్ప గాయకుడయినప్పటికీ నన్ను అధిగమించాలని ప్రయత్నం చేయలేదు. రఫీ గారితో పాడడం ఎన్నటికీ మరిచిపోలేని గొప్ప అనుభవం. అది ‘తుమ్ నే పుకారా’ కానివ్వండి, లేదా ‘ఆజ్‌కల్ తేరే మేరే ప్యార్ మే’ కానివ్వండి, ఎంతో గొప్ప పాటలు. 1960 దశకం పాటల విషయంలో స్వర్ణయుగం అనుకోవచ్చు.  క్లాసిక్ సింగర్ మన్నా డే గారితో పాడడం నా అదృష్టం. అలాగే హేమంత్ కుమార్ గారితో, ముకేశ్ గారితో కూడా. వీరిలో ప్రతి ఒక్కరిది విశిష్టమైన ఘనత. వీళ్ళతో యుగళ గీతాలు పాడుతూ నేనెంతో నేర్చుకున్నాను. ఈ దిగ్గజాల స్వరంతో స్వరం కలిపేందుకు తగిన కృషి చేశాను. హేమంత్ కుమార్ గారి స్వరంలోని రొమాంటిసిజమ్‍ను అందుకునేందుకు ‘తుమ్ హీ మేరే మీత్ హో’ పాటలో ఎంతో కష్టపడ్దాను” అన్నారు.

“శంకర్ జైకిషన్‍లు నాకిష్టమైన సంగీత దర్శకులు. వారెంతో విశిష్టులు. గాయనీ గాయకులను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అలాగే ఎస్. డి. బర్మన్ గారంటే నాకెంతో గౌరవం. కళ్యాణ్‍జీ ఆనంద్‍జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ అంటే నాకెంతో అభిమానం. వీరు నా గానంతో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఉషా ఖన్నా, గణేశ్ వంటి స్వరకర్తలకు కూడా నేను ఋణపడి ఉన్నాను. వీరు లేకపోతే నాకు ‘పానీ మే జలే’, ‘మన్ భాయే’ వంటి హిట్ పాటలు లేవు.

అవి ఎంతో మంచి రోజులు. నేను పాడిన కొన్ని బెంగాలీ పాటలకీ చక్కని పేరొచ్చింది. ‘మూనే కరో అమీ నీ’ రొమాంటిక్ పాట అయితే, ‘ఆకాశ్ అజ్నా తబు’ అనేది ఎగిరే పక్షి పాడుకునే పాట. ‘బాదలేర్ మదల్ బాజే’ ఋతువుల రాకని సూచిస్తుంది. ‘అమర్ సప్నో దేఖర్ దుతి నయన్’ నాకెంతో ఇష్టమైన పాట. ‘దురే థేకో నా’ పాశ్చాత్య ధోరణిలో వేగంగా సాగే పాట. బెంగాలీలో – సలీల్ చౌదరి, నచికేత్ ఘోష్, సుధిన్ దాస్ గుప్తా, రతు ముఖోపాధ్యాయ, హేమంత ముఖర్జీ (హేమంత్ కుమార్) వంటి గొప్ప స్వరకర్తలు ఉన్నారు. వీరి దర్శకత్వంలో పాటలు పాడడమంటే ఎంతో గొప్ప.

కేశవరావ్ భోలే తర్వాత నేను ఎవరి వద్ద సంగీతం నేర్చుకోలేదు. కాకపోతే యశ్వంత్ దేవ్ మరాఠీ సంగీతంలోని కొన్ని సూక్ష్మాలను నేర్పారు. సుధీర్ ఫాడ్కే- ఖట్కా, ముఖ్రీ పాటలు ఎలా పాడాలో నేర్పారు. మాస్టర్ నవరంగ్, అబ్దుల్ రహమాన్ ఖాన్ లలిత శాస్త్రీయ సంగీతంలో రాణించేందుకు నన్ను సన్నద్ధం చేశారు. వీళ్లందరి వద్ద నేను మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు నేర్చుకున్నాను. అంతే” చెప్పారు సుమన్.

“1955లో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా (ఒకప్పటి HMV) కంపెనీ – రికార్డింగ్ కోసం నాతో ఒప్పందం కుదుర్చుకుంది. మా మొదటి డిస్క్ – మరాఠీ భక్తి పాటలు – ‘సావల్య విఠల తుజ్య దరి ఆలె’, ‘నంద ఘరి నందనవన్ ఫులాలే’ అనే రెండు పాటలతో వచ్చింది. వీటికి సుప్రసిద్ధ మరాఠీ స్వరకర్త దశరథ్ పుజారి సంగీతం అందించారు. సంగీతజ్ఞులు వీటికి గొప్ప గీతాలుగా కితాబునిచ్చారు.

