అలనాటి అపురూపాలు-137

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి నర్గిస్ డైరీలోని కొన్ని పేజీలు:

దక్షిణాఫ్రికా లోని డర్బన్ నుంచి ఒక అభిమాని ఈ మధ్య నాకు ఉత్తరం రాశారు. “ఫిల్మ్‌ఫేర్ 1958లో – నా డైరీలోని పేజీలు – శీర్షికన – మీరు రాసిన వాటిల్లో ఈ వ్యాకాలు చదివిని నేను భావోద్వేగానికి లోనయ్యాను  – ‘ఆమె ఎవరికీ తెలియదు, నాకు మాత్రమే, నాకే ఆమె తెలుసు. ఎందుకంటే నేను ఆమె ఆత్మని’.  ఇవి చదివాకా, మీకీ ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాను” అన్నాడాయన.

రచన చివర్లో రాసిన ఈ వాక్యాలు ఆయనను కదిలించినట్లున్నాయి. అందుకే ఉత్తరం రాశారు.

అటువంటి ఉత్తరాలను సినీ స్టార్స్ తరచూ అందుకుంటారు – కొన్ని నేరుగా ఇంటి చిరునామాకే వస్తాయి, మరికొన్ని వార్తాపత్రికల కార్యాలయాల నుంచో, సినీ పత్రికల కార్యాలయాల నుంచో వస్తాయి.

సినీ నటుడి జీవితంలో ఒక దశ ఉంటుంది – అప్పుడు అతని సమయమంతా ఇంటికి, స్టూడియోకి మధ్య తిరగడానికే సరిపోతుంది. బయటి వ్యక్తులను చూడడానికి, కలవడానికి వీలు చిక్కని ఆ సమయంలో ఎవరైనా అభిమాని ఉత్తరం రాస్తే సాధారణంగా పక్కకు పెడతారు, ఎందుకంటే తాము గడిపే జీవితం వల్ల గాని లేదా తామెలాంటి వ్యక్తులుగా ఉండాలనుకుంటారనేదాన్ని బట్టి గాని, లేదా తాము వెంట తిరిగే వ్యక్తులను బట్టి గాని అతడు సమాజానికి కాని, తమపక్కింటి వాళ్ళకి కాని బాధ్యులు కాడు.

అందువల్ల, ఓ నటుడు తెర మీద ఓ విధమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే, ప్రేక్షకులు దాన్ని మెచ్చుకుంటారు, అతనికి బోలెడు డబ్బు వస్తుంది. అంతే.

అయితే, సెట్స్ మీద ఉన్నప్పుడు మాత్రమే తనో సినీ స్టార్ నన్న విషయం అతను గుర్తుంచుకోవాలి. మిగతా సమయాలలో అతను – తాను కోరుకున్న విధంగా లేదా ఖచ్చితంగా తాను అనుకున్న విధంగా తన జీవితాన్ని గడపవచ్చు. తెర మీద తాను చూపించే వ్యక్తిత్వానికి అనుగుణంగా నడుచుకోవచ్చు.

కాలక్రమంలో ఆ స్టార్ ఓ కొత్త దేవుడయిపోతాడు. పాలరాతి భవంతులలో ఏకాంతంగా ఉంటాడు. ఇది గతం అవుతుంది.

నేడు – పాలరాతి భవనంలో టెలిఫోను మోగుతూనే ఉంటుంది. రోజులో ఎన్ని సార్లు పోస్టల్ డెలీవరి ఇవ్వాల్సి ఉంటుందో అన్ని సార్లు పోస్టుమాన్ ఆ ఇంటి తలుపు కొడుతూనే ఉంటాడు. ప్రపంచవ్యాఫ్తంగా జనాలు రాసిన ఉత్తరాలు మోసుకొనివస్తాడు.

ఫలితంగా అతను కేవలం సెట్స్ మీద ఉన్నప్పుడే మాత్రమే కాకుండా ఇరవై నాలుగు గంటలూ స్టార్ అయిపోతాడు.

