[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
నటి మీనా కుమారి డైరీలోని కొన్ని పేజీలు:
అప్పట్లో నాది డైరీ రాసేంత వయసు కాకపోయినా, నాకున్న జ్ఞాపకాలు నన్ను నా బాల్యానికి అంటే నాకు మూడేళ్ళప్పటి వయసుకి తీసుకువెళతాయి. అక్కడ్నించే ప్రారంభిస్తాను. ఒకసారి బొంబాయి నుంచి పంజాబ్ లోని నాన్న వాళ్ళ ఊరికి బయల్దేరాము. అమ్మ వాళ్లది లక్నో.
నాకింకా ఆ అందమైన గ్రామీణ వాతావరణం గుర్తుంది. గ్రామంలో చిన్న ఇల్లు, పొల్లాలు, దూరంగా ఎండిపోయిన భూములు, ఇంకా మెడలో గంటలు వేలాడే పశువులు, వాటి నుంచి వెలువడే ఆ ధ్వనీ ఎంతో మధురంగా ఉండేవి. ఇంకా ఒంటెలు, నేను వాటిని ఎన్నటికీ మరిచిపోలేను.
అది స్వల్పకాలిక పర్యటనే అయినా ఎన్నో మధురస్మృతులు ఉన్నాయి. అవి నా మనసులో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. బొంబాయి తిరిగి వచ్చేశాం. అప్పడు నాకు నాలుగేళ్ళు. అప్పుడే నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది. నాన్న ఒప్పుకోనట్టు గుర్తు, కానీ అమ్మ నాన్నని ఒప్పించి ఆ అవకాశాన్ని అంగీకరించింది, కుటుంబానికి కొంతైనా ఆర్థికంగా ఉపకరిస్తుందని.
మొదటిరోజు నన్ను ప్రకాశ్ స్టూడియోస్‍కి తీసుకువెళ్ళారు. అక్కడ అన్నింటినీ అబ్బురంగా చూస్తుండిపోయాను. పెద్ద స్టూడియో, కార్లు, నాకిచ్చిన మంచి దుస్తులు – అన్నీ గొప్పగా ఉన్నాయి. పైగా అక్కడి తోట ఎంతో బాగుంది. కానీ చిత్రీకరణ మొదలయ్యాకా సమస్య ఎదురయింది. నేను సెట్‍లోకి గబగబా పరుగెత్తుకు రావాలి. అక్కడ ఓ బందిపోటు మా అమ్మ పాత్రధారిని బంధించి ఉంచి, చంపుతానని బెదిరిస్తూ ఉంటాడు. అతను నన్ను కాల్చాలి, నేను చచ్చిపోయినట్టు పడిపోవాలి.
నేను దీనికి తిరస్కరించాను. దుమ్మూ ధూళితో నిండిన నేల మీద పడిపోవడానికి నాకు ఇబ్బంది అనిపించింది.
మొత్తం యూనిట్ కంగారు పడింది. నన్ను బుజ్జగించారు, బ్రతిమాలారు, అర్థించారు. కానీ నేను పట్టుదలగా ఉన్నాను, లొంగలేదు.
అప్పుడు నా బలహీనత తెలిసిన మా అమ్మ ముందుకు వచ్చి – వాళ్ళు చెప్పినట్టు చేస్తే – నాకు కొన్ని క్రీమ్ కేకులు కొనిపెడతానని మాటిచ్చింది.
అమ్మ లంచం పని చేసింది. నేను అంగీకరించాను. కొన్ని రిహార్సల్స్ అయ్యాకా, నేను చచ్చిపోయినట్టు కింద పడిపోయాను.
సీన్ బాగా వచ్చింది అనుకున్నాకా అమ్మయ్య అనుకున్నారు. సాయంత్రమయ్యాక అక్కడున్న వాళ్ళు నా చేతిలో 25 రూపాయలుంచారు. వెంటనే ఆ డబ్బుని అమ్మకి ఇచ్చేసాను, అమ్మ దాన్ని ఇంటద్దెకి ఉపయోగించింది.
నేను చాలా సిగ్గరిని, న్యూనతా భావం ఉండేది. ఇది నన్ను చాలా కాలం వేధించింది.
