Site icon Sanchika

అలనాటి అపురూపాలు-136

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

దిగ్గజ నటుడు దిలీప్ కుమార్:

పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రసిద్ధ కిస్సా ఖ్వానీ బజార్ అనే సందులోని రెండంతంస్తుల భవనంలో 11 డిసెంబరు 1922న ఒక బాలుడు జన్మించాడు. ముహమ్మద్ యూసఫ్ ఖాన్ అని పేరు పెట్టారా అబ్బాయికి. అతను పెరిగి పెద్దవాడై భారతీయ సినిమాల తొలి ఖాన్ అయ్యాడు. లాలా గులాం సర్వార్ ఖాన్, అయేషా బేగం దంపతులకు జన్మించిన 12 మంది సంతానంలో యూసఫ్ ఒకరు. ఆరుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు. సర్వార్ ఖాన్ బొంబాయిలో స్థిరపడిన ధనవంతుడైన పండ్ల వ్యాపారి. తన పిల్లలందరినీ బాగా పెంచారు. వీరిలో యూసఫ్, అతని తమ్ముడు నసీర్ ఖాన్ సినీరంగలో హీరోలయ్యారు. ఆ యూసఫే దిగ్గజ నటుడు దిలీప్ కుమార్.

డియోలాలీ లోని బార్నెస్ స్కూల్‍లో చదువుకున్నారు. పెషావర్‍లో ఉండగా తమతో కల్సి పెరిగిన రాజ్ కపూర్‌ని బొంబాయిలో కలిసారు. ఇద్దరూ బొంబాయిలోని విల్సన్ కాలేజీలో రెండేళ్ళు కలిసి చదివారు. రూపసి అయిన దిలీప్‍ని కాలేజీ నాటకాలలో నటింపజేయాలని రాజ్ ప్రయత్నించి విఫలమయ్యారట. కాలేజ్ చదువు ముగిసాకా, దిలీప్ భారత్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలని ప్రయత్నించారట. కానీ తండ్రితో చిన్న వాదన జరిగి, ఇల్లు వదిలి వెళ్ళవలసి వచ్చిందట. అప్పుడు పూనేలో ఒక చిన్న క్యాంటిన్‍లో సహాయకుడిగా పనిచేశారు. ఒక ఏడాది పని చేసి కొంత డబ్బు ఆదా చేసుకునే సమయానికి ఆ క్యాంటిన్ మూత పడింది. అదే సమయంలో ఆయనకి సినిమాల్లో అవకాశం వచ్చింది.

దిలీప్ సెలవల కోసం నైనిటాల్ వెళ్ళగా, అక్కడ ఓ స్నేహితుడు దేవికారాణి గారికి పరిచయం చేశాడు. ఆమె అప్పటికప్పుడు దిలీప్‍కి స్క్రీన్ టెస్ట్ చేయించి –  బాంబే టాకీస్ బ్యానర్ పై తాము తీస్తున్న ‘జ్వార్‍ భాటా’ (1944) సినిమాకి ఎంపిక చేశారు. తనకి నటన అంటే ఏమీ తెలియదని దిలీప్ అన్నారట. అయితే దర్శకుడు అమియ చక్రవర్తి – అన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త భగవతి చరణ్ వర్మ – యూసఫ్‍కి ‘దిలీప్ కుమార్’ అని పేరు పెట్టారు. అది ఆయనకు కలిసొచ్చింది. బాంబే టాకీస సంస్థతో పని చేసిన కాలంలో ఆయనకు నెలకు 625 రూపాయల జీతం లభించేది. అయితే, 1952 నాటికి సినిమాకి లక్షన్నర రూపాయలు అందుకునే స్థాయికి ఎదిగారు దిలీప్.

దిలీప్ నటుడికన్నా ఎక్కువ. 54 ఏళ్ళ కెరీర్‍లో చేసిన 65 సినిమాలతో ఒక తరం నటులని ప్రభావితం చేసిన సంస్థ అనవచ్చు. ‘జ్వార్‍ భాటా’ (1944) తో మొదలైన కెరీర్‍లో మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా, ఆ సినిమా ఆయన కళ్ళ లోని తీవ్రతని అందరికీ పరిచయం చేసింది. తరువాత చేసిన మరో రెండు సినిమాలు పరాజయం పాలవగా, నాల్గవ సినిమా – నూర్జహాన్‍తో నటించిన ‘జుగ్ను’ (1947) పెద్ద హిట్ అయింది. తర్వాత 1948లో వచ్చిన షహీద్, మేళా సినిమాలు కూడా పెద్ద హిట్‍లయ్యాయి. అయితే జుగ్ను, షహీద్ సినిమాలు – అవి విడుదలైన ఏడాది అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలు.