నిజానికి అతను వెండితెర వేలుపు మాత్రమే కాదు, మానవత్వం ఉండాల్సిన మనిషి కూడా. సమాజంలో బాధ్యత గలిగిన సభ్యుడు. తన అభిమానుల పట్ల మాత్రమే కాకుండా, మొత్తం సమాజం పట్ల బాధ్యత గలవాడు. తన జీవితం, ప్రవర్తన, పద్ధతులు – తెరపై తాను ప్రదర్శించే వ్యక్తిత్వానికి భిన్నంగా ఉండకుండా చూసుకోవాలి.

స్టార్లకి ఎన్నో రకాల ఉత్తరాలు, ఎన్నో రకాల ఫోన్ కాల్స్ వస్తూంటాయి. కొందరు స్టార్లు వాటికి వ్యక్తిగతంగా సమాధానాలు ఇస్తారు, కొందరు ఇవ్వరు (చాలా మందికి ఈ పనులు చేసేందుకు సెక్రటరీలు ఉంటారు).

కానీ మనం వాళ్ళకి జవాబు ఇవ్వాలి. ఒక మనిషి సాటి మనిషి పట్ల చూపవలసిన మౌలికమైన మర్యాద అది.

స్టార్లు అందుకునే పలు రకాల ఉత్తరాల్లో ఒక నమూనా ఉంటుంది. అది ఆదర్శవాద చిత్రం, కొన్ని లక్షల చేతులతో చిత్రించబడినట్లుగా ఉంటుంది.

తమ ముందు బొమ్మల బల్లపై చిత్రించబడుతున్న చిత్తరువుపై తలా ఒక రేఖ గీసేందుకు అభిమానులు ఎంతో పెద్ద వరుసలో నిలబడి ఉంటారు.

‘మదర్ ఇండియా’ విడుదలయ్యాకా, నా అభిమానుల రాసిన ఉత్తరాల ఫైల్‍ని పరిశీలించే అవకాశం దొరికింది.

ఎన్నో ఫైల్స్ ఉన్నాయి. కొన్ని పేజీలు తిప్పుతుంటే నోస్టాల్జియా భావన కలిగింది. నా మీద అభిమానులు పెట్టుకొన్న పలు అభిప్రాయాలను గ్రహించాను.

ఆ అభిప్రాయాలను వివరించబోను, వాటిని ఓ చిత్తరువు రూపంలో మలచబోను. కానీ కొన్ని ఉత్తరాలను ప్రస్తావించి, నా చిత్తురవుని పూర్తి చేసే అవకాశాన్ని నా పాఠకులకే కల్పిస్తాను.

నా ఇటీవలి చిత్రాలు ‘మిస్ ఇండియా’, ‘మదర్ ఇండియా’లలో నా నటనని అభినందిస్తూ వందలాది ఉత్తరాలు వచ్చాయి. వాటిల్లో చాలా వరకు ఆటోగ్రాఫ్ చేసిన ఫోటోలను పంపమని అడిగేవే. చాలామంది అభిమానులు వాళ్ళని చెల్లెళ్లుగా, సోదరులుగా, మేనకోడళ్లుగా, మేనల్లుళ్ళుగా ఆమోదించమని కోరేవారు. కొందరు నన్ను పెళ్ళి చేసుకుంటామన్నారు కూడా.

~

ఇటీవల నన్ను ప్రత్యక్ష్యంగా చూసిన, బొంబాయికి చెందిన మిస్. ఎస్.హెచ్.ఎమ్ ప్రతిస్పందన ఇది:

“19 నవంబరు 1957, మంగళవారం నాడు సాయంత్రం 5.45కి, మీరు ‘మదర్ ఇండియా’ చూడడానికి మీ నేస్తంతో కలిసి లిబర్టీ సినిమాకి వచ్చారు. అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. గేట్‌మన్ మిమ్మల్ని ఒక గదిలో కూర్చోబెట్టాడు.

నేను మీ వెనుక వరుసలో కూర్చున్నాను. మీరు లోపలికి వస్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీరు నర్గిస్ అని నాకు తెలుసు. నేనెంతో ఉత్తేజితురాలినయ్యాను. మీతో మాట్లాడాలనుకున్నా, సిగ్గు వల్ల మాట్లాడలేకపోయాను.