మా అమ్మమ్మ నన్ను ‘చిన్ని’ అని పిలిచేది. బహుశా – నా పల్చని ముఖం, పొడవాటి బుగ్గ ఎముకలు, పైకి చూస్తున్నట్లు ఉండే కళ్ళు – ఆమెని నచ్చేవేమో.
అయితే నాకా పేరు నచ్చేది కాదు, విచిత్రంగా అనిపించేది. పెద్దయినా నా ముఖంలో పెద్ద మార్పులు లేకపోవడంతో – నాకిష్టం లేకపోయినా ఆ పేరు దాదాపుగా నాకు ముద్దు పేరయిపోయింది.
ఆ పేరు నాకిష్టం లేకపోవడం నా రూపం పట్ల అయిష్టత వల్ల – నాలో న్యూనతాభావం పెరిగి పెద్దదయింది.
నాకు ఆరేళ్ళు వచ్చేసరికి మా చెల్లెలు మాధురి కూడా సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అయితే తనని ఎవరూ – ఇంట్లో కాని, స్టూడియోలలో కాని ముద్దు పేరుతో పిలవకపోవడంతో నా న్యూనతా భావం ఇంకా పెరిగింది. అది ఎంతుండేదో నేను చెప్పగలిగేదాన్ని కాదు
అది ఎంతలా పెరిగిందంటే – ఎవరైనా మా ముగ్గురు అక్కచెల్లెళ్ళలో ఎవరు బాగా పని చేస్తారంటే నేను ఠక్కున ‘మాధురి’ అని చెప్పేదాన్ని.
అలాగే, ఈ ప్రశ్న వెంటనే వచ్చే మరో ప్రశ్నకి కూడా తప్పక జవాబివ్వాల్సిన అవసరాన్ని నేను మర్చిపోలేదు. మా ముగ్గురు అక్కచెల్లెళ్ళలో ఎవరు చక్కని అందగత్తె అంటె నేను ఠక్కున ‘ఖుర్షీద్’ అని చెప్పేదాన్ని.
ఖుర్షీద్ అంటే మా అక్క. కొద్ది కాలానికే నాకు ఉపశమనం కలిగిస్తూ నా ముద్దు పేరు శూన్యంలో కలిసిపోయింది. నన్ను ఆ పేరుతో పిలవడం ఆపేసారంతా.
ఈ క్రమంలో నేను ఇంటి వ్యవహారాలలో బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టాను. నేను సంపాదిస్తుండంతో కుటుంబంపై దృష్టి పెట్టడం సాధ్యమైంది. అలానే, కాలానుగుణంగా నాకు నేను ఊహించుకున్న, సృష్టించుకున్న క్రుంగుబాట్లు, నిరుత్సాహాలను అధిగమించే స్థితికి చేరుకున్నాను.
అయితే నేను గట్టిగా కోరుకున్నది ఒకటుంది. అదేమిటంటే బడికి వెళ్ళి చదువుకోవాలనుకోవడం. నా ఈడు పిల్లలు స్కూలుకు వెళ్తుంటే నాకు కలిగిన కోరిక అది. అయితే వారు నన్ను చూసి అసూయ పడతారన్నది అప్పట్లో నాకు తట్టలేదు.
మా తాతయ్య (మా అమ్మ తండ్రి) షకీర్ మీరుటి గొప్ప రచయిత. ఆయన ఎన్నో గ్రంథాలను అనువదించారు. తన తల్లిదండ్రులు ధనవంతులైనా, అమ్మ స్వతంత్రంగా జీవించింది, సమర్థురాలు.
తనపై తాను శ్రద్ధ వహించేది, ఎవరి నుంచి సాయం అడగలేదు.
మా తాతయ్య చేసిన కృషిలో నాకు బాగా ఇష్టమైనది – ఆయన మూడు పిల్లల పుస్తకాలకు సంపాదకుడిగా వ్యవహరించడం. ఆయన ఆ పుస్తకాలను మాకు పంపేవారు. నాన్న కాస్త చదువు నేర్పడంతో, ఆయన సహాయంతో – ఆ పుస్తకాలను చదవగలిగేదాన్ని. అవి నాకెంతో సంతోషాన్ని కలిగించేవి.