అయితే ఒక నటుడిగా దిలీప్‍ని స్థానాన్ని పదిలం చేసిన సినిమా మరో ఐదేళ్ల తరువాత వచ్చింది. అదే నర్గిస్, రాజ్ కపూర్ లతో నటించిన ‘అందాజ్’ (1949). విషాదం ఆయనకి బాగా నప్పడంతో, ఆయనకి ట్రాజెడీ కింగ్ అని పేరొచ్చింది. ఈ విషాదానికి మూలలు పెషావర్‌లో ఆయన గడిపిన బాల్యంలో ఉన్నాయని తన ఆత్మకథ ‘Dilip Kumar – The Substance and the Shadow!’లో పేరొన్నారు.

ఆ కథ ఏంటంటే – చిన్నప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నారట. ఒక ఫకీర్ గుమ్మం వద్దకు వచ్చి ఈ పిల్లాడిని చూసి, భవిష్యత్తు చెప్పారట. “ఈ పిల్లాడు గొప్ప కీర్తి సాధిస్తాడు. చెడు దృష్టి నుంచి ఇతన్ని కాపాడుకోండి” అన్నారట. అప్పటి నుంచి వారి నాయనమ్మ ఆయనని ఇంటి నుంచి బయటకి వెళ్ళాలంటే – నుదుటన మసి బొట్టు పెట్టుకుంటే గాని వెళ్ళనిచ్చేవారు. దీనివల్ల స్నేహితులు హేళన చేసేవారట. అందువల్ల అందరికీ దూరమయ్యాననే వేదన ఆయనలో అధికమై, అది సినిమాల్లో వ్యక్తమయ్యేది.

దిలీప్ కుమార్ డైలాగ్ డెలివరీ పద్ధతితో – రంగస్థలం మీద సంభాషణలు చెప్పడంలా – సినిమాల్లో చెప్పే పద్ధతి పోయింది. స్వల్ప భేదాలు, విరామాలు, గుసగుసలు, ఇంకా నిశ్చలత్వం. దిలీప్ కుమార్ ప్రదర్శించినట్లుగా నిశ్చలత్వాన్నీ, మౌనాన్ని మరొకరు ప్రదర్శించలేకపోయేవారు. తలత్ మహమూద్ గానం చేసిన ‘షామ్-ఏ-గమ్ కీ కసమ్’ (ఫుట్‍పాత్, 1953) పాటలో ఒంటరితనాన్ని అంత బాగా ఎవరు అభినయించగలరు? లేదా ముకేశ్ ఆలపించిన ‘యే మేరా దీవానాపన్ హై’ (యెహుదీ, 1958) పాటలో విరహతాపంతో ఉన్న యువరాజుగా మరెవరు అంత గొప్పగా నటించగలరు? దిలీప్ కుమార్ నటన ఉన్నత శిఖరాలకు చేరుతున్నా, ఆయన ఒకదాని వెంట ఒకటిగా వరుసగా ధరిస్తున్న విషాద పాత్రల వల్ల ఆయన మానసిక ఆరోగ్యం కాస్త దెబ్బతింది. అప్పుడు వైద్యుడు – విషాద పాత్రలు కొన్నాళ్ళు ఆపి హాస్య పాత్రలు, తేలికపాటి పాత్రలను ప్రయత్నించమన్నారట. ఆ తరువాత సిని ప్రపంచం దిలీప్ లోని మరో కోణాన్ని చూసింది. రామ్ ఔర్ శ్యామ్, కోహినూర్ తదితర చిత్రాలలో హాస్యంగా, అల్లరిగా, రఫ్‍గా ఉండే పాత్రలలో కొత్త దిలీప్‍ని చూశారు.

దిలీప్ కుమార్ నటనని అధ్యయనం చేయడమంటే – దేశ విభజన యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే. ఆయన ధరించిన పాత్రల ద్వారా మానవ జీవితాలలోని, మానవ సంబంధాలలోని వైరుధ్యాలను ప్రదర్శించారు. అందాజ్ లోని నిర్భంధ ప్రేమికుడైనా, దేవదాస్‍లోని విఫల ప్రేమికుడైనా లేదా – నైతికత లోపించిన అమర్, ఫుట్‌పాత్ లోని పాత్రలైనా – దిలీప్ ఏకైక సత్యానికి పరిమితం అవాలనుకోలేదు. పెద్ద స్టార్ అయిన తరువాత కూడా ఆయన మూస పాత్రలను అంగీకరించలేదు. తెరపై సహజత్వాన్ని ఆవిష్కరించేవారు.