సినిమా పూర్తి కాకముందే మీరు త్వరగా వెళ్ళిపోయారు. నేను పాటలను హమ్ చేయడం మీరు గమనించి, వెనక్కి తిరిగి చూశారు. మిమ్మల్ని చూశాను కాబట్టి, మిమ్మల్ని కలవాలని కోరుకున్నారు. మీరు వ్రాసిన ఉత్తరాన్ని నేను చనిపోయేవరకు భద్రంగా ఉంచుకుంటాను.”

టర్కీ, రష్యా, అమెరికా వంటి దూర దేశాల అభిమానులు కూడా నా పై గొప్ప అభిమానాన్ని పెంచుకొన్నారు.

“గౌరవనీయులు, అందాల తార నర్గిస్ గారికి..” అంటూ మిస్. ఐ.ఎ. మాస్కో నుంచి రాశారు. “మీరు గొప్ప సౌందర్యవతి, మర్యాదస్థురాలు. మీరో దేవత వంటి వారు.

మీరు ఇక్కడ ఉన్నప్పుడు నేను గీసిన మీ చిత్రాన్ని ఉత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ ప్రదర్శనలో ఉంచాను.

దాన్ని భారతీయ చిత్రకారుడు ఎమ్.ఆర్. అచ్రేకర్ చూశారు. దాని గురించి ఆయన అభిప్రాయాన్ని ఆయన మీకు చెప్పవచ్చు.

మీకు సమయం తక్కువ ఉన్నందున నేను ఆయిల్ పెయింటింగ్ చిత్రించలేకపోయానని ఆయన మీకు చెబుతారు. మీరు వెళ్ళిపోయాకా, నేను ఏడ్చాను. బాధ కలిగింది..”

ఇస్తాంబుల్ నుంచి మిస్టర్. డి.ఎస్. ఇలా రాశారు – “1954 చివర్లో, నేను హిందీ సినిమా ‘ఆవారా’ చూశాను. అందాల తార నర్గిస్ పై అభిమానం పెంచుకున్నాను.

మేడమ్, టర్కీలో మీరో హాలీవుడ్ స్టార్‍తో సమానంగా ప్రసిద్ధులు. మిమ్మల్ని – ఆహ్, బర్సాత్, పాపి, దీదార్, అందాజ్, అంబర్ వంటి సినిమాల్లో చూశాను. మిస్ సెటాన్ చెప్పినట్టు మీరో ‘విశ్వసుందరి’.

మీరు కనుక భారతీయ దుస్తులకు బదులుగా పాశ్చాత్య తరహా దుస్తులు ధరిస్తే, సోఫియా లోరెన్, మార్లిన్ మన్రో వంటి గ్లామర్ గర్ల్స్‌ని సులువుగా అధిగమిస్తారు.

కానీ మీరలా ఎన్నడూ చేయరని నాకు తెలుసు. చీర, బిందీ మీ సంప్రదాయమని, అవి మీకు ఓ అసాధారణ సౌందర్యాన్ని కలిగిస్తాయని తెలుసు.

అవి మీ చిహ్నాలు. మీరు నటించే పాత్రలకు మీరు గొప్పగా నప్పుతారు.

నిరాడంబరంగా ఉండడం, బయటి విషయాల వల్ల ప్రభావితం కాకుండా ఉండడం ఆదర్శ మహిళగా మారుస్తుంది.”

అమెరికాలోని మేరీలాండ్ నుంచి ఓ అసాధారమైన ఉత్తరం వచ్చింది. “నేనో చెల్లని నాణెం లాంటి వాడిని” అంటూ మొదలయింది ఆ ఉత్తరం.

“నేను విచారంగా ఉన్న ప్రతీసారి, మీతో మాట్లాడాలని అనిపించడం వింత కదూ? మాట్లాడడమంటే నేను మీతో నిజంగా మాట్లాడలేను. మాట్లాడాలని అనుకున్నా.. ఉత్తరం రాస్తున్నా.