తరువాత నన్ను బడికి పంపమని ఒత్తిడి చేశాను. నాకు చదువంటే బాగా ఇష్టం. పైగా సినిమాలంటే అప్పట్లో ఆసక్తి పోయింది. పనికి సంబంధించిన వారినందరినీ అసహ్యించుకోసాగాను. అయినా ఉపయోగం లేకపోయింది.
కొంత కాలం గడిచేసరికి నేను కాస్త తెలివి నేర్చాను, అనారోగ్యమని చెప్పేదాన్ని. అయితే పనికి వెళ్ళడం తప్పించుకోవాలన్న నా ఆలోచనలన్నీ అమ్మ పసిగట్టేది.
అమ్మ ఎంతైనా అమ్మే. సహజమైన బాల మానసిక వేత్త. నా సమస్యకి మూల కారణం ఏమిటో గ్రహించింది. ఆర్థికంగా సర్దుబాటు చేసి నాకు ట్యూషన్ మాస్టర్‍ని పెట్టించింది. అప్పుడు నేను వంకలు మాని శ్రద్ధగా, సంతోషంగా షూటింగులకి వెళ్ళేదాన్ని.
ఎన్నో ఏళ్ళ తరువాత 1947లో మేము సొంతిల్లు కొనుక్కోగలిగే స్థాయికి వచ్చాము. సంతోషకరమైన, తృప్తి చెందిన, ఆప్యాయమైన మా కుటుంబానికి సరిపోయేటంత భవనాన్ని కొన్నాము. ఆ ఇంటికి అమ్మ పేరిట ‘ఇక్బాల్’ అని నామకరణం చేశాము.
మాకన్నా ఎవరూ సంతోషంగా ఉండరు అనుకునేదాన్ని. అన్నీ కలిసొచ్చి కాలం గొప్పగా నడిచింది.
అయితే జీవితం ముందుకు సాగవలసిందే, దాన్ని ముగించడానికి మరణం తప్పక వస్తుంది. ఏదీ శాశ్వతం కాదు. మా కొత్తింట్లో ఏడాది పాటు సంతోషంగా గడిపిన తరువాత అమ్మ చనిపోయింది.
నా గుండె బద్దలయింది. మళ్ళీ నేను ఒంటరిననే భావన కలిగింది. చిన్నప్పటిలా – తోటి పిల్లలు బడికి వెళ్తుంటే – నేను షూటింగులకి వెళ్ళినప్పటి భావన తిరిగి తలెత్తింది.
నా న్యూనతా భావం తిరిగి వచ్చింది. దాని ఒంటరితనం తోడు. నన్ను అర్థం చేసుకునే వారి కోసం, ప్రేమ కోసం తపించిపోయాను. మా అమ్మ నాకు మార్గదర్శి, తోడు, స్నేహితురలు, ఓదార్పు కూడా.
నేను చదవడం, రాయడం మొదలుపెట్టాను. కాలం గడిచే కొద్దీ రాయటమనేది నాకో మనోహరమైన ఆస్తిగా మారింది.
అక్క, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవడంతో కుటుంబం విడిపోయింది. ఎవరికి వారు వాళ్ళ జీవితాలలో స్థిరపడ్డారు. 1949 చివరికి వచ్చేసరికి నేనో మేగజైన్ చదువుతూంటే, దానిలో కనబడిన ఒక ఫోటో నన్ను ఆకర్షించింది. ఆ చిత్రం క్రింద వారి పేరు ‘కమాల్’ అని రాసి ఉంది.
అప్పట్లో నేను బాంబే టాకీస్ వారి సినిమా ‘తమాషా’కి పని చేస్తున్నాను. ఒక రోజు షూటింగులో ఉండగా, స్టూడియో ప్రవేశ ద్వారం వద్ద ఏదో కోలాహలం వినిపించింది. కాసేపయ్యాకా, స్టూడియో యజమానులలో ఒకరైన అశోక్ కుమార్, కమాల్ గారితో కలిసి వచ్చారు.
ఆయనెవరో, ఏం చేస్తూంటారో నాకు తెలుసు. ఆయన గురించి తెలియాల్సినన్ని విషయాలు నాకు తెలుసు. తెలుసుకున్నాను.
నాకు నోట మాట రాలేదు. గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉండిపోయాను. తర్వాత పరిచయాలయ్యాయి. ఆయన తలాడించారు – అయితే తల పైకెత్తడం కానీ, కళ్ళు కలపడం కానీ చేయలేదు. కనీసం నన్ను చూడను లేదు!