ఆయన వస్తువులు, స్థలాలతోనూ అభిమానం పెంచుకునేవారు. తరానా, ముసాఫిర్, మధుమతి, గంగా జమున వంటి సినిమాల్లో దిలీప్ ప్రకృతిలోని వస్తువులతో మాట్లాడుతారు – తన చొక్కా గుండీతో ఆడుకుంటారు – స్లీవ్ మడతతో మాట్లాడుతారు. ఒక డైలాగ్ లోని ముఖ్యమైన పదాలను మళ్ళీ మళ్ళీ చెప్తారు. ఉన్నట్టుండి ఓ డైలాగ్ మధ్యలో ఓ లయబద్ధమైన పాటని అందుకుంటారు. ఫలితంగా ఆ పాత్ర అత్యంత హుషారుగా ఉండి, అందరినీ ఆకర్షించేది.

కాలక్రమంలో ఇవి ఆయన మేనరిజంగా మారాయి. అయితే ఎంతమంది ‘రామ్ ఔర్ శ్యామ్’ చిత్రాన్ని ఒక నటుడి అంతర్గత స్వేచ్ఛను పొందే ప్రయత్నంగా చూస్తారు?

దిలీప్‍లో ఒక మెజీషియన్, ఒక పెయింటర్ లక్షణాలున్నాయి. అయితే దిలీప్‍ని నటనలో ఓడించడానికి ప్రయత్నించినవారు లేకపోలేదు. ‘పైగామ్’ లో మోతీలాల్ ఓ వివేకవంతుడైన పెట్టుబడీదారుడి పాత్రలో – దిలీప్‍ని పరీక్షిస్తారు. ‘దేవదాస్’ లో కూడా మోతీలాల్ దిలీప్‍ని మునివేళ్ళపై నిలబెడతారు. అలాగే తర్వాతి కాలంలో ‘సంఘర్ష్’ సినిమాలో సంజీవ్ కుమార్, బాలరాజ్ సహానీ కూడా దిలీప్‍కి గట్టి పోటీ ఇచ్చారు.

‘సంఘర్ష్’ సినిమాలో ‘మేరే పైరోం ఘుంఘ్రూ’ పాటలో అద్భుతంగా నటిస్తారు దిలీప్. అలాగే ‘గంగా జమున’లో ‘నైన్ లడ్ జయీ హై’ అనే పాటలో గ్రామీణుడిగా గొప్పగా అభినయిస్తారు. ఈ సినిమాలో ఆ పాత్రలోని వైరుధ్యాలను గొప్పగా ప్రదర్శించారు.

1962లో బ్రిటీష్ డైరక్టర్ డేవిడ్ తాను తీస్తున్న ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ చిత్రంలో ‘షరీఫ్ అలీ’ పాత్రని మొదట దిలీప్‍నే అడిగారు. కానీ ఆ సినిమాలో నటించేందుకు దిలీప్ అంగీకరించలేదు (తరువాత ఆ పాత్ర ఈజిప్టు నటుడు ఒమర్ షరీఫ్‍కి దక్కింది. ఆ పాత్రలో తన కంటే ఒమర్ షరీఫ్ బాగా నటించారని దిలీప్ తన ఆత్మకథలో పేర్కొన్నారు). అలాగే ఎలిజబెత్ టేలర్ సరసన ‘తాజ్‌మహల్’ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది, కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది.

1960వ దశకం వచ్చేసరికి దిలీప్ కుమార్ స్థానానికి రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్ ల రూపంలో గట్టి పోటీ ఎదురయ్యింది. అందుకని దిలీప్ ఓ ఐదేళ్ళ పాటు విరామం తీసుకున్నారు.

తరువాత 1981లో ‘క్రాంతి’ సినిమాతో కారెక్టర్ యాక్టర్‍గా పునఃప్రవేశం చేశారు. ఆ ఏడాది ఆ సినిమా గొప్ప హిట్ అయింది. ఆ తరువాత వచ్చిన సుభాష్ ఘయ్ ‘విధాత’, రమేష్ సిప్పీ ‘శక్తి’  (దిలీప్, అమితాబ్ కలిసి నటించిన తొలి, ఏకైక చిత్రం) గొప్ప హిట్ అయ్యాయి. ఆయన ఆఖరి చిత్రం 1998లో వచ్చిన ‘ఖిలా’. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది.