తలత్ మహమూద్‍ గారితో సుమన్

గట్టిగా మాట్లాడి నా స్వరాన్ని అలసిపోయేలా చేయకూడదని నాకు మొదటి నుంచి తెలుసు. చలి, దగ్గు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. నేనేమీ ప్రత్యేకమైన డైట్ పాటించను, కాకపోతే రికార్డింగ్ ముందు రోజు మాత్రం, వేపుడులు, చల్లని పదార్థాలకి దూరంగా ఉంటాను. సినిమా పాటలకైతే రిహార్సల్స్ చేయను, కానీ ఇతర పాటలకి కాస్తంత హోమ్ వర్క్ చేస్తాను.

కాలక్రమంలో నేను హిందీ లోనే కాక, మరాఠీ, గుజరాతీ, కన్నడ, రాజస్థానీ, భోజ్‍పురి, మైథిలీ, ఛత్తీస్‌ఘఢీ, బ్రిజ్ భాషా, పంజాబీ, బెంగాలీ, అస్సామీ భాషలలో పాటలు పాడాను.

ఒకే ఒకసారి, అదీ కూడా అబ్దుల్ రెహమాన్ ఖాన్ గారి సలహా మేరకు HMV వారి కోసం రెండు ఠుమ్రీలు పాడాను.

సినీనేపథ్య గానం విషయానికి వస్తే, నేను నూర్జహాన్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమే నాకు ప్రేరణ. నాపై ఎంతో ప్రభావం చూపారు” అని చెప్పారు సుమన్.

సుమన్ స్వరానికి, లత స్వరానికి మధ్య పోలికలు ఉండడం యాదృఛ్ఛికం. అయినా సుమన్ స్వరంలో తనదైన తీయని మాధుర్యం ఉంది. తనకే సొంతమైన మధుర స్వరంతో ఆమె సినీ సంగీత ప్రియులను, భక్తి గీతాల ప్రియులను ఒకేలా ఆకట్టుకున్నారు.

పాశ్చాత్య శ్రోతల ముందు ప్రదర్శన ఇచ్చిన అతికొద్ది మంది భారతీయ గాయనీగాయకులలో సుమన్ ఒకరు. ఒక విదేశీ టీవీలో కనబడిన తొలి భారతీయ నేపథ్య గాయని కూడా సుమనే. 1961వ సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయని అవార్దు గెల్చుకున్నారు. అదే సంవత్సం ఆమె మహారాష్ట్ర గవర్నర్ నుంచి ఆ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో స్వర్ణపతకం స్వీకరించారు.

ఉత్తమ నేపథ్య గాయనిగా మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఆమెకు 1965లో, 1966లోనూ దక్కాయి. 1966 లోనూ, 1970లోనూ ఆమె ‘సుర్ సింగర్ సంసద్’ వారి ఉత్తమ గాయని అవార్డులు గెల్చుకున్నారు.

సుమన్ తన భర్తతో కల్సి రెండు సార్లు విదేశీ పర్యటనలు చేశారు. తన పర్యటనల గురించి ఆమె గొప్పగా చెప్పారు. “నా పర్యటనలు ముఖ్యంగా సాంస్కృతికపరమైనవి. నేను ఇంటికి కొంత విదేశీ ద్రవ్యం తెచ్చుకున్నా – ముఖ్యంగా మన ఘనమైన సంస్కృతి గురించి విదేశీయులకు కొంతైనా అవగాహన కల్పించానని అనుకుంటాను. విదేశాలకి వెళ్ళిన కళాకారులకి గొప్ప స్వాగతం లభిస్తుంది. విదేశీయుల సంస్కృతి, ఆతిథ్యం గొప్పవి. నా తుణీరంలో ఎన్నో భాషల పాటలు ఉన్నాయి. అందుకని వారి అభిరుచికి తగ్గ పాటలతో వారిని మెప్పించాను. మా ప్రోగ్రాం మూడు అంకాలుగా ఉండేది. నేను తొలి, చివరి అంకంలో పాడేదాన్ని. రెండవ అంకంలో వాయిద్య ప్రధాన సంగీతం ఉండేది. మా బృందం అంతా శ్రోతలను అలరించాము” అని చెప్పారు.

తాను పాటలు రోజులో ఒక పూటే పాడుతానని, అది ఉదయం కావచ్చు లేదా సాయంత్రమైనా కావచ్చు అనీ, మిగతా సమయంలో తాను ఇంటి పనులు చూసుకుంటానని, చిన్నప్పటి అభిరుచులను కొనసాగిస్తానని సుమన్ చెప్పారు.

వినయశీలి, వక్తగా కన్నా శ్రోతగా ఉండేందుకు ఎక్కువ ఇష్టపడే సుమన్‍కి వృత్తిపరమైన అసూయలు లేవు.

నిరాడంబరంగా ఉంటూ, దేశం పట్ల అమితమైన గౌరవం కలిగిన సుమన్ కళ్యాణ్‌పూర్ జాతీయ రక్షణ నిధుల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఎన్నో చారిటో షోలలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here