నేను ఉడికిపోయాను, ఉద్రేక పడ్డాను. ఆ పై మండిపోయాను.
1950లో ఓ రాత్రి సుమారు పది గంటలకి నాకో వార్త తెలిసింది. కమాల్ గారు తాను తీయబోయే ‘అనార్కలి’ అనే చిత్రంలో టైటిల్ రోల్‌కి నన్ను అడుగుదామనుకుంటున్నారని.
కమాల్ గారితో కలిసి సంబంధిత వ్యక్తులు వచ్చిన నన్ను, నాన్నని కలిసారు. నియమాలు, షరతులు చెప్పారు, ఒప్పందం కుదిరింది. సంతకం చేశాను.
ఏదో మధురమైనది జరగబోతున్నట్లు నాకు బలంగా అనిపించింది. అదేంటో స్పష్టంగా తెలియదు కానీ, జరిగితే బాగుండునని అనిపించింది.
కానీ వాస్తవంగా జరిగిందో దుర్ఘటన. ఎందుకంటే మా ఇద్దరి తర్వాతి సమావేశంలో ఆసుపత్రిలో జరిగింది. అప్పట్లో నేను నాకు జరిగిన ఓ మోటార్ కారు ప్రమాదానికి చికిత్స పొందుతున్నాను.
అసలేం జరిగిందో రికార్డు కోసం చెప్తాను. నాకు కార్లలో, విమానాల్లో, ఓడల్లో ప్రయాణమన్నా, ఇంకా సైకిల్ మీద వెళ్ళాలన్నా కూడా ఎంతో భయం. చిన్న పురుగు నుంచి ఏనుగు వరకూ ఏదైనా భయమే.
సరే విషయానికి వద్దాం, మహాబలేశ్వర్ నుంచి బొంబాయి వస్తుండగా మా కారుకి పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను పూనేలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
సినిమా వాళ్ళు, ఎందరో నిర్మాతలు వచ్చి నన్ను చూశారు. అందరూ – ఒక్క కమాల్ గారు తప్ప!
నాలుగు రోజున, నాలుగు రోజుల నిర్లక్ష్యం అనంతరం – ‘అనార్కలి’ చిత్ర నిర్మాతలతో కలిసి ఆయన వచ్చారు.
కాసేపయ్యాకా, మిగతా వాళ్ళంతో నాన్నతో మాట్లాడడానికి బయటకి వెళ్లారు. కమాల్ గారొక్కరే గదిలో ఉన్నారు.
మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. క్షణాలు గడిచే కొద్దీ నాకు నేను బ్యాండేజీలలో బంధింపబడ్డ పిసినికాయలా అనిపించసాగాను.
నా పక్కగా ఉన్న బల్లపై ఉన్న జ్యూస్ గ్లాస్ పై నా దృష్టి పడింది. “ఆయన ఆ గ్లాసుని అందుకుని నాకు తాగిస్తే..” అన్న ఆలోచన నా మనసులో మెదిలింది.
ప్రతీ పదంతోనూ నా ఉద్దేశం మరింత బలపడింది. సరిగ్గా అప్పుడే, కమాల్ గారు కదిలి గ్లాసు నందుకుని నాతో జ్యూస్ తాగించారు.
నా ప్రశ్నలన్నింటికి జవాబు దొరికినట్లనిపించింది. ఓ అద్భుతమైన భావన ఏదో మనసంతా నిండిపోయింది.
అది ఒక గొప్ప క్షణం, బంగారు క్షణం, దైవికమైనది, అద్భుతమైనది. అది ఒక జీవితకాలం.
1953లో కమాల్ గారితో నా వివాహం జరిగినప్పుడు నా జీవితం, మేలిమలుపు తిరిగింది. ఎన్నో ఉద్వేగాలు, చర్యలు, ఆశలు అన్నీ సఫలీకృతమయ్యాయి. ఆనందం ఆవృతమైంది.
దీనికి నేను సంతోషమనే పదాన్నే వాడగలను. ఎందుకంటే ఆ భావన నన్ను గొప్పదాన్ని చేస్తుంది. ఆ భావనయే నాలో సంపూర్ణతని కలిగిస్తుంది.
ఫిల్మ్‌ఫేర్ 1957.