‘శక్తి’ సినిమాలో అమితాబ్ బచ్చన్ దిలీప్‍కుమార్ నటనకి సరితూగేలా నటించారు. రమేష్ సిప్పీ తీసిన ఈ సినిమాలో దిలీప్ అమితాబ్‍కి తండ్రిలా నటించారు. తల్లి మరణించినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరూ మౌనంగా రోడిస్తారు. ఈ సన్నివేశంలో సంభాషణలు ఉండవు. ఈ ఇద్దరు నిశ్శబ్దంగా తమ బాధని గొప్పగా వ్యక్తం చేస్తారు. నిజానికి ఈ సన్నివేశంలో ఒక డైలాగ్ ఉందనీ; కానీ తరువాత అది అసంబద్ధంగా ఉందని సంభాషణల రచయిత జావేద్ అఖ్తర్ భావించారట. ఆ సన్నివేశంలోని తీవ్రతని ఆ గొప్ప నటులిద్దరూ తమ కళ్ళ ద్వారానే పలికించారు.

రాజ్ కపూర్‌ది మూకీ సినిమాల నాటి చాప్లిన్ శైలి అయితే, దిలీప్‌ది వాస్తవిక శైలి. తాను పోషించే ప్రతీ పాత్రనీ తాను అనుభవించి, నటించేవారు. ఈ శైలికి మెథడ్ యాక్టింగ్ అని పేరు. దీనిలో నియంత్రణ, తీవ్రత ఉంటాయి. అవి నటుడి అభినయంతో తెరమీద వ్యక్తం అవుతాయి.

దిలీప్ కుమార్ actor’s actor అన్న విషయం ఎక్కువ మందికి తెలియదు. ‘కిస్సా’ అనే పంజాబీ సినిమాలో నటించేటప్పుడు నటి తిలోత్తమ షోమ్‌కి ఆ సినిమా దర్శకుడు అనూప్ సింగ్ – దిలీప్ కుమార్ నటించిన – ఆన్, తరానా సినిమాల డివిడిలు ఇచ్చి బాగా అధ్యయనం చేయమన్నారట. ఆ సినిమాలో ఆమెది జటిలమైన పాత్ర. మగాడిలా దుస్తులు ధరించే స్త్రీ పాత్ర. “తిలోత్తమకి బాడీ లాంగ్వేజ్ విలువ తెలియజేయాలనేది నా ఉద్దేశం. అంతర్గత అస్థిరతని ప్రదర్శించడంలోని ఇబ్బందిని అధిగమించడం తెలియజేయాలనేది నా ప్రయత్నం” అన్నారు అనూప్. ఓ ట్రాజిక్ హీరోగా పేరుగాంచిన దిలీప్ – ఆన్ సినిమాలో – హుషారైన రైతుగా పరివర్తనం చెందడం చూసి అబ్బురపడ్డారట తిలోతమ్మ.

తన జీవిత కాలంలో దిలీప్ కుమార్ – ఏ నటుడు పొందలేని విధంగా – ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు. ప్రారంభించిన తరువాత మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్దు ఆయనకే (దాగ్ చిత్రానికి) వచ్చింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు అందజేసి గౌరవించింది. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందారు. 1998లో పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్-ఎ-ఇంతియాజ్’ ఇచ్చి ఆయనను గౌరవించింది.

పాకిస్తాన్ లోని పెషావర్‌లో వారి శిధిలమవగా, దాన్ని మరమత్తు చేసి ఆధునికీకరించవలసిందిగా రెండు దేశాల ప్రజలు కోరడంతో, పాకిస్తాన్ ప్రభుత్వం మరమత్తులు చేయించి 2014లో ఆ భవనాన్ని జాతీయ వారసత్వంగా ప్రకటించి, దాన్ని మ్యూజియమ్‍గా మార్చింది.

ఆయన జీవితం కూడా సినిమాలానే గడిచింది. జూన్ 30 2021న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే, ఆయనని ముంబయిలోని హిందూజా హాస్పిటల్‍లో చేర్చారు. 7 జూలై 2021న ఉదయం 7.30కి ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకి 98 ఏళ్ళు. ఆయన భార్య ప్రముఖ నటి సైరా బాను.

Exit mobile version