మీరు ఇప్పటికి పాశ్చాత్య నృత్యం అంటే చెడ్డదని భావిస్తున్నారా? మీకు గుర్తుందో లేదో, సుమారు రెండేళ్ళ క్రితం మీరు రాసిన ఉత్తరంలో డాన్సుని మీరు అంగీకరించలేదు. ఎందుకనో నాకు తెలియదు.”

మారిషస్ నుంచి రాసిన మిస్ ఐ.ఎస్. “మీరో అద్భుతం” అంటుంది. “ఏదో ఒక రోజు బొంబాయి వచ్చి మిమ్మల్ని కలవాలని నిర్ణయించుకున్నాను.

మీరో దేవదూత. దేవుడు మీకు అందమూ, ప్రతిభ మాత్రమే కాకుండా బంగారం లాంటి హృదయం ఇచ్చాడు.. ఓ గొప్ప వ్యక్తి అయ్యేందుకే మీరు జన్మించారు”

~

నా నటన పట్ల ఎందరో నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పర్చుకున్నారు. ఉదాహరణకి కలకత్తాకి చెందిన మిస్. బి.జి. “మీ ఉద్దేశంలో మీ ఉత్తమ చిత్రం ఏమిటో నాకు తెలియదు, కాని నా దృష్టిలో మాత్రం ‘మదర్ ఇండియా’నే..

మీరు సాధారణ పాత్రలు పోషించాల్సిన అవసరాన్ని అధిగమించారు. మిమ్మల్ని అసాధారణ పాత్రలలోనే చూడాలనుకుంటున్నాం” అన్నారు.

ఈస్ట్ పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) నుంచి ఒక అభిమాని ఇలా రాశారు “నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అహంకరించలేదు. మీ దయ, హుందాతనంతో కూడిన ఆతిథ్యాన్ని నేను ఇంకా మరిచిపోలేదు.

నేను మీలో మీ తోటి నటీమణుల కన్నా విశిష్ట మేధావిని చూస్తున్నాను కాబట్టే మీకు ఉత్తరాలు రాస్తున్నాను.”

~

ఇవన్నీ సరే! నాకో విచిత్రమైన టెలిగ్రామ్ ఒకటి వచ్చింది. దాని అర్థం ఎవరైనా వివరించగలరా? అందులో – “CONGRATULATIONS MISS INDIA SORRY MOTHER INDIA” అని ఉంది.

ఇవి రోజూ నేను అందుకున్న పలు రకాల ఉత్తరాల నమూనాలు. వీటిని చూసినప్పుడు నాకు కలిగే మొదటి ఆలోచన – ఇవి రాసినవాళ్ళు దయగలవారు, ఉదారులు, ఓర్పు గలవారు అని.

వారు నన్ను వారి మనస్సుల్లో గొప్పగా చిత్రించుకున్నారు. వాళ్ళు నా గురించి ఊహించుకునేంత గొప్ప ఆదర్శవంతురాలిని కాలేనేమో.

నేనూ వాళ్ళ లాగే మనిషిని. నాలోనూ తప్పొప్పులు ఉంటాయి.

అయితే నా గురించి వాళ్ళ అభిప్రాయాలను – ఓ క్షణం ఆగి అర్థం చేసుకుంటే – వాళ్లు నన్ను నన్నుగా భావించడం లేదు. వాళ్ళ దృష్టిలో నేనెలా ఉంటే బావుంటుందో అలా అనుకుంటున్నారని అనిపిస్తుంది.

నా మీద వాళ్ళ అభిప్రాయానికి తగ్గట్టుగా ఉండేందుకు వీలైనంత కృషి చేస్తాను. మా పాలరాయి భవంతి తలుపులను పోస్ట్‌మాన్ తట్టినప్పుడల్లా, మరో స్నేహితుడు, ప్రపంచపు మరో భాగం నుండి నా గురించి ఆలోచిస్తున్నాడని నేను గ్రహిస్తాను.

అదో అద్భుతమైన భావన (ఫిల్మ్‌ఫేర్ 1958)

[వచ్చే వారం నిరుపా రాయ్ డైరీలోని పేజీలు].